13. ట్రావెల్
ట్రావెల్, ట్రావెల్, ట్రావెల్… విసుగొచ్చింది వాడికి. బస్సు, రైలు, విమానం, ఆటో, కార్, బైక్, వ్యాన్, సైకిల్, నడక.
ఒక ఏడాది పాటు ఎక్కడికీ కదలకూడదని నిర్ణయించుకున్నాడు.
శాంతికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు.
‘ఇక్కడికి రా మాట్లాడుకుందాం’ అంది శాంతి.
‘చెప్పాను కదా? నేను కిచెన్‌కి రాను. నువ్వే పనులన్నీ ముగించుకుని బెడ్ రూముకు రా!’ అని ఫోన్ కట్ చేశాడు.
14. పేద
శాంతి నిరుపేదగా పుట్టి, పుట్టిన మరుక్షణమే తన తల్లి పని చేసే అదే పేద ఇంటిలో చిన్నారి పనిమనిషిగా మారిపోయింది.
ఒకటే హింస. తాళలేక ఏడ్చేది. ఇంటినుండి పారిపోయి వేరే ఎటైనా వెళ్ళిపోదామని ఒక దశలో నిర్ణయించుకుంది కాని ఆమె నిర్ణయం ఆమెతో సహా ఎవరికీ సరిగ్గా అర్థం కాలేదు.
హింసల్లోకల్లా అతిపెద్ద హింస కుల హింస అని గ్రహించింది శాంతి. అగ్రకులానికొక న్యాయం, తక్కువ కులానికొక న్యాయం. అందునా సంకరజాతి అన్నిటికంటే హీనమైనది. అందరిచేతా చీదరించుకోబడింది శాంతి. ఆ ఇంటిలో అగ్రకులాల వాళ్ళు తినగా మిగిలిన ఎంగిలికూడే శాంతికి. ఎండకు ఎండాలి, వానలో తడవాలి, చలికి వణికిపోవాలి.
ఇలా రోజులు సాగుతుండగా (నిజానికి ఈ వాక్యం అక్కర్లేదు, కథ చదువుతున్నట్టు పాఠకులను నమ్మించటానికే) యవ్వనంలో శాంతి వయ్యారాలొలికే అందగత్తెగా శోభిల్లింది. తరువాత ఏం జరుగుతుంది? మానభంగమే.
అగ్రకులపు కుక్క ఒకడు ఆమెను పట్టపగలు మానభంగం చేశాడు. మానభంగం చెయ్యడం దారుణాల్లోకెల్లా పెద్ద దారుణం కదా? శాంతి రెడ్‌హేండెడ్‌గా పట్టుబడింది. శాంతి తక్కువ కులం కదా, కాబట్టి శాంతికే శిక్ష. ఇంటినుంచి తరిమికొట్టబడింది. భరించలేని అవమానంతో వీధిలో నడిచి వెళ్తుంటే, కొన్ని పోరంబోకులు చుట్టుముట్టుతూ వెంటపడ్డాయి.
ఏం బతుకురా ఇది అని నొచ్చుకోడానికి కూడా ఓపిక లేదు. తన తోకను వెనక్కాళ్ళ మధ్యన ముడుచుకుని పైకి ధైర్యం నటిస్తూ మొరుగుతూ చుట్టు పక్కల చూసుకుంటూ వేగంగా పరుగు తీసింది.
15. శివ ప్రధాని
శివ భక్తుడైన అతను భారతదేశ ప్రధానిగా పదవీ స్వీకారం చేశాక శివుని గూర్చి తపస్సు చేశాడు. ప్రధాని కాబట్టి ఓ గంటలో శివుడు దిగి రావలసిందేనన్నది తపస్సు కండిషన్‌లో భాగం. సరిగ్గా 22 నిముషాల్లో శివుడు ప్రత్యక్షమయ్యాడు.
“ప్రధాని అయినందుకు శుభాకాంక్షలు. కళ్ళు తెరవచ్చు.”
“స్వామీ, నాకంటూ నేనేమీ కోరుకోను. దేశంలో హత్యల సంఖ్య పెరిగిపోతోంది. దాన్నెలా నిరోధించడం? ఎందుకిలా హత్యలు పెరిగిపోతున్నాయి? నా పాలనలో దాన్ని అరికట్టడానికి మీరే ఓ మార్గం చూపించాలి.”
“కుమారా, నేను లయకారుణ్ణి. అంటే నిర్మూలనకు సంబంధించిన డిపార్ట్‌మెంట్. నాకున్న ఏకైక అసిస్టెంటు యముడు మాత్రమే. పనిలో వాడు బాగా స్లో. వాడి వాహనం కూడా అలానే ఏడ్చింది. మందబుద్ధికి మారుపేరుగాడు. అప్‌డేట్ అవ్వడం వాడి తరం కాదు.
ఇదివరకు ఒక హత్య జరిగితే, హత్య చేసిన వాడిని మీరు ఉరి తీసేవారు. నా లెక్కలో రెండు వికెట్లు అవుట్. కాబట్టి ఇద్దరి పద్దు ముగించాలనుకుంటే ఒక హత్యకు ఏర్పాటు చేసేవాణ్ణి. ఇప్పుడలా కాదు, ఉరిశిక్ష పడిన నేరస్తుణ్ణి నేను కూడా చేరుకోలేకపోతున్నాను. అంతటి భద్రతా చర్యలు చేపడుతున్నారు. అందుకే ఇద్దర్ని కడతేర్చాలంటే రెండు హత్యలు చెయ్యక తప్పని పరిస్థితిలో ఉన్నాను. అందువల్లే హత్యల సంఖ్య పెరుగుతోంది. దానికి తోడు పెరుగుతున్న జనాభాకి యముడొక్కణ్ణి పెట్టుకుని నెట్టుకురాలేకపోతున్నాను కాబట్టే మరి కొందరికి అవుట్-సోర్స్ కూడా చేశాను. అమెరికా అధ్యక్షుడు, శ్రీలంక అధ్యక్షుడు లాంటి వారు ఈ లిస్ట్‌లో టాపర్స్. కొందరు తీవ్రవాదులతో చిన్నపాటి టై-అప్ కూడా పెట్టుకున్నాను. ఏం చెయ్యమంటావు కుమారా? బ్రహ్మకు వేరే టెన్షన్స్, పనీపాటా లేకపోవడంతో నిర్విరామంగా సృష్టి చేసుకుంటూ పోతున్నాడు. అతని వేగాన్ని అందుకోలేకపోతున్నాను.”
ప్రధాని పెద్దగా నిట్టూర్చి, “దేశవ్యాప్తంగా నీటి కొరత పెద్ద సమస్యగా ఉంది…” అంటూ శివుని తలపైకేసి ఆబగా చూశాడు.
శివుడు దౌడు తీసి మాయమయ్యాడు.
16. మెను
శాంతి వచ్చి పదిహేను నిముషాలయ్యింది. అయినా సర్వర్ ఇంకా ఆర్డర్ తీసుకోడానికి రాలేదు. ఎప్పట్లాగే ఏసీలో కూడా చెమట కారుతోంది.
‘ఎక్స్‌క్యూజ్‌మీ…’ అని కేకేసింది.
పెద్దబొజ్జ వ్యక్తి తిరిగి చూశాడు. బొజ్జకూడా ప్రయాసతో తిరిగింది.
‘ఇంకా ఆర్డరే తీసుకోలేదు, వచ్చి అర్ధగంట అయింది!’ అంది.
‘సారీ మేడమ్!’ అని చెప్పి బొజ్జ వెనక అతను నడిచెళ్ళి మెను కార్డు తీసుకుని పదిలంగా నడిచి వచ్చి శాంతి చేతికిచ్చాడు.
పదిహేను నిముషాలు మెను కార్డ్ చూసింది.
“మేడమ్…’ అంటూ ఆర్డర్ తీసుకోడానికి ఆయత్తమయ్యాడు సర్వర్.
‘ఒక కర్డ్ రైస్. చికెన్ కర్రీ లేదా?’ అనడిగింది శాంతి.
17. ఇంటర్వ్యూ
(మేకప్ లేకున్నా కూడా కళ్ళు తిప్పుకోలేని సహజసిద్ధమైన అందం ఆమె సొంతం. దక్షిణాదినంతా తన అందంతో, నటనతో చిన్నా పెద్దా ఆడా మగా తేడా లేకుండా అందర్నీ కట్టిపడేసిన సినిమా హీరోయిన్ అరణ్య. తెల్ల స్కర్ట్, తెల్లటి స్లీవ్‌లెస్ టీ షర్ట్‌లో దేవతలా నడిచి వచ్చింది. ‘సారీ, పది నిముషాలు వెయిట్ చేయించాను…’ అంటూ రెండు చేతుల్లో రెండు టీ కప్పులు పట్టుకు వచ్చింది. ఆమె మాట్లాడుతుంటే ఆమె నుదురు, కళ్ళు, ముక్కు, బుగ్గలు, పెదవులు, గడ్డం, మెడ.. అన్నీ ఆమె మాటలను అభినయం చేస్తున్నాయి. ఆమె ఇంటి స్విమ్మింగ్ పూల్ పక్కనున్న లాన్‌లో కుర్చీలు వేసుకుని లెమన్ టీ సిప్ చేస్తూ ముచ్చటించిన విశేషాలు…)
–ఉన్న పళంగా మీ కరియర్లో ఓ బ్రేక్ పడినట్టు ఉందే?
నేను ఏదీ ప్లాన్ చేసుకుని చెయ్యను. కథ నచ్చితే అడిగినవాళ్ళకు ఎన్ని కాల్ షీట్లయినా ఇస్తాను. కొన్ని సందర్భాలలో వాళ్ళే సరిగ్గా వాడుకోకుండా వృధా చేస్తుంటారు. అలాంటప్పుడు చిరాకేసి కొన్ని నెలలపాటు తెలుగు సినిమాలను దూరంపెట్టక తప్పలేదు. తమిళ్‌లో నాలుగు సినిమాలు చేస్తున్నాను. హిందీలో ఒకటి సైన్ చేశాను. అరణ్య ఇప్పటికీ హాటే!
–మీరు పేమెంట్ ఎక్కవగా డిమాండ్ చెయ్యటంవల్లే తెలుగులో… (ప్రశ్న ముగించేలోపే అడ్డుకుని)
ఇంతవరకు నేను నోరు తెరచి ఎవర్నీ ఇంత ఇవ్వండి అని అడిగింది లేదు, తెలుసా? వాళ్ళుగా ఇంత ఇస్తాం అని చెప్పేసి దాంట్లో కూడా తగ్గించుకునే ఇస్తారు. రిటర్న్ అయిన చెక్కులన్నీ కలిపితే తయారైన ఒక ఆల్బమే ఉంది నా దగ్గర.
–కాదూ, మీ పేమెంట్ ఒకటిన్నర కోటి అట కదా?
అది నిజం కాదు.
–ఎప్పుడూ యంగ్‌గా ఫ్రెష్‌గా ఉంటారే, ఎలా?
సింపుల్. నాకు కోపమే రాదు. అసూయ లేదు. రోజూ ఎక్కువగా నీళ్ళు తాగుతాను. జూసులు బాగా తీసుకుంటాను. సాయంత్రం ఆరు గంటలకల్లా డిన్నర్ చేసేస్తాను. యోగా చేస్తాను.
–మీతో చేసిన హీరోల్లో మీకు బాగా నచ్చినవారు ఎవరు?
ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. ప్రభాస్ ఫైట్స్‌లో దుమ్ము లేపుతారు. జూనియర్ ఎమోషన్స్ పండిస్తారు. అర్జున్‌ని డాన్స్‌లో బీట్ చెయ్యలేం. శర్వానంద్ సింపుల్‌గా స్కోర్ చేస్తారు. నాని నేచురల్‌గా చేస్తారు. రామ్ చరణ్ నటనలో ఇన్వాల్వ్ అయి చేస్తుంటే ఆయన నటనని చూస్తూ నేను నా పాత్రను మరిచిపోయి డైరెక్టర్ల దగ్గర తిట్లు తిన్న సందర్భాలున్నాయి. విష్ణు డెడికేషన్. చై సింప్లిసిటీ. మహేశ్‌బాబుగారైతే ఆడపిల్లలకంటే ఎక్కువగా సిగ్గుపడిపోతుంటారు, అంత మొహమాటం. కల్యాణ్‌గారు అంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా కేజువల్‌గా ఉంటారు, వర్క్‌లో మాత్రం చాలా సిన్సియర్.
–సాటి హీరోయిన్లు తెలుసా? మీకెవరంటే ఇష్టం?
అందరూ స్వీట్ గర్ల్సే. కలసినప్పుడు చాలా మాట్లాడుకుంటాం. అందరూ వర్క్ విషయంలో ప్రొఫెషనల్‌గా ఉంటారు. సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫోన్ చేసి పరస్పరం అభినందించుకుంటాం.
–మీరు నటించే సినిమాలు మీకు తృప్తిగా అనిపిస్తాయా?
కథలు నాకు నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటాను. అప్పటికీ కొన్నిసార్లు కేల్‌క్యులేషన్స్ తప్పుతుంటాయి. నాకు నచ్చడం, తృప్తిగా ఉండటం కన్నా ప్రొడ్యూసర్స్, ప్రేక్షకుల తృప్తి ప్రధానం. డబ్బే ఇందులో పెద్ద కొలమానం.
–మీరు ఇక్కడ చేస్తున్న సినిమాలకూ, తమిళంలో చేసే సినిమాలకూ చాలా తేడాలున్నాయిగా? తమిళంలో ఎక్కువ గ్లామరస్‌గా చేస్తున్నారు, ఎందువల్ల?
కథ. ఎంత గ్లామర్ ఓకే, ఎంత ఓకే కాదన్న బౌండ్రీస్ నాకు బాగా తెలుసు. తమిళైనా, తెలుగైనా, హిందీ అయినా కథ డిమాండ్ చేస్తున్నట్టయితే ఎంత గ్లామరైనా చూపించచ్చు.
–మీకూ ఆ డైరెక్టర్‌కూ ఏదో నడుస్తోందని గాసిప్స్ వస్తున్నాయిగా?
నేను ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాను. అందరితోను క్లోజ్‌గా ఉంటాను. నాకు నటించడం చేతకాదు.
–అయితే ఆ డైరెక్టర్‌తో మీకు ఎలాంటి ప్రేమా లేదంటారా? ఆయన జస్ట్ ఫ్రెండేనంటారా?
కేవలం ఫ్రెండే అని చెప్పను, నా జీవితంలో ఒక ముఖ్యమైన మగవాడు. ఇద్దరి అభిరుచులు కలుస్తాయి. నా ఇంటికి ఎప్పుడైనా రాగలవాడు. నేను లేనప్పుడు కూడా మా వాళ్ళందరితో కలిసి కబుర్లు చెప్పుకునేంత చనువు ఉంది. చాలా?
(ఇప్పటికి ఇంత చాలు అని నవ్వి పది నిముషాల క్రితం వచ్చిన జూస్ తీసి చేతికిచ్చింది. తాగి సెలవు తీసుకున్నాను. జూస్ కూడా అరణ్యలా చల్లగా ఉండి, ప్రాణానికి హాయిగా అనిపించింది.)
– దర్శన్ ధర్మవరం.
టైప్ చేసి ముగించి పక్కకు తిరిగి ఒళ్ళు విచ్చుకున్నాడు దర్శన్. ఐదు నిముషాల్లో ఫ్రూఫ్ సరి చూసి, ఒకటి రెండు వాక్యాలు సవరించి తాను పని చేస్తున్న పత్రికకు మెయిల్ చేశాడు. తృప్తిగా అనిపించింది. మూడ్ బాగుండటంతో తరువాయి ఇంటర్వ్యూ కూడా ఇప్పుడే రాసేద్దామా అని ఒక క్షణం ఆలోచించాడు. టైమ్ చూసుకున్నాడు. 5:30. ఏడింటికి ఎవర్నో కలవడానికి బారుకు వెళ్ళవలసి ఉండటం వల్ల స్నానానికి వెళ్ళాడు.
ఒళ్ళు తుడుచుకుంటూ ఫోన్ చూసుకున్నాడు. నాలుగు మిస్డ్ కాల్స్. ఒకే నెంబర్. ఆఫీసునుండి.
కాల్ రిటర్న్ చేశాడు.
“దర్శన్, ఇందాకే ఎడిటర్‌కి ఇంపార్టంట్ కాల్ వచ్చిందట. అరణ్య విషయం వచ్చే వారం చూసుకోవచ్చు. శివాని ఇంటర్వ్యూ ఈ వారమే రావాలట. పెద్ద డీల్‌లా ఉంది. చాలా సోర్సెస్ ద్వారా ట్రై చేస్తున్నారట. శివాని ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్ కూడా వచ్చేశాయి. చాలా బాగున్నాయి. ఒకటి కవర్ ఫోటోకి కూడా పనికొస్తుంది. నువ్వు పంపించిన అరణ్య ఇంటర్వ్యూ చదివాను. నువ్వు చెప్పు, దీన్ని శివాని ఇంటర్వ్యూగా వేసుకోవాలంటే ఏమైనా మార్చాలా? లేదంటే కొత్తగా రాసిస్తావా?”
దర్శన్ మూడు సెకన్లు ఆలోచించాడు. “ఏం మార్చక్కర్లేదు, అలానే వేసుకోవచ్చు.”
“ఒరేయ్! పేరు మార్చాలిరా!” పగలబడి నవ్వాడు ఫోన్‌లో ఉన్న వ్యక్తి.