సాంస్కృతికంగా బలమైన సమాజాల్లో ప్రతీ తరం రాబోయే తరాలకు బహుముఖీనమైన కళావారసత్వాన్ని ఇచ్చి వెళ్ళడం, ఆ నీడన కొత్త తరాలు తమ ఆలోచనలను రూపు దిద్దుకోవడం పరిణామక్రమంగా జరిగే విషయం. ఆ వారసత్వం లేని సమాజం ఎక్కువకాలం ఉండలేదు. తెలుగులో సాహిత్యసంగీతాది కళలలో లబ్ధప్రతిష్ఠులైన ఎందరో కళాకారులు నిన్నటి యువతరానికి తమ వారసత్వాన్ని అందించి పడమటిగూటికి చేరుకుంటున్నారు. వారికి వారి కళ పట్ల ఒక స్పష్టమైన జ్ఞానం, కళలకు లక్షణాలే కాని కచ్చితమైన నిర్వచనాలు ప్రయోజనాలు ఉండవన్న విచక్షణ ఉన్నది. అది వారి వారి సృజనలో ప్రతిఫలించింది. ఆ బహుముఖీనత వల్లనే ఆ కళలు పండితపామర విచక్షణ లేకుండా పదిమందికీ చేరినది, అందరినీ అలరించినదీ. అలా చేరితేనే మంచిదనో గొప్పదనో కాకపోయినా కళ సమాజంలో ఎక్కువమందిని చేరగలగాలి. వారి అభిరుచిని పెంపొందించగలగాలి. కనీసం మంచీ చెడూ చర్చించే అవకాశం ఇవ్వగలగాలి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. సృజనకున్న అనేకరూపాలను సమానంగా సహృదయంతో స్వీకరించి విశ్లేషించగల విమర్శా దృక్పథం ప్రస్తుతం సంగీతం, చిత్రకళ వంటి ఇతర కళలలో కొంతయినా కనిపిస్తున్నది కాని తెలుగు సాహిత్యంలో మాత్రం లేదు. బహుముఖీనతను విస్మరించి నిర్వచనాల సంకెళ్ళలో ఒకే రకమైన సాహిత్యాన్ని రచయితలు విమర్శకులు అందలమెక్కించడం వల్లనే సాహిత్యం తెలుగు సమాజంలో ఒకప్పటి ప్రాభవాన్ని పోగొట్టుకున్నది. సాహిత్యరంగంలో నిన్నటి తరం నేటి తరానికి అందించిన వారసత్వం ఎటువంటిది, అది రేపటికి ఎలా ఉండాలి? అని ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చి కొంత కాలమయినా ఎవరూ ఆవైపుగా ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. రచయితలు ఇప్పటికీ పాతకాలపు సాహిత్య భావనలనే పట్టుకుని వేలాడడం, విమర్శకులు సాహిత్యరూపలక్షణ పరిమితీపరిణామాలపై చర్చ విస్తృతంగా జరపకపోవడం ఇందుకు కారణాలు. ఈ స్థితిని సంస్కరించే దిశగా నేటి సాహిత్యకారులు అడుగువేస్తారని, రేపటితరంలో వారి వారసత్వంగా చక్కటి సాహిత్యాభిరుచిని పెంపొందిస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించడం ఎండమావి చందమే అయినా అది ఎప్పటికీ అత్యాశ కాకూడదనే మా ఆశ.
ఈ సంచికలో:
- కథలు: ఆహవి – అవినేని భాస్కర్ (ఎ. ముత్తులింగం); నీళ్ళు – పెద్దిభొట్ల సుబ్బరామయ్య (పునర్ముద్రణ); బ్రెడ్ ప్యాకెట్ – పూడూరి రాజిరెడ్డి (స్వగతం); మరోసారి – చంద్ర కన్నెగంటి; బేతాళ కథలు: కథన కుతూహలం 1 – టి. చంద్రశేఖరరెడ్డి.
- కవితలు: మా పీకల మీదుంచిన కత్తులు తీయండి – అవినేని భాస్కర్ (ఇళంగో కృష్ణన్); ఇగో – పాలపర్తి ఇంద్రాణి; చిత్రపటం – సాంఘిక; రెండు దేహాలు – విజయ్ కోగంటి (ఒక్తావియో పాజ్); నిర్ణయం – సంతోష్ దోసపాటి.
- వ్యాసాలు: రెండు ప్రశ్నలు – జెజ్జాల కృష్ణ మోహన రావు; సంగీత నాటకాలు – బాలాంత్రపు రజనీకాంతరవు (పునర్ముద్రణ); విమర్శ సృజనాత్మక కావ్యం – పాపినేని శివశంకర్; కలలు ఇచ్చిన బలిమి – మైథిలి అబ్బరాజు.
- ఇతరములు: సెలవు మాస్టారూ! – పి. సత్యవతి; తెలుగునాట మహాకథకుడు పెద్దిభొట్ల – సింగమనేని నారాయణ; సిలువగుడి కథలు – దాసరి అమరేంద్ర; నాకు నచ్చిన పద్యం: గౌతమీ కోకిల వేదుల – చీమలమర్రి బృందావనరావు. గడి-నుడి 20 – కొల్లూరు కోటేశ్వరరావు.