పదహారు గడ్డిపోచలు
గడ్డిపోచలను గుర్తించడం చూసేవారి చూపుల్లోని చురుకుదనాన్ని బట్టి ఉంటుంది. వాటికి విలువనివ్వడం చూపరుల సున్నితత్వం పైన, అవి ఊగే ప్రాంతాల పైన ఆధారపడి ఉంటుంది. కానీ, గాలి వీచినప్పుడల్లా కదిలే గడ్డిపోచలు, ఆ నేలలోని జీవనసారానికి గుర్తన్నదైతే నిశ్చయం. పదహారు గడ్డిపోచలు పేరిట స్వాతికుమారి వెలువరించిన వచన కవిత్వం జీవనదాహానికీ, జీవనకాంక్షకీ అక్షరరూపం. తేలిక పదాలను ఆధారంగా చేసుకుని, అతిసామాన్యమైన సందర్భాలను నెపంగా ముందుంచుకుని, వెలితినీ, వేదననూ బలంగా బయటకు నెట్టిన జీవన శకలాలివి. ఏదో చెప్తోంది అన్న స్పృహ, మార్మికతలా కవిత్వమంతా పరుచుకుని ఉండటంతో, దానిని కనిపెట్టే ప్రయత్నం పుస్తకం చదివినంతసేపూ అవిరామంగా జరుగుతూనే ఉంటుంది. ఆ లోతు తెలుసుకోవడంలో కృతకృత్యులైనప్పుడు ఉద్విగ్నతకు లోనవడం, అది అందనప్పుడు నిరాశతో పేజీలను తప్పించుకుపోవడం అనివార్యం. ఈ గుణమే ఈ కవిత్వాన్ని అందరికీ తేలిగ్గా చేరనీయక అడ్డుపడుతుంది. చాలా వాక్యాల్లో కనిపించే విరోధాభాస ఈ కవిత్వపు శైలిగా గుర్తుండిపోతుంది. ఆహ్లాదం కలిగించడం ఈ కవిత్వ లక్షణం, లక్ష్యం కాదు. ఇందులోని ఖండికలు, సహానుభూతి చెందాలనిపించే విషాదం, జాలి, ఇబ్బంది చూపెడుతూ, రాయడం అత్యంత వైయక్తికం అని గుర్తుచేస్తాయి. ఏది చెప్పినా బలంగా చెప్పడం వల్ల, ఇవి పాఠకుడితో చాలా దూరమే ప్రయాణం చేస్తాయి. ఒక్కో మాటా, ఒక్కో వర్ణనా ఆమె చెప్పాలనుకున్న ఉద్వేగాన్ని పరిచయం చేస్తుండగానే, ఆ పరిచయం ఇంకా నిండుగా పూర్తవకుండానే, ఇక ఇంత నింపాదిగా చెప్పలేనట్టు కట్టలు తెంచుకుని వచ్చినట్లుగా ముగుస్తుందా వర్ణన. ఈ హఠాత్పరిణామం ఉక్కిరిబిక్కిరి చేసి, పదాల్లో ఒలికిన మానసిక స్థితిని కళ్ళకు కడుతుంది. ఉదా: సరదాకీ మాటవరసకీ కాదు. కాళ్ళూ చేతులూ వణికిపోతున్నంత నిజంగా, కల్తీలేని భయం. చప్పుడు రాకుండా రాత్రిపూట ఏడ్చేటప్పుడు, గుండె మీద రుద్దుకుంటూ ఊపిరి అందుకునేటప్పుడు, బయటపడని కేకలో, ఒక మనిషి తాలూకా వాసన. ఒక అలవాటైన శరీరపు రుచి. రోజంతా వినపడని ఒక గొంతు లోపల్లోపలే మోగుతూ, మెలిపెడుతూ, చీకటికొట్టు లాంటి దిగుల్లోకి విసిరికొడుతూ….
రచయిత మానసిక ప్రపంచాన్ని ఈ గడ్డిపోచల ద్వారా అందుకోవాలనే పాఠకులు, కొంత ప్రయాసపడక తప్పదు. ‘గడ్డిపోచలు గర్జించే సమయం వచ్చినపుడు నిప్పురవ్వలు నిద్రపోవు’ అన్న విప్లవ వాక్యాన్ని వ్యక్తిగత స్థాయిలో గుర్తుచేసే ఈ పుస్తకం వివరాలు:
రచయిత: స్వాతికుమారి బండ్లమూడి
ప్రచురణ: ఛాయా రిసోర్స్ సెంటర్
ధర: $9.90 / రూ. 200
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు
ఏడు గంటల వార్తలు
ఇది వివిధ దేశాలకు చెందిన రచయితలు వ్రాసిన పద్నాలుగు కథల సంపుటి. యుద్ధం, యుద్ధానంతర పరిస్థితుల నేపథ్యంలో వ్రాసిన కథలు లెక్కకు ఎక్కువగా కనిపించినా, మొత్తం అన్ని కథల్లోనూ మానవోద్వేగాలను చిత్రీకరించిన తీరు, దానిని తెలుగులో కొల్లూరి సోమశంకర్ ఒడిసిపట్టిన తీరు, దీనిని మంచి పుస్తకాల జాబితాలోకి చేరుస్తుంది. నిజానికి ప్రతి మనిషి మనసూ ఒక యుద్ధ రంగమే. ప్రత్యర్థులూ, పరిష్కారాలూ, కొండొకచో ఒప్పంద మార్గాలూ మారుతూ ఉంటాయంతే. నేరుగా వస్తున్న కథల్లోనైనా, అనువాదాల్లోనైనా, అరిగిపోయిన వస్తువుగా కనపడుతోన్న స్త్రీ పురుష సంబంధాలను దాటి, విభిన్నమైన వస్తువులతో ముడిపడ్డ కథల ఎంపిక పాఠకులకు తెరిపినిస్తుంది. పదవీవిరమణ వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో, అభిమానవంతురాలు ఉద్యోగం కోల్పోతే ఏ పరిస్థితులను ఎదుర్కొంటుందో ఈ కథల్లో చదువుతున్నప్పుడు, మనిషి బయటా లోపలా మెదిలే సంఘర్షణలు పాఠకుల అనుభవంలోకి వస్తాయి. నిన్నామొన్నల్లో ప్రచురింపబడ్డ ఈ పరాయి భాషల కథలను, అంతే వేగంగా తెలుగులోకి అనువదించడం సమకాలీనులకు బాగా కలిసివచ్చే విషయం. ఒకే కాలానికి చెందిన మనుషులు, వేర్వేరు ప్రాంతాల్లో ఎలా మెలుగుతున్నారో గమనించడం దానికదే ఒక అభ్యాసం. ప్రత్యేకించి, సున్నితత్వాన్ని, సహానుభూతిని నేర్పించైనా సరే పదిమందికీ అలవాడేలా చెయ్యాలని ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న ఈ కాలంలో, అరకొర బోధనలు, అర్థమయ్యీ కాని పాఠాలు, మానవ సంబంధాలను మరింత జటిలంగా మారుస్తోన్న క్రమాన్ని పూసగుచ్చినట్టు వర్ణించిన ‘సెన్సిటివిటీ ప్రోగ్రాం’ లాంటి కథలు ఈ సంపుటిలో ఉండటం, కథల ఎంపికలోని చురుకుదనాన్ని పట్టిస్తుంది. స్వాభావికంగా మనిషి మంచివాడనీ, బలవంతుండనీ, వృత్తులూ, తప్పనిసరిగా నేర్వాల్సిన లౌక్యాలూ, ఇంటాబయటా యుద్ధాలు, మనిషిని ప్రమాదకరమైన హద్దుల్లోకి నెడుతున్నాయనీ చెప్పకనే చెప్పిన కథలివి. ఏ ముడీ లేనట్టుండే విషయాలు మనిషి ఆలోచనలో ఎలా కలుస్తాయో ‘బైపాస్ రోడ్’, ‘వానదొంగ’ లాంటి కథలు చెబుతాయి. ఈ ప్రాతిపదికన చూస్తే, శైలి, శిల్పాల్లోని సంక్లిష్టతల వల్ల కాక, కేవలం కథ నడత ద్వారా, రచయిత ముగింపుల్లో వేసిన ముడుల ద్వారా, పాఠకులను ఆకర్షించి, ఆలోచింపజేసే కథలుగా వీటిని పేర్కొనవచ్చు. గొప్ప మెలకువతో, చీకటిని కాక వెలుగును వెదికిన పాఠకుడి చేతిలో అనువదించబడ్డ ఈ కథల సంపుటి వివరాలు:
రచయిత: కొల్లూరి సోమశంకర్
ప్రచురణ: కొల్లూరి సోమశంకర్
ధర: రూ. 120
ప్రతులకు: ఇ-బుక్; నవోదయా బుక్ హౌస్, కాచిగూడా, హైదరాబాద్. +91-9000413413, 040-24652387.
భయం: కథాసంకలనం
సమాజంలో స్త్రీలను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఇబ్బందులకు గురిచేస్తున్న అంశాలను వివరంగా, ఏ దాపరికమూ లేకుండా చర్చించిన కథలివి. ఇందులో ఉన్నవన్నీ మనం రోజూ వార్తల్లో చూసే నేరాలు, లేదా ఆ నేరాల వెనుక తెర చాటున జరిగిన నమ్మశక్యం కానట్టున్న ఘోరాలు. ఈ పుస్తకాన్ని కథా వస్తువుల్లోనూ రచనా పద్ధతుల్లోనూ కొత్తదనాన్ని కోరుకునేవారు చదవనవసరం లేదు. ఈ కథల ప్రధాన లక్ష్యం స్త్రీలకు, ప్రత్యేకించి బాధిత వర్గాలకు చేరడంలా కనపడుతుంది. జరుగుతున్న అన్యాయాల పట్ల మెలకువను కలిగించడం; ఇబ్బందికర, ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన స్త్రీలు, కోల్పోనున్న సాంఘిక భద్రత గురించి భయపడకుండా, ధైర్యంగా అన్యాయాలను బయటపెట్టి బయటకు రావాలనే పిలుపు ఈ కథల్లో ఉంది. స్నేహం, ప్రేమ, పెళ్ళి ఎరలుగా చూపి, కొందరు మగవారు చేసే దురాక్రమాలను, వారి సంకుచిత మనస్తత్వాన్ని విశదంగా చెప్పడంలో, అమాయకంగా వీళ్ళ వలలో పడుతున్న ఆడవారికి అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యం, ఈ కథల్లో స్పష్టంగా కనపడుతుంది.
స్త్రీకి తన మీద తనకు నమ్మకం ఉండాలనీ, తన విద్యనూ, ఉద్యోగాన్ని, వ్యక్తిత్వాన్ని కొరగాని వాళ్ళకోసం వదులుకుని విచారించకూడదనీ, మానసిక స్థిరత్వం అసలు బలమనీ ఇందులో కథలు చెప్తాయి. ఇవన్నీ పాఠాల పద్ధతిలో ఉండటం వల్లా, నేరప్రవృత్తి గురించీ, నేరాల గురించీ చాలా బిగ్గరగా, వివరంగా చర్చిండం వల్లా, ఈ పుస్తకపఠనం ఇబ్బందిగా సాగుతుంది. ముందే చెప్పినట్టు, ఒక లక్ష్యాన్ని ఉంచుకుని చేసిన రచన కనుక, నిర్దేశిత పాఠకులకు చేరితే, ఇందులో అనుభవాలు వారికి ధైర్య వచనాలుగా వినపడి లాభాన్ని చేకూర్చే అవకాశాలున్నాయి. బాధిత స్త్రీలు గొంతు పెగుల్చుకోవాల్సిన అవసరాన్ని, ఆత్మవిశ్వాసం ఇచ్చే బలాన్ని, కూడగట్టుకోవాల్సిన ధైర్యాన్ని ఇంతింతగా అందిస్తూ వచ్చిన ఈ కథల సంపుటి వివరాలు:
రచయిత: కె. ఎం. భవాని
ప్రచురణ సంస్థ: తమిళనాడు విమెన్ రైటర్స్ చారిటబుల్ అసోసియేషన్
ధర: రూ. 100
ప్రతులకు: కె. ఎం. భవాని, ఫోన్ – 7598210163, 9949380246; ఈ-మెయిల్.