సౌభాగ్య కుమార మిశ్ర: రెండు ఒరియా కవితలు

1. ప్రథమ సంధ్యా సమయ స్వరం (ప్రథమ సంధ్యార స్వర)

ఈ సంధ్య విశాల ఆకాశంలో మెరిసిపోతుంది
పటాటోపంగా రకరకాల రంగుల కాంతులతో,
రక్తపు ఉప్పువాసన, వాడిపోయిన తామరపూవుపై
సిగ్గుమాలిన తేనెటీగ ఝంకారం; నేనెరిగిన
ఈ సంధ్య ఇవాళ రోత రుచులనుంచి విమోచన కోరుతుంది.

ఆహా! కఠినకాంస్యభూమిపై తలబాదుకొని సముద్రం రోదిస్తుంది
ఏమిటి? కాంస్యభూమి చనిపోయిందా? లేక చచ్చినట్టు నటిస్తున్నదా?
నువ్వు, నేను, రమానాథ్, మనందరం
పెద్దగుమాస్తా ఆఫీస్‌లో శూలనెప్పి అని నటించినట్లు!

కాఠిన్య కాంస్యభూమిని చూసి గాలి, నక్షత్రాలు,
సరివిచెట్టు, హోటల్, బ్రతుకు కదలికలు,
సర్వావయాలూ నిజంగానే రవంత నిర్జీవమైనాయి,
రాయిగామారిన అహల్య ఏ రాముడికోసమో ఎదురుచూస్తున్నది.

రాతిలో ప్రాణం ఎక్కడ? ప్రాణం లేకుండా
ఎదురుచూడటం ఎలా సాధ్యం, చెప్పు, ఓ వాల్మీకీ! ఓయీ విశ్వామిత్రా!
హే విజ్ఞానీ! ఇదేమిటో విశదంగా చెప్పు! నిరుడు నేను చూశాను,
స్టెనో అనుపమా దాస్ నాకోసం ఎంతో ఎదురు చూసింది.

ఎంత ప్రయత్నించినా తన ఉసురు నేను గుర్తించలేకపోయాను
టైప్ మెషీన్ టప్ టప్ టప్ టప్ అన్నట్టు, ఆమె గొంతులోనుంచి
మాట వెనుక మాట, మాట వెనుక మాట ఇప్పటికీ నా చెవుల్లో రింగుమని మోగుతున్నాయి.
హే శ్రీరామా! హే నీలసాగరా! జీవనబాటలో దుఖం తప్ప మరేమయినా మిగిలి ఉన్నదా?

2. ద్వితీయ సంధ్యా సమయ స్వరం (ద్వితీయ సంధ్యార స్వర)

ఏకాంతంగా ఉన్న కొండ త్రోవ దాటి క్రొత్త సంధ్య వెళ్ళిపోతుంది
సాంసారిక సుఖాల కోరికల భయం వృధా అని పారిపోయే సన్యాసినిలా
యుద్ధభూమిలో మరణం ఎంత బాధ, పైన ఎదురుగా వినపడే ఆర్తనాదం,
ఎదురుచూడటంలో కల ఎక్కడ? పూల వాసన తీపిలో తడిసిన వెన్నెల ఎక్కడ?

గాయపడ్డ ప్రాణం కాలప్రవాహంలో ఇసుకరేణువు
ఇసుకలో తలదూర్చి దొర్లుతాను ఇవాళ, ఒకవేళ మేఘాలొచ్చి వర్షం కురిస్తే,
నీకనురెప్పల క్రింద కోరిక నింపిన మేఘం, మెత్తని గడ్డిలా
ఇవాళ రాబోయే నీకల సఫలం కావచ్చు, కాకనూ పోవచ్చు,

ఇవాళ నేను ఖిన్నుణ్ణి, రోజంతా షికారుచేసి పక్షి
సుఖంగా తన గూటికి చేరింది, నన్ను అవమానించింది,
సన్యాసినిగా సంధ్య నా ప్రక్కనించి దూరమై వెళ్ళి పోయింది
మనసులో మేలైన కల అనేది ఏదీ ఉండకూడదు.

ఆశ్చర్యం! కోరిక గీత గీసి గబ్బిలం చీకటి గాలిలో ఎగురుతుంది,
వరండాలో కుర్చీలో అగపడని పెదాలమధ్య సిగరెట్ నిప్పు మండుతుంది.


(డా. సౌభాగ్య కుమార మిశ్ర అగ్రగణ్యులైన ఒరియా కవులలో ఒకరు, పదికి పైగా కవితాసంకలనాలను వెలువరించారు. మధ్యపదలోపి, నైపహర్న, అంధా మహుమాచ్చీ, బజరంజన్, ద్వా సుపర్ణ, మణికర్ణిక, అన్యత్ర, చర్చర అందులో కొన్ని. ఒరియా సాహిత్య అకాడెమీ అవార్డ్ (1978), కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ (1986) వీరు అందుకున్న పురస్కారాలలో ముఖ్యమైనవి. ప్రస్తుత నివాసం భుబనేశ్వర్. పైన ప్రచురించిన తెలుగు-ఇంగ్లీషు అనుసృజనలకు ఒరియా మూలాలు మిశ్ర ప్రథమ సంకలనం ఆత్మనేపదీ (1965) నుండి తీసుకోబడ్డాయి. పై కవితలు త్వరలో ప్రచురింపబడబోతున్న సౌభాగ్య కుమార మిశ్ర కవితల ద్విభాషా (తెలుగు-ఒరియా) అనువాద సంకలనం లోనివి.)