సామాన్యుని స్వగతం: నా విమాన ప్రయాణం

నా ఐటి ఉద్యోగం పుణ్యమా అని, తర్వాత కూతురు చదువుకోసం అమెరికాకు వెళ్ళి కొన్నేళ్ళు ఉండిపోవటం వల్ల నేను కొన్ని సార్లు అమెరికా ప్రయాణాలు చేయవలసి వచ్చింది. వాటిలో నాకళ్ళకు అద్భుతంగా కనిపించి నా మనసులో ముద్రించుకు పోయిన విమానాశ్రయాలు కొన్ని ఉన్నాయి.

1996లో నా మొదటి విదేశయానంలో మొట్టమొదటగా చూసిన అంతర్జాతీయ విమానాశ్రయం ఫ్రాంక్‌ఫర్ట్‌. దాని వైశాల్యం, అసంఖ్యాకమయిన విమానాల రాకపోకల్ని నిర్వహించగల సౌలభ్యాలు, నా కళ్ళకు ఎంత గొప్పగా కనిపించాయో మాటల్లో చెప్పలేను. అదొక స్టీల్, గ్లాస్, కాంక్రీట్ సమంగా కలగలిపిన అద్భుతమయిన కట్టడం! అక్కడ్నుంచీ అట్లాంటాకు వెళ్ళే విమానం కోసం కాచుకుని ఉన్నప్పుడు, ఎదురుగా సైకిళ్ళు తొక్కుతూ, బ్యాటరీ ఆపరేటెడ్ మిని కార్లలో తిరుగుతూ తమ పనులు చేసుకుపోతున్న విమానాశ్రయం సిబ్బందిని ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుని ఉంటే, నాలుగ్గంటలు గడిచిందే తెలియలేదు. దీన్ని బట్టి అలాంటివి ఎప్పుడూ చూడనివాళ్ళు ఆ విమానాశ్రయం వైశాల్యం ఎంత ఉండొచ్చో ఊహించుకోవచ్చు. ఇది చాలదనుకుంటే, మా తరువాతి గమ్యం అట్లాంటా విమానాశ్రయంలో వంద పైనే ఉన్న జాతీయ, అంతర్జాతీయ విమానాలు వచ్చి పోవడానికోసం నిర్మించ బడిన గేట్ల మధ్య ప్రయాణీకులు తిరిగేందుకు సబ్-వే సూపర్ ఫాస్ట్ ఆటోమాటిక్ రైళ్ళు.

అమెరికాలో నేను మొదట చూసినవి ఆస్టిన్, డల్లాస్, సిన్సినాటి, సాల్ట్‌లేక్ సిటీ వంటి అమెరికా జాతీయ విమానాశ్రయాలు. అక్కడున్న వైశాల్యం, సౌకర్యాల్తో పోలిస్తే అవి అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాలకన్నా తక్కువేం కాదు. ఆ ప్రయాణం నేను ఒంటరిగా చేశాను. అప్పట్లో అమెరికాకు, బెంగుళూర్నుంచీ నేరు ప్లైటు కాదు కదా, రెండు మూడు సార్లు కాక, వెళ్తున్న స్థలాన్ని బట్టి కనీసం ఏడెనిమిదిసార్లు విమానాలు మారవలసి వచ్చేది. అందుకని బెంగుళూర్నుంచీ, ఆస్టిన్ చేరేలోపల విమానాశ్రయాలు అన్నీ కలిపి కొన్ని మైళ్ళు నడిచి ఉంటాను. ఈ అమెరికా జాతీయ విమానాశ్రయాలన్నీ సాధారణంగా ఒకలా ఉంటాయి. అట్లాంటా నుంచీ డల్లాస్ దాకా నా ప్రయాణంలో నా సీటులో పక్కనున్నది ఒక ‘బడ్ స్పెన్సర్’ అంత లావుపాటి అమెరికన్. కానీ పాపం తన సైజు వల్ల నాకెక్కడ అసౌకర్యమవుతుందోనని అతనెక్కువ జాగ్రత్త పడుతుంటే ముచ్చటేసింది.

తరువాత చేసిన అన్ని ప్రయాణాలు ఒక ఎత్తయితే, నేను 2007లో బెంగుళూర్నుంచీ, హీత్రూ మీదుగా శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్ళిన ప్రయాణం ఒక ఎత్తు. అప్పటికి రెండు మోకాళ్ళు ఆపరేషన్ అయిన నేను అంతర్జాతీయ ప్రయాణాల్లో చక్రాల కుర్చీ అడగడం మొదలుపెట్టాను. మామూలుగా విమానం ఆగిన వెంటనే, అందరు ప్రయాణీకులు దిగేలోపల ప్రవేశ ద్వారం దగ్గరికి వస్తుంది కుర్చీ, ముందరే చెక్ఇన్ చేసేటప్పుడే వ్రాయించి ఉంటాం కనుక. ఆవేళ మాత్రం ఏమయిందో కానీ నా కోసం, అందుకనే కాచుకుని ఉన్న వయసయిన మరో ఇద్దరు ప్రయాణీకుల కోసం చక్రాల కుర్చీలు రాలేదు. ఇంకొక ముప్పయి నిముషాల్లో హీత్రూ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరే విమానం ఎక్కడ తప్పుతుందో అని మా భయం! మమ్మల్ని పట్టించుకోకుండా తమ పనులేవో చేసుకుంటున్న విమానం సిబ్బందిని నిలదీసి అడుగుతున్నాం అందరం. అందరికీ ఒకే సమాధానం, వస్తాయి కుర్చీలు, ఫోన్లు చేశాము, అని. దాదాపు పది నిముషాల తర్వాత, డెబ్భై ఏళ్ళు పైనున్న ఒక ఫిలిపినో ముసలతను మెల్లగా ఒక చక్రాల కుర్చీ తోసుకుని వచ్చాడు. ముగ్గురమూ అతన్ని చుట్టుకున్నాము, కుటుంబాలతో. అతను మాత్రం తాపీగా జేబులోంచి ఒక కాయితం తీసి మాలో ఒకరి పేరు చదివాడు. ఆ ప్రయణీకుడు మాత్రం సంతోషంగా వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడా చక్రాల కుర్చీ మనిషి అసలు విషయం బయట పెట్టాడు. అప్పటికి తనొక్కడేనట. మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరుగా తనే డ్రాప్ చేస్తానని వచ్చీ రాని ఇంగ్లిష్‌లో చెప్పాడు. ఇవాళకు ఇంతే, మాలో ఒకరం సమయానికి సరిగ్గా చేరతామేమో అనుకున్నాము. అయిదు నిముషాల్లో తిరిగొచ్చిన కుర్చీ మనిషి నన్ను తీసుకెళ్ళాడు.

వెంట మావారు నడుస్తుండగా. మమ్మల్నొక బస్ టర్మినల్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు, మేం వెళ్ళాలిసిన విమానం ఉన్నది ఇంకొక టర్మినల్ అని, అక్కడికి మేం బస్‌లో వెళ్ళాల్సుంటుందని చెప్పాడు. బస్‌లో కష్టం మీద నిలుచుని ప్రయణించి ఇంకొక టర్మినల్‌కు వెళ్ళాము. టర్మినల్ స్టేషన్ ఇన్-చార్జ్ గా ఉన్న ఒక ఇంగ్లిష్ ఆమెకు చెప్తే ఆమె ఫోన్ చేసి మరొక కుర్చీ తెప్పించింది. అందులో కూర్చుని మా విమానం చేరేసరికి శుభవార్త – మేం వెళ్ళాల్సిన విమానం 90నిముషాలు ఆలస్యంగా వెళ్తోందని. అమెరికాలో లాగా బస్‌ లోపలికే చక్రాల కుర్చీ వెళ్ళేలా ఉండి, ఒక వ్యక్తే మొదటినుంచీ చిచరిదాకా వెంట వస్తే ప్రయాణీకులకు ఎంత సౌకర్యంగా ఉంటుంది, అనుకున్నాను. నాకేం తెలుసు, తిరుగు ప్రయాణంలో ఇంకా ఎక్కువ అసౌకర్యం నాకోసం కాచుకుని ఉందని?

తిరుగు ప్రయాణంలో విమానం ఉదయం ఆరు గంటలకు హీత్రోలో ఆగింది. చక్రాల కుర్చీ ఆమె మమ్మల్ని నేరుగా ‘ప్రయణీకుల వినిమయ కేంద్రం’ దగ్గర అక్కడున్న ఒకరికి మమ్మల్ని అప్పగించి వెళ్ళింది. బెంగుళూరికి వెళ్ళే విమానాన్ని మేం పదకొండు గంటలకు అందుకోవాలి. వెళ్ళాల్సిన టర్మినల్, దిగిందీ ఒకటే. ఫర్వాలేదు, సమయానికి సరిగ్గా ఎవరయినా వచ్చి తీసుకెళ్తారు అనుకున్నాము. ఇంకా చాలా సమయం ఉందని నిమ్మళంగా విమానాశ్రయంలో ఉన్న సౌకర్యాలు ఉపయోగించి ఫ్రెషప్ అయి, అల్పాహారం, కాఫీ కానిచ్చి కాచుకుని కూర్చున్నాము. ‘ప్రయాణీకుల వినిమయ కేంద్రం’ నిండుగా నాలాంటి ప్రయాణీకులు, వాళ్ళ కుటుంబాలు చాలా మందిమే ఉన్నాము. వచ్చిన రెండు చక్రాల కుర్చీల్లో ఇద్దరు ప్రయాణీకులు వారి వారి గేట్ల దగ్గరికి చేరారు. తర్వాత గమనిస్తే తెలిసింది, అక్కడ మిగిలిన వాళ్ళమంతా బెంగుళూరికి వెళ్ళాల్సిన వాళ్ళమే. పదిగంటలయింది. అందరికీ కంగారు. ఐదు నిముషాలకొకరం రిసెప్షన్‌లో ఉన్న ఆఫీసర్ను అడగటం, అతను మమ్మల్ని ఇంకా కాచుకోవాలని చెప్పడం జరుగుతోంది. పదిన్నరకు ఒక బ్యాటరీ మిని-కారు వచ్చింది. అందులో అంగ వైకల్యమని వ్రాయించుకున్న వారిని మాత్రం కూర్చోనిచ్చారు. మా వెంట ఉన్న భర్తలు, భార్యల్లో వయసయిన వాళ్ళకు కార్లో చోటు లేదు నడిచి రమ్మన్నారు. ఆమాట ముందే చెప్తే వాళ్ళు ఎప్పుడో బయలుదేరి ఉండే వాళ్ళు కదా? చెప్పడానికేమొచ్చింది అని తిట్టుకున్నాము అందరం!

మిని-కారు మొదటి ట్రిప్‌లోనే నేను ఇంకొక ఐదుగురు ప్రయాణీకులతో కలిసి వెళ్ళాను. డ్రైవరు భారతీయుడే. అందుకని మమ్మల్ని మా గేటు దగ్గర దింపింతర్వాత, అతన్ని అడుక్కున్నాను, “మా వాళ్ళూ నడిచి వస్తుంటారు. సగం దూరంలో కనిపిస్తారు. వాళ్ళను ఇక్కడ డ్రాప్ చెయ్యండి, ప్లీజ్!” అని. ప్రయోజనం లేకపోయింది. అతను, “నో. అక్కడింకా చాలా మంది పేషంట్లను తీసుకు రావాలి. మీ వాళ్ళను కుదరదు,” అని పెదవి విరిచి వెళ్ళిపోయాడు. తరువాత తెలిసింది బెంగుళూరు విమానం బయలుదేరేది ఒక గంట ఆలస్యం అవుతుందని. సంతోషంగా ఊపిరి పీల్చుకుని, కిక్కిరిసి ఉన్న గేట్ నంబర్ 25 వైపు చెక్-ఇన్ చేస్తున్న జన సందోహన్ని చూస్తూ కూర్చున్నాను. పదినిముషాల్లో మా వారు కనిపించారు, ఆయాసపడి నడిచి వస్తూ. ఇద్దరం చెక్-ఇన్ చేశాక మరో అడ్డంకి! మేం వెళ్ళాలిసిన విమానం గ్రౌండ్ లెవల్‌లో ఉంది. మా గేటు మొదటి లెవెల్. నా కుంటి కాళ్ళతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్లు నలభయి మెట్లూ కిందికి దిగటం తప్పలేదు. అంతదాకా వచ్చాక ఇంకేం చేస్తాం?

బెంగుళూరికి తిరిగొచ్చిన కొన్ని రోజుల్లోపల, నేను పడ్డ కష్టాలన్నీ వివరిస్తూ ఏర్ లైన్స్ ‘కస్టమర్ కంప్లెయింట్స్ సెల్’ కు వ్రాశాను. దానికి వారి ‘కస్టమర్ రిలేషన్స్ మేనేజర్’ నుంచీ వచ్చిన జవాబిది. “మీరు, మీ భర్త మాతో ఇటీవల చేసిన ప్రయాణంలో పడిన కష్టానికి మేము చింతిస్తున్నాము. మా సిబ్బంది సహాయం కోసం చాలా సేపు కాచుకోవలసి వచ్చిన మీ క్లిష్ట పరిస్థితి నా కర్థమవుతుంది. మీలాంటి ప్రయాణీకులకు ఎక్కువ సౌకర్యాలు కలిగించి సహాయ పడటమే మా ఏర్ లైన్స్ ఉద్దేశ్యం. …మా క్షమార్పణలతో పాటు, మీకూ, మీ భర్తకీ మాతో ప్రయాణం చేసినప్పుడు మీ టికెట్ ఒక్కొక్కదానికయే ఖర్చులో రూ.4119.23 తక్కువ చేయడానికి అంగీకరిస్తున్నాము. ఈ సౌకర్యాన్ని మీరు ఉపయోగించుకోవడానికి మా ‘కస్టమర్ సర్వీస్ సెల్’ ను సంప్రదించండి.”

దాదాపు నలభయివేల రూపాయల ఖరీదు అయే టికెట్టుకు, నాలుగు వేలు డిస్కౌంటు లభిస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియలేదు.