℞: మారేజ్

ఇది దొరకదు! అంటూ కౌంటర్లో కూర్చున్న ఫార్మసిస్ట్ ప్రిస్క్రిప్షన్ మిగతా మెడిసిన్లు నీ వైపుకి తోస్తాడు. ఎక్కడ దొరుకుతుంది? అని అడగబోతూ అతని నవ్వును గమనిస్తావు. ఆ నవ్వు నీకు బాగా పరిచయం. కొన్నేళ్ళ క్రితం వరకూ మెడికల్ షాపుల్లో శానిటరీ పాడ్స్ అడిగితే నల్ల కవర్లో వాటిని చుడుతూ నీకేసి ఓరగా చూస్తూ అలానే నవ్వేవారని నీ అనుభవం. కానీ నువ్విప్పుడు సానిటరీ పాడ్స్ అడగలేదు. నీ గైనిక్ నీకు ఏ కాంట్రసెప్టివ్ పిల్సో రాసిచ్చే అవకాశమే లేదు. అసలావిడ ఏం రాసిందా అని చూస్తావు. ℞: మారేజ్ అని ఉంటుంది దానిపైన. కౌంటర్ వెనకున్నవాడు ఎందుకు నవ్వాడో అర్థమయ్యాక నువ్వు గాభరాగా ప్రిస్క్రిప్షన్ మిగతా మందులూ హాండ్ బాగులో కుక్కుకుని గబగబగా ఆటో ఎక్కేస్తావు. ఆటోలోని చీకట్లో నువ్వు వీధి దీపాల నీడలో ఆటో మాయమైనాక కూడా అతడి నవ్వు ఇంకా నిన్ను వెంబడిస్తూనే ఉన్నట్టు నీకనిపిస్తుంది.

ఇంటికి చేరుకోగానే, తాళం తీసి తలుపు మూసేస్తావు ఎవరి నుండో దాక్కుంటున్నట్టు. బట్టలన్నా మార్చుకోకుండా గ్లాసు మంచినీళ్ళు కూడా తాగకుండా లాప్‌టాప్ తెరుస్తావు. నీ యూ.ఎస్. బాస్ పింగ్ చేసుంటాడు. నీకెందుకో తేడాగా అనిపిస్తుంది ఆయన పలకరింపు. పింగ్ మీ వెన్ యు ఆర్ ఆన్‌లైన్ అనే ఎప్పట్లానే రాసినప్పటికీ! ఎనీథింగ్ రాంగ్? అని అడుగుతావు. ఆయన బదులిచ్చే ఒకట్రెండు నిముషాల్లో నువ్వు వేరే మెయిల్స్ చూసుకుంటున్నా ఈ విండో మీదే ఒక కన్నేసి ఉంచుతావు. హౌజ్ యుర్ హెల్త్? ఎనీ వే ఐ కెన్ హెల్ప్? అని అడుగుతాడాయన. నువ్వు అనుకుంటున్నంత పనీ అయ్యిందని నీకు తెలుస్తుంది. కాఫెటేరియాలో నీ గురించి మొదలైన గుసగుసలు ఆయన దాకా చేరాయి. టేకింగ్ మెడికల్ హెల్ప్. విల్ కీప్ యు పోస్టెడ్ అని చెప్తావు. ఇది చాలా క్రిటికల్ ప్రాజెక్ట్ అని ఎలాంటి రిస్క్ తీసుకోదల్చుకోలేదు అని గుర్తు చేస్తాడు. రాత్రనక, పగలనక చాకిరి చేస్తున్న నువ్వు అప్పుడే రిస్క్ ఎలా అయిపోయావని నీకు కోపం వస్తుంది. లాప్‌టాప్ మూసేస్తావు.

ఇప్పుడేం చెయ్యాలో నీకు అర్థం కాదు. పనిలో పడిపోతే హాయిగా ఉంటుంది నీకు. కానీ మూకుమ్మడిగా నీ గురించి ఉన్నవీ లేనివీ చెప్పగానే రిస్క్ అని తేల్చేశాడు నీ బాస్. బ్రేకులు కూడా తీసుకోకుండా పని ఎవ్వడు చెయ్యమన్నాడని నిన్ను నువ్వు తిట్టుకుంటావు. ఎవరో కొత్త అబ్బాయి చేరాడని పలకరింపుగా అతనితో మాట్లాడ్డానికి ఒక పది నిముషాలు కాఫెటేరియాలో కూర్చుంటే తెలిసింది నీకు నీ గురించి ఏమని– సీటులో ఉండడం లేదు ఊరికే చిరాకు పడుతుంది చెప్పింది ఏదీ గుర్తుపెట్టుకోవడం లేదు– చెప్పుకుంటున్నారో. ఐదేళ్ళ ప్రాజక్ట్ ఏది అడిగినా చిటికెలో చెప్పగల నిన్ను అలా ఎలా అనుకుంటారని నీలో నువ్వే గింజుకుంటావు. ఇప్పుడు ఇవన్నీ వంక పెట్టుకుని నిన్ను ఈ ప్రాజెక్ట్ నుండి తీసేస్తారేమోనని భయంతోనే డాక్టర్ దగ్గరకు వెళ్ళావు.

డాక్టర్‌తో నీ సంభాషణ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తావు. ప్రిస్క్రిప్షన్ కోసం హేండ్‌బేగ్ అంతా తిరగతోడుతావు. చివరకు దొరుకుతుంది. అందులో పైన నీ పేరు నీ వయసు రాసుంటుంది. ఒక పక్కగా నీ ఎత్తు బరువు బిపి వగైరా వివరాలు. పేజీ మధ్యలో నువ్వు చెప్పిన లక్షణాలు– ఎక్కువగా నిద్రపోతుండడం విపరీతమైన నీరసం ఒక సంవత్సరం నుండి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటం పీరియడ్స్ వచ్చే ముందు ఏడుపొచ్చేట్టుండడం హెయిర్ లాస్ ఎదురుగా పెట్టిన వస్తువును కూడా చూసుకోకుండా కంగారు పడిపోవడం– అన్నీ వుంటాయి. డాక్టర్‌కు కాఫెటేరియాలో నువ్వు విన్నవి కూడా చెప్పావు. ఆమె ముఖంలో ఏ భావమూ లేకుండా విన్నది గుర్తొస్తుంది నీకు.

అసలా ప్రిస్క్రిప్షన్: మ్యారేజ్ ఏంటో అర్థం కాదు నీకు. అర్ధరాత్రుల వరకూ పని చేస్తూ దొరికిన గడ్డల్లా తింటూ అసలు ఎక్సర్‌సైజ్ అన్న మాట లేకుండా బతుకుతుంటే సవాలక్ష రోగాలు వస్తాయి. దానికీ పెళ్ళికీ సంబంధం ఏంటి నీ బొంద! అనుకుంటావు. ఆకలి మొదలవుతుంది నీకు. పట్టించుకోకుండా మొబైల్లో పీకి పడేసిన గేమ్స్ అన్ని మళ్ళీ ఇన్‌స్టాల్ చేస్తావు. ఆడ్డం మొదలు పెడతావు. తెలిసిన ఆటల్లో కూడా కింది లెవెల్స్ లోనే ఓడిపోతావు. ఆకలి ఇంకా పెరుగుతుంది. అయినా ఆడుతూనే ఉంటావు. ఓడుతూనే ఉంటావు. ఆకలి ఇంకా నస పెట్టలేక ఊరుకుంటుంది. నువ్వు పడుకుంటావు.

లేస్తావు. ఆఫీసుకెళ్తావు. పని చేస్తావు. ఇంటికొస్తావు. పని చేస్తావు. పడుకుంటావు.

నీ ఆల్-గర్ల్స్-బెస్ట్-ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులో ఒక ఫ్రెండ్ గుర్తు చేస్తుంది, డాక్టర్ ఏమందని. జరిగింది చెబుతావు.

నేను చెప్తూనే ఉన్నా…

ఇప్పటికైనా పెళ్ళి గురించి ఆలోచించు.

అర్రె! పెళ్ళంటే ఎవరినో హత్య చేయాలి అన్నట్టు భయపడతావ్ ఏంటి?

వద్దూ దానిమాట వినకు… పెళ్ళి చేసుకోకు.

చిర్రెత్తుకొచ్చి ఆ గ్రూపు మ్యూట్ చేసి పడేస్తావు.

డాక్టరు ఏమంది? అని మీ అమ్మ, నాన్నలు అడుగుతారు ఫోన్‌లో. రక్తం తక్కువుంది ఆకుకూరలు బా తినమంది అని చెప్తావు. ప్రిస్క్రిప్షన్ ఏం రాసిందో చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు.

మే బి షి మెంట్ ఎ ఫిజికల్ రిలేషన్! ఇట్స్ ఆల్ అబౌట్ హార్మోన్స్, యు సీ! అని పింగ్ చేస్తుంది ఒక ఫ్రెండ్ నీకు డైరెక్టుగా.

అంటే? స్లీపింగ్ అరౌండ్? అడుగుతావు నువ్వు, హారర్ ఎమోటికన్ పెట్టి.

నీ మొహం. నేనంటున్నది అది కాదు. గో అరౌండ్. ఫైండ్ సమ్‌బడీ యూ లైక్. మనిషి నచ్చితే పెళ్ళి చేసుకోవాలనేం లేదు. మీ ఇద్దరికీ ఒకే అయితే ప్రపంచానికి తెలియనవసరం లేదు.

ఆ లైన్‌ని ప్రాసెస్ చేయడం మొదలెడుతుంది నీ మెదడు. గో అరౌండ్- టిక్. ఫైండ్ సమ్‌బడీ- స్టక్.

నీ గైనిక్‌తో అసలేం జరిగిందని ఫ్రెండ్ అడుగుతుంది. డాక్టర్‌తో నీ సంభాషణ ఇలా నడిచిందని చెప్తావు.

మారీడ్?

నో.

ఆర్ యు సెక్సువల్లీ ఆక్టివ్?

నాకు పెళ్ళి కాలేదు.

ఆర్ యు సెక్సువల్లీ ఆక్టివ్?

ఐ సెడ్ ఐ యామ్ నాట్ మారీడ్.

హౌ అబౌట్ యువర్ లిబిడో?

వాట్ అబౌట్ ఇట్?

ఈజ్ ఇట్ హై ఆర్ లో?

నాట్ ష్యూర్!

లోల్‌లోల్‌లోల్‌లోల్ నీకు వాట్సాప్‌‌లో చెప్తుంది ఫ్రెండు. వెంటనే ఫోన్ కూడా చేస్తుంది.

ఇంకెవరికైనా అయితే హావ్ సమ్ సెక్స్ అని చెప్పుండేది డాక్టర్. నువ్వు ఆవిడని భయపెట్టేశావు. అందుకే సేఫ్‌గా పెళ్ళి చేసుకోమని రాసింది అని వివరిస్తుంది. నువ్వు మౌనంగా వింటావు. అతనింకా నీ మనసులో ఉన్నాడా? అని అడుగుతుంది తాను. లేదు అని చెప్తావు. సరే! ఈ వీకెండ్ మనం కలుద్దాం అంటుంది. అప్పుడు ఇంత తేలిగ్గా వదిలేయదు నిన్ను అని నీకు తెలుస్తుంది.

దెబ్బ తగిలినప్పటికన్నా దాన్ని కెలికినప్పటి నొప్పి లాంటిది కలుగుతుంది నీకు. ఆఫీసు వాళ్ళకి తప్ప ఎవరికీ అందుబాటులో ఉండకుండా చూసుకుంటావు. ఆఫీసులో ఫ్రెషర్ ఒక అమ్మాయి నెల కూడా కాలేదు జాయిన్ అయ్యి నీ క్యూబికిల్‌కి వచ్చి మరీ తనకి సంబంధం కుదిరిందని చెప్తుంది. నువ్వు కంగ్రాట్స్ అనేలోపు నీకు పెళ్ళి ఎందుకు కాలేదని అడుగుతుంది. నువ్వేదోకటి చెప్పే లోపు, మీకు పదేళ్ళ ఎక్స్పీరియన్స్ అంట కదా?! అని నీకు నీ వయసు గుర్తుచేస్తుంది. పిడికిలి బిగించి నిదానంగా ఆ ఒక్క వేలూ నిటారుగా లేపి చూపించాలనిపిస్తుంది నీకు. కానీ ఎందుకులే చిన్న పిల్లని వదిలేస్తావు.

అలా అని నీ తోటివాళ్ళో నీకన్నా పెద్దవాళ్ళో ఇలా కెలికితే వేలు చూపించే రకం కాదు నువ్వు. అసలు అలా చూపించాలన్నంత కోపమే నీకు కొత్త. పరిచయం ఉన్నవాళ్ళు కానీ ఈ విషయం కనుక్కోవడానికే పరిచయం ఏర్పర్చుకున్నవాళ్ళు కానీ ఏం, నీకు పెళ్ళి చేసుకోవాలనిపించదా? అని అడిగినప్పుడు నువ్వు చేతనైనంత వరకూ మర్యాదగానే మాట్లాడతావు. అరే అలా ఎలా? మనిషి అన్నాక తోడు కావాలిగా! అని వాళ్ళంటే నేను మనిషిని కానేమో! అని బలవంతపు నవ్వు నవ్వుతావు. వాళ్ళు తల్లిదండ్రులకి నువ్వు కుంపటిగా అవుతావని సమాజం నిన్ను గౌరవించదని చెప్తూ పోతుంటే వింటూ ఉండిపోతావు ఎప్పుడూ. అక్కడా ఆగక ఎవల్యూషన్ బేసిక్ బాడీ నీడ్స్ అంటూ దంచేస్తుంటే ఘోరమైన రేటింగ్స్ ఇచ్చిన మానేజర్‌తో అప్రయిజల్ మీటింగ్‌లో కూర్చున్నట్టు కూర్చుంటావు.

వీకెండ్ వస్తుంది. నీ ఫ్రెండ్ కలుస్తుంది. నిన్ను నిలదీస్తుంది.

అప్పుడెప్పుడో వాడేదో అన్నాడని, అదే పట్టుకొని కూర్చుంటావా?

అరె! మనిషి నిజమే చెప్పాడుగా!

వాడి బొంద నిజం!

అందుకే నువ్వెప్పుడూ అతడి గురించి ఎవరి దగ్గర ఎత్తవు. చెప్తే ఇదే గోల. అతణ్ణి జడ్జి చేస్తారు జనాలు. మాటలంటారు. లేబుల్స్ అతికిస్తారు. ఇన్నేళ్ళైనా అతణ్ణి ఎవరన్నా ఏమైనా అంటే నీకు చుర్రున కోపం వస్తుంది.

అప్పటికీ నువ్వు మీ ఇద్దరి మధ్య జరిగింది ఎప్పుడు చెప్పినా వీలైనంత వరకూ ఇద్దరి వైపు నుంచి సమానంగా చెప్తావు. నువ్వేమాత్రం బాగున్నా కొంచెం తెల్లగా కొంచెం సన్నగా కనీసం పెద్ద కళ్ళో లేకపోతే సూటి ముక్కో అవర్ గ్లాసు ఫిగరో- కంటికి ఏదో ఒకటి ఇంపుగా ఉండాలిగా రోజూ చూడాల్సిన మొహమాయే! అని సర్దిచెప్పబోతావు.

అతను నిన్ను కాదనలేదు. కానీ అవుననలేకపోయాడు, అంతే! నువ్వంటే ఇష్టం లేదు అని అతడెప్పుడూ చెప్పలేదు. మీరిద్దరూ కలిసుండడం కష్టమని చెప్పాడంతే! ఒక సింపుల్ నో సరిపోయుండేది నీకు. కానీ నువ్వు నీ ఇష్టాన్ని చెప్పాక నిన్ను కలిసి కాఫీ షాపులో కూర్చోబెట్టి చేతిలోకి చేయి తీసుకొని నువ్వంటే నాకు చాలా గౌరవం. బట్ నాకు అలాంటి ఫీల్సింగ్ లేవు నీ మీద అని చెప్పేసి ఊరుకోక నేననే కాదు. ఏ అబ్బాయికైనా నువ్వు నచ్చటం కష్టం. అంటే, పెద్దవాళ్ళ బలవంతం మీద పెళ్ళికి ఒప్పుకోవచ్చు. కానీ, తర్వాత ఎంత ఇబ్బందో ఆలోచించు. మన ఆర్పీ సర్ మిసెస్ బాగోదని కాలేజిలో ఎన్ని జోకులేసుకునేవారో నీకు తెలీదా. నువ్వు తెలివైన అమ్మాయివి. నువ్వు అర్థం చేసుకోగలవనే ఇవ్వన్నీ చెప్తున్నా అంటూ కొంచెం దగ్గరిగా జరిగి ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో గానీ ఒకటి చెప్తాను. అందంగా లేని భార్యతో కాపురం సాగదు. ఎరక్టయిల్ డిస్‌ఫంక్షన్ వస్తుంది అని చెప్పాడు. ఎరక్టయిల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటో అప్పట్లో నీకు తెలీదు. అతడి డిటెయిల్డ్ నో నుండి తేరుకున్న కొన్నాళ్ళకి గూగుల్ చేస్తే తెలిసింది. తెలిసి తెలిసి నీ వల్ల ఒక మనిషికి ఆ స్థితి రాకూడదని బలంగా నిశ్చయించుకున్నావు.

వాడికింకా ఆ రోగం వచ్చిందో లేదో గానీ, నీ ఈగోకి మాత్రం డిస్‌ఫంక్షనే! అంటూ ఇంత ఎత్తున లేచాడు ఈ సంగతి చెప్పినప్పుడు నీ ఫ్రెండొకడు. అలాంటి వాగుడు వాగినందుకు నువ్వు వాడి మొహం ఎందుకు పగలగొట్టలేదో ఈ ఫ్రెండ్‌కి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకు పగలగొట్టాలో నీకు అప్పటికీ అర్థం కాదు. వాడి కళ్ళకి నువ్వు నచ్చలేదేమో కానీ నువ్వు ఎవరికీ నచ్చవు అని చెప్పడానికి వాడెవ్వడు అని అంటాడు. నిన్ను అలా చూసిన కళ్ళేవీ నీకు కనిపించలేదనీ నీతో అబ్బాయిలు మెలికలు తిరిగిపోతూ తత్తరపడతూ ఎప్పుడూ మాట్లాడలేదనీ చెప్తావు. అయినా అందమంటే కేవలం స్కిన్ కలరూ ఫిగరేనా అంటూ బ్యూటీ ఈజ్ బట్ స్కిన్ డీప్ అని కోట్ చేస్తాడు. అసలు నువ్వు పుట్టగానే వచ్చిన బంధువులే నీ ముక్కు గురించి బోలెడు కామెంట్లు చేశారు. నీతో పాటే ఫెయిర్ ఆండ్ లవ్‌లీ కూడా పెరిగి పెద్దదయ్యింది. ఏదో ఒకలా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నీది అందం కాదని గుర్తు చేస్తూనే ఉన్నప్పుడు స్కిన్ డీప్? మై ఫుట్! అని అరవాలనిపిస్తుంది నీకు.

కథంతా మళ్ళీ తిరగతోడినాక యు లాస్ట్ యుర్ మైండ్! అంటూ నీ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. ఆ చిరాకులో ఫేస్బుక్‌లో వీకెండ్ స్టేటస్ ఏదో తేడాగా రాస్తావు. అది చదివి కంగారుగా ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. జరిగినది తెలుసు వాడికి. జరుగుతున్నది తెల్సుకొని వాచ్ సమ్ పోర్న్ యార్! అని సలహా ఇస్తాడు.

నువ్వు ప్రయత్నిస్తావు. ఆఫీసుకెళ్తావు. ఇంటికొస్తావు. ఆఫీసు పని చేస్తావు. పడుకునే ఓ అరగంట ముందు ఆ రోజు పోర్న్ చూస్తావు. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో. ఇంతలో మీ అమ్మ ఫోన్ చేస్తుంది. సరిగ్గా తింటున్నావా? మందులేసుకుంటున్నావా? వేసుకుంటున్నానని చెప్తావు లాప్‌టాప్ నుంచి దూరంగా జరిగిపోయి.

ఓ వారానికి నీ ఫ్రెండ్ మళ్ళీ పింగ్ చేస్తాడు. డిడ్ యూ లైక్ ఇట్? హౌ డిడ్ యూ ఫీల్?

నీకొచ్చిన ఒక కల గురించి చెప్తావు. ఏదో సముద్రపు ఒడ్డున బోలెడంతమంది నగ్నంగా ఉంటారు. సముద్రంలో మునకలేసి ముద్దగా తడిసొస్తుంటారు. వాళ్ళని చూసి చూసి నువ్వూ సముద్రంలోకి నడుచుకుంటూ పోతావు. నీటిలో మునకేయబోతావు. కానీ, ఒక్క చుక్క నీరు కూడా అంటుకోదు. దూరం వెళ్ళేకొద్దీ అందులో తేలుతావే గానీ మునగవు. ఇది విని నీ స్నేహితుడు ఆలోచనలో పడతాడు. బహుశా అది సీ ఆఫ్ సీమన్. అందుకే ఇట్ రిజక్టెడ్ మీ! అని నీ అనాలిసిస్‌తో సాయం చేస్తావు. పోర్న్ చూడటం రిపల్సివ్‌గా ఉంది అని చెప్తావు. వై డోన్ట్ యూ ట్రయ్ ఎరోటిక్ లిటరేచర్ అని ఇంకో సలహా ఇస్తాడు.

పచ్చిగా రాసినవి కాకుండా అందంగా అందీ అందనట్టుగా రాసిన ఎరోటిక్ లిటరేచర్ పట్టుకోడానికి నీకు కొంత సమయం పడుతుంది. అవి పోర్న్ కన్నా మెరుగ్గా అనిపిస్తాయి. ఒంట్లో ఉన్న వేడిని తట్టిలేపుతాయి. ఇంతలోనే మాస్టర్బేషన్ కోసం రకరకాల పరికరాలు రికమెండ్ చేస్తుంది ఫేస్‌బుక్ ఈ మధ్య నువ్వు చేసిన సెర్చెస్ అన్నీ గమనించి దాని తాహతుకు తగ్గట్టు నీకు లింక్స్ పంపించటం మొదలెడుతుంది. ఏది ఎలా వాడాలో టిప్సూ ట్రిక్సూ అన్నీ నీకు అందిస్తూ ఉంటుంది.

కుతూహలం కొద్దీ ఇవన్నీ చదువుతావు. నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శరీరం మీద ఆసక్తి కలుగుతుంది. జ్వరమొచ్చినప్పుడో దెబ్బతగిలినప్పుడో మాత్రమే గుర్తొచ్చే నీ శరీరం అలాంటిదిప్పుడు దాన్ని చూసుకోవాలనిపిస్తుంది. అద్దెకు ఉన్న ఇంట్లో నువ్వొక్కదానివే ఉంటున్నా స్నానం అయ్యాక పైనుంచి కింద వరకూ బట్టలేసుకుంటే తప్ప ఏ టవలో మాత్రమే చుట్టుకొని బెడ్రూమ్‌లోకి కూడా వచ్చే అలవాటు లేని నువ్వు మొదటిసారిగా నిన్ను నువ్వు పూర్తిగా నగ్నంగా చూసుకుంటావు అద్దంలో. నువ్వు చూసిన పోర్న్ వీడియోల్లో ఉన్న అమ్మాయిల్లా చెక్కినట్టుండే శరీరాకృతిగాని రంగు గానీ నీకు లేవు. కానీ నీకు చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది.

చూడూ! అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు అద్దం పగలగొట్టకుండా ఉన్నావంటే నీది అందమే! జనాలు తలలు తిప్పితేనే అందమని కాదు. మొహం పక్కకు తిప్పుకోకపోయినా అందమే! అని నువ్వు-ప్రేమించినవాడి-మొహం-పగలగొట్టనందుకు- నీమీద అరిచిన ఫ్రెండ్ అప్పట్లో చెప్పిన మాటలు గుర్తొస్తాయి నీకు. నువ్వు చదివిన ఎరోటిక్ సాహిత్యంలో మెంటల్లీ అన్‌డ్రస్సింగ్ అన్నది పదేపదే వస్తుంటుంది. ఈ ఫ్రెండ్ నిన్ను మెంటల్లీ అన్‌డ్రస్ చేసుంటాడా అన్న ఊహ నీకు జలదరింపు కలిగిస్తుంది. ఇంకెవ్వరికీ నచ్చవని వాడెలా చెప్తాడు? అన్న మాటల్లో నాకు నచ్చావనే కొత్త అర్థం స్ఫురిస్తుంది. అందుకేనేమో నీ ఫ్రెండ్ తన పెళ్ళికి మీ కామన్ ఫ్రెండ్స్ అందరినీ పిల్చి నిన్ను మాత్రం పిలవలేదని అనిపిస్తుంది.

నీలో నీతో ఏం జరుగుతోంది అని ఆలోచిస్తావు. అసలు అతను నీకు పరిచయమయ్యేసరికి నువ్వొక అవస్థలో ఉన్నావని నీకు ఇప్పుడు అర్థం అవుతుంది. అతను చెప్పింది గానీ నీ తక్కిన స్నేహితులు చెప్పింది గాని అప్పుడు నీ తలకెక్కలేదు. హావ్ యు లాస్ట్ యువర్ మైండ్? అని కాదు హావ్ యు లాస్ట్ యువర్ బాడీ? అని తిట్టుండాల్సింది వాళ్ళు అనిపిస్తుంది. నీ ఐడెంటిటీ నీ ఆలోచనలు నీ పని నీ హాబీలు నీ ప్రేమ దాని ఫెయిల్యూర్ అంతా నీ మైండ్‌లో ఉండి కేవలం ఆ మైండ్‌ని సపోర్ట్ చేయడానికి మాత్రమే నీకో శరీరం ఉంది అని ఎవరూ ఎందుకు చెప్పలేకపోయారని అనుకుంటావు.

ప్రపంచమంతా ట్రాన్స్ రైట్స్ గే రైట్స్ అంటూ ఉద్యమాలు తీస్తుందన్న వార్తలు చదువుతూ సినిమాల్లోనూ వార్తల్లోనూ ఎక్స్‌ట్రామారైటల్ అఫైర్స్ సెక్స్ స్కాండల్స్ గురించి చూస్తూ ఇలా అందరూ తమ శారీరక స్థితిని కోరికలను తమ అస్తిత్వంగా మార్చుకుంటుంటే దానికోసం సమాజాన్ని కూడా ఎదిరిస్తుంటే నువ్వు మాత్రం ఏ కోరికా కలగక ఎవ్వరిలోనూ కోరిక కలిగించక… నువ్వేంటి – ఫ్రిజిడ్? అసెక్సువల్? ఆంటీసెక్సువల్? అన్నది నీకు అర్థం కాదు. నువ్వు ప్రేమించిన వ్యక్తితో కలిసి చేసిన ట్రిప్‌లో స్టేషన్ రాబోతోందనగా సైడ్ లోవర్ బెర్త్‌లో కూర్చున్న నీకు కిక్కిరిసి కోలాహలంగా ఉన్న రైల్వే కంపార్ట్‌మెంట్‌లో అతడు దగ్గరగా జరిగినప్పుడు లీలగా వచ్చిన చెమట వాసన అతడి మెడమీద క్రాఫ్ కింద పల్చటి వెంట్రుకలు చూసి వాటిని ముద్దు పెట్టుకోడానికి వంగిన నీకు అంతమందిలో అందరి ముందూ నీకు నేర్పబడిన సభ్యతనూ అలవాటైన సిగ్గు బిడియాలనూ నొక్కిపెట్టగలిగేంత కోరిక కలిగింది కాదని నీకు వెంటనే గుర్తొస్తుంది.

ఇంతలో ఆఫీసులో నిన్ను మెయిన్‌టెనెన్స్ ప్రాజెక్టులో పడేస్తారు నీకు ఒంట్లో బాలేదని వంక పెట్టి. నువ్వు ఆఫీసులో మొబైలులో గేములు ఆడడం మొదలు పెడతావు. ఆన్‌లైన్ షాపింగ్ చేస్తావు. ఆఫీసులో పని తగ్గించి నీ మీద నువ్వు శ్రద్ధ పెడతావు. గోనెసంచిలో చుట్టినట్టుండే బట్టలు కాకుండా కొంచెం బిగుతైన బట్టలేసుకోవడం మొదలెడతావు. యోగాలో చేరతావు. నీ శరీరం ఎంతలా వంగగలదో తెల్సుకుంటావు. ఇంటి నుండి ఏదో సంబంధం వచ్చిందంటూ ఫోన్ వస్తే ఇంతకు ముందులా కాదూ కూడదూ అనకుండా ఫోటోలు చూడ్డం మొదలెడతావు. ఒకట్రెండు సంబంధాలు ఫోటోల దగ్గరే ఆగిపోతే ఇంకో రెండు మూడు జాతకాల దగ్గర ఆగిపోతాయి. నీ సానుకూలత చూసి మీవాళ్ళు పట్టువదలకుండా పట్టుకొచ్చిన సంబంధాల్లో ఒకటి పెళ్ళి చూపుల దాకా వస్తుంది.

అతడు హెచ్.ఆర్. ఐదేళ్ళ క్రితం నాన్న చనిపోతే దాని నుండి తేరుకొని కుటుంబాన్ని ఒక గాడిన పడేయడానికి ఇన్నేళ్ళు పట్టిందని అందుకే పెళ్ళి ఆలస్యమైందని చెప్తాడు. జీతం ఈఎమ్‌ఐ లెక్కలు మెడికల్ అప్‌డేట్‌లు హాబీల చిట్టాలు అయ్యాక ఉద్యోగం నువ్వే మారాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకో అతనికి నువ్వు నచ్చవని నీకు అనిపిస్తూ ఉంటుంది. రెండు రోజుల్లో వాళ్ళు వాళ్ళకి ఇష్టమేనని చెప్తారు. నీ ఇష్టాన్ని అడుగుతారు ఇంట్లోవాళ్ళు. ఇష్టం లేకపోతే పెళ్ళి చేసుకోవద్దని జస్ట్ టైమ్‌పాస్ కోసమైతే టిండర్ ఆప్స్ లాంటివి ఉన్నాయని స్నేహితులు చెప్తారు. ఇంకెన్నాళ్ళు? ఇంకెన్నాళ్ళు? మీ అమ్మనాన్నల ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉండదు. అందుకే సరే చెప్తావు.

ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాక ఎక్కడున్నావ్? తిన్నావా? ఇంకా నిద్రపోలేదా? లాంటి కబుర్లు మొదలవుతాయి. మెయిన్టెనెన్స్ ప్రాజెక్టే కాబట్టి పాత కంపెనీ వాళ్ళు త్వరగా పంపించేస్తారు. కొత్త ఉద్యోగం వెతుక్కొని వచ్చేస్తావు. కలిసి సినిమాలు షాపింగులు లాంగ్ డ్రైవ్‌లు మొదలవుతాయి. అవకాశం ఉన్నచోటల్లా చేతిలో చేయి ఎవరూ లేని చోట ఒక ముద్దు మెసెంజర్లో సెక్స్ జోక్స్- పెళ్ళి పీటల దాకా ఇలా నడుస్తుంది.

ఒకరి భాష ఒకరికి అర్థం అవ్వని మీ ఇద్దరి శరీరాలు తంటాలు పడుతూనే మొదటిరాత్రి ఎలానో మాట్లాడుకుంటాయి.

కొన్ని నెలలకే నీకు సైడ్-ఎఫెక్ట్స్ తెలుస్తాయి. ఇంట్లోనూ ఉద్యోగంలోనూ కొత్తవాళ్ళు. ఒకపక్క పని ఒత్తిడి. రెండు నెలలు అవ్వకుండానే గుడ్ న్యూస్ ఎప్పుడు? అని తరిమే ఇంట్లోవాళ్ళూ చుట్టాలూ! కళ్ళ కింద నలుపు ఎక్కువవుతుంది. జుట్టింకా ఊడిపోతూనే ఉంటుంది. పీరియడ్స్ పూర్తిగా కుదటపడవు.

మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్తావు ఈసారి అతనితో కలిసి. తక్కిన మందులతో పాటు ℞: కిడ్స్ అని రాసిస్తుంది.


రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ...