అహం బ్రహ్మాస్మి

ఆజానుబాహువూ అరవిందనేత్రుడూ కాని దంతులూరి సత్యన్నారాయణరాజుగారిని ఊరిలో అయితే సత్తిబాబుగారని, పట్నం పొలిమేరల్లోకి అడుగెడితే లారీ సత్తిబాబుగారని అంటుంటారు. ఆయనకి రాంపురంలో లారీల బిజినెస్ వుంది.

చామనచాయలో వుండే ఆయన కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా వుంటాయి. ఆ ఎరుపు కనపడకుండా నల్లకళ్ళద్దాలు కాపు కాస్తూ వుంటాయి. ఆయన పెదాలు మాడిన కెంపు రంగులో వుంటాయి. వాటిని పొగలుగక్కే సిగరెట్లు దాచి పెడుతుంటాయి. ఆయన వంటి మీద లాల్చీ షరాయిలు ఎప్పుడూ లేత మొగలి రేకుల్లా తళతళమంటుంటాయి. కాలికుండే తోలు బూట్లు భూమికి బెత్తుడుండే ఆయన్ని రెండంగుళాలు ఎత్తుచేసి చూపిస్తుంటాయి. ఆయన మెడలో వ్రేళ్ళాడే లక్కీబోన్ వందమందిలో వున్నా ఆయన్ని ప్రత్యేకంగా పట్టిచూపిస్తుంటుంది. ఎందుకోగానీ ఆయన బొడ్లో ఎప్పుడూ ఓ కైజారుంటది. ఎక్కువగా అంబాసిడర్ కారులోనూ అప్పుడప్పుడూ సువేగా బండి మీదా తిరిగే ఆయన ఆచూకీని గాలిలో తేలివచ్చే పునుగు పరిమళం ముందే మోసుకొస్తుంటుంది. ఆ వాసన తగలగానే ఎక్కడివాళ్ళక్కడ గప్ చిప్. బయటి జనం అయితే దారిలో కళ్ళప్పగించి చూస్తారు. ఇంట్లో జనం అయితే అత్తిపత్తి ఆకుల్లా ముడుచుకుపోతారు. ఆయనది ఆవూ దూడా కాంగ్రెస్ పార్టీ. హైద్రాబాద్ బ్రహ్మానందరెడ్డి లాడ్జిలో పర్మినెంటుగా ఆయన పేరు మీద ఓ రూమ్ రిజర్వ్ అయి వుంటది. ఆయన నాలుగు మాటలు మాట్లాడితే అందులో ఖచ్చితంగా అరడజను బూతులుంటాయి. కోపం వస్తే పెద్దా చిన్నా ఆడా మగా అన్న తేడాలేదు, అందరికీ తిట్ల దండకమే. దీంతో ఆయన మనతో మాట్లాడకపోవడమే మేలనుకుంటుంటారు జనం.


“ఖాళీ తెపాలాలు ఊపుకుంటూ వచ్చావు, పాలేమయ్యాయిరా?” అడిగారు బంగారమ్మగారు.

“ఇంకెక్కడి పాలండీ… దూళ్ళకి దగ్గరుండి మరీ తాపించేసీరు సత్తిబారు,” చెప్పాడు నారాయుడు పాల తెపాలాల కావిడిని వంటింటి అరుగు మీద పెడుతూ.

“ఏంటో… వాడూ వాడి అద్వైతం!”

“ఆయ్… మామూలు అద్దయితం కాదండి బాబూ, మందూమాకూ లేని అద్దయితవండి. దూళ్ళు గడ్డి మరిగీదాకా పాలు తీత్తే… కాల్లూ చేతులూ ఇరగ్గొట్టేత్తానన్నారండి.”

“కరోడా వోడు అన్నంతపనీ చేస్తాడు. ఇవాళుండి రేపెళ్ళిపోతాడు. వాడి గొడవ మనకెందుక్కానీ… నువ్వు పెదరారింటికెళ్ళి పాలు పట్టుకురారా ఈ పూటకి. వాడు పాలూ పెరుగూ ముట్టుకోపోతేనేం. తతిమ్మా వాళ్ళకి కావాలి కదా!”

“ఆయ్ అలాగేండి,” అంటూ పాలకావిడి మళ్ళీ భుజానికెత్తుకున్నాడు నారాయుడు.


మందారచెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చున్న సత్తిబాబుగారు కొండడి కోసం విసుగ్గా ఎదురుచూస్తున్నారు. ఆయన పెదాలమధ్య చలన చిత్రరంగపు ఎన్నికైన బర్కిలీ సిగరెట్… కమ్మని ధారాళమైన పొగని ఎగజిమ్ముతోంది. సిగరెట్ చివరికంటా కాలిపోవడంతో దాన్ని విసిరికొట్టి, భుజాన వున్న జంధ్యాన్ని చూపుడువ్రేలి చుట్టూ చుడుతూ విప్పుతూ మధ్య మధ్యలో కొండడి కోసం చూస్తున్నారు. అప్పుడొకటీ అప్పుడొకటీ ఎక్కడనుంచో ఎగిరి వస్తున్న తేనెటీగలు మందారపూలమీద వాలి మకరందం పీల్చుకొని ఎగిరిపోతున్నాయి. దూరంగా కడుపునిండా పాలు తాగేసిన లేగదూడలు తోకలెత్తుకుని చెంగుచెంగున పరుగులు దీస్తున్నాయి. మళ్ళీ తల్లి గుర్తొచ్చి వెళ్ళి పాలుకుడుస్తున్నాయి. పొదుగును కుమ్మేస్తున్న లేగదూడల తోకల కింద ఆవులు ఆప్యాయంగా నాలుకలతో నాకుతున్నాయి. పాలుత్రాగుతున్న దూడల నోటినుంచి తెల్లగా చొంగలు కారుతున్నాయి.

సత్తిబాబుగారు ఎదురు చూస్తున్న కొండడు రాలేదు కానీ మరకాళ్ళ మాణిక్యం వచ్చాడు.

“యాటండి నాకోసవేనా ఎదురు సూత్తుంట?” భుజాన వున్న టేకుతోకల కట్ట కిందపడేస్తూ అడిగాడు మాణిక్యం.

“కాదహే… పోసుకోలు కబుర్లు చెబుతా ఆ కొండడెధవ ఎక్కడన్నా కనబడ్డాడా?”

“ఆ కాపీ వొటేలుకాడున్నాడండి. కాలు కుంటుతా కూనిరాగాలు తీత్నాడండి.”

సత్తిబాబుగారు కిందవున్న కట్టలోంచి ఓ టేకుతోకని లాగి గాల్లో కత్తిని ఝళిపించినట్టు ఝళిపించారు. సర్ సర్ మని గాలిని చీరేస్తోందది.

ఇంతలో పిల్లిలాగా వచ్చిన కొండడు, వెనకే నిలబడి రాయి మీద కత్తి నూరడం మొదలెట్టాడు.

“ఏరా ఈ వేళదాకా ఇంటి దగ్గర పెద్దగుర్రం పళ్ళు తోముతున్నావా?” కరుగ్గా అడిగారు సత్తిబాబుగారు చేస్తున్న పనాపి.

“ఆయ్ అదండీ… కాల్లో కంచిత్రం ముల్లు దిగడిపోందండి. దీనమ్మా ఒకిటే సలుపూపోటూ. జాయిగా నడిసొత్తన్నాను. అందుకే ఆలీసమైపోయింది. ఏరా మాణీ నువ్వు చూసేవుగా నా అవత్త. చెప్పు సత్తిబారుకి,” కాలు ఎత్తి చూపిస్తూ మాణిక్యాన్ని సాక్ష్యం వేసుకున్నాడు కొండడు.

“అదేంట్రా… ఇందాకా నాకు కుడికాలు కదా సూపించావు? ఉపుడు ఎడంకాలెత్తేవేటి?” ఆశ్చర్యపోయాడు మాణిక్యం.

కొండడి మొహం ఆముదం త్రాగినట్టయ్యింది. సత్తిబాబుగారి కళ్ళు పొగలు చిమ్మాయి. వాడి వంక కోపంగా చూసిన ఆయన “ఇల్రారా లంజకొడకా నా ఎదురుగుండా,” అని గర్జించారు.

కొండడు కత్తిని మడిచి భయపడుతూ భయపడుతూ వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. సత్తిబాబుగారు టేకుతోకని గాల్లో తిప్పుతుంటే జయ్ జయ్ మని ఒకటే శబ్దం. ఆ దెబ్బ వంటి మీద పడితే తోకతోపాటూ చర్మం ఊడి వచ్చేస్తుంది. కొండడి కాళ్ళు గజగజ వణికాయి. వాడి భయం చూసి మాణిక్యానికి నవ్వొస్తోంది.

“ఏరా రంకెధవా భయమేస్తుందా? అబద్దం ఆడినప్పుడు లేని భయం ఇప్పుడెందుకురా? ఇప్పటికైనా అతి తెలివి తగ్గించు,” అంటూ కుర్చీలోంచి లేచి, “ఎందుకైనా మంచిది, ఈ కుర్చీ తీసి దూరంగా వెయ్యి. ఏ మందార పువ్వో రాలి నీ నెత్తి బొర్రడిపోతే… సత్తిబాబుగారు నా బుర్ర బద్దలుగొట్టేశారని ఊరంతా కేన్వాసింగ్ చేసేస్తావు. అసలే సుకుమారం లంజకొడుకువి,” అని వంకరగా నవ్వారు.

సత్తిబాబుగారు టేకుతోకకి పనిచెప్పకుండా మాటలతో వదిలిపెట్టడంతో బతుకుజీవుడా అని కుర్చీని దూరంగా జరిపిన కొండడు ఆయన కూర్చోగానే తన కత్తికి పని చెప్పాడు.

చేతిలో టేకుతోకని మాణిక్యం మీదకి విసిరిన సత్తిబాబుగారు “ఈ కట్టని జాగ్రత్తగా కారుడిక్కీలో పెట్టెయ్యరా.” అన్నారు.

గడ్డం గీసేసిన కొండడు సత్తిబాబుగారికి వళ్ళంతా నలుగు పెడుతుంటే, పక్కనే గొంతుక్కూర్చున్న మాణిక్యం కంఠం సర్దుకున్నాడు.

“ఏంట్రా నసుగుతున్నావు? చెప్పేడు.”

“సత్తిబారు… మరి తిరపతి ఎలదారనుకుంట్నానండే.”

“ఏరా, ఇంగితం ఇంటిదగ్గర మర్చిపోయొచ్చేవా? వెళ్ళు. నన్నడగడం దేనికి? నన్నడిగ్గానీ నీ పెళ్ళాంతో సంసారం చేస్తనావా?”

“కొంచెం డబ్బులు గావాలండే…”

“నన్నెందుకడుగుతావ్. వెళ్ళి తిరపతెంకన్న బాబునడుగు.”

కొండడు మాణిక్యాన్ని సరదా తీరిందా అన్నట్టు చూశాడు. మాణిక్యం ఏమీ మాట్లాడకపోవడంతో…

“ఒరేయ్ పిచ్చి మాణిగా… దేవుడు దగ్గరకి మనమెళ్ళాలనుకుంటే వెళ్ళలేంరా. ఆయన తీసుకు వెళ్ళాలి. మనం పిలవని పేరంటానికి వెళ్తామా చెప్పు? ఇదీ అంతే. వెంకన్నబాబుకి నిన్ను చూడాలనిపించిందనుకో. అన్నీ ఆయనే ఏర్పాటు చేసి పిలిపించుకుంటాడు. నువ్వు నన్నో నాలాంటి ఇంకో లంజకొడుకునో బతిమాలక్కర్లేదు. దేనికైనా టైమ్ రావాలిరా. నాకు తెలిసి నీకింకా ఆ టైమ్ రాలేదనుకుంటా. అయినా వెంకన్నబాబుని చూడాలనుకుంటే అప్పో సప్పో చేసి తిరపతే వెళ్ళాలేంట్రా. ఆయన ఎక్కడలేడు చెప్పు? ఆ ఆవులో లేడా? ఆ దూడలో లేడా? ఈ కొండముండాకొడుకులో లేడా?”

కొండడు మొహం మాడ్చుకున్నాడు. మాణిక్యం ఏం మాట్లాడకుండా అలా వింటూ వుండిపోయాడు.

కొండడు నలిచిన సున్నిపిండి వుండలు వుండలుగా కిందపడుతుంటే దాని చుట్టూ చీమలు చేరుతున్నాయి.

“యీటెమ్మా చీమలు. యాండి సత్తిబారు చూడండియ్యెలా వచ్చేసీయో. అసలెలా తెలుత్తదండీటికి. పెళ్ళికి సుబరేకందుకున్నట్టు తెగ ఎగేసుకొచ్చేత్తనాయి,” అంటూ కాలితో వాటిని చంపడం మొదలెట్టాడు.

“రేయ్ తింగరి నాకొడకా! ఆగు. ఏం చేస్తున్నావు. అవేమన్నా నీ పెళ్ళాం కొప్పులో మల్లె పూలెత్తుకుపోతున్నాయా? నీయమ్మా మొగుడి ఆస్తేమైనా దొబ్బి తినేస్తున్నాయా?” అంటూ కొండడ్ని దూరంగా తోసేశారు.

ఓ నిమిషం వాటి వైపు చూసి… ఎడమ భుజాన వున్న జంధ్యాన్ని కుడి భుజానికి మార్చుకొని “సర్లే… ఈ కుర్చీని ఇక్కన్నుంచి మార్చు,” అని చెప్పి స్నానానికి నూతి వైపు వెళ్ళిపోయేరు.

“ఏం మడిషిరా? ఈ రాజు ఎవలకీ అద్దమవడు. ఈ ఇంట్లో తప్పబుట్టేడు. దేవుడి గురించి ఇలా మాట్టాడితే కళ్ళు పోవా? పుట్టగతులుంటాయా?” మాణిక్యం చెవిలో గుసగుసలాడేడు కొండడు.

“ఆయనన్నదాంట్లో తప్పేం వుందిరా? మా గొప్పమాట చెప్పేడు. నువ్వు చెప్పిందీ నిజమే అనుకో. అందరికీ అద్దం అవరు. ఆయనదదోలాటి ఏదాంతం!” నిట్టూర్చాడు మాణిక్యం.


నిత్యం ఆధ్యాత్మిక చింతనతో, గుర్రంమీద తిరుగుతూ కనిపించిన వాళ్ళందరినీ ప్రేమగా పలకరించే దేవుడు చిట్రారంటే అందరికీ ఓ పూజ్యభావం. ఆయన తొమ్మండుగురు సంతానంలో ఈ సత్తిబాబుగారొకరు. చలాకీగా వుండే సత్తిబాబుగారికి తండ్రి దగ్గర అంతా ఇంతా గారం కాదు. కొండమీద కోతైనా దిగి రావాల్సిందే. గుర్రానికి జీను కడుతూ దానికి కళ్ళెం తగిలిస్తూ తండ్రి వెనకెనకే తిరిగే సత్తిబాబుగారు ఎప్పటికైనా చిట్రారి పేరు నిలబెడతారని అందరికీ నమ్మకం. అదే నమ్మకంతో చిట్రారు కూడా సత్తిబాబుగారికి మంత్రోపదేశం చేశారు. సత్తిబాబుగారికి పదహారేళ్ళొచ్చేసరికి చిట్రారు కాల చేశారు. చిట్రారి మరణం సత్తిబాబుగారిలో ఓ విశేష మార్పుని తీసుకొచ్చింది.


వాకిట్లో భగభగ మండుతున్న భోగిమంట పుష్యమాసపు చలిని తరిమికొడుతోంది.

పెరట్లోంచి వస్తున్న పిండి వంటల ఘుమఘుమలు వీధిలోంచి పోతున్నవాళ్ళ నోరూరిస్తున్నాయి. పిల్లలూ పెద్దలూ పాలేళ్ళూ పనిమనుషులూ కట్టుకున్న కొత్తబట్టల గమ్మత్తు వాసన గాల్లో కలిసిపోయి అక్కడక్కడే సుడులు తిరుగుతోంది.

గాబులోని వేడినీటితో భోగి స్నానం చేసిన సత్తిబాబుగారు సూర్యుడికెదురుగా నిలబడి మూడుసార్లు గాయత్రీమంత్రం చదివి సంధ్యవార్చారు. గదిలోకి వెళ్ళి ఓ పాత లుంగీ, చింకి చొక్కా కట్టుకొని వీధిలోకి వచ్చారు.

ఆయన అవతారం చూసిన పద్మనాభుడు “ఇదేటండి సత్తిబారు పండగ పూటా ఇయ్యేం బట్టలూ!” కొత్తపంచె మడతలు సర్దుకుంటూ అడిగేశాడు ధైర్యం చేసి.

“ఇవి కూడా లేనివాళ్ళు చాలామంది వున్నార్రా లోకంలో. అలాటోళ్ళు మనింటిముందు నుంచి పోతా పోతా నన్నుచూసి, మనకంటే లేనోడు ఒకడున్నాడని సంతృప్తి చెందితే, దానికన్నా వాళ్ళకి మనం ఇచ్చే గొప్ప పండగ కానుక ఏం వుంటదిరా సన్నాసని… నడు, అలా గోదారి గట్టుకేసి వెళ్ళొద్దాం మన షోకు అందరూ చూడాలి కదా!” నవ్వుతూ అన్నారు.

“యేటోండి బాబు చిన్నప్పట్నుంచి చూత్తనాను. మీ చేతలకీ మాటలకీ ఎక్కడా సాపత్తెం వుండదు,” బుర్ర గోక్కున్నాడు పద్మనాభుడు ఆయన వెనకాలే నడుస్తూ.

కాస్సేపు గోదారి గాలి పీల్చుకొని తిరిగొచ్చిన సత్తిబాబుగారు వడ్డన్లయ్యాయని పెరట్లోంచి పిలుపు వచ్చేవరకూ భోగిమంటను ఎగదోస్తూ వచ్చేపోయేవాళ్ళతో రాజకీయ కాలక్షేపంచేసి లోపలకి వెళ్ళారు.

“ఇంక ఈ జన్మలో వీడు మారడు!” ఆయన కట్టుకున్న చింకిపాతలు చూసిన బంగారమ్మగారు చెప్పారు కోడలితో.

“దాని గొడవ వదిలెయ్యండి. అసలు విషయం కదపండి,” లోగొంతుతో చెప్పారా కోడలు.

భోజనం ముందు కూర్చున్న సత్తిబాబుగారు ఎప్పట్లానే వడ్డించిన అన్నంలో సగం తీసి వెనక్కి పెట్టేశారు.

“పెళ్ళైనోళ్ళు ఏడాదికోసారైనా సత్యన్నారాయణ వ్రతం చేసుకు తీరాలి. ఓసారి అన్నవరం వెళ్ళి రండ్రా. నీ పేరుకూడా ఆయనదేను…” గొంతు సవరించుకున్న బంగారమ్మగారి నోట్లోంచి ఎలాగోలా ఊడిపడిందా మాట.

తల్లి మాట వినగానే సత్తిబాబుగారు త్రాచుపాములా తలెత్తి ఆ ఇద్దరి మొహాలనీ మార్చి మార్చి చూశారు.

“మొగుడుకి కూడొండి పెట్టడానికి ముప్పైమూడు మూల్గులు మూలుగుతారు. మీ మొహాలకి వ్రతాలూ నోములూ తక్కువయ్యాయా? ఏం, ఇంట్లో వెలగబెడుతున్న పూజా పునస్కారాలు చాలట్లేదా, ఇంకా ఊర్లంటా ఊరేగాలా?”

“పోనీ ఇంట్లోనే చేసుకోండి వ్రతం.”

“హూఁ… పెళ్ళాలు చేసిన పూజాఫలంలో సగం మొగుళ్ళకే దక్కుద్ది కదా! నా వాటాకొచ్చిన పుణ్యం చాలు. మీకేది నచ్చితే అది మీరేడండి. అందులోకి నన్ను లాక్కండి,” అంటూ అన్నం తినేసి బయటకు వెళ్ళి చేయి కడిగేసుకున్నారు. మారు అడగడం, మజ్జిగ పొయ్యండనడం లాంటివి అస్సలుండవు. గిన్నెలో మిగిల్చిన ఆ అన్నాన్ని ఏ కాకులకో, కుక్కలకో పెట్టడం ఇంక ఆడవాళ్ళ వంతు.


కారొస్తున్న సౌండుతో పాటూ లేస్తున్న ఎర్రకంకర బూడిదని చూసిన గిరజాల మేస్టారు సైకిల్ దిగేశారు. కారు ఆపమన్నట్టు రోడ్డు పక్కనే నిలబడి చెయ్యి ఊపారు.

అది చూసిన సత్తిబాబుగారు కారాపి కిందకి దిగి “ఏంటి మాస్టారు ఎప్పుడూ లేంది, సైకిల్ గాలి కానీ పోయిందా?” అని అడిగారు.

“లేదురా సత్తిబాబూ… ఎప్పన్నుంచో నీతో మాట్లాడాలనుకుంటున్నాను పడి చస్తేనా? నువ్వెక్కడో టౌన్లో వుండి అప్పుడప్పుడూ వచ్చిపోతున్నావు. ఇక్కడ నీ తమ్ముళ్ళు ఏం చదువుతున్నారో, ఏం చక్కబెడుతున్నారో ఓ కంట కనిపెట్టాపోతే ఎలా? నీకులాగే వాళ్ళూ జల్సాలు గిల్సాలంటూ పెడదారులుపడితే ఎలా చెప్పు? సంసారం వీధినపడిపోదా? నువ్వు పూనుకోవాల మరి.”

ఆయన మాటలకి సత్తిబాబుగారి మొహంలో అసహనం తొంగిచూసింది.

“ఏంటి, ఇది చెప్పడానికేనా వగుర్చుకుంటూ కారాపారు! మీకు గవర్నమెంటు జీతం ఇస్తుంది పిల్లలకి పాఠాలు చెప్పడానికా, ఇలా దారంటా పోయేవాళ్ళని నిలగొట్టి పాఠాలు చెప్పడానికా? సరే చెప్పారనుకుందాం. మనం పొద్దున్నే లేచి పళ్ళు తోముకుంటున్నాం కదా అని కుక్కనీ, గేదెనీ, పిల్లినీ, మేకనీ పిలిచి పళ్ళు తోముకోమంటే తోముకుంటాయా? వాటికి గడ్డి తినమనీ నీళ్ళు త్రాగమనీ మేతమెయ్యమనీ కాలవలో ఈతకొట్టమనీ ఎవరో చెబితేనే తెలుసుకున్నాయా? వాటికీ మనకీ ఏమిటి తేడా? జ్ఞానమే కదా! వాటికన్నా మనిషి తెలివైనోడే కదా! వాడా మాత్రం తెలుసుకోలేడా? మీరో నేనో చెప్పాలా? ఈసారికొదిలేస్తున్నా. ఇంకోసారిలా నన్ను రోడ్డుమీదాపితే కారు మీ మీదనుంచి పోనిచ్చేస్తాను జాగ్రత్త!” అని కారెక్కేసి ‘కుక్కలు ఎవరినన్నా చూస్తే మొరుగుతాయి. అదేంటో నన్ను చూస్తే సలహాలిస్తుంటాయి…’ గొణుక్కుంటూ కారుని ముందుకు లాగించేశారు.

మంచి చెప్పబోయిన మేష్టారికి మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలీక ‘ఏంటీడి మూర్ఖత్వం, ఏంటీడి వళ్ళు పొగరు, ఎందుకిలా ఎగిరెగిరి పడుతున్నాడు! జ్ఞానమంట జ్ఞానం… అసలదుందా వీడికి!” అని మనస్సులోనే అనుకున్నారు.


రోడ్డుపక్క పెదరాజుగారి చావిట్లో రాజులంతా పిచ్చాపాటీలో వుండగా, ఎర్ర బూడిద రేపుకుంటూ సత్తిబాబు కారుగారు ముందుకు దూసుకుపోయారు. కారు సౌండ్ దూరమైన రెండు నిమిషాలకి కానీ అక్కడ యథాతధంగా పరిస్థితి నెలకొనలేదు.

“యేటండాడి బలుపు! దేవుడంటే ఓ భక్తిలేదు. పెద్దలంటే ఓ గౌరవం లేదు. ఏం చూసుకొని ఆ మిటమిటలు? ఎనకాలేమైనా ఎస్టేట్లున్నాయా, ఎకరాలకి ఎకరాల మాగాణీలున్నాయా? ఏం మన తాహతుకి మనం కొనలేమా కార్లు?!” పలచబడ్డ ఎర్ర బూడిదని తువ్వాలుతో చెదరగొడుతూ రుసరుసలాడారు భద్రిరాజుగారు.

“మన వల్ల కాదండి బావా అది. పెట్టిపుట్టాలి. అనుభవించడం కూడా ఓ కళండి. అది మనకెక్కడ చాతనవుతుంది,” అన్నారు లంకలో కొత్తరాజుగారు.

“ఆ ఘటానికి చెప్పడం మన వల్లకాదండోయ్ భద్దిర్రారు. వాడు నోటికొచ్చినట్టు తిడితే మన తల తీసుకొని మొలేసుకోవాలి. చూసేరు కదా ఆడి గోరోజనం! అయ్యో పెద్ద మనుష్యులు కూర్చుని వున్నారు. బండి కొంచెం నెమ్మదిగా తోలదాం. పలకరించి పోదాం, అని ఓ మర్యాదా మన్ననా ఆ మొహంలో మచ్చుకైనా కనపడ్డాయా? పుల్లొంకర పొయ్యే తీర్చాలి. చూస్తాడు… చూస్తాడు. చూసి చూసీ ఆ దేవుడే తగిన శాస్తీ చేస్తాడు!” కసిగా అన్నారు గిరజాల మేస్టారు.


మంజేరు నుంచి మసకపిల్లి వెళ్ళి తిరిగొచ్చే ఉల్లిపాయల నావకోసం మాణిక్యాలమ్మ గుడి దగ్గర నుంచొని ఎదురు చూస్తున్నారు అప్పలస్వామీ వాడి కొడుకు సింహాద్రీ. ఆ నావెక్కి
ఇంజరం వంతెన దగ్గర దిగితే అక్కన్నుంచి బస్సట్టుకొని రాంపురం వెళ్ళాలన్నది వాళ్ళ ఆలోచన. నాలుగోతరగతి చదువుతున్న సింహాద్రి అక్కడ హాస్టల్లో వుంటున్నాడు.

రెండ్రోజులనుంచి వాన పడుతుండడంతో రోడ్లమీద గోతులన్నీ నీళ్ళతో నిండి వున్నాయి. రయ్యిమంటూ వచ్చిన సత్తిబాబుగారి కారు చక్రం ఓ గోతిలో పడి ఇంజన్ ఆగిపోయింది. ఆ నీళ్ళన్నీ చింది సింహాద్రి బట్టలు డాగడిపోయాయి.

వెంటనే పక్కనున్న ఓ కంకరరాయిని తీసుకున్న వాడు “నియ్యమ్మ ఒరేయ్! కళ్ళు కనబడ్డంలేదా?” అని కోపంతో ఊగిపోతూ కారు మీదకి విసిరేశాడు.

అప్పుడే కారు స్టార్ట్ అయ్యి ముందుకు పోవడంతో రాయి గురి తప్పి కారుడిక్కీకి తగిలి భళ్ళుమని చప్పుడయ్యింది.

సింహాద్రి చేసింది చూసిన అక్కడివాళ్ళంతా భయంతో వణికిపోయారు. కుర్రనాకొడుకు ఈవేళ సత్తిబాబుగారి చేతిలో చచ్చిపోయాడు అనుకున్నారు అంతా.

డిక్కీ మీద రాయి చేసిన శబ్దం వినబడ్డంతో కారు ఆపిన సత్తిబాబుగారు కోపంగా కిందకి దిగారు. ఆయన చేతిలో టేకుతోక.

“ఏ లంజకొడుకురా రాయేసి కొట్టింది?”

అప్పలస్వామి గబగబా ముందుకు వెళ్ళి “బాబ్బాబు కుర్రెధవ ఉడుకుమోత్తనంతో అలా చేసీసేడు. తప్పయిపోయింది. నా మొహం సూసొదిలీయండే,” అంటూ సత్తిబాబుగారి చేతులు పట్టేసుకున్నాడు.

ఆయన మొహంలో కోపాన్ని చూసిన పద్మనాభుడికీ మిగతావాళ్ళకీ బ్రతిమాలడానికి ముందుకు వద్దామన్నా ధైర్యం చాలడంలేదు.

“ఆ నేనే! కొట్టేను ఇప్పుడేంటి? నీదే కారా? నాయి బట్టలుకాదా?” జంకూగొంకూ లేకుండా అన్న సింహాద్రి కిందకి వంగి ఇంకో రాయిని చేతిలోకి తీసుకున్నాడు. అప్పలస్వామి వాడి డిప్ప మీద ఒక్కటిచ్చి చేతిలో రాయి లాగేసుకుని దూరంగా విసిరేశాడు.

“నువ్వుండ్రా అప్పన్నా. ఈ కుర్ర లంజకొడుకు నాకు నచ్చాడు,” మెచ్చుకోలుగా అన్నారు సత్తిబాబుగారు.

ఆయన మొహంలో ప్రసన్నత చూసిన అందరూ ఒకళ్ళమొహాలు ఒకళ్ళు చూసుకున్నారు.

“ఏం పేర్రా వీడిది? ఎక్కడకి తీసుకువెళ్తున్నావు?”

“సింహాద్రి. రాంపురం హాస్టల్‌కి వెళ్తున్నాం” అప్పలస్వామికంటే ముందే చెప్పేశాడు సింహాద్రి.

“కారెక్కు, నేను తీసుకు వెళ్తా. అక్కడకెళ్ళాకా నీకు కొత్త బట్టలు కొనిపెడతా,” అన్నారు. అందరికీ అది కలా నిజమా అనిపించింది.

“ఒరేయ్ అప్పన్నా వీడినిలాగే పెంచరా. ఆ పొగరు, పెంకితనం పిసరంత కూడా తగ్గకుండా. మనిషికి అహమేరా అసలు సిసలు ఆస్తి. అహం లేని మనిషి చచ్చినోడితో సమానం,” కారుని ముందుకు కదిలిస్తూ అన్నారు సత్తిబాబుగారు.

“మీ మాటలు నాకద్దమవడం లేదండే.”

“ఒరేయ్ కుర్రా… ఎప్పుడూ కళ్ళు దించకు. చెయ్యి చాపకు!” ఎదర సీట్లో కూర్చున్న సింహాద్రి వైపు చూస్తూ అన్నారు.

“ఆయ్!” అన్నాడు సింహాద్రి.


పాపమో శాపమో కానీ సత్తిబాబుగారి లారీకి యాక్సిడెంట్ అయ్యింది. గేటులేని రైల్వే ట్రాక్ మధ్యలో ఇంజన్ ట్రబులొచ్చి ఆగిపోయింది. ఎప్పుడూ టైముకి రాని రైలు ఆరోజు కరక్ట్ టైముకి వచ్చేసింది. రైలు గుద్దెయ్యడంతో గాల్లోకి ఎగిరిన లారీ నామరూపాల్లేకుండా పోయింది. అందులో వున్న వాళ్ళ ప్రాణాలు కూడా హరీమన్నాయి. ఎక్కడ లేని కేసులూ ఆయన మెడకి చుట్టుకున్నాయి. ఎప్పుడూ అమ్మని కూడా అన్నం పెట్టమని అడగని ఆయన ఎవరినైనా సాయం చేయమని ఎలా అడుగుతారు? అడగగలరు?

అందుకే ఆస్థులు అమ్మి సెటిల్మెంటులు చేసేశారు. చుట్టూ వున్న జనం, డాబూ దర్పం అన్నిటినీ వదిలి రాష్ట్రాంతరం వెళ్ళిపోయారు. అయ్యో పాపం అన్నారు కొందరు. బాగా తీరింది దురద అంటూ మనస్సులో నవ్వుకున్నారు ఇంకొందరు.

ఆయన దర్జాగా తిరిగిన పట్టణం ఆయన్నిపుడు మర్చిపోయింది. కానీ ఊరి జనం నోళ్ళల్లో ఆయన పేరు నానుతూనే వుంది.

భద్దిర్రాజుగారు, గిరజాలమేస్టారు, అప్పలస్వామి లాంటి వాళ్ళంతా చచ్చిపోయారు. అప్పలస్వామి కొడుకు సింహాద్రి ఇప్పుడో పెద్ద పోలీసాఫీసర్. రాష్ట్రంలో ఎక్కడెక్కడ తిరిగినా ఏడాదికోసారి వచ్చి ఊరిని పలకరించిపోతుంటాడు. సింహాద్రి ఊరిలోకి వస్తే ముసలోళ్ళందరికీ దసరా పండగే. వాళ్ళు అడిగినవీ అడగనివీ అన్ని తెచ్చి పడేస్తాడు. ఎవరినడిగినా అడక్కపోయినా సత్తిబాబుగారి గురించి అతన్ని ఊరంతా అడుగుతుంటారు.

“ఇగో సిమాద్దిరిబాబో సత్తిబారెలా వున్నారు? ఈ మద్దలేవన్నా అంపడ్డారా?” అడిగాడు ఊత కర్రతో వచ్చిన కొండడు.

“ఆయనకేం తాతా! దర్జాగా వున్నారు. అడక్కుండానే అన్నీ తెచ్చిచ్చే తమ్ముళ్ళు, అమర్చిపెట్టే పిల్లలూ…”

“ఏం చేత్నారంటావు. ఎడ్రాసుంటే ఇయ్యిబాబా ఓ ఉతరం ముక్క రాయించడేత్తాను. దూళ్ళకి పాలు తీత్తే ఒప్పుకునీవోరుకాదు రాజు. ఒప్పుడి మాట! మా యందరినీ మరిచిపోయుంటారు,” అన్నాడు నారాయుడు.

“ఒరే కొండా, నీగ్గుత్తుందా సత్తిబారి గురించి నువ్వాయాలేమన్నావో?” అడిగాడు మాణిక్యం కళ్ళజోడు సర్దుకుంటూ. ఏమన్నానా? అనుకుంటూ ఆలోచనల్లోకి జారిపోయాడు కొండడు.

“ఎవల గురించిరా పంచాయితీ ఎట్టేసీరు. ఓరి ఓరి సిమ్మాద్రి నువ్విక్కడే వున్నావేటిరా. నాకు బోరంవిటాడబ్బా తెచ్చేవా లేదా? ఏంట్రా మన సత్తిబారేవన్నా అంపడ్డారా?” అడిగాడు పద్మనాభుడు చక్రాల కుర్చీ తోసుకుంటూ వచ్చి. ఈ మధ్య కొత్తగా చెవుడొకటొచ్చింది వాడికి.

“చెప్పండ్రా ఈడికి. మళ్ళీ మొదాలకాడనుంచీని. ఆరి గురించే చెప్పుకుంటుంట!” చిరాకుపడ్డాడు నారాయుడు.

“భలే భత్తుడురా. నేనూ ఆయనా ఈ మాణిగాడు, ఆ కొండడూ మూడెక్లాస్ దాకా చదుంకొన్నాంరా సిమ్మాద్రీ. పిల్లలు కింద కూచ్చుంటే మేట్టారు కుచ్చీలో కోచ్చోడం యేటి. మేట్టారు కూడా కిందే కూచ్చుని పాటం చెప్పాల అని బళ్ళోకి రాటం మానేసీరు.” సంబరంగా చెప్పాడు పద్మనాభుడు.

“ఊల్లో ఉన్నంతసేపూ ఆ మడిషిని ఒవులం అద్దం చేసుకోలేపోయేంరా,” అన్నాడు నారాయుడు.

“చత్ నోర్ముయ్యండహే. ఆయన అద్దం కాపోడవేంటి? ఆయన పెతి మాటకీ ఓ అద్దం వుండీది. ఆయన పెతి చేతకీ ఓ పరమాద్దం వుండీది!” పరిశోధకుడిలా చెప్పాడు చెవి నొక్కిపెట్టి వింటున్న పద్మనాభుడు.

“మడుషులు దూరవైపోతేనేరా ఆళ్ళ విలుం తెలుత్తాది. అప్పుడాయనగోరు తిడతనాడనుకునీవోన్ని. కానీ ఇప్పుడాలోచిత్తుంటే ఆ బాబు నోటినుంచి వచ్చినియ్యి బూతులు కాదు మంత్రాలనిపిస్తంది రా. సిమ్మాదిరి బాబూ సత్తిబారింకా అందరినీ అలాగే తిడతన్నారా?” అడిగాడు కొండడు. అడుగుతుంటే వాడి గొంతు పూడుకుపోయింది.

“లేదు తాతా సత్తిబాబుగారి నోటి వెంట ఇప్పుడు గాయత్రీ మంత్రం తప్ప ఇంకో మాట రావడంలేదు.” చెప్పాడు సింహాద్రి.

“ఆమంత్రవే కదా ఈ ఎధవలందరికీ తిట్టుల్లాగా వినబడేది!” అంటూ పెద్దగా నవ్వేశాడు పద్మనాభుడు, సింహాద్రి మాట సగం వినిపించి సగం వినిపించక.