విశ్వ మహిళా నవల: 1అ. గెన్జి గాథ

(మొదటి భాగం)

గెన్జి గాథలో ఏముంది?

జపనీసు భాషలో గాథను మొనొతరి అంటారు అని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ నవల పేరు జపనీసులో గెన్జి మొనొతరి. గెన్జి గాథకు ముందు వచ్చిన గాథలన్నీ అభూతకల్పనలు, మాయలు, మంత్రాలు ఉన్నవే. గాథ అని అంటూనే వాస్తవికంగా, సామాజిక దృష్టితో, మానవసంబంధాల చిత్రణే ప్రధానంగా చేసిన రచనల్లో ఇదే మొదటిది. జపనీసు గాథను ‘ఆధునికం’ చేసినందుకు ఆనాటి పాఠకులు మూరాసాకి ప్రతిభకు ముగ్ధులైపోయారు. ఆమె రాజాస్థానంలో ఉన్నపుడు పదేళ్ళపాటు 1100 పుటలు, 54 అధ్యాయాలతో, మూడు సంపుటాలుగా ఈ రచన చేసింది. ఆమెకు కాగితం, సిరా, ఆస్థానంలో మిత్రుడైన మిచినగ సమకూర్చేవాడు. అప్పటికి ఒక సంపూర్ణ గద్యరచన చేసేంత సామర్ధ్యం జపనీసు భాషకూ, లిపికీ లేకపోవడంతో అక్కడక్కడా ఈ నవలలో చైనీసు లిపి కలగలిసి ఉంటుంది. కానీ చైనీయ సాహిత్యగ్రంథాల ప్రభావం ఏ మాత్రం లేకుండా, పూర్తిగా జపనీసు భాషలోనే, వారి అభివ్యక్తి రూపాల్లోనే మూరాసాకి రచన సాగింది.

ది టేల్ ఆఫ్ గెన్జి కథాస్థలి ఈనాడు జపాను సాంస్కృతిక రాజధానిగా పరిగణించే క్యోటో నగరం. 11వ శతాబ్ది నుంచి వివిధ రాజవంశాలు ఈ ప్రాంతం రాజధానిగా దాదాపు 19వ శతాబ్ది వరకూ పరిపాలించాయి. అలాంటి ఒక రాజవంశం నేపథ్యంలో, రాజభవనంలో జరిగిన కథ ఇది. అంతమాత్రాన ఇది రాజులు, మంత్రులు, రాజకీయాలు, యుద్ధాల గురించిన రచన కాదు. ఆ రాజభవనం కేంద్రంగా స్త్రీపురుష సంబంధాలు, తండ్రీకొడుకుల సంబంధాలు, స్నేహసంబంధాలను చర్చించిన నవల. మానవసంబంధాల్లో ఉన్న లోతుల్ని, రాజకీయాల్ని కూడా వ్యాఖ్యానించిన నవల. రాజ్యవ్యవస్థలో వివాహాల వెనక ఉన్న రాజకీయాలు, రహస్యాలు, కుతంత్రాలు చిత్రించిన నవల. ముఖ్యంగా ఒక అందమైన, ప్రతిభావంతుడైన ఉన్నతవంశీయుడి ప్రణయగాథల సమాహారం ఈ నవల.

ఎన్నో పాత్రలు, మరెన్నో సంఘటనలు, కథనాలు ఉన్న ఈ నవలను సంపూర్ణంగా పరిచయం చేయడం కష్టం. అందులోనూ నవలలో ఇంకా 13 అధ్యాయాలుండగా కథానాయకుడు గెన్జి మరణిస్తాడు. ఆ తర్వాత అతని జీవితంలో పాత్ర వహించిన కొందరి కథనాలు కొనసాగుతాయి. వాటిని పరిహరిస్తూ ప్రధాన కథను స్థూలంగా పరిచయం చేస్తాను.

చక్రవర్తికి వంశోద్ధారకుడిని ఇవ్వగలిగిన ఆడపిల్లను ప్రసాదించడం ఆ రాజ్యంలో రాజవంశీకులు, సంపన్నులందరి ఏకైక లక్ష్యం. అలా రాజకీయకారణాలవల్ల జరిగే పెళ్ళిళ్ళు కాక, చక్రవర్తి మోజుపడి, ఇష్టపడి చేసుకునే పెళ్ళిళ్ళు మరికొన్ని. ఈ పోటీల కారణంగానే చక్రవర్తికి ఎందరో భార్యలు, ప్రియురాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళలో స్థాయీ భేదాలుండేవి. అతని వంశంతో సరిసమానమైన వంశానికి చెందిన భార్య అయితే ఆమె సహధర్మచారిణి (కన్సార్ట్); అంతకంటే తక్కువ సామాజిక స్థాయికి చెందిన భార్య ఇష్టసఖి (ఇంటిమేట్). ఈ సహధర్మచారిణుల్లో కూడా ‘మహారాణి’ పదవి సహజంగా ఒకరికే దక్కేది. ఇష్టసఖులకు అలాంటి ఆశలు, రాజకీయమైన మద్దతు శూన్యం. అటువంటి ఒక ఇష్టసఖి కుమారుడు హికరు. (గెన్జి పేరు అతనికి తర్వాత ప్రసాదింపబడుతుంది). చక్రవర్తికి ఎందరు ఇష్టసఖులున్నా, కిరిత్సుబొ కుటుంబానికి చెందిన స్త్రీ అయిన గెన్జి తల్లి అంటేనే ఎక్కువ ప్రేమ. మహారాణిని, ఇతర ఇష్టసఖులనూ నిర్లక్ష్యం చేసేంత ప్రేమ. ఆమె గదికి అతను వెళ్ళకుండా ఆపాలని ఇతర భార్యలు మధ్యలో గోడలు, తలుపులు కట్టిస్తే, ఆమె కోసం ఒక భవనాన్నే కట్టించి ఇస్తాడు చక్రవర్తి. కథానాయకుడు గెన్జికి మూడేళ్ళ వయసులో తల్లి చనిపోతుంది. అటు చక్రవర్తిని, అతన్ని కూడా ఆమె నీడ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.

చక్రవర్తి యౌవరాజ్య పట్టాభిషేకం చెయ్యాల్సిన రోజు వస్తుంది. అతనికి మహారాణి ద్వారా జన్మించిన కొడుకును యువరాజుగా ప్రకటించాల్సివుంది. అతనికేమో తన ఇష్టసఖి కుమారుడు, ఎంతో అందగాడు, అంతఃపురంలో అందరికీ ప్రియమైనవాడు అయిన హికరును యువరాజుగా ప్రకటించాలని ఉంటుంది. కానీ అది రాజ్యాంగ విరుద్ధం కనక ఆ పని చేయలేకపోతాడు. అందువల్ల అతనికి ‘గెన్జి’ అనే బిరుదు ఇచ్చి, అటు రాజరిక హోదాను కలిగివుంటూ ఇటు సామాన్య జనంలో తనకు ఇష్టమైన రీతిగా జీవించగల స్వేచ్ఛను కల్పిస్తూ ఆదేశం జారీ చేస్తాడు. అందువల్ల గెన్జి రెండు వ్యవస్థల్లోనూ ఇమిడి, తనకు నచ్చిన పనులు చేస్తూ, నచ్చిన సంబంధాలను పోషించుకుంటూ ఆనందంగా ఉంటాడు. గెన్జికి 12వ యేటే అఒయి అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. కానీ ఇద్దరూ చిన్నవాళ్ళు కనక, ఆ అమ్మాయి వెంటనే కాపురానికి రాదు. అటు చక్రవర్తి తన ఇష్టసఖి, అంటే గెన్జి తల్లి మరణంతో నిరంతరం విచారంలో ఉంటాడు. చివరివరకూ చక్రవర్తి ప్రేమను పూర్తిగా పొందింది గెన్జి తల్లి మాత్రమే. చక్రవర్తిని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు, మంత్రులు కలిసి గెన్జి తల్లి బంధువర్గంలో ఆమె రూపురేఖలతో ఉన్న ఒక యువతికి చక్రవర్తితో వివాహం జరిపిస్తారు. ఆమెను చూడగానే చక్రవర్తికే కాదు; గెన్జికి కూడా విపరీతమైన ఆకర్షణ కలుగుతుంది. కానీ అప్పటికే తనకు కూడ వివాహం జరిగింది. తర్వాత అయిదేళ్ళు ఏ సంఘటనా లేకుండా గడిచిపోతాయి.

పదిహేడు సంవత్సరాలు నిండిన తర్వాత గెన్జి ప్రణయగాథలు ప్రారంభమౌతాయి. తండ్రికంటే చాలా చిన్నదైన సవతి తల్లి ఫుజిత్సుబొ పట్ల అప్పటికే చాలా యేళ్ళుగా అతనికి ఆకర్షణ ఉంది. వీళ్ళిద్దరూ దాదాపు సమానవయస్కులు. గెన్జి సౌందర్యం చూసి రాజభవనవాసులు అతన్ని ‘తేజస్వి’ అని సూర్యుడు గుర్తుకు వచ్చేలా పిలుస్తూంటారు. అలాగే సవతితల్లి ఫుజిత్సుబొ వెలుగులీనే ముఖం చూసి ఆమెను సూర్యకుమారి అంటారు. వారిద్దరి మధ్య జరిగిన ప్రేమాయణం వాళ్ళకు మాత్రమే తెలుసు. గెన్జి జీవితంలో తొలి లోతైన ప్రేమకథ సవతితల్లితో ఉన్నదే. వీరిద్దరికీ ఒక కుమారుడు జన్మిస్తాడు. అయితే అతను గెన్జి కుమారుడని బయటివాళ్ళకు తెలీదు. అతను చక్రవర్తి కుమారుడిగానే చలామణీ అవుతాడు. చక్రవర్తి అనంతరం మహారాజు కూడా అవుతాడు.

గెన్జి జీవితంలో రెండో ప్రేమానుబంధం, చిరకాలం నిలిచిన బంధం ఫుజిత్సిబొ మేనకోడలు మూరాసాకితో ఏర్పడుతుంది. ఆమె అత్తలాగే చాలా అందగత్తె. ఆ అమ్మాయి బౌద్ధ సన్యాసిని అయిన అమ్మమ్మ వద్ద పెరుగుతూంటుంది. బౌద్ధ సన్యాసిని వద్ద పదేళ్ళ మూరాసాకిని చూసి, మోహంలో పడిపోయిన గెన్జి ఆ పాపను తనకు ఇచ్చేయమని, తన ఇంట్లో పెంచుకుంటాననీ అడిగితే ఆమె నిరాకరిస్తుంది. కానీ గెన్జి ఆ పదేళ్ళ అమ్మాయిని దొంగతనంగా తీసుకువచ్చి, ప్రేమతో పెంచి పెద్దచేసి యుక్తవయస్సు వచ్చాక పెళ్ళి చేసుకుంటాడు. గెన్జి నిజంగా తన జీవితంలో త్రికరణశుద్ధిగా ప్రేమించేది మూరాసాకినే. కానీ అప్పటికే పెద్దలు చేసిన పెళ్ళి వల్ల అఒయి భార్యగా ఉంది. కాపురానికి కూడా వచ్చింది. ఆ తర్వాత అతనికి గాఢమైన ప్రేమ కలిగింది ఆకాషీ అనే యువతితో. ఈ నలుగురు స్త్రీలు కాక మరెందరో స్త్రీలతో అతనికి పరిచయాలూ ప్రణయాలూ ఉంటాయి. వీటిలో విరహాలు, వియోగాలు, అపార్థాలూ, తిరస్కారాలూ వంటి అన్ని అనుభవాలూ అతని జీవితాన్ని మధురమైన బాధగా మారుస్తాయి.

అసాధారణమైన సౌందర్యం, కావలసినంత స్వేచ్ఛ, సమాజంలో రాజవంశీకుడిగా పరపతి, సంగీత సాహిత్య చిత్రకళాది అనేక కళల్లో ప్రవేశం, మంచి మనసు, మధురమైన మాట, అపరిమితమైన సంపద – ఇవన్నీ పోతపోసిన అరుదైన విగ్రహం గెన్జి. అతను పుట్టినప్పటి నుంచే ఆ సౌందర్యానికీ, పెరిగే కొద్దీ ఆ సౌశీల్యానికీ అందరూ ముగ్ధులవుతూంటారు. ఇంత మంచివాడూ అంతమంది ఆడపిల్లలతో ఎందుకు సంబంధాలు పెట్టుకున్నాడన్నది ఈనాడు ప్రశ్నార్థకంగానే ఉంటుంది కానీ ఆ రోజుల్లో అది అతిసహజంగా కనిపించేది కాబోలు. సమకాలీనులలో ఎవరూ గెన్జిని విమర్శించరు. తోటి పురుషులు కూడ ఇదే విధమైన జీవితాలు గడుపుతూంటారు కనక గెన్జిని స్త్రీలు తమంతటతాము ఇష్టపడ్డం పట్ల అసూయ చెందుతారు; అభినందిస్తారు తప్ప ఆనాటి సమాజం దాన్ని తప్పుగా భావించేది కాదు.

అయితే ఆధునిక విమర్శకులు కొందరు అతన్ని పతితుడిగాను, విలాసపురుషుడిగాను, వంచకుడిగానూ పేర్కొన్న సందర్భాలున్నాయి. రచయిత్రి మాత్రం గెన్జిని మంచి ప్రేమికుడిగానే వర్ణిస్తుంది. రెండో అధ్యాయంలో అతని స్నేహబృందం, వారి సంభాషణలు ఒకరకంగా అతని వ్యక్తిత్వానికి పునాది వేసివుండవచ్చుననిపిస్తుంది. అతనికంటె వయసులో పెద్దవాళ్ళు, ‘అనుభవజ్ఞులు’ అయిన ముగ్గురు తమ ప్రేమకలాపాల గురించి కథలు కథలుగా చెప్తారు. అప్పటికి అతను ఎక్కువగా శ్రోతే. కానీ వారిని శ్రద్ధగా వింటాడు. తన అభిప్రాయాలు కూడ వ్యక్తం చేస్తాడు. క్రమంగా అతని జీవన సరళి కూడా వాళ్ళని అనుకరిస్తుంది. క్రమక్రమంగా రాజకీయంగా కూడా అతనికి గుర్తింపు లభించడం, పరపతి విస్తృతం కావడంతో అతని శృంగారలీలలు కూడ పెరుగుతాయి. అయితే తన కుటుంబానికి రాజకీయ శత్రువైన వ్యక్తి కూతురితో ప్రేమకలాపాలు మొదలుపెట్టడం అతన్ని కష్టాలలోకి నెడుతుంది. ఆ అమ్మాయి అక్క రాజభవనంలోనూ, సమాజంలోనూ శక్తిమంతురాలు; శత్రువులను ఢీకొనడంలో ఎలాంటి చర్యకైనా వెనుదీయదని పేరు పొందిన మహిళ. ఆమెకు తన చెల్లెలు తన శత్రువు వల్లో పడిందని తెలియగానే అతన్ని ముప్పుతిప్పలూ పెడుతుంది. చివరకు తన ప్రాణరక్షణ కోసం అతను దేశం వదిలి వెళ్తాడు. భార్య అఒయిని, ఇష్టసఖి మూరాసాకిని వదిలి సూమా అనే ప్రాంతానికి వెళ్తాడు.

అప్పటికే అతనికి భార్యతో ఒక కొడుకు ఉన్నాడు. సవతితల్లి ద్వారా ఒక కొడుకున్నాడు. కానీ వారందరి వియోగం కంటే మూరాసాకి వియోగాన్ని భరించలేకపోతాడు. ఆ విషాదంలో తిరుగుతూ, తుఫానులో చిక్కుకుని ఎలాగో ప్రాణాలు దక్కించుకుంటాడు. అక్కడ అతన్ని రక్షించి తిరిగి నగరానికి ఒక స్త్రీ తీసుకు వస్తుంది. ఆమె కూతురు ఆకాషీ. ఈ యువతి కూడా గెన్జి ప్రియురాలే. ఆమెకు గెన్జికి ఒక కూతురు పుడుతుంది. అప్పటికే ప్రసవం తర్వాత అనారోగ్యం పాలైన అఒయి కొంతకాలానికి జబ్బుచేసి చనిపోతుంది. అప్పటికి గెన్జికి ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. సవతితల్లి ద్వారా పుట్టిన అతని పేరు రైజి. తర్వాతి కాలంలో రైజి మహారాజవుతాడు. అతని సుదీర్ఘపాలన అనంతరం ఇప్పుడు పుట్టిన ఆకాషీ కూతురు మహారాణి అవుతుంది. రైజికి తండ్రిగా అప్పటి చక్రవర్తే చలామణి అవుతున్నాడు కనక, ఆ పిల్లవాడు గెన్జికీ మహారాణికీ పుట్టినవాడన్నది రహస్యం కనక, తను రాజుగారి తండ్రి అయినా ఆ విషయం గెన్జి బయటకు చెప్పుకోలేడు. కానీ ఈ అమ్మాయి గెన్జి కూతురుగానే పెరుగుతుంది. ఆమెకు పుట్టిన కొడుకే రైజి అనంతరం రాజవుతాడు. అప్పుడు గెన్జికి మహారాజుకి మాతామహుడైన హోదా దక్కుతుంది. ఇదంతా తర్వాత జరిగే కథ. ఈలోగా కూడ గెన్జి జీవితంలో ఎన్నో స్త్రీసంబంధమైన ఆటుపోట్లు వచ్చిపోతాయి.

ప్రవాసం నుంచి దేశానికి తిరిగి వచ్చిన తర్వాత గెన్జికి చక్రవర్తి మరిన్ని రాజపదవులతో మరింత సంపద సమకూరుస్తాడు. నాలుగు భవనాలు, నలుగురు భార్యలతో, అపరిమితమైన భోగభాగ్యాలతో తులతూగుతాడు గెన్జి. అప్పటి రాజు గెన్జిని గౌరవ చక్రవర్తిగా (ఆనరరీ ఎంపరర్) నియమిస్తాడు. అంటే గెన్జి జీవితం పరిపూర్ణ వికాసదశ చేరుకుంటుంది. కానీ అతనికి అత్యంత ప్రియమైన మూరాసాకి అనారోగ్యం పాలవుతుంది. ఇది అతన్ని నిత్యం కలచివేసే విషయం. ఈలోగా, అంతకు పూర్వం గెన్జి దేశబహిష్కరణకు పరోక్షంగా కారకుడైన అతని సవతి తమ్ముడు సుజకు పశ్చాత్తాపంతో గెన్జిని పిలిపిస్తాడు. తను అతని పట్ల అన్యాయంగా వ్యవహరించానని, ప్రాయశ్చిత్తంగా తన కూతురు ‘మూడో రాకుమారిని’ (ఆమె పేరు కథలో రాదు) భార్యగా స్వీకరించమని కోరతాడు. గెన్జికి నిజానికి మూరాసాకిపై ఉన్న ప్రేమ మరెవ్వరి మీదా లేదు. కానీ ఆమె రాజవంశానికి చెందదు కనక ఎప్పటికీ ఇష్టసఖి అవుతుందే కానీ సహధర్మచారిణి కాజాలదు. తన తొలి సహధర్మచారిణి అఒయి ఎప్పుడో మరణించింది. అందువల్ల తనకంటే వయస్సులో ఎంతో చిన్నదైన అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. కానీ రాజవంశానికి చెందిందన్న ఒక్క విషయం మినహా ఆమెలో గెన్జికి నచ్చిన గుణం ఒక్కటి కూడా ఉండదు. తను పొరపాటు చేశాడని గ్రహించి ఆమెను వదిలేసి, మూరాసాకి దగ్గరే ఉండిపోతాడు. ఆమెకు అనారోగ్యంలో సపర్యలు చేస్తూ మరో భార్య వైపుకు కూడా వెళ్ళడు. ఈలోగా ఈ మూడో రాకుమారిని పెళ్ళాడాలని విఫలయత్నం చేసిన ఒకతను, గెన్జి ఆమె పట్ల విముఖుడిగా ఉన్న విషయం తెలుసుకుని ఆమెకు దగ్గరవుతాడు. ఆమె గర్భవతి అవుతుంది. గెన్జికి ఈ విషయం తెలిసి ఉగ్రుడౌతాడు. అప్పుడు ఆమెకు పుట్టిన కుమారుడిని లోకం మాత్రం గెన్జి కొడుకు అనే భావిస్తుంది. గెన్జి భార్యను ప్రేమించిన వ్యక్తి తను గెన్జికి చేసిన అపకారానికి పశ్చాత్తాపంతో దూరంగా వెళ్ళిపోయి కొంతకాలానికి మరణిస్తాడు. తన జీవితంలో జరిగిన సంఘటనలు తట్టుకోలేని మూడో రాకుమారి సన్యాసం స్వీకరిస్తుంది. అనారోగ్యంగా ఉన్న మూరాసాకి మరి కొంత కాలానికి తన నలభయ్యో పడిలో మరణిస్తుంది. అప్పటికి గెన్జికి యాభై యేళ్ళు దాటాయి. మూరాసాకి మరణం అతనిని తీవ్రంగా కృంగదీస్తుంది. నవల 41వ అధ్యాయంలో అతను రాజ్యం వదిలి ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళిపోతాడు. రెండేళ్ళ తర్వాత అక్కడే మరణిస్తాడు.

కథానాయకుడు మరణించాక కూడా మరో 13 అధ్యాయాల కథ ఉంది. ఈ కథలో గెన్జి మనమడు నియు, గెన్జి కొడుకుగా ప్రపంచం భావించే మూడో రాకుమారి కొడుకు కఉరు ప్రధాన పాత్రలు. గెన్జి చనిపోయిన ఎనిమిదేళ్ళ తర్వాతి కథ ఇది. ఇందులో కూడ ప్రణయమే ప్రధానం. రాజకీయంగా జరిగే కొన్ని మార్పులు, ఈ ఇద్దరు మిత్రుల మధ్య స్త్రీల విషయంలో కలిగే అపార్థాలు వంటి సంఘటనలతో ఈ భాగం నిండివుంటుంది. నవలాంతానికి కఉరు తను ప్రేమించిన అమ్మాయి, మరణించిందని తను భావిస్తున్న అమ్మాయి నియు సంరక్షణలో బతికే వుందా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతూండగా కథ ముగుస్తుంది. గెన్జి మనమడైన నియు కూడ తాతగారిలాగే స్త్రీలను విపరీతంగా ఆకర్షించాడని, అతని జీవితం కూడ గెన్జి జీవితంలాగానే కొనసాగిందనీ అనుకోవడానికి వీలుంది. అంటే ఆనాటి రాజవ్యవస్థకు సహజమైన, గెన్జిలో అణువణువూ మూర్తీభవించిన ఒక సుఖలాలస జీవితం ఆనాటి రాజవంశపురుషుల్లో కొనసాగిందన్న సూచనతో నవల ముగుస్తుంది.

ఈ నవలలో పరిశీలించదగ్గ విషయాలు

1. పితృస్వామ్య వ్యవస్థ

గెన్జి గాథ నవలలోని ప్రత్యేకత పాత్ర చిత్రణలో, సంభాషణల్లో, ఆనాటి రాజ్యవ్యవస్థ చిత్రణలో ఉంది. నాటి రాజ్యవ్యవస్థలో బహుభార్యాత్వం అత్యధికం. భార్యల్లో హోదాలు, స్థాయీభేదాలు ఉండేవి. సంతానానికి తండ్రి సామాజిక స్థాయే ప్రమాణం. అందుకే తల్లి రాజవంశీకురాలైనా తండ్రి సామాన్యుడైతే ఆమె కుమారుడికి రాజ్యార్హత ఉండేది కాదు. అంటే పితృస్వామ్య వ్యవస్థ స్వభావం అన్ని విషయాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీలు వ్యవహారభాష అయిన జపనీస్ మాత్రమే నేర్చుకోవాలి, పండితభాష అయిన చైనీసు నేర్చుకోకూడదన్న నియమం, భర్త ఎన్ని వివాహాలు చేసుకున్నా భార్య ఆమోదించాలన్న సంప్రదాయం, భర్త పదిమందితో పదిమంది పిల్లల్ని కన్నా తప్పులేదు కానీ భార్య వివాహేతర సంబంధంలో బిడ్డని కనడం క్షమించరాని నేరమన్న భావన, దొంగచాటు ప్రణయాలు, సంతానాలు–ఇవన్నీ కూడ సామాజిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పురుషాధిక్యతను ఆమోదించాయని స్పష్టంచేస్తాయి.

సమాజంలో పురుషులతో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే స్త్రీల వర్గీకరణ కనిపించడం అన్ని దేశాల సంస్కృతిలోనూ అనాదిగా ఉన్న విషయమే. 11వ శతాబ్ది జపాన్‌లో స్త్రీల వర్గీకరణ దీనికి మినహాయింపు కాదు.

  1. రాజవంశీకులైన స్త్రీలు (వివాహానంతరం వీరిని సహధర్మచారిణులు అంటారు. వీరి సంతానం రాజార్హత పొందుతుంది)
  2. ఇష్టసఖులు (సామాన్య ప్రజానీకం, ప్రభుత్వోద్యోగుల సంతానం, చక్రవర్తులకు ఇతర రాజవంశజులకు ప్రియురాళ్ళు – వీరి సంతానానికి రాజ్యవారసత్వం లభించదు)
  3. కళావంతులు (వివిధ కళల్లో నిష్ణాతులు)
  4. బౌద్ధ సన్యాసినులు

అన్నిరకాల స్త్రీలకూ సామాన్య లక్షణం ఒకటుంది – వివిధ కళల్లో ప్రావీణ్యం. ముఖ్యంగా చిత్రకళ, కవిత్వం ఆనాటి స్త్రీలకు అందుబాటులో ఉన్న కళలు, వారికి గుర్తింపు తెచ్చిపెట్టిన కళలు. ఒక్క కళావంతులు మాత్రం సంగీత, నృత్యాల్లోనూ నిష్ణాతులు. ఈ కళావంతులనే హేయ్‌ఆన్‌ వంశరాజుల కాలంలో షిరబ్యోషి అనేవారు. వీరు రాజాస్థానాలలోను, సంపన్నుల వేడుకల్లోనూ ఆటపాటలతో అలరించేవారు. ఒక రకంగా వీరు ప్రస్తుతం అందరికీ సుపరిచితమైన గీషాలకు పూర్వరూపమని చెప్పవచ్చు. 18వ శతాబ్దినాటికి గీషాలనే పేరు స్థిరపడి, వీరికి విడిగా ఒక సంస్కృతి వంటిది, ప్రత్యేక ఆవాసం ఏర్పడ్డాయి. షిరబ్యోషీలు సంగీత నృత్యాలలో ఆరి తేరడమే కాదు. స్త్రీలు పురుషుల వేషాలు ధరించి అభినయం కూడా చేసేవారు. మన కూచిపూడిలో పురుషులు స్త్రీల వేషాలు ధరించడానికి చాలా యేళ్ళకు పూర్వమే జపానులో స్త్రీలు పురుష పాత్రలు దాల్చి అభినయించడం ఆసక్తికలిగించే విషయం.

ఈ నవలను బట్టి చూస్తే సామాజిక వ్యవస్థలో తమ స్థానాన్ని ఆమోదించి, దాని ఫలితాలను స్వీకరించిన స్త్రీలే ఎక్కువ. దాన్ని ధిక్కరించినవారు లేకపోలేదు. అలా ధిక్కరించినందుకు వారు సమస్యలు, శిక్షలు ఎదుర్కొన్నారా లేదా అన్నది నవలలో ప్రత్యేకంగా చర్చించినట్టు కనిపించదు.

పురుషుల పాత్రల్లో ఇంత వైవిధ్యం కనిపించదు. సమాజంలో కూడా బహుశా రాజవంశీకులు, సామాన్యులు అన్న విభజనే పురుషులకు వర్తించేదేమో. ఈ నవలలో సామాన్య పురుషులు ఎక్కువగా కనిపించరు. పురుషాధిక్యత దాదాపు అన్ని సంభాషణల్లోనూ, వ్యవహార సరళిలోనూ కనిపిస్తుంది. స్త్రీల గురించిన చర్చల్లో పురుషులు తమ ‘ఘన విజయాలను’ చెప్పుకోవడం పరిపాటి. పిల్లల విషయంలో, భార్య పుట్టింట్లో ఉండాలా, అత్తగారింట్లో ఉండాలా అన్న విషయంలో ఎక్కువభాగం మగవాళ్ళ మాటలే చెల్లుతాయి. చాలాసార్లు వివాహమైన తర్వాత కూడ స్త్రీలు తండ్రిగారింట్లోనే ఉండిపోయారని, భర్త పిలిపిస్తేనే వెళ్తారనీ సూచన ఉంది.

2. మతం

ఆ రోజుల్లో బౌద్ధం జపానులో స్థిరపడింది. చైనాతో వ్యాపార, సాంస్కృతిక సంపర్కం వల్ల జపానులో క్రీ.శ. 6వ శతాబ్దిలోనే బౌద్ధమత ప్రభావం మొదలైంది. జపానులోకి చైనాలోని ఆరు రకాల బౌద్ధ సంప్రదాయాలూ ప్రవేశించాయి. ఈ నవలాకాలం, అంటే హేయ్‌ఆన్ వంశీయుల పరిపాలనాకాలం నాటికి బౌద్ధం కాక షింటో మతం కూడ ప్రచారంలో ఉండేది. షింటో మతం జపానుకే స్వంతం. అక్కడే పుట్టిన మతం. దాదాపు నాలుగో శతాబ్ది నుంచి స్థానిక ఆచార సంప్రదాయాలతో కూడిన ఈ మతం వ్యాప్తిలో ఉంది. బౌద్ధం వచ్చిన తర్వాత ఈ మతం పరపతి కొంత తగ్గింది. ఈ మతానికి ప్రత్యేకమైన సిద్ధాంతాలు, నైతిక నిబద్ధత, నిబంధనలు, నియమాలు లేవు. కానీ ఇందులో కర్మకాండలు, పండగలు, ఉత్సవాలు ఎక్కువ. అంటే భారతదేశంలో గ్రామదేవతల పూజలా ఇందులో కామీ అనే దేవతల సమూహాన్ని కొలవడం కనిపిస్తుంది. ఒకరకంగా షింటోను ఆధునికార్థంలో మతం అనేకంటే ఒక ఆచార విధానమని చెప్పడం సబబుగా ఉంటుంది. క్రైస్తవం, ఇస్లామ్‌లా దీనికి ఒక దేవుడు లేడు. హైందవంలా విగ్రహారాధన కలిగిన ముక్కోటి దేవతలూ లేరు. ప్రజలందరూ కలిసి తమకు కనిపించని, రూపురేఖలు లేని దేవతలను ఉద్దేశిస్తూ కొన్ని ప్రార్థనా విధానాలు అమలుచేస్తారు. ఇది క్రమంగా బలహీనపడి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపుగా జపాన్‌ నుంచి ఒక మతం రూపంలో నిష్క్రమించింది.

గెన్జి గాథలో బౌద్ధంతో పాటు, షింటో ప్రస్తావన కూడ వస్తుంది. బహుశా ఈ రెండిటిని కలగలిపే కాబోలు, గెన్జి ఒక చోట ‘కోరికను పరిహరించినపుడే జ్ఞానోదయం అవుతుంద’న్న బుద్ధుడి బోధనను నిరాకరిస్తూ ‘నిజానికి కోరికకూ, జ్ఞానానికీ ఎక్కువ తేడా లేదు, రెండిటి లక్ష్యం ఒక్కటే.’ అంటాడు. అప్పట్లో మతమే కాక, జ్యోతిషంపై కూడ నమ్మకం ఉండేదనడానికి కూడ దాఖలాలు కనిపిస్తాయి. ఎప్పుడో చిన్నప్పుడే గెన్జికి ఒక జ్యోతిష్కుడు ముగ్గురు సంతానం ఉంటారని, అందులో ఒకరు చక్రవర్తి, మరొకరు మహారాణికి తండ్రీ అవుతారనీ చెప్తాడు. అదంతా నిజమవుతుంది కనక గెన్జి ఆ జ్యోతిష్కుడిని తలుచుకుంటూ ఉంటాడు. మతాధికారులతో చర్చల సందర్భంలో షింటో మతానికి సంబంధించిన కొన్ని ప్రస్తావనలు వస్తాయి.

స్త్రీలు బౌద్ధసన్యాసినులుగా మారడానికి సమాజం నుంచి, కుటుంబం నుంచి ఎటువంటి అవరోధాలు ఉండేవి కావని కొన్ని సన్నివేశాల వల్ల తెలుస్తుంది. గెన్జి చివరి భార్య, వివాహేతర సంబంధం పెట్టుకున్నానన్న అపరాధభావంతో సన్యాసం స్వీకరించడం దీనికొక ఉదాహరణ. అంటే ఇష్టసఖులుగానో, సహధర్మచారిణులుగానో, వేశ్యలుగానో ఉండక తప్పని వ్యవస్థలో, తమకు ఇష్టమైతే బౌద్ధ సన్యాసినులుగా మారే అవకాశం, స్వేచ్ఛ ఆనాటి స్త్రీలకు ఉండేదేమో. గెన్జి భార్య వివాహేతర సంబంధం ద్వారా ‘నేరం’ చేసింది కనక, నిందలకు భయపడి గానీ, ప్రాయశ్చిత్తం కోసం గానీ సన్యాసిని కావడం తప్పలేకపోయుండాలి. అయితే చిన్నప్పుడు గెన్జిని పెంచిన ఆయా కూడా తర్వాతి కాలంలో బౌద్ధ సన్యాసిని అవుతుంది. గెన్జి ఎంతగానో ప్రేమించే మూరాసాకి అమ్మమ్మ కూడ బౌద్ధ సన్యాసినే. అంటే, సన్యాసినులు అయిన తర్వాత కూడ వారు సమాజానికి దూరంగా వెళ్ళేవాళ్ళు కాదు. కుటుంబ సభ్యులుగా కొనసాగేవాళ్ళు. పిల్లల ఆలనాపాలనా చూసేవాళ్ళు. ఇంటి బాధ్యతలను వదిలించుకునేవారు కాదని అర్థం అవుతుంది.

3. పాత్ర చిత్రణ

ఈ నవలలో నాయకుడున్నాడు గానీ నాయిక లేదు. నాయికలు అనేకం ఉన్నారు. నవలలో 40కి పైగానే పాత్రలున్నాయి. అందులో పాతిక వరకూ ప్రాముఖ్యం కలిగినవి. ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మూరాసాకి, ఫుజిత్సుబొ, ఆకాషీ. ఈ ముగ్గురిని గెన్జి వేర్వేరు దశల్లో ప్రేమిస్తాడు. అతనిలో ఆనందానికీ, మనోవ్యథకూ కూడ వీళ్ళు ముగ్గురూ ఎక్కువ కారకులౌతారు. కానీ గెన్జితో సంబంధం ఉన్న సందర్భంలో తప్ప, విడిగా వీరికి నవలలో అస్తిత్వం కనిపించదు.

ఒక రకంగా నవలలో ఎవరు ఎక్కువ భాగం ఆక్రమిస్తారు అనే దృష్టితో చూసినపుడు స్త్రీపాత్రలకే ఎక్కువ ప్రాముఖ్యం కనిపిస్తుంది. ప్రధాన కథలోని స్త్రీలు కాక, మరెందరో స్త్రీలు తమ అనుభవాలను పరస్పరం పంచుకోవడం నవలంతటా ఉంటుంది. ఈ సంభాషణల్లోనే నాటి సాంస్కృతిక విషయాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, జీవనవిధానం, స్త్రీపురుష సంబంధాల్లోని సంఘర్షణలు అన్నీ వ్యక్తమవుతాయి. దీనికి ముఖ్య కారణం అప్పటి మహారాణులు చదవడం వచ్చినా అది తమకు పరువుతక్కువగా భావించి సఖులచేత ‘చదివించుకునేవాళ్ళు’ కావడంతో చాలామంది దాసీల స్థాయిలో ఉన్న స్త్రీలు కథలు చదివేవాళ్ళు. లేదా చెప్పేవాళ్ళు. అందువల్లే ఈ నవలలో స్త్రీల సంభాషణలు అధికంగా ఉంటాయి. కానీ ప్రధాన కథ గెన్జి దృక్కోణం నుంచి సాగుతుంది. అతని జీవితంలో తటస్థపడిన స్త్రీలు అతని జీవితంలోనే కాక, నాటి రాజ్య వ్యవస్థలోనూ కీలకపాత్రలు నిర్వహిస్తారు. అందువల్ల ఇది నాయక ప్రధానమైన నవలే. గెన్జిలోని ప్రధాన లక్షణం స్త్రీలను అతను ఆకర్షించడం; స్త్రీలు అతన్ని ఆకర్షించడం–తన బాల్యంలోనే చనిపోయిన తల్లిని గెన్జి ఎప్పటికీ మరచిపోడు. ఇతరుల ద్వారా, ఆమె ఎలా ఉండేదో ఎలా మెలిగేదో తెలుసుకుంటాడు. ఆమెలా ఉన్న స్త్రీలందరూ అతనికి సన్నిహితులౌతారు. అందుకే బహుశా విమర్శకులందరూ ఇది తొలి మనోవైజ్ఞానిక నవల అన్నారు. గెన్జి పాత్రను ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఈడిపస్ కాంప్లెక్స్ దృష్ట్యా పరిశీలించడానికి అవకాశం ఉంది.

తల్లి భావన అతని ప్రణయసంబంధాల విజయానికే దోహదం చేసింది కానీ ఎక్కడా అతనికి ఈ విషయంలో పరాజయం ఉండదు. అసమాన సౌందర్యవంతుడు, ధనవంతుడు, పైపెచ్చు మంచి స్వభావం కలవాడు; మాటలో దయ, స్నేహం పొంగిపొర్లేవాడు. అతన్ని ఇష్టపడకుండా ఉండడానికి ఆడపిల్లలకు ఏ కారణమూ కనిపించదు. (తనలాంటి చాలామంది ప్రియురాళ్ళు అతనికి ఉన్నారన్న వాస్తవం మినహా.) అమ్మాయిలు చాలామంది అతన్ని ప్రేమిస్తారు కానీ అతని ప్రేమను పరిపూర్ణంగా పొందింది మూరాసాకి మాత్రమే. గెన్జి ఎక్కడా తన హోదాను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్త్రీలను వలలో వేసుకునే ప్రయత్నం చెయ్యడు. ఆ స్త్రీ కూడా తన పట్ల ఆకర్షింపబడినపుడు మాత్రం నిస్సంకోచంగా సంబంధం పెట్టుకుంటాడు. అలా శృంగారపురుషుడిగా, తుమ్మెదలాగా బతికిన అతను, మూరాసాకి అనారోగ్యం పాలైన తర్వాత తన శృంగార సంబంధాలకు స్వస్తి చెప్తాడు. సవతి తమ్ముడి కూతురిని రాజకీయ కారణాల వల్ల వివాహం చేసుకోవడం మినహా మరే స్త్రీ ముఖం చూడడు. పైగా మూరాసాకి చనిపోయేవరకూ ఆమెకు సపర్యలు చేస్తూ ఉండిపోతాడే తప్ప, రాజ్యం గురించి, తన భోగాల గురించి అసలు ఆలోచించడు. తన ప్రియురాలికే కాదు, చిన్నప్పుడు పెంచిన దాది మరణించినపుడు కూడ పనులన్ని వదులుకుని ఆమె అంత్యక్రియలు స్వయంగా జరిపిస్తాడు.

గెన్జి పోరాటయోధుడు కాడు. గొప్ప పరిపాలకుడూ కాడు. చిత్రకళలో, సంగీత, సాహిత్య నృత్యాలలో నిష్ణాతుడు. అన్నిటికీ మించి ప్రేమించడంలో సాటిలేనివాడు. ప్రేమను ఒక కళగా ఆరాధించి, అభ్యసించినవాడు. అతన్ని ఇప్పటి పరిభాషలో లవర్ బాయ్‌గా, కాసనోవాగా చెప్పవచ్చు. దీనితో పాటే మర్యాదగా మాట్లాడే సంస్కారం, ప్రేమించిన అమ్మాయిల పట్ల గౌరవం, పెద్దల పట్ల భక్తిశ్రద్ధలు, ప్రేమకోసం సాహసాలు చేయగలిగిన మొండితనం, సేవాదృక్పథం వంటి మంచి గుణాలున్నాయి. ఇలా నవలలో ప్రధాన పురుష పాత్ర ఉంది కానీ, కథానాయిక అని చెప్పగల స్త్రీ పాత్రలేదు. మూరాసాకి గెన్జికి అత్యంత ఇష్టురాలు కనక ఆమెను కథానాయిక అనవచ్చు కానీ ఆమె పాత్ర గెంజికి సంబంధించినంత మేరకే కనిపిస్తుంది. ఆ పరిధిలోనే పరిభ్రమిస్తూంటుంది.

గెన్జి పాత్ర చిత్రణలో రచయిత్రి శ్రద్ధ కనిపిస్తుంది. గెన్జి ప్రేమలో నవలలోని స్త్రీలు తలమునకలయ్యారు. వాళ్ళే కాదు. ఆ పాత్రను సృష్టించిన లేడీ మూరాసాకి కూడా, బ్రహ్మ తను సృష్టించిన సరస్వతిని మోహించినట్టు, గెన్జి ప్రేమలో పడిపోయిందేమో. గెన్జి వట్టి ప్రేమికుడే కాదు. గొప్ప చిత్రకారుడు కూడ అని రచయిత్రి గుర్తుచేస్తుంది. 17వ అధ్యాయంలో చిత్రకళాపోటీల సన్నివేశం ఉంటుంది. అంతవరకూ అందరి చిత్రాలూ చూసిన న్యాయనిర్ణేతలు తలా ఒక అభిప్రాయం వ్యక్తంచేస్తారు కాని, గెంజి చిత్రాల ప్రదర్శన మొదలయ్యాక ఇక ఎంపిక అనవసరం, ఏకగ్రీవంగా వీటికే బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం గెన్జితోపాటు పోటీలో పాల్గొనేవాళ్ళలో యువతులు ఎక్కువగా ఉండడం. అప్పట్లో కవిత్వానికి కూడ బొమ్మలు విధిగా ఉండేవి. ఆ బొమ్మలు (ఇలస్ట్రేషన్స్) ఎక్కువగా ఆడపిల్లలు వేసేవాళ్ళంటే వాళ్ళకు ఈ కళలో ఎంత ప్రావీణ్యం ఉందో, ఆ ప్రావీణ్యతకు ఎంతటి గుర్తింపు ఉందో అర్థమవుతుంది. గెన్జి మంచి సంగీతజ్ఞుడు కూడా. కిన్ అనే తంత్రీ వాద్యాన్ని అద్భుతంగా వాయించేవాడు. బౌద్ధారామాల్లో ప్రార్థన సమయంలో ఈ వాద్యాన్ని ఉపయోగిస్తుంటారు.

తోటి పురుషులతో పోలిస్తే గెన్జి మంచి సంస్కారవంతుడిగా కనిపిస్తాడు. మిత్రులతో చర్చల్లో స్త్రీల ప్రస్తావన వచ్చినపుడు, గెన్జికి తదితరులకు ఉన్న తేడా బాగా తెలుస్తుంది. ఒక మిత్రుడంటాడు: ‘ఆడవాళ్ళు వారి సామాజిక స్థాయిని బట్టి ఉత్తమ, మధ్యమ, అధమ జాతులకు చెందుతారు. మనం పై రెండిటి గురించే పట్టించుకోవాలి. అధమ సామాజిక వర్గానికి చెందిన స్త్రీలతో మనకు పనిలేదు.’ వెంటనే గెన్జి అడ్డుకుని ‘ఎవరు అధమం, ఎవరు ఉత్తమం అని ఎలా నిర్ణయిస్తావు? వారి వ్యక్తిత్వాలను బట్టి నిర్ణయించాలి గానీ సామాజిక హోదాను బట్టి కాదుగా. ఇదే విభజన మగవాళ్ళకు కూడ వర్తిస్తుంది కదా. ఉత్తమవంశానికి చెందిన వాడు పరమనీచుడయ్యుండొచ్చు’ అంటాడు. శృంగారపురుషుడు, భోగి, సకల కళాప్రవీణుడు అయిన గెన్జి పాత్రను రచయిత్రి చాలా ఇష్టంతో తీర్చిదిద్దినట్టు స్పష్టంగా తెలుస్తుంది. గెంజిలోని ఒకరకమైన ముగ్ధత్వం, సంస్కారం, ప్రేమించే గుణం పాఠకులనుకూడ విశేషంగా ఆకట్టుకుంటాయి.

4. కథనం

నవలలో కథనపరంగా చూసినపుడు అత్యంత ఆకర్షణీయమైనవి సంభాషణలు, కవితలు. నవలంతటా రచయిత్రి కవితల్ని గుప్పిస్తారు. కొన్ని చోట్ల గెన్జికి, యువతులకు మధ్య సంభాషణ కవితల్లోనే సాగుతుంది. తమ సంబంధాల గొప్పలు పురుషులు చెప్పుకునే సన్నివేశాల్లో కూడా ఆయా స్త్రీలు ఎంత తెలివిగా తమని తప్పించుకున్నారో, తమతో ఎంత చాకచక్యంగా మెలిగారో వాళ్ళే చెప్పడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ రోజుల్లో తమ వెంట పడుతున్న పురుషులను ఎలాంటి వాక్చాతుర్యంతో ఆడవాళ్ళు తప్పించుకునేవారో సంభాషణల్లో వ్యక్తమవుతుంది. ఒక అందమైన అమ్మాయితో గెంజి సంభాషణ:

నేను ప్రతి పువ్వు మీదా వాలిపోయే రకాన్ని కాను
కానీ ఈ నీలిపువ్వు నామనసును పట్టి లాగేస్తోంది.
(గెన్జి)

తెల్లారకముందే తరలివెళ్ళాలన్న నీ తహతహ చూశాను
కబుర్లకే తప్ప పువ్వు మీద నీకు ప్రేమే లేదని తెలుసుకున్నాను.
(అమ్మాయి సమాధానం)

ఈ కవితలను వాకా (Waka) అంటారు. ఇవి ఇప్పుడు ప్రచలితంగా తెలుగులో కూడ వస్తున్న హైకూలకు పూర్వరూపమని చెప్తారు. కవితల్లో ఎక్కువగా కనిపించే ఉపమ మంచు బిందువు, రకరకాల పువ్వులు, పళ్ళు. ఒక్క మంచు బిందువు ఉపమానంగా, పాత్రల మనఃస్థితిలోని అనేక కోణాలు ఉపమేయాలుగా ఎన్నో కవితలున్నాయి.

ఒక రకంగా ఈ నవలకు సంభాషణలే ప్రాణమని చెప్పవచ్చు. స్త్రీల పరస్పర సంభాషణలు, పురుషుల పరస్పర సంభాషణల్లో ఎక్కువగా వస్తువు ప్రేమలు, పెళ్ళిళ్ళు, వివాహేతర సంబంధాలే. తమను ప్రేమించిన స్త్రీలు, తాము ప్రేమించిన స్త్రీల గురించిన చర్చలు తప్ప వేరేవి మాట్లాడే పురుషులు తక్కువ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మగవాళ్ళు కేవలం స్త్రీల సౌందర్యం గురించి మాట్లాడరు. వారి పాండిత్యాన్ని, సాహితీ ప్రజ్ఞను గురించి చర్చించుకుంటారు. ‘ఆ అమ్మాయి కవితలో ఒక్క లోపం ఎన్నలేం. అద్భుతమైన పద్యాలు అల్లగలదు. కానీ తక్కిన కవయిత్రులను చులకన చేస్తుంది చూడు. ఆ గుణం నాకు నచ్చదు’ అంటాడు గెన్జి మిత్రుడు ఒక సందర్భంలో.

మరో మిత్రుడు తన భార్య తనని ఎలా త్యజించిందీ చెప్పుకొస్తాడు: ‘భార్యలు ఎలా భర్తలకు విధేయంగా ఉండాలి, ఎలా భర్తలు వేరే స్త్రీల వెంట పడుతూంటే సహనంగా అర్ధం చేసుకుని నెమ్మదిగా మార్చుకోవాలి, నాకు సామాజిక హోదా లేనంతమాత్రాన తను ఎందుకు నన్ను తిరస్కరించకూడదు అని నేను చెబుతున్నాను. ఆవిడ నా ఉపన్యాసమంతా విని, నీ సామాజిక హోదా పెరగలేదని నాకేం బాధలేదు. అది నాకు ముఖ్యం కాదు. కానీ ఏళ్ళ తరబడి నా పట్ల నీ క్రూరత్వాన్ని మాత్రం ఇంక సహించలేను. మనిద్దరం విడిపోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అంది నా ముఖం మీదే…’

ఇలాంటి సంభాషణలు చదువుతూంటే ఈ రచన ఎంతో ఆధునికంగా అనిపిస్తుంది. పురుషుల మాటే చెల్లే సమాజం గురించి రాస్తూ, అందులో సొంతగొంతు వెతుక్కున్న స్త్రీపాత్రలెన్నిటినో ఈ నవలలో మూరాసాకి చిత్రించింది. ఇలాంటి సంభాషణలు ఉల్లేఖిస్తూ పోతే నవలంతా చెప్పాల్సివస్తుంది. పురుషులకు సంప్రదాయానుసారంగా సంక్రమించిన ఆధిపత్యం స్పష్టంగానే కనిపిస్తున్నా, స్త్రీలకు అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉందనిపిస్తుంది.

ఈ నవల 1921 నుంచి ఆంగ్లంలో అనువాదమవుతూనే ఉంది. ఆర్థర్ వేలీ (Arthur Waley) చేసిన ఆరు సంపుటాల అనువాదం మొట్టమొదటి సారి ఆధునిక పాఠకులకు ఈ రచనను అందుబాటులోని తెచ్చింది. అయితే రాయల్ టైలర్ చేసిన అనువాదం మూలానికి అతి సన్నిహితంగా ఉందని అంటారు. ఇతను సమగ్ర అనువాదాన్నే కాక, సంక్షిప్త అనువాదాన్ని కూడ ప్రకటించాడు.

గెన్జి గాథ జపనీయుల ప్రజాసంస్కృతిలో ఎన్నో రూపాల్లో నిలిచింది. దీనిపై 1951, 66, 87, 2001, 2011 సంవత్సరాల్లో సినిమాలు వచ్చాయి. ఆపెరా ప్రదర్శనలు జరిగాయి. మూరాసాకిని, ఈ కథను చిత్రిస్తూ ఎన్నో చిత్రలేఖనాలు వచ్చాయి. మూరాసాకి పేరు మీద జపాన్ ప్రభుత్వం స్టాంప్ విడుదల చేసింది. 1968లో సాహిత్యంలో తొలి జపనీస్ నవలకు నోబెల్ పురస్కారం అందుకున్న యసునారి కవాబాటా, ‘మా సాహిత్యంలో గెన్జి మొనొగతరికి మించిన కాల్పనిక రచన ఒక్కటి కూడ రాలేదు’ అని అంటారు. ఆ తొలి నవలనే అత్యుత్తమ నవలగా జపనీయులు చాలా మంది భావిస్తారు. అలా ఒక మహిళ ప్రపంచ నవలా సాహిత్యానికి దారిదీపమై నిలిచింది.

సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...