విమర్శ ఎందుకు?

విమర్శ అంటే ఏమిటి? దాని ఉద్దేశ్యం ఏమిటి? విమర్శ ఎవరికి? ఎందుకు? అనే ప్రశ్నలకు ఒక నిరంతర సాహిత్య పాఠకుడు స్వీయానుభవాలు ప్రాతిపదికగా చెబుతున్న సమాధానాలు ఈ వ్యాసం.

❋ సాహిత్యావగాహనను పెంచడం విమర్శ ఉద్దేశ్యం. ఆ పనికి తోడ్పడే రచన ఏ రూపంలో ఉన్నా అది విమర్శే.

గుణదోష విశ్లేషణ చేసే రచనను విమర్శ అని వ్యవహరిస్తున్నాం. సైద్ధాంతికంగా (theoretical) ఇలా అంటున్నా ప్రయోగంలో(practical) ఈ పదం ఇంకా విస్తృతార్థంలో కనబడుతుంది. ఉదాహరణకు- విమర్శ విజ్ఞాన సర్వస్వాలలో అలంకారశాస్త్ర సంబంధమైన అంశాలు, కథానిక నవల వంటి ప్రక్రియల స్వరూప స్వభావ వివరణలు, సాహిత్య తత్వ వివేచన వ్యాసాలు కూడా ఉంటాయి.

సరైన సమీక్ష, మంచి పీఠిక కూడా విమర్శచ్ఛాయతో కనిపిస్తాయి. కె.వి. రమణా రెడ్డిగారు, రా.రా. వంటి కొందరయితే ఉత్తమస్థాయి విమర్శతో కూడిన సమీక్షా వ్యాసాలు రాశారు. కృష్ణశాస్త్రిగారు ‘ఏకాంత సేవ’కు రాసిన పీఠిక భావకవిత్వ ముఖ్య లక్షణ ప్రకటనగా సాక్షాత్కరిస్తుంది. విమర్శ గురించిన వివేచనకు పూనుకున్న చాలామంది ప్రసిద్ధ విమర్శకులు పీఠికలను సమీక్షా వ్యాసాలను కూడా విమర్శగానే వ్యవహరించడం గమనించవచ్చు. (ఉదా. చేకూరి రామారావుగారి రచనలు).

లోతుగా పరిశీలిస్తే వ్యాఖ్యానం కూడా విమర్శ పరిధిలోదే అని తడుతుంది. వ్యాఖ్యానం కేవలం అర్థవివరణతో సరిపెట్టుకోవడంలేదు. వీలయిన ప్రతి సందర్భంలోనూ విశేషాంశాలు చెబుతుంది. కావ్యం ఖండనకు గురైన ప్రతిస్థలాన అది సమర్థనకు పూనుకుంటుంది.

సాహిత్యావగాహనకు తోడ్పడే రచనలన్నీ తరతమ భేదాలున్నా ప్రాథమిక స్థాయిలోనో పరిణతస్థాయిలోనో విమర్శ రచనలే అవుతున్నాయి. (అకవిత్వాన్ని కవిత్వంగా, అవిమర్శను విమర్శగా వ్యవహరించాల్సి రావడం వేరే విషయం.) విమర్శ ఏక రచనకు పరిమితం అయినా, ఒక ప్రక్రియకు సంబంధించిన అనేక రచనలను ఉద్దేశించి సాగినా, మొత్తం సాహిత్య స్వభావ స్వరూప సంబంధి అయినా, ఖండనగా ఉన్నా, ప్రశంసగా ఉన్నా, విశ్లేషణాత్మకంగా ఉన్నా, నిర్దేశాత్మకంగా ఉన్నా దాని లక్ష్యం మన సాహిత్యావగాహనను పెంచడమే. అది ఒక పరిచయ వ్యాసంగా ఉండొచ్చు. వ్యాఖ్యానం అయి ఉండొచ్చు. పీఠిక, ఉపన్యాసం- రూపం ఏదైనా కావచ్చు.

అవును. ఉపన్యాసం కూడా కావచ్చు. ఉపన్యాసం ఒక సాహిత్య ప్రక్రియ. అది మౌఖిక సాహిత్య విమర్శ. వ్యాసం లిపి రూపి. ఉపన్యాసం శబ్ద రూపి. ఆయా రూపాలలోని భేదం వల్ల వ్యాసంలో ఉన్న బిగువు, క్రమత ఉపన్యాసంలో లేకపోవచ్చు. ఉపన్యాసంలోని ఆత్మీయత, తాక్షణికత (Immediacy), ఉద్వేగం వ్యాసంలో లేకపోవచ్చు. కాని రెండూ సాహిత్యప్రక్రియలే. విమర్శకు సంబంధించిన ఒక సాహిత్య ప్రక్రియగా ఉపన్యాసం పాత్ర తగినంత గుర్తింపుకు నోచుకోలేదు.

❋ విశ్లేషణలో కూడా సృజనాత్మకత ఉంటుంది.

ప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు చేకూరి రామారావుగారు విమర్శ కూడా సృజనాత్మకమే అంటారు. ఇతరులు సృజనాత్మక రచన అంటున్న దానిని కల్పనాత్మక రచన అనాలి అంటారాయన. తాపీ ధర్మారావుగారి హృదయోల్లాస వ్యాఖ్య, వెల్చేరు నారాయణరావుగారి కవితా విప్లవాల స్వరూప స్వభావాలు, రాచమల్లు రామచంద్రారెడ్డిగారి సారస్వత వివేచన- ఇలాంటి కొన్ని రచనల్లోని ‘కొత్తచూపు’ను అన్వయాన్ని గమనించినప్పుడు చేరాగారి అభిప్రాయపు సామంజస్యం, తెలివి స్ఫుటంగా తడతాయి. మరొక విధంగా కూడా ఈ సృజనలక్షణం కనిపిస్తుంది. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఎస్వీ భుజంగరాయశర్మ మొదలైన కొందరు హృదయవాదులు రాసిన విమర్శవ్యాసాలు సృజనాత్మక రచనలు చదువుతున్న ‘అనుభవాన్నే’ కలిగించడం చాలామందిమి గమనించిన విషయమే. ప్రతి విమర్శా సృజనాత్మకం కాదు కానీ విజ్ఞాన శాస్త్ర పరిశోధనలలో కనిపించే సృజన సాహిత్య విశ్లేషణలో కూడా అక్కడక్కడా తారసపడుతుందనడానికి సందేహం అక్కరలేదు.

❋ విమర్శ ముగ్గురికి ఉపయోగం.

విమర్శ ద్వారా కలిగిన అవగాహన పాఠకుడికి పఠన లబ్ధిని పెంచుతుంది. రచయితకు సృజన పట్ల ఎరుకను పెంచుతుంది. విమర్శకుడికి అనుశీలనకు కొత్త కోణాలను అందిస్తుంది.

❋ పాఠకుడికి ఒక మంచి పరిచయవ్యాసం ఒక రచన ఉనికిని తెలియచేస్తుంది. చదవాలనే కోరికను కలగచేస్తుంది.

వాటి ద్వారా తెలుసుకుని ఆసక్తితో వెతికి, వేటాడి నేను చదువుకున్న పుస్తకాలెన్నో. మోటూరి వేంకటరావుగారి ‘సింహబలి’లాంటి కండగల కావ్యాన్ని అటువంటి ఒక పరిచయ వ్యాసంవల్ల కాకపోతే నేను ఎప్పటికీ గమనించకుండా ఉండిపోయేవాడినేమో అని అనిపిస్తుంది. పరిచయ వ్యాసాలు సాహిత్య క్షేత్ర విస్తరణకు ఉపయోగపడతాయి. పరిచయ వ్యాసాలు అంతిమంగా ప్రశంసాత్మక విమర్శలు.

❋ మంచి విమర్శకులు ప్రముఖుల ప్రసిద్ధ పుస్తకాలకు మాత్రమే పరిమితం కారు.

విమర్శకులు తరచుగా ప్రసిద్ధ రచనలను విశ్లేషిస్తూ ఉంటారు. ప్రసిద్ధికి రాని పుస్తకాలలో కూడా చాలా మంచివి ఉంటాయి. వాటిని పట్టించుకుని, విశ్లేషించి, తగిన గుర్తింపునివ్వడం విమర్శకుల బాధ్యత. వాళ్ళు మంచి రచనలను మరుగున పడనివ్వకూడదు.

ఉదాహరణకు నాకు వెంటనే తట్టే రచనలు రెండు. నాయని సుబ్బారావుగారి ‘జన్మభూమి’, ‘విషాదమోహనం’. నాయని వారి ‘సౌభద్రుని ప్రణయయాత్ర’, ‘మాతృ గీతాలు’ భావకవిత్వం ముమ్మరంగా వస్తున్న రోజుల్లో వచ్చాయి. వాటికి తగినంత గుర్తింపు వచ్చింది. విషాదమోహనం, జన్మభూమి ఆ తర్వాత కాలంలో వచ్చాయి. సాహిత్యచరిత్రలో, మంచి పుస్తకాల ప్రసక్తులలో ఆ రెండిటికీ తగిన చోటు దక్కక పాఠకుల దృష్టికి సరిగా రాలేదు. సుమారు పదేళ్ళ క్రితం ‘నాయనితో కాసేపు’ అని అనుమాండ్ల భూమయ్యగారి విమర్శపుస్తకం ఒకటి వచ్చింది. అది నాయని సుబ్బారావుగారి మొత్తం రచనల మీద వచ్చినా జన్మభూమి, విషాదమోహనం కావ్యాల మీద ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించింది. అది చదివాకనే ఈ రెండు పుస్తకాలనూ చదవాలనే కోరిక కలిగి సంపాదించి చదివాను.

❋ ఒక కొత్త శిల్పం(టెక్నిక్) వచ్చినప్పుడు, జటిల రచన తటస్థపడినప్పుడు పాఠకుడు దాన్ని అర్థంచేసుకోవడానికి విమర్శ సహాయపడుతుంది.

ఆరుద్ర ‘త్వమేవాహం’ కావ్యం మొదటిసారిగా సింబాలిక్ ధోరణిని తెలుగులో ప్రవేశపెట్టినప్పుడు పాఠకులు దాన్ని అందుకోలేకపోయారు. శ్రీశ్రీ, దాశరథి¸ సినారెల రాతల సహాయం లేకపోతే ‘త్వమేవాహం’ నాకు అవగతం అయివుండేదికాదు. వ్యాఖ్యానాల తోడ్పాటు వల్లనే కదా గురుముఖాధ్యయన పద్ధతి లోపించిన మన తరం, మన ముందుతరం వసు చరిత్ర, ఆముక్త మాల్యద, రాఘవ పాండవీయం లాంటి ప్రాచీన ప్రబంధాలను చదివి అవగాహన చేసుకోగలిగింది.

❋ ఒక కొత్త ప్రక్రియ ప్రవేశించినప్పుడు రచయితలకు పాఠకులకు కూడా విమర్శ చాలా ఉపయోగకారి కాగలదు.

ఉదాహరణకి, గజల్ ప్రక్రియ తెలుగులో ప్రచురం కావడానికి, దానికి సంబంధించి వచ్చిన లక్ష్యలక్షణ విశ్లేషణ వ్యాసాలు ముఖ్య కారణాలు. ఇప్పుడు గజల్ రాస్తున్న వాళ్ళలో అత్యధిక సంఖ్యాకులు ఉర్దూ తెలిసినవాళ్ళు కారు. డా. బూర్గుల, సామల సదాశివ, శేషేంద్ర ప్రభృతులు రాసిన వ్యాసాలు వాళ్ళకు అవగాహన, ప్రేరణ కలిగించాయి. గజల్ వంటి ప్రక్రియ కొన్ని సృజనాత్మక రచనలను చదివినంత మాత్రాన పూర్తిగా అవగతం అయ్యేదికాదు. విమర్శ ద్వారా దాని స్వరూప స్వభావాలు తెలిశాకనే రచయితకు అంతుచిక్కుతుంది. తెలుగులో హైకూ కవిత ప్రచురం కావడానికి విమర్శకులు ఇచ్చిన అవగాహన చాలా దోహదపడింది. అతి సాదాసీదాగా, మూడే పంక్తుల చిన్నరూపంలో, ఏ చమత్కారాలూ, అలంకారాలూ లేకుండా ఉన్న హైకూ చాలామందిని మొదట్లో ఏమీ ఆకట్టుకోలేదు.

నాకయితే ఇస్మాయిల్‌గారు రాసిన పీఠికావ్యాసాలు, చేరాతలలోని వ్యాసం, ఇంటర్నెట్ నుంచి మిత్రులు ‘దించి’ ఇచ్చిన ఆంగ్ల వ్యాసాలు దాని ‘జెన్ తత్వాన్ని’, సౌందర్యాన్ని, లక్ష్యాన్ని, రూప నిరాడంబరతలోని రహస్యాన్ని వివరించి చెప్పి, ఆ ప్రక్రియ పట్ల అవగాహనని తద్వారా ఇష్టాన్ని కలగచేశాయి. హైకూ రచనకూ, హైకూ మీద విమర్శ వ్యాసరచనకూ నన్ను పురికొల్పాయి.

చైతన్య స్రవంతి, మాజిక్ రియలిజం వంటి రచనా పద్ధతులు విమర్శ తోడ్పాటు లేకుండా పాఠకుడికి అందడం కష్టం.

వచన కవితా ప్రక్రియ ప్రారంభ దశలో కుందుర్తివంటి వాళ్ళ మద్దత్తు దానికి ఎంతో బలం ఇచ్చింది. ఆయన వ్యాసాలు పీఠికలు సమీక్షలు- ఇంచుమించుగా అన్నీ ఆ ఒక్క ప్రక్రియనే లక్ష్యంగా చేసుకుని నడిచాయి. మినీ కవితారూపానికి రావి రంగారావుగారు, అద్దేపల్లి రామమోహనరావుగారు చేసిన దోహదం ఈ సందర్భంలో చెప్పుకోదగిన మరో ఉదాహరణ.

❋ ఒక కొత్త కవిత్వోద్యమం, ఒక వాదం, ఒక ధోరణి బయలుదేరినప్పుడు విమర్శ పాత్ర చాలా ముఖ్యమయింది.

మచ్చుకి భావకవిత్వం కొత్తగా వస్తున్న రోజుల్లో తెలుగు సాహిత్యలోకం దాన్ని ఆమోదించడానికి సిద్ధంగా లేదు. సంప్రదాయిక కవిత్వం మాత్రమే చదివిన పాఠకులకి విమర్శకులకి అనుభూతి ప్రధానం అయిందీ, ప్రతిపదార్థ తాత్పర్యాలకు లొంగనిదీ, అతఃపూర్వం ఎరగని ప్రపంచాన్ని వస్తువుగా తీసుకున్నదీ అయిన భావకవిత్వం అకవిత్వంగా కనిపించింది. ఊహ, అలంకారం, పదజాలం, పదచిత్రం అన్నీ కొత్తే. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ఎన్నెన్నో సభలలో భావకవిత్వాన్ని పరిచయం చేస్తూ, విమర్శకులకు జవాబులు చెబుతూ, తనవీ ఇతర కవులవీ అనేక కవితలు చదివి వినిపిస్తూ ఉపన్యసించేవారట. ఆ ‘మౌఖిక విమర్శ’ నిర్వహించిన పాత్ర చాలా గొప్పది అంటారు. అలాగే ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు మొదలైన వాళ్ళు రాసిన వ్యాసాలు కూడా భావ కవిత్వావగాహనకు ఎంతో ఉపకరించాయి.

కొత్త ఉద్యమం, ధోరణి వచ్చినప్పుడల్లా తెలుగు విమర్శ తన బాధ్యతను నెరవేరుస్తూనే వచ్చింది. ఆధునికోత్తర వాద ప్రతిపాదనను వివరిస్తూ తిరుపతిరావుగారు రాసిన పోస్ట్ మాడర్నిజం పుస్తకం, మిసిమి ప్రచురించిన ప్రత్యేక సంచిక, చినవీరభద్రుడు, అఫ్సర్ వంటి వాళ్ళ వ్యాసాలు సమీప గతంలో తెలుగు విమర్శ ఈ విషయంలో నిర్వహించిన పాత్రకు తాజా నిదర్శనాలు.

❋ పాఠకుడి, విమర్శకుడి దృక్పథాలను మలిచే శక్తి విమర్శకు ఉంది.

ఈ శక్తి కొట్టచ్చినట్టు కనిపించే సందర్భాలు తక్కువ ఉంటాయి. కట్టమంచి రామలింగారెడ్డిగారి ‘కవిత్వతత్వ విచారం’ ఒక అద్భుతమైన ఉదాహరణ. అప్పట్లో అది మొత్తం సాహిత్యప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది. సాహిత్యం పట్ల పాఠకుల అవగాహనను మార్చిన మూడు నాలుగు అరుదైన తెలుగు సాహిత్య విమర్శ పుస్తకాల్లో కవిత్వతత్వ విచారం ఒకటి. విమర్శ అంటే ఛందస్సుకీ, శబ్ద సాధుతాసాధుతలకీ పరిమితం అయిన వ్యవహారం కాదని తెలియచెప్పిన రచన అది. సమాజానికి సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని, సాహిత్యంలో వాస్తవికతకు హేతుబద్ధతకి ఉన్న పాత్రని ఆ పుస్తకం మొట్టమొదటిసారిగా ఆవిష్కరించింది. ఆ తర్వాత విమర్శకులు, కవులు దాని ప్రభావాన్నుంచి తప్పించుకోలేకపోయారు. ఒక విమర్శ సాహిత్య దృక్పథాన్ని నిర్దేశించగలదని తెలుగువాళ్ళకి తట్టిన తొలి సందర్భం అది.

ఇరవయ్యవ శతాబ్ది తొలి పాదంలో వచ్చిన రచన అది. అయితే నేను దాన్ని చదివింది మాత్రం ఆ శతాబ్ది చివరి పాదంలో. అయినప్పటికీ అది నాలో కలిగించిన సంచలనం చాలా గొప్పది. నేను చదువుతున్నది ఎంతటి కవిని కానీ మంచి చెడుల్ని నిర్ధారించుకోవడంలో ఒక మానసిక స్వేచ్ఛని నిలుపుకుని చదవడం ఆరంభించింది దాన్ని చదివాకనే. గొప్ప విమర్శ వచ్చి ఎంత కాలం అయినా దాని విలువ తగ్గదు. సమాజానికి లాగానే వ్యక్తికి కూడా పరిణామ దశలుంటాయి. వ్యక్తి సాహిత్యావగాహనను ఒక మెట్టు ఎక్కించే పనిని తగిన జీవిత దశలో అది కాలాంతరంలో కూడా చేస్తూనే ఉంటుంది.

సాహిత్య వాతావరణంలోని అవాంఛనీయ ధోరణులకి, జడత్వానికి షాక్ ట్రీట్మెంటు ఇవ్వగల శక్తి విమర్శకు ఉంది. అలా ఇవ్వాల్సిన అవసరమూ ఉంది.

సాహిత్యం దానికదిగా ఒక ప్రపంచం అన్నట్టూ, చుట్టుపక్కల ఉన్న సమాజంతో దానికి ఏ సంబంధమూ లేనట్టూ భావిస్తూ ప్రతిభకన్న వ్యుత్పత్తికీ, స్వేచ్ఛకన్న అలంకార శాస్త్ర శాసనాలకీ అగ్రపీఠం ఇచ్చి స్తబ్ధమైపోయిన ఒక సాహిత్య దృష్టికి కవిత్వ తత్వ విచారం ఒక కుదుపు నిచ్చినట్టే. భావకవిత్వానంతర దశలో- సాహిత్యం కేవలం వైయక్తిక వ్యవహారం మాత్రమే అనీ లాలిత్యమూ ఆనందమే దాని పరమావధి అనుకునే ఒక మానసిక తత్వానికి- రాచమల్లు రామచంద్రారెడ్డి ‘సారస్వత వివేచన’ విమర్శ ‘షాక్ ట్రీట్మెంట్’ ఇచ్చింది. కళాకారుల బాధ్యతను స్పష్టపరిచింది. అలాగే వస్తువూ ప్రయోజనమూ మాత్రమే సాహిత్య సర్వస్వంగా చెలామణీ అయ్యే దురవస్థలో మన సాహిత్యం ఉన్నప్పుడు సాహిత్య లక్ష్యం ఆనందమా ప్రయోజనమా అన్న చర్చే వృథా అనీ, ‘ఆనందం లేదా ఆహ్లాదం కవిత్వం లక్షణం. లక్ష్యంగా చెప్పబడలేదు’1 అనీ, ప్రయోజనకారకత వల్ల వచ్చే చైతన్యానికి, శిల్పసౌందర్యం ద్వారా, అనుభూత్యావిష్కరణ ద్వారా వచ్చే ఆహ్లాదం కలిస్తేనే మంచి సాహిత్యం పుడుతుందనీ శేషేంద్ర ‘కవిసేన మేనిఫెస్టో’ ఉద్ఘోషించింది.

❋ విమర్శ గతకాలపు సాహిత్యానికి వ్యాఖ్యాతగా మాత్రమే మిగిలిపోదు. రాబోయే సాహిత్యానికి మేనిఫెస్టోగా కూడా ఉండగలదు. అలా ఉండి అది సృజనకారుణ్ణి నడిపిస్తుంది. పాఠకుల్ని ఆ సృజన స్వీకరణకు సంసిద్ధుల్ని చేస్తుంది.

తెలుగుసాహిత్యంలో స్త్రీవాదం, దళితవాదం సృజన రూపాలను వెలువరిస్తున్న క్రమంలో ఈ విషయాన్ని స్ఫుటంగా గమనించవచ్చు. అప్పటివరకూ వచ్చిన కొన్ని స్త్రీవాద కవితల్ని ఏకత్ర కూరుస్తూ వెలువడ్డ ‘నీలిమేఘాలు’ సంకలనం తన పీఠికలలో స్త్రీవాదానికి సంబంధించిన అనేక పార్శ్వాలను చర్చించింది. ఆ సంకలనంలోని కవితలకు మాత్రమే పరిమితం కాలేదు. అలాగే దళితవాద సంకలనాలయిన ‘చిక్కనవుతున్న పాట’, ‘పదునెక్కిన పాట’ల పీఠికలలో దళిత మేనిఫెస్టోలాంటి తత్వం స్ఫుటంగా కనిపిస్తుంది. తర్వాత ఆయా వాదాలకు సంబంధించిన రచనలు చేసిన కవులు రచయితలు ఆ పీఠికల నుంచి మార్గదర్శనాన్ని పొందారనడంలో సందేహం లేదు.

తెలుగులో స్త్రీవాద, దళితవాద, ప్రాంతీయ అస్తిత్వవాద, సాంస్కృతిక సామ్రాజ్య వ్యతిరేక వాద సాహిత్యాల నేపథ్యంలో వచ్చిన విమర్శను చదివి ఆ సాహిత్యాన్నే కాక సమకాలిక సమాజాన్ని కూడా అర్థంచేసుకోవచ్చు. దీన్ని బట్టి విమర్శ అటు సృజనాత్మక రచనలతో ఇటు సంఘంతో ఎంత గాఢంగా పెనవేసుకుని ఉండగలదో తెలుస్తుంది.

❋ విమర్శ ఒక నిఘానేత్రంలా కూడా పనిచెయ్యాలి.

పాపులర్ రచనలను పట్టించుకోవడం అనేది చాలామంది మంచి విమర్శకులు సైతం విస్మరిస్తున్న పని. ‘సాధారణ పాఠకుడి’ పఠన రీతుల్ని మలచగల శక్తి, మలచాల్సిన బాధ్యత విమర్శకున్నాయి. ఈ పనిని చేసినవాళ్ళు కొద్దిమందే, కొడవటిగంటి కుటుంబరావుగారి వంటివాళ్ళు. ఆయన ‘హపూర్వ హపరాధ పరిశోధన కథలు’ డిటెక్టివ్ నవలల మీద వచ్చిన సృజనాత్మక విమర్శ రచనలు. (అంటే విమర్శ ఎప్పుడూ వ్యాసరూపంలోనే ఉండకపోవచ్చు.) మంచి రచనలు ఎందుకు మంచివో చెప్పడమే కాక చెడ్డ రచనలు ఎందుకు చెడ్డవో కూడా విమర్శకులు చెప్పాలి.

❋ విమర్శకుడికి కాల స్పృహ అవసరం. రచయితల పరిమితులు, ప్రక్రియల పరిధులు అతనికి తెలియాలి.

అది లేకపోవడం వల్లనే ప్రాచీన పద్యకవిత్వం మొత్తం వ్యర్థం అనుకుంటున్నారు కొందరు. ఈరోజు ఏ విలువలు కళాత్మకంగానీ సామాజికంగానీ ప్రామాణ్యాన్ని పొందాయో అవే విలువలు గతంలో కూడా ప్రామాణ్యం పొంది ఉండాలని ఏమీలేదు. ఆ కారణంచేత ఇప్పటి విలువలు ఆధారంగా గతకాలపు సాహిత్యాన్ని తోసి పారెయ్యడం సరికాదు. సాహిత్యం చాలా పొరలను కలిగి ఉంటుంది. దేశ కాలాతీతమైన విలువల్ని కొన్ని పొరలలో నిక్షిప్తం చేసుకున్న సాహిత్యం ఎప్పుడూ ఉంటుంది. ఆ సంగతిని విస్మరించకూడదు.

అలాగే ప్రక్రియ విషయానికి వస్తే, ఉదాహరణకు- పద్య రచనలో ప్రవేశంలేని విమర్శకులకు పద్య నిర్మాణం కవికి ఇచ్చే అవకాశాలు, ప్రత్యేకతలు, విధించే పరిమితులు తెలియక, వాళ్ళ నుంచి పద్యరచనల పైన సరైన విమర్శ రాదు.

రచయితల గురించి చెప్పాల్సివస్తే, మచ్చుకి దళిత వివక్ష విషయంలో ‘మాలపల్లి’లో ఉన్నవవారి స్పందన, తన కృతులలో జాషువా స్పందన ఒకేలా ఉండవు. జాషువా ప్రతి స్పందన ఇవ్వాల్టి దళిత కవి స్పందన ఒకే విధంగా లేవు. మనిషికి దేశ,కాల, జన్మాదికాల చేత పరిమితులు ఏర్పడతాయి. సమాజం పరిణామం చెందుతూ ఉంటుంది. దానితోపాటే మనిషికి ఎరుక, ఆలోచనాస్థాయి మారుతూ ఉంటాయి. ఆయా దశలలో రచయిత పురోగమనశీలత ఆధారంగా మాత్రమే ఆ రచనల్ని అంచనా వెయ్యాలని విమర్శ మరిచిపోకూడదు.

❋ విమర్శ ఎప్పుడూ సృజన రచనల తర్వాత పుట్టి వాటికి అనుచరమాత్రంగా ఉండిపోతుందని అనుకోవడం తప్పు. ఇటువంటి తప్పుడు భావన ఎక్కువమందిలో ఉండిపోవడంవల్ల విమర్శకు, విమర్శకులకు దక్కాల్సిన స్థానం దక్కడంలేదు.

ఒకప్పుడు లక్షణకారుల్లో ఒక దురభిప్రాయం ఉండేది- కవులు తమను ఉల్లంఫిుంచిపోవడానికి వీలు లేదని. వాళ్ళు తమ గ్రంథాలకు ‘కవి గజాంకుశం’ ‘కవి సర్ప గారుడం’ వంటి పేర్లు పెట్టుకున్నారు. కవులు కూడా దాన్ని నిజమని నమ్మినట్టున్నారు. అందువల్లనే పుర వర్ణనలూ, చతుర్వర్ణాల వర్ణనలు, కోట వర్ణనలు, అష్టాదశ వర్ణనలు, శృంగార ప్రాధాన్యం మొదలైన నియమాలు సాహిత్యపు ఎదుగుదలను ఎల్లలను దారుణంగా అడ్డుకున్నాయి. ఒకే రకమైన కావ్యాలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి.

ఇప్పుడు దానికి సరిగ్గా వ్యతిరేకమైన స్థితి ఉంది. సృజనకారులు, విమర్శకుల కన్నా హెచ్చుస్థాయి సాహిత్యకారులని ఒక భావన కనిపిస్తుంది. ఇది సరికాదు. సృజన విమర్శల మేలుకలయికే మంచి సాహిత్యం.‘ఈ దేశంలో విమర్శ తోడ్పాటు అదుపు లేకుండా సాహిత్యం ఎదుగుతోందని’2 గురజాడ తనకాలపు చారిత్రక నవలలలోని అహేతుక అచారిత్రక కల్పనలను విమర్శించే సందర్భంలో ఊరికే విచారించలేదు.

ప్రతి సృజనాత్మక రచనా జనన వేళ రచయిత మనస్సులో అజ్ఞాతంగా ఎడతెగని విమర్శకు గురౌతూనే ఉంటుంది. చాలామంది కవులూ, కథకులూ, నవలాకారులూ మంచి విమర్శ రచనలు కూడా చెయ్యడాన్ని గుర్తుంచుకుంటే విమర్శకీ సృజనకీ మధ్య అంతర్గతంగా ఉన్న అవిభాజ్యత బాగా అర్థమౌతుంది.

❋ జీవితంపట్ల అవగాహన లేకపోయినా కళాస్వభావం తెలియకపోయినా విమర్శకులు విఫలమౌతారు.

సృజన సాహిత్యం మనిషినీ, అతనికి సమాజంతో ప్రకృతితో ఉన్న సంబంధాన్నీ, అతని జీవితాన్నీ చిత్రిస్తుంది. అతని కోరికల్నీ ఆశయాలనీ బలాలనీ బలహీనతలనీ ఆనందాన్నీ దుఃఖాన్నీ బహిరంతస్సంఘర్షణలనీ, అతన్ని నడిపిస్తున్న శక్తులనీ సంఘటనాత్మకంగా కల్పనాత్మకంగా కళాత్మకంగా చిత్రిస్తుంది. ఈ పనిని నిర్వహించడంలో సృజనకారులు ఏ మేరకు విజయులయ్యారో విమర్శ సాహిత్యం విశ్లేషిస్తుంది. అందువల్ల సృజనకారులకు జీవితం, కళ ఎంతగా తెలిసి ఉండాలో విమర్శకులకు కూడా అంతగానూ తెలిసి ఉండాల్సిందే.

మంచి విమర్శ చదివినప్పుడల్లా మన సాహిత్యావగాహనతోబాటు మన సంస్కారం, మన లోకపుటెరుక ఒక మెట్టు ఎక్కుతాయి.

సాహిత్యం గొప్ప మానవీకరణ సాధనం. ఉదాత్తీకరణ మాధ్యమం. ఏమీ సందేహం లేదు. దాన్ని కాపాడుకోవడానికీ, పరిపుష్టం చేసుకోవడానికీ విమర్శ చాలా అవసరం.

(డీటీఎల్సీవారు నిర్వహించిన విమర్శావ్యాస పోటీలలో మూడవ బహుమతి గెల్చుకున్న వ్యాసం.)


ఉపయుక్త విషయసూచిక

  1. గుంటూరు శేషేంద్రశర్మ కవిసేన మేనిఫెస్టో ఇండియన్ లాంగ్వేజెస్ ఫోరం 1992, పుట 261.
  2. గురజాడ వేంకట అప్పారావు, గురుజాడలు సం. పెన్నేపల్లి గోపాలకృష్ణమూర్తి, ఎమెస్కో, 2012, పుట 955, ఆంగ్ల వాక్యానికి ఇది తెలుగు సేత.

రెంటాల శ్రీవెంకటేశ్వరరావు

రచయిత రెంటాల శ్రీవెంకటేశ్వరరావు గురించి: రెంటాల శ్రీవెంకటేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కత్తవపాడులో 1956లో జన్మించారు. మూడు విమర్శనా సంపుటాలు, రెండు కవితాసంపుటాలు, ఒక గజల్ గీతాల పుస్తకం ప్రచురించారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం లభించింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్గా 2016లో పదవీ విరమణ చేశారు. ఇపుడు స్వచ్ఛందంగా రాజమండ్రి ఆర్ట్సు కళాశాలలో ఎమ్మేతరగతులకు పాఠ్యబోధన. ...