[2012 డిసెంబరులో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగినప్పుడు, తెలుగు విశ్వవిద్యాలయంవారు వెలువరించిన ఒక ప్రత్యేక సంచికలోనూ, పిదప రచయిత్రి గ్రంథం విశ్వనాథ కథన కౌశలం రెండవ ముద్రణలోనూ చోటుచేసుకున్న ఈ వ్యాసాన్ని ఈమాట పాఠకుల కోసం పునర్ముద్రిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ గ్రంథం గురించి కామేశ్వరిగారితో దేవులపల్లి ప్రభాకరరావుగారు చేసిన ముఖాముఖి ఈ వ్యాసానికి అనుబంధంగా ప్రచురిస్తున్నాం. –సం.]
ఈ మధ్య ఒక ఉత్తరాది వ్యక్తితో సంభాషించేటప్పుడు ‘మీ ఇటీవలి పుస్తకం ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. ‘ఏకవీర: విశ్వనాథ కథన కౌశలం’ అన్నాను. సంభాషణ ఇంగ్లీషులో సాగుతోంది. ‘Oh! Then it is about a sole Warrior, or a lone Warrior! What is the name of the hero?’ అన్నాడాయన. ‘నాయకుడు కాదు, నాయిక. ఆమె పేరు ఏకవీర’ అన్నాను. నాయిక పేరు పురుషుని పేరులా ఏకవీర అని ఉండటం ఆయనకు అర్థంకాలేదు. దక్షిణాదిలో ఏకవీరాదేవి ఆరాధన పరిచితమే కాబట్టి ఇక్కడి వారికి ఎవరికి ఒక నాయికకు ఏకవీర అని పేరు ఉండటంలో వైచిత్రి గోచరించదు. ఆ సంస్కృతితో పరిచయం లేకపోవటం వల్ల ఉత్తరాదివారికి అనుమానం కలిగింది.
ఆ సంభాషణ జరిగిన తరువాత ప్రతి అక్షరాన్ని సార్థకంగా ఉపయోగించి విశ్వనాథ రచించిన ఆ నవలలో, నాయికకు ఆ పేరునే ఎందుకు ఎంచుకున్నారు? దేవీనామమే కావాలంటే, అవి అనంతంగా ఉండగా ఏకవీర అనే పేరునే ఎంచుకోవటానికి కారణం ఏమిటి? అని కుతూహలం కలిగింది. ఏదో సార్థకమైన ఉద్దేశం ఉండే ఉండాలి. ఆ కోణంలో పరిశోధన ప్రారంభించేసరికి నిజంగానే గొప్ప అవగాహన, సాంకేతికతలను రంగరించి రచయిత ఆ పేరును ఉపయోగించారని స్పష్టమైంది.
అష్టాదశ శక్తి పీఠాలలో మాహురలోని ఏకవీరాదేవి ఆలయం ఒకటి. దానిని గూర్చి చెప్పుకొనేముందుగా భారతదేశంలో శక్తి ఆరాధనా విధానాల అవగాహన అవసరమౌతుంది. హిందూ మతంలో శక్తి ఆరాధన ఏర్పడిన విధానాన్ని స్థూలంగానైనా తెలుసుకోవలసి ఉంటుంది. ఏకవీర నవలకు, దేవీ ఆరాధన ఏర్పడిన చరిత్రకు సంబంధం ఏమిటి?
భారతదేశంలో దేవీ ఆరాధన ఎన్నో దశలలో రూపొందింది. ఏకవీరాదేవి మహారాష్ట్ర ప్రాంతం నుండి అలంకవరకూ ఎన్నో పేర్లతో ఆరాధింపబడుతోంది. భారతదేశంలో ఏకవీరాదేవికి గల వివిధ నామాలతో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వివిధ దశలలోన ఆ కథలు ఉన్నాయి. అన్ని దశల కథలతోను, ఏకవీర నవలానాయిక కథకు ఎక్కడో ఒక చోట సంవాదం కుదురుతూ ఉంది. ఒక్కొక్క కథను తెలుసుకుంటూ దానికి ఏకవీర కథానాయికతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గ్రహిస్తున్నప్పుడు, విశ్వనాథ తన ముప్పయ్యో వడిలో రచించిన ఆ రచన ఎంత ప్రౌఢమో అర్థం అవుతుంది. ఏకవీర నవల ఎంతగా ఆలోచనామృతమో అనుభవంలోకి వస్తుంది.
భారతదేశంలో శక్తి ఆరాధన రూపొందిన విధానం
“భారతదేశమున ఉదయించిన మతములు- శైవము, శాక్తేయము, వైష్ణవము, గాణాపత్యము, సౌరము మొదలైన అన్నింటిలోనూ ఇంద్రాది దేవతలున్నారు. వారిపైన త్రిమూర్తులు-సత్వ రజస్తమో గుణ ప్రతీకలైన విష్ణువు, బ్రహ్మ, హరుడు. ఈ త్రిమూర్తులకు మూలమైన తత్త్వము విషయముననే అభిప్రాయ భేదములు. ఆ మూల చైతన్యమును శైవులు సదాశివుడని, వైష్ణవులు మహావిష్ణువని, శాక్తేయులు శక్తియని, సౌరులు సూర్యుడనీ, గాణాపత్యులు గణపతియని పిలిచారు.” – శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి, దశమహావిద్యలు, పుట 67.
బహుదేవతారాధన ఉన్న హిందూమతంలో శక్తి ఆరాధనకు ప్రాచీన కాలంనుంచే ప్రాచుర్యం ఉంది. ఆ శక్తినికూడా బహురూపాల్లో ఆరాధిస్తారు. ఏయే శక్తిరూపాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవటం ఒక పెద్ద అధ్యయనం అవుతుంది. సాహిత్యాధ్యయన సందర్భంలో, ఏకవీర నవలానాయికకు రచయిత ఆ పేరునే ఎందుకు ఎంచుకున్నారని ఆలోచిస్తున్న ఈ సందర్భంలో అవసరమైనంత తెలుసుకొనే ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది.
“వేదకాలం నుండి శక్త్యుపాసన ఉన్నదని ప్రాజ్ఞులైన పండితుల అభిప్రాయం. ఋగ్వేదంలో ఇంద్ర, అగ్ని, వరుణాది దేవతలకు ప్రాధాన్యం కనిపిస్తుంది. శతరుద్రీయ, నారాయణీయాలలో శివ విష్ణు విశిష్టత గోచరిస్తుంది. ఇలా ఉండగా కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని ఋగ్వేదం నుండి కాళీ, తారా, ఛిన్నమస్తాది దేవతా మంత్రాలను ఉద్ధరించి చూపి దశమహా విద్యా సూత్రావళి అనే పేరుతో వాటికి వ్యాఖ్యానం రచించారు. అధర్వణవేదంలో అభిచారిక ప్రక్రియల సందర్భంగా ఆసురీదుర్గ, ప్రత్యంగిర వంటి తీవ్రదేవతల ప్రస్తావన కనిపిస్తుంది. అధర్వణ ప్రత్యంగిరా ఋక్కులను ఆత్మరక్షణకు, శత్రుశిక్షణకు ఉపయోగించటం ప్రాచీన కాలం నుండీ ఉంది.”– శ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి దశమహావిద్యలు, పుట 60.
ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం హిందూమతం సారాంశం. సామాజిక శాస్త్రాల నేపథ్యంతో జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేసిన పరిశోధకులు వివిధ సందర్భాలలో ఈ శక్తి ఆరాధనకు సంబంధించిన వివిధ విషయాలను తెలిపారు. ముఖ్యంగా గ్రామదేవతలకు సంబంధించిన అధ్యయనాలలో, జానపద పురాణాల్లో, జానపద గేయాల్లో, జాతుల పుట్టుక, సృష్టి ప్రారంభం గురించిన జానపద సాహిత్యంలో శక్తి ఆరాధనకు సంబంధించిన గాథలు కనిపిస్తున్నాయి. ఆ పండితులు ఈ శక్తి ఆరాధనకు సంబంధించిన దేవతలను మూడు తెగలుగా చెప్పారు. 1. వేదాలలో దేవతలు. 2. ద్రావిడ మాతృకలు. 3. జానపద దేవతలు.
“తాంత్రిక పూజలో ప్రముఖాంగంగా నెగడిన దేవీపూజకు, ప్రాఙ్మత స్వరూపంలో ప్రధానాంశమైన మాత్రారాధనకు భేదాలు తక్కువ. మొదటిదే రెండవ రకపు విధానంగా చోటుచేసుకొని పరిణామం చెందిందన్న విషయం సులువుగా గుర్తించడానికి వీలుంది.” – (మాతృదేవతారాధన) రక్షక దేవత-xxvi(27) జానపద గేయాలు సాంఘిక చరిత్ర-సంపా-బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణ కుమారి, ఆం.ప్ర.సాహిత్య అకాడమి.
“వేదాలలోని అదితి, వాగ్దేవతలు, శ్రీసూక్తంలోని శ్రీలక్ష్మి, వాజసనేయ సంహితలోని అంబిక, శతపథబ్రాహ్మణాలలో కనిపించే ఉమ, దుర్గ, కాళికలు, ముండకోపనిషత్తునందున్న సప్త మాతృకలు, గుహ్యసూత్రాలలోని సినీవాలి, వాశిని, భవాని, భద్ర, దుర్గలు, ద్రావిడ మాతృదేవతలైన పోశమ్మ, ఈదెమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, జానపద దేవతలైన మాత, రేణుక, మాహుర, కొర్రువై, అయ్యై, అక్కలు, మొదలైనవారు అందరూ కలగలపి ఏకతాస్ఫూర్తి పొంది, ఏక సమాహారంగా ఏర్పడి, లక్ష్మీ, దుర్గా, సరస్వతీ, రూపాన త్ర్యంబికా స్వరూప లబ్ధిని పొంది, హైందవ మత విధానంలో శక్తిస్వరూపంగా నెలకొనడం జరిగింది. ఆ తర్వాత అక్కడ పటిష్టంగా ఏర్పడిన పురుషత్వ ప్రతీక అయిన భగవదంశానికి, ఈ శక్తి అర్ధాంగంగా, వాగంశగా, హృదయవర్తిగా ప్రాముఖ్యాన్ని పొందడం జరిగింది.” -పై గ్రంథం-XXviii (28).
శక్తి ఆరాధన- ఛిన్నమస్త-ఇంద్రాణి, ఏకవీర, రేణుక, మాతంగి, ఎల్లమ్మ మొదలైన దేవతల పరస్పర సంబంధం
వివిధ ఆకరాల నుండి ఏర్పడిన దేవీ ఆరాధనలో అష్టాదశ శక్తిపీఠాల ప్రాముఖ్యం ఎంతో ఉంది. దక్షయజ్ఞంలో ఆత్మత్యాగం చేసిన సతీదేవి శరీరాన్ని భుజంపై ఉంచుకొని ఉగ్రతాండవం చేస్తున్న శివుని శాంతింపజేయటానికి, ఆ శరీరంపై విష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆమె శరీరభాగాలు వివిధ ప్రదేశాలలో పడి అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధిచెందాయి. మాహుర గ్రామంలో సతీదేవి కుడిహస్తం పడిన చోట ఆమె ఏకవీరాదేవిగా వెలసి పూజలందుకుంటోంది. ఆమెనే ఏకవేణికాదేవి అనికూడా అంటారు.
ఏకవీర-రేణుక
[అ] జమదగ్ని భార్య రేణుకాదేవి ఐతిహ్యం అందరికీ సుపరిచితమే. ఆమె తన పాతివ్రత్య ప్రభావం చేత ప్రతిరోజూ ఇసుకతో కుండను చేసి, నది ఒడ్డున కనిపించే పామును చుట్టకుదురుగా తలపై ధరించి, నీటిని ఆశ్రమానికి తీసుకొని వెళుతుంది. ఒక రోజు గంధర్వరాజు భార్యతో క్రీడించటాన్ని చూచి ఆమె మనసు చలించింది. ఫలితంగా ఎప్పటిలాగా ఇసుకను కుండగా చేయటం సాధ్యపడదు. నదీతీరానికి పాము రాలేదు. కుండతో నీటిని తీసుకొని రాలేక విఫలమైన రేణుక శిరస్సును, కుమారుడైన పరశురాముడు, తండ్రి ఆజ్ఞానుసారం ఖండించగా అది మాహుర గ్రామంలోని ఏకవీరాదేవిలో లీనమైందని అక్కడి స్థానికులు చెపుతారు. ఇప్పటికీ అక్కడ కేవలం అమ్మవారి శిరస్సు మాత్రమే కనిపిస్తుంది. అనగా ఏకవీరాదేవి పేరిట శక్తి ఆరాధన రేణుక గాథ కంటే ముందుగానే భారతదేశంలో ఉందని తెలుస్తోంది. ఏ రోజుకు ఆ రోజు ఇసుకరేణువులతో చేసిన కుండతో నీరు తీసుకొని రావటం ఆమెకు అలవాటు కనుక ఆమె రేణుక అయింది. అప్పటినుండి ఏకవీరాదేవిని రేణుకగా కూడా ఆరాధించటం ప్రారంభమైంది. రేణుకాదేవి గాథ భారతంలో, భాగవతంలో కనిపిస్తుంది. ఏకవీరాదేవి ఆలయాల్లో మహారాష్ట్రలోని పుణేకు 58 కి.మీ.ల దూరంలో, కార్లా గుహల వద్ద ఉన్న ఆలయం చాలా ప్రసిద్ధమైంది. అక్కడ ఆమెను ఆయీ ఏకవీరగా కొలుచుకుంటారు. ఇక్కడ ఆ మాటకు ఏకైక వీరుడైన పరశురాముని తల్లిగా అర్థం చెపుతారు. మొత్తంమీద రేణుకకు, ఏకవీరకు ఎన్నో చోట్ల అభేదమైన ఆరాధన, వ్యవహారం కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తమిళనాడులలో ఆమెకు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లా, వరంగల్, తిరుపతి ప్రాంతాలలో ఎల్లమ్మ, రేణుకాఎల్లమ్మ పేరిట ఊరూరా ఒక గుడిగా ఆమె ఆరాధన ఇప్పటికీ కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లో రేణుకాసరస్సు, రేణుకా అభయారణ్యం ఆ అమ్మవారి పేరిట నెలకొన్నాయి. జమదగ్నిని కార్తవీర్యార్జునుడు వధించగా ఆ మహర్షితోపాటుగా సహగమనం చేసిన రేణుకాదేవి పేరిట వాటిని అలా వ్యవహరిస్తున్నారు.
వివిధ క్షేత్రాలలో రేణుక కథ
[అ-1] పరశురాముడు రేణుకాదేవి శిరస్సును ఖండించిన కథకు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కటిగా రెండు మూడు భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఒక కథనం ప్రకారం రేణుకాదేవి నదినుండి వట్టి చేతులతో తిరిగి వచ్చేటప్పుడు ఆ సంగతిని తన దివ్యదృష్టి ద్వారా గ్రహించిన జమదగ్ని ఆమె శిరస్సును ఖండించమని పరశురాముని కోరగా అతని ధనుస్సునుండి వెలువడిన బాణం రేణుక వెనుకగా వస్తున్న మాతంగి శిరస్సును కూడా ఖండించింది. పరశురాముని కోరికపై జమదగ్ని ఆమెను పునర్జీవితురాలిని చెయ్యమని ఆదేశించినప్పుడు, పరశురాముడు తొందరలో ఒకరి శిరస్సును మరొకరి శరీరానికి చేర్చాడు. జమదగ్ని రేణుక శిరస్సు ఉన్న స్త్రీని భార్యగా స్వీకరించగా, మాతంగి శిరస్సు గల స్త్రీ నిమ్న కులాలకు దేవతగా పూజలందుకోవటం ప్రారంభమైంది.
[అ-2] మరొక కథలో రేణుక పరశురాముని నుండి తప్పించుకోవటానికి మాదిగవాడలో ప్రవేశిస్తుంది. అక్కడ ఒక మాతంగి ఆమెను కౌగలించుకొని రక్షించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఆమె శిరస్సు కూడా ఖండించబడుతుంది. అలా ఖండించబడిన రేణుక శిరస్సుకు ఇబ్బడిముబ్బడిగా ప్రతిరూపాలు ఏర్పడి గ్రామగ్రామాలకు వెళ్ళగా గ్రామగ్రామాన ఆమె దేవతగా పూజలందుకొన్నది. మాతంగిగా పేరుపొందింది.
[అ-3] వేరొక కథలో పచ్చికుండతో, నీటిని తేలేని రేణుకను జమదగ్ని ఆశ్రమం నుండి పంపించివేస్తాడు. ఆమె శివుని అర్చించి ధ్యానంలో కూర్చున్నప్పుడు తండ్రి ఆదేశం మీద పరశురాముడు ఆమె శిరస్సును ఖండిస్తాడు. ఆశ్చర్యకరంగా ఆమె శిరస్సు అసంఖ్యాక రూపాలను ధరించి అన్ని దిశలకు తరలిపోయి ఊరికొక దేవతగా పూజలందుకొంటుంది. అదేసమయంలో ఆమె కూడా మరణం పొందక సజీవురాలై ఉంటుంది.
ఈ కథలనన్నింటినీ పరిశీలిస్తే ఒక విషయం మనకు గోచరిస్తుంది. జమదగ్ని మహర్షికి శివుని గుణాలు ఉన్నాయి. ఈ కథలో అతడు తన మాటను ధిక్కరించిన కుమారులను తన చూపుతో దహిస్తాడు. శివునివలెనే తొందరపాటు కలవాడు. మళ్ళీ శీఘ్రమే ప్రసన్నుడౌతాడు. జమదగ్ని శివుడైనప్పుడు, రేణుక పార్వతి అవుతుంది. ఇక పరశురాముడు విష్ణువు అవతారమని మన అందరికీ తెలుసు. ఎన్నో పురాణకథల్లో తొందరపాటుతో శివుడు చేసే పొరపాట్లను విష్ణువు ఉపాయంతో సరిదిద్దుతూ ఉండటం కనిపిస్తుంది. ఈ కథలో కూడా కోపావేశంలో ఉన్న శివావతారమైన జమదగ్ని బారినుండి, కుటుంబాన్నంతటినీ పరశురాముడు తన ఉపాయంతో రక్షించటాన్ని గమనించాలి. లయకారుడు తన పని తాను చేస్తే, స్థితికారుడు తన పని తాను చేశాడు. ఖండిత శిరస్సు అనేక రూపాలు ధరించటం, ఆమె సజీవురాలై ఉండటం, ఆమె నిర్దోషిత్వాన్ని సూచిస్తుంది. రేణుకామాత ఆరాధన అన్ని జాతులలో ప్రవేశించిన విధం ఈ కథలో సూచితమైంది.
దశమహావిద్యలు– ఛిన్నమస్త-రేణుక-ఏకవీర
కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని వేదాలు ఉపనిషత్తులనుండి దశమహావిద్యలకు సంబంధించిన మంత్రాలను, స్తోత్రాలను ఉద్ధరించి చూపారు. ఆ దశమహావిద్యలలో ఛిన్నమస్త ఆరవది. షష్ఠి అనికూడా ఆమెకు వ్యవహారం ఉన్నది. దశమహావిద్యలలో ఆరవదికావటమే కాక, విష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురామావతారానికి వెనుక ఉన్న శక్తి ఆమెయే! పరశురాముని తల్లియందు ఛిన్నమస్త ఆవిష్కృతమైంది అంటారు.
రేణుకాదేవి కథను గణపతిముని వేరొక విధంగా చెప్పారు. కార్తవీర్యార్జునుడు జమదగ్ని కామధేనువును కాక రేణుకాదేవినే అపహరించాడనీ, పరశురాముడు అతనిని జయించి, ఆమెను విడుదల చేశాడనీ, పరుల పంచన ఉన్న రేణుక శిరస్సును ఖండించమని జమదగ్ని ఆజ్ఞాపించగా పరశురాముడు దానిని పాలించాడనీ ఆయన అన్నారు. గణపతిముని వేదకాలంనాటి ఇంద్రుడు పురాణకాలంనాటికి ఈశ్వరుడు అయ్యాడని చెప్పి ఇంద్రేశ్వరాభేదసూత్రాలను రచించారు. ఇంద్రాణి అనగా ఇంద్రుని భార్య. శివునికి శక్తికి ఉన్న బంధమే ఇంద్రునికి ఇంద్రాణికి ఉన్నది. శివుని శక్తి శివాని అయితే, ఇంద్రుని శక్తి ఇంద్రాణి. శక్తిలేక ఈశ్వరుడు ఎలా జడుడో, ఇంద్రాణి లేక ఇంద్రుడు జడుడు. ఇంద్రాణియే వజ్రవైరోచని. ఆమె విద్యుద్రూపిణి. అనగా వజ్రాయుధరూపంలో ఇంద్రుడు ప్రయోగించేది ఆమె శక్తినే. ఛిన్నమస్తామంత్రమును రేణుకాదేవి సాధన చేసి ఉండవచ్చనీ, తన ఉపాసకురాలికి అన్యాయం జరిగినప్పుడు ఉపాసిత దేవత అయిన ఇంద్రాణి ఆమెలో ప్రవేశించి పునర్జీవితురాలిని చేసి ఉండవచ్చనీ శ్రీసిద్దేశ్వరానంద భారతీస్వామి అభిప్రాయపడ్డారు. (చూ. దశమహావిద్యలు పే-48) అందుచేత కావ్యకంఠ గణపతిముని చెప్పినట్లుగా ఇంద్రుడు ఈశ్వరుడు ఒకరే అయినప్పుడు, జమదగ్ని మహర్షి ఇంద్రుడవుతాడు. ఇంద్రాణి రేణుక అవుతుంది. విద్యుద్రూపిణి అయిన ఇంద్రాణి ఛిన్నమస్త ఒకరే. ఈ కారణం వల్లనే ఛిన్నమస్తాసాధకులను, వారు సాధనాస్థితిలో ఉన్నప్పుడు స్పృశిస్తే విద్యుత్స్పర్శ కలుగుతుందని చెప్తారు.
ఛిన్నమస్త ఒక చేత కత్తెరను (లేదా వజ్రాయుధాన్ని) ధరిస్తుంది. ఒక చేత స్వయంగా తానే ఖండించిన తన శిరస్సును ధరించి, తన కంఠం నుండి వెలువడుతున్న మూడురక్తధారలలో మధ్యధారను తానే త్రాగుతూ ఉండగా, వర్ణిని, డాకిని అనే చెలులు ఆమె పక్కన నిలబడి మిగిలిన రెండు ధారలను గ్రోలుతూ ఉంటారు. ఆమె దిగంబరమై, రతిక్రీడలో ఉన్న రతీమన్మథులపై పదఘట్టనం చేస్తూ నిలబడి ఉంటుంది. తాంత్రికులు పూజించే రూపం ఇది. ఇందులో ప్రతి వివరానికి నిగూఢార్థం ఉంది. ఈ సందర్భానికి తగినంతగా చర్చ జరుగుతుంది.
ఈ సందర్భంలో ఛిన్నమస్తా ఉపాసకులైన గణపతిముని ఆ దేవత గురించి ఏయే విశేషాలను చెప్పారో తెలుసుకోవటం అవసరం. ఛిన్నమస్తనే ప్రచండచండి అని ఆమె స్వభావానుగుణంగా పిలుస్తారు. గణపతిమునిగారి సంస్కృత గ్రంథం ప్రచండచండీత్రిశతి అందుబాటులో లేకపోవటంవల్ల వారు చెప్పిన విషయాలను తమ “The ten great cosmic powers’ లో ఇంగ్లీషులో వ్రాసిన ఎస్. శంకరనారాయణన్‌గారి వివరణ ఆధారంగా “ఛిన్నమస్త’ తత్వాన్ని ఈక్రింద వివరించటం జరుగుతోంది.
“We have said that Light Prakasa and Sound Nada are the precursors of creation. Prakasa when it becomes delimited as Akasa, Space is Bhuvaneswari. When the delimitation takes the form of duration, Time, it is Kali. When Prakasa gets involved in creation, when it becomes immanent principle in everything, at the same time transcending it, the unexpressed, un manifested Sound turned towards creation in a concentrated consciousness is Bhairavi, while the Sound perceiving itself, Seeing Word is Tara. The interaction of Prakasa and Nada, Light and Sound to precipitate the creation is known to the Tantrics as great Goddess Chinnamasta. The Supreme is Truth-Consciousness-Bliss, sat chit aananda and the Vedic Rishis called these poises of the Supreme as three states, as three worlds constituting the higher hemisphere Parardha. When the Supreme Being extended himself as creation, his three states, and his triple worlds came down in creations three worlds Prithvi, Antariksham, mid-region—and Dyauh heaven – the lower hemisphere, aparardha. This lower triple is the three worlds of Annam physical Prana vital, and Manas mental of the being evolving in creation. The interaction of Light and Sound produce such speed and force that the lower triple is almost precipitated out of the higher triple. It is almost cut asunder from the original source. The Whole purpose of creation is for the one to delight itself in separate existences as many. The many have to cut off from the One to become separate existences. The umbilical cord connecting the mother and child has to be incised to ensure the separate life of the child. The interaction of Light and Sound is so terrific and violent that it almost cuts off the creation from the creator. That is why Chinnamasta is represented as cutting off head, rending asunder the Original Source and the creation which is nothing but extended enveloping body varshma of the creator. In the world of phenomena the interaction of Light and Sound results in thunder and lightning. Chinnamasta is the thunder-clap and the lightning -flash, “Shining like a streak of lightning’ (విద్యల్లేఖేవభాస్వ రా) says Upanishad. That is why Chinnamasta is known as Vajravairochaniya. She is the force of Virochana the specially luminous. (విశేషేణ రోచతే ఇతి విరోచనా:) Who is this Virochana? It is the Supreme himself, the Primordial Prakasa. Vajra is her power which he wields. We know that Vajra is the weapon of Indra. Who then is Indra?
…But to the Vedic seers, Indra is higher than all the cosmos (విశ్వమత్ ఇంద్ర ఉత్థార) He is the one over lord of our triple existence of matter, life and spirit and master of swar which is the luminous world of Divine Mind. He is the sat of the Supreme self-manifested in the Divine Mind…Chinnamasta is the Sakti, force of Indra. He wields as his weapon and smites Vritra who covers with his darkness the luminous rays of pure knowledge. He lashes the clouds with his lightning whip, making them surrender the life-giving waters. Chinnamasta is the thunder destroying all the anti-divine forces; she is the hidden radiance in the heart of the cloud. Ruling over the Divine Mind she acts through the human mind and is the sense behind the senses. There are five senses of action Karmendriyas and five senses of Knowledge Jnanendriyas, the mind is considered as the eleventh sense by Indian thinkers. In, it is known as Antahkarana the inner instrument through which the eye sees, the ear hears and the other senses carry out their functions. The Sanskrit term for sense is significant; it is indria, the power of Indra, the ruler of the mind. Thus one becomes a master of his senses by the grace of Indras force, Chinnamasta. The most powerful activity of the senses is physical sensual activity translated in the language of sex. The great Goddess is depicted as trampling with her feet Rati and Manmatha joined in amorous union. This is the picturesque and dramatic way of the Tantric to drive home the fact that worship of Indras force Chinnamasta grants complete mastery over the sex impulse and other impulses of the senses Indriyas.” – The Ten Great Cosmic powers, S. Sankaranarayanan page 69-72.