పాలు తాగిన వినాయకుడు

(కవన శర్మ గారు ముప్ఫై ఏళ్ళ పైగా కథలు, నవలలు, వ్యాసాలు రాస్తున్నారు. వీరి “బ్రెయిన్‌ డ్రెయిన్‌ అను అమెరికా మజిలీ కథలు”, రాసి ముప్ఫై ఏళ్ళౌతున్నా నిత్యనూతనాలు. హాస్యం, వ్యంగ్యం వీరి రచనల్లో ఆనందనాట్యం చేస్తుంటాయి. శ్రీ శర్మ గారు ఐ.ఐ.ఎస్‌.సి. బెంగుళూర్‌ లో ప్రొఫెసర్‌గా పనిచేసి ఈ మధ్యనే రిటైరయ్యారు.
కొన్ని నెలల క్రితం  బాగా ప్రచారం పొందిన కొన్ని సంఘటనల గురించిన ఈ వ్యాసం కవనవనంలో మరో హృదయంగమ సుమం.)

ప్రజాపతుల కాలంలో అంబ దగ్గర పాలు పాగిన లంబోదరుడు, మళ్ళీ భారతీయ జనతాపక్షం తెలుగుదేశ ఘనతాపక్షం కలిసి రాజ్యమేలుతున్న స్వర్ణయుగంలో కొన్ని వేల సంవత్సరాల అనంతరం తనకి పట్టిన పాలు విశాఖ డయిరీవా? ముంబాయి డయిరీవా? నిన్నటివా? మొన్నటివా? అని ఆలోచించకుండా ఎడాపెడా తాగేసాడు. అతగాడి చిన్నప్పుడతడు ఎప్పుడూ ఎడే తాగేవాడు. పెడ తాగటానికి అవకాశం ఉండేది కాదు. ఎప్పుడైనా బాల్యచేష్ట వల్ల పెడవైపు చెయ్యి వెయ్యబోయినా పాలిల్లు కాక పాము తగిలేదిట పాపం. శివుడికి పెద్దిల్లూ, చిన్నిల్లూ వున్నా వినాయకుడికి మాత్రం తాగటానికి పాల ఇళ్ళు లేవు. ఉన్నది ఒక్కటే ఇల్లు! అందరి పిల్లలకి సాధారణంగా అందుబాటులో ఉండే రెండు అవకాశాల బదులు తనకి ఒకటే ఉండటం వల్ల వినాయకుడికి “మెంటల్‌” వచ్చింది. (ఈ తెలుగు వాడకం వింటే నాకు “మెంటల్‌” వస్తూ ఉంటుంది. ఈ ఘోరమైన వాడకం తెలుగు వాళ్ళని ఇబ్బంది పెట్టదు. నేను తెలుగు రచయితని కనక, నా రచన లు తెలుగు వాళ్ళు చదవాలనే కోరిక ఉన్న దురాశాపరుడిని కనక మెంటల్‌గా సర్దుకొంటున్నాను.) దాని పరిణామమే వినాయకుడు ఆబగా పాలు తాగటం అయుంటుందని నేను పరిశోధించి తేల్చుకొన్నాను.

వినాయకుడు పాలు తాగుతున్నాడన్న వార్త భారతీయ సంస్కృతిని ప్రచారం చెయ్యటానికి కంకణం కట్టుకొన్న స్టార్‌ టీవీతో పాటు ఈటీవీ ఆటీవీ కూడా ప్రసారం చేసాయి. ది హిందూ తో పాటు ది క్రిస్టియన్‌ పత్రిక ఆ వార్తని ప్రచురిస్తూ హిందువుల మూఢనమ్మకాలని విమర్శించింది. అయితే అదే పత్రిక తన నాలుగో పేజీ మూడో కాలమ్‌లో కలకత్తాలో క్రీస్తు రక్తం కార్చాడనీ తనని నమ్మిన వారి పాపాల్ని తన రక్తంతో ప్రక్షాళనం చేస్తాడనీ మరోసారి ఋజువు చేసినట్టు వ్రాసింది.

ఈ వార్త ఇండియాలోనే కాక భారతదేశ ఆధ్యాత్మికత మీద ఎంతో గౌరవం కల ఎన్నో దేశాల్లో సంచలం కలిగించింది. ప్రపంచం అంతట “ఇదిగో తొండం” అంటే “అవిగో గిన్నెలో పాలు తరిగాయి” అంటూ ప్రయోగాలు, ప్రదర్శనలు మొదలయ్యాయి.

“ఇన్నాళ్ళబట్టి లేని పాలకుతి వినాయకుడి కీనాడేల?” అని నేను ప్రశ్నిస్తే, “మనం పడ్తే ఎప్పుడూ తాగుతాడు. ఇన్నాళ్ళూ మన  బిజీలో మనం ఉండి (ఈ తెలుగు వాడకం కూడా కేవలం నా దురాశ వల్లే) మనం పట్టనూ లేదు అతగాడు తాగనూ లేదు” అని మా తోడల్లుడు, “పైవాడి”కిష్టుడు అయిన రంగస్వామి గారు నా అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేసారు. వాళ్ళింట్లో వినాయకుడు పాలు తాగాడు. మా ఇంట్లో వినాయకుడికి నేను పట్టే పాల మీద నమ్మకం లేక తాగలేదు. దానికాయన బాధ్యుడు కాదే! అందుకని నేను వినాయకుడు పాలు తాగలేదంటే చెల్లుతుందా?

ప్రపంచం లోని దుఃఖభాజనుల్లో నిత్యశంకితులు ఒక వర్గం. ఆ విషయం చిన్నప్పుడే చిన్నయసూరి నుంచి విని కూడా నా గుణం మార్చుకోలేకపోయాను. ప్రపంచంలో అందరూ సుఖభాజనులు కారు. రెండో రకం వాళ్ళు తీరి కూర్చోలేక “అంతర్జాతీయ అపనమ్మకాల సంఘం” స్థాపించుకొన్నారు. అందులో దేవుడిని నమ్మని వారు, దేవుణ్ణి నమ్మకపోయినా ఆత్మల్ని దెయ్యాల్ని నమ్మే వారు (ఈ వర్గం వారు తులసిదళం ధరిస్తూ ఉంటారు!), రేషనలిస్టులు, రేషనలైజేషనిస్టులు, ఇల్లా చాలా రకాల వాళ్ళు సభ్యులుగా ఉన్నారు.

అంతర్జాతీయ అపనమ్మకాల సంఘం “వినాయకుడు పాలు” అనే  అంశానికి సంబంధించిన దృష్టాంతాలు పరిశీలించవలసిందిగా శతపరిశోధనాపత్ర రచయితనైన నన్నూ, తులసీదళ వర్గనేత, అఖిల మంత్రతంత్ర శాస్త్ర పారంగతుడూ అయిన “యమూవీ” అనే హైదరాబాద్‌ ఆయన్నీ, రేషనలైజేషనిస్టూ, కంఠేక్రాసు, ఫాలభాగే విభూతి ధరిస్టూ, సెక్యులర్‌ సైన్స్‌ విభాగ అధ్యక్షుడు అయిన సుభాంతం అనే అణుశాస్త్రజ్ఞుడినీ కోరింది.

నేను వెంటనే మట్టివినాయకుడితో, కుండవినాయకుడితో, పంచలోహవినాయకుడితో, వెండివినాయకుడితో పాలు తాగించే ప్రయత్నం చేసి నాలుగు పేపర్లు, పాలు తాగించే ప్రక్రియలో ఇద్దరేసి వినాయకుల్ని పోలుస్తూ ఆరు పేపర్లు, ముగ్గురేసి వినాయకుల పాటవాలు పరిశీలిస్తూ మూడు పేపర్లు, నలుగురినీ పోలుస్తూ మరోటి మొత్తం పధ్నాలుగు పరిశోధనా పత్రాలు తయారు చేసాను. అందరు వినాయకులూ పాలు తాగినట్టే ఉన్నారు కాని ఎంత తాగిందీ లెక్క కట్టటమే సాధ్యపడలేదు. ఎంత పరిమాణం వినాయకుడి ఒంటిమీద ఒలికిపోయాయి? ఎంత పరిమాణం ఇగిరి (ఆవిరై) పోయాయి? అన్నవి సరిగ్గా లెక్కతేల్చటం కష్టం అయింది. లీటరు పాలు తీసుకొంటే 600 మి.లీటర్లు మిగిల్తే మిగిలిన 400 మి.లీటర్లు వినాయకుడు తాగినట్టేనా? వినాయకుడి బొజ్జలో పాలు వినాయకుడి బరువు పెంచవా? వినాయకుడి బరువు పెరిగితే, వంటి మీద ఒలికి ఇంకా ఆరని పాల బరువు అందులో ఎంత శాతం? ఇవన్నీ విపులంగా చర్చించి, వినాయకుడు పాలు తాగలేదు కాని అలా అని చెప్పటానికి ధైర్యం చాలటం లేదని, ఇటువంటి ప్రయోగాలనే అంజనేయుడు, రాముడు, సీత, శివుడు, పార్వతి, సరస్వతి, లక్ష్మి మొదలైన విగ్రహాలతో గూడా చేసి వినాయకుడికి ప్రత్యేకత ఉందో ఆ పని అందరూ చాటుగా చేస్తున్నా ప్రచారం పొందటం లేదో తేల్చాల్సిన అవసరం ఉందని వ్రాసాను.

దానికి సమాధానంగా యమూవీ శిష్యులు శరపరంపరలాగా పరిశోధనా పత్రాలని వదిలారు. విషాచి నుంచి తాము కాష్మోరా విగ్రహం సంపాయించి దానితోనూ, నాజీస్వామి నుంచి హిట్లర్‌ బొమ్మ సంపాయించి దానితోనూ పరీక్షలు చెయ్యగా వాళ్ళిద్దరికి కూడా పాలు తాగే అలవాటుందని తేలిందని అందులో వినాయకుడికి ప్రత్యేకత ఏమీ లేదని, ఎందుకంటే దయ్యాలున్నట్టు దేవుళ్ళు లేరని, వినాయకుడు తాగి  ఉంటే తొండంతో పాలు తీసుకొని నోట్లో పోసుకొని తాగి ఉండాలని, ఉన్న దృష్టాంతాలన్నీ తొండంతో పాలు తీసుకొన్నట్టే కాని నోట్లో పోసుకోగా ఎవరూ చూడలేదని, ఆ తొండాలలో తీసుకోడం కూడా దూరం నుంచి ఎవరో ఎలెక్ట్రానిక్‌ పరికరాలతో ఆదేశించగా ఆ విధంగా ఆదేశింపబడటానికి నిర్దేశింపబడిన వినాయకుడి విగ్రహాల విషయంలోనే జరిగినట్టుగా తాము నిస్సంశయంగా ఊహిస్తున్నామనీ తెలియజేసారు.

అసలు చంటబ్బాయి వినాయకుడేనని, చంటివాడు సార్థక నామధేయుడని, అతనికి చిక్కుడు గింజలు తినడంతో పాటు పాలు తాగే అలవాటు ఉందని చంటబ్బాయిని వెదకటానికి ప్రయత్నిస్తున్న మవెకృమూ పరిశోధక సంస్థ తెలియజేసింది.

డాక్టర్‌ సుభాంతం మాత్రం తన అన్వేషణని ఫ్రాయిడ్‌ కోణం నుంచి తెలుగు సాహిత్యం గుండా కొనసాగించి అసలు సిసలు నివేదనని సమర్పించాడు.

“కొంత వయస్సు వచ్చాక సహజంగా అంటే ఫ్రాయిడ్‌ చదవకుండా పెరిగిన జంతుజాలం పాలు తాగటం మానేస్తుంది. పాలు అవసరమై ఉంటే దేవుడే ఆ ఏర్పాటు చేసేవాడు. ఈ విషయం ఓసారి నేను కమలహసన్‌ని చూదామని వెళ్ళినప్పుడు అతను వసుంధరాదాస్‌తో అంటూండటం (చూ. హే రామ్‌ 2000) విన్నాను. కమలహసన్‌, మరికొందరు అలా అనుకోవచ్చు. రాజ్‌కపూర్‌, మరికొందరు మరోలా అనుకోవచ్చు. భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటం మనుష్యుల లక్షణం.

మనిషి, దేవుడు పుట్టించినప్పటిలాగా ఆహారం పోగుచేసుకొని ఆ దశలోనే ఉండిపోలేదు. దేవుడు వాళ్ళకి బుద్ధినిచ్చి “కోర్కెలని అవసరాలని స్వయంగా సృష్టించుకొని వాటిని తీర్చుకొనే క్రమంలో శ్లేష్మంలో పడ్డ ఈగల్లా కొట్టుకోండి” అన్నాడని నేను నమ్ముతాను. ఆయన ఆదేశానుసారం మనుష్యులు పశువుల్ని మచ్చిక చేసుకొని పాడిచేసుకోవటం, పాలు తాగటం (అవసరం లేకపోయినా) మొదలుపెట్టారు. వాటిని చంపితింటే ఆకలి కొద్ది రోజులే తీరుతుందని వాటిని బతకనిస్తే అన్ని కాలాల్లోనూ తిండికి కొరత ఉండదని గుర్తించగలిగారు. తన ఇంట్లోదే కాకుండా ఇతర్ల ఇంట్లోది దొంగిలించితే అసలు కొరత ఉండదని గ్రహించటమే భాగవతం చెప్పిన పరమార్థంగా గ్రహించాలి (చూ. పోతన ఒరుం కల్లు 1300).

నాగరికత వృద్ధి పొందిన కొద్దీ మనిషి పాలు పితుక్కోగల జంతువుల జాతులు పెరిగాయి. ఆవుతో పాటు గేదె, మేక, గుర్రం (లేక గాడిద) ఇల్లా ఎన్నో జంతువులు మనుష్యులకి మచ్చిక అయ్యాయి. పితృస్వామ్యం స్థిరపడ్డాక స్త్రీని మభ్యపెట్టటం, మచ్చికచేసుకోవటం చేతనైనాక, ఆమె వల్ల తను ఏమేమి పొందగలడో తెలుసుకొన్నాడు.

తల్లి వద్ద పాలు తాగటం చాలా సంతృప్తి కలిగించే అనుభవం అని ఫ్రాయిడ్‌ ద్వారా మనం ఈ మధ్య తెలుసుకొన్నాం. చనుబాలకి మగవాడికున్న అవసరం క్రమేపి వాటి జన్మస్థానాల పట్ల ఆకర్షణగా మారింది. అందుకే తెలుగు సాహిత్యం లోనూ సినిమాల్లోను పాల జన్మస్థానాలు విశిష్టస్థానం సంపాదించుకొన్నాయి. అన్ని జోకులు, బూతులు వాటి మీదే ఉండటం గుర్తించాలి. చిన్నప్పుడు తల్లి దగ్గర చాలినంతగా పాలుతాగని వాడికి కుతి తీరదని అందువల్ల పెద్దయ్యాక కూడా అవకాశం వచ్చినప్పుడల్లా, దాన్ని విడవకుండా, కుతి తీర్చుకొంటాడని తెలియజెప్పటానికి అలనాటి అడివి బాపిరాజు (1930) నుంచి ఈనాటి బలివాడ కాంతారావు (1980) దాకా, బమ్మిడి జగదీశ్వర రావు (1990) దాకా కథాసాహిత్యం మనకి ఉంది.

వినాయకుడు చిన్నప్పుడు తృప్తిగా పాలు తాగిన వాడు కాదు. పాల పట్ల అతని కోర్కె పూర్తిగా తీరలేదు. పైగా ఇప్పటి గృహిణులకు ఉండ్రాళ్ళతో పాటు నవకాయ పిండివంటలు చేసిపెట్టే తీరుబడి లేదు. వినాయకుడికి ఒకటే ఆకలి పాపం! అది తీరకపోతే దుగ్ధ. అందుకని అది పాలతో తీరితే సంతోషిస్తున్నాడు. ఇన్నాళ్ళూ, పెద్దయ్యాక పాలు తాగితే సాకేతరామ అయ్యంగార్లు నవ్వుతారేమోనని మానేసినా, తెలుగు సాహిత్యం, సినిమాలు, ఫ్రాయిడ్‌ సమర్థిస్తారని తెలిసి ఒకానొక మానసిక పరిస్థితిలో ధైర్యం చేసినట్టు అనుకొంటున్నాను.

దయ్యాలు పాలు తాగుతాయని యమూవీ వర్గం అభిప్రాయంతో ఏకీభవిస్తూనే, మనుషులు చేసిన దేవుళ్ళు మనుషులకి భిన్నం కారన్న వాదం దృష్య్టా దేవుళ్ళు కూడా పాలు తాగుతారని నమ్ముతున్నాను.

అందరు దేవుళ్ళ లోను నమ్మకమున్న సెక్యులర్‌ శాస్త్రజ్ఞుడినైన నేను వినాయకుడు కూడా దేవుడేనని నమ్ముతున్నాను. కొందరు కాపిలారిటీ, సర్ఫేస్‌ టెన్‌షన్‌ అంటూ సైంటిఫిక్‌ జార్గన్‌తో వినాయకుడు పాలుతాగటాన్ని వివరించగలిగినా, కొందరు వినాయకుళ్ళయినా ఆకలికి ఆగలేక తాగారని మనం అనుకోడానికి అభ్యంతరం కనిపించడం లేదు” అంటూ సుభాంతం తన పేపరు ముగించాడు.

తాజావార్త అంతర్జాతీయ అపనమ్మకాల సంఘానికి ఈ నివేదికల్లో దేనిపట్లా నమ్మకం కలగలేదుట. ఆ నివేదికల్లో నాది కూడా ఉందిట. అందుకని వారి జర్నల్లో ఏదీ ప్రచురించమన్నారు.