చెంగావి రంగు ఎండ
మొండిగోడ దేహం మీంచి
ఊగుతూ ఊగుతూ ఊసరవెల్లి నీడలు
తెగని రంపపుకోత
ఎగిరే కాకి ఎంతకూ వాలదుభూమి ఒక సుడిగాలి
ఆకాశమంతా ఒకే కన్ను
సముద్రం ఒకే ఒక్క కన్నీటి చుక్క
తడికె కన్నాల నుంచి చూస్తున్నాను
మూడో కాలొకటి నడచి వస్తోంది
నల్లమబ్బు ఒకటి దేహం మీద వాలింది
రెప్ప కదలిన అలికిడి లేదు
కల కలవరింతా లేదు
కిటికీలో సగం వంగిన జామకొమ్మకు
మౌనంగా
పండూ నేనూ వేలాడుతున్నాము
తెగిన గాలిపటం
గిరికీలు కొడుతూ జారిపోతూ ఉంది
ఏదీ చేతికందదు
ఏదీ చెంతకు రాదు
నేను నా నీడ
తడవని మొండిగోడ దేహం మీంచి
కదులుతున్నాము కదులుతున్నాము

రచయిత గోపిని కరుణాకర్ గురించి:
గోపిని కరుణాకర్ కథా రచయిత, సినీ రంగంలో అసోసియేట్ డైరక్టర్. వీరు రచించిన “భారతం బొమ్మలు – మరికొన్ని కథలు” అనే కథా సంపుటాన్ని2012 లో కథా కోకిల పురస్కారానికి ఎంపిక చేసారు. రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. వీరి కథలు ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి.
... పూర్తిగా »