పొద్దుతేరి పక్షులెగిరి పోయాయి
పర్లేదు పోనీ
ఎక్కడెక్కడికో వెళ్ళాలి
ఎవరెవరినో కలవాలి
చేయాల్సిన పనులన్నీ అలాగే వున్నాయి
సమయం దాటిపోతోంది
పర్లేదు పోనీ
కాసింత ఆగు
కొంచెం సేపు ఈ నీరెండనై
ఈ చల్లటి గాలిలో
స్వేచ్ఛగా ఎగురుతున్న తూనీగనై
కొన్ని సార్లైనా
ఏ పందెపు గాలానికీ చిక్కకుండా
ఏమీ ఆలోచించకుండా
దేనికోసమో పరుగులెత్తకుండా
ఇలా వుండనీ
గాలికీ వానకీ ఎండకీ ఏటికీ లేని
కాలచక్రంతో ఎన్నాళ్ళు కట్టేసుకు కూచుందాం?
అదే పనిగా తిరుగుతూ వుక్కిరిబిక్కిరై పోదాం?
కొంచెంగానైనా మనల్ని మనకోసం మిగుల్చుకుందాం
మనకిష్టమైన మనల్ని వెతుక్కుందాం
కొంచెంసేపు కాలాతీతంగా మనలాగే బతికి చూద్దాం