పొద్దస్తమానం దేశంలోని వార్తలన్నీ వడబోస్తూ ఉంటావు.
కాశ్మీరు సైనికుడి రక్తమంటిన అరువు రాయి
అటవీ అధికారులపై ఎర్ర చందనం కూలీ రాయి
వాహన చోదకుని రక్తమంటిన నిర్లక్ష్యపు రాయి
స్థలాల దురాక్రమణల్లో కాళ్ళొచ్చిన రాయి
మృత కథలని మోస్తున్న చరిత్ర రాయి
మోసులెత్తిన ఆశలను మోస్తున్న పునాది రాయి
ప్రతీ వార్త పాల మనసులో ఉప్పురాయి.
బేల మనసుకు అంటురాయి.
జవాబు లేని ఒరిపిడి రాయి.
దేశపు వొళ్ళంతా నిండిన రాళ్ళన్నీ మోసుకుంటూ
మొరాయిస్తావే కదలడానికి?
సగం కాలిన కాష్ఠాల్లాంటి ఆశలన్నీ ఏరుకుంటూ ఉంటావు.
పొందరాని దానికై పోరాటం
అందరాని వాటికై ఆరాటం
చెందరాని చోట్లలో చెలగాటం
చెప్పలేని మాటల్లో ఇరకాటం
అవదూ జీవనమకటావికటం?
పాటల పడవలో జీవన నౌకని కుదుపుల్లేకుండా నడుపుకుపోవాలని రహస్యంగా ఆశపడతావు.
వలపుల ఊటలు ఊరే పాటలు
పాల కంకులుగ ఊగే పాటలు
మెల్లని గాలిగ వీచే పాటలు
పిట్టలు దాగిన పచ్చని తోపులు
చల్లని వీవెన వీచే మాపులు
కన్నుల కాంతుల కన్నె కలుపులు
తీరని దాహపు తియ్యని మలుపులు
తీరుస్తాయంటావా నిజ జీవన వెతలు?
పుస్తకాల మేడమీదనించి లోకాన్ని తొంగి తొంగి చూసి అర్థం చేసుకోవాలని ఆరాటపడతావు.
పుస్తకాలు మస్తకాలు
ఆలోచనల అంపకాలు
భావనల పంపకాలు
మాటల అౘ్చకాలు
మేధకు ఆరెకాలు
ఈ పగిలిన జీవన శకలాలు
ప్రతిఫలిస్తాయా సాకల్యంగా
రంగులు అలదిన జీవన చిత్రాలు?
అర్థంపర్థం లేని సందేహాలతో సతమతమౌతూ ఉంటావు.
పెరట్లో కూచున్నా
వాకిట్లో నుంచున్నా
అదే గనక నాకైతే
ఇదే గనక నాకొస్తే
అనుకుంటూ
అదిరిపోతూ
లేని పులి
మీద పడినట్టే
బెదిరిపోతూ
క్షణక్షణం
అనుక్షణం
అదే గనక నాకైతే
ఇదే గనక నాకొస్తే
అనుకుంటూ అనుకుంటూ
క్షణ క్షణం
అనుక్షణం.
పేరుకున్న సందేహం
అంతరాభవ దేహం
పురాతన అగ్గి దాహం.
అన్నింటినీ మోసుకుంటూ
అన్ని దిక్కులూ చూసుకుంటూ
ఆయాసాన్ని అణచుకుంటూ
నడు. నడు ముందుకి.
అరుణారుణ కాంతులతో
కనిపిస్తుంది అదిగో అరుణాచలం.
ఆ రాళ్ళన్నీ విసురు కొండ మీదకి.
ఆ కాష్ఠాలను.
ఆ పూరేకులని.
ఆ పుస్తకాలని.
ఆ మందపాటి సందేహాలని.
అప్పుడు అరువు అరుణాచలం ప్రతిధ్వనించేటట్టు.
నేనెవరు?
నేనెవరు?
నేనెవరు?
తిరిగి ఆ ఎర్రెర్రని కొండ నిన్నే అడుగుతుంది.
గిరగిరా తిరిగి తిరిగి.
నేనెవరు?
నేనెవరు?
నేనెవరు?
ఆ ప్రశ్ననే జపించుకుంటూ
పదే పదే తలుచుకుంటూ
అటూ ఇటూ చూడకుండ
తిరిగి రా ఇంటికి.