రామారావుకు తన అభిమాన నటుడు, తెలుగు చలనచిత్రరంగంలో ఏకైక గిగాస్టార్, సంజీవి కెనడా వస్తున్నాడని తెలిసినప్పటి నుంచీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కెనడా తెలుగు అసోసియేషన్ వాళ్ల దశ వార్షికోత్సవాలకు తన అభిమాన గిగాస్టార్ రావడం ఆ తెలుగు సంస్థ అదృష్టంగా కాకుండా తన అదృష్టంగా భావించాడు రామారావు.
సంజీవి సినిమా రిలీజు అయితే, మొదటి రోజు, మొదటి ఆటకు వెళ్ళాల్సిందే!
ఒకవేళ కాలేజీ ఉంటే, క్లాసులు ఎగ్గొట్టి మరీ వెళ్ళేవాడు. తన అభిమాన హీరో నటించిన అన్ని సినిమాలు ఒక్కొక్కటి కనీసం ఓ ఇరవై సార్లయినా చూసి ఉంటాడు.
అదే హిట్టయిన సినిమా అయితే ఇక చెప్పనవసరం లేదు, ఓ వంద సార్లయినా చూసుంటాడు.
ఇండియాలో ఉన్నన్నాళ్ళూ, తన అభిమాన హీరో దర్శనమే కాలేదు. ఆ తరువాత చదువుల కోసం కెనడా రావడం, అక్కడే స్థిరపడిపోవడం తో తన అభిమాన హీరోని సశరీరంగా కళ్లారా చూసుకునే భాగ్యం ఇన్నాళ్ళవరకు కలగలేదు.
అడపాదడపా, సంజీవి సినిమాలు మాత్రం వదలకుండా చూస్తాడు.
రామారావు భార్య హరిత అదే అంటుంది, “ఈ పళంగా మీ అభిమాన హీరో నాకు విడాకులిచ్చేయమంటే, మీరు ఓ క్షణం కూడా ఆలోచించరు. మీ హీరో అంటే మీకు అంత పిచ్చి!”
ఓసారి, హరిత “సంజీవి” నటన బాగాలేదంటే, ఓ నెల రోజులపాటు రామారావు హరితతో మాట్లాడడం మానేశాడు.
అప్పటినుండి, హరిత రామారావు ఎదుట “సంజీవి” గురించి ఒక్క మాట కూడా అనదు.
రామారావు “సంజీవి”కి విదేశాలలో చిక్కుకుపోయిన వీరాభిమాని.
తన అభిమాన నటుడి రాక తెలిసినప్పటినుండి, రామారావు తెలుగు సంఘం వాళ్లని ఓ పది సార్లయినా కలిసాడు, కెనడాలో ఆయన జైత్రయాత్ర వివరాల కోసం.
ఆ తెలుగు సంఘం వాళ్ళు ఈ వార్షికోత్సవానికి భారీ టిక్కెట్లు పెట్టారు. రామారావు తన హీరోని దగ్గరగా చూడాలని అన్నిటికంటే ఖరీదైన టిక్కెట్టు కొన్నాడు.
అంతే కాదు, “గిగాస్టార్ తో విందు” అంటూ ఓ వెయ్యి డాలర్ల టిక్కెట్టు పెడితే, రామారావే మొట్టమొదటి టిక్కెట్టు కొన్నాడు.
ఆహా! తన చిరకాలపు కోరిక తీరుతోందని సంబరపడిపోయాడు.
దశ వార్షికోత్సవాల తేదీ ఎప్పుడొస్తుందా అని, ఆ తెలుగు సంఘం కంటే రామారావే ఎదురుచూశాడు.
కానీ గిగాస్టార్ గారు రాకపోవచ్చు అనే వదంతులు, వార్తలు రావడంతో రామారావు నీరుకారిపోయాడు.
చివరికి ఎలాగైతేనేం, రామారావు అదృష్టం బాగుండి, సంజీవి వస్తున్నాడన్నారు.
ఆ రోజు రానే వచ్చింది. గిగాస్టార్ సంజీవి రానే వచ్చాడు.
తెలుగు సంస్థ వారు మొదటి రోజు సాయంత్రం, ఆంధ్రుల అభిమాన నటుడు, గిగాస్టార్‌కు వజ్రకిరీటంతో సన్మానం ఏర్పాటు చేశారు.
ఆ సాయంత్రం ప్రోగ్రాం మొదలైంది.
ఇసుకవేస్తే రాలనంత జనం.
అమెరికా నుండీ గిగాస్టార్ అభిమానులు తండోపతండాలుగా వచ్చారు.
ఇంకా గిగాస్టార్ గారి సన్మానానికి ఓ గంట టైముంది.
రామారావు, మొత్తానికెలాగో తెలుగు సంఘం వాళ్ల సహాయంతో గిగాస్టార్, వారి బృందం బస చేసిన హోటల్‌కు వెళ్లాడు.
వెళ్ళేసరికి, గిగాస్టార్ రూంలో పెద్దగా గొడవ జరుగుతోంది.
రామారావు దూరంగా నుంచుని చూస్తున్నాడు.
సంజీవి గట్టిగా తెలుగులో, మరుగున పడిపోతున్న అశ్లీల పదజాలాన్ని అంతటినీ తిరగదోడి, తెలుగు సంఘం ఆర్గనైజర్ మీద అమాంతంగా కుమ్మరిస్తున్నాడు.
“ఒక 50 లక్షల రూపాయిలైనా ఇవ్వకుండా ఎందుకు పిలుస్తారండి? మాకేం పనీ పాటా లేదనుకుంటున్నారా? మాకు ప్రతీ నిమిషం ఓ వంద డాలర్లతో సమానం. మీరు కనీసం ఓ 25 లక్షలైనా ఇవ్వకపోతే, నేను స్టేజీ మీదకి రాను. మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. రేపు ప్రోగ్రాం కూడా క్యాన్సిల్.” బెదిరించాడు సంజీవి.
“అలాగంటే ఎలాగ్ సార్! మీకు సన్మానం లో భాగంగా, ఆ వజ్రకిరీటం ఖరీదే 20 లక్షలైంది. ఇంకా మీకు వేరే ఇమ్మంటే కష్టమండి. అయినా మేము ముందుగా మీరు వస్తే డబ్బు ఇస్తామని చెప్పలేదు కదండి. అసలు ఈ విషయం మీ సెక్రటరీ కానీ, మీరు కానీ చెప్పలేదు. ఇప్పుడు రామూ అంటే, మా తెలుగు సంఘం పేరు పోతుందండి. ఇంత క్రౌడ్‌ని ఎలా కంట్రోల్ చెయ్యడం?” ప్రార్థించాడు తెలుగు సంఘం ప్రెసిడెంట్.
“మీ పేరు ఎవడికి కావాలండి? మా పేరు చూసి వస్తారు ఈ జనం. టిక్కెట్లు బాగానే అమ్మేరు కదా, ఆ మనీ ఇవ్వండి. లేకపోతే ప్రోగ్రాం క్యాన్సిల్.” మరోసారి విసుగ్గా అన్నాడు గిగాస్టార్!
నోటికొచ్చిన తిట్లతో తెలుగు సంఘం ప్రెసిడెంట్‌ని చెడా మడా తిట్టాడు గిగాస్టార్.
అవాక్కయి చూస్తూ నిలబడ్డాడు రామారావు.
మొత్తానికి చుట్టుపక్కల ఉన్న వాళ్లు అందరూ సర్ది చెప్పేక, అలాగే వస్తానని ఒప్పుకున్నాడు గిగాస్టార్.
తెలుగు సంఘం ప్రెసిడెంటే కాదు, రామారావు కూడా ఊపిరి పీల్చుకున్నాడు.
ఇదంతా చూస్తే రామారావుకు తలతిరిగి నట్లయ్యింది.
తన అభిమాన నటుడి నిజ జీవిత ప్రవర్తన చూసేక, “ఇతన్నేనా తను ఇంతకాలం ఆరాధించింది?” అనిపించింది.
మొత్తానికి అరగంట ఆలస్యంగా గిగాస్టార్ స్టేజీ మీదకి వచ్చాడు.
రావడం మామూలుగా రాలేదు; తూలుతూ ఇంకొకరి సాయంతో డైయాస్ దగ్గరకు వచ్చాడు.
“ప్రియమైన నా అభిమానుల్లారా!” అంటూ ముద్దమాటలతో మొదలెట్టాడు.
తమ అభిమాన నటుడి ఈ సంబోధన వినేసరికి అందరూ నిశ్చేష్టులయ్యారు.
“నాకు ఈ దేశం బాగా నచ్చింది. ముఖ్యంగా ఇక్కడమ్మాయిలు మన తెలుగు హీరోయిన్‌ల కన్నా అందంగా ఉన్నారు. నా తదుపరి చిత్రంలోకి ఈ దేశపు తెలుగమ్మాయినే హీరోయిన్‌గా తీసుకుంటానని సభాముఖంగా మీకు మనవి చేసుకుంటున్నా. అంతేకాదు, పదేళ్ళ క్రితం నేను నిర్మించిన చిత్రాన్ని ఈ తెలుగు వాళ్లకు అంకితం ఇస్తున్నాను. ఇంకా ఇండియాలో నా అభిమాన సంఘం వాళ్లు చేపట్టిన కార్యక్రమాలకు మీరందరూ విరాళాలు ఇవ్వండి.
మీరు ఇక్కడ బాగానే సంపాదిస్తారు. మీరందరూ ఇండియాలో వాళ్లకి నా అభిమాన సంఘం ద్వారా సహాయం చేయండి.”
ఇలా సాగుతున్న ఉపన్యాసం పూర్తవ్వకుండానే, గిగాస్టార్ తూలుతూ కిందపడ్డాడు.
గబగబా స్టేజి వెనుక నుండి ఎవరో వచ్చి తీసుకెళ్లారు.
జనంలో ఒక్కసారి కలకలం మొదలైంది.
ఇంతలో ఎవరో స్టేజి మీదకి వచ్చి: “అందరూ దయచేసి కూర్చోండి. గత రెండు రోజులుగా మన గిగాస్టార్ గారికి జ్వరం ఉంది. అయినా సరే మన తెలుగు వాళ్లంటే అభిమానం కొద్దీ, జ్వరం కూడా లెక్క చేయకుండా మిమ్మల్ని ఆనందింప చేసారు. ఎక్కువ నీరసంగా ఉండడం వల్ల నిల్చో లేకపోయారు. దయచేసి మీరందరూ సహకరించండి” అంటూ ఇంగ్లీషులో వివరించారు.
జనం అందరూ కాస్త సద్దుకున్నారు.
ఇదంతా చూస్తుంటే రామారావుకి మతిపోయింది.
“ఇతనేనా మీ హీరో?” అన్నట్లుగా రామారావు భార్య అతనికేసి చూసేసరికి, రామారావుకు తలకొట్టేసినట్లయ్యింది.
ఇలాంటి హీరోనా ఇన్నాళ్ళూ ఆరాధించింది?
క్లాసులు ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసింది?
తన అభిమాన హీరోని విమర్శించిన హరిత మీద తను చాలా సార్లు కోప్పడింది?
ఇవన్నీ తలుచుకుంటే రామారావుకి తన ప్రవర్తనకి సిగ్గేసింది.
ప్రోగ్రాం అయిపోయాక బయటకు వస్తూంటే, రామారావు స్నేహితుడు కిరణ్ కనిపించాడు.
రామారావు తన అభిమాన హీరోతో జరిగిన సంఘటన గురించి చెప్పాడు.
“ఇది చాల చిన్న విషయం. నీకు తెలియనిది ఇంకో విషయం చెబుతాను,” అంటూ, “ఈ గిగాస్టార్ ఇక్కడ ఒక కెనడా అమ్మాయి చెయ్యి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించబోతే ఆ అమ్మాయి పోలీసుల్ని కాల్ చేసిందట.
మొత్తానికి ఈ తెలుగు సంఘం వాళ్లు కింద మీదా పడి ఆ గొడవ తప్పించారు. అయినా, ఇంత పెద్ద సెలబ్రిటీలకు పదిమందిలో ఎలా మసలాలో తెలియదు. వాళ్ల దృష్టిలో ప్రజలు గొర్రెలమంద. వాళ్లు ఏం చేసినా చెల్లుతుందనే అహంకారం. అయినా వాళ్లను ఏమనడం? మనలాంటి వాళ్లు అలాంటి వాళ్ల వెనక పడుతూ ఉంటే అలాగే ఉంటారు,” కిరణ్ ఆవేశంగా చెప్పాడు.
రామారావుకు చెళ్ళున కొట్టినట్లయ్యింది.
ఇంటికి వస్తూ కారులో ఉండగా, హరిత రామారావు మౌనం చూసి అంది: “ఏం? మీ హీరో గారు మీకు చిన్న జర్క్ ఇచ్చారా?”
“… మీ హీరో గార్ని చూస్తే అందరికీ అసహ్యం వేసింది. ఇంత ఖర్చు పెట్టి తీసుకొస్తే, కనీసం ఈ ప్రేక్షకుల ముందు ఎలా ప్రవర్తించాలో తెలియని ఇండీసెంట్ ఫెలోస్! ఇలాటి వాళ్ల ప్రోగ్రాంలంటూ ఎగబడిపోయే వాళ్లననాలి. మనమిక్కడ బాగా సంపాదిస్తామట. మనకు ఊరికే ఎవరూ డబ్బు ఇవ్వరు. అయినా ఈ గిగాస్టార్లు ప్రతి సినిమాకి కోట్లు కోట్లు పారితోషికం తీసుకుంటారుగా. అంతగా పేద ప్రజలకు సహాయం చేయాలంటే తన ఒక సినిమా పారితోషికం విరాళంగా ఇవ్వచ్చు కదా? వాళ్ల డబ్బు మాత్రం పదిలం. మనమే ప్రజా సేవ చేయాలని చూస్తారు!”
రామారావు ఏమీ మాట్లాడకుండా మౌనంగా వింటున్నాడు.
ఇన్నాళ్ళు హరిత అణచుకున్న కోపం బయటకి రావడాన్ని చూస్తూ…
ఆ మర్నాడు ఇంటర్నెట్ ఎడిషన్ తెలుగు పేపర్లలో వార్త:
“ప్రవాసాంధ్రులను సమ్మోహన పరచిన గిగాస్టార్!”
“గిగాస్టార్ ప్రదర్శనకి మంత్రముగ్ధులైన ప్రవాసాంధ్రులు!”
“మూడుగంటల పాటు ప్రవాసాంధ్రుల్ని కట్టి పడేసిన గిగాస్టార్ నటనా చాతుర్యం…”
ఈ వార్తలన్నీ చదివి ప్రవాసాంధ్రులకు మతిపోయింది. రామారావుకు కూడా.
“ఈ పత్రిక ప్రజల పత్రిక, నిష్పక్షపాత వార్తలకు పుట్టినిల్లు,” ఆ పత్రిక లోగో కింద పెద్ద పెద్ద అక్షరాలు రామారావును మరొక్కసారి వెక్కిరించాయి.
దెబ్బతిన్న అభిమానంతో, రగులుతున్న అవమానంతో ఆ రాత్రి రామారావుకు నిద్రపట్టలేదు.
జాగారమే అయింది.
తెలతెలవారుతుండగా ఓ ఘోరమైన నిర్ణయానికి వచ్చాడు అతను.
పొద్దున్నే గుడికి వెళ్లి శాస్త్రోక్తంగా గిగాస్టార్ అభిమానానికి తిలోదకాలు ఇచ్చేశాడు.
పనిలో పనిగా వర్ధమాన టెరాస్టార్ జూనియర్ లంబోదర్‌కు అభిమానసంఘం స్థాపించి తనే దానికి ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేశాడు!