IV
మదరాసు రాజధానిలో విద్యాభివృద్ధినిగూర్చి విచారణ చేయుటకు 1820లో మదరాసు గవర్నరైన సర్ తామస్ మన్రోగారు వివిధ జిల్లాలలోని కలెక్టరులను ఆయాజిల్లాలయందుగల పరిస్థితులను తనకు తెలుపవలసినదని ఉత్తరువు చేసెను. వారిచ్చిన సంజాయిషిలును సుబ్బారావుగారు చెప్పినట్లే యుండెను. పూర్వపు విద్యాపద్ధతులు నశించిపోయినందున అప్పటికి నిలిచియున్న పద్ధతులు సుబ్బారావుగారు వ్రాసిన దుస్థితిలోనికి దిగియున్నందునను చెన్న రాజధానిలో విద్యావిధానమును సంస్కరించుట యవసరమని మన్రోగారు నిశ్చయించి కొన్ని యింగ్లీషు పాఠశాలలను నెలకొల్పుటకు 1826లో నొక ప్రణాళికను తయారుచేయించిరి గాని అది అమలులో పెట్టకపూర్వమే 1827లో వారు చనిపోయిరి. అంతటితో నీ ప్రయత్నము నిలిచిపోయెను.
ఇట్లు 1830 ఆప్రాంతముల నాటికి విద్యాభివృద్ధిని గూర్చియు చేయవలసిన పని ఎంతోయుండెను. కాని నాటి భారతీయులకు తమదేశమును పరిపాలించుచున్న కుంఫిణీవారి యధికారముల గురించిగాని ఇంగ్లాండుదేశము యొక్కయు తమదేశము యొక్కయు చరిత్రను గురించి గాని రాజ్యాంగ పద్ధతులను గురించి గాని తెలియదు. తమను పరిపాలించు అధికారుల వలన తాము విద్యావిషయమునందు శాంతిభద్రతల విషయమునందు కొన్ని సౌకర్యములు పొందుటకు తమకు హక్కు కలదని గాని ఈ దేశమునుండి వసూలు చేయుచున్న పన్నులు ఈ దేశాభివృద్ధి కొరకు ఖర్చుపెట్టమని కోరుటకును తుదకు దేశమును గాఢముగా ఆవరించియున్న అవిద్యాంధకారమునైనను మాన్పి ఇంగ్లీషుభాషను పాశ్చాత్య విజ్ఞానమును బోధించు పాఠశాలలు స్థాపించుమని కోరుటకును తమకు అధికారము కలదని యైన వీరెరుగరు. తమకు కావలసిన సౌకర్యములగూర్చి ఎవరి నడుగవలెనోకూడ వీరికి తెలియదు. ఈ విషయములను గూర్చి ప్రజలలో కొంత ప్రచారము చేసి సంస్కరణముల కొరకు ప్రయత్నించునట్లు చేయవలెనన్నచో ముందుగా ప్రజలకు పైన చెప్పిన విషయములను గురించి తమ పౌరసత్వ హక్కులను గురించి వారికి బోధించవలసియుండెను. ఒక్క మదరాసు రాజధానియందేగాక భారతదేశమందలి యన్నిచోటులను గూడ ప్రజలీస్థితిలోనే యుండిరి. వంగరాష్ట్రమునందు ప్రజల యదృష్టవశమున మహానాయకుడగు రామమోహనరాయలు బయలుదేరి సంఘసంస్కరణమునకు రాజకీయసంస్కరణములకొరకు పనిచేయుటలో దారి దీసెను. ఆంగ్లవిద్యాస్థాపన చేసి పాశ్చాత్య విజ్ఞానమును వ్యాపింపజేయుటకు పాటుపడి కృతకృత్యుడైనాడు.
చెన్నరాజధానిలో జార్జి నార్టనుగారు వీరాస్వామయ్యగారును వారి మిత్రులును వంగరాష్ట్రమున రామమోహనరాయలవారు చేసినంత మహత్తర ప్రజాసేవ చేయలేకపోయినను విద్యాభివృద్ధి విషయమున మాత్రము అంతటిపని చేసినారని చెప్పక తీరదు.
వీరాస్వామయ్యగారు చెన్నపట్టణములోని పురప్రముఖులను దర్శించి విద్యాభివృద్ధి కొరకు పాటుపడుటకు పెద్దలందరు కలిసి పనిచేయుట అవశ్యకమనియు పురప్రముఖులొక సంఘముగా నేర్పడి కృషి చేసినచో తమ కోరికలు సిద్ధించగలవనియు నచ్చచెప్పి తమ స్వంతపని కొరకువలె కష్టపడి హిందూ లిటరరీ సొసైటీ అను నొక ప్రజాసంఘమును స్థాపించిరి. ఈ సంఘముయొక్క ఆధిపత్యము క్రింద అనేక మహాజనసభలు గావించి అనేక విషయముల గురించి ఉపన్యాసములిప్పించి ప్రజలకు అనేక విషయములను గురించిన విజ్ఞానమును బోధించి ప్రజలలో ఒక విధమైన ఐకమత్యమును కార్యదీక్షను కలిగింపసాగిరి. ఈ సొసైటీవారి ఆధిపత్యము క్రింద ఆంగ్లేయోద్యోగుల కేర్పడిన సెంటు జార్జికోట కాలేజి భవనమున 1833-34 సంవత్సరములలో నేటివు పెద్దమనుష్యులు సమావేశమైన మహాసభలో వారికి జార్జి నార్టనుగారు భారతదేశ పరిపాలనము గురించి రాజ్యాంగమును గురించి న్యాయ పరిపాలనా విధానముల గురించి దేశచరిత్రను గురించియు కొన్ని మహోపన్యాసముల నొసగసాగిరి.
నార్టనుగారిచ్చిన ప్రారంభోపన్యాసమునకు నాటి మదరాసు గవర్నరు సర్ ఫ్రెడరిక్ ఆడంగారు కూడ వచ్చిరి. నార్టన్‌గారిట్లుపన్యసించిరి:–
“ఘనమైన అయ్యా, స్నేహితులారా!
నేను తృప్తికరముగా నిర్వహింపగలుగుదునని నాకు ధైర్యములేని పెద్దకార్యమును నేనిప్పుడు తలపెట్టితిని. కాని ఈ కార్యము ఎంతవరకు నెరవేరిననుగూడ దీనివలన చాలమందికి శాశ్వతమైన లాభము కలిగితీరును.
రాజ్యాంగ పద్ధతులు ధర్మపరిపాలనా పద్ధతులును ప్రజలు విధేయులై యున్న పరిపాలన విధానము యొక్క స్వరూప స్వభావములను దాని శాసనముల స్వభావమును న్యాయ పరిపాలన కేర్పరుపబడిన మార్గములను ఈ దేశీయ (నేటివు) జనసంఘమునకు విశదపరుప దలచితిని.
ఈ కార్యములో నాకుగల కష్టములను గూర్చి ఆలోచించియేయున్నాను గాని యిపుడు సాక్షాత్తుగా దీనిని ప్రారంభించునప్పుడు కొంచెము జంకును భయమును గలుగుచున్నవి. ఈ విషయమున నన్ను పురికొల్ప ప్రోత్సహించు ముఖ్యశక్తి (నేటివు) దేశీయ జనసంఘము నందలి ఉన్నత తరగతిలోని ప్రజలింతమంది యిచ్చట నా యుపన్యాసములను వినుటకువచ్చి ఇంత యుత్సాహము కుతూహలము కనబరచుచుండుటయే నేను పడు శ్రమవలన తాము పొందగలగిన లాభములెల్ల పొందుటకు కృతనిశ్చయులైన వీరికి ఉపన్యాసముల నిచ్చుటలో నాకుగల సంతోషమే తక్కిన భావముల నణచివేయుచున్నది.”
V
నార్టనుగారు ఇంకను ఇట్లు పలికిరి:-
“ఇంగ్లాండు ప్రభుత్వమును భారతదేశ కుంఫిణీ ప్రభుత్వమును గూడ కొన్ని సంవత్సరములనుండి చేయుచున్న శాసనములందు హిందూదేశీయులపట్ల ఆ ప్రభుత్వములు చూపుచున్న ఉదారభావమును మీరు గ్రహించితిరని నేనెరుగుదును. మీ దేశ సివిలు పరిపాలనమున ముఖ్యమైన పెద్ద యుద్యోగములు పొందుటకును మీ దేశముయొక్క శాసనములు అమలు పరుచుటలోను మీకిప్పుడు కలిగింపబడిన అవకాశములు వానిని మీరు చలాయించుటకు మీకు గల అర్హతలపైననే ఆధారపడియుండును. ఇట్లు రాజకీయముగను సాంఘికముగను మీస్థితి నభివృద్ధి చేసికొనుటకు మీకివ్వబడిన అవకాశమునకు మీరర్హులేయని చూపుటకు మీరు ముందంజ వేయుచుండుటయు నేనెరుగుదును. మీ ప్రయత్నములకు ఇంగ్లాండు ప్రభుత్వము ఇండియా ప్రభుత్వము కూడ ప్రోత్సాహమిచ్చునని నమ్ముడు. ఈ సమయమున ఈ సభలో గవర్నరుగారు హాజరై యుండుటయే దీనికి సాక్షి.
హిందూజనసంఘము తమలో విజ్ఞానాభివృద్ధి కలిగించుకొనుటకు చేసిన స్వయంకృషి ప్రయత్నము నొకదానిని గురించి నేనిక్కడ చెప్పవలసియున్నది. అది హిందూ లిటరరీ సొసైటీ స్థాపనము. దానియొక్క ప్రథమ ఫలితములలో నేనిక్కడ నిచ్చుచున్న ఉపన్యాసముల కార్యక్రమమొకటి. పరిపాలనకు సంబంధించిన రాజ్యనీతిశాస్త్రములు, న్యాయపరిపాలన సూత్రములు, ప్రభుత్వతత్వము, తాము బద్ధులైయుండు శాసనములు, ఆ శాసనముల అమలు, ముఖ్యముగా తెలిసికొనదగిన విజ్ఞానవిషయములని ఈసంఘమువారు తలచినందుకు నేను సంతోషించుచున్నాను. ఈ నమ్మకముతోనే ఈ సంఘముయొక్క సభ్యులలోని పెద్దలు కొందరు ఈ విషయములను గురించి తాము చదవవలసిన గ్రంథముల గూర్చియు ఇతరులకు చెప్పవలసిన మార్గముల గూర్చియు అప్పుడప్పుడు నాతో ఆలోచించుచుండిరి. ఈ విషయములకు సంబంధించిన విజ్ఞానమును అభ్యసించినవారికిని ఇంగ్లీషు సారస్వతమునందు మీ ప్రజలు యింతవరకు చేసిన కృషినిగూర్చి యెరిగినవారికిని నేను తృప్తికరమైన సలహాల నొసగలేకపోయితినని వేరుగ చెప్పవలసిన పని లేదు.
పాశ్చాత్యగ్రంథకర్తలు వ్రాసిన రాజ్యనీతిశాస్త్రములందును ధర్మశాస్త్రములందును ఈ సామ్రాజ్యమున జీవించు ప్రజల స్థితిగతులకు అనుగుణములైన సంగతులు గాన్పింపవు. ఇప్పుడు ప్రజలలోగల గ్రహణశక్తి యున్న స్థితిలోనవి సులభముగా అర్థములును కావు. ఈదేశీయులకు ప్రసాదించబడిన అవకాశముల లాభమును వారు పొందుటకు నేను చేయగల సాయమెల్ల చేయదలచితిని. ఈ విషయములనుగూర్చి నేను గ్రహించినదెల్ల మీకు చెప్పదలచితిని. ప్రజలకుపయోగించునట్లు సులభశైలిలో ప్రభుత్వపరిపాలనా విధానములు ధర్మశాస్త్రవిధులును మీ జన్మభూమియగు నీదేశములో నిప్పుడమలులోనున్న పరిపాలనావిధానము న్యాయపరిపాలనయు అర్థమగునట్లు చెప్పదలచితిని. నాసేవను మీరు గ్రహింపుడని కోరుచున్నాను. ఈ విషయములను గూర్చిన జ్ఞానము నభివృద్ధి చేసికొనుట, మీ యోగక్షేమములతో సంబంధించియున్న మీ జాతీయతకు చాలముఖ్యమని మీరు తలచునట్లుగా మీలో నట్టిభావమును కలిగించుటకైనను ప్రయత్నింతును. ఇకముందు మీరును మీతరువాతవచ్చు తరమువారును సాహిత్యజ్ఞానమునందు అభివృద్ధి చెంది అనుభవజ్ఞానమును సంపాదించి ఈ విషయములను మీకనువైన విధముగా గ్రంథములద్వారా నేర్చుకొనగలరు–ఈ విషయములను మనము గ్రహింపగలమా? ఈ కృషిని మనము చేయగలమా? అని మీరధైర్యపడనక్కరలేదు. ఈ సభాసదులకు నేనిప్పుడుపన్యసించునట్లు ఏడేండ్లక్రిందట బొంబాయిలోని ప్రజలకు నేనుపన్యసింప ప్రయత్నించియుండినచో నామాటల నర్థముచేసికొనగల నేటివులు ముగ్గురైన నక్కడ నుండెడివారని నాకు నమ్మకము లేదు. ఇప్పుడా నగరముననే మరల నేనుపన్యసింపదలచి శ్రోతలను ఆహ్వానించినచో అవి వినుటకు అత్యంత కుతూహలముతో తెలివిగలవారు ఒక వందమంది విద్యార్థులైనను నా యుపన్యాసమునకు వచ్చి యుత్సాహముతో వినెదరని నా విశ్వాసము. ఈ పరివర్తన మెట్లు కలిగినది? ఆ రాజధానిలో నేటివు ప్రజలలో ముఖ్యులకైనను మంచి ఇంగ్లీషువిద్య పాశ్చాత్యశాస్త్రవిజ్ఞానమును బోధించుట వలన లాభము కలుగునని గ్రహించి ఆ కార్యమును ప్రభుత్వముచేత చేయించిన ఒక దేశాభిమాని యొక్క తెలివితేటల వలనను కృషి వలనను జరిగినది” అని బొంబాయిలో ఇంగ్లీషు విద్యాభివృద్ధికి కారకుడైన మౌంట్ స్టూఆర్ట్ ఎల్‌ఫిన్‌స్టన్ అను గవర్నరు చేసిన సేవను ప్రశంసించిరి. “(1827లో) నే నారాష్ట్రమున నున్నప్పుడు అక్కడి దేశీయులకు గల ఇంగ్లీషు భాషాజ్ఞానమును సాహిత్యజ్ఞానమును నేను చూచినమట్టుకు (ఇప్పుడు 1833లో) ఇక్కడివారికిగల ఇంగ్లీషు భాషాజ్ఞానముతోను సాహిత్యజ్ఞానముతోను పోల్చిచూడగా ఇక్కడివా రచ్చటివారికి తీసిపోవువారు కారనియు, మీరే వారికన్న యెక్కువ తెలివిగలవారనియు నాకు తోచుచున్నది. అయితే అక్కడివారు ప్రజలలో విద్యాభివృద్ధిని చేయుటవలని లాభములను మీకంటె ముందుగా గ్రహించి ఇంగ్లీషు స్నేహితుల సహాయముతో అది చేసి దాని లాభములను పొందగలిగిరి. మీరింకను వెనుకబడియున్నారు” అని చెప్పిరి.
VI
తాను చెప్పబోవు రాజ్యాంగశాస్త్రవిషయములు కొంచెము కష్టమైన విషయములే గాని అవి అందరికి తెలియునట్టి సులభశైలిలోనే చెప్పగలనని చెప్పి నార్టనుగారు మరియు నిట్లనిరి–“ఈ విషయములన్నియు చాలా గొప్ప విషయములనియు సామాన్యులకివి సాధ్యమైనవి కావనియు మీ రధైర్యము చెందవలసిన పనిలేదు. మీ దేశముననే వివిధకాలములందు జన్మించి మీ చరిత్రలో ప్రసిద్ధులైన అనేకులగు జ్ఞానసంపన్నులు ప్రతిభాశాలురునగు మహామహుల జీవితములే మీకీ విషయమున ధైర్యము కలిగించగలవు.
“పూర్వకాలమునుండి ఈ క్షణమువరకును నిజమైన ధర్మశీలురు (Moralists) రాజ్యనీతి ధురంధరులు స్మృతికర్తలునని చెప్పతగిన వారనేకులు మీలో నుద్భవించియున్నారు. నేను గౌరవముతో నుల్లేఖింపతగు మనుష్యులింక నితర పూర్వ గ్రంథకర్తలు ననేకులున్నారు. ఇక మహమ్మదీయులు వివిధదేశములలో వృద్ధిచేసిన సారస్వత విజ్ఞాన మంద రెరిగినదే. వారివలన పాశ్చాత్యులు చాలా శాస్త్రములు పాఠములు నేర్చుకొన్నారు. ఈ మద్రాసులోనే దొరలలో ప్రారంభమైన ఇంగ్లీషు విద్యావిధానము ఇప్పుడు అయిరోపాలోనెల్ల ప్రసిద్ధి చెందియున్నది.
ఈ తూర్పుదేశములలో నిదివరకు వర్ధిల్లిన సిద్ధాంతములలో విజ్ఞానమునందు చాలా లోపములున్నవని అంగీకరించినను దీనికన్న పాశ్చాత్య విజ్ఞానము శ్రేష్ఠమని యెంచినను ఒక విధమయిన విజ్ఞానమును వర్ధిల్లచేసిన మేధ యీ దేశప్రజలందు కలదని మాత్రము స్పష్టము. ఇట్టి తెలివితేటలుగల పూర్వికులయొక్క వంశములవారేనా మీరు? వారికిగల తెలివితేటలు మీకు తక్కువైనవా? అవి కొరత పడలేదని నా అనుభవమే చెప్పుచున్నది. రామమోహనరాయలుగారిపేరు మీ రందరు వినియే యున్నారు. ఆయన ఇంగ్లీషులో మంచి పాండిత్యమును సంపాదించినాడనియు గొప్ప గ్రంథములు వ్రాసినాడనియు పేరుపొందిన సంగతి మీ రెరుగుదురు. ఈ దేశమును చక్కగా పరిపాలించు విధానములకును ఇక్కడ చక్కగా న్యాయవిచారణ చేయు పద్ధతులకును సంబంధించిన విషయములను గూర్చి ఇంగ్లాండులో అతిసమర్థులైన రాజ్యతంత్రజ్ఞులు ఆయనతో ఆలోచించి ‘వారి సలహా’ యొక్క లాభమును కొంతపొందినారని మీకు నేను గట్టిగా చెప్పగలను. నేను మీకు చెప్పదలచు విషయములను గురించి కృషి చేయుటకు వలసిన తెలివితేటలకు శక్తిసామర్థ్యములకు కొరతలేదని చెప్పుట కీయొక్క నిదర్శనమే చాలును” అని నార్టనుగారు పలికి దేశీయులలో గొప్ప ఆంగ్లేయులు గూడ మెచ్చుకొనినట్టి సలహాలనిచ్చిన మైసూరు మంత్రియైన పూర్ణయ్యగారి తెలివితేటలను యుదాహరణముగ చూపిరి. ఇంగ్లీషులో చక్కని మరణశాసనమును వ్రాసిన చిన్నతంబి మొదలియారును గూర్చి ప్రశంసించి హిందూ సమిష్టి కుటుంబమునందు సోమఱులై జీవించువారి నష్టము లనుభవించు పద్ధతిని చూసి 21సంవత్సరములు నిండగనే తమ స్వార్జితములతో వేరు వేరు ఇండ్లలో కాపురము చేయుచు కుటుంబములో కలహములు లేక స్వయంకృషి చేత స్వతంత్రముగా జీవింపుడని ఈ చిన్నతంబిగారు తన కొమాళ్ళని హెచ్చరించుచు అనేక నీతులను బోధించినారనియు ఈయన మాటలు స్వాతంత్ర్యమును స్వపరిపాలనమును స్వయంకృషిని బోధించుచున్నవనియు మూఢాచారముల దాస్యమునుంచి వెలువడుడని హెచ్చరించుచున్నవనియు మెచ్చుకొని ఈయనమాటలాయన పిల్లలకొరకే గాక దేశీయుల కందరికిని ఉపయోగింపగలవనిరి.
ఈ సందర్భమున ఇంగ్లీషుజాతియొక్క చరిత్రవలన నేర్చుకొనతగిన గుణపాఠములను చెప్పదలచి నార్టనుగారు ఇంగ్లాండును భారతదేశముతో పోల్చిరి. అంత చిన్నదేశము యొక్కజాతివారింత పెద్ద దేశముయొక్క ప్రజలను పరిపాలించుట కెట్లు శక్తులైరో నిరూపించిరి. వారియొక్క ఆయుధబలము వలనను వారు రాజ్యతంత్రముద్వారా గైకొనిన చర్యల వలనను విశాలమైన రాజ్యములు వారి యాధీనములగుటయు చెప్పి “ఒక మహాబలవంతునిక్రింద నున్నట్లుగా నీ విశాల సామ్రాజ్యము యొక్క శాఖోపశాఖలు శాంతిసౌఖ్యములతో వారివలన పరిపాలింపబడుటనూ మీరు చూచుచున్నారు. వారికి వాణిజ్యమునగల తెలివితేటల వలన దేశములో ధనము క్రొత్తవిధముగా ప్రవహించుచుండుట మీరు చూచుచున్నారు. క్రొత్త పరిశ్రమలు బయలుదేరుట క్రొత్త పెట్టుబళ్ళు స్థాపింపబడుటను మీరు చూచుచున్నారు. ఈ యద్భుతమంతయు నెట్లు సంభవించినదను ఆలోచన మీకు కలుగవచ్చును. మీరు కొంచెము యోచించినచో నొక క్షణములోనే దీని కారణములు మీకు బోధపడును.
“స్థిరమైన మంచి ప్రభుత్వమువలన, న్యాయములై చక్కగా అమలు జరుపబడు శాసనధర్మముల వలన ఈ జాతి ప్రజలిట్లు అభివృద్ధి చెందినారని మీకు తెలియగలదు. ఆత్మవిశ్వాసము వలన, మంచి శీలము వలన శాస్త్రవిజ్ఞానమునందు వృత్తికళలందు ప్రతివిషయముననుగూడ వీరు ప్రవీణులై ఇతరులకు అజేయులై సామ్రాజ్యములను స్థాపించినారు.
“బయటనుండి వచ్చు శత్రువుల వలనగాని దేశములో కలుగు అంతఃకలహముల వలనగాని కదల్చుటకు సాధ్యముగాని ఒక్క స్థిరమైన ప్రభుత్వముక్రింద నిప్పుడీ భారతదేశీయులు తమచరిత్రలో మొదటిసారి జీవించుచున్నారు. అయితే జాతులన్నిటిలోను గొప్పదగు నీ జాతితోడి కలయిక యెంతవరకు కేవలము అధికారబలముపైన నాధారపడు హక్కులుకాక, హెచ్చుఅధికారములును మీతోడిప్రజలు ఈవరకే అనుభవించుచు మీరిప్పుడు చూచు ఉన్నతస్థితికి వచ్చినందులకు కారణములైన స్వాతంత్ర్యములును, మీకు కూడా కలుగుటకు విస్తరించుటకు నుపయోగపడునో అనునది మీరిప్పు డీశ్వరేచ్ఛవలన లోబడియున్న ప్రభుత్వము యొక్క అధికారు లవలంబించు రాజ్యాంగనీతిపైన నాధారపడియుండును.
మీకు అవకాశము లొసగదలచిన ఆ యుదారరాజ్యనీతిగురించి మీకిదివరకే చెప్పియున్నాను. ఆనీతిలోని ఉదారభావమునకుగల నిదర్శనములను చెప్పుట యొక కష్టమైనపని కాదు. సర్వసమానములును స్థిరములునగు శాసనధర్మములద్వార సమిష్ఠి ప్రయోజనమును కలిగింపజూచు ఉద్దేశములను మీరు చూచుచునేయున్నారు. మీరు ఉద్యోగములను అధికారములను పొందుట కవకాశము కల్పించుట ప్రభుత్వము తీసుకొనిన చర్యలను గురించి విచారించిన వారికి సులభముగా తెలియగలదు” అని పలికిరి (Rudimentals by George Norton, pp ii, iii; 1-18).
VII
ఇట్టి మహోన్నతమైన ఉద్దేశములతోను ఉదారభావములతోను ప్రారంభించి నార్టనుగారు ఆనాడు భారతదేశప్రజ లెరుగవలసిన రాజ్యాంగవిషయములనెల్ల సశాస్త్రీయముగను విపులముగను అందరికి తెలియునట్లును అనేక ఉపన్యాసములందు చర్చించి బోధింపసాగిరి. ప్రపంచమునందలి రాజ్యాంగనీతులు ధర్మపద్ధతులు వాని మూలసూత్రములు వివరించి, ప్రభుత్వధర్మము ప్రజలహక్కులు స్పష్టీకరించి ఇంగ్లాండుదేశ రాజ్యాంగచరిత్రమును ఇంగ్లాండుప్రజల అధికారములును ప్రభువులసభ కామన్సుసభల నిర్మాణములును చెప్పి భారతదేశమును పాలించుచున్న తూర్పుఇండియాసంఘ నిర్మాణచరిత్రయు ఈదేశము వారివశమైన చరిత్రయు ఇక్కడి పూర్వపరిపాలను చెప్పి కుంఫిణీవారి పాలకవర్గమగు డైరెక్టర్ల కోర్టువారి అధికారములు బాధ్యతలు వీనిపైన ఇంగ్లాండు పార్లమెంటు వారేర్పరచిన బోర్డు ఆఫ్ కంట్రోలు అను విచారణకమిటీవారి అధికారములు భారతదేశమున నిర్మింపబడిన ప్రభుత్వవిధానము, గవర్నరు జనరలు, గవర్నర్లు వీరి ఆలోచనాసంఘములు, వీరి అధికారములు, పైవారికి వీరిపైగల అధికారములు చక్కగా విమర్శించి చెప్పిరి. ధర్మపరిపాలనా పద్ధతులనుగూర్చి ముందుగా చెప్పి, ప్రజల ఆస్తిహక్కులు వ్యక్తిస్వాతంత్ర్యములు వానిని కాపాడుట కేర్పడిన శాసనవిధులు అవి అమలుజరుపు విచారణపద్ధతులు, ఆస్తిహక్కులకు సివిలుహక్కులకు భంగము కలిగినప్పుడు న్యాయవిచారణ చేసి నష్టపరిహార మిచ్చుట కధికారము గల సివిలుకోర్టులు, వ్యక్తులకు ప్రజలకు నష్టమును కలిగించు నేరములు జరిగినప్పుడు వానిని విచారించి దోషులను దండించు క్రిమినలుకోర్టులు, అందమలు జరుగు శాస్త్రధర్మములు విచారణ పద్ధతులు, ఇందుకేర్పడిన క్రిమినలు ప్రొసీజరును లోపములుగల ధర్మపరిపాలనా పద్ధతులవలన కలుగు నష్టములును చక్కగా వివరించి ఇట్లొక దేశముయొక్క రాజ్యాంగధర్మములు కొన్ని శాస్త్ర సిద్ధాంతములపైన నేర్పడియున్నందున ఆ సిద్ధాంతములొక శాస్త్రముగా నేర్పడియున్నవనియు ఆ శాస్త్రవిజ్ఞానము నభ్యసించుట చాల లాభకరమనియు చెప్పిరి. ఇంగ్లీషున్యాయ విచారణలోని లోటుపాటులు మేలుకీళ్ళు కోర్టువివాదము లధికమగుటను గూర్చియుచెప్పి దేశములో అమలుజరుగు న్యాయశాసనధర్మములెల్ల స్థిరములై స్పష్టములైయుండుటకు స్మృతులుగా గ్రంథస్తము చేయుట అవసరమనిరి.
నార్టనుగా రొసగిన యుపన్యాసములందు నేడు విశ్వవిద్యాలయములందు బోధింపబడు రాజనీతి ధర్మశాస్త్ర సిద్ధాంతములు రాజ్యాంగధర్మములును భారతదేశ పరిపాలనాపద్ధతులును మొదలగు ఉపయుక్తమైన విషయములన్నియు చెప్పబడినవి. ఇదిగాక ప్రజాసేవజేసి దేశోద్ధరణ చేయువారు నేర్చుకొనవలసిన రాజకీయవిషయములు ఆర్థికనీతులును చెప్పబడినవి. వీరి యుపన్యాసములు భావగర్భితములై దేశభక్తి పూరితములై వినువారియందు రాజకీయపరిజ్ఞానమును గాఢమైన దేశాభిమానమును ప్రజాసేవాపరాయణత్వమును కార్యదీక్షను ఉద్బోధించుచుండెను. ఇవి రాజకీయపరిజ్ఞానమునందు దేశాభిమానమునందు ప్రజాసేవయందును చెన్నపట్టణ ప్రజలు నేర్చుకున్న ప్రథమపాఠములని చెప్పవచ్చును. ఈయుపన్యాసములను వినినవారిలో నీగొప్ప భావములు నాటుకొని తరువాత వారు చేసిన ప్రజాసేవకు కారణములయ్యెను. అట్టివారిలో 1844 మొదలు 1868 వరకును చెన్నపట్టణమున ప్రజానాయకులై క్రైస్తవమతాచార్యుల దురంతముల నరికట్టుటకు ఆందోళనచేసి స్వధర్మరక్షణకొరకు దేశోద్ధరణకొరకు పాటుపడుచు రాజకీయ సంస్కరణములకొరకు ప్రయత్నించి తన ధనమును జీవితమును ధారపోసిన గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారొకరని చెప్పినచో ఈ హిందూ లిటరరీ సొసైటీ స్థాపించిన వీరాస్వామయ్యగారును దాని ఆధిపత్యము క్రింద మహోపన్యాసములిచ్చిన నార్టనుగారును వారి మిత్రులును ఆనాడు చేసిన కృషి దేశమున కెంత యుపకారము చేసినదో తెలియగలదు.
1833 మొదలు చెన్నపట్టణమున ప్రజలలో గొప్ప వికాసము కలిగెను. సభలు తీర్మానములు చేయబడి విద్యాభివృద్ధికి గొప్ప ప్రయత్నములు జరుగసాగెను, అది కార్యరూపము దాల్చెను.
1837లో మదరాసు గవర్నరుగ వచ్చిన ఎల్‌ఫిన్‌స్టనుప్రభువు కేంద్రప్రభుత్వమువారు 1835లో నిశ్చయించిన ప్రకారము ఆంగ్లేయ విద్యావిధానమును పాశ్చాత్యప్రకృతిశాస్త్రవిజ్ఞానమును చెన్నపురి రాజధానిలో ప్రవేశపెట్టుటకు సుముఖుడుగా నుండెను. ఈ అవకాశమును జూచుకొని చెన్నపురిపౌరులు చెన్నపట్టణమున ఇంగ్లీషుకాలేజి యొకటి అవసరమనియు ప్రజల విజ్ఞానాభివృద్ధి జాతీయతకు పునాదియని తాము గ్రహించితిమనియు కేవలధర్మముపై నాధారపడిన విద్యాపద్ధతిని తాము కోరుటలేదనియు తమ శక్త్యానుసారముగా ఈ మహత్కార్యమునకు విరాళము లిచ్చెదమనియు ప్రభుత్వము స్థాపించు సంస్థల నిర్వహణమందు ప్రజలకు కొంత అధికారమును పలుకుబడియు నుండవలెననియు వ్రాసి యొక మహజరును తయారుచేసి డెబ్బదివేలమంది సంతకము చేసి జార్జినార్టనుగారిద్వారా గవర్నరు కందచేసిరి.
విద్యాభివృద్ధినిగూర్చిన విషయములందు ప్రజాభిప్రాయము తీవ్రరూపము దాల్చినదని ఈ మహజరునుగూర్చి నార్టనుగారు చెప్పిరి.
గవర్నరగు ఎల్‌ఫిన్‌స్టనుగారు జాగ్రత్తగా యోచించి ఆంగ్లసారస్వతము ప్రకృతిశాస్త్రములు తత్వశాస్త్రము నేర్పుటకు ఒక యూనివర్‌సిటీ అనబడు విశ్వవిద్యాలయమును స్థాపించుటకును దానికి విద్యార్థులను తయారుచేయుట కొరకు ఒక ఉన్నతపాఠశాలను స్థాపించుటకు నిశ్చయింపుచు 12-12-1838 తేదీన ఒక మినుటును వ్రాసెను.
VIII
పైనచెప్పిన తీర్మానప్రకారము 2-8-1839లో నొక యూనివర్‌సిటీబోర్డు చెన్నపట్టణమున నెలకొల్పబడెను. దానికి జార్జినార్టనుగారు అధ్యక్షులుగను వి. రాఘవాచార్యులు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె మొదలగు కొందరు భారతీయులుగూడ దొరలతోపాటు అందు సభ్యులుగను నియమింపబడిరి.
1841 సంవత్సరం ఏప్రియలు 14వ తేదీన మదరాసు కాలేజి హాలులో మదరాసు యూనివర్‌సిటి ప్రారంభోత్సవము ఎల్‌ఫిన్‌స్టన్‌ప్రభువు అధ్యక్షతక్రింద జరిగెను. ఆసభకు 1500మంది పౌరులు వచ్చిరి. అంతమంది నేటివు ప్రజలు అదివరకెన్నడును ఏ సందర్భమునను చెన్నపట్టణమున సమావేశమై యుండలేదు.
ఈ విద్యావిధానమును గూర్చి ప్రజలలో అంత యుత్సాహముండెనని కనపడెను. యూనివర్‌సిటీ అధ్యక్షుని తరఫునను గవర్నరులనబడు సభ్యుల తరఫునను నార్టనుగారు ఎల్‌ఫిన్‌స్టనుప్రభువునకు వినతిపత్రము సమర్పించెను. దానికతడు జవాబు చెప్పుచు “ఇది క్రొత్త పాఠశాలయొక్క ప్రారంభోత్సవముగాక ఒక నవీన యుగారంభమని” పలికెను. సభ కరతాళాధ్వనులతో ప్రతిధ్వనించెను.
ఇట్లు వీరాస్వామయ్యగారు నాటిన బీజము మహావృక్షమై ఫలించగా ఈ మహోత్సవమున పాల్గొనుటకు ఆయన యశఃకాయముతో నుండిననూ కృతకృత్యులైరని చెప్పవచ్చును.
1830 మొదలు 1841 వరకును గతించిన పది సంవత్సరములలో భారతదేశమునందు ఈ దేశప్రజలందు కలిగిన గొప్పమార్పును గూర్చి జార్జినార్టనుగారే 1841లో తమపుస్తకమునకు* పీఠిక వ్రాయుచు నిట్లు చెప్పియున్నారు.
[*జార్జినార్టనుగారు 1833-34 సంవత్సరములలో నిచ్చిన యుపన్యాసములు ప్రజాయాదరమునకు పాత్రములై రూడిమెంటల్సు అని పేరుతో నొక గ్రంథరూపమున 1841లో ప్రకటింపబడెను. అప్పుడు నార్టనుగారు దానికి పరిచయవాక్యములను వ్రాయుచు దేశములోను ప్రజలలోను కలిగిన మార్పునుగూర్చి వివరించిరి.]
“ఈ యుపన్యాసములిచ్చిన నాటికిని నేటికిని దేశప్రజలయందు జనసంఘమునందు నొక అత్యద్భుతమైన మార్పు వచ్చినది. బ్రిటీషు పరిపాలనముపట్ల స్నేహభావము వర్ధిల్లినది. బ్రిటీషుసంస్థలను ప్రజలు మెచ్చుకొనుచున్నారు. ప్రజలయందు జనసంఘమునందు కలిసికట్టుతనము ప్రారంభమైనది. ఒకే సామ్రాజ్యముక్రింద పౌరులుగ నుండవలెనను వాంఛ వర్ధిల్లినది. అన్నిటికన్న ముఖ్యముగా ఇంగ్లీషు విద్యవలని లాభములు ప్రజలు గ్రహించి దానిని అభివృద్ధిజేసి రాజ్యమునందు సంఘమునందు అధికారమును గౌరవమును సంపాదించుటకుగల నిజమైన అర్హతలను పొందవలెనను వాంఛ నేటివు ప్రజలందు ముఖ్యముగా పైతరగతులయందు వ్యాపించినది. ఈ మార్పును కాదనుటకు వీలు లేదు. ప్రజల ఆశయములను తృణీకరించుటకును వీలు లేదు. మర్యాదస్థులైన డెబ్బదివేలమంది నేటివులు ఒక్క అర్జీలో ఏకీభావము వహించి విద్యావిధానమునకు ప్రభుత్వాదరణమును పొందుటకు ప్రయత్నించుటయే ప్రజలలో ఒక నూతనభావ ముదయించినదనుటకు సాక్షి. ప్రజల కోర్కెలకు అనుగుణముగా తగినంత వేగముతో విద్యాభివృద్ధి జరిగి విద్యాసంస్థలు వర్ధిల్లకపోయినను భారతదేశప్రభుత్వముయొక్క సంరక్షణ క్రిందను స్వతంత్రసంఘములును వ్యక్తులును ఆంగ్లసారస్వతమును పఠించు విద్యార్థులు వర్ధిల్లుచున్న ఒక క్రొత్త తరమును సృష్టించినవి. ఈ గొప్ప యాశయములు కలిగి జాతీయాశయములు వాంఛించుచున్న దేశప్రజలకును ఉపయుక్తమయిన ఆంగ్లవిద్యాశాఖలయందు కృషిచేయుచు పైకి వచ్చుచున్న యువజనులకును ఈ యుపన్యాసములయందు వివరింపబడిన యంశములకన్న తమదేశమునకు ఎక్కువ ఉపకారమును కలిగించి విషయములు లేవు” అని వ్రాసిరి.
నార్టనుగారు చెప్పినట్లు 1830-1841 సంవత్సరముల మధ్య భారతదేశ రాజకీయ సాంఘిక మతాచార వ్యవహారములందొక గొప్ప మార్పు వచ్చినమాట వాస్తవము. ఇది వచ్చుటకు నార్టను, వీరాస్వామయ్య, రామమోహనరాయి మొదలగువారు చేసిన ప్రజాసేవ యొక కారణమే. అయితే ఈ మార్పుయొక్క నిజస్వభావమును గ్రహింపవలెనన్నచో ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్వము వలన రాజకీయ ఆర్థిక సాంఘిక మత విషయములందు వచ్చిన మార్పులు, పాశ్చాత్య నాగరికత, పరిపాలక జాతియొక్క జీవితవిధానము, క్రైస్తవమత ప్రచారము, ఇంగ్లీషు సారస్వతము, ప్రకృతిశాస్త్రవిజ్ఞానము లోనగు వానివలన కలిగిన భావపరివర్తనల చరిత్రను చర్చించవలసి యుండును. అనగా బ్రిటీషు యుగారంభమునాటి భారతదేశ చరిత్రనే చదవవలెను.
ఇంగ్లీషువారితోడి పరిచయము, స్నేహము, ప్రజలందు వారిరుచులయందు మర్యాదలందు అనేకమైన మార్పులు కలిగించుచుండెను. ఇంగ్లీషువారివలె ఇండ్లను కారింతియన్ స్తంభములతో కట్టుట, వాటిని కుర్చీలు బల్లలు వేసి అలంకరించుట, చక్కని గుఱ్ఱపుబండ్లయందు షికారుకుబోవుట, పిల్లలకు ఇంగ్లీషు లాగు చొక్కాలు వేయుట, టోపీలను బూట్సులను వేయుట, కులాచారములను వీడుట మెల్లగా ప్రారంభమయ్యెననియు, ఒకటి రెండు వార్తాపత్రికలు కూడ బయలుదేరి రాజకీయములను చర్చించుచుండెననియు 1823 డిశంబరులో బిషపు హెబరు వ్రాసినాడు.
ఇంగ్లీషుభోగద్రవ్యములను ఉపయోగించుట ప్రారంభమైనదని విలియం బెంటింకు 30-5-1829లో వ్రాసినాడు. సీమసారాయముల నుపయోగించుట, వాచీలు గడియారములు, గుఱ్ఱపుబండ్లు నుపయోగించుటను గూర్చి హోల్టుకొకంజీ కామన్సుసభలో 23-2-1832లో సాక్ష్యమిచ్చినాడు.
(సశేషం)
[ప్రథమ ప్రచురణ: కృష్ణాపత్రిక, శ్రీ విషు సంవత్సర చైత్ర మాసపు (ఏప్రిల్, 1941) సంచికలలో. ఈ వ్యాసాన్ని అందజేసిన దిగవల్లి రామచంద్రగారికి మా కృతజ్ఞతలు – సం.]