శనాదివారాలు నిర్మానుష్యంగా ఉండే స్టేడియం పార్కింగ్ లాట్లలోన తనని డ్రైవర్స్ సీట్లో కూర్చోబెట్టి డోర్ తీసి పట్టుకుని పక్కనే పరిగెడుతూ కారు ముక్కుసూటిగా ఎలా నడపాలో నేర్పించేడు. “క్లచ్చెక్సలేటరు మూమెంటు తెల్సుకుంటే చాన….” అని సిగరెట్ ముట్టించుకుని, మిగతావన్నీ వాటంతటవే వొచ్చెస్తాయి అని సంజ్‌నలు చేస్తూ. ఆయన ఇండియా తిరిగి వెళ్ళేనాటికి తనకి డ్రైవింగ్ వచ్చింది. అవేళ ఆయన ఎప్పటిలాగే పొద్దున్నే లేచి బాల్కనీలో బొందు లాగు మాత్రం కట్టుకుని దండలు జోరుగా గాల్లోకి తిప్పుతూ సూర్య నమస్కారాలు చేసేడు. ఏర్‌పోర్ట్ లో అనుముల గాడు గురవా గాడు రాజా గాడు తను అందరూ దుక్క చలికోట్లు వేసుకుని స్టైరోఫోమ్ కప్పుల్లోన కాఫీలు తాగుతూ మర్యాదగా నిలబడితే గురవా భుజం మీద చెయ్యి వేసి మాటలు మాత్రం తనకు తనే చెప్పుకుంటున్నట్టు “అక్కడిది అదే బాగున్నాది! ఇక్కడిదీ ఇదే బాగున్నాది!! దాన్దదే దీన్దిదేని…బెంగెందుకురా గురువా?” అని కళ్ళు తడిగా చిన్నవిగా చేసుకున్నాడు. పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ గట్టిగా పట్టుకుని ఎస్కలేటర్ మీదికి వెళ్ళే వరకూ మాటి మాటికీ ’జీగర్తేం…..? జీగర్త!’ అని హెచ్చరించుకుంటూ. అక్కడ ఇంక aerobridge లోనికి వెళ్ళిపోయేవాడు ఒక రకంగా బరువుగా గూని వాళ్ళలాగ కింది వరుకూ వంగిపోయి అందరికీ టాటాలు చెప్పుకుంటూ కనుమరుగైపోయేడు. బిచ్చారెడ్డి గార్ని ఆ తరవాత తను మళ్ళీ ఎప్పుడూ చూడలేదు.
గురవా గాడు గ్రాడ్యుయేట్ అయిన రోజు చాలా ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చేడు. అంటే వాడికి Poughkeepsie లో ఉద్యోగం వచ్చింది. “అబేయ్ స్సాలే… సిక్స్టీన్ కే బే! 16 K!…చెప్పండ్రా ఎవడెవడికేఁవేం కావాలి?” అన్నాడు. షోలే పాటలతో Straton House అట్ట గోడలు కంపించే లాగ మ్యూజిక్ పెట్టి ‘హరియోస్సాంబా! బచ్ గయా స్సాలా!’ అని అరుచుకుంటూ. నాలిక మడత పెట్టుకుని గొప్ప సంతోషంగా ‘షేకాడించెత్తాను నాకొడకల్లాలా! షేకంటే షేకు!’ అని రాత్రతా, పోలీసులొచ్చి cut it out! అని చెప్పే వరకూ. ఈ మెట్ల దగ్గరే పొద్దున్నే ఆరు గంటలప్పుడు ఆవిర్లు కక్కుతూ Chevy Celebrity ట్రంక్ ని తాళ్ళతో కట్టి వాడి సామాన్లన్నీ పేక్ చేసేరు. స్టీరియోకి, టీవీకి దెబ్బ తగలకుండా కంఫర్టర్లు చుట్టి. పుస్తకాలన్నీ తెచ్చి ఒక అట్ట డబ్బాలో సర్ది “ఈ జంకు మీ గల్ ఫ్రెండ్ కిచ్చెయ్ రా!” అని ఆజ్‌నాపించేడు తనని. వాడికి రావల్సిన అద్దె ఎడ్వాన్స్ వాటాతో కేవలం కెంటకీ ఫ్రైడ్ చికెన్ తిని, రమ్ మాత్రమే తాగాలని షరతులు పెట్టేడు. డొక్కు సెలబ్రిటీ సీట్లోన ప్రపంచాన్ని జయించే వాడిలాగ సిగరెట్ పెదాలు విచ్చుకుని నవ్వుకుంటూ ’ఓకే బే … చలో! రైటో!!’ అని అసలు వెనక్కి తిరిగి చూడకుండా I-85 Exit లోకి కనుమరుగైపోయేడు.
ఉద్యోగాలు వెదుక్కుంటూ అనుముల గాడూ ఆకునూరి గాడూ శర్మా గాడూ రాజా గాడూ మాధవీ భర్నేని వెదుక్కుంటూ పంచాపకేశన్ గాడూ అందరూ ఒక్కొక్కరూ అలాటి డకోటా కార్లలోనే అదే Exit లోంచే నిష్క్రమించేరు. తను Essentuky అని ఒక చిన్న ఊళ్ళోన ఈ ఇన్నేళ్ళూ ఇళ్ళు మారుతూ, ఉద్యోగాలు మారుతూ, ఎప్పుడైనా అటకలు సర్దుతున్నప్పుడు డబ్బాల దుమ్ములు దులిపే వేళ ‘నాకొళ్ళు ఎక్కడున్నారా?’ అని వాళ్ళని తల్చుకుంటాడు. పెళ్ళిళ్ళు, పిల్లలు, సమ్మర్ పిక్ నిక్ లు, కొత్త ఇళ్ళల్లోకి house warmingలు, Europe Tripలు ఇవన్నీ – తన జీవితం – బిచ్చారెడ్డి గారు అన్నట్టే వాటంతట అవే నడుస్తుంటే చూస్తూ. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండి ఉంటారు? అని. ఒక సారి అనుముల గాడి నుండి మాత్రం ఒక ఉత్తరం వచ్చింది. ఎక్కడెక్కడి ఎడ్రస్ లో అన్నీ దిద్దించుకొని ఆలస్యంగా వచ్చిన పెళ్ళి శుభ లేఖ.
Chy. Srinivas Anumula, M. S.
Weds
Sow. Satyaveni Katipamula, M.B.B.S.
D/O Smt & Sri Annaji Rao Katipamula,
Satya Sai Rice Industries, Maidanam Street, Rajole
అని ఒక బంగారు పూతల అరిటాకు. ఆ ఎడ్రస్ కే జవాబుగా గ్రీటింగ్ పంపిస్తే తిరిగొచ్చీసింది తనకే. ఒకసారి D.C.లో ఒక గుడికెళ్ళి అక్కడ అరుగుల మీద కూర్చుంటే పాలరాతి ఫలకం మీద రాజా గాడి పేరున్నాదనిపించింది. 5,116 డాలర్లు విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేర్లలోన. పూజారి గార్ని అడిగితే ఆయనకి తెలియదు గానీ ఫోన్ బుక్ లో చూద్దాం రండి అన్నాడు. వాళ్ళ ఇంటి పేరు ‘కే’తో అని గుర్తుంది గాని, కనుములావో కనుమూరీవో జ్‌నాపకం వచ్చింది కాదు. కనుముల వెంకట రాజ శేఖర్ అని. ఫోన్ బుక్ లో Venkata Kanumula లు ముగ్గురూ Venkata Kanumuri లు ఇద్దరు, ఇంకా Venkata Kandula అని ఇద్దరు…….. తీరా Venkata and Rama Kanumula అని ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే ఒక చిన్న అబ్బాయి గొంతుకతో మెసేజ్ వచ్చింది ఎన్ని సార్లు ప్రయత్నించినా. తను ఇలాగ రామలింగేశ్వర్రావు చిలకపాటి అనీ, రాజా అనే అతనికోసం వెతుకుతున్నాననీ, ఒకవేళ ఆ రాజా మీరే అయితే తనకి ఫోన్ చెయ్యమనీ నెంబర్‌తో మెసేజ్ పెట్టేడు. రాజా గాడి నుండి ఏమీ జవాబు రాలేదు. బహుశా అతను కాడేమో అనుకున్నాడు.
ఏడెనిమిదేళ్ళ కిందట ఒక సారి Niagara Falls దగ్గర రాతి బండల మీద చెప్పులు చేతుల్లో పట్టుకుని తడి కాళ్ళతో వల్లినీ వాళ్ళమ్మనీ వెదుక్కుంటూ ఒక్కడే నడుస్తున్నాడు. అక్కడ పార్క్ నిండా మఫ్లర్లు పెద్ద చీరలు కొత్త వాకింగ్ షూస్ తో వెనకబడి నెమ్మదిగా నడుస్తూ దేశం నుండి వచ్చిన పెద్దవాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చిన జంటలూ పిల్లలూ. ఎండలో మొఖాలు చిట్లించుకుని చుట్టూ ఇటూ అటూ చూసుకుంటూ, ఎదురుగా ఎవరి కళ్ళల్లోనూ ఎవరూ చూపులు కలపకుండా మొహమాటంగా తప్పించుకుంటూ మరీ తప్పనిసరి అయిపోతే నవ్వుతూ. అక్కడ కర్ర వంతెన మీద ఒకావిడ దళసరి చలికోటు వేసుకుని, ఇటూ అటూ టీనేజ్ అమ్మాయీ అబ్బాయి తోనూ పెద్ద పెద్ద కాటన్ కేండీలు తింటూ నడుస్తుంటే, వెనకే పరధ్యానంగా నడుస్తూ వస్తున్నాడు ఒకతను. ఎంతో పరిచయం ఉన్న తూగుతో అడుగులు వేస్తూ. గురవారెడ్డే! అతని వెనక ఒక పెద్దావిడ. వెంకటగిరి చీర ఊలు స్వెటర్లతో కొత్తవి తెల్ల జాగింగ్ షూస్ తో నడవడానికి ఇబ్బందిగా చలికి తనలోకి తనే ముడుచుకుంటూ చుట్టూ బెరుకు బెరుగ్గా చూస్తూ నడుస్తున్నాది. వొళ్ళుగా బూరె బుగ్గలు, సిగరెట్లకి నల్లబారిన కింది పెదవీ, సిరి బొజ్జ – ఇవేవీ గురవా రెడ్డిని పోల్చుకోడానికి అడ్డం రాలేదు. “గురవా….! గురవా..?!” అని చప్పట్లు కొట్టుకుంటూ చనువుగా కేకేస్తే ఆగి తనకేసి చూసి ప్రశ్నార్ధకంగా “Hi..?” అన్నాడు.
“నేనూ….రాం! రాంచిలుక…”
“Oh! Hi….” అన్నాడు మళ్ళీ. పొడిగా. తన మొహంలోన ఆశ్చర్యపు నొప్పిని చూసి కొంత సంబాళిచుకుంటున్నట్టు మళ్ళీ “అఛ్చచ్చా! హౌ ఆర్యూ అండీ…?” అన్నాడు. గురవా గాడు….గురవా రెడ్డి … తనని అండీ అంటే చాలా అవమానంగా గట్టిగా నిలబడ్డాను అనుకున్నది కృంగిపోతున్నట్టు అనిపించింది. అతని భార్యా పిల్లలూ కాటన్ కేండీల వెనక నుండి ఇద్దర్నీ మార్చి మార్చి వింతగా చూస్తుంటే. “ఏంటి ఫేమిలీతో రాలేదా? తనకి ఇప్పుడే కాస్త రిలీవయ్యిందని…. సర్లే ఇంక ఇక్కడ Upstate New York we have a vacation home!…. ఆల్రైటో! సరే వోకేనండీ….! రైటో!! All the best!” అని మర్యాద మర్యాదగా తెగ్గొడుతున్నాడు. ‘ఏందిబే నీ యబ్స్ ..?’ అని గౌరవించకుండానే. ఆవిడ – వాళ్ళమ్మ గారనే గుర్తొచ్చింది. బిచ్చారెడ్డి గారు చూపించిన ఫొటోల నుండి. వాటిలో అర్ధ రూపాయంత బొట్టు పెట్టుకొని ఉండేది. ఇప్పుడు బొట్టేం లేకుండా వంతెన పక్కన ఒక వారగా దేశం నుండి వచ్చిన పెద్దవాళ్ళందరి బెంగ మొహాల్లోకీ పట్టి పట్టి చూస్తూ వేరుగా నిలబడింది. ఆవిడ్ని చూసి ‘బిచ్చారెడ్డి గారు పోయేడా?’ అనుకున్నాడు. కాని ఈ దేశానికొచ్చేక ఆడవాళ్ళు ఎవరూ బయట బొట్టు పెటుకోరు కదా అని సర్దిచెప్పుకున్నాడు. ‘మీ ఫాదరెలాగున్నార’ని అడిగే అవకాశం ఇవ్వలేదు గురవా రెడ్డి. “Next ride is at 11:20. Hurry up…..మల్ల అన్నీ లేటవుతయ్యి! OK! Nice meeting you అండీ” అని దూరంగా నడుస్తూ. అలా అక్కడ కనిపించి విడిపోయిన గురవాని తల్చుకుంటే చిత్రంగా ఉంటుంది. బుగ్గలు పొంగి, కళ్ళ చుట్టూ చిన్న పొంగులతో, అదొక లాంటి పొడి పొడి ధీమా తో ఖరీదుగా అంచనాగా దూరం దూరంగా. అతన్ని తన జ్‌నాపకాల్లో నిలుపుకోలేదు. అంటే గురవా అలాగ తనకి ఇష్టం లేదు. ఇప్పుడయితే వాళ్ళందరూ ఉండవలసిన చోట ఇప్పుడు కాళ్ళకి తగులుతూ విరిగి పడిన ఇటికలు, దుమ్ము, చీకటి.
అక్కడ చూడ్డానికి ఇంకేమీ లేదని ధృఢంగా నిశ్చయించుకుని మళ్ళీ చెక్క మెట్లన్నీ దిగి మెయిల్ బాక్స్ ల్ని, బాస్కెట్ బాల్ స్థంబాన్నీ దాటుకుంటూ New Comer మీదికొచ్చేడు. రైలు రావడానికి ఇంకా ఏడు నిమిషాలుంది. ‘సారా జహాఁ సె అచ్ఛా!’ అని రాగం తీస్తూ కోటు జేబులో ఎగిరిపడుతోంది తన సెల్. నంబర్ చూసుకుని “చెప్పమ్మలూ చెప్పు!” అంటే అట్నుండి అమ్మాయిల గుంపు నవ్వుల చప్పుడు. “Hey wait up you guys! Shutt….UP!” అంటోంది. వల్లి. “Where ARE you, dad?” అంటోంది నవ్వులు ఆపుకోలేకుండానే.
“Pendelton…!”
“But I thought you’re in Liberty!”
“Not any more sweety dumps!”
“How did the ceremony go? Did you get your big, fat award?”
“Yes …. Listen! How ….. where are you? What’s all the ….?”
“Jessica’s! She’s throwing this MAJOR party!” అంది. పక్కనున్న అమ్మాయిల్ని జబర్దస్తీగా అదిలిస్తోంది నవ్వులు నవ్వులు ఆపలేక తనూ ఆపుకోలేక. “Oh wait! You’re at your college place…?
That infamous Thelugoo Cockroach Castle?!”
“Yes! Its a dead place now ……….. actually, I’m not there anymore. I’m at the train station. Finding my way back to Liberty..!” అంటే నవ్వింది. “Good luck, Dad. Come back soon! Love ya!” అంది గబ గబా, అలవాటుగా, ఒక వైపు “Dork!” అని ఎవర్నో తిడుతూనే. “Love you too Kittums! Did mom say…..” అని ఇంకా ఏదో అనబోతుంటే డయల్ టోన్ మాత్రం మిగిల్చి.
కిటికీ జాగాలో ఎదురుగా ఒక అబ్బాయి సెకండ్ హేండ్ Adidas బేగ్ ని ఒళ్ళో హత్తుకుని కూర్చున్నాడు. అతన్నే తదేకంగా చూస్తుంటే ఇబ్బంది పడ్డాడు. అతను వేసుకున్న చలికోటు – అచ్చం అలాంటిదే తనకి ఉండేది. కన్‌ష్ట్రక్షన్ వర్కర్లు ఎక్కువగా తొడుక్కునే చారల చారల మెక్సికో స్వెటర్. “Are you from Madras?” అంటే Yes అని గొణుక్కున్నట్టు మాత్రం అని తలూపేడు. కళ్ళద్దాల్లోంచి కూడా తెల్లటి పెద్ద కళ్ళతో నల్లని మొహాన్ని స్వచ్ఛమైన దీపాల్లాగ వెలిగించుకుంటున్నాడు. “I used to have a jacket … one exactly like that!” అంటే ‘ఓ…ఓహో…’ అని వెడల్పుగా మొహమాటంగా నవ్వి ఆ నవ్వు మొహం అలాగే ఉంచుకున్నాడు. ‘Hi! I am Ram ….’ అని చెయ్యి చాస్తే ‘yes …yes sir!’ అని తలూపి “రాం చిలకపథీ…!” అన్నాడు తెలిసినట్టు. “I read about you in Liberty Sun! They gave you the alumni award, No?” అని ఇంకా ఏదో అంటున్నాడు. సెవెన్ మైల్ క్రీక్ మీది బ్రిడ్జి వచ్చి దట్టంగ దడ దడా దట్టంగ దడ దడా ధఠ్ఠంగ ధఠ్ఠంగ ధఠ్ఠంగ దఢ దఢా అని అడ్డుకుంటే చెవుల్లో వేళ్ళు పెట్టుకుని ఆ నవ్వు మొహంతో అలాగే బ్రిడ్జి దాటే వరుకూ నిశ్శబ్దంగా ఉండిపోయేడు. మళ్ళీ ‘ఇంకా ఏదైనా చెప్తారా?’ అన్నట్టు ఆరాధనగా చూస్తున్నాడు తనని. అతని పేరు ప్రభు అట. ఇక్కడికి వచ్చి రెండు నెలలే అయ్యింది. అతని చేతిలో హత్తుకొని కూర్చున్న ఫైలు మీద PSITES అని పెద్దక్షరాల్లోను, దిగువన Panneer Selvam Institute of Technology, Engineering and Science అని ఉంది. ఒక రెండు దోసిళ్ళలో ఇటూ అటూ ప్రమిదలు పట్టుకుని చిన్న చిన్న సంస్కృతం అక్షరాల్లోన ఏదో. Walhalla దాటుతున్నాక గర్డర్లు చీకటీ వెలుతురూ చీకటీ వెలుతురూ నీడలు పారుతుంటే ఆ ఫైల్లోంచి బిడియంగా ఒక కాయితం పైకి తీసి
“సర్ ! మై రెజ్యూమ్ …!” అన్నాడు.
దాన్ని పరిశీలనగా చూసి “You have very good grades…!” అంటే మళ్ళీ “Sir! Currently I am not having funding! They are saying that after first semester they will be having funding??” అని ఆదుర్దాగా అడుగుతున్నాడు. అతని భవిష్యత్తు పటాన్ని గురించి తన సలహా. అప్పటి తన resume గుర్తొచ్చింది. అది ఇప్పుడు ఇరవై రెండు పేజీల బొత్తి. దాన్లో తన చదువులు, పబ్లికేషన్లు, గొప్పలు, ఉద్యోగ విజయాలన్నీ నెల నెలా జాగ్రత్తగా పోగు చేసుకుంటాడు. తన అస్థిత్వానికి అదే ఒక గీటురాయి. లేదా తనలాంటి వాళ్ళ జీవన యానానికి తెల్లటి తెరచాప. అని తన లోలోపల చిన్నగా నవ్వుకున్నాడు. ప్రభు తన గురించి రాసినవి అవీ చదివేడు. తనలాగ అయితే బావుంటుంది అని అనుకుంటున్నాడు. తను అతనిలో, అతని మాటలు వాలకం అన్నింట్లో తన వెనుకటి బొమ్మని స్పష్టంగా చూసుకుంటున్నాడు. ఇరవైరెండు పేజీల నుండి ఒక పేజీకి…….. Liberty వచ్చీసింది. లేచి నిలబడితే ముందుగా తనని దిగమని తోవ చూపించేడు, స్టీల్ రాడ్ ని పట్టుదలగా పట్టుకుని ఎండుగా, నిటారుగా నిలబడ్డాడు. స్టేషన్ బయటికొచ్చి అతని వెనకే కర్ర మెట్లన్నీ దిగి రోడ్డు మీదికొచ్చేరు. అక్కడ పొద్దుటి కన్‌ఫెటీ కాయితాలన్నీ ఎవరూ లేని రోడ్డంతా చిందర వందరగా పడున్నాయి. ఉండుండి ఒక కార్లోన పెద్దగా పాటల చప్పుడు చేసుకుంటూ స్టూడెంట్స్. అటు Saint మీదనుండి ప్రభుని పలకరించుకుంటూ బిలబిల్లాడుతూ పిల్లలొచ్చేరు. ఐదారుగురు. పంజాబీ డ్రెస్ లు చవక రంగుల కోట్లూ గ్లవ్స్ వేసుకుని గొడవగా రాబోయిన వాళ్ళే తనని చూసి సందేహంగా రోడ్డుకి అవతలి ఫుట్‌పాత్ మీదనే ఆగిపోయేరు. ప్రభు “OK Goodnight Sir!” అని వెళ్ళేడు వాళ్ళతో కలిసి వాళ్ళు లోగొంతులతో ‘ఇత్నా దేర్ క్యోం…?’ అని, ‘వో కోన్ రే బుడ్ఢా?’ అనీ గుస గుసలుగా అడుగుతూ మోచేతులతో పొడుచుకుంటూ నవ్వుతుంటే రాతి మేడల పక్కనుండీ వాళ్ళ ఎపార్ట్ మెంట్ల వైపు. రొజ్జ గాలికి పులి చారల కాయితాలు తెల్లగా నారింజగా సుళ్ళు సుళ్ళు తిరుగుతూ స్థంభాల దీపాల మీదికి లేస్తున్నాయి. వెనక మెట్ల ఎత్తున నిశ్శబ్దంలోంచి రైలు తలుపులు మూసుకుని వెళ్తూ మృదువుగా “Liberty…. Doors Closing! Liberty! Doors Closing!! This train is departing!!” అని హెచ్చరిస్తోంది.