పరీక్ష

అతనిది కాని రోజొకటి వచ్చింది. దేనికీ బదులు రాకపోవడంతో అలక అనుకున్నాడు ముందు. అంతకన్నా సీరియస్ అని నెమ్మదిగా అర్థమయింది. వేడుకోళ్ళతో వెంటపడ్డాక చెప్పింది ఏం తప్పు చేశాడో.

“నువు నన్ను ప్రేమించడం లేదు.”

“లేదు, ప్రేమిస్తున్నాను. నువు ఏం చేయమన్నా చేస్తాను నా ప్రేమను నిరూపించుకోడానికి.”

“ప్రేమించడమే కదా ప్రేమకి రుజువు!”

“నా ప్రేమ నిజం. నిరూపిస్తాను.” చెప్పాడు. వినిపించుకోలేదు.

మాట్లాడలేదు. అప్పుడూ, తర్వాత కూడా. ఇద్దరికీ మిత్రులయిన వాళ్ళతో యథాతథంగా మాట్లాడుతూంది.

“నిన్ను పట్టించుకోవడం లేదు.” చెప్పారు వాళ్ళు. “పరీక్షిస్తూంది.” చెప్పాడు.

పుట్టినరోజుకు అతన్ని తప్ప అందరినీ పిలిచింది.

“నిన్ను అవమానించింది.” చెప్పారు వాళ్ళు. “పరీక్షిస్తూంది.” చెప్పాడు.

ప్రమాదంలో కాలు విరిగి హాస్పిటల్‌లో చేరినా పలకరింపు లేదు.

“నిన్ను మర్చిపోయింది.” చెప్పారు వాళ్ళు. “పరీక్షిస్తూంది.” చెప్పాడు.

“ఎవరితోనో తిరుగుతూంది.” చెప్పారు వాళ్ళు. “పరీక్షిస్తూంది పరీక్షిస్తూంది.” చెప్పాడు.

“ఎవరితోనో పెళ్ళవుతూంది.” చెప్పారు వాళ్ళు. “పరీక్షిస్తూంది పరీక్షిస్తూంది.” చెప్పాడు.

“కాపురానికి వెళ్ళిపోయింది.” చెప్పారు వాళ్ళు. “పరీక్షిస్తూంది పరీక్షిస్తూంది.” చెప్పాడు.

జీవితం ఒడ్డుకి చేరి అక్కడే నిలబడిపోయాడు. “కదులు కదులు!” మబ్బులు గర్జిస్తూ చెప్పాయి. “పద పద!” చినుకులు కురుస్తూ తట్టాయి. “రా రా!” పిట్టలు పాడుతూ పిలిచాయి. “మరిచిపో మరిచిపో!” ఆకులు రాలుతూ అన్నాయి.

కదలని మరవని అతనికి అవసానదశలో ఒకటే ప్రశ్న. దాన్ని మోసుకుంటూ ఎక్కడెక్కడో వెతకగా చివరికి కలిసింది. తనను గుర్తు పట్టాక అడిగాడు “నేను పరీక్షలో నెగ్గానా?”

“ఏం పరీక్ష?” అన్నది అయోమయంగా.

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...