ఎయిర్ రెయిడ్ ఐన ఐదు నిమిషాల తరువాత

26 స్టేషన్‌ రోడ్‌
పిల్సెన్, చెక్ రిపబ్లిక్.

మెట్లన్నీ ఎక్కి
మెల్లిగా చేరుకుంది
మూడో అంతస్తుకి
ఆవెఁ.

ఆ ఇల్లంతటికీ మిగిలింది
ఆ మూడంతస్తుల మెట్లే.
బారగా తలుపు తీసి
బైట ఆకాశం కేసి
కళ్ళు విప్పార్చి చూసింది
ఆవెఁ.

ఔను, అనంత ప్రపంచం
అంతమైంది ఇక్కడే.

అతి భద్రంగా
మూసింది తలుపు
ఎవడో దొంగ సూర్యుణ్ణీ,
శుక్రుణ్ణీ, సిరియస్‌నీ
తన వంటింట్లోంచి
ఎత్తుకొని పోతాడేమోననే
వెఱపు.

బూడిదైన ఇంటి కోసం
బూడిదైన భర్త కోసం
ఖండికలుగా తెగిపడ్డ
పసికందుల
కాళ్ళూ, చేతులూ, ముక్కూ, మొహం
తిరిగి అతుక్కుంటాయని ఆశగా
బూడిదలోంచి ఫీనిక్స్‌లా వారి
పునర్జననం కోసం
మెట్లు దిగి నిశ్శబ్దంగా
వేచి వుంది
ఆవెఁ.

నిశ్చల పాషాణంలా
పడివున్న ఆవెఁని
ఆవెఁ చేతుల్నీ, ఆవెఁ దేహాన్నీ
రాబందులు
పీక్కొని తినడం
మర్నాడుదయవేఁ చూశారు
వాళ్ళందరూ!

(మిరోస్లావ్‌ హొలూబ్‌ అనే చెక్ కవి రాసిన Five Minutes After Air raid గీతానికి తెలుగు అనుసృజన.)