1.
దుమ్మో, పొగో, మంచో తెలియకుండా పల్చగా అలిమినట్టుంది. ఒక పక్క రకరకాల వాహనాలు నెమ్మదిగానో, వేగంగానో పోతున్నాయి. వెనక గాజు తలుపులూ కిటికీలతో పెద్ద మాల్ దీపాలతో మెరిసిపోతూ ఉంది. పై అంతస్తుపై అస్తమించే సూర్యుడి వెలుగు పడి ఎర్రగా మెరుస్తూంది. ఆ వెనగ్గా ఇంకా ఎత్తయిన భవనసముదాయాలు కబళించడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాయి. గుంపులు కడుతూ మాల్ లోపలికి వెళుతూ ఉన్నారు కొందరు. చేతిలో ఎరుపూ నీలం రంగులతో షాపుల పేర్ల వంటివేవో రాసి ఉన్న సంచులతో నవ్వుతూ మెట్లు దిగి వస్తున్నారు నలుగురు అమ్మాయిలు. వెనక గులాబి గౌను పాపను పట్టుకుని మెట్లు జాగ్రత్తగా దింపుతున్నారు ఒక తల్లీ తండ్రీ. రోడ్డు దాటడానికి కొందరు గుంపుగా నిలబడి ఉన్నారు. అటు వైపు బస్టాండ్ దగ్గర కొంతమంది ఎదురుచూస్తూ ఉన్నారు.
ఎటు చూసినా చూపు చివరికి ఆమె మీదికే వచ్చి నిలుస్తూంది మిగతా అన్నిటినీ వెనక్కి నెట్టేస్తూ. వెలిసిపోయిన ఎర్రకోక చుట్టుకుని ఎముకల కుప్పలా కూచుని ఉంది. పుల్లలాంటి కుడిచేయి ముందుకు పొడుచుకొచ్చినట్టుండి వికృతంగా ఉంది. తెల్ల జుట్టు గాలికి కొద్దిగా రేగి ఉంది. ముడతలు పడ్డ నల్లటి మొహంలో కాంతిహీనమైన కళ్ళు, కనుకొలకుల్లో పుసి, కారుతూ మధ్యలోనే చారికలుగా ఆరిపోయిన కన్నీరు, ఎండిపోయిన పెదాలు, వాటి మధ్య రెండు గొగ్గిరి పళ్ళు, వాటి మధ్య ఖాళీ వికారంగా కనపడుతున్నాయి. తల చుట్టూ గిరికీలు కొడుతున్నట్టు రెండు ఈగలు ఎగురుతున్నాయి. వాటిని తోలబోతూ రెండో చేయి పైకి లేచింది.
ఆరోగ్యంగా వెలుగుతున్న చర్మం మీద కురుపులా, అక్కడ ఉండకూడని మనిషిలా ఉంది ఆమె. అయినా చుట్టూ ఉన్న ఎవరికీ ఏమీ పట్టినట్టు లేదు. ఎవరికీ ఆమె దయ చూపవలసిన దీనురాలిలాగా కనపడుతున్నట్టు లేదు. పరికించి చూస్తే నిజానికి జాలిపడవలసింది వాళ్ళ గురించే అనిపిస్తుంది.
“ఇంకా ఇక్కడే ఉన్నావా?” అంటూ వెనకనించి వినవచ్చిన మాటలకు ఉలిక్కిపడింది ఆమె. వెనక్కి తిరక్కుండానే అంది అతనితో “బావుంది కదా!”
“అవును. అబ్బ, ఆ ముసలమ్మ ఎంత నాచురల్‌గా ఉంది నిజంగా అక్కడ కూచున్నట్టే!” ఆగి అన్నాడు. “కొందామా? ఎంతో?” ఫ్రేమ్ కొసన వేలాడుతున్న టాగ్ చూస్తూ అన్నాడు.
2.
“అసలు వాడిది ముందే కోతి మొహం, ఆపైన చెక్క మొహం…’ శివం గొంతు పెద్దది చేసుకుని కుడి చేయి పైకీ కిందికీ ఊపుతూ చెప్తున్నాడు. రమణ చేయెత్తి ఆగమని సైగ చేస్తూ “వాడూ వీడూ ఏమిటండీ, కాస్త మర్యాదగా మాట్లాడుకుందాం!” అన్నాడు.
“మీరెక్కడి మనిషి బాబూ! సినిమావాళ్ళను ఎవడయినా అలాగే అంటాడు. ఇప్పుడు కొత్తగా వాళ్ళకు మర్యాదలేమిటీ?” చిరాకు అణుచుకుని మళ్ళీ అందుకున్నాడు. “ఆ బాబుగారికి నటనలో ఓనమాలు తెలీవు. మొదటి సినిమా నుంచి ఇప్పటిదాక మొహంలో ఒకటే ఫీలింగ్. వాళ్ళ బాబు దగ్గర డబ్బులుండబట్టి అన్ని సినిమాలు ఫ్లాపయినా ఇంకా సినిమాలు తీస్తూ జనాల్ని చంపుతున్నాడు కానీ బుర్ర ఉన్న వాడెవడూ డైలాగ్ లేని వేషం కూడా ఇవ్వడు. ఆయనకి ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు?”
“మిగతావి వదిలేయండి. ఈ సినిమా చూశారు కదా! ఈ పాత్రలో ఒదిగిపోయాడు అంటున్నా నేను.”
“ఏం పాత్ర అది? నటన రానివాడి పాత్ర అది. సినిమా హీరో కావాలని ట్రై చేసి ఫెయిలవడం కథ. ఇంక నటనకి స్కోప్ ఎక్కడుంది? ఉన్న కొద్ది చోట్లా గడ్డం పెంచి మొహం కనపడకుండా చేసి కొంతా, మొహం మీద నీడలు పడేలాగ కొంతా… అసలా డైరెక్టర్ తెలివిని మెచ్చుకోవాలి. అరె, ఏడుపు సీన్ ఉంటే మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చినట్టు చూపించాడు. మీరు దేన్ని యాక్షన్ అంటున్నారు?”
అతనో క్షణం మిగతా ముగ్గురి వంకా చూశాడు. కౌముది ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూంది. గోపాల్ ఫోన్లో మెసేజెసో, ఫేస్‌బుక్కో చూసుకుంటూ ఉన్నాడు. నరసింహ బజ్జీలు తింటూ కౌముది వంక వంకరగా చూస్తూ ఉన్నాడు. మీరిద్దరూ ఏదో తేల్చుకోండి అన్నట్టు వాళ్ళు వదిలేసినట్టుంది. అప్పటికే మిగతా అవార్డులు తేల్చడానికి చాలా వాదోపవాదాలు జరిగాయి. చివరికి మిగిలినవి ఇక రెండే కేటగిరీలు: ఉత్తమ నటుడూ, ఉత్తమ సహాయ నటుడూ.
“అతనికి నటన వచ్చా రాదా అని కాదు కదా మనం చూడవలసింది? ఈ పాత్ర ఎట్లా పోషించాడు అని. అతని గురించి మనకేమీ తెలియదనుకోండి, అప్పటికీ అదేమాట అంటారా? పోనీ ఏ మహానటుడినయినా తీసుకోండి, ఇంతకంటే బాగా చేసేవాడా? అతను ఆ పాత్ర ద్వారా చివరికి ప్రేక్షకుడిలో ఏ స్పందన కలగజేస్తున్నాడా అన్నది కదా కొలమానం?”
“అసలు వా… అతనో పెద్ద దగుల్బాజీ. వేసిన హీరోయిన్లందరినీ వేధించుకుతిన్నాడు. అవసరం లేకపోయినా ముద్దులు పెట్టుకున్నాడని గొడవ చేసిందని కొత్తగా వచ్చిన ఆ హీరోయిన్‌కి వేషాలు రానివ్వకుండా చేశాడు. అట్లాంటి నీచుడికి అవార్డు ఎట్లా ఇస్తాం?”
సహనం అడుగంటినట్టు అతనికి తెలుస్తూంది. కోపంవంటిదేదో లోపల్నించి తన్నుకొస్తూంది. దాన్ని దాచిపెట్టడం ఇక తనవల్ల కాదనీ తెలిసిపోయింది. మొహంలోకి నెత్తురు చిమ్ముకొచ్చి వెచ్చనవడం తెలుస్తూంది. తాగుతూన్న కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టిన విసురుకి టప్పున శబ్దం వచ్చింది. కొంచెం కాఫీ చింది టేబుల్‌పై పడ్డాయి. మిగతా ముగ్గురూ ఒక్క క్షణం ఇటు చూసి తల తిప్పుకున్నారు.
“మనం ఏమన్నా పత్తిత్తులమా ఇక్కడ కూచుని వాళ్ళ వ్యక్తిత్వాలు జడ్జ్ చేయడానికి? పోయిన ఏడు వచ్చిన సినిమాల్లో ఉత్తమ నటుడు ఎవరో ఎన్నుకోవాలి. వాళ్ళ చరిత్రలు, ప్రవర్తనా వాటి బట్టి ఇస్తామా అవార్డులు?”
శివం బిత్తరపోయి చూస్తుండిపోయాడు. తన గొంతులోని దురుసుతనానికి తనకే ఇబ్బంది అనిపించి రమణ వెంటనే లేచి గదిలోంచి బయటపడ్డాడు. వరండాలో చివరిదాక నడిచి చెట్టు మీదనుంచి కూ అని పిట్ట అరుస్తుంటే అటే చూస్తూ నిలబడిపోయాడు.
అంత కోపం వచ్చినందుకు తనపైనే చిరాకనిపించింది. శివం మామూలుగా చాలా తార్కికంగా, హేతుబద్ధంగా మాట్లాడే మనిషే. ఏ కారణానికో ఒక్కొక్కరి మీద పెంచుకునే ద్వేషం అట్లా బయటపడినప్పుడు జీర్ణించుకోవడం కష్టం.
“ఇక్కడున్నారా?” అంటూ వచ్చాడు శివం.
“సారీ!” రమణ చెప్పాడు.
“పర్లేదు. మీరు అతనికే అవార్డు ఇవ్వమని ఎందుకంత పట్టు పడుతున్నారో నాకు అర్థమయింది,” నవ్వుతూ అన్నాడు.
“మీరు అనుకుంటున్నట్టు అతను నా కులం కావడం కాదు కారణం. నిజంగానే అతనా పాత్రలో జీవించినట్టనిపించింది. నేనేదో కులాభిమానం చూపిస్తున్నానుకుంటారని ఎందుకు భయపడాలి నేను నమ్మింది చేస్తున్నప్పుడు?”
“సరే ఒక పని చేద్దాం. ఉత్తమ సహాయ నటుడుగా పరశురామ్‌గారిని సెలెక్ట్ చేయడానికి మీకేమీ అభ్యంతరం లేకపోతే మధుకే ఉత్తమ నటుడు ఇద్దాం!”
అప్రయత్నంగా రమణ పెదాల మీదికి నవ్వొచ్చి కనపడకుండా ఉండేందుకు చేయి బుగ్గ మీదికి పోనిచ్చాడు.
3.
తమ కక్ష్యల్లోనే గ్రహాలు తిరుగుతూంటాయి నిర్ధారిత వేగంతోనే. నదులు తిరగవల్సిన దగ్గరే మలుపు తిరిగి కలవవలసిన దగ్గరే సముద్రంలో కలుస్తాయి. మబ్బు అదే రంగు అంతే పులుముకుని ఎటువైపు వెళ్ళాలో అటే జారుతుంది. నువు లేవవలసిన సమయానికే కళ్ళు విప్పుతావు. కచ్చితంగా నువు వేసుకోవలసిన బట్టలే వేసుకుని తినవలసిందే తిని బయటపడతావు. గాలికి ఎగిరొచ్చిన పిట్ట ఈక ఒకటి నీ కుడికాలి దగ్గరే పడుతుంది. మురుగునీళ్ళమీద పడిన సూర్యరశ్మి గోడమీద అవే ఏడురంగులతో బొమ్మ గీస్తుంది. సరిగ్గా నీకు ఎదురయినవాళ్ళే నీకు ఎదురవుతారు. కావలసినంతే నవ్వి అనవలసి ఉన్న మాటలే అంటావు. ఎప్పుడు మోగాలో అప్పుడే ఫోన్ మోగుతుంది. నువు ఎదురుచూస్తున్న మిత్రుడు కాకుండా ఇంకెవరో చేయవలసి ఉన్న వాళ్ళే చేస్తారు.
రావలసినట్టుగా నువు ఊహించని కారు వేగంగా నీ మీదికి వస్తుంది. సరిగ్గా సెకను ముందే నీ మోటర్ సైకిల్ పక్కకి తిప్పుతావు నువు తిట్టవలసిన తిట్లే తిడుతూ. రోడ్డు దాటుతున్న పాప కారు గుద్దగానే ఎగిరి కొలిచినట్టు నాలుగున్నర అడుగుల దూరంలోనే పడుతుంది. నుదుటిమీద తగలవలసినట్టు రెండుంబావు అంగుళాల గాయమే తగులుతుంది.
మలుపు మీద సరిగ్గా అక్కడే పసిపిల్లవాడిని కర్రతో బాదుతూ తిడుతూ ఒకడుంటాడు అదే నల్ల పాంటూ, నీలం చొక్కానే వేసుకుని. ఆ పిల్లాడి అన్న విసిరిన రాయి తలమీద తగలవలసిన చోటే తగిలి ఎలా కూలబడాలో అలాగే కూలబడతాడు అతడు. ఇంకో సెంటర్లో పాతికమంది కుర్రాళ్ళు చేరి అదే దిష్టిబొమ్మను తగలబెడుతుంటారు అలాగే చేతులు పైకెత్తి అవే గొంతులతో నినాదానాలిస్తూ.
ఆప్షన్స్ అనేకం ఉన్నప్పటికీ కచ్చితంగా ఎన్నుకోవలసి ఉన్నవే ఎన్నుకున్నావు, ఎన్నుకుంటావు, ఎన్నుకోబోతావు. అన్నీ ఉండవలసినట్టు, ఉన్నది ఉన్నట్టుగానే ఉంటాయి, జరుగుతాయి, జరిగాయి, జరగబోతాయి. కాలంలో దూరాన్ని గడిచినట్టు సమస్త కాలాన్నీ మనకి తెలియని మరో కొలతలో గడించి సమస్త కాలాన్నీ చూసినప్పుడు నీకు తెలుస్తుంది మారేదేదీ, మార్చవలసిందేదీ లేదనీ, అన్నీ ఎప్పటిలాగే, ఎప్పటికీ అలాగేననీ. ఎంత అందంగా అద్భుతంగా ఉంది అని నువ్వు గుర్తించకపోవడంతోటో, గుర్తించడంతోటో సహా.