మెట్లెక్కి పైకి పోగానే పిట్టగోడమీద వళ్ళెరగకుండా ఊగుతున్న గుల్మొహర్ కొమ్మలు. అవి నీ దృష్టిలో పడకుండా బిత్తరచూపులు చూస్తూ నడుస్తావ్. డిపార్ట్మెంట్ ఆఫీస్ ఇంకా బద్దకంగా నిద్రపోతూ ఉంటుంది. చేసేదేమీ లేక కారిడార్‌లో మందారరంగు పూలదగ్గరే వదిలేసిన నీ మనసు దగ్గరకి శరీరాన్ని కరుకుగా లాక్కొనిపోతావ్. అక్కడనుండి కిందకిచూస్తే ఆటోమేటిక్‌గా ఒక ఊహ తొలుస్తుంది. ఇదేమీ మొదటిసారి కాదు. చూసిన ప్రతిసారీ ఇంతే. ఆ రాతిగచ్చుపై నిన్ను నువ్వు నిభాయించుకోలేని తత్వం. దూకేయాలనే ఉబలాటం. ఒకసారి నీ ఫ్రెండ్‌కి ఇదే మాట చెప్తే–“చాలామందికి ఇలానే అనిపిస్తుందేమోరా! కానీ మనకి రీజన్ అంటూ ఒకటి ఏడ్చింది కదా. దూకితే పైకిపోతామనే భయం కూడానూ.”–నీ సానిటీ లెవెల్స్ తగ్గుతున్నాయని సూచనగా మాట్లాడాడు వాడు.
దూకాలని నీకు మొదటిసారి ఎప్పుడు అనిపించిందో గుర్తు చేసుకుంటావు. లాస్ట్ ఎండ్ సెమ్ ఎగ్జామ్స్‌లో ఇండియన్ ఫిలాసఫీ పేరుతో తన నమ్మకాలని, ప్రెజుడిసెస్ని, మీ మీద రుద్దిన ఒకానొక బట్టతల ప్రొఫెసర్ని పిట్టగోడ మీద కూర్చొని బండబూతులు తిడుతున్నావ్. ‘సత్కార్యవాద పొజిషన్ తాలూకా మెటాఫిజికల్ అజంప్షన్స్’ అనే ప్రశ్నకు ఏమి రాయాలిరా? అని అడుగుతున్న మీ ఫ్రెండ్‌గాడి ముఖం చూళ్ళేక కిందకి చూశావ్. సరిగ్గా ఆ క్షణం నీకనిపించింది దూకెయ్యాలని. ఆ ఆలోచన మెదడులోకి రాగానే జివ్వుమనే ఒక కేక. అది వీపు కిందనుండి పక్కటెముకలోకి దూరి కాళ్ళ కింద దాక్కొని పాదాలను అటూ ఇటూ ఊపింది. పిల్లర్‌ను ఆనుకొని నిల్చొన్న కళ్ళజోడమ్మాయి నీ రెక్క పట్టుకొని లాగకపోతే, ఇలాంటి వింత ఆలోచనలు రావడానికి నువ్వంటూ ఉండేవాడివి కాదు లోకంలో ఈ రోజు.
అదిగో అలాంటి టర్బులెంట్ టైమ్‌లో పరిచయం అయింది తను నీకు. లెక్చర్ హాల్లో మూలన కూర్చొని రాసుకుంటున్న నిన్ను చూసి నవ్వింది. ‘ఏదో పరధ్యానంలో ఉండి అలా చేసిందేమో’ అని నీ పని నువ్వు చేసుకుంటూ పోతావ్. బ్రేక్‌లో టీ తాగుతుంటే వచ్చి “అంత బోరింగ్ టాక్‌లో కూడా నోట్సు రాస్తారా” అని నవ్వుతుంటే, నువ్వు గీసిన పిచ్చి కార్టూన్ గీతలు చూపెడతావు. అలా ఇబ్బందిగా మొదలైన మాటలు ఇష్టంగా మారి మీ ఇద్దరినీ దగ్గర చేశాయి.
మొదట్లో తనతోనే ఉండాలని, తన మాటలే వినాలని ఉండేది. ఈ మధ్య చిన్న మార్పు. కప్పిపుచ్చుకోవడానికి దొంగవేషాలు, నంగి మాటలు, అబద్ధాలు. నీకు తనంటే ఇష్టం లేదని కాదు. కానీ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా, నీతో నువ్వే మాట్లాడుకోవాలని, నీతో నువ్వే ఉండాలని. అదిగో అలాంటిదే ఈ ఫేజ్. మభ్యపెట్టడం ఎందుకని తను ఇంటినుండి రాగానే చెప్పేద్దామనుకుంటావ్.
తన నుండి ఫోన్. నిశ్శబ్దంగా వింటున్నట్టు నటిస్తుంటావ్. అవిరామంగా పొర్లుతున్న తన మాటల సందడి మధ్యలో అడుగుతుంది “నన్ను మిస్ అవుతున్నావా?” అని. తను చెప్పే కబుర్లకి సమాంతరంగా నీ మనసులో మెదులుతున్న ఆలోచనల కొసలని మూటగట్టి, ఏమి చెప్పాలా అని ఆలోచిస్తుంటావ్.
నీ నిశ్శబ్దం వెనుక ఒక బరువైన ఎమోషన్ని తనే ఊహించేసుకున్నట్టుగా తడబడిన మాటలు. “ఎంత కష్టంగా ఉందో కదా! నేనే ఎక్కువ బాధపెడుతున్నా నిన్ను.”
తడికళ్ళల్లో ఓ మెరుపు. తన కల్పనని నీది చేసుకొని, మాటలు అల్లడం మొదలెడతావు–నిన్న రాత్రి కలొచ్చిందని, పొద్దు పొడిచేదాకా ఎర్రటిచూపుల్తో ఒకరి దేహాన్ని ఇంకొకరు కోసుకు తిన్నారని, పాదం అడుగుభాగం నుండి చెవివెనక నున్నటి చర్మం వరకు తడిగుర్తులు వదిలావని. ఇలా తన అమాయకపు ఊహకి, నీవొక్కడికే సొంతమైన అనుభవాలను అలుకుతావ్.
ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు, సిగ్గుతో నవ్వి, ఆ తరువాత తనొదిలే వేడిగాలి తాకేలా, తను వీపునానుకొని కూర్చోవాలనుకుంటావు.
కొన్ని నిమిషాలు అయిష్టంగా మాట్లాడిన తరువాత, ఫోన్ పక్కన పెట్టేసి నీ లోకంలోకి జారుకుంటావు.
స్పాంటేనియస్‌గా ఇంతకుమునుపు అల్లిన కథలో, సగం చెక్కి వదిలేసిన జ్ఞాపకాలకి, నీ వెర్రితనంతో కొంత మెరుగులు దిద్దే పనిలో పడతావ్. వంటి మీద ఏ రంగు దుపట్టా ఉంది, నుదుటి మీద ముద్దు పెట్టేటపుడు కళ్ళు మూసుకుందా లేదా, తన వేళ్ళు నీ జుట్టులోకి పోనిచ్చి ముద్దు చేసిందా లేదా, మెడ కింద ముద్దు పెట్టేటపుడు కంఠపు నరం అటూ ఇటూ ఊగిందా లేదా… ఇదిగో ఇలాంటి నీకు నచ్చే డిటైల్స్ అన్నీ గుంభనంగా అద్దుతావు ఆ కలకి. సరిగ్గా అప్పుడే కలకి-నిజానికి, కల్పనకి-యథార్థానికి మధ్య ఉండే అడ్డుగోడ చిన్నగా నెర్రెలిస్తుంది.
ఇదివరకొకసారి ఇలాగే నువ్వు కట్టుకున్న గూడులో ఏముందో తనకి చూపించాలనుకున్నావ్. తూకం వేసినట్టు అతిజాగ్రత్తగా మేలిమి పదాలు వాడుతూ, మబ్బుల్లో చుక్కలు పరిచినట్టుగా తన ముందు నీ లోపలి జీవితాన్ని పరిచావు. నీ మనసు సరిగా తెలియక, తన ముందు రాశిగా పోసిన నీ ఊహలను కూడా, మీరప్పుడప్పుడు ఆడే ప్రేమ దాగుడుమూతల్లో ఒక అంకంలాగా భావించి నవ్వి ఊరుకుంది. రెండడుగులు ముందుకేసి నీ ఆరాటాన్ని అర్థం చేసుకోలేకపోయింది. వెల్లువలా సాగుతున్న ప్రవాహాలకి ఆనకట్టేసి నిశ్శబ్దంగా ఉండిపోయావప్పుడు.
తను లేని ఖాళీతనాన్ని లైబ్రరీ అరల దగ్గర మరచిపోతావు. అప్పుడప్పుడు రాత్రివేళల్లో నీకు ఏవేవో గుసగుసలు వినిపిస్తాయి ఆ షెల్ఫుల దగ్గర. దగ్గరగా వెళ్ళి చూస్తే మడతలు పడిన పుస్తకాలు, చినిగిన పేజీలు తప్ప ఏమి ఉండవు. కానీ ఆ పక్కన కిందపడిన రెండు పుస్తకాలూ ఏదో చెప్తున్నట్టు ఊగుతాయి. ఊహకందని కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు ఈ లోకంలో ఏదో ఒక మూల కాచుకొని ఉంటాయి కొంతమంది కోసం. అలాంటివారు ఎదురైనప్పుడు ఇదిగో ఇలా వడిలో వాలిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి వాళ్ళని.
వారం తరువాత నీ పలకరింపులో అనాసక్తి కనిపెట్టేసింది తను. బరువైన మాటలు, నెమ్మది అడుగులు, అసందర్భమైన నవ్వు అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంది. పక్కనచేరి మోయలేనంత ప్రేమని చూపిస్తుంటే నీలో నీకే ఏదో గిల్టీ ఫీలింగ్. ధైర్యం తెచ్చుకొని కొన్ని రోజులుగా ఇబ్బందిపెడుతున్న విషయాన్ని తనతో చెప్పేశావు–మొన్న నువ్వు కూడా ఇంటికి వెళ్ళావని, మళ్ళీ ‘ఆ అమ్మాయిని’ కలిశావని. తను ఊఁ కొట్టి మౌనంగా ఉంది. తన మూగసైగ అర్థమయ్యి ఇదిగో ఇలాగ జరిగిందని చెప్తూ తన పొట్టమీద ఏవో పిచ్చిగీతలు గీస్తావ్.
…నువ్వు ప్రేమించావనుకున్న అమ్మాయింటికి తన పెళ్ళైన మూడో రోజుకే వెళ్తావ్. గుమ్మందగ్గర కట్టిన మామిడి తోరణం ఇంకా ఎండిపోలేదు. గోడమీద లవ్ సింబల్లో తన పేరు మాత్రమే చూసుకుంటావ్. వెడ్స్ కింద ఏముందో కూడా పట్టించుకోవు. టీవిలో ఏవో ఫైటు శబ్దాలు. కొత్తగా అంటుకున్న బాధ్యతల వల్ల చిక్కులు పడిన జుట్టుకి నూనెరాసి మెత్తగా దువ్వుకుంటుంది తను. ఇటుగా వచ్చి కూర్చోమన్నట్టు వడలిపోయిన రెప్పలను మూస్తుంది తను.
అసలు తనంటే అంతలా ఎందుకిష్టమో గుర్తుచేసుకుంటావు నువ్వు. అప్పట్లో నిన్ను సివిల్స్ రాయమని మీ నాన్న ఒకటే పోరు. తీరా నిన్ను ఒప్పించకుండానే నిశ్శబ్దంగా సమాధిలోకి జారుకున్నాడు ఏ హెచ్చరిక ఇవ్వకుండానే. పోతూ పోతూ నీలో సగభాగాన్ని కూడా తీసుకెళ్ళాడు. మరణం నీ జీవితంలోకి వచ్చింది అప్పుడే. మీ నాన్నదే కాదు, నీది కూడా. ఆయనతో పాటు నువ్వు కూడా చనిపోయావప్పుడు. నీ మొదటి మరణం.
అప్పుడొచ్చింది నీ లోకంలోకి తను. నిర్జీవమైన నీ సగభాగాన్ని తన దగ్గర కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పింది. జ్వరంలో మాట్లాడే నీ డెలీరియస్ మాటలకి ఊ కొట్టి, తన భుజాన్ని తోడు ఇచ్చింది. మాటల మధ్య మౌనాన్ని, ఒంటరి క్షణాల నిర్వేదాన్ని నీతో పాటే అనుభవించి, నిన్ను పూర్తిగా తనలోకి లాగేసుకుంది. పోయినేడాది యూనివర్సిటీలో జాయినయిన కొత్తలో వచ్చిన కలహం మిమ్మల్ని దూరం చేసింది. ఆశ్చర్యమేమిటంటే ఆ తరువాత ఎప్పుడూ మీరు ఆ గొడవ ఊసు ఎవరిదగ్గరా ఎత్తలేదు. సంవత్సర కాలం ఎడబాటు తరువాత ఇదిగో మళ్ళీ ఇలా.
‘నాలా ఈ లోకంలో నిన్నెవరూ ఇష్టపడరులే’ అని నీతో చెప్పిన ముఖాన్ని వెతుక్కుంటావ్ నలుగైనా ఆరని తన పసుపు ముఖంలో. మౌనం ఇద్దరిలోనూ. కాలం గడ్డకట్టింది. ముందుకు నెడదామని గతం గుర్తుచేస్తావ్. ఉరుముల వానొచ్చి ఇంకా కుదుటపడని తన జీవితంలో మీరిద్దరూ కలిసున్న శకలాలు మసకబారిపోయినట్టు చూస్తుంది తను. విరిగిపోయిన చెక్కకుర్చీలా నిర్జీవంగా చూస్తావ్ తనవైపు.
నీ పక్కగా వొచ్చి మంచమ్మీద పడుకుంటుంది.
తనకిష్టమైంది గుర్తొచ్చింది. అటుపక్కకి ఒరిగి ఎడమచేతి వేళ్ళని తన జుట్టులోకి పోనిచ్చి తలని నిమురుతావ్. ‘బావుంటుందే నువ్వు ఇలా చేస్తే’ అనే మాటకోసం ఎదురుచూస్తావ్. కానీ తను మాత్రం అలానే పడుకొని ఉంది. ఏ అలికిడి, స్పర్శ లేదు, నిశ్చలంగా ఊగని చెట్టులాగా. ఇంతకుమునుపు ఇలా చేసినప్పుడల్లా నీ నరాలు కూడా తిమ్మిర్లెక్కేవి మైకంతో. ఈ సారి నీలో కూడా ఏ కదలికా లేదు.
‘ఆ అమ్మాయితో’ మాట్లాడటం అదే చివరిసారి అని, తరువాత నీకు మెస్సేజ్ పంపినా రిప్లై కూడా ఇవ్వలేదని చెప్తావ్ ఈ అమ్మాయితో…
ఈ విషయం చెప్పకుండా దాచినందుకు మన్నించమని బెడ్ కిందకి జరిగి మెల్లగా తన పాదాలు నొక్కుతావ్. చాలాసార్లు తనకి కాళ్ళునొప్పులంటే ఇలానే చేశావ్. నువ్వు ఇలా చేయడం తనకి ఇష్టం కూడా. ఈసారెందుకో తను కాళ్ళు లోపలికి మునగదీసుకుంది.
ఆ రోజు నుండి ముభావంగా ఉంటుంది తను. నీదే తప్పంతా అని రియలైజ్ అవుతావు. తను మాట్లాడే సమయం కోసం ఎదురు చూస్తుంటావు.
తన దగ్గర ఇంకొక విషయం దాచిపెట్టావ్ నువ్వు. ఆ ‘అమ్మాయిని’ కలిసిన రోజు రెండోసారి నీకు చావు సెగ తగిలిందని, పొరలు పొరలుగా నువ్వు కాలిపోతున్నావని.
ఈ లోపు ఇంటికి రమ్మని ఫోను, నాన్న రెండో సంవత్సర స్మరణ కూడిక కోసం. వెళ్తే ఆయన జ్ఞాపకాలన్నీ వెంటాడతాయని భయం. మళ్ళీ మామూలుగా మారాలంటే నీకు సమయం పడుతుంది. ఇక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకుంటావ్. ఆ రోజు సాయంత్రం తను నీ హాస్టల్ గది దగ్గరికి వచ్చింది. బెడ్ మీద పడుకుని నువ్వుంటే, తల తీసుకొని తన వళ్ళో పెట్టుకుంది. పట్టలేని దుఃఖం. కూర్చోని తనని గట్టిగా వాటేసుకుంటావు.
నీకు నాన్నకి మధ్య ఏర్పడిన అంతరం గురించి తనకి చాలాసార్లు చెప్పావ్. జీవితంలో వెలితి గురించి తనకొక్కదానికే చెప్పుకున్నావ్. ఎవరి దగ్గరా లేంది, తన దగ్గర కన్నీళ్ళు కూడా పెట్టుకున్నావు.
ఏమైందో కానీ తను ఒక మాట అనేసింది. “మీ వాళ్ళేమో ఇంటిదగ్గర, నువ్వేమో ఇలా వెచ్చగా నా కౌగిట్లో.”
ఆ మాట వెనుక దాగున్న తన అంతరంగం ఏదో నీకు బోధపడుతుంది. నీకు బాహాటంగా బాధపడటం రాదు. కానీ నీకు అది ఎలా కలుగుతుందో తెలుసు తనకి. పైపెచ్చు నాన్న ఊసెత్తెసరికి అణుచుకోలేని కోపం కూడా వచ్చింది. బలవంతంగా తోసేసి చెంపమీద గట్టిగా కొట్టావ్. అక్కడనుండి బయటకొచ్చేశావ్, తనని పట్టించుకోకుండానే.
బాధ ఎవరికీ తెలియకూడదు. ఏడుపు ఎవరూ చూడకూడదు. మనుషుల గందరగోళమైన ఫీలింగ్స్‌కి ఎటువంటి సంబంధం లేని చోటు ఏదైనా ఉందా అని నీ జిడ్డుతల చుట్టూ ముసురుతున్న ఈగలు. మూడు గుప్పిళ్ళ పొగతో ఓ ఐదుక్షణాల ట్రాన్స్ని కొనుక్కున్న తరువాత, కళ్ళుమూసుకొని చూపంతా చీకట్లు నింపుకుంటావ్. నీకు నచ్చని ఒక జీవి నీ వైపే నడుస్తూ వస్తుంది. కక్కడానికి దాచుకున్న మొహమాటమంతా ఇంకిపోయుందని తెలిసి, చీకట్లో తొక్కిన పాములా సర సరా వెలుగులోకి పారిపోతావ్. ఎదురుగా సోషల్ సైన్స్ జంక్షన్. కుడివైపు తిరిగి హాస్టల్‌కి పోవాలని నిశ్చయించుకుంటావ్. తీరా, మలుపు దగ్గర ఏదో గుర్తుకొచ్చినట్టు ఆగి ఎడంవైపు అడుగులేశావ్.
మొద్దుగా నిద్రపోతున్న బిల్డింగ్ పేరు మనసులో చదువుకుంటావ్. ఇందిరాగాంధీ మెమోరియల్ లైబ్రరీ.
వీకెండ్ కాబట్టి పుస్తకాల గుంపుల మధ్య రెండు, మూడు తలలు… అక్కరకురాని పాతవస్తువులు విసిరేసినట్టుగా. ‘నీకేం పనిలేదు రా’ అన్నట్టు చూస్తున్న మెట్లపక్క ఒక లడ్డు పుస్తకం. మెట్లెక్కుతూ బోర్లాతిప్పేస్తావ్ దాన్ని ఊపిరాడకుండా. ఫస్ట్ ఫ్లోర్లో సైన్స్ గోలలు తప్పించుకొని, రెండో ఫ్లోర్లో చివర వరస హిస్టరీ షెల్ఫుల దగ్గర, వెలుగుపడని చోటులో జారిపడతావ్.
ఏదో లోపలికి గూడు తవ్వుకున్నట్టు రెండు కాళ్ళమధ్య తలకాయ. మిరపకాయల టిక్కీలు కాలినట్టు పంజెంట్ స్మెల్. ఎదురుగా ఉన్న పుస్తకాల రూపాలను చిన్ని చిన్ని చుక్కల మెరుపుల్లా చేస్తూ కళ్ళలో ఇంకుతున్న నీళ్ళు. ముక్కుల్లోంచి ఊరుతున్న వేడి ఆవిరి. ఎంతసేపు అలా ఉన్నావో తెలీదు. కానీ ఆ తరువాత ఏదో హాయి. చలికంతా మొద్దుబారి ముడతలు పడిన చర్మానికి పొగలు కమ్మే వేడినీళ్ళు తాకినప్పుడుండే హాయి అది.
నువ్వున్నావనే స్పృహలేకుండా లైటాఫ్ చేస్తారెవరో. అలవాటైన స్థలం కాబట్టి తడుముకోకుండా మెట్లదగ్గరికొస్తావ్. మేడ కిటికీలోంచి చూస్తే చీకటి కప్పుకున్న బిల్డింగ్ రూపం. చెక్కమెట్ల బల్ల పట్టుకొని దిగుదామనేలోపు థీసిస్ సెక్షన్లో వెలుగు గమనిస్తావ్. ఎవరో అని కుతూహలం. లోపలికెళ్తావ్. కుడివైపు గది తలుపు తీసి ఉంటుంది. వెలుతురు నీడ లోపలికి పడుతుంది కానీ ఏమీ కనిపించదు గదిలో. మామూలుగానైతే ఆ గదిలోకి ప్రవేశం నిషిద్ధం. ఇప్పుడా బోర్డు కిందపడి ఉంటుంది. తలుపు నెడతావ్. అదేమో పెద్దశబ్ధం చేస్తూ లోపలి లోయలోకి పడిపోతుంది. లోపలంతా చీకటి శూన్యం. ఎడమకాలు గుమ్మం ఆవల పెట్టి నేలకోసం గాలిలో తచ్చాడతావ్. వెనువెంటనే లోపలికి దూకేయాలనే ఇంపల్సివ్ థాట్. ఆలోచన లేకుండా రెండో కాలు కూడా గాల్లో వేస్తావ్.
…’ఆ అమ్మాయి’ వీధిలో నడుస్తున్నావ్. వాకిట్లో తడిక వేసుంటుంది. కానీ లోపలనుండి కూనిరాగాలు. మెల్లగాదూరి కిటికిలోనుండి తొంగి చూస్తావ్. ఒక్కత్తే దానిమ్మగింజలు వొలుస్తూ ఉంటుంది. నువ్వు రావడం చూసి, తినమని గిన్నె నీ ముందు పెడుతుంది. ఇంట్లో ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక దగ్గరగా లాక్కొంటావ్ తనని. ఊపిరాడకుండా వెనకనుండి వాటేసుకుంటావ్. ఇబ్బందిగా చెయ్యి వదిలించుకోవాలని చూస్తుంది. చెయ్యి వెనక్కివిరచి పెనుగులాడతావ్ ముందుకి, వెనక్కి. అరిస్తే ఎవరైనా వస్తారని కాబోలు గింజుకోవడం తప్ప గోలచేయదు తను. నీ పట్టు విడిపించుకోవాలని కలబడుతుంది. తన మెడ మీద నీ సొల్లంతా కార్చుతావ్.
చివరకి తను గట్టిగా అరుస్తుంది. “నా పర్మిషన్ లేకుండా నా బాడీని ఏమిచేస్తున్నావ్రా?”
మిత్రుల దగ్గర నీ ‘ప్రోగ్రెసివ్’ బడాయిలు, ఫేస్బుక్లో నీ ‘ఫెమినిజం’ నురగలు, డిబేట్లలో నీ ‘విప్లవాల’ మురుగు మాటలు గుర్తొస్తాయి.
తననొదిలేసి మంచంలో కూలబడిపోతావ్. అప్పటికే ప్యాంటు మీద కొంచెం జిగట తడి. తలుపు తీసుకొని గాబుకాడికి వెళ్తుంది తను. రెండు క్షణాల్లో మొహం కడుక్కొని లోపలికొస్తుంది. అప్పటికే వరండాలో కూర్చొని నేలచూపులు చూస్తుంటావ్.
ఇన్ని రోజులూ నీ గురించి నీకే తెలియంది ఇప్పుడు తెలిసొస్తుంది. ఈ అమ్మాయి స్నేహంవల్ల నీలో దాగున్నవే కాదు, ఇంకా మిగతా విషయాలెన్నో తెలుసుకున్నావ్ ఇదివరకు. చర్మానికి అతుక్కున్న పనికిరాని చెడు కుబుసాలెన్నో విదిలించుకున్నావ్. కానీ ఇప్పుడు తెలిసిన విషయం, అంగీకరించడానికి నీకు టైమ్ పట్టేలా ఉంది. చేదు నిజం నిన్ను అసహనానికి గురిచేస్తుంది. తన వైపు చూడటానికి కూడా నీ దగ్గర శక్తి లేదు.
కండువతో మొహం తుడుచుకుంటూ కుర్చీ వేసుకుంది నీ వెనకాల. అటొక కాలు, ఇటొక కాలేసి నిన్ను మధ్యలో కూర్చోపెట్టుకొని నీ తలమీద చెయ్యేస్తుంది.
రెండునిముషాల ఎడబాటు మౌనం తరువాత నోరు తెరుస్తుంది. “పిచ్చి… నువ్వు దూరంగా ఉంటే నేను బానే ఉంటా. ఎన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడి? అసలు నీ మొహం కూడా గుర్తు లేదు. తలకి నూనె రాసుకుంటున్నపుడో, కాలికి రాయి తగిలినపుడో, అన్నం ముద్దలు ముద్దలు కలిపి తింటున్నపుడో, నీ తోడు తాలూకా సాన్నిహిత్యం మదికొస్తుంది. మొదట్లో ఇలా గుర్తొచ్చినపుడల్లా ఏడ్చేదాన్ని. ఆ ఏడుపుకు నాకు నేను కారణం చెప్పుకోవాలని ఇలా పిచ్చిగా గోళ్ళతో గిచ్చుకునేదాన్ని (నల్లటి ఇసకగీతలు చేతిమీద). తరువాత తరువాత ఇలాంటి తలంపు రాగానే, నీ మీద కోపం రావాలని, ఏ తెల్లతోలుదానికో నువ్వు అన్నం తినిపిస్తున్నట్టు, ఏ రింగుల జుట్టున్నదానితోనో నువ్వు ఊరేగుతున్నట్టు ఊహించుకునేదాన్ని. కొంచెం మనసు కుదుటపడేది.”
కుర్చీలో కూర్చున్నదల్లా వంగోని నీ జుట్టుమీద గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది. ఎప్పుడు తనని ముద్దు పెట్టుకున్నా నీ వేడి తగ్గించుకోవాలనే ప్రయత్నమే కానీ అందులో ప్రేమ ఎప్పుడూ వెతుక్కోలేదు నువ్వు. తన ఇప్పటి ముద్దులో మాత్రం ఈ జన్మకి సరిపోయేంత ప్రేమ నీకిచ్చేసిందేమోనని అనిపిస్తుంది.
మళ్ళీ మాట్లాడటం మొదలెడుతుంది- “…ఇదంతా నువ్వు దగ్గరలేనప్పుడే. నువ్వు కనిపిస్తావా, మళ్ళీ అదే కథ. అదే నువ్వు చెప్తావ్ కదా, నువ్వు యూనివర్సిటీ నుండి ఇంటికొచ్చినపుడు నీకు దానికి సంబంధించిన రూపురేఖలు ఏమీ గుర్తుండవని, ఆ స్పేస్‌తో పూర్తిగా బంధం తెగిపోతుందని, అసలు అటువంటి ఒక ప్లేస్ ఒకటుందా అనేంతలా మరచిపోతావని. ఇది కూడా ఇంతే.
ఇదిగో నువ్వు కనపడగానే, వేపకొమ్మకి కట్టిన చీర ఊయల్లో మన పోట్లాటలు, తొలకరి చినుకుల వేళ జంటగా కిందకి వేలాడుతూ దూసిన చింతచిగురు, మట్టిపొయ్యి గడ్డకు కాళ్ళు నిగడదన్ని ఒకరి వెచ్చని చేతులతో ఇంకొకరి చెంపలను తడమడం, ఇలా గొంతుకోసి దాపెట్టిన అనుభవాలన్నీ మరల చిగురిస్తాయి.
నీకొక విషయం చెప్పాలిరా. మా ఆయనకు నా మనోగాడి స్టోరీ అంతా చెప్పేశా. కోపం లేదు, తిట్టు లేదు. గట్టిగా నన్ను కౌగిలించుకొని ఏడ్చేశాడు. ఇంక అలాంటి పిచ్చిపనులు చెయ్యొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. ఆయన అలా నన్ను కౌగిలించుకున్నపుడు నువ్వే గుర్తొచ్చావ్రా. నీకు చెప్పినప్పుడు కూడా అలానే దగ్గరకు తీసుకొని ముద్దు చేశావ్ గుర్తుందా నీకు?”
ఆ రోజు జరిగింది నీకు గుర్తొస్తుంది. తన చెంపమీద వదలిన నీ విషపుగుర్తులు, అసహ్యమైన బూతుమాటలు. ఇవేమి గుర్తు పెట్టుకోకుండా చివర్లో ఆ రెండు నిముషాల కౌగిలింతను మాత్రమే గుర్తెట్టుకుంది తను.
తన ఆలోచనలకి నీ ఆలోచనలకి, తన ప్రపంచానికి నీ ప్రపంచానికి తేడా నీ ఎరుకలోకి స్పష్టంగా ఇప్పుడే వస్తుంది.
చాలాసేపటిగా నిన్ను ఇబ్బందిపెడుతున్న మాటొకటి బయటికొచ్చేసింది. “నేను నిన్ను బలవంతం చేసినట్టు, ఐ మీన్ ఐ ట్రైడ్ టు రేప్ యూ కదా.”
తడిసిన నీ మొహాన్ని తనవైపుకు తిప్పుకుంటుంది. కళ్ళమీద ముద్దు పెట్టి “అంతకుముందు ఇంకా పిచ్చిగా, మృగంలా ఉండేవాడివిలే. ఇప్పుడే కొంచెం మేలు,” అంటుంది.
బయటకు ఏడ్చేస్తావ్ అప్పుడు.
“ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావ్రా!” అని పైకి లేపుతుంది.
….కళ్ళు తెరచి చూస్తే మసక మసకగా కొన్ని ఆతృతతో నిండిన మొహాలు.
నేలమీద పడుకున్నావేంటి? అసలు మాకంటే ముందు లోపలికెలావచ్చావ్? రాత్రి తాళాలేసేటపుడు సెక్యూరిటీ చూసుకోవద్దా? ప్రశ్నల పరంపర. లైబ్రరీ స్టాఫ్ ఒకామె నిన్ను చెయ్యిపట్టుకొని పైకి లేపుతుంది.
తల తిమ్మిరిగా ఉంది. పాచి వాసన. మోకాళ్ళ దగ్గర ప్యాంటు చినిగుంది కొంచెం. చొక్కా వీపుకంతా దుమ్ము. అడుగులో అడుగేసుకుంటూ బయటకి మెల్లగా నడుస్తుంటావ్.
హడావుడిగా తను. ఎర్రగా కందిపోయిన చెంప. నిన్నటి గొడవ గుర్తొచ్చింది. ‘ఐయామ్ సారీ’ అని నీలో నువ్వే ఏదో గొణుక్కుంటావ్.
ఇదేమి తనకు పట్టనట్టు నిన్ను దాటుకొనిపోతుంది రాత్రి తెరిచి ఉంచిన గది తలుపు వైపు.
ఆ రాత్రే నీ రెండో మరణం తాలూకా చితి పూర్తిగా ఆరిపోయింది.