ఆగస్ట్ 2018

స్వేచ్ఛాభారతంలో ఇంకొక రోజు, ఇంకొక దౌర్జన్యపర్వం. ఈసారి మళయాళ రచయిత హరీశ్‌పై దాడులు. కారణం? షరా మామూలుగానే మనోభావాలు గాయపడటం. మా స్త్రీలను అవమానించేలా నీ నవలలో ఒక పాత్ర మాట్లాడింది కాబట్టి నీ భార్యాబిడ్డలను బలాత్కారం చేస్తాం, నీ చేతులు నరికేస్తాం అని బెదిరింపులు. ఈ రకమైన న్యాయం మధ్యప్రాచ్య తాలిబన్లకూ, మనదేశపు ధర్మగంగబిందువులకూ మాత్రమే సబబనిపిస్తున్నట్టుంది. ఇది భౌతికమైన దాడి. ఇక రెండవది, మానసికమైన దాడి. ఒక రచన ఆధారంగా రచయిత నైతికత, శీలం అంచనా వేయడం, సోషల్ మీడియా ముసుగులో అవమానాలు, ముద్ర వేయడాలవంటివి. పైకి వేరుగా అనిపించినా ఈ రెండు రుగ్మతలకూ మూలం ఒకటే–తమకు తప్పనిపించే భావాలపై ఉండే విపరీతమైన అసహనం, దానితో వచ్చే క్రూరత్వం. సక్రమమైన రీతిలో స్పందించలేని, వ్యతిరేకించలేని దుర్బలత్వం, దాని ద్వారా వచ్చే అనైతిక ప్రవర్తన, ఇందుకు కారణాలు. ఏ మంచి కోసమైనా సరే, ఎంతమాత్రమూ సమర్థించకూడని లించింగ్ మాబ్ మెంటాలిటీ ఇది. తమను, తమ జీవితపు సంఘటనలను, తమ వాదాభిప్రాయాలను పేలవమైన కథలుగా చెలామణీ చేసే రచయితలు లేరని కాదు కాని, కథలన్నీ రచయిత అనుభవాలుగా, పాత్రల ఉద్దేశాలన్నీ రచయిత అభిప్రాయాలుగా మాత్రమే అనుకోవడం, రచయితకు కాల్పనిక దృష్టి లేదని అవమానించినట్టే. స్పందన వ్యక్తపరచిన అభిప్రాయం గురించి ఉండాలి కానీ వక్త గురించి కాదనేది మౌలిక జ్ఞానం. విమర్శ రచన గురించే తప్ప రచయిత గురించి కాకూడదనేది కనీస మర్యాద. పాఠకుల మాట అటుంచి, కనీసం ఇది విమర్శకులకూ రచయితలకూ అలవడనంత వరకూ సాహిత్యస్పందన దొమ్మిలాట స్థాయిని దాటదు. తమకు నచ్చినట్టే, నచ్చినవే రాయాలి, అనాలి, వినాలి, చూడాలి అనే సాంస్కృతిక నాజీల దౌర్జన్యమూ ఆగదు. రచయితకు, ఆమాటకొస్తే ఏ కళాకారునికైనా తన సృజనను, అది ఎంత వివాదాస్పదమైనదైనా సరే, నిర్భయంగా ప్రకటించగలిగే, ప్రదర్శించగలిగే స్వేచ్ఛ ఉండాలి. ఆ తర్వాతే ఏ చట్టబద్ధమైన నిరసనైనా. మనిషిని జంతువు నుండి వేరు చేసే ఒక గొప్ప శక్తి మాట. ఆ మాటకున్న శక్తిని సంపూర్ణంగా గుర్తించేది, దాని విలువను నిలబెట్టగలిగేది సమర్థులైన రచయితలే. వారికి ఆ స్వేచ్ఛనివ్వలేని సమాజం ఒక జంతుసమూహం మాత్రమే.


ఈ సంచికలో

  • కథలు: ఒక సంస్కారవంతమైన కథ – పూర్ణిమ తమ్మిరెడ్డి; పరీక్ష – చంద్ర కన్నెగంటి; సైజు – ఆర్. శర్మ దంతుర్తి; బేతాళ కథలు: కథన కుతూహలం – 3 – టి. చంద్రశేఖర రెడ్డి; ది టర్న్ – లైలా యెర్నేని; వెలుగు – అవినేని భాస్కర్ (మూలం: ఎ. ముత్తులింగం); వెన్నెల తెరపై వెండి కల – వాయుగుండ్ల శశికళ (స్వగతం); రెండు ముచ్చట్లు – పూడూరి రాజిరెడ్డి (స్వగతం).
  • కవితలు: ఒక ఖాళీ ఉదయం – విజయ్ కోగంటి; కారణాలేమీ అక్కర్లేదు – తేళ్ళపురి సుధీర్ కుమార్
  • వ్యాసాలు: తెలుగు సాహిత్య విమర్శ: సాహిత్యేతర శాస్త్రాల ప్రమేయం – లక్ష్మణ చకవ్రర్తి; మళ్ళీ మందాక్రాంతము – జెజ్జాల కృష్ణ మోహన రావు; సిలబస్: 6. బాపూ బొమ్మ – అన్వర్
  • ఇతరములు: విధి నా సారథి: పొత్తూరి వెంకటేశ్వరరావు ఆత్మకథ – ఇంద్రకంటి వేంకటేశ్వర్లు (సమీక్ష); రాగమాలిక – దాసరి అమరేంద్ర (యాత్రాసాహిత్యం); నేహల: చారిత్రక నవల – జెజ్జాల కృష్ణ మోహన రావు (సమీక్ష); నాకు నచ్చిన పద్యం: అభినవ కవిబ్రహ్మ తెలుగు నుడికారం – చీమలమర్రి బృందావనరావు; గడి నుడి 22 – భైరవభట్ల కామేశ్వరరావు.