ఏకాకితనం

విజ్ఞాన వలయ పరిధులు
అవధులు దాటుతుంటే
హృదయ విస్తారం
కేంద్రం లోకే కుంచించుకుపోతోంది.
చోటు చాలని మనసులో
కుటుంబమే
ఇరుకుగా సర్దుకుంటోంది.

కరడు గట్టిన స్వార్థం
వేగం పెరిగిన అవసరాలు
లోతుగా చొచ్చుకుపోతే –
ఒక స్నేహం,
ఇంకొక బంధుత్వం
ఆత్మీయతల్ని
ఆప్యాయంగా
ఆహ్వానించ లేకపోతున్నాయి.

నాలుగు గోడలే నేస్తాలైతే
నట్టింట్లో చిత్రదర్శనమే
పలకరింపు చుట్టంగా మిగిలితే –
ఏకాకితనం దగ్గరై
నిర్వేదం ఆత్మబంధువై
ఒంటరికణం రక్తపోటులో
భాగమై పోతోంది !

పక్క వీధిలో ఓ చావునీ
పక్కింట్లో ఓ పెళ్ళినీ
కన్నెత్తి చూడలేక
సంతోషాలు, దుఖాలు
పరిమితికి అలవాటుపడ్డాయి.
నీకు నువ్వే అయిన ప్రపంచంలో
జనాభా
ఒంటరి సంఖ్యే !

అందుకే –
చిన్న కదలికతో
ప్రయత్నాన్ని చుట్టి
హృదయాన్ని
చుట్టూ ఉన్న
బావిగోడల్ని దాటించు
వైశాల్యం విస్తరించుకుంటుంది.
దానంతట అదే ఎదుగుతుంది
మరుగుజ్జు మనస్తత్వం!

చిన్న గీతల్ని సైతం
భూతాల్లా భ్రమించే మనసుకి
పెద్ద కష్టం కూడా
నలుసై
ఉనికిని కోల్పోతుంది.

ఏకాకి పంజరం తలుపులు తీయి
ఒంటరితనం
ప్రేమని చూస్తుంది.
ఆప్యాయతల్ని తడుముతుంది.
అందరినీ కలుపుకోవడం అలవాటుచేసుకుంటుంది
తెలియకుండానే
ఇంటిపేరు స్నేహంగా మార్చుకుంటుంది
జీవిత నిఘంటువులోంచి
ఒంటరి పదాన్ని తుడిచేస్తుంది.
గుప్పెడు గుండె కూడా
వసుధైక కుంటుంబాన్ని
అవలీలగా మోసేస్తుంది.