దిల్ ధడక్‌నే దో!

అతడు ఇబ్బందిగా కదిలాడు. ‘ఇంక ఆపు మహాతల్లీ!’ అందామనుకొన్నాడు. అనలేకపోయాడు. ఆమె వైపునుండి బోర్లా తిరిగి దిండులో మొహం దాచుకున్నాడు. వెల్లకిల్లా తిరిగి పడుకొని మాట్లాడుతున్న ఆమె ఆ విషయం గ్రహించలేదు. నుదురు దిండుకేసి రుద్దుకుంటూ ఉష్… ష్! అనుకున్నాడు. ఒకోసారి ప్రవాహంలాను, మరోసారి ఆగి ఆగి సాగదీస్తూనూ ఆమె మాట్లాడుతూనే వుంది. కలగాపులగంగా ఆ గొంతు పలికే భావాలు నెమ్మది నెమ్మదిగా చెవిని చేరడం మాని అతడు నిద్రలోకి జారుకున్నాడు.

మర్నాడు ఉదయం ఎవరూ లేపలేదతడిని. లేచేటప్పటికి గడియారం పదకొండు చూపిస్తోంది. రేయికి పగలు–పగలుకి రేయి అని తప్ప ఏ రోజు ఏ వారమో తెలియటంలేదు. ఉదయం ఆమె లేపకపోవడం, వంటింట్లోనుండి వస్తున్న కమ్మటి మసాలా వాసనలని బట్టి, ఆ రోజు ఆదివారం అని తేల్చుకున్నాడు. అప్పటివరకు వాదులాడుకుంటున్న అన్నాచెల్లెళ్ళు తండ్రిని చూడగానే ఒకరు పుస్తకంలో మరొకరు ఐపాడ్‌లో తలదూర్చారు. అతడి కోరచూపుకి వాళ్ళ ఓరచూపులు జవాబిచ్చాయి.

బాల్కనీలో తమ కోసం అమర్చిన ధాన్యాన్ని పక్షులు వంతులవారీగా వచ్చి తినిపోతున్నాయి. స్టవ్ తాలూకు ఓ బర్నర్ పైన కూర కుతకుతా వుడుకుతోంది. మరో బర్నర్ పైన కుక్కర్ విజిల్ వేస్తోంది. వాషింగ్ మెషీన్‌లో బట్టలు గిరగిరా తిరుగుతున్నాయి. ఆరిపోయిన బట్టలు మడతబెట్టబడుతున్నాయి.

కాఫీ ఇస్తూనే మొదలుపెట్టింది ఆమె- టీ పొడి అయిపోయిందని, గ్రైండర్ పాడై వారం రోజులయిందని, దాంతో చెయ్యి విరిగినట్లు వుందని. అతడు కనిపించని మరుక్షణం తనకి మాట్లాడే అవకాశం పోతుందేమో అన్నట్లు ఆమె ఆగకుండా చెపుతూనే వుంది. అవ్వని పనులు, చెయ్యాల్సిన పనులు ఏకరువుపెడుతున్న ఆమె కళ్ళలోకి చూడాలంటేనే అతడికి బెరుకు. మాట్లాడుతున్నప్పుడు బేలగా అలసటగా ఆమె కళ్ళు పలికే భావాలు ఇబ్బంది పెట్టకుండా అతడామె నుదుటిపైన వాలే ముంగురులకేసి, ఊగే చెవి జూకాలకేసి చూస్తూ వింటాడు. నిజంగా అన్నీ వింటాడని కాదు. అలా అని అశ్రద్ధ కాదు. మరంతే!

ఇంతకుముందు ఆమె ఇలా వుండేదికాదు. ఈ రెండు మూడు నెలల నుండే! మనసులో ఆందోళనో, తీరిక చిక్కనివ్వని పనులో, మరింకేమిటో?! అప్పటికీ సహాయానికి దిగాడు. అదే మూకుడు. అదే నూనె. కానీ ఆ ఆలూ వేపుడు ఓసారి కుదిరినట్లు మరింకోసారి కుదరదు. ఎందుకో అర్థంకాదు. పోనీ గిన్నెలు కడిగిపెడదామంటే జిడ్డు వదలలేదంటుంది. తానూ ఆఫీస్ పనితో పాటు మరెన్నో పనులు చక్కబెట్టుకుని వస్తోంది కదా! అతడిని కనీసం పిల్లల హోమ్‌వర్కులైనా చూడమంటుంది. ఆ విషయంలో అతడికి పిల్లలకి మధ్య గొప్ప గొప్ప యుద్ధాలే జరిగిపోతాయి. దాంతో తలనొప్పి అంటూ తప్పించుకుంటాడు.

పిల్లలు పూరీలు కావాలని డిమాండ్ చేశారు. వాటికి చెనామసాలా జతకావల్సిందే. అతగాడు ఆదివారాన్ని బిరియానితో ముడిపెడతాడు. తోడుగా రైతా, ఆలూ కుర్మా, పన్నెండు కొట్టేటప్పటికి టేబుల్ పైన రెడీ అయ్యాయి. పిల్లలిద్దరూ ‘హే!’ అంటూ వచ్చి వాళ్ళమ్మ నడుము చుట్టేసి ‘థాంక్యూ అమ్మా! లవ్ యూ అమ్మా!’ అంటూ తమ ఆనందాన్ని ప్రకటించారు. అతడు బిరియాని బావుందని చెపుదామని విరమించుకున్నాడు. ఒక మాటకి నాలుగు మాటలు వినాల్సివస్తుందని భయం.

కనీసం పిల్లలకైనా పనులు అలవాటు చేద్దామని నిన్న పిల్లాడిని ఆరిన బట్టలు మడతపెట్టమన్నాడు. కస్సూబుస్సూమంటూ పావుగంట పని గంటసేపు చేశాడు వాడు. పిల్లదాన్ని సింకులో వున్న నాలుగు పింగాణి ప్లేట్లు కడగమంటే, ఎవరో కొట్టినట్లే వెక్కివెక్కి ఏడుస్తూ కడిగింది. వాళ్ళమ్మే ‘చిన్నవాళ్ళకి ఇంత పెద్ద పనులేమిటీ’ అంటూ జాలిగా దగ్గరకు తీసుకుంది.


లంచ్ అయ్యాకా కాస్సేపు హాల్లో పచార్లు చేసి-చేస్తూ-గోడకి వున్న అద్దంలో చూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటే తల చుట్టూ జిల్లేడు తీగలు అల్లుకుపోయి, బ్రహ్మజెముడు పొదలు పెరిగిపోయి, శరీరంకన్నా తల నాలుగు రెట్లు బరువుందనిపిస్తోంది. తనకు తానే జుట్టు కట్ చేసుకుందామనుకుని విరమించుకున్నాడు. ప్రయోగాలు విఫలమై అప్పటికే వాళ్ళ వీధిలో మూడు పెద్ద గుండ్లూ నాలుగు చిన్న గుండ్లూ వెలిశాయి.

ఒకటికి రెండుసార్లు తల విదిల్చి, కళ్ళు మూసుకుని, తెరచి, మళ్ళీ మూసుకుని మళ్ళీ తెరచి అద్దంలో చూసుకుంటే, అస్తవ్యస్తంగా పెరిగిన తెలుపు నలుపుల కేశమిశ్రమం వెక్కిరించింది. అప్రయత్నంగా పెదవులు ముందుకి సాగి ప్చ్! అంటూ శబ్ధం బయటకి వచ్చింది. వెనుక కిసుక్కుమంటూ నవ్వు వినిపించింది. తిరిగి చూస్తే చెల్లి సైలెంటుగా అన్నకేసి వేలు చూపించింది. వాడు నేను కాదన్నట్లుగా తల అడ్డంగా వూపాడు. అసలు అదే సమయానికి ఆమె కిచెన్లోకి వెళ్ళింది. ఆమెగాని నవ్విందా?

ఆ ఇంట్లో తనకే ఎలాంటి విలువా లేదనిపించిందతడికి. జుట్టు చిందరవందరగా పెరిగిపోయి, చిటపటలాడే మొహం వేసుకుని నిత్యం నలిగిపోయిన లాల్చీపైజామాలలో వున్నా పట్టించుకునేవాళ్ళు లేరనుకుంటే ఉక్రోషం వచ్చింది. వాళ్ళిద్దరూ వాదనలోకి దిగితే అదేం విచిత్రమో పిల్లలిద్దరూ ఆమె పక్షమే అవుతారు. ఎంత అన్యాయం?!

పిల్లలు కూడా విసిగిపోయివున్నారు. బయటకి వెళ్ళడానికే లేదాయే! వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ అతడు తప్పించుకుంటున్నాడు. కానీ ఆమెకి తప్పదు. వెనుకపడి విసిగిస్తారు. చీటికిమాటికి చిరుతిండ్లు కావాలంటారు. అసలు తినాల్సినవి తినరు. దానితో ఆమె సణుగుడు మరింత పెరుగుతుంది.

ఇక సాయంత్రంవరకూ సమయం గడవడం మరీ కష్టం. ఇంటికి తనవంతు సహాయంగా కిటికీలు దులిపాడు. అల్మారాలు సర్దాడు. మరో మూడు గంటలు గడిచి, కాసేపు పేపర్ చదివి, మరికాసేపు టి.వి. చూస్తుంటే వినవచ్చిన వార్త, ఆ రోజు ఉదయంనుండే అత్యవసరమైన షాపులన్నీ తెరిచారని. ఎందుకైనా మంచిదని ఓ సారి ఫోనుచేసి తేల్చుకుని, బట్టలు మార్చుకుని, చెవుల మీదుగా చుట్టి మాస్క్ కట్టుకుని ఉత్సాహంగా బయలుదేరాడు. గదిలోకి తొంగిచూస్తే ఆమె మంచి నిద్రలోవుంది. బయటకి రాగానే అతడికి ఓ! అంటూ గట్టిగా అరవలనిపించింది.


సెలూన్ నుండి బయటపడ్డాడు. కటింగుతోపాటు మసాజ్ కూడా అయిందేమో తలంతా తేలికై-వీస్తున్న గాలికి, సాయంత్రపు నీరెండకి-కళ్ళు మూతలుపడిపోతూ గొప్ప సౌఖ్యంగా వుంది. సెలూనులో విన్నపాట ‘యే షామ్ ఢల్‌ తో లే జరా యే దిల్ సంభల్ తో లే జరా!’ అంటూ మనసుని ఉల్లాసపరుస్తూ అతడి వెంటే వచ్చింది.

ఇంటి దగ్గర పార్కులో వీధిలోని పదిమంది పిల్లల్ని దూరం దూరంగా కూర్చోపెట్టి కళ్యాణి టీచర్ సంగీతం నేర్పిస్తోంది. ఆ తరువాతి ఆర్ట్ క్లాస్ కోసం ఆమె భర్త ఇంటి నుండి బోర్డ్ మోసుకొస్తున్నాడు. పిల్లలిద్దరితో పాటు మిగిలిన పిల్లలు, టీచరు, ఆమె భర్త ఆగి చూస్తున్న అతడిని చేతులూపుతూ పలకరించారు.

ఇంట్లో ఆమె సాయంత్రం వంటకి రెడీ అవుతోంది. అతడు తలస్నానం చేసి, బట్టలు వేసుకుని అదే పాట కూనిరాగం తీస్తూ వచ్చేటప్పటికి ఆమె తిరిగి తన మాటలు ఆయుధాలుగా చేసుకుని ఎదురుపడింది. ఒకప్పుడు అతడు క్రాఫ్ చేయించుకుని వచ్చిన రోజున ఆమె అల్లరిగా నవ్వేది. నిక్కబొడుచుకుని కనిపించే చెవులు చూసి ఆట పట్టించేది. ఇప్పుడో? అలసిపోయిన మొహం, నిస్సహాయంగా చూసే ఆ కళ్ళు. అతడి మనసు కరిగిపోయింది. మాటలతో అనునయించలేడు… పనులకా అందిరాడు… మరింక చేతల్లోనయినా తెలియజెయ్యకపోతే ఇంకెందుకు? గుండె పలికే ఊసులని ఆమె గుండెకి చేరవెయ్యలేకపోతే మరింకెందుకు?

నడుం చుట్టూ ఒడిసిపట్టి దగ్గరికి లాక్కుని ‘ఉష్! ఊరుకో!’ అన్నాడు. ఇంకా ఏదో చెప్పబోతున్న ఆమెని ఈసారి పెదవులతో వారించాడు. అదాటున లాగడంతో పడిపోకుండా ఆధారం కోసం అతడి మెడ చుట్టూ బిగుసుకున్నాయి ఆమె చేతులు. గాఢంగా హత్తుకున్న వాళ్ళ మధ్య నుండి నెట్టివెయ్యబడ్డ గాలి ఎవరు ఎవరిని కౌగిలించుకున్నారో తెలియక తికమక పడి ఇద్దరి చుట్టూ కలయతిరిగింది.

కాలం ఆగిపోలేదు. వాళ్ళమానాన వాళ్ళని వదిలేసి, నాతో నీకేంటి పోటీ అంటూ లాక్‌డౌన్ అంతు తేల్చడానికి వేగంగా కదిలిపోసాగింది.