ఇవాళ రోజు రోజంతా వేస్టే.
మీటింగులో పేపర్లన్నీ పరమ బోరింగా ఉన్నాయి, ఒక్క ఫుల్లర్ ప్రెజెంటేషన్ తప్ప. సాయంత్రం ఠంచన్‌గా ఆరుకొట్టంగానే సుందరం బయట పడ్డాడు. వాంకూవర్ గాలి చల్లగా చెంపలకి తగులుతున్నది.
“కీ ఈజ్ అన్డర్ ది వెల్‌కమ్ మాట్. మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. ఐ వోన్ట్ బి హోం అన్‌టిల్ టుమారొ ఆఫ్టర్ నూన్. – యెస్.”
లంచ్ టైంలో రిసెప్షనిస్ట్ ఇచ్చిన మెస్సేజ్ కాయితం సుందరం మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు. టాక్సీ ఎక్కి సరాసరి సఫూరా ఎపార్ట్ మెంట్‌కి వచ్చాడు. తాళం తీసుకొని లోపలికొచ్చాడు. సఫూరా ఎపార్ట్మెంట్ మొత్తం ఆరువందల చదరపుటడుగులుంటుందేమో. పొరపాటున రెండు ఈగలు గనక ఒకేసారి లోపలికొస్తే, అటునించి ఇటు, ఇటునించి అటూ స్వేచ్చగా ఎగరడానికి కూడా స్థలం చాలదు. ఎదురుబొదురు గోడలకి తలకాయలు కొట్టుకొని వాటంతట అవ్వే చస్తాయి. మన ప్రమేయం అనవసరం. సుందరం తన అనాలజీకి నవ్వుకుంటూ ఫ్రిజ్ లోనించి రెండు ఐస్ క్యూబులు తీసి గ్లాసులో పడేశాడు. ఆవిరులొస్తున్న ఐస్ క్యూబులమీద స్కాచ్ పోస్తున్నప్పుడు వచ్చే చిటపట శబ్దం సుందరానికి మహ ఇష్టం.
ఒక ఫుల్ బెడ్. పక్కనే గోడవారగా లేజీ బాయ్ రిక్లైనర్, ఆట్టోమన్. బెడ్ పక్కనే నైట్ టేబుల్. దానిమీద రీడింగ్ లైట్ పక్కనే బంగారపు రంగులో యాన్‌టిక్ టెలిఫోన్. నైట్ టేబుల్ మీద నఫీసా హాజి రాసిన మొదటి నవల , ది రైటింగ్ ఆన్ మై ఫోర్‌హెడ్. బెడ్‌కి ఎదురుగుండా రెండు ఆఫీసు కుర్చీలు, వర్క్ టేబుల్. సుందరం రెండు సిప్పులు స్కాచ్ తాగాడు. సఫూరా ఇంట్లో ఎప్పుడూ రకరకాల సారాయాలు ఉంటాయి. సింగిల్ మాల్ట్ స్కాచ్. “నాకోసమే స్కాచ్ కొంటుంది,” పైకే అనుకుంటూ, మరో రెండు సిప్పులు తాగాడు. స్కాచ్ గ్లాస్ కుడిచేతిలోంచి ఎడమచేతిలోకి మార్చి, నైట్ టేబుల్ మీదపెట్టాడు, గ్లాసు మీద తన బొటనవేలి ముద్రకేసి చూస్తూ. ఎడమచేత్తో నవల తిప్పి చూసాడు. అట్టమీది ఫొటోలో హాజీ చాలా అందంగా ఉంది. ముందు కవర్ బ్లర్బ్‌లో ఆఖరి వాక్యం మీద ఎర్ర మాజిక్ మార్కర్ గీతలు.
ది చాయిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ అవర్ ఓన్, అండ్ దట్ ఫెయిత్ ఈజ్ నాట్ జస్ట్ యాన్ ఇంటలెక్చువల్ ప్రిఫరెన్స్.
పుస్తకాన్నక్కడే పడేసి సుందరం హమ్మయ్య అనుకుంటూ లేజీ బాయ్‌లో వాలాడు. బెడ్ మీద బోలెడు ఉత్తరాలున్నాయి. సుందరం ఓ ఉత్తరం తీసాడు. తప్పే. ఇంకోళ్ళ ఉత్తరాలు చదవడం ఇల్లీగల్. ఇమ్మోరల్.
పరాయి వాళ్ళెవ్వళ్ళూ చదవకూడని రహస్యాలున్న ఉత్తరాలయితే, సఫూరా అలా బెడ్ మీద ఎందుకు పడేస్తుంది?
ఎయిర్‌మెయిల్ ఉత్తరం. పార్ అవియన్ లోగో. ఎక్కడనుంచి వచ్చిందో సరిగా తెలియటల్లేదు. అరడజను పోస్టల్ ముద్రలున్నాయి. కవరు తెరిచే ఉంది. సఫూరా లెటర్ ఓపెనర్ వాడి ఉండాలి. సుందరం కవర్లోంచి ఉత్తరం బయటకి తీసాడు. ఎక్కడనుంచి వచ్చిందో చూద్దామన్న కుతూహలం తప్ప, ఉత్తరం చదువుదామన్న ఉద్దేశం ఏ కోశానా లేదు. ఇది అంత ఇల్లీగల్ కాదు గాని ఇమ్మోరల్.
ఉత్తరం చాలా చిన్నది. ఇంతచిన్న ఉత్తరానికి కవరెందుకో? కార్డు రాస్తే పోలా?
తీరా చూస్తే ఉత్తరం తిరకాసు భాషలో ఉంది. అక్షరాలు చూడటానికి ఉర్దూ అక్షరాల్లా ఉన్నాయి. తారీకు కూడా ఆ భాషలోనే రాయాలా? అరబిక్ అయ్యుండచ్చు. సఫూరా ఇరానీ కదూ? సుందరానికి ఒకేఒక్క ఉర్దూ అక్షరం తెలుసు. అలీఫ్. ఉత్తరం మొత్తంలో అలీఫులు చాలానే ఉన్నాయి. ఉత్తరం కింద సంతకం రెండు పొడి అక్షరాల్లో ఉంది. అదీ తురకంలోనే! ఎవరై ఉంటారబ్బా?
సుందరం ఆరేళ్ళ క్రితం ఇంటర్నేషనల్ బయర్స్ సెమినార్లో మాట్లాడాడు, వాంకూవర్లో. సఫూరాతో అప్పుడే పరిచయం. సుందరానికి ఉద్యోగం పేరున వాంకూవర్ రావడం బాగా పరిపాటే. అప్పటినుంచీ వాంకూవర్ వచ్చినప్పుడల్లా సఫూరాతో గడిపేవాడు. అలా సుందరానికి ఆరేళ్ళుగా సఫూరా తెలుసు. బాగానే తెలుసు. చాలా బాగానే తెలుసు. అందువల్ల తన ఉత్తరాలు చదవడం అంత ఇమ్మోరల్ కాదు.
సుందరం మరో ఉత్తరం తీసాడు. ఇదేదో గ్రీటింగ్ కార్డల్లే ఉన్నది. చిన్న చేటంత కార్డు. కార్డు మీద ఒక పక్క మూడు రంగుల ఫొటొ. స్విమ్మింగ్ పూల్ దగ్గిర అర్థనగ్నంగా కూచున్న అమ్మాయిలు అబ్బాయిలూ. ఆకుపచ్చ సిరాతో రాసిన చిన్న ఉత్తరం.
“థాంక్స్ ఫర్ ఎవ్విరిథింగ్. ఇమ్మెన్స్‌లీ ఎంజాయ్డ్ దిస్ టైమ్. విల్ సీ యు ఇన్ సిడ్నీ ఇన్ త్రీ మంత్స్. బెస్ట్.”
కెఎచ్. ఎ. అని పొడి అక్షరాల సంతకం. కె కాపిటల్, ఎచ్ చిన్న అక్షరం. ఎ పెద్ద అక్షరం.
ఎవరై ఉంటారబ్బా? సిడ్నీ ఆస్త్రేలియానా, సిడ్నీ కెనడానా? సుందరం నుదుటి మీద చిరుచెమట తుడుచుకొని మరో డబుల్ స్కాచ్ పోసుకున్నాడు, మిగిలిన ఐస్ ముక్కల మీదే. సఫూరా పై చదువుల కోసం ఇరాన్ నుంచి వచ్చానని చెప్పినట్టు గుర్తు, పదేళ్ళ క్రితం. ఇరానా? లెబనానా?
మరో ఉత్తరం. కవరు మీద బ్రిటీషు రాణి బొమ్మ. కవర్ లోనుంచి ఉత్తరం తీస్తుండగా టెలిఫోన్ మోగింది.
టెలిఫోను తీసుకోవాలా, వద్దా? టెలిఫోను కాల్ ఖచ్చితంగా తన కోసం కాదు. తను ఇక్కడ ఉన్నట్టు సఫూరాకి తప్ప మరెవ్వరికీ తెలియదు. తను అపార్ట్‌మెంట్‌కి వచ్చానో లేదో అని రింగ్ చేస్తూన్నదా? నోప్. దట్ ఈజ్ ఇంపాసిబుల్. నేను కంపెనీ మీటింగ్ లో రాత్రి పదిన్నర వరకూ ఉంటానని సఫూరాకి తెలుసు.
గ్యారంటీగా ఈ టెలిఫోన్ కాల్ సఫూరాకే. సఫూరా రేపు మధ్యాన్నానికి గాని తిరిగి రాదే? పోనీ, టెలిఫోను తీసుకొని సఫూరాకి మెసేజ్ తీసుకుంటే? సరి సరి. ఆ పిలిచిన వాళ్ళకి పెద్ద కథ చెప్పాలి. తను ఎవరో చెప్పుకోవాలి. సఫూరా ఎపార్ట్ మెంట్‌లో తను ఎందుకున్నాడో చెప్పాలి. వాళ్ళు సఫూరా నాన్నో అమ్మో దగ్గిర బంధువులో అయితే! ఓ డియర్ గాడ్.
టెలిఫోను ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ అంటూ ఆగకండా మోగుతోంది. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఆన్సరింగ్ మెషీన్ పెట్టుకుంటారు; సఫూరా ఎందుకు పెట్టుకోలేదో?
ఆన్సరింగ్ మెషీన్ ఉంటే ఎంత సుఖం! మనం ఇంట్లో ఉన్నా కూడా పిలుస్తున్నవాళ్ళెవళ్ళో తెలుసుకున్న తరవాత మనకి ఇష్టమయితేనే సమాధానం చెప్పచ్చు. ఇష్టం లేకపోతే వాళ్ళ మానానికి వాళ్ళని వదిలెయ్యచ్చు. ఏమో! ఆన్సరింగ్ మెషీన్ పెట్టుకోకపోవడం కూడా ఒకరకంగా తెలివైన పనేనేమో.
స్మార్ట్. వెరి స్మార్ట్. సఫూరా ఈజ్ వెరి వెరి స్మార్ట్.
టెలిఫోను ఇంకా మోగుతూనే ఉన్నది, ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ అంటూ. ఎవరూ సమాధానం చెప్పకపోతే, ఆ పిలిచే వాళ్ళు పిలవడం మానేయచ్చుగా. బహుశా ఇప్పుడు పిలుస్తున్న వాళ్ళకి సఫూరా తెలియదేమో. ఇదేదో పెద్ద మాన్షన్, టెలిఫోను దగ్గిరకి వచ్చి సమాధానం చెప్పడానికి చాలా టైమ్ పడుతుందనుకోవచ్చు. నాన్‌సెన్స్.
టెలిఫోను మోగటం ఆగటల్లేదు. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. ఇలా ఎంతసేపు మోగుతుందో. ఎన్నిసార్లు మోగింతర్వాత పిలుస్తున్నవాళ్ళు డయల్ చెయ్యడం మానేస్తారో. ఇప్పటికి ఎన్నిసార్లు మోగిందో లెక్కపెట్టలేదు. ఈ పాటికి కనీసం పదిసార్లన్నా ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ అని మోగింది. పోనీ ఇప్పటినించీ లెక్కపెడితే?
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, పదకొండు.
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, పన్నెండు.
ఆ పిలిచేవాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేరని సమాధాన పరుచుకోరేమా అని మనం అనుకోవడం కూడా తప్పే. ఇంట్లో నేను ఉన్నానుగా. శబాష్. ఇంట్లో నేను ఉన్నానని తెలిస్తే ఈ పాటికి తప్పకండా సమాధానం చెప్పుతానని వాళ్ళు అనుకోవడం తప్పేమీ కాదు.
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, పదిహేను.
మళ్ళీ మరోసారి. పదహారు.
పోనీ ఇప్పుడు రిసీవర్ ఎత్తి సమాధానం చెప్పితే? పదిహేడు.
ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు రిసీవరు తీసుకొని సమాధానం చెప్పడం మర్యాద కాదు. ఒకవేళ సమాధానం చెప్పినా, ఎందుకింత ఆలస్యం అయ్యిందని వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి?
ఇంట్లో నేను ఉండికూడా టెలిఫోను తియ్యటల్లేదనే అనుమానం ఆ పిలిచే వాళ్ళకి వచ్చిందేననుకో. వీడు టెలిఫోను తియ్యడు అని తెలిసికూడా డయల్ చెయ్యడం మానరేం? ఇదంతా నాపిచ్చి గానీ, వాళ్ళకి నామీద అనుమానం ఎందుకు వస్తుంది? వస్తే గిస్తే సఫూరా మీదే ఆ అనుమానం రావాలి. సుందరం గ్లాసెత్తి స్కాచ్ అంతా నోట్లో పోసుకున్నాడు. రూములో వేడిగా ఉంది హీటర్ తగ్గించాలేమో.
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, పంథొమ్మిది. ఇరవై.
ఈ సారి దట్టంగా ఐస్ వేసి గ్లాసు నిండా స్కాచ్ నింపాడు.
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, ఇరవై మూడు.
ఒక్కొక్క విడతకీ మూడుసార్లు ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ అని మోగితే అది లోకల్ కాలా, ఇంటర్నేషనల్ కాలా?
ఇరవై ఐదు. జీసస్!
ఇదేదో సఫూరాకి ఆ పిలిచే వాళ్ళకీ మధ్య సీక్రెట్ కోడ్ అయిఉంటుంది. ఆ సిడ్నీ గ్రీటింగు కార్డు వాడేమో. ఆ గ్రీటింగ్ కార్డ్ పంపించింది మగవాడేనన్న గ్యారంటీ ఏమిటి?
ఆ కార్డు చాలా రొమాంటిగ్గా కూడా ఉంది.
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, ఇరవై ఏడు.
సీక్రెట్ కోడ్. వీళ్ళిద్దరిమధ్య సీక్రెట్ కోడ్ ఉండి ఉంటే అది ఏమిటై ఉండచ్చు, చెప్మా? ప్రతిరోజూ నేను సరిగ్గా సాయంత్రం ఎనిమిది గంటలకి పిలుస్తా. ఇరవై రింగుల తర్వాత నువ్వు రిసీవర్ తీసుకుంటే, ఆ రాత్రి నేను రాకూడదు. అంతకన్నా ముందే తీసుకుంటే నేను రావచ్చన్న మాట.
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, ఇరవై తొమ్మిది. రిసీవర్ తీసి వెంట నే పెట్టేస్తే? నో వే.
ముప్ఫై.
టెలిఫోను మోగడం మానేసింది. మై గుడ్‌నెస్. ముప్ఫై రింగులతో టెలిఫోను మోగడం మానేస్తే, వీళ్ళ ఇద్దరి మధ్యా కోడ్ అర్థం ఏమిటి? అబ్బా, ఎందుకింత వేడిగా ఉంది రూములో.
కొంపదీసి సఫూరా ఏ ఇరానీ ఏజెంటో కాదు కదా? మరి ఆ అరబిక్ ఉత్తరం ఏమిటి? సిడ్నీ ఉత్తరం కూడా ఎవడో సీక్రెట్ ఏజెంట్ రాసిందే అయి ఉండాలి. ఇంకా ఈ తిరకాసు భాష ఉత్తరాలు ఎన్నున్నాయో? బెడ్ మీద ఉత్తరాలన్నీ తీసి చూస్తే? అసలు ఆ ఉత్తరాలన్నీ ఎత్తుకొనిపోతే? ఎత్తుకుపోయి సి.ఐ.ఎ. కి పంపిస్తే? మిగిలిన ఉత్తరాలు కూడా చూస్తే ఏముంటుందో, అయినా ఎందుకు అదో లేనిపోని బెడద కాదూ. చిన్నప్పుడు, ఇండియాలో పీస్ కోర్ వాలంటీర్లని చూసినప్పుడల్లా అనేవాళ్ళు, వీళ్ళంతా సి.ఐ.ఏ. ఏజెంట్లని.
ఇక్కడనుంచి ఎంతత్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. సఫూరా! యూ స్లై డాగ్! యూ స్లై బి_!
సఫూరాతో పరిచయం ఉన్నదని బయటపడితే, మన పని ఖతం. ఉద్యోగం ఊడిపోతుంది. జైల్లో పడేస్తారు. ఏ జైల్లో పడేస్తారో కూడా ఎవడికీ చెప్పరు.
పాపం సంధ్య గతి ఏం కాను? పిచ్చిమొహంది. పరమ అమాయకురాలు. అంగలకుదురు నుంచో , ఆముదాలవలస నుంచో వచ్చింది. వెర్రిబాగుల్ది. కంద కోసం ఊరంతా వెతికేది కందా బచ్చలకూరా ఇగురంటే నాకు ఇష్టం అని. నేను నిజంగా… ఛీ! ఛీ!
సుందరం గట గటా స్కాచ్ తాగేసి గ్లాస్ బయట శుభ్రంగా తుడిచాడు. చేతి గడియారం చూసుకున్నాడు. తొమ్మిదిన్నర.
సఫూరా ఎపార్ట్మెంటుకి తాళంవేసి బయట పడ్డాడు. బయట చీకటిగా ఉంది. సన్నగా చినుకులు పడుతున్నాయి. రోడ్డుకి అవతల వైపున పబ్లిక్ ఫోను పక్కనే ఎవడో ఓవర్ కోట్ వేసుకొని నిలబడి ఉన్నాడు. అటూ ఇటూ తారట్లాడుతున్నాడు. బహుశా వీడే సఫూరాని పిలుస్తూ ఉండచ్చు. సీక్రెట్ కోడ్. ముప్ఫై రింగులతో ఆపేశాడు. అర్థం ఏమిటో?
పదినిమిషాలవరకూ ఖాళీ టాక్సీ కనపడలేదు. అటు రోడ్డుమీద ఉన్నవాడు తనకేసే చూస్తున్నాడు.
ఖాళీ టాక్సీ కనబడంగానే ప్రాణం లేచి వచ్చింది. వాంకూవర్ నుంచి చికాగోకి రెడ్ ఐ ఫ్లైట్ దొరికింది.
అమ్మయ్య! పొద్దున్నే ఆరు గంటలకల్లా చికాగో. ఇంటికొచ్చి జాకెట్ జేబులన్నీ వెతుక్కున్నాడు, తాళం చేతులకోసం. డార్న్ ఇట్. హాండ్ కారీ సఫూరా అపార్ట్మెంట్లో వదిలేసాడు.
బెల్ కొట్టాడు. ఒకటి. రెండు. మూడు. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. ముప్ఫై.
విసుగెత్తి యదాలాపంగా తలుపు తోసాడు. వీధి తలుపు తెరుచుకుంది.
సంధ్య ఇంట్లో లేదు.