జాతీయ రహదారుల మీద పగిలి నెత్తురోడుతోన్న అరికాళ్ళ ముద్రలు. రోళ్ళు పగిలే ఎండల్లో నిండు నెలల గర్భిణుల నడకలు. నిలువ నీడ లేని దారుల్లో ప్రసవం. ఆగే వీల్లేని బ్రతుకుని మోసుకుంటూ తారురోడ్ల మీద పచ్చి కడుపులతో ఆ తల్లుల ఎడతెగని ప్రయాణం. గడ్డలు కట్టే రొమ్ములను నొక్కుకుంటూనే రోజుల పసిగుడ్లను హత్తుకుంటూనే కొనసాగిన నడకలు. పెద్దలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యులు అందరిదీ అదే దారి. అదే వరస. ఊరెటో తెలీదు. ఇంకెంత దూరం వెళ్ళాలో లెక్కేలేదు. వెళ్ళగలరో లేదో తెలీదు. భాష రాదు. బస్సు లేదు. రైలు లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం అరికాళ్ళకు చెప్పుల్లేవు. ఎక్కడా ఆగి ఆశ్రయం పొందగల పరిస్థితి అసలే లేదు. గత రెండు నెలలలో రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటుకుంటూ కోట్లాది వలస కార్మికులు చేసిన హృదయవిదారకమైన ప్రయాణంలో మచ్చుకి కొన్ని దృశ్యాలివి. ఎలాగోలా ఇల్లు చేరాలన్న వెర్రి ఆశకి ఆకలి, వ్యాధి భయం, అధికారులు ఎక్కడ ఎందుకు అడ్డగిస్తారోనన్న బెరుకు తప్ప ఏం తోడున్నాయి వారికి? అవసరానికి వాడుకోవడమే తప్ప ఏ సమాజమూ సొంతంచేసుకోని ఏకాకితనం ఈ వలసజీవులది.
కరోనా వైరస్ ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసింది. రవాణా వ్యవస్థలు స్థంభించిపోయాయి. సామాజిక జీవితం సగటుజీవి మరపుపొరల్లోకి నెట్టేయబడింది. లక్షలలో నిరుద్యోగులవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. బలవంతంగా మీదపడ్డ ఒంటరితనం, ఉన్నట్టుండి మారిపోయిన జీవితం, ఉక్కిరిబిక్కిరిచేసే బాధ్యతలు, కనీసావసరాలు తీరేందుకు ఏర్పాటు చేసుకోవాల్సిన తొందర–ప్రపంచమంతా అనుభవించిన వొత్తిడిలో స్థాయీభేదాలుండవచ్చునేమో కాని, ఉదాసీన వాతావరణం మాత్రం ఎక్కడా లేదు. ఇట్లాంటి పరిస్థితికి ఏ దేశపు ప్రజలూ సిద్ధపడి లేరన్నది వాస్తవం. ఏ ప్రభుత్వమూ ఎన్ని ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకున్నా నూటికి నూరుశాతమూ తన ప్రజలను కాపాడుకోలేదనీ అర్థంచేసుకోగలం. కానీ, గత కొన్నాళ్ళుగా భారతదేశంలో మనం చూసిన వలసజీవుల కన్నీటిచరిత్ర, ఒక పరిపాలనావ్యవస్థగా మనమెంత హీనస్థితిలో ఉన్నామో సుస్పష్టం చేసింది. ఇందరు వలసకార్మికులు అప్పటికప్పుడు అమలైన లాక్డౌన్తో అటు పనిలేక, భత్యంలేక, బ్రతుకులేక, భద్రతలేక, ఇంటికిపోయే దారిలేక గిలగిలలాడిపోతూ నడివేసవిలో సామాను నెత్తిన పెట్టుకుని రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటి నడిచిపోతుంటే, సరిహద్దుల దగ్గర ఆపి చోద్యం చూసిన పాలకవ్యవస్థను ఏమనాలి? ప్రజల క్షేమం చూడాల్సిన ప్రభుత్వం వారిపైనే తమ జులుం చూపించడాన్ని ఇంకేమనాలి? సమాజంలోని ఒక భాగానికి కనీస రక్షణ కరవవుతున్నప్పుడు, నిర్లజ్జగా వాళ్ళనలా వదిలేసి చేతులు దులుపుకోవడం ఎంత అమానుషం! కులాన్ని, మతాన్ని, ధనాన్ని మత్తుమందుగా ప్రజలకు పంపిణీ చేసి అవసరానికి పబ్బం గడుపుకునే మన ప్రభుత్వాల ప్రమాదకర ధోరణికి నిలువెత్తు ప్రతీక ఈ వలసకార్మికుల మహానిర్గమనం. అయితే, రాజ్యం నీళ్ళొదిలేసిన బాధ్యతను సామాన్య ప్రజానీకం తలకెత్తుకుంది. ప్రభుత్వం గుడ్డిదైనచోట మానవత్వం కళ్ళు తెరిచింది. సాటి మనుషుల కష్టానికి చలించిపోయిన సామాన్యులెందరో తమ శక్తికి మించి, వలస కార్మికులకు ఎంతో కొంత కడుపు నింపి వారిని ఆదరంతో గౌరవంతో ఇళ్ళకు చేర్చడం కోసం తపించారు, శ్రమించారు. చీమూ నెత్తురూ లేని రాజకీయనాయకులు వారి శ్రమను తమదిగా ప్రచారం చేసుకుంటున్నా, అహంకారంతో అధికారయంత్రాంగం అడ్డుపడుతున్నా అన్నింటికీ ఎదురొడ్డి మరీ అనుకున్నది సాధించారు. మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని ఇంత గొప్పగా ప్రకటించి, అది ఎన్నటికీ సమసిపోదని భవిష్యత్తు పట్ల భరోసా ఇచ్చి, దేశమంటే మట్టి కాదు, దేశమంటే ప్రభుత్వం కాదు, దేశమంటే మనమేనని మరొక్కసారి గుర్తుచేసిన ఆ మానవీయశక్తులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం.