యజ్ఞం కథ: మరో పరిశీలన

సాహిత్యం యొక్క ప్రత్యేకత, విశిష్టత దాని సృజనాత్మకత. అందులోనూ, కథా రచన ద్వారా ఆవిష్కరింపబడిన జీవితం మన వాస్తవిక జీవితానుభవంగా మనల భ్రమింప జేయగల ఇంద్రజాలం కలిగివుంటుంది. కాళీపట్నం రామారావుగారి ‘యజ్ఞం’ కధ అనే స్పృహ లేకుండా దాన్ని ఆమూలాగ్రం మనచే చదివింపజేస్తుంది. ఆ కథ లోని పాత్రలు, వారున్న పరిస్థితులలో, వారికెదురైన సంఘటనలకు వారి స్పందనలు, పరిపూర్ణంగా మన జీవితానుభవం అవుతవి.

కథావేదిక సుందరపాలెం అనే గ్రామం. ఇది ఎక్కడుందో మనకు చెప్పే ప్రయత్నంలో కొంత అతి, కొంత డొంక తిరుగుడు, గందరగోళం సృష్టించినా కథ ప్రారంభం అయిన దగ్గరనుండి కథలో మనం పూర్తిగా లీనమవుతాం. మనం పాఠకులమనే విషయం పూర్తిగా మర్చిపోతాం. కథావిషయం అప్పల్రాముడి కుటుంబం గోపన్నకి బాకీగా ఉన్న అప్పుకు సంబంధించి, దేవాలయం దగ్గరి ధర్మమండపం పంచాయితీ వేదికగా జరుగుతున్న సమావేశంలో పడే తర్జన భర్జనలు. మండపానికి చుట్టూరా, వీధికి ఆ చివరి నుండి ఈ చివరి దనుకా హాజరై కూర్చున్న జనంలో మనం కలిసి పోతాము.

పాత్ర చిత్రణ చాలా చక్కగా, సహజంగా సజీవంగా ఉంటుంది. ఇంత క్రితమే చెప్పినట్లు వారిని పాత్రలుగా మనం భావించం. నిజమైన వ్యక్తులుగా వారికి చేరువవుతాం. వారి మనోగతాన్ని అవగతం చేసుకుంటాం. కథలోని పాత్రలన్నీ ఎవరికి వారే వారి వారి ప్రత్యేకమైన వ్యక్తిత్వాలతో మనం గుర్తుంచుకునేట్లు మిగిలిపోతారు.

సంక్షిప్తంగా కథ: దశాబ్దాల క్రింద తాను మధ్యవయస్కుడుగా ఉన్నప్పుడు, గోపన్న వర్తకునిగా ఎదిగి స్థిరపడక పూర్వం, అప్పల్రాముడు తన వ్యవసాయ పంటలను అప్పుడే దళారి వ్యాపారిగా జీవితం ప్రారంభించిన గోపన్నకు ఆయన చెప్పిన ధరలకు మారుమాట్లాడకుండా అమ్ముతుండేవాడు. అయిదారు సంవత్సరాలలోనే గోపన్న అంచెలంచెలుగా ఎదిగాడు; అప్పల్రాముడి ఆర్థిక పరిస్థితి మాత్రం క్రమక్రమంగా దిగజారింది. గోపన్న దగ్గర తీసుకున్న కొద్ది అప్పు తడిసి మోపెడయింది. తనకున్న పొలం క్రమక్రమంగా తరిగిపోయి ఇప్పుడు కాసింత మాత్రమే మిగిలింది. గోపన్న అప్పు తీర్చాలంటే ఆ కాసింత అమ్మాలి. అది అమ్మితే తనకు, తన కొడుకులకు, మనవలకు బువ్వ లేనట్లే. బానిస బతుకులు బతకాలి. గోపన్న పరిస్థితి కూడా పెద్ద వర్తకుల పోటీ తట్టుకోలేక పోవటం వలన చితికిపోయింది.

ఇప్పుడు పంచాయితీలో తేల్చవలసిన విషయాలు ఒకటి – అది అప్పా, కాదా? రెండు – దానిలో ధర్మమెంత, అధర్మమెంత? మూడు – తీర్చవలసి వస్తే ఎంత ఇస్తే సరిపోతుంది?

శ్రీరాములు నాయుడు ఊరిలో పెద్ద మనిషి. ఊర్లో వారి తగాదాలు అతనే పరిష్కరించేది. శ్రీరాములు నాయుడు ఎంతో గుంజాటనకు లోనై ఇది అప్పే అని తీర్పు చెప్పాడు. అప్పల్రాముడికి కోపం వచ్చింది. అయినా కోపం దిగమింగుకుని ఆయన తీర్పులోని అసంగతాన్ని వివరించాడు. ఆ ‘కాసింత నేల’ అమ్మి అప్పు తీరుస్తానన్నాడు. కానీ, అప్పల్రాముడి రెండవ కొడుకు సీతారాముడికి ఇది ససేమిరా ఇష్టం లేదు. బ్రతికినంతకాలం చాకిరీ చేసి గోపన్న అప్పు తీరుస్తాను కానీ, నోటికాడి ఆ కాసింత పొలం అమ్మటానికి వీలు లేదన్నాడు. అమ్మితే తండ్రిని చంపి తానూ చస్తానన్నాడు. అయినా అప్పల్రాముడు తన మాటకు కట్టుబడి, అమ్మకం పత్రం మీద నిశానీ పెట్టి, కొడుకుల చేత, మనవళ్ళ చేత నిశానీ వేయించాడు. సీతారాముడి కళ్ళు చండ్రనిప్పు లయినాయి. ఇంటివైపు పరిగెత్తాడు. జనంలో కలకలం పెరిగింది. సీతారాముడికి తనకున్న ఒక్కగానొక్క కొడుకు కంబారీగా ఉండటం ఇష్టం లేదు. ఆ చిన్నవాడ్ని నరికి గోతంలో వేసుకుని ధర్మ మండపం ముందు దభాలున పడవేశాడు. ఈ అకృత్యంతో కథ ముగుస్తుంది. సంక్షిప్తంగా కథ ఇదే అయినా వ్యాసంలో కథ ప్రధానాంశాలను పరామర్శించేటప్పుడు అవసరమైన మేరకు విశదీకరించటం జరుగుతుంది.

ఇలా ఒక మంచి కథ దారుణమైన అకృత్యంతో, అమానుషంగా, జుగుప్సాకరంగా ముగుస్తుంది. మానవీయత లేదు, కారుణ్యం లేదు, అర్ధం, పర్ధం లేవు.


సాహిత్యవిమర్శలో టెక్స్చువలిస్ట్ క్రిటిసిజం (Textualist Criticism) అనేది ఒకటున్నట్లు మన అనుభవం లోని విషయం. ఒక గ్రంధాన్ని పరామర్శిస్తున్నప్పుడు ఆ గ్రంధంలో చెప్పబడిన విషయాలకే ప్రాధాన్యత నివ్వటం ఆ విషయాలకే మన పరిశీలనను పరిమితం చేయడమన్న మాట. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గ్రంధాన్ని దాటి పోవలిసిన అవసరం లేదు. It is only the text that matters. అంతేగాని ఎక్కడెక్కడి సిద్ధాంతాలనో, దృక్పధాలనో, సమాచారాన్నో తీసుకొచ్చి ఆ గ్రంధానికి అన్వయించి దాని బాగోగులు నిర్ణయించడం సమంజసమైన పద్ధతి కాదని చెప్పడమన్న మాట. అంతమాత్రం చేత సాహిత్యవిమర్శలో ఇదొకటే రీతని కానీ, పద్ధతని కాదు. ఇది ఎక్కువ సమంజసమయిన పద్ధతని చెప్పవచ్చనుకుంటాను.

‘రచయిత అవగాహనలో లోపాలు‘ అనే శీర్షికతో కాళీపట్నం రామారావుగారి యజ్ఞం కథ మీద వ్రాసిన వ్యాసంలో రంగనాయకమ్మగారు తర్కబద్ధంగా వారి విమర్శనాంశాలను వివరించారు. రంగనాయకమ్మగారు పరిశీలించిన ప్రధానాంశాలు:

  1. వ్యవసాయ రంగంలో వ్యాపార పంటలప్రవేశం
  2. శ్రీరాములు నాయుడి పాత్ర
  3. అప్పలరాముని అప్పు స్వభావం
  4. కథ ముగింపు

1. వ్యవసాయరంగంలో వ్యాపార పంటల ప్రవేశాన్ని గురించి అంత విపులంగా చర్చించ వలసినంత ప్రాధాన్యత వాటికి కథ బాగోగులను బేరీజు వేయడంలో అవసరమా అని సందేహం వస్తుంది. దానిలో ఎక్కువ భాగం సాహిత్య విమర్శ క్రిందికి వస్తుందా అని అనుమానం కలుగుతుంది.

2. శ్రీరాములు నాయుడి పాత్రలో పెద్దగా వైరుధ్యాలున్నట్లు పాఠకులకనిపిస్తుందని నేననుకోను.

రచయిత చిత్రించిన పాత్రల స్వరూప స్వభావాలు ఒక క్రమంలోనే నడిచాయి. శ్రీరాములు నాయుడు మృదు స్వభావి, విద్యావంతుడు, ఊరికి మంచి చేద్దామనుకునే స్వభావం కలవాడు. న్యాయంగా తీర్పు చెప్పాలనే ప్రయత్నం చేసేవాడు. గోపన్నకు అప్పల్రాముడు అప్పు పడి వున్నాడనే ఆఖరుకు శ్రీరాములు నాయుడు తీర్పు చెప్పి, అప్పటి అప్పల్రాముడి ఆర్ధిక దుస్థితి దృష్ట్యా తాను అప్పు తీరుస్తానని చెప్పడం అప్పల్రాముడికి అవమానం అనిపించింది, కోపం తెప్పించింది. ఎక్కడా తొణకని, బెణకని అప్పల్రాముడు సహనం కోల్పోయి శ్రీరాములు నాయుడ్ని చాప కింద నీరు లాంటి వాడని, ఆయన కొట్టిన దెబ్బ అది తగిలిన చోట కాక మరోచోట బాధిస్తుందని విమర్శిస్తాడు. ఈ ఒక్కచోట తప్ప రచయిత తన మాటగా కాని, వేరే పాత్రలు కాని (సీతారాముడు మినహా) ఆయననెవరూ తప్పుబడుతూ మాట అన్నట్లు కనబడదు.

శ్రీరాములు నాయుడు గాంధీగారి తాత్విక చింతనతో ప్రభావితుడైతే మనం తప్పు బట్టవలసిన అవసరమేముంది? శ్రీరాములు నాయుడు గాంధేయవాది కనకే “పవిత్రమైన సేవా భావంతో అంత గొప్ప యజ్ఞం (గ్రామాభివృద్ధి) సాధించడం చెయ్యగలిగా”డని రచయిత భావమైతే ఆ భావం కలిగి ఉండే స్వాతంత్ర్యం, హక్కు ఆయనకుండటంలో తప్పు లేదు కదా! ఏ రచయితకైనా ఏవో భావాలు ఉండబట్టే కదా వాటి ననుసరించి రచనలు చేయడం. రంగనాయకమ్మగారు శ్రీరాములు నాయుడి పాత్రను గురించి చేసిన విమర్శలో “అతను గాంధి వాదం ఎడల విశ్వాసం ఉన్న ఆదర్శ నాయకుడుగానూ, ఇంకోపక్క అతను మోతుబరుల కొమ్ముకాసే కపటి గానూ కనిపిస్తా”డని వెల్చేరు నారాయణ రావుగారు చెబుతారు. కథలో ఎక్కడా అతను మోతుబరుల కొమ్ము కాసే కపటిగా కనిపించినట్లు అనిపించదే.

పైగా నారాయణ రావుగారు ‘ఈ కథను రెండవ సారి చదవటానికి ముందు’ అనే శీర్షిక గల వ్యాసంలో రామారావు గారి కథలలో క్లిష్టత ఉంటుందంటారు. అలా క్లిష్టత ఉండటం అదొక సుగుణమన్నట్లు ధ్వనింపజేస్తారు. పైగా సామాన్యులకు అర్ధం కాని విధంగా వ్రాస్తారని ప్రాచీన రచయితలను విమర్శిస్తూ, సామాన్య పాఠక జనాన్ని జాగృతం చేయాలనే తలంపుతో వ్రాసే వారి రచనలలో క్లిష్టతను మెచ్చుకోవటం ఎలా సాధ్యం? నా వరకు నాకెక్కడా క్లిష్టత కనిపించలేదు. ఆ కథను అర్ధం చేసుకోవడానికి రెండు మూడు సార్లు చదవవలసిన అవసరం లేదు. కథలో లేని క్లిష్టతను తన పరామర్శలో ప్రవేశ పెట్టారు వెల్చేరు నారాయణ రావుగారు, వక్తంటూ ఒక ఘోస్ట్ కధకుడున్నాడని చెప్పి. రచయిత తన మాటగానే కథంతా చెప్పాడు, లేదా పాత్రల చేత వారి స్వభావాలకు అనుగుణంగా మాట్లాడించారు. కథలో కనిపించేది రచయిత లేదా పాత్రలే. ముసుగులో ఉన్న వక్తంటూ ఎవరూ లేరు.

రామారావుగారు వర్గ వైరుధ్యాన్ని స్పష్టంగా చూపించలేదని రంగనాయకమ్మగారి వాదం. కారణం బాకీ ఉన్న అప్పలరాముడు, అప్పిచ్చిన గోపన్న, ఇద్దరూ బీదవాళ్ళే. వారిలో ఎవరూ దోపిడీ మనస్తత్వం కలవారు కాదు. వర్గ వైరుధ్యాల్ని ప్రవేశపెట్టకుండా కథలు వ్రాయడానికి వీలు లేదా? మనం చూసే నిజ జీవితంలో కూడా ఇద్దరు బీదవాళ్ళ మధ్య బాకీ తగవులు ఉండటం గమనిస్తాం. ఒక బీదవాడు ఇంకొంచెం మెరుగైన ఆర్థిక స్థితి ఉన్న బీదవాని దగ్గర వడ్డీకి ఋణం తీసుకోవడం మామూలుగా జరిగే పని. పైపెచ్చు కొంచెం ఎక్కువ వడ్డీకి కూడా. ఇద్దరూ పూరి గుడిసెలలో ఉండే వారే. వారిద్దరి మధ్య వర్గ వైరుధ్యాలు లేకపోయినంత మాత్రాన వారి స్వభావాలకు తగిన పాత్ర చిత్రణతో కథ వ్రాయటానికి వీలు లేదా? మార్క్సిస్ట్ తాత్విక దృష్టితో చూసినపుడు కాకపోయినా, వీరి మధ్య వర్గ వైరుధ్యాలు లేకపోయినా, సంఘర్షణలు తప్పని సరి. అప్పిచ్చిన వారి మధ్య తీసుకున్న వారి మధ్య కూడా సంఘర్షణలు అనివార్యం. వాటిని చిత్రిస్తూ కథలు వ్రాయడానికి వీలు లేదా?