మనిషి బహిరంతర్లోకాల సంఘర్షణకు కథారూపం డా. వి. చంద్రశేఖరరావు కథలు

జీవితాన్ని అధ్యయనం చెయ్యటానికి నేనెంచుకున్న ప్రక్రియ కథ. కథ నాకూ ప్రపంచానికీ మధ్య ఒక ఇన్‌స్ట్రక్టర్‌లా నిలబడి నన్ను విద్యావంతుణ్ణి చేసింది. నాలోనికి తొంగి చూసుకోవటానికి అవసరమైన చూపునిచ్చింది. ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌ అంటామే, అట్లాంటి ఆత్మీయమైన అనుభూతిలా నన్ను స్పృశించింది కథ.

ఈ మాటలు 1994లో తన తొలి కథాసంపుటి జీవనికి స్వగతంలో చంద్రశేఖరరావు రాసుకున్న ముందుమాట లోనివి. ఆయన కథలన్నీ జీవితాన్ని అధ్యయనం చేసే క్రమంలో రూపొందినవే. నిజానికి జీవితాన్ని నిర్వచించడం చాలా కష్టం. జీవితాన్ని అన్వేషిస్తున్న, అధ్యయనం చేస్తున్న క్రమంలో సంఘటనలుగా, కలలుగా, సముద్రంలోని అలలుగా విస్తరించిన జీవిత శకలాలను ఒడిసి పట్టుకుని జీవితాన్ని నిర్వచించే ప్రయత్నం తన కథల ద్వారా చేశాడు చంద్రశేఖరరావు. ఇది కూడా అంత తేలిగ్గా జరిగే పని కాదు. అనుక్షణం తనను తాను దహించుకుంటూ, పుఠం పెట్టుకుంటూ ప్రయాణం సాగిస్తే తప్ప సాధ్యం కానిపని. అందుకే ఇరవై తొమ్మిది సంవత్సరాల కాలంలో కేవలం 71 కథలు మాత్రమే రాయగలిగాడు. 1988లో తొలి కథ ‘డ్యూటీ’ ఆంధ్రజ్యోతిలో అచ్చయ్యింది. 2017లో మరణించే వరకూ సాహితీ వ్యాసంగం కొనసాగుతూనే ఉంది. కథ రాయటం కోసం నిద్రలేని అసహనపు రాత్రులు గడపడం నాకు తెలుసు. కథ రాయడం కోసం రచయిత ఇంతగా ఆత్మక్షోభ అనుభవించాలా అనిపించేది నాకు, ఆయన మానసిక స్థితి చూసినప్పుడు.

1994లో వెలువడిన జీవని తొలి సంపుటి కాగా, 2012లో వెలువడిన 20 కథల ద్రోహవృక్షం ఆయన బ్రతికుండగా వచ్చిన ఆఖరు కథాసంపుటి. ఆయన మరణానంతరం 2018లో మరో ఏడు కథలతో ముగింపుకు ముందు కథాసంపుటాన్ని మిత్రులు, కుటుంబ సభ్యులు ప్రచురించారు. ఈ ముప్పై ఏళ్ళ కాలంలో సగం కాలం–అంటే 2003 నుంచి 2017 వరకు–చంద్రశేఖరరావు సాహిత్య జీవితంలో అత్యంత ప్రభావవంతమైనది. మరీ ముఖ్యంగా 2012 వరకు. ఆ తరువాత ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతూ వచ్చాడు. రాయటం బాగా తగ్గిపోయింది. ఈ కాలంలోనే రెండు ముఖ్యమైన నవలలు ఆకుపచ్చని దేశం, నల్లమిరియం చెట్టు కూడా రాశాడు. తను అప్పటిదాకా రాస్తున్న శైలినుంచి విడిపడి కొత్త తరహాలో కథలు రాయటం మొదలు పెట్టిందీ ఈ కాలంలోనే. జీవని (1994) సంపుటికీ, లెనిన్‌ ప్లేస్‌ (1998), మాయాలాంతరు (2003) సంపుటాలకూ కథానిర్మాణం, శైలిలో ఎంత తేడా ఉందో అదే తేడాని, వాటికీ ద్రోహవృక్షం, ముగింపుకు ముందు సంపుటాల్లోని కథల్లో కూడా చూడవచ్చు.

అంతేకాదు, అప్పటిదాకా ఉన్న వామపక్ష ఉద్యమ కథావస్తువు మారుతూ వచ్చింది. ఆ స్థానంలో గ్లోబలైజేషన్‌ పరిణామాల వల్ల, అస్తిత్వవాద ఉద్యమాల వల్ల వచ్చిన మార్పులన్నిటినీ ఎప్పటికప్పుడు చంద్రశేఖరరావు తన కథల్లోకి తర్జుమా చేసుకుంటూ వచ్చాడు. తెలుగు కథాసాహిత్యంలో ఈ పని చేసింది బహుశా చంద్రశేఖరరావు ఒక్కడే. క్రానికల్స్‌ ఆఫ్‌ లవ్‌, హంస రెక్కలు, ఆదివారం, హెచ్‌. నరసింహం ఆత్మహత్య, ద్రోహవృక్షం, సూర్యుని నలుపురంగు రెక్కలు, నేను-పి.వి. శివం వంటి కథలు ఇందుకు ఉదాహరణలు. ఈ సంపుటిలో ఉన్న కథల్లో ఇటువంటి వస్తువిస్తృతిని, దానితోపాటు శైలీ, శిల్పాల వైవిధ్యాన్ని, వాటితోపాటు భాష లోనూ చాలా మార్పులు రావడం మనం గమనించవచ్చు. తొలిసంపుటికి రాసిన ముందుమాటలో ప్రముఖ విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య, ‘పాండిత్యపు బరువునే కాదు, భాష బరువును కూడా సహించలేని సాహిత్య ప్రక్రియ కథ’ అంటూ ఎక్కువగా ఆంగ్లపదాలు ఉపయోగించనవసరం లేదని, భాష బరువుగా ఉండనవసరం లేదని రచయితని సున్నితంగానే హెచ్చరించారు. ఈ మాటలకు చంద్రశేఖరరావు నొచ్చుకుని, ఆ క్షణానికి బాధపడినా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ మార్పు ద్రోహవృక్షం కథాసంపుటి నుంచి స్పష్టంగా కనబడుతుంది. బరువైన భాష స్థానంలో బరువైన భావవ్యక్తీకరణ, నూతన పదచిత్రాలు చోటుచేసుకున్నాయి. హంసరెక్కలు కథలో చనిపోయిన మాలతిని తల్చుకుంటూ కూర్చున్న మిత్రుల మధ్య మాటలు లేనితనాన్ని, ‘మిత్రులందరం భయపెట్టే మౌనంగా మారిపొయ్యాము’ అని రాస్తాడు. అదే కథలో మరోచోట, ‘అతను మళ్ళీ జీవించడం మొదలుపెట్టాడు. అతని చర్మం చిగురిస్తున్నట్లుగా అనిపించేది.’ అనీ రాస్తాడు. సూర్యుని నలుపురంగు రెక్కలు కథలో, ‘ఒకరినొకరు కౌగలించుకున్నాము. కవితల్లా అల్లుకుపోయాము’ అనీ, అలాగే ‘నాలో కలల్ని నాటినవాడు, ఆయన ఒక వెలుగు వృక్షం, ఒక చీకటి ఖండం’ అనీ తన తండ్రి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది ప్రధాన పాత్ర. తక్కువ పదాలతో భాషాపటాటోపం లేకుండా బలమైన భావాన్ని పలికించడానికి వాడిన ఇలాంటి పదచిత్రాలు, వ్యక్తీకరణలు ప్రతి కథలోనూ చోటు చేసుకుని, పాఠకుల్ని చకితుల్ని చేస్తాయి. కథలోంచి పాఠకుడ్ని బయటకు రానియ్యవు, ఆయా పాత్రల్లోకి పాఠకుల్ని ప్రవహింప చేస్తాయి.

ఈ ముప్పై ఏళ్ళ కాలంలో సమాజంలో వచ్చిన ఏ చిన్న మార్పుని, సంఘటనని చంద్రశేఖరరావు వదిలిపెట్టలేదు. తను రాసిన ప్రతి కథా తన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే సంఘటనల సమాహారమే. ఏదీ కల్పన కాదు. అయితే శైలీనిర్మాణంలో బోలెడంత కల్పన ఉంటుంది. ఎంచుకున్న వస్తువులో మాత్రం కాదు. అలా జరిగిన సంఘటనలలో కొన్ని ఏకంగా కథా వస్తువులయినాయి. మరికొన్ని ఆయా కథల్లో సంఘటనలుగా, భాగాలుగా అయ్యాయి. తొలిరోజుల్లో రాసిన నైట్‌ డ్యూటీ కథ నుంచి మొదలై లైఫ్‌ అండ్‌ టైమ్ ఆఫ్‌ సత్యప్రకాశం, మోహరుతువు, ఆమె 45వ పుట్టినరోజు, ఋతుసంహారం, హెచ్‌. నరసింహం ఆత్మహత్య, మినర్వా పత్రిక… ఇవన్నీ అలాంటి కోవలోని కథలే. అయితే, కొన్ని ప్రధాన విషయాలు అప్రధాన సంఘటనలుగానూ, అప్రధానమనిపించే కొన్ని విషయాలు ప్రధాన వస్తువుగానూ ఈ కథల్లో రూపొందాయి. ఇందుకు కారణం, రచయిత ఆ క్షణంలో ఆయా సంఘటనలకు లోనైన మానసిక ఉద్వేగపు స్థాయీభేదం కావచ్చు.

ఎప్పుడో 80ల్లో కన్నడంలో లంకేశ్ ప్రారంభించిన ‘లంకేశ్ పత్రిక’ అనే చిన్న పత్రిక 2000 సంవత్సరంలో లంకేశ్ చనిపోయేనాటికి దాదాపు రెండు లక్షల పైచిలుకు సర్క్యులేషన్‌తో కన్నడనాట పెను సంచలనం సృష్టించింది. దళిత వర్గాలకు, వారి ఆరాటాలకు, పోరాటాలకు గుండెచప్పుడు అది. ఆ తర్వాత ఆయన కూతురు గౌరీ లంకేశ్ (అవును, 2017లో సంఘ్ పరివార్‌ చేతుల్లో హత్యకు గురైన గౌరీనే!) దాని సంపాదక బాధ్యతలు చేపట్టిన తరువాత ఒక దశలో గౌరీపై తీవ్రమైన దాడి జరిగింది. ఆనాడు గౌరీపై జరిగిన దాడిని ఏ తెలుగు వార్తాపత్రిక ప్రముఖంగా ప్రస్తావించలేదు. చిన్న వార్తగా కొన్ని వేశాయి, కొన్ని పత్రికలు అదీ లేదు. సరిగ్గా ఇక్కడే చంద్రశేఖరరావు ప్రత్యేకత కనపడుతుంది. తెలుగు నేలపై అప్రధానంగా కనిపించిన ఆ సంఘటన ఆయన్ని కదిలించింది. గౌరీ సునీతారాణి అయ్యింది తన మినర్వా పత్రిక కథలో. ఆ సంఘటన కేవలం ప్రేరణే. అనేక కొత్త విషయాలను చర్చిస్తూ, చిన్న చిన్న అధ్యాయాలతో అద్భుతమైన కథగా దాన్ని రూపొందించాడు. దళిత ఉద్యమానికి సంబంధించిన అనేక విషయాలను వివిధ కోణాల నుంచి ఆ కథలో ప్రస్తావించి, చర్చించాడు. కథ చివర మినర్వా పత్రిక సంపాదకురాలు సునీతారాణి, ఆమె కూతురు గురించి రాస్తూ, ‘ఆ పిల్ల, వాళ్ళమ్మ, వాళ్ళిద్దరూ మన ఇవాళ్టి ఆశలు కదా!’ అంటాడు రచయిత.

ఇప్పుడు గౌరీ లంకేశ్‌ని ఏకంగా చంపేశారు. మనం నోరు మెదపలేదు. ఏ రచయితా కథ రాయలేదు. ఇలాంటి సందర్బాల్లోనే చంద్రశేఖరరావు పదేపదే గుర్తుకు వస్తాడు. ఆయనే బ్రతికుంటే గౌరీ లంకేశ్‌ కనీసం ఆయన కథల్లో మరో పాత్రగానైనా మన మధ్యన కలకాలం నిలబడేది కాదూ! మాజీ నక్సలైట్‌ నయీమ్, ప్రజా కళాకారిణి బెల్లి లలితను హత్య చేయించిన విధానం అత్యంత భయానకమైనది. శవాన్ని 17 ముక్కలుగా చేసి వాటిని వివిధ ప్రదేశాల్లో పడేసిన నయీమ్ పైశాచికానందంపై ఆరోజుల్లో మీడియా, ప్రజాసంఘాలు గగ్గోలుపెట్టాయి. ప్రభుత్వం కిమ్మనలేదు. విచారణ తూతూ మంత్రంగా సాగింది. ఈ సంఘటన మాయాలాంతరు కథగా రూపొందింది. ఆ సంఘటన పట్ల రచయిత పడిన ఆవేదనకు కథారూపం అది.

చంద్రశేఖరరావు కథల మీద ఒక ఆరోపణ ఉంది. ఆయన రాసే కథలు పాఠకుల కోసం రాసినవి కాదు, కేవలం విమర్శకులనుద్దేశించి రాసినవి అని. ఇంకొంచెం ముక్కుసూటిగా మాట్లాడుకుంటే ఆయన కథలు అర్థం కావు అనేది ఆ ఆరోపణ సారాంశం. పైపైన చూస్తే ఈ ఆరోపణ సబబేననిపిస్తుంది. కానీ లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. తన కథలు ఖచ్చితంగా భిన్నమైనవే. మామూలు వార, మాసపత్రికల్లో అచ్చయ్యే కథలున్నంత తేలికగా, పలచగా ఉండవు. అదే సందర్భంలో పరిణతి చెందిన పాఠకులకు జిజ్ఞాసను, అవగాహనను కలిగించే కథలు. హృదయాన్ని తాకి, జీవితాంతం వెంటాడే కథలు కావాలనుకుని పాఠకుల కోసం రాసిన కథలవి. అంతేకాదు, కథ రాయడంలో రచయితకి బాధ్యత ఉన్నట్లే, చదివే పాఠకుడికి కూడా ఒక బాధ్యత ఉంటుంది అనిపించే కథలవి. పాఠకుల జ్ఞానతృష్టకు పని కల్పించే కథలు.

ఆయన కథల్లో అస్పష్టత ఉంటే ఉండి ఉండవచ్చు. రిత్విక్‌ ఘటక్‌ (చంద్రశేఖరరావుకి ఇష్టమైన బెంగాలీ దర్శకుడు. తన కొడుక్కి ఆ పేరే పెట్టుకున్నాడు.) ఒక సినిమా చివర్లో ఫిలిమ్ తగలబడుతున్న శబ్దంతో పాటు మంటల దృశ్యంతో ముగుస్తుంది. దానిమీద అనేక వ్యాఖ్యానాలు, చర్చలు, ఆలోచనలు ముందుకొచ్చాయి. ఒక రకంగా చంద్రశేఖరరావు కథలూ అంతే. చర్చించగలగాలే కాని కథ ప్రారంభము, ముగింపులే కాదు కథలోని ప్రతి సన్నివేశానికి ఒక ఓపెన్‌ ఎండ్‌ ఉంటుంది. కథ చదివాక రచయితలోంచి ఒక ఎంపతీ లాంటిదేదో పాఠకుడిలోకి ప్రసారమవుతుంది. తరచి చూస్తే అర్థంకానిదేదీ ఉండదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతే. లేదా ఆ కథను అనుభవించాలి. ఆదివారం అట్లా అనుభవించాల్సిన కథే. ఇద్దరి ముసలివాళ్ళు ఉంటున్న అపార్ట్‌మెంట్లో ఒక ఆదివారంనాటి ఆ ఇద్దరి మానసికస్థితిని ఆవిష్కరించడమే కథ లక్ష్యం. కథంతా మానసికంగా దూరమైన బిడ్డల చుట్టూ తిరిగి, వారి ఆలోచనలతో పాఠకులను సైతం నిస్సహాయ స్థితిలోకి నెడుతుంది. వారిద్దరి మధ్య పాఠకుడు మూడో పాత్ర. దానికి ప్రారంభం, ముగింపు అనేవి ఉండవు. కథ మధ్యలో అప్పుడప్పుడు వినపడే తలుపు తడుతున్న శబ్దం దేనికైనా సంకేతం కావచ్చు. కథ కూడా తలుపు చప్పుడుతో ప్రారంభమయి, అదే తలుపు చప్పుడుతో ముగుస్తుంది. కథ చివర, ‘ఆ చప్పుడుకి అతని (రామసుందరం) శరీరంలో కూలుతున్న మహారణ్యాలు, మహాసర్పమేదో విసురుగా పడగవిప్పి బుస్సుమన్నట్లు’ అనిపిస్తుంది. అతని భార్య అన్నపూర్ణ దువ్విన కురులు ముడి వేసుకుని వంటగదిలోకి నడుస్తుంది. అంతే కథ అయిపోతుంది. అన్నీ కాకపోయినా కొన్ని కథలు ఇలా నడుస్తాయి. వీటిల్లో కథాశిల్పాల గురించి సంప్రదాయ పద్ధతిలో విశ్లేషించడం మొదలుపెడితే, తలాతోకా లేని కథగా అనిపించి, అర్థం కాదు అని తప్పుకుంటారు కొందరు పాఠకులు. పైన చెప్పినట్లు అలాంటి కథల్ని అనుభవించాలి, ఆ పాత్రలతో పాటుగా. లేదూ, మామూలుగా అర్థం కాని మానసిక స్థితిని మాటల్లో పాఠకుడికి చేరవేస్తున్న ఒక కొత్త వ్యాకరణంగా ఆ కథలను సరికొత్త పద్ధతులలో విశ్లేషించి అర్థం చేసుకోవాలి.

చంద్రశేఖరరావు విమర్శకుల కోసం రాశాడు అన్నది ఎంత సత్యదూరమో, అలా తప్పుకునే పాఠకుల కోసం కూడా రాయలేదు అనేది అంతే సత్యం. అందుకే అతని కొన్ని కథల్ని వస్తువు, శైలీ, శిల్పం అంటూ వింగడించి చర్చించడం సాధ్యం కాదు. కొన్ని కథల్లో సంఘటనలే శిల్పమూ, వస్తువూ కూడా (మినర్వాపత్రిక, ఆదివారం, నిద్ర, అతను అతనిలాంటి మరొకడు, ముగింపుకు ముందు లాంటి కథలు). కొన్ని కథల్లో పాత్రలు, వాటి ఆలోచనలు, అవి కన్న కలలు, వాటి కన్ఫెషన్స్ లాంటివే వస్తువు (మోహరుతువు, ఋతుసంహారం, లైఫ్‌ అండ్‌ టైమ్స్ ఆఫ్‌ సత్యప్రకాశం వంటి కథలు).

క్రానికల్స్‌ ఆఫ్‌ లవ్‌, జనవరి నెల ప్రేమ, ద్రోహవృక్షం, నేను-పి.వి. శివం వంటి కథల్లో కొంతవరకూ స్పష్టాస్పష్టంగానైనా వస్తువు ఇదీ అని చెప్పవచ్చు. ఈ కథల్లో కూడా కథను చెప్పిన ప్రత్యేక పద్ధతే శిల్పంగా రూపొందింది. ఆమాటకొస్తే ఇది చంద్రశేఖరరావు మార్కు కథ అనిపించేటట్టుగా తన ముద్రను కథల్లో వేసిన ప్రత్యేక కథకుడు చంద్రశేఖరరావు. ఆ శైలిలో భాగంగానే పాత్రలు కూడా మళ్ళీ మళ్ళీ అవే వస్తుంటాయి. మోహనసుందరం, పూర్ణమాణిక్యం, మోహన, శంకరం, మాలతి, సునీత–అన్ని కథల్లో దాదాపు ఇవే పాత్రలు. ఆ పాత్రను రూపుదిద్దిన పద్ధతుల వల్ల, చేసిన వర్ణనలవల్ల వాటిల్లో సమకాలీన రాజకీయ వ్యక్తులు లేదా సామాజిక ఉద్యమకారులు పాఠకులకు స్ఫురించే అవకాశం ఉంది. అయితే, సామాజిక ఉద్యమాల్లోని అనేక మంది వ్యక్తుల ఛాయలు ప్రతి పాత్రలోనూ కనబడతాయి. నిజానికి ఆ పాత్ర ఒక వ్యక్తి కాదు. ఈ సమాజంలో ఒకనొక కాలంలో ఉద్యమాల మధ్య నిలబడిన అనేకమంది వ్యక్తుల, వ్యక్తిత్వాల సమాహారం. ఉద్యమాలలోని వ్యక్తుల, నాయకుల బలాలు, బలహీనతలు, రాగద్వేషాలు, దిగజారిన తత్వాలు అన్నీ పెనవేసుకుని ఉంటాయి ఆ పాత్రల్లో. అందుకే కథలోని ఒకే పాత్రతో పాఠకులు ఒక దశలో ఆదర్శవంతంగా ప్రయాణం చేస్తారు, మరో దశలో ఈసడించుకుంటారు కూడా. ‘అతను, అతనిలాంటి మరొకడు’ వంటి కథల్లో ఈ విషయం కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకీ ఈ గొడవంతా అతని పురుష పాత్రలతోనే. ఎన్ని వైరుధ్యాలున్నా ఏ కథలోనూ స్త్రీ పాత్రలు దారి తప్పినవి కాదు. తప్పినా కన్ఫెషన్‌ ఉంటుంది. అందుకే మోహిని, పూర్ణమాణిక్యం, మాలతి వంటి పాత్రల్లో ఎక్కడా ప్రతికూల ఛాయలు (నెగటివ్‌ షేడ్స్‌) అంతగా కనబడవు. చంద్రశేఖరరావు కథల్లోని స్త్రీ పాత్రలన్నీ ఆదర్శమూర్తులే, మార్గనిర్దేశకులే, దీపధారులే!

చంద్రశేఖరరావు తన కథాపాత్రల గురించి తానే ఒకచోట, ‘నేనే మోహనసుందరాన్ని, నేనే లలితను, నేనే మోహినిని. ఆ పాత్రల గుండెల్లోని రిసెంట్‌మెంట్ నేనే, నాస్టాల్జియాను నేనే. తన శరీరంపై తానే గాయాలు చేసుకుంటున్న కాలం నేనే. నా కథల్లోని ప్రోటోగనిస్టులు నా లోపలి రిప్రెషన్‌ నుంచి, సందేహాల నుంచి, కోట్లాది భయాల నుంచి, చిటికెడంత ఆశ నుంచి, పుట్టుకొచ్చిన వాళ్ళే’ అని చెప్పుకున్నాడు.

ద్రోహవృక్షం సంపుటిలోని రెండు కథల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవి వస్తురీత్యా విమర్శకు గురైన కథలు. లేదా ఒక వైపు స్టాండ్‌ తీసుకుని కథ రాశాడని అపవాదుకు గురికాబడ్డ కథలు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాసిన హెచ్‌. నరసింహం ఆత్మహత్య కథలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చిన్నచూపు చూశాడని, వ్యతిరేకించాడని విమర్శ ఉంది. ఆవేశకావేశాలు కాస్త చల్లారాక మళ్ళీ ఇప్పుడు చదివినా, అందులో నాకేమీ వ్యతిరేకత కనిపించలేదు. ఈ కథలో రచయిత ఆత్మ స్త్రీ పాత్రలోనే ఉంది. ఆమె తన కథ చెప్తూ, ప్రారంభవాక్యాలలో తనను తాను నిర్వచించుకుంటుంది. ‘కోఠీ ఉమెన్స్‌ కాలేజీ వెనుకన ఇరుకిరుకుగా ఉన్న ఒక గల్లీలో నేను పుట్టాను. సెటిలర్‌, ఔట్‌ సైడర్‌, ఆంధ్రపోరి వగైరా లేబుల్స్‌ నాకు అంటించినా నేను హైదరాబాదీనే. కోస్తా జిల్లాల మదం, పొగరు, ఆధిపత్య భావజాలం వగైరాల మాట అటుంచి, నా పాతికేళ్ళ జీవితం, సారం హైదరాబాదే’ అంటుంది. అంతేకాదు, ‘మా నాన్న పుట్టిన ఊరు కూచిపూడి వెళ్ళినప్పుడు మా బంధువులంతా నా భాషను చూసి నవ్వడం నాకింకా గుర్తే’ అని కూడా అంటుంది. ఈ వాక్యాలు చాలు, తాను ఉద్యమాన్ని, ఉద్యమ ఆకాంక్షతో ఉద్యమంగానే చూశాడని చెప్పడానికి. ‘నరసింహం కాస్త మొరటుగా ఉంటాడు. ఏకవచనం, బహువచనం లాంటి భాషానియమాలు పట్టించుకోడు… నరసింహంతో రొమాన్స్‌ మొరటుగా ఉంటుంది. మృదువుగా, లలితంగా ఉండడం అతనికి తెలియవు’ వంటి వర్ణనల వల్ల ఉద్యమ వ్యక్తుల్ని చిన్నచూపు చూశాడు అని అనిపించవచ్చు. కానీ, అంతటి మొరటు మనిషి ఎంత సున్నిత మనస్కుడో, ఎంతలా చలించిపోతాడో చెప్పడానికి ఈ వర్ణనలని ఒక ఆసరాగా చెప్పి ఉండవచ్చు. బొటనవ్రేలు కోసుకొని రక్తంతో కరపత్రంపై సంతకం పెట్టిన ఉద్రేక స్వభావి అతను. అది చెప్పడానికే ఆ ‘మొరటుతనాన్ని’ కాంట్రాస్ట్‌గా తీసుకున్నాడు. ఉద్యమకాలంలో ఉన్న వైరుధ్యాలు కథలో అక్కడక్కడా కనపడినా, ఎక్కడా ఉద్యమానికి వ్యతిరేకంగా ఆ కథ రాసినట్లు అనిపించదు. పైగా, నరసింహం పాత్రను ఉన్నతంగా నిలబెట్టాడు.

ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. అసలు చంద్రశేఖరరావే హైదరాబాదీ. ఆయన ఏ కథ తీసుకున్నా, ఏ వస్తువుతో కథ రాసినా దాని నేపథ్యం మాత్రం హైదరాబాదే అయి ఉంటుంది. హైదరాబాద్‌ గల్లీ గల్లీలోను, వివిధ ఇరానీ రెస్టారెంట్‌లలోను, తాజ్‌మహల్‌, ద్వారకా హోటళ్ళలోనూ, ఉస్మానియా క్యాంపస్‌లోనూ, రవీంద్రభారతి, సంగీత్‌ సినిమాహాల్లోనూ దాదాపు అన్ని కథలూ సంచరించాయి. కథలనిండా పరుచుకున్నది హైదరాబాద్‌ నేపథ్యమే, వాతావరణమే. ఆయన్ని కథకుడిగా ఉద్రేకపరిచిందీ, ఉద్యమపరంగా ఆలింగనం చేసుకున్నదీ హైదరాబాద్‌ నగరమే. పుట్టి పెరిగిన, చదువుకున్న గుంటూరు నేపథ్యం నేను-పి.వి. శివం కథలో తప్ప మరే కథలోనూ కనబడదు. హైదరాబాద్‌ను అంతగా స్వంతం చేసుకున్న కథకుడు నెల్లూరు కేశవస్వామి తరువాత చంద్రశేఖరరావు తప్ప మరొకరు లేరు.

మరో కథ ద్రోహవృక్షం. పైన చెప్పినట్లు తెలుగు నేలపై ఎన్ని ఉద్యమాలు నడిచాయో అన్నిటినీ తన కథల్లో నిక్షిప్తం చేసినవాడు చంద్రశేఖరరావు. మాదిగ రిజర్వేషన్‌ ఉద్యమం గురించి ఆ కాలంలో ఒకటి రెండు పేలవమైన కథలు వచ్చినా, ఆ ఉద్యమానికి సాహిత్యస్థానం ఏర్పడింది మాత్రం ద్రోహవృక్షం అనే ఒకే ఒక్క కథ ద్వారానే (లేదా నల్లమిరియం చెట్టు నవల ద్వారా). ‘మా ఇద్దరి రక్తాల్లో ప్రవేశించే చరిత్ర ఒక్కటే అని తేల్చుకున్నాము. దగ్గరగా చూస్తే మా ఇద్దరిలో ఎన్నో పోలికలు. ముక్కు తీరు, లావాటి పెదాలు, మాటల ఉచ్చారణ… ఇవన్నీ అర్థమవుతుంటే ఎంతో ఆశ్చర్యం. కబుర్ల మధ్యలో వాడి భుజంపై చేయి వేశాను. అద్భుతంగా ఉందా స్పర్శ.’ అలా కలిసి నడిచి శిఖరం దాకా ప్రయాణం చేసిన వాళ్ళిద్దరూ తిరిగి వస్తూ, ఊరి దగ్గరకి వచ్చేసరికి మనం దూరంగా నడుద్దాం అన్న ఉ. కొండయ్య మాటల్లో ఉద్యమ దురుసుతనం, ఉద్యమ మెలకువ ఉండవచ్చు కానీ రచయితలో ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించిన స్టాండ్‌ కనపడదు. ఇద్దరూ కలిసి శిఖరాన్ని అధిరోహించాల్సిన అవసరం గురించి చెప్పిన కథ అది.

‘చంద్రశేఖరరావు కథల మీద ఆర్టు సినిమాల ప్రభావం విపరీతంగా ఉంటుంది. సన్నివేశాల చిత్రీకరణ విషయంలో స్క్రీన్‌ప్లేల ప్రభావం స్పష్టంగా చూడవచ్చు. సంక్షిప్తత, కథకుడి శిల్ప విశేషం కావడానికి ఇదే కారణం కావచ్చు.’ ద్రోహవృక్షం సంపుటికి బి. తిరుపతిరావు రాసిన వెనకమాటలోని ఈ వాక్యాలు అక్షరసత్యాలు. ఇష్ట్‌వన్ సబో (István Szabó) అనే హంగేరియన్‌ సినిమా దర్శకుడు రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తీసిన సినిమాల పరంపరలో మెఫిస్టో అనే సినిమా ఒకటి. ఆ సినిమాను పాతికేళ్ళ క్రితం చూశాను. రచయితలు, కళాకారులు పాలకవర్గాలకు, ప్రభుత్వాలకు కొమ్ముకాస్తూ అధికారంలో భాగమైనప్పుడు ఆ కళాకారుడు దిగజారిపోయిన విధానాన్ని, క్షోభించే అతని ఆత్మను వస్తువుగా తీసుకుని తీసిన సినిమా అది. కమ్యూనిస్టుల ప్రభావంతో రూపొందిన అద్భుత కళాకారుడు నియంత హిట్లర్‌ వైపు చేరి అధికారంలో భాగమైనప్పుడు అతని మానసిక స్థితిని, సంక్షోభాన్ని చిత్రించిన సినిమా అది. ఈ మెఫిస్టో సినిమాను తెలుగునేల రాజకీయ వాతావరణానికి అన్వయించి, ఇక్కడే జరిగిన కథగా మోహరుతువును మలిచిన తీరు ప్రశంసనీయం. 2005లో ఆయన రాసిన ఈ కథ 2018 నాటి స్థితికి అన్వయించుకుంటే ఎంత ముందుచూపుతో ఈ కథ రాశాడో అర్థమవుతుంది. ఉద్యమాల్లో పనిచేసి, ఉద్యమాలను ఆవాహనం చేసుకున్నవాళ్ళు పాలకుల కొమ్ముకాస్తుంటే దుఃఖం రాకమానదు. ఈ కథలో సుందరం అధికారంలో భాగమై పైకి ఎగబ్రాకుతున్నాననుకుంటూ, ఆత్మను చంపుకుంటూ దిగజారిన క్రమాన్ని, నిత్యం జ్వలించే సుందరం చల్లారిపోయిన వైనాన్ని మోహిని వివరిస్తుంది. ఆత్మహత్య చేసుకునే ముందు సుందరం పడిన మానసిక క్షోభను, అపరాధభావాన్ని వ్యక్తపరుస్తూ రాసిన ఉత్తరాన్ని సభాముఖంగా ఆమె చదివి వినిపించి, ఆఖరుగా, ‘ఇది రాజుల కాలం, ఇక్కడ మృదువైన పరిష్కారాలు ఉండవు. రక్తసిక్తమైన పరిష్కారాలే’ అంటూ స్టేజి దిగి వడివడిగా వెళిపోతుంది. అధికారంలో భాగమైన రచయితలు, కళాకారులందరికీ కనువిప్పు కావలసిన కథ ఇది (ఈ కథను మా కథాసంకలనంలో తీసుకోలేకపోయినందుకు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను).

చంద్రశేఖరరావు ఒక్కొక్కసారి పెద్ద కథనో, నవలికనో రాయాలని మొదలుపెట్టి, దాన్ని చిన్న కథగా ముగించేస్తాడు. మళ్ళీ ఆ ముగింపు దగ్గర మొదలుపెట్టి మరో కథ రాస్తాడు. ఇలా ఒకటి రెండు కథల్లో జరిగింది. (బహుశా అలా రాసిన కొన్ని కథలే ఐదు హంసలు నవల అయింది.) ఋతుసంహారం, నిద్ర-కొయ్యగుర్రాలు, నేను-పి.వి. శివం రెండూ సీక్వెల్‌ లాంటి కథలే. ఇలా రాసిన క్రమంలో మొదటి కథలోని వాక్యాలు యథాతథంగా రెండో కథలోకి రావటం, దాదాపు అదే భావవ్యక్తీకరణతో కథ నడవడం, అవే పదచిత్రాలు పునరుక్తి కావటం యాదృచ్ఛికమా, పొరపాటా లేక ఆ మూడ్‌ నుంచి బయటకురాలేని రచయిత మానసిక స్థితిలో భాగమా? లేదూ అది కథకుడి కొత్త వ్యాకరణమా?

గ్లోబలైజేషన్‌ ప్రభావంతో మారిన స్థితిగతులను అంచనా వేస్తూ దానికి వ్యతిరేకంగా తెలుగులో చాలా కథలే వచ్చాయి. అవన్నీ సంఘటనాత్మకంగానో, వస్తుగతమైన కథలుగానో మిగిలిపోయాయి. చంద్రశేఖరరావు రాసిన రెండు మూడు కథలు (క్రానికల్స్‌ ఆఫ్‌ లవ్‌, సుందరం కలలది ఏ రంగు, నిద్రపోయే సమయాలు) దాని ప్రభావానికి లోనైన వ్యక్తుల అంతర్లోక సంఘర్షణని, మానసిక క్షోభను చిత్రించాయి. ఈ మానసిక స్థితిని పది సంవత్సరాల క్రితమే కథల్లోకి తర్జుమా చేసిన కథకుడతను.

1988లో డ్యూటీ కథతో ప్రారంభించిన కథారచన 2017లో ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రికలో అచ్చయిన ‘పూర్ణమాణిక్యం ప్రేమకథలు’తో ఆగిపోయింది. ఇదే అచ్చయిన ఆయన ఆఖరి కథ. ఇవికాక ఎన్నో రాయాలనుకున్న కథలు, మరెన్నో కథాశకలాలు ఆయన డైరీల నిండా పరుచుకుని ఉన్నాయి. బతికుంటే మరో 70 కథలు వచ్చేవి కదా!

ఈ వ్యాసంలో 2003 నుంచి 2017 వరకు రాసిన కథలనే ఎక్కువగా సమీక్షించాను. మొత్తం కథల మీద మరోసారి ఎప్పుడో మాట్లాడుకోవాలి.

ఒక్కమాటలో చెప్పాలంటే వర్తమానంలో బ్రతుకుతూ, భవిష్యత్తులోని వస్తువుతో మానవక్షోభను, ఆవేశాన్ని ప్రతిబింబిస్తూ అదే వర్తమానంలో కథలు రాయటం అంత తేలికైన పనికాదు. ఇది కొందరికే సాధ్యం. పోలుస్తున్నానని కాదు కాని, దస్తోవ్‌స్కీ, వైకం మహ్మద్‌ బషీర్‌, త్రిపుర వంటి కథకుల సరసన చేర్చదగిన కథకుడు చంద్రశేఖరరావు. సమాజాన్ని, చరిత్రను, చరిత్రగతిని సీరియస్‌గా తీసుకుని రాసిన చంద్రశేఖరరావు కథల గురించి తెలుగు సాహిత్యలోకం చర్చించాల్సినంతగా చర్చించకపోవడం, దాదాపు మౌనంగా ఉండడం, అర్థంకాని కథలనే వ్యాఖ్యల మాటున దాక్కోవడం చంద్రశేఖరరావు కంటే తెలుగు కథకు జరిగిన నష్టంగానే భావించాలి. ఆయన పోయి రెండు సంవత్సరాలైంది. పోయినప్పుడు నలుగురైదుగురు రాసిన సంస్మరణ వ్యాసాలు తప్ప ఆయన రచనలపై చెప్పుకోదగ్గ వ్యాసాలేవీ ఈనాటికీ రాలేదు.

లెనిన్‌ ప్లేస్‌ పుస్తకానికి ఆఖరి మాటలుగా రాసుకున్న ఈ వాక్యాలు రచయితగా ఆయన ఆత్మను పట్టిస్తాయి. రచయితలకు మార్గనిర్దేశనం చేస్తాయి.

“తలుపుల్ని తెరిచి అక్షరాల్ని గాలిలోకి, ఆకాశంలోకి, అనంతమైన మానవ మూలాల్లోకి ఎగరవేయటం కదా ఈ ప్రక్రియ. రోడ్ల పొడవునా ప్రశ్నల్ని నాటడమే కదా కథ ఉద్దేశ్యం. వేటచరిత్రలు తిరగరాయడం, సింహాలో, సివంగులో యుద్ధాలకు మోహరిస్తే అశ్శరభ… అశ్శరభ… అంటూ ఉత్సాహపరచడం కదా ఇవాళ్టి కథకు వస్తువు.”

నిజమే కదా!

[01-04-2019 ఆంధ్రజ్యోతిలో సంక్షిప్తంగా ప్రచురించబడిన వ్యాసపు పూర్తి పాఠం. – సం.]