మంటో కథలు: సియా హాషియే 2

విభజన మిగిల్చిన నెత్తుటి చారలు ఈ నల్లటి గీతలు.

అప్పుడు హత్యలూ జరిగాయి, మానభంగాలూ జరిగాయి. బలవంతపు మతమార్పిడిలూ జరిగాయి. మతమార్పిడికి ఒప్పుకోక బలవన్మరణాలూ జరిగాయి.

పంద్రాగష్టు అంటే స్వాత్రంత్య దినోత్సవం అని చెప్పుకొస్తారు. కానీ ఒక్క గీతతో, కొందరి సంతకాలతో తరతరాలుగా ఉన్న నేల పరాయిదవటమంటే ఏంటో ఎవరూ చెప్పరు. ఉన్నపళంగా, కట్టు బట్టలతో, ఇల్లూ-వాకిలీ, గొడ్డూ-గోదా అన్నీ వదులుకొని ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోవటం ఊసెత్తరు. దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న ఇరుగూ-పొరుగే ప్రమాదంగా మారటమంటే ఏంటో చెప్పరు. ముఖ్యంగా, ఎప్పుడూ ఏ ఆయుధమూ పట్టుకోని ఒక మామూలు మనిషిలో మరో మనిషిని చంపితే గానీ తాను సురక్షితం కాదన్న భయం ఎలా పుడుతుందో, అంతటి అభద్రతను ఎవరు ఎలా పెంచి పోషిస్తారో… హుష్… అది అసలే చెప్పరు.

అందుకే విభజనను గుర్తించే మ్యూజియం పెట్టుకోడానికి మనకు డెబ్భై ఏళ్ళు పట్టింది.

విభజనకు సంబంధించిన సాహిత్యం, సినిమాలు లేవని కాదు. ఆ తరంలో ఆ దారుణాన్ని భరించినవాళ్ళు బాగానే రాశారు దాని గురించి. సినిమాలూ వచ్చాయి. కానీ అదెప్పుడో, ఎక్కడెక్కడో, వాళ్ళెవరికో జరిగిందనట్టు… దూరంగా, విసిరేసినట్టు, కింద పడితే లేచి మట్టి దులుపుకొని పోయినట్టు…

‘కాదు, కాదు, అది ప్రకృతి విలయానికి తట్టుకోలేక ఓడిపోవడం కాదు. అది ఆధునిక ఆయుధాలకి బలి అవ్వడం కాదు. అది మనిషి మీదకు మనిషిని ఉసిగొల్పడం’ అని మనకి అర్థమైపోతే? ఇప్పుడు, ఇక్కడ, మనకే జరుగుతుందది అని మనకి తెలిసిపోతే? అందుకే అంతా గప్‌చుప్!

మంటో ‘సియా హాషియే’ అందుకే ప్రత్యేకం! ఇందులో చంపడం, చావడం మాత్రమే ఉండదు. వాటి చుట్టూ అల్లుకున్న వివశత, వెర్రితనం కూడా ఉంటాయి. వాటిని గురించి వెగటూ ఉంటుంది, వెటకారమూ ఉంటుంది. ఏడ్వలేక నవ్వటమూ ఉంటుంది. అంతటి విపరీత పరిస్థితుల్లోనూ ఒకడిని ఒకడు దోచుకోవడమూ ఉంటుంది. అంతటి గందరగోళంలోనూ ఆడ-మగ, పేద-ధనిక, బలవంతుడు-బలహీనుడు మధ్య మారని హెచ్చుతగ్గులను నాలుగేసి వాక్యాల కథల్లో పట్టుకున్నది కేవలం ఆయనే.

ఇట్లాంటి కథలు రాసి మంటో ‘శవాల మీద చిల్లరేరుకున్నాడు’ అని ఎవరో అనే ఉంటారు. ‘నేను నల్లటి పలక మీద తెల్లటి బలపంతో రాస్తాను, ఎందుకంటే ఆ తెలుపు వల్ల నలుపు మరీ స్పష్టమవుతుంది.’ అని మంటోనే ఇంకో చోట చెప్పుకున్నాడు. కానీ, గతానికి మొత్తం సున్నం కొట్టి తెల్లగా మార్చేసి, విభజన గురించి మనం మర్చిపోయేలా చేశాక, మంటో కథలు ఆ సున్నాన్ని గీరి నల్లటి నిజాన్ని చూపించే గాట్లు! ఈ గాట్ల వల్లనే ఎంత సున్నం కొట్టారో, ఇంకా కొడుతున్నారో స్పష్టంగా తెలిసివస్తుంది.

అటు హిందూస్తాను గానీ, ఇటు పాకిస్తాను గానీ కాని నేలమీద టోబా టేక్ సింగ్ కుప్పకూలిపోతాడు గానీ, మంటో మాత్రం అక్కడే తచ్చాడుతూ ఉంటాడు. అటూ ఇటూ ఉన్న కంచెలు చేసిన ఘోరాలని మనకి వినిపిస్తూనే ఉంటాడు. మన చుట్టూ పుట్టుకొస్తున్న కంచెల గురించి ఆలోచించుకోమంటూ… – పూర్ణిమ.

పఠానిస్తాన్

“ఊ… దబ్బున చెప్పు నువ్వెవరు?”

“నేను… నేను… ”

“ఊ… దెయ్యం నాకొడకా… జల్దీ చెప్పు… హిందూవా, ముస్లీమువా?”

“ముస్లిమును”

“ఊ… మీ రసూలు ఎవరు?”

“మహమ్మద్ ఖాన్.”

“సరే… వెళ్ళు…”

ఖబర్దార్!

అల్లరిమూకలో ఒకడు ఇంటి యజమానిని చాలా కష్టపడి ఈడుస్తూ బయటకు లాగాడు.

బట్టలు దులుపుకుంటూ అతడు లేచి నుంచున్నాడు.

అల్లరిమూకతో అన్నాడు: “కావాలంటే నన్ను చంపండి. కానీ ఖబర్దార్! నా పైసలని ముట్టుకుంటే మాత్రం… ”

ఎప్పటికీ సెలవు

“పట్టుకోండి… పట్టుకోండి… తప్పించుకోకుండా చూడండి.”

వేట కొంచెం పరుగు, దూకుడు తర్వాత దొరికిపోయింది.

బల్లేలు అతడిగుండా అటూ-ఇటూ వెళ్ళేసరికి అతడు కంపిస్తున్న గొంతుతో గిలగిలాడుతూ అన్నాడు: “నన్ను చంపకండి… నేను సెలవలకని ఇంటికెళ్తున్నాను.”

హలాల్ – జట్కా

“నేను వాడి మెడనరంలోకి చాకు దింపి మెల్లిమెల్లిగా తిప్పుతూ కోసి, వాణ్ణి హలాల్ చేశాను.”

“ఎందుకలా చేశావ్?”

“ఎందుకేంటి?”

“వాణ్ణి హలాల్ ఎందుకు చేశావ్?”

“మజా వస్తుంది అలా చేస్తే.”

“మజా వస్తుందా, నాకొడకా… నిన్ను జట్కా చేయాలసలు… ఇలా!”

అలా హలాల్ చేసినవాడి మెడ జట్కా అయిపోయింది.

చెడిన బేరం

ఇద్దరు దోస్తులు కలిసి పది-ఇరవై మంది ఆడపిల్లల్లో ఒక అమ్మాయిని ఎంచుకొని, నలభైరెండు రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు.

రాత్రి గడిపాక ఒక దోస్తు ఆ అమ్మాయిని అడిగాడు: “నీ పేరేంటి?”

అమ్మాయి తన పేరు చెప్పేసరికి వాడు అదిరిపడ్డాడు: “అదేంటి, మాకేమో నీది వేరే మతమని చెప్పారు?”

అమ్మాయి బదులిచ్చింది: “అబద్ధమాడారు వాళ్ళు.”

ఇది విని వాడు పరిగెత్తుకుంటూ దోస్తు దగ్గరకు వెళ్ళి అన్నాడు: “ఆ దొంగ నాకొడుకు మనల్ని మోసం చేశాడు… మన మతం అమ్మాయినే అంటగట్టాడు… పద, వాపసు చేసొద్దాం… ”

పాశవికత

అతి కష్టం మీద భార్యా భర్తా ఇంట్లో ఉన్న కొద్ది సామానుని కాపాడుకోవడంలో సఫలమైయ్యారు. యుక్తవయసులో ఉన్న కూతురి జాడ మాత్రం తెలియలేదు. మరో చిన్నపిల్ల ఉంది, తల్లి దానిని గుండెలకు హత్తుకొనే ఉంది.

కడుపుతో ఉన్న బర్రె ఉండేది, దాన్ని అల్లరిమూకలో ఒకడు పట్టుకొనిపోయాడు. ఒక ఆవు ఉండేది, అది బతికిపోయింది కానీ దూడ దొరకలేదు.

భార్యా-భర్తా, వాళ్ళ చిన్నపాప, ఆవు ఒకచోట దాక్కొనున్నారు.

చిక్కని చీకటి రాత్రి అది.

పాప భయపడి ఏడ్వడం మొదలెట్టింది, నిశ్శబ్దపు వాతావరణంలో డోలు వాయించినట్టు. తల్లి గాభరాపడిపోయి బిడ్డ నోటిని చేతితో మూసేసింది శత్రువులు వినకూడదని. గొంతు వినిపించలేదు. తండ్రి జాగ్రత్తగా పాప మీద లావుపాటి రగ్గు కప్పాడు.

కొంచెం దూరం వెళ్ళాక దూరం నుండి ఒక దూడ గొంతు వినిపించింది. ఆవు చెవులు నిక్కపొడుచుకున్నాయి. లేచి, పిచ్చిదానిలా పరిగెడుతూ అరవడం మొదలెట్టింది.

దాని నోరు మూయించడానికి చాలా పాట్లు పడ్డారు కానీ ఫలితం లేకపోయింది. అరుపులు విని శత్రువులు దగ్గరగా వచ్చారు. కాగడాల వెలుగు కనిపించింది.

భార్య తన భర్తతో చాలా కోపంగా అంది: “నువ్వెందుకు ఈ పశువుని మనతో పాటు తీసుకొచ్చావ్?”

వినమ్రత

నడుస్తున్న బండిని ఆపేశారు.

వేరే మతం వాళ్ళని బయటకు లాగి లాగి కత్తులతో, తుపాకులతో లేపేశారు.

ఈ పని పూర్తయ్యాక బండిలో ఉన్న తక్కినవారికి హల్వా, పాలు, పళ్ళు ఇచ్చి మర్యాదలు చేశారు.

బండి కదులుతుందనగా ఏర్పాట్లు చేసినవారి నాయకుడు ప్రయాణికులను ఉద్దేశిస్తూ అన్నాడు: “అన్నలారా, అక్కలారా! బండి వస్తున్నట్టు మాకు ఆలస్యంగా తెలిసింది; అందుకే, మేము చేయాలనుకున్నట్టుగా, మీకు మర్యాదలు చేయలేకపోయాము!”

ఎరువు

అతడి ఆత్మహత్య గురించి అతడి దోస్తు ఇలా అన్నాడు:

“భలే మూర్ఖుడండీ… లక్షవిధాల నచ్చజెప్పాను, ఇదిగో, నీ జుట్టును కత్తిరించినా నీ గెడ్డం గొరిగేసినా నీ మతం అంతమైపోతుందని.

చెప్తే అర్థం కాలేదు…

రోజూ పెరుగు వాడు… వాహ్, గురు దయుంటే ఒక్క ఏడాదిలో నువ్వు మళ్ళీ నీలాగే తయారవుతావు…!”

దృఢ నిశ్చయం

“నేను

సిక్కుగా

మారడానికి

అస్సలంటే అస్సలు

తయారుగా లేను…

నా మంగలికత్తి

వాపసు చేయండి

నాకు…!”

పర్యవేక్షణలో

‘క’ తన దోస్తు ‘ఖ’తో తనది కూడా అదే మతమని చెప్పి అతడిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి మిలిటరి దళంతో పాటు బయలుదేరాడు. ఇటీవల సమయంలో అతడి మతం మార్చేయబడిన ‘ఖ’ దారిలో మిలిటరీవాళ్ళని అడిగాడు: “ఏం జనాబ్? ఇక్కడెక్కడా ఏం అల్లర్లు జరగలేదా?”

జవాబొచ్చింది: “పెద్దగా ఏం జరగలేదు… ఇక్కడే ఒక మొహల్లాలో ఒక కుక్కని చంపారు.”

కుదుటపడి ‘ఖ’ అడిగాడు: “ఇంకేం విశేషాలు లేవా?”

జవాబొచ్చింది: “విశేషాలేం లేవు… కాలువలో మూడు ఆడకుక్కల శవాలు దొరికాయి.”

‘క’, ‘ఖ’ తరఫున, మిలిటరీ వాళ్ళని అడిగాడు: “మిలిటరీ వాళ్ళేం చర్యలు తీసుకోలేదా మరి?”

జవాబొచ్చింది: “ఎందుకు తీసుకోలేదు… అన్ని పనులు మా పర్యవేక్షణలోనేగా జరుగుతున్నాయి…”

రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ...