కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు – ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సులు
ఏ భాషలోనైనా తమ తమ రచనలతో తమకొక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు. తెలుగు భాష చేసుకున్న అదృష్టమేమోగాని తెలుగు సాహిత్యంలో విశేషంగా కొనియాడదగ్గ అసమాన ప్రతిభావంతులు ముగ్గురు కొద్ది నెలల తేడాలో వంద సంవత్సరాల క్రితం పుట్టారు. వారే కొడవటిగంటి కుటుంబరావు (కొకు), శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ), త్రిపురనేని గోపీచంద్. రాబోయే సంవత్సర కాలంలో తెలుగు నాట అంతటా ఈ ముగ్గురి తెలుగు సాహిత్య కృషిని గుర్తుచేసుకునేందుకు ఎన్నో సాహితీ సమావేశాలు ఇంచుమించు నెలనెలా జరగబోతున్నాయి. డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (DTLC) ముగ్గురి శతజయంతుల్నీ కలిపి ఈ సంవత్సరం సెప్టెంబరు చివరి వారాంతం, అనగా సెప్టెంబరు 26, 27 (శనివారం, ఆదివారం) తేదీల్లో సాహితీ సమావేశాలతో గుర్తు చేసుకునేందుకు తలపెట్టింది. ఉత్తర అమెరికాలోని తెలుగు సాహిత్యాభిమానులందరికీ డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ తరపున ఈ సమావేశాలకు ఇదే నా ఆహ్వానం!
స్థూలంగా సమావేశ వివరాలు ఇవి: రెండు రోజుల్లో మొత్తం ఐదు సమావేశాలు జరుగుతాయి. ముందు సమావేశం శనివారం (సెప్టెంబరు 26, 2009) ఉదయం ముగ్గురి రచయితల జీవిత విశేషాలపై ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క రచయిత సాహిత్యంపై ఒక్కొక్క సమావేశం శనివారం మధ్యాహ్నం, ఆదివారం ఉదయం జరుగుతాయి. చివరిగా ఆదివారం మధ్యాహ్నం, ఈ ముగ్గురి రచయితల సాహిత్యం, నాటి సమాజం, ఎలాంటి పరస్పర ప్రభావం కలిగి ఉన్నాయన్న విషయంపై చర్చ ఉంటుంది. శ్రీశ్రీ సాహిత్యంపై సమావేశానికి శ్రీ వెంకటయోగి నారాయణస్వామి (swamyv(at)gmail.com), కొకు సాహిత్యంపై సమావేశానికి ఆచార్య గోపరాజు లక్ష్మి (lakshmi_goparaju(at)yahoo.com) గార్లు అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రసంగించదల్చుకున్నవారు స్వామి గారికిగాని, లక్ష్మి గారికిగాని తెలుపవచ్చు. మిగిలిన మూడు సమావేశాలకు నాయకత్వ బాధ్యత వహించడానికి ముందుకు రావలసిందిగా అనుభవజ్ఞులకు ఇదే మా ఆహ్వానం. ఈ సమావేశాలకు నాయకత్వం వహించదల్చుకున్నవారు, నాకు గాని (kmaddipati(at)gmail.com) ఆరి సీతారామయ్య (ari.sitaramayya(at)gmail.com) గారికి గాని తెలియజెయ్యండి.
గత సంవత్సరం సెప్టెంబరులో మా డిట్రాయిట్ లిటరరీ క్లబ్ పది సంవత్సరాల పండుగ సమావేశాలకొచ్చిన సాహితీ మిత్రులందరికి అభివందనాలు తెలుపుకుంటూ, ఈ సెప్టెంబరులో మళ్ళీ రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకూ మా సమావేశాలకు రావడానికి అవకాశం కలగని మిత్రులకు, వచ్చి వట్టి హృదయాలతో వెళ్ళరని మాత్రం హామీ ఇస్తున్నాం! ఇంటర్నెట్ పత్రికలు, రచ్చబండ వంటి సమూహాల్లో ఎలక్ట్రానిక్ గా పరిచయమైన మిత్రుల్ని ముఖతః కలుసుకునే అవకాశం వదులుకోరని విశ్వసిస్తున్నాం.
(మరిన్ని వివరాలు, త్వరలో …)