ఏడు గోరీల కథ

పదేళ్ళ కిందటిమాట.


తొంభైల్లో ముచ్చటగా మూడు సార్లు ఆ ఊరి మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన మోటూరు సుబ్బయ్య నాయుడు కొత్త శతాబ్దం మొదలు కాగానే అగ్రహారం ఉత్తరాన ఉన్న దక్షిణపువీధి వార్డుకి కౌన్సిలరుగా ఎన్నికయ్యాడు. “భల్లూకపు పట్టంటే సుబ్బయ్యనాయుడిదే,” అన్నారు ఊళ్ళో జనం. సుబ్బయ్య నాయుడికే ఆశ్చర్యం వేసింది; అనుమానం కూడా వచ్చింది. “చూస్తూ ఉండండి, సుబ్బయ్య నాయుడే రికౌంటుకి దరకాస్తు పెడతాడు,” అని ఓడిపోయిన కాంగిరేసు వాళ్ళూ, కమ్యూనిష్టులూ, డిపాజిట్లు పోయిన ఇండిపెండెంట్లూ, ఒకళ్ళేవిటి – అన్ని రంగులవాళ్ళూ వేళాకోళం చేసారు. మూడు గ్రూపులుగా విడిపోయి హోరాహోరీ యుద్ధం చేస్తున్న కౌన్సిల్ మెంబర్లు – ఊరిలో పాత మోతుబరులు, మాజీ చైర్మన్లూ, – అందరూ చైర్మన్ పదవి ఎవరికి కట్టపెట్టాలో ఒక పట్టాన ఒప్పందానికి రాలేక తలకాయలు పగల గొట్టుకునేంత వరకూ వచ్చారు. మళ్ళీ మాజీ చైర్మన్ జోగి పంతులుని గనక చైర్మన్‌గా చేస్తే మునిసిపల్ ఆఫీసుకి అగ్గి పెడతానని ఒక పాత మోతుబరి టౌన్ హాల్లో పేకాడుతూ పబ్లిగ్గా పదిమందితో అన్నాడని వదంతి.

అందుకు కారణం లేకపోలేదు. ఆ ఊళ్ళో మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రేసు వాళ్ళూ, కమ్యూనిస్టులూ చైర్మన్ పదవికోసం కాట్లాడుకోవడం ఆనవాయితీ. పాతికేళ్ళనించీ, జోగి పంతులు అగ్రహారం వార్డునుంచి కౌన్సిలర్‌గా పోటీ లేకండా ఇండిపెండెంటుగా ఎన్నికయ్యేవాడు. మాణిక్యం కిళ్ళీకొట్టు కెదురుగుండా వంతెన గట్టు మీద కూర్చొని కేప్స్టన్ సిగరెట్లు కాలుస్తూ కూచునేవాడు, వచ్చేపోయే వాళ్ళనందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ! అన్ని గ్రూపులవాళ్ళూ కొట్లాడుకొని చివరికి జోగి పంతులునే చైర్మన్ చేసేవాళ్ళు. అయితే, ఈ సారి మటుకు మునిసిపల్ ఎన్నికల్లో ఒక షావుకారుగారిని ఊళ్ళో కూరగాయల వర్తకసంఘం వాళ్ళు పుల్లలు పెట్టి ఎక్కించి జోగి పంతులుకి ఎదురుగా ఇండిపెండెంటుగా పోటీ చేయించారు. జోగి పంతులు నెగ్గడమైతే నెగ్గాడు గానీ, బతుకుజీవుడా అన్నట్టు పాతిక వోట్ల మెజారిటితో నెగ్గాడు. అది ఆశ్చర్యమే మరి! “అగ్రహారం వోటర్లందరూ మనవాళ్ళే అనుకున్నాం సార్! ఈ మధ్యకాలంలో మనవాళ్ళే అనుకున్న వాళ్ళు కూడా తెలివి మీరి పోతున్నారు పంతులుగారూ” అని జోగిపంతుల్ని ఆయన అనూయాయులంతా సముదాయించారట!

చైర్మన్ పదవి గురించి కీచులాటలు మొదలై నెల దాటింది. ఈ గొడవలు ఇలా సాగుతూ పోతే, చివరకి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలని నిర్ణయించవచ్చు. ఇండిపెండెంట్లకే కాదు, కాంగ్రేసువాళ్ళకి, కమ్యూనిష్టులకీ ఆ భయం లేకపోలేదు. మళ్ళీ ఎన్నికలంటే, ఇప్పుడు నెగ్గిన వాళ్ళందరికీ బోలెడు డబ్బు ఖర్చు. పైగా, ఖర్చు పెట్టినా తిరిగి ఎన్నికవుతామన్న గ్యారంటీ ఏమిటి? వెంటనే ఎన్నికలొస్తే జోగిపంతులు సీటుకే ముప్పురావచ్చు.

ఈసారి సుబ్బయ్య నాయుడి సుడి తిరిగిందని చెప్పుకోవాలి. ఒంటిపిల్లిలా తటస్థంగా కూర్చున్న సుబ్బయ్య నాయుడుని మునిసిపల్ చైర్మన్‌గా చెయ్యడానికి మొత్తంమీద అన్ని వర్గాలవాళ్ళూ రాజీ పడ్డారు. జోగిపంతులే మధ్యవర్తిత్వం చేసి సుబ్బయ్య నాయుడి పేరు ప్రతిపాదించాడు. పిట్టపోరు, పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు, అనుకోకండా కౌన్సిలరుగా ఎన్నికయిన మోటూరు సుబ్బయ్య నాయుడు ఉన్నట్టుండి ఆ ఊరికి మునిసిపల్ చైర్మన్ అయ్యాడు.


ఆ ఊరి గురించి మీకు కొంచెం విపులంగా చెప్పాలి.

సుబ్బయ్యనాయుడు దక్షిణపు వీధి నియోజకవర్గం నించి ఎన్నికయ్యాడని చెప్పాను కదూ! దక్షిణపు వీధి అనేది ఒక వీధి కాదు. ఊరిలో అదొక పేట. ఒక సబర్బు. అల్లాగే తూర్పు వీధి, పడమర వీధీ కూడా ఉన్నాయి. అవి కూడా ఆ పెద్దూరికి సబర్బులే. నిజం చెప్పాలంటే సబర్బులు లేకపోతే అసలు ఆ వూరే ఉండదు. మరి ఎందుకనో తెలియదు; ఉత్తరపు వీధే లేదు ఆ ఊళ్ళో!

దక్షిణపు వీధి లోకి మిమ్మల్ని తీసుకోవెళ్ళే మట్టి రోడ్డు జూటుమిల్లు కెదురుగా కాలవ మీద కర్ర వంతెన దాటంగానే మొదలవుతుంది. ఆ మట్టి రోడ్డు మహా అయితే మూడు వందల గజాల పొడవుంటుందేమో, అంతే! సడెన్‌గా ఆ రోడ్డు ఆగి పోతుంది. కారణం ఎదురుగుండా ఉన్న ఏడు గోరీలు. ముందున్న మూడు గోరీలు బహుశా మూడడుగుల ఎత్తు ఉంటాయి. వాటి వెనకాలే ఉన్న మూడు గోరీలు కాస్త పెద్దవి. అన్నింటికన్నా వెనకాల ఉన్న గోరీ ఐదడుగుల పైనే ఉంటుంది. అవేమిటో చెప్పేవరకూ కొత్త వాళ్ళెవ్వరికీ అవి గోరీలు అని తెలియవు. అవి గోరీల్లా కనపడవు. చూడటానికి అచ్చంగా మన పెరట్లలో సున్నంతో కట్టిన తులసి కోటల్లా ఉంటాయి; తులసి మొక్కలే లేవు, అంతే. ఆ గోరీల దగ్గిరే మట్టి రోడ్డు రెండు చీలికలైపోతుంది. ఒక రోడ్డు ఎడమ పక్కకి, మరో రోడ్డు కుడి పక్కకీ. ఈ మధ్యలో ఏడు గోరీలు! ఆ ప్రాంతాన్ని విమానం మీదనుంచి ఫొటో తీసి చూపిస్తే, అచ్చంగా – ఒకప్పుడు హిప్పీలు మెళ్ళో వేసుకునే పీస్ సింబల్ లాగానో బెంజి కారు హుడ్ మీద ఆభరణం లాగానో కనపడుతుంది. ఇంజనీరు డ్రాయింగు గీస్తే సున్నాలో ఇరికించిన ఇంగ్లీషు అక్షరం ‘వై’ లా ఉంటుంది. ఆ మట్టి రోడ్డు చివర ఎడమ పక్కన ఉన్న మండువా లోగిలి సుబ్బయ్య నాయుడి ఇల్లు. సుబ్బయ్య నాయుడి ముత్తాత కట్టిన ఇల్లు. మూడు తరాల మోటూరు వారి చరిత్ర ఉన్న ఇల్లు. ఇప్పుడు మునిసిపల్ చైర్మన్ గారి ఇల్లు. చైర్మన్ గారి ఇంటి దొడ్డిగుమ్మానికి ఎదురుగుండా ఏడు గోరీలు.


చైర్మన్ అయిన వారానికల్లా సుబ్బయ్య నాయుడు ఊరి వీధులన్నింటికీ కొత్త రాటబల్లలు – తెల్లటి అక్షరాలతో ఆకుపచ్చ రాటబల్లలు – కట్టించాలని తీర్మానించాడు. ఊరి జనం శబాష్ అంటే శబాష్ అన్నారు. కౌన్సిల్లో ఎవడు మాత్రం కాదనగలడు?

చైర్మన్‌గారి ప్రణాళికైతే బాగానే ఉన్నది కానీ, పురిట్లోనే సంధి కొట్టిందా అన్నట్ట్లు ఆరంభంలోనే ఇబ్బంది వచ్చి పడింది. ఆ ఊళ్ళో చాలా రోడ్లకి పెట్టిన పేర్లేవీ లేవు, అన్నీ కొండ గుర్తులే తప్ప. ఉదాహరణకి, జనానికి బాగా అలవాటయిపోయిన పెద్ద రోడ్లు – ఆస్పత్రి వీధి, స్టేషను వీధి, చేపల బజారు రోడ్డు, బస్సు స్టాండ్ వీధి, రైస్ మిల్లు వీధి, పవర్ ప్రెస్సు వీధి, క్లబ్బు వీధి, శివాలయం సందు, వగైరా! ఇలాంటి వీధుల పేర్లన్నీ మార్చాలని కొందరు కౌన్సిల్ మెంబర్లు పట్టుబట్టారు. ఈ రోడ్డులన్నింటికీ వాళ్ళకిష్టమైన రాజకీయ నాయకుల పేర్లు పెడదామని సూచించడం మొదలెట్టారు. చేపల బజారు వీధికి ఇందిరా గాంధీ వీధి అని, రైస్ మిల్లు వీధికి లెనిన్ వీధి అనీ, ఆస్పత్రి రోడ్డుని అంబేద్కర్ వీధిగానూ మార్చాలని రకరకాల మార్పులు సూచించడంతో కౌన్సిల్లో కలకలం మొదలయ్యింది. సుబ్బయ్య నాయుడు ఈ విషయంలో మాత్రం చాలా పెద్దమనిషి తరహాగా వ్యవహరించాడు. “మీరు ఏ పేరు పెట్టినా ఊళ్ళో జనం చేపలబజారు వీధిని చేపలబజారు వీధనే అంటారు. పైగా, ఆ వీధిలో ఉన్న ఇళ్ళవాళ్ళు మీరు చెప్పే మార్పుకి ఒప్పుకోకపోవచ్చు కూడాను!” అని నచ్చజెప్పబోయాడు. కానీ ఎవడూ సుబ్బయ్య నాయుడు మాట ఖాతరు చెయ్యలేదు. వాళ్ళ మంకుపట్టు వదల్లేదు. “ఊ! సరే, అట్లాగే కానియ్యండి,” అని పైకి ఒప్పుకొని ‘మీ ఖర్మ’ అని మనసులో అనుకొని సర్దుకున్నాడు.