ఆ రోజు ఆదివారం.
గోమెజ్ అప్పటికీ రాలేదు. పోయిన శనివారమే రావాల్సినవాడు.
పదుహేను రోజులకోసారి, శనివారం పొద్దున్నే వచ్చి లాన్ చెయ్యమని ఎన్నిసార్లు చెప్పినా వాడికి అర్థం కాదు. ప్రతీసారీ యస్ యస్, సీ సీ, అంటూ నవ్వుతూ తలకాయ ఊపుతాడు. అంతే. వాడికి తీరికైనప్పుడే వస్తాడు. వచ్చినప్పుడు ప్రతిసారీ శ్రద్ధగా గడ్డి కోసి, ఇంటి ముందు, వెనకా పెరిగిన పొదలన్నింటినీ అందంగా కత్తిరిస్తాడు. అదేం ఖర్మమో మరి! ఎప్పుడూ మధ్యాన్నం ఒంటి గంటకి వస్తాడు. కనీసం రెండు గంటలు మండుటెండలో పనిచేస్తాడు. రోడ్డుమీద ఎవరిని చూసినా చెయ్యి ఊపుతూ నవ్వుతూనే ఉంటాడు. అందుకనే కాబోలు, వాడు రావలసిన రోజున టైముకి రాలేదని సుజాత ఎంత చిరాకుపడినా గోమెజ్ చేతే లాన్ పనులన్నీ దగ్గిర ఉండి చేయిస్తుంది. తను మంచినీళ్ళు తాగుతూ వాడికి కోక్ బాటిల్ ఇస్తుంది.
గోమెజ్‌కి ఇంగ్లీషు రాదు, యస్ యస్, అనడంతప్ప! ఇంగ్లీషు నేర్చుకుందామన్న కుతూహలం కూడా ఉన్నట్టు కనిపించదు. సుజాతకి స్పానిష్ రాదు. నేర్చుకుందామని అనుకోవడమే కాని, పనికట్టుకొని ఈ వయస్సులో కొత్త భాష నేర్చుకోవడానికి కావలసిన ఓపికా లేదు. అయితేనేం, వాళ్ళిద్దరూ చేతులతో సైగలు చేస్తూ సంభాషణ చెయ్యడం మూకీ సినిమాలని మరిపిస్తుంది. నిజం చెప్పొద్దూ! వీళ్ళముందు మార్సెల్ మార్సో ఎందుకూ పనికి రాడనిపిస్తుంది. గుబురుగా పెరిగిన పొదలు ఎంత ఎత్తు ఉంచాలో, ఎంత కిందకి కత్తిరించాలో, ఏ పూలమొక్కలు ఎప్పుడు ఎక్కడ తిరిగి పాతాలో, ఈ వివరాలన్నీ సుజాత చేతులు తిప్పుకుంటూ సైగలు చేస్తూ చెప్పడం, వాడు యస్ యస్! అని తలకాయ ఊపడం చూడముచ్చటగా ఉంటుంది. ఈ రెండేళ్ళన్నరలో వాడు సుజాతతో మాట్లాడుతూ నేర్చుకున్న తెలుగు మాటలు ముత్యంగా మూడు – ఆగు, ఇలారా, కాదు. సుజాత నానాయాతనా పడి వాడితో మాట్లాడుతూ నేర్చుకున్న స్పానిష్ మాటలు – అమీగో, సబాదో, దొమింగో.
రెండున్నర సంవత్సరాల పైనే అయ్యింది సుజాత, మోహన్ ఆ వీధిలో ఒక పెద్ద పాత ఇల్లు కొనుక్కొని. ఇంటి ముందు, వెనక ఖాళీ స్థలం అర ఎకరం పైనే ఉంటుంది. ముందు పెద్ద లాను, రకరకాల పూల పొదలు. వెనక అటూ ఇటూ రెండు వీపింగ్ విల్లో చెట్లు ఉన్నాయి. వెనకాల సరిహద్దులో పెద్ద బర్మ్. దాని కింద ఆరడుగులెత్తున హెడ్జింగ్ పొదలూ ఉన్నాయి. వాళ్ళు కొత్త ఇంట్లోకి చేరిన రోజునే ఎదురింట్లోకి కేథరీన్, ఫ్రాంక్ కూడా వచ్చారు. ఇద్దరికీ సంసార బాధ్యతలు, ఇతర బాదరబందీలు ఏవీ లేవు. దానికి తోడు ఒకే వయసు వాళ్ళవడంతో సుజాతకి, కేథరీన్‌కీ ఇట్టే స్నేహం కుదిరింది. రోజూ పొద్దున్నేలేచి సబ్ డివిజన్‌లో వీధులన్నీ కొలుచుకుంటూ మెల్లిగా నడవడం, అమ్మకానికున్న ప్రతి ఇంటి మీదా కామెంట్లు చెయ్యడం, సాయంత్రం పూట ఎవరి డ్రైవ్ వేలో వాళ్ళు నిలబడి గంటల తరబడి పిచ్చాపాటీ చెయ్యడం అలవాటయ్యింది. సుజాత అమెరికా వచ్చి ముప్ఫై ఏళ్ళయ్యింది. ఇన్ని ఏళ్ళున్నా ఫలానా తెల్లవాళ్ళు స్నేహితులు అని చెప్పుకోవటానికి ఎవరూ ఉన్నట్టులేదు. అలాగని నల్లవాళ్ళూ కూడా లేరు. ఇంతకుముందు వాళ్ళున్న ఇంటి సంగతి సరేసరి! తను పెరట్లోకి వెళ్ళితే చాలు, తను చెయ్యి ఊపుతూ పలకరిద్దామనుకున్నా ఆ వెనకింటి ఆవిడ హాయ్ అని కూడా అనేది కాదు! ఈ సబ్‌డివిజన్ లోకి రావడం, వచ్చిన రోజే కేథరీన్‌తో స్నేహం కుదరడం కలిసివచ్చింది.
ఒక శనివారం సాయంత్రం సుజాతా కేథరీన్ కబుర్లు చెప్పుకుంటూ ఉండంగా ట్రక్ నిండా పైన్ స్ట్రా బేళ్ళు పెట్టుకొని ఒక పాతికేళ్ళ కుర్రాడు వచ్చాడు. ఒక కట్ట పైన్ స్ట్రా చేత్తో పట్టుకొని, ఇంటిముందు చెట్లకుదుళ్ళకి స్ట్రా వేస్తానని సైగ చేస్తూ స్పానిష్‌లో వటవట వాగడం మొదలెట్టాడు. కేథరీన్ మాట్లాడద్దని తర్జని తన పెదాలపై పెట్టుకొని సైగ చేస్తూ, “హౌ మచ్?” అని అడిగింది. వాడు మూడు వేళ్ళు చూపించాడు. అంతే! కేథరీన్ ఇంటి ముందు, సుజాత ఇంటి ముందూ చెట్లకి, పొదలకీ ఓపిగ్గా కుదుళ్ళు చేసి పైన్ స్ట్రా వేశాడు. బహుశా ఒక్కొక్క ఇంటికి పాతిక బేళ్ళు పట్టి ఉంటాయి. అంటే డెబ్భై ఐదు డాలర్లు! ఏ హోమ్ డిపో లోనో పైన్ స్ట్రా కొంటే నూటపాతిక పైనే అవుతుంది. దానికి తోడు, అది తెచ్చి వేసినందుకు కూలి కనీసం మరో పాతిక డాలర్లు. చులాగ్గా ఒక్కొక్కళ్ళకీ నూట యాభై డాలర్లు ఖర్చు. సుజాత, కేథరీన్ లిద్దరికీ కలిపి నూటయభై డాలర్లతో ఇంటి ముందు అన్ని చెట్లకీ, పొదలకీ పైన్ స్ట్రా చవగ్గా దొరికింది.
సుజాత, కేథరీన్ ఇద్దరూ ఒకేసారి వాడిని “గడ్డి కూడా కోస్తావా?” అని సైగ చేశారు, లాన్ చూపిస్తూ! వాడు యస్, యస్ అన్నాడు. కేథరీన్‌కి సుజాతకన్నా ఓ నాలుగు స్పానిష్ మాటలు ఎక్కువ వచ్చు. ఇంగ్లీషు స్పానిష్ కలిపి మాట్లాడేస్తుంది. వాడిని “లాన్ మోవర్ ఉన్నదా?” అని అడిగింది, వచ్చీరాని స్పాంగ్లిష్లో! వాడు “సీ, సీ” అన్నాడు చిరునవ్వు నవ్వుతూ! లాన్ చెయ్యడానికి ఎంత కావాలి, అని కూడా అడగలేదు. అడగడం ఎల్లాగో తెలిస్తేగా! ఆ రోజునుంచీ సుజాతకీ, కేథరీన్‌కీ గోమెజ్ తోటమాలి. ఇద్దరూ కూడబలుక్కొని చెరో ముప్ఫై డాలర్లు ఇద్దామనుకునుకున్నారు, అంతే.
ఆ నెల వర్షాలు బాగా పడ్డాయో ఏమో, రెండు వారాలు తిరక్కుండా ఇంటిముందు గడ్డి కనీసం అరడుగుపైగా పెరిగింది. వెనక బర్మ్ మీద డాన్‌డెలీయన్ కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. గడ్డి కొసన సన్నగా మట్టిరంగు పూలు కూడా పూస్తున్నాయి.
వారం నుంచీ సుజాత గోమెజ్‌కి ప్రతిరోజూ టెలిఫోన్ చేస్తూనే ఉన్నది. గోమెజ్ దగ్గిరనుంచి సమాధానం లేదు.
అప్పటికి రెండు నెలల కిందట వీధి చివర కార్నర్‌లో ఉన్న పెద్ద ఇంట్లోకి కొత్తగా గుజరాతీ వాళ్ళు దిగారు, రెండు హోండాలు, ముగ్గురు పిల్లలతో సహా! ఈ ఇల్లు ఏడాదినుంచీ అమ్మకానికుంది. కార్నర్‌లో ఉన్న ఇళ్ళు తొందరగా అమ్ముడుపోవు కాబోలు! కారణం; మిగితా ఇళ్ళకన్నా కాళీ స్థలం భారీగా ఉంటుంది అందులోనూ, ఈ ఇల్లు కొండమీద ఉన్నట్టే ఉంటుంది. మూడు పక్కలా స్థలం కూడా సుజాత ఇంటికన్నా బాగా పెద్దది. రెండు లాట్లు కలిపి కట్టిన ఇల్లు.ఇల్లు ఫోర్‌క్లోజర్ లోకి పోయింది కాబట్టి బాగా చవగ్గానే దొరికి ఉండాలి గుజరాతీ ఫేమిలీకి. వాళ్ళు ఇంట్లోకి దిగిన రెండో రోజున సుజాత, కేథరీన్, ఇద్దరూ ఒక క్రోటన్ మొక్క తీసుకొని “వెల్కమ్ టు నైబర్‌హుడ్” అని చెప్పటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆవిడ ఇచ్చిన టీ తాగుతూ వచ్చీ రాని హిందీలో వాళ్ళ భోగట్టా కనుక్కుంది సుజాత. ఆవిడ పేరు మాలిని; ఆయన పేరు జాయ్. అతనికి ఏదో ట్రక్కింగు కంపెనీ ఉందిట. ఆవిడ పిల్లలని బళ్ళో దింపిన తరువాత స్వామి నారాయణ్ గుడిలో వాలంటీర్ పనికి పోతుందిట. వాళ్ళ గురించి ఇంత సొద ఎందుకు చెప్పాలసి వచ్చిందంటే, సుజాత రికమండేషన్‌తో, గోమెజ్ వాళ్ళకి ఒకే ఒక్కసారి లాన్ కూడా మో చేశాడు, అందుకని!
సుజాత గోమెజ్ జాడ గురించి కేథరీన్‌ని అడిగింది. ఆ సాయంత్రం మాలిని ఇంటిముందు ఆగి ఆవిడని కూడా అడిగింది. ఆవిడ ఏదో గుజరాతీలోనో, హిందీలోనో గొణిగింది. సుజాతకి ఒక్క మాట కూడా అర్థం కాలేదు. కేథరీన్ కూడా రోజూ టెలిఫోన్ చేస్తూనే ఉన్నది. కాని, ఫలితం శూన్యం.
గోమెజ్ శనివారం, ఆదివారం మాత్రమే లాన్ పనిచేస్తాడు. మిగిలిన ఐదు రోజులూ వందమైళ్ళదూరంగా ఏదో పూల మొక్కల కంపెనీలో పని చేస్తాడు. వీడితో పాటు నలుగురు అమీగోలు రోజూ పొద్దున్నే ఆ కంపెనీకి వెళ్ళి రాత్రి పది గంటలదాకా తిరిగి రారని కేథరీన్ భోగట్టా. అందుకనే కాబోలు, ఎవరు ఎన్నిసార్లు ఫోను చేసినా సమాధానం ఇవ్వడు.
“కాస్త నమ్మకంగా, ఖచ్చితంగా రెండువారాల కొకసారి వచ్చి లాన్ చేసే వాడిని, మరొకణ్ణి చూసుకోవాలి,” అని ఇద్దరూ అనుకుంటారు, గోమెజ్ రానప్పుడల్లా! గోమెజ్ రాగానే ఇద్దరూ ఆ విషయం మరిచిపోతారు! కారణం, వచ్చినప్పుడు లాన్ పని బాగా చేస్తాడు. పై పై పనులెన్ని చెయ్యమని చెప్పినా విసుక్కోడు; అందుకుగాను పైకం అడగడు; టిప్ ఎంత ఇస్తే అంతే తీసుకుంటాడు. నవ్వుతూ యస్ యస్ అంటాడు. అంతే!