అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ఇండియా ప్రయాణం

ఏమిటీ, రేపు ప్రయాణం పెట్టుకుని ఇంకా ఏమీ సర్దలేదేం అంటారా?

ఏముందిటా సర్దడానికి, వెళ్తున్నది లింగు-లిటుకు అని ఇద్దరం! వెళ్ళేది ఇండియాకే గాని అడవిలోకి కాదు కదా? దూరపు ప్రయాణం పెట్టుకుని కావాల్సినవి దగ్గర లేకపోతే అక్కడికెళ్ళాక ఇబ్బంది పడిపోతాం అంటారా ?

మీకు ఆ భయం ఏం అక్కరలేదు. అవసరమైన వస్తువు మర్చిపోయినా, అసలు తీసికెళ్ళక పోయినా కూడా ఏం ఫరవాలేదు. ఇవ్వాళా రేపూ ఇండియాలో మారుమూల సందుల్లో కూడా అమెరికా వస్తువులన్నీ దొరుకుతున్నాయి. మళ్ళీ మాట్లాడితే ఇక్కడి కంటే మంచివి కూడా దొరుకుతున్నాయి! మీకు కావాల్సిన వాళ్ళందరూ అమెరికాలోనే వుండటంతో, ఈ మధ్య ఇండియా ప్రయాణాన్ని వెనక్కి నెట్టేస్తూ వచ్చారు. ఇన్నాళ్ళకు నా బలవంతం కొద్దీ బయలుదేరి ఇండియా అనగానే… ఆనాటి ప్రయాణం అనుకుంటూ అనవసరంగా కంగారు పడుతున్నారు!

ఏమిటీ, అక్కడ మన వాళ్ళకు ఇవ్వడానికి ఏమైనా గిఫ్ట్స్ పట్టికెళ్తే బావుంటుంది అంటారా?

బానే వుంటుంది! నేనూ అలాగే అనుకుని షాపింగుకు వెళ్ళా. కానీ నాకు నచ్చింది ఏం కొందాం అన్నా ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే వుంటున్నాయి. వెతికి వెతికి ఏమైనా తీసుకున్నా, అక్కడి వాళ్ళు మనం ఇచ్చిన వాటిని అలా తీసుకుని ఇలా పక్కన పెట్టేస్తున్నారు! అందరికీ అక్కడే ఏమైనా కొని ఇద్దాం లేండి.

మీరన్నట్టు వెనక రోజుల్లో ఇండియా ప్రయాణం అంటే ఎంత హడావిడి, ఎంత హంగామా వుండేదో!

ఇండియా ప్రయాణం అనుకున్నప్పటి నుంచీ వెళ్తున్నాం అన్న భావన తోనూ, తిరిగి వచ్చాక వెళ్ళొచ్చిన ఆనందంతోనూ కొన్ని ఏళ్ళు గడిపే వాళ్ళం. మరి ఈ కాలం వాళ్ళు ఇండియా వెళ్తే… వాళ్ళు వెళ్ళినట్టు ఇంట్లో వాళ్ళు కూడా గమనించట్లేదు. అంత గుట్టుగా అలావెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు! ప్రయాణానికి విమానం టిక్కెట్లు రాగానే వాటిని చూసే మనం ఎంతో సంబర పడిపోయేవాళ్ళం! ఓ చిన్న పుస్తకం అంత సైజులో మెత్తగా మిలమిలా మెరిసిపోయే ఆ టిక్కెట్లను ఎంతో జాగ్రత్తగా ముట్టుకుని మురిసిపోయేవాళ్ళం! మనలో ఎవరు ఇండియా వెళ్తున్నా వాళ్ళను దింపటానికి పిల్లలతో సహా అందరం పొలోమని ఎయిర్పోర్ట్‌కు బయలుదేరే వాళ్ళం.

మనం ఇంటికి వెళ్తున్నాం అని తెలియగానే మన ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాళ్ళవాళ్ళకు ఇవ్వమని ఏదో ఒకటి ఇచ్చేవారు. మనం అక్కడికి చేరగానే ఎవరెవరో వచ్చి అమెరికాలో వున్న వాళ్ళ పిల్లల యోగక్షేమాలు అడిగి వాళ్ళను చూసినంత ఆనందపడి పోయేవారు!

ఫలానా నెలలో ఇండియా వస్తున్నాం అని ఓ ఆరునెలల ముందు మీ నాన్న గారికి మీరు ఉత్తరం రాసేవారు. ఇంక మావగారి ఆనందానికి పట్టపగ్గాలు వుండేవి కావు. వెంటనే ఇప్పటి ఈ మెయిల్స్ కంటే ఫాస్టుగా బంధువులందరికీ మావాడొస్తున్నాడని కార్డు ముక్కలు రాసిపడేసేవారు! ఇంక అక్కడినుంచి మనకు వరసగా ఉత్తరాలు వచ్చేవి.

ఒరే మధూ! నాకు ఫుల్ హాండ్స్ చొక్కా… మా బాస్ కి ఓ టై పట్టుకురా… మీ వదిన రిస్టు వాచీ కావాలని మనసు పడుతోందిరా!

అక్కా! నాకు పింక్ కలర్ ఫారెన్ నైలాన్ చీర తీసుకురా… ఒసేవ్ మా బుజ్జిగాడికి ఓ జుబ్బా, అలాగే ఓ బంతి తేవడం మర్చిపోకు.

అన్నయ్యా, నాకు నల్ల కళ్ళ జోడు కావాలి. బావా! మేజోళ్ళు… అంటూ ఇలా అందరూ ఏదో ఒకటి కావాలని రాసేవారు.

దగ్గరివాళ్ళు దర్జాగా అడిగితే దూరపువాళ్ళు దొంగతనంగా అడిగేవారు! ఉత్తరం చివరలో, ‘ఇలా అడిగినట్లు మీ నాన్న గారికి చెప్పొద్దని’ కూడా రాసేవారు! అందరికీ తీసికెళ్ళాల్సిన వస్తువులు ఒక్కక్కటే కొని గదిలో పిల్లలకు అందకుండా దాచేవారు మీరు. అన్నీ ఒక్కసారి కొనటానికి అప్పట్లో మనకు అన్ని డబ్బులెక్కడివీ?

అందరూ అడిగే వస్తువులు కాకుండా మావగారు ప్రత్యేకంగా ఓ లిస్టు రాసేవారు. ఎల్మర్స్ గ్లూ, బాల్ పాయింట్ పెన్నులు, కలర్ పెన్సిళ్ళు, చెక్కుకోవడానికి పెన్సిల్ షార్పెనర్లు… అడిగేవారు. హైస్కూల్ హెడ్మాస్టర్ రామనాధం గారంటే ఆ రోజుల్లో పిల్లలతో పాటు తల్లిదండ్రులక్కూడా భయమే! ఫైనల్ ఎక్జాంస్‌లో ఫస్ట్ మార్కులొచ్చిన వాళ్ళకు, ఆటల్లో గెలిచిన వాళ్ళకు, వ్యాసపోటీల్లో పాల్గొన్న వాళ్ళకు, స్కూల్ వార్షికోత్సవాల్లో వాటిని బహుమతులుగా ఇచ్చేవారు.

అందరూ ఇలా ఏవేవో అడిగినా, అత్తగారు మాత్రం ఏమి అడిగేవారు కాదు. మొదటిసారి మనం ఇండియా వెళ్ళినప్పుడు మీరు స్టీలు గ్లాసులో కాఫీ తాగడానికి అవస్థ పడటం చూసి, మీ అమ్మగారు అప్పటికప్పుడు పింగాణి కప్పు-సాసరు తెప్పించారు మీ కోసం గుర్తుందా? అత్తగారు గోరుచుట్టుతో బాధపడుతూ కూడా, మీకు ఇష్టమైన గారెలు చేసిపెట్టాలని పప్పురుబ్బటానికి కూర్చుంటే ఆవిడను లేపి గుండమ్మకథలో అంజిలా మీరు రోటికి అటోకాలు ఇటోకాలు వేసి బడబడా పిండి రుబ్బటం నాకు బాగా గుర్తు!

మీ అమ్మకు శ్రమ తగ్గించాలని తర్వాత ట్రిప్పులో, కస్టమ్స్ వాడికి బోలెడంత టాక్స్ సమర్పించి ఓ గ్రైండర్ పట్టికెళ్ళారు. ప్లగ్గు పాయింట్ హాల్లోనే వుండటంతో దాన్ని అక్కడున్న టేబుల్ మీద పెట్టారు మీరు. తళతళా మెరిసిపోతున్న ఈ మిషినేదో మానెడు పప్పుని క్షణంలో రుబ్బేస్తుందని తెలిసి, ఆ చోద్యం చూడ్డానికి ఇంట్లో వున్నవాళ్ళం కాకుండా పనిమనిషి కాంతం, పాలు పోసే సాంబయ్య, చాకలి వీరయ్య, పెళ్ళాం రాజమ్మ, వాడుకగా పూలమ్మే వెంకట్రావ్, అప్పుడే వూరినుంచి దిగిన మా అన్నయ్య, వదినలతో హాలు నిండిపోయింది. ఏదో సామెత చెప్పినట్టు ఎదురు చూసినంత సేపు పట్టలా! మీరు స్టైల్ గా స్విచ్ ఆన్ చెయ్యడంతోటే వున్న పవర్ చాలక ఓవర్ లోడ్ అయి ఠాప్ అన్న శబ్దం అందులో నించి పొగలు సెగలు రావడంతో అందరూ పెద్దగా అరుచుకుంటూ వీధిలోకి పరిగెత్తారు!

మనం అక్కడ వున్నన్నాళ్ళు ఇల్లు పెళ్ళివారి ఇల్లులా సందడి సందడిగ, హడావిడిగా వుండేది! మనల్ని చూడ్డానికి మీవైపు వాళ్ళు నావైపు వాళ్ళు ఎవరో ఒకరు వస్తూనే వుండేవారు. వస్తూ వస్తూ ఎంబ్రాయిడరీ చేసిన జేబురుమాళ్ళు, గాజులు, పూసల గొలుసులు, పార్కర్ పెన్నులు, కఫ్ లింక్స్, బందరు లడ్డూలు, కాకినాడ కాజాలు, ఇలా ఏవో ఒకటి మనకోసం ప్రేమగా తెచ్చేవారు.

మన తిరుగు ప్రయాణం దగ్గరకి వస్తోందీ అనగానే అత్తగారు దిగులు పడటం మొదలు పెట్టేవారు, కానీ మావగారు మాత్రం బిజీబిజీగా వుండేవారు! మనతో పంపించాల్సిన ఊరగాయలతో మొదలయ్యేది ఆయన హడావిడి. మన ప్రయాణానికి వారం రోజులకు ముందే పాత సామాన్లు అమ్మే కోటయ్య దగ్గరకెళ్ళి అమూల్ డబ్బాలు, ఒవల్టీన్ డబ్బాలు పట్టుకొచ్చి ఆయనే స్వయంగా శుభ్రం చేసేవారు. తర్వాత వాటిల్లో ప్లాస్టిక్ కవర్లు వేసి పచ్చళ్ళు నింపి మూతలు పెట్టి ఆ డబ్బాలన్నీ రిక్షాలో పెట్టించుకుని హడావిడిగా మాట్లు వేసే మస్తాన్ సాయిబు దగ్గరకు వెళ్ళేవారు. వాటిని సీలు చేయించి హాల్లో గోడవారగా బోర్లించి వరసాగ్గా అమర్చేవారు. నాలుగైదు రోజులు అలాగే వుంచి ప్రతిరోజు పరీక్షించేవారు. అవసరమైతే హుటాహుటిన డబ్బా(లు) పుచ్చుకుని రిపేరుకు పరిగెత్తేవారు!

“ఇవి అమెరికా వెళ్ళే పచ్చళ్ళర్రా” అంటూ ఎవరినీ ముట్టుకోనిచ్చే వారు కాదు. మావగారొక్కరే మడిగా ముట్టుకునేవారు! ఇక్కడికొచ్చాక ఎక్కడ తికమక పడిపోతామో అని అన్నింటికీ పేర్లు రాసి లేబుల్స్ అతికించేవారు. మనకోసం దొడ్లో చెట్టునుంచి కరివేపాకు కోయించి నీడలో ఆరపెట్టి ప్యాక్ చేసేవారు. మన లగేజ్ అంతా వరండాలో పెట్టి సుబ్బయ్య కొట్టునుంచి కాటా తెప్పించి ఒక్కొక్కటీ బరువు తూచేవారు. మన తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఆయనే అమెరికా వెళ్తున్నంత సంబరపడి పోయేవారు!

మీ అమ్మగారి పిండివంటల ఘుమఘుమల లాగే ఆ ప్రయాణం తీపి గుర్తులు మనతో ఎన్నో రోజులు వుండేవి. నిజంగా ఆ పాత రోజుల్లో మనం చేసిన ఆ ప్రయాణాలే వేరు ఆ పెద్దవాళ్ళ ప్రేమలే వేరు.

వుయ్ మిస్ దెమ్ వెరీ మచ్.