కలకీ కలకీ మధ్య

“అయినా లాభం లేదు. ఫ్లైట్‌ వెళ్ళిపోయింది” కౌంటర్లో మనిషి నిర్లక్ష్యంగా చెపుతూనే ఉన్నాడు. ఇటు తిరిగి చూస్తే ఫ్లైట్‌ గాల్లోకి ఎగురుతూ.. ఒక క్షణంసేపు ప్రపంచమంతా నిలిచిపోయినట్టూ.. వొళ్ళంతా చెమటలు కక్కుతూ..ఏంచేయాలో అర్థంకాదు..

చటుక్కున ఉలికిపాటుతో మెలకువ వచ్చింది. పాడుకల. అదే పీడకల మళ్ళీ మళ్ళీ ఎందుకొస్తుందో? కరెంటెప్పుడు పోయిందో, పైన సీలింగ్‌ ఫాన్‌ ఆగిపోయి ఉంది. ఉక్కకి ఒకటే చెమట.

“లేచావా?” అంటూ గదిలోకి వచ్చింది వదిన. చేతిలో ప్లేటులో కారప్పూసా, పప్పుచెక్కా.
“కరెంటు పోయినట్టుందిగా!. వరండాలో కూచుందువు రా!” అంటూ బయటికి నడిచింది ప్లేటుతో.
(“పెట్టుకోలేవూ? అన్నమూ, కూరలూ టేబుల్‌ మీదే ఉన్నాయిగా? అత్తయ్యో నేనో వచ్చి పెట్టిందాకా కూచోవటమేనా?”)
వదిన ముచ్చటపడి చేయించుకున్న డబుల్‌ కాట్స్‌. పక్కనే దానికి మేచ్‌ అవుతూ డ్రసింగ్‌ టేబుల్‌.
(“ఏమిటి, మా గదిలోకెందుకొచ్చావు?”
“నా చొక్కా చినిగి పోయింది. మిగతావన్నీ ఉతుకులోకి పోయాయి. అన్నయ్య పాతచొక్కా ఏమన్నా ఉందేమోనని ..”
“నన్నడిగితే ఇచ్చేదాన్నిగా! బయటికి పద!”)

బయటికి వరండా లోకి. టీపాయ్‌ మీద ప్లేట్‌. పక్కనే స్టీల్‌ గ్లాసులో మంచి నీళ్ళు. ఉండుండీ వెచ్చటి గాలి.
ఒక తేపొచ్చింది. లంచ్‌ అరిగినట్టు లేదు. ఇంత భారీగా తినడం అలవాటు లేదన్నా వినిపించుకోలేదు వదిన. కొసరి కొసరి వడ్డించింది చేపల పులుసు.
కాఫీ కప్పు తీసుకుని అమ్మ వచ్చి గడపమీద కూచుంది.
“తీసుకోబ్బాయ్‌! మీ వొదెనే చేసింది నీకిష్టమని!”
“అరగలేదమ్మా! ఇందాకేగా తింది!”
“అయితే కొబ్బరి బోండామొకటి తాగరాదూ! శాంతీ! అబ్బాయికి ఒక కొబ్బరి బొండామంట ఇయ్యమ్మా!” లోపలికి కేకేసి చెప్పింది.
నవ్వొచ్చింది.
(“తొందరగా తిను! మీ వొదినొచ్చే టైమయింది.”
“అంత భయపడుతూ తినకపోతే ఏమయింది?”
“ఆఁ నీకిష్టమని మీ వొదినకి తెలియకుండా కొన్నా! మళ్ళీ తెలిస్తే దుబారా చేస్తన్నానని గొడవ చేసుద్ది. ఎందుకు లేనిపోని తగూలు!”)
“అయిపోయినట్టున్నయ్యి అత్తయ్యా! తెప్పిస్తాలే!” వదిన గొంతు.
“ఇప్పుడేం వద్దొదినా!” వినిపించుకున్నట్టు లేదు.

బదులుగా కాసేపటికి అన్నాయ్‌ వచ్చాడు చొక్కా గుండీలు పెట్టుకుంటూ.
“బాగా నీళ్ళున్నయ్యి తేబ్బాయ్‌!” అమ్మ.
“ఇప్పుడెందుకన్నాయ్‌ ఈ ఎండలోపడి? సాయంత్రం నే తెస్తాగా!”
“ఆఁ ఇదేమెండలే!” స్కూటర్‌ స్టాండ్‌ తీసి నెట్టుకుంటూ బయటికి నడిపిస్తూ అన్నాడు తల తిప్పకుండానే.
(“ఇదేమెండ? ఆ ఇస్త్రీ షాపెంత దూరమని? నాలుగడుగులు వేస్తే అరిగిపోతావా లేకపోతే స్కూటర్‌ మీద పోతే గానీ మన లెవల్‌కి సరిపోదా?”)

వదిన కూడా కాఫీ కప్పు తీసుకుని కూచుంది.
“ఇంకా అమెరికా కబుర్లేమిటి రవీ?”
(“పొద్దుణ్ణించీ చెపుతున్నా కాసిని కూరగాయలు తీసుకు రమ్మని. ఎప్పుడు చూసినా ఫ్రండ్స్‌తో ఆ పోచుకోలు కబుర్లేగానీ ఒక్క పనీ అందుకోకపోతే ఎట్లా?”)
“అన్నీ చెప్పేసినట్లే వదినా! ఇంకేంఉన్నాయి!”
“ఇంతకీ సెలవులెన్ని రోజులబ్బాయ్‌?”
“ఇంకా నాలుగు వారాలు!”
(“మహా అయితే నాలుగు లేదూ అయిదు వారాలు! ఇన్ని ఫ్రయ్స్‌ మిగిలిపోయినయ్‌ కెచప్‌ అయిపోయింది పట్టుకొస్తానుండు!”)
“ఇంకో పదిరోజులు ఎక్కువ తీసుకోవల్సిందబ్బాయ్‌! ఆ కోటేసర్రావు మామయ్య కబురుమీద కబురు చేస్తన్నాడు!”
“ఏ కోటేశ్వర్రావు మామయ్య, ఏంకబురు?”
“నువ్వెరగవులే! మా పెద్దమ్మమ్మ మనవడు! రాకపోకల్లేక దూరమయ్యాంగానీ దగ్గిరాళ్ళే! బాగనే సంపాయించాడంట. ఒక్కటే కూతురు. నువు అమెరికా ఎల్లావని ఎట్ట తెలిసిందో మరి, ఒకటేమైన ఎమ్మటపడతన్నాడు. పిల్ల పొటోలు కూడా తీసుకొచ్చాడు పోయినసారి!”
“అమ్మాయి బాగానే ఉంది. కొంచెంనలుపుగానీ!” వదిన.
“నలుపెక్కడలేమ్మాయ్‌ కొంచెంచామనచాయగ ఉంటది.”
“ఇప్పుడదేంలేదులేమా! ఇంకో ఏడాది దాకా పెళ్ళిమాటే వద్దు.”
(“సంవత్సరం కూడా పట్టదు మార్కెట్‌ పుంజుకోవటానికి! మళ్ళీ ఫెడరల్‌ రేట్స్‌ తగ్గిస్తూనే ఉన్నారుగదా! జనాల్లో కొంచెం కాన్ఫిడెన్స్‌ వస్తే ఏముందిక?”)
“ఏమోనయ్యా నీ ఇష్టం అసలొచ్చి మాట్టాడతానన్నాడులే నీతో ఒకపాలి.”

మాట మార్చాలి. “కవిత పెళ్ళి బాగా అయిందా?”
“ఆఁ బాగనే అయిందిలే! మీ పెద్దమ్మ కారేసుకొచ్చి బొట్టు పెట్టి పిలిచింది. మీ వదినకీ నాకూ చీరలు పెట్టింది. పదేళ్ళ తర్వాత ఇయ్యే పిలుపులు. ఏదో నువ్వు అమెరికా ఎళ్ళబట్టిగానీ ఆమె కంటికి మనంఆనేవాళ్ళమా? మడుసుల్ని బూజు దులిపేసినట్టు దులిపేది ఇప్పుడు బంగారంలాగ మాట్టాడతంది!”
నవ్వుమొహంతో చెపుతోంది అమ్మ. గొంతులో స్థాయి పెరిగిన గర్వమూ, తృప్తీ.
“రంగారావు బాబాయ్‌ కనపడలేదే? ఎప్పుడూ ఇక్కడే తిరిగేవాడు?”
“వాళ్ళ పనయిపోయిందిలే! పిల్లలకి చదువులనీ అయ్యనీ ఎక్కడెక్కడో జేరిపిచ్చాడు బోలెడు డబ్బులు పెట్టి. ఎక్కడ బట్టినా అప్పులేనాయె. మడిసికి మొహంచెల్లితేగా? ఎక్కడన్నా బజాట్లో కనబడి డబ్బులడుగుతాడేమో ఇయ్యబాక!”

బోండాలు పట్టుకొచ్చాడు అన్నాయ్‌. వదిన అందుకుని లోపలికి పట్టుకెళ్ళి ఒక గ్లాసులో పట్టుకొచ్చి ఇచ్చింది.
“అదేమిటి నాఒక్కడికే ఎందుకు? మీరు కూడా తాగండి!”
“మేమెప్పుడూ తాగేయ్యేగా, నువ్వు తాగయ్యా!”
“మా మేనేజర్‌ బాగా ఆనమ్దపడిపోయాడు నువు తెచ్చిన ఆ కార్డ్‌లెస్‌ బాగా పనిచేస్తుందని. అయితే వాళ్ళ అల్లుడొచ్చి ముచ్చటపడి పట్టుకెళ్ళాడట అది! ఎట్లాగయినా ఈసారి ఇంకోటి తెప్పించమని ఒకటే అడుగుతున్నాడు!” అన్నాయ్‌ నవ్వుతూ చెపుతున్నాడు.
ఈసారి!?
“ఇందాక నేను పడుకున్నప్పుడు ఫోనులేమైనా వచ్చాయా వదినా?”
“లేదే?”
అవును, ఈ టైమ్‌లో ఎందుకు చేస్తాడు? ఇది టైంకాదు!
“ఎవరన్నా ఫోన్‌ చేస్తే నిద్రపోతున్నా లేపొదినా!”
(“ఎందుకూ నీకు ప్రతివారం ఈ ప్రాజెక్ట్‌ సంగతి ఎంతవరకొచ్చిందీ ఫోన్‌ చేసి చెప్తానుగా! మూణ్ణెళ్ళనించీ నలుగుతున్నదే కదా! టైం పట్టొచ్చుగానీ అది మనకే ఖాయం! ఆ డైరెక్టర్‌ ఎప్రూవల్‌ ఒక్కటే కావలసింది. “)
“సరేలే”

శీను మామయ్య వచ్చాడు హడావుడిగా. పల్లెటూరి రాజకీయాల్లో పడి గుంటూర్లో ఫైనాన్సింగ్‌ బిజినెస్‌ దాకా లాక్కొచ్చాడు. ఎప్పుడెక్కడుంటాడో ఏంచేస్తాడో తెలియదు.
“ఏందబ్బాయ్‌ ఎట్టుందక్కడ? రెండేళ్ళ పైమాటేగా నువ్వక్కడికెళ్ళి?”
“బాగానే ఉంది!”
“సెలవులెన్నాళ్ళు? పెళ్ళి చేసుకుపోవూ? ఏంది అందర్నీ ఎనక్కి పంపించేత్తన్నారంట నిజమేనా? ఇంతకీ నీది పర్మనెంటేనా?”
ప్రశ్నల వర్షం. ఆయనకి జవాబులు అక్కర్లేదు.
“ఏందోనబ్బాయ్‌ మావాణ్ణి కూడా ఈ కంప్యూటర్‌ కోర్సుల్లోనే పెట్టా! ఏమయిద్దో ఏమోగాని!”
“మీ వాడికి ఉద్యోగమెందుకులే! నీ బిజినెస్‌లోనే పెట్టు!” అన్నాయ్‌
“నీ సంగతేందబ్బాయ్‌ ఆమద్దెన బిజినెస్‌ బిజినెస్‌ అంటివి. ఏమయింది? అబ్బాయొచ్చాడుగా మాట్టాడావా మరి?”
బిజినెస్‌? అన్నాయ్‌ బిజినెస్సా?
“ఏదీ నువా లెక్క మొత్తం చెప్పకపోతివి. మళ్ళీ నీతో మాట్లాడటం కుదరకనేపోయె!”
” పదయితే మాట్టడదాం! అయితే స్టాకుల్లో కూడా ఏమన్నా పెట్టావ అబ్బాయ్‌?ఎంత నష్టమొచ్చినేంటి?”
(“నేను చెపుతూనే ఉన్నా మరీ అంత ఆశకి పోవద్దని! ఇప్పుడు అమ్మితే మాత్రంఏమొస్తుంది? ఎటూ మునిగావు, గోచిపాత ఉంటే ఎంత ఊడితే ఎంత? ఇంకో ఏడు ఆగి చూడు!”)
“ఏందబ్బాయ్‌ ఏ మాట్టాడవ్‌? ఆఁ మొదట్నుంచీ నువ్వంతేగా పెద్దగ మాట్టాడవాయె!”
“శాంతీ, శీను బాబాయ్‌కి కాఫీ తీసుకురామ్మా!”
“వొద్దులేమ్మాయ్‌ ఇప్పుడేమొద్దక్కాయ్‌ ఎళ్ళాలి, ఇంకా చాన పనులున్నయి. ఈసారి తీరిగ్గా వస్తాలే!”
“నేనూ వస్తున్నా మామయ్య! వెళదాంపద!”
అన్నాయ్‌ ఆయన వెంటే వెళ్ళాడు.
బిజినెస్‌ అన్నాయ్‌ బిజినెస్సా?

కాసేపటికి గేటు తీసుకుని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ గురవాయొచ్చాడు.
“దణ్ణాలు బాబూ! గుర్తుపట్టా నన్ను?”
“ఆఁ గురవాయవి కాదూ?”
“అబ్బో, గుర్తే అయితే!”
“మర్చిపోతే నువ్వూరుకుంటా?” అమ్మ అందుకుంది. “గురవాయ్‌ కేమబ్బాయ్‌ పొలంకవులుకి తీసుకుంటన్నాడు సొంతంగా. సుబ్బరంగా చేసుకుంటన్నాడు.”
“అది పెద్ద దండగమారి పనిలేండే! పంట పండి సావదు, బాగ పండిందిరా అనుకుంటే రేటు పలకదు. ఏదో రేయింబొగుళ్ళూ కొట్టుకులాడతమేగానీ పైసా మిగిలేదిలేదు సచ్చేది లేదు. అందుకే ఈ ఏడు మీ నాలుగెకరాలేగా సేత్తంది. మా అగసాట్లకేమొచ్చెగానీ నీ సంగతులేంది సెప్పండే?”
“ఏమున్నయ్‌ అంతా బాగానే ఉందక్కడ!”
(“పదేళ్ళనించీ కాంట్రాక్టులు చేస్తున్న నాకే మూణ్ణెల్ల కాంట్రాక్ట్‌ దొరకటానికి రెణ్ణెల్లు పట్టింది. ఇంత వరస్ట్‌ పీరియడ్‌ ఎప్పుడూ చూడలేదు నేనింతవరకూ!”)
“సిన్నప్పుడంతా నా బుజాలమీదేగా ఆడింది! ఎప్పుడన్నా తలుసుకుంటావాండీ అయన్నీ?”
“అంత టైంఎక్కడ ఉంటదిలే అబ్బాయికక్కడ?”
“గుర్తుందీ ఒకపాలి కాలుజారి సెర్లో పడితే ఎవురూ సూడకపోతిరి! నేను సమయానికి సూసి దూకి వొడ్డుకి లాక్కొత్తిని!”
“నిజమే, నువు సూడకపోతే ఏమయ్యుండేదో? ఇంతకీ నీ సంగతులేంటి గురవాయ్‌”
“పిల్ల పెల్లి కుదిరిందండే! సరే అబ్బాయ్‌ గూడ వొచ్చాడని సెప్పారు. సూసిపోదామనొచ్చా!”
“కాసుక్కూచుంటారు మీరంతా పిల్లాడు ఎప్పుడొస్తాడాని!” అమ్మ నవ్వుతూ అంది.
లోపలికెళ్ళి పర్స్‌ లోంచి అయిదొందలు తీసుకొచ్చి ఇవ్వబోతే తీసుకోలేదు గురవాయ్‌.
“ఈ డబ్బులెందుకండే నాకు?”
” అదేమిటి తీసుకో!”
“తీసుకో గురవయ్యా! నువ్వడక్కుండానే అబ్బాయిస్తన్నాడుగదా!”
“ఈ డబ్బులు నేనేంసేసుకునేది? ఈ డబ్బులు బొబ్బులు నాకొద్దులేయ్యా!”

“ఎంత ఆశ్చర్యపోయానో వాడి మాటలు విని. డబ్బుతో ముడిపడని సంబంధాలు కూడా ఉండొచ్చనిపించింది.”
మేస్టారు ఆశ్చర్యపోతూ వింటున్నారు.
“కానీ వాడి ఉద్దేశం అదికాదు. నాపేరు మీద ఏదయినా వస్తువు కొనాలట. ఒక నగో, బీరువానో..”
నవ్వేశారు మేస్టారు. “పోనీలే మనుషులు మనుషుల్లానే ప్రవర్తిస్తున్నారు!”
శకుంతలగారు టీ పట్టుకొచ్చారు.
“అయ్యో ఆ కుర్చీ కాలు విరిగినట్లుంది బాబూ! ఇటు బెంచీ మీద కూర్చోకపోయావూ?”
లేచి బెంచీ మీద.
(“మూణ్ణెల్లవటంలా? ఇంకా ఇక్కడుండి ఏంచేస్తావ్‌”)
టీ ఇచ్చి వెళ్ళిందామె.
“రోజులట్లా ఉన్నాయి. ఏదీ నమ్మకంలేదు; నిలకడ లేదు. ఒకదాన్నే పట్టుకుని బతుకంతా గడిపేసే పరిస్థితి లేదిప్పుడు. అన్ని తలుపులూ తట్టవలసిందే! అన్ని దారులూ ప్రయత్నించి చూడవలసిందే! ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు! ఒక స్వామి కాకపోతే ఇంకో స్వామి! ఈ మనిషి కాకపోతే ఇంకో మనిషి! ఈ ఉద్యోగంకాకపోతే ఇంకో ఉద్యోగం! ఒక ఉద్యోగానికి గడుస్తుందా? రెండు ఉద్యోగాలు కావాలి. లేకపోతే భార్యాభర్తలిద్దరూ చేయాలి. లేకపోతే బిజినెస్‌. ఒక రోజుకు ఒక్కటే సమస్య ఎపాయింట్‌మెంట్‌ తీసుకుని వస్తుందా? బొచ్చెబోలెడు సమస్యలెప్పుడూ చుట్టుముట్టే ఉంటాయి. పంజరంలో చిలకమాదిరి గిలగిల కొట్టుకుంటూనే ఉండాలి. లేచిందగ్గర్నుంచీ వెయ్యి మార్గాలు చూసి పెట్టుకోవాలి. తెలిసిన ప్రతి మొహంలోనూ ఒక అవకాశాన్ని వెదకాలి!”

రెండు గుక్కలు టీ తాగి సర్దుకున్నారు.
“అయితే సెలవులన్నీ ఇక్కడే గడుపుతావా, ఎటన్నా వెళుతున్నావా?”
ఇంకో అవకాశాన్ని వెదకాలి. ఇక్కడుండి లాభంలేదు. కెచప్‌ దొరకదు. ఫ్రైస్‌ చప్పబడిపోతాయి. ఫోన్‌ రాదు. “వచ్చే వారం హైద్రాబాదెళ్ళి అక్కణ్ణుంచి బెంగుళూర్‌ వెళ్ళి వద్దామనుకుంటున్నా. అక్కడ కొంతమంది ఫ్రండ్స్‌ ఉన్నారు.”
(“ఇక్కడ పరిస్థితీ అంతే ఉందిరా! ఏవో ప్రాజెక్టులు వస్తాయొస్తాయంటున్నారు గానీ నమ్మకంలేదు!”)
“పై అరలో డబ్బా అందిద్దురుగాని ఇటు రండి!” శకుంతల గారు లోపల్నుంచి పిలుస్తున్నారు.
“వస్తానుండు!” అంటూ లోనికి వెళ్ళారు మేష్టారు.
” అడుగుతానని చెప్పి అడగరేమిటి? నన్నడగమంటారా?” శకుంతలగారి గొంతు సన్నగా వినిపిస్తూంది.
“అడుగుతానంటున్నాగదా? అసలు తన పరిస్థితి ఎట్లా ఉందో ఏమిటో కనుక్కోనీ..”
“సరే, మీరడక్కపోతే నేనే అడుగుతాను. మళ్ళీ కోపంతెచ్చుకోవద్దు!”

ఒక్కసారి లేచి ఇక వెళ్ళి పోదామన్పించింది. ఎక్కడికి? మళ్ళీ అలవాటైపోయిన నీరసం.
మేస్టారొస్తున్నట్టు అడుగుల చప్పుడు.

* * *

గుండె దడదడ కొట్టుకుంటూంది. పాస్‌పోర్ట్‌ ఎక్కడ? జేబులో.. ఉహుఁ.. బేగ్‌లో.. ఉహుఁ.. ఇదుగో ఈ కవరులో.. టిక్కెట్టేదీ.. పాస్‌పోర్ట్‌లోనే ఉండాలి కదా.. అవును ఇదుగో.. పాస్‌పోర్ట్‌లో వీసా కనపడదే మరి? ఎక్కడికి పోతుంది.. కంగారేంలేదు. ఇదుగో.. హమ్మయ్య.. ఇంతకీ ఫ్లైట్‌ ఎన్నింటికి? ఇవిగో అన్నీ ఉన్నాయి. ఏదీ మిస్‌ కాలేదు.
“అయినా లాభంలేదు. ఫ్లైట్‌ వెళ్ళిపోయింది” కౌంటర్లో మనిషి నిర్లక్ష్యంగా చెపుతూనే ఉన్నాడు.


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...