ఎమ్. ఎస్. రామారావు లలితగీతాలు

ఈ సంచికలో ఎమ్. ఎస్. రామారావు పైన ఒక వ్యాసం వస్తుంది. దానికి అనుబంధంగా ఆయన పాడిన పాటలు కొన్ని పంపమని ఈమాట సంపాదకులు అడిగారు. అందుకోసం ఒక 25 పాటలు ఎంచుకున్నాను. కాని ప్రస్తుతానికి ఒక పదకొండు పాటలు విందాం.

ఆయన స్వగ్రామం మోపర్రు నాకు చాలా చిన్న వయసు నుండి బాగా తెలిసిన ఊరు. అందువల్ల ఆయన గురించిన సంగతులు వింటూ పెరిగాను. ఆయన సినిమాకు పాడిన మొదటి పాట ‘ఈ వసంతము నిత్యము కాదోయి’ (దేవత, 1941) తెలుగులో తొలి సినీ నేపథ్య గీతాల్లో ఒకటి. ఇదే మొదటిది అనేవారు కూడా ఉన్నారు! దరిదాపు ఇరవయ్యేళ్ళ పాటు మద్రాసులో సినీరంగంలో వున్నా పాడిన పాటల సంఖ్య వందకు మించదు. మొదటి పదేళ్ళలో పాడిన పాటల్లో ఎక్కువ భాగం అప్పటి ప్రముఖ నటుడు చదలవాడ నారాయణరావుపైన చిత్రీకరించబడినవి. నారాయణరావు నటన, ఎమ్. ఎస్. రామారావు బేస్ వాయిస్‌ల కలయిక అప్పటి మధ్యతరగతి, విద్యావంతుల వర్గం బాగా ఇష్టపడింది. ఈ సందర్భంలో ఆయన మనదేశం (1949) సినిమాలో సి. కృష్ణవేణితో పాడిన ‘ఏమిటో సంబంధం’ అన్న తెలుగు సినీ యుగళ గీతాలలో తలమానికమైన పాటను తప్పకుండా గుర్తుకు తెచ్చుకోవాలి. సి. కృష్ణవేణి, ఎన్. టి. రామారావు తాము సొంతంగా తీసిన సినిమాలలో ఎమ్. ఎస్. రామారావుకి పాడే అవకాశం ఇచ్చారు. ఏదయినా ఘంటసాల గాయకునిగా బలపడిన తరవాత ఎమ్. ఎస్. రామారావుకి అవకాశాలు తగ్గిపోయాయి అన్నది వాస్తవం. ఈ విషయాన్నే ఆయన 1987 ప్రాంతంలో ఆంధ్రప్రభ పత్రికకు ఇచ్చిన ఒక విస్తృతమైన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.

ఈ క్రింది 11 పాటలు వేర్వేరు రికార్డింగుల నుండి తీసుకున్న లలిత గీతాలు. మొదటి నాలుగు పాటలు: కన్నె కాటుక కళ్ళు (విశ్వనాథ సత్యనారాయణ), లేపాక్షి బసవయ్య (అడవి బాపిరాజు), నీ యడుగులే గాక (దేవులపల్లి కృష్ణశాస్త్రి), చంద్రలోకం (?), ఆయన 1984-85 ప్రాంతంలో లండనులో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్ధినీ విద్యార్ధుల సమావేశంలో భాగంగా జరిగిన కచేరీలో అతి కొద్ది వాద్య సహకారంతో పాడినవి. ఈ పూర్తి కచేరీని నాకు 2002లో అందించిన డా. నాగభైరు అప్పారావుగారికి కృతజ్ఞతలు!

(అప్పారావుగారు స్వతహాగా మంచి గాయకులు. 1967-1969 కాలంలో, ముఖ్యంగా మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో కొన్ని సినిమాలలో కూడా పాడారు. అప్పారావుగారు ఇంగ్లాండులో రికార్డు చేసిన చాలా పాటలను ఇక్కడ వినవచ్చు.) తరవాతి రెండు పాటలు–ఈ చల్లని చూపులే, అదను దాటిన వయసుతో–40 ఏళ్ళ క్రితం రేడియో నుండి రికార్డు చేసినవి. గేయ రచయితల వివరాలు ప్రస్తుతానికి నాకు అందుబాటులో లేవు. తక్కిన 5 పాటలు 78 ఆర్‌పిఎమ్ రికార్డుల పైన వచ్చినవి. ఈ అయిదింటిలో కొన్ని పాటలు ఇంటర్‌నెట్‌లో దొరుకుతున్నాయి. అయినా చాలా మంచి రికార్డుల నుండి కాపీ చేసినవన్న కారణంతో ఇక్కడ వినిపించడం. అదియొక గాథ, ఓ చెలి తలుపు మూయకనే (HMV N28713) పాటలకు సంగీతం సమకూర్చింది పెండ్యాల. నిజానికి 1948-1952(?) ప్రాంతంలో ఎమ్. ఎస్. రామారావు స్వయంగా రాసుకుని, బాణీలు కట్టుకుని పాడిన పాటలు పెండ్యాల వాద్య సహకారంతో (orchestration) రికార్డులపై వచ్చాయి. ఉదాహరణకి బాగా ప్రఖ్యాతి చెందిన ‘తాజమహల్, నల్లపిల్ల’ పాటల రికార్డు పైన కూడా పెండ్యాల పేరు ఉంటుంది. ఎమ్. ఎస్. రామారావు రికార్డులుగా ఇచ్చిన మరికొన్ని లలిత గీతాలు, అలాగే కొన్ని అరుదైన సినిమా పాటలు వచ్చే సంచికల్లో విందాం.

  1. కన్నె కాటుక కళ్ళు

  2. చంద్రలోకం

  3. లేపాక్షి బసవయ్య

  4. నీ యడుగులే గాక

  5. అదను దాటిన వయసుతో

  6. అది ఒక గాథ

  7. ఈ చల్లని చూపులే

  8. ఓహో మల్లి నాఅందాల మల్లి
  9. నాట్యమాడవే రాణి

  10. ఓ చెలి తలుపులు మూయకనే

  11. సమాధిలో అనాథలు