సెప్టెంబర్ 2017


ఛాల్స్ జోసెఫ్ ట్రవియే డి విలియెర్స్, 1830

సాహిత్య విమర్శ అనేది (మనం ప్రస్తుతం వాడుతున్న అర్థంలో) తెలుగు సాహిత్య రంగానికి స్వతస్సిద్ధమైన లక్షణం కాదు. ఇది పాశ్చాత్య ప్రభావం వల్ల వచ్చినది కావడంతో ఆ ఆధునిక విమర్శాపద్ధతులు మనకు సరిగా బోధపడలేదు, మనం అలవర్చుకోలేదు కూడా. విమర్శ సాహిత్యాన్ని నిర్వచించబూనుకోదు. ఎందుకంటే నిర్వచనాలు సాహిత్యాన్ని సంకుచితం చేస్తాయి. సిసలైన విమర్శ సాహిత్యాన్ని వివరించి విస్తరిస్తుంది. పాఠకులలో సాహిత్యాభినివేశం కలిగిస్తుంది, పెంచుతుంది. ప్రస్తుత సాహిత్యరంగంలో—పొగడ్తలు తప్ప మరేమీ స్వీకరించలేని రచయితలు; ఏ రచననైనా పొగడడం లేదా తెగడడం అన్న రెండే పద్ధతులు పాటిస్తూ, రచన ఏం చెప్తున్నదో కూడా పూర్తిగా చూడకుండా వస్తువునో, శైలినో, వచనాన్నో–ఇలా తమకు నచ్చిన ఏవొక్క అంశనే ఎంచుకుని, తమ అభిప్రాయాలనే సాహిత్యసత్యాలుగా ప్రకటించే విశ్లేషకులు; రచయితల మనసులు నొప్పించకుండా వారి సాహిత్యాన్ని కేవలం ‘పరిచయం’ చేసే సమీక్షకులు, కొల్లలుగా కనిపిస్తూ—విమర్శ అన్న పదానికి, ఒక రచనను దాని సాహిత్యలక్షణ పరిథులలో వైయక్తికాభిరుచులకావలగా విశ్లేషించడం అనే అర్థం పూర్తిగా మాయమయిపోయింది. ఈ సమయంలో, సాహిత్యంలో విమర్శ అవసరాన్ని గుర్తించి ‘సాహిత్య విమర్శ ఎలా ఉండాలి?’ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించి, ఆ దిశగా మొదటి అడుగు వేసిన డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (DTLC) వారికి ధన్యవాదాలు. ఈ పోటీలో పాల్గొని బహుమతులు గెల్చుకున్న–చామర్తి మానస, జిజ్ఞాస సోమనాథం (ప్రథమ); జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి(ద్వితీయ); రెంటాల శ్రీవేంకటేశ్వర రావు (తృతీయ)–రచయితలకు ఈమాట తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. విజేతల వ్యాసాలు, మరి కొందరు తెలుగు ప్రముఖులు ఇదే అంశంపై ప్రత్యేకంగా రాసిన వ్యాసాలు కలిపి ఒక పుస్తకంగా డిటిఎల్‌సి వారు త్వరలో తేబోతుండడం సాహితీప్రియులందరికి సంతోషం కలిగించే విషయం.


ఈ సంచికలో:

  • కథలు: గుర్రాల మావయ్య – శ్రీరమణ; Breakrooమోపాఖ్యానము – పాలపర్తి ఇంద్రాణి; ఒకనాటి యువ కథ: సరిహద్దు – హవిస్; రైలు అమ్మాయి – అవినేని భాస్కర్ (ఎ. ముత్తులింగం); యుద్ధం – కన్నెగంటి చంద్ర; బ్రేకప్ – పి. స్వాతి; గణపతి: అంతు చిక్కని వింత దేవుడు–1 – సురేశ్ కొలిచాల
  • కవితలు: ఒక్క మలుపు – విజయ్ కోగంటి; గోకర్ణ గీతి – సూరంపూడి పవన్ సంతోష్; హోమ్ సిక్ – బండారి రాజ్ కుమార్.
  • శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: పాత సంప్రదాయంలో కొత్త చూపు – భైరవభట్ల కామేశ్వరరావు; తెరచాటు-వులు: 8. కప్పు, లిప్పు – సిప్పా? స్లిప్పా? – శ్రీనివాస్ కంచిభొట్ల.
  • ఇతరములు: స్త్రీల పాటలలో షట్పదులు (వ్యాసం) – జెజ్జాల కృష్ణ మోహన రావు; భూమి చాలని మనిషి (సమీక్ష) – అమరేంద్ర దాసరి; బిల్హణీయము: గేయ(నృత్య)నాటిక – తిరుమల కృష్ణదేశికాచార్యులు; గడి నుడి 11 – భైరవభట్ల కామేశ్వరరావు.