ఒక విన్నపం.
శ్రీ వెల్చేరు నారాయణరావు గారి ఆధ్వర్యంలో కొందరు సాహితీప్రియులు తయారుచేసిన పట్టిక ఇది. తానా వారి 12వ “తెలుగు పలుకు”లో ప్రచురించబడుతోంది.
ఇరవయ్యో శతాబ్దికి వీడ్కోలు చెపుతూ, కొత్త సహస్రాబ్దికి స్వాగతం చెపుతూ వున్న ఈ సంధి సమయంలో, గడిచిపోతున్న ఈ శతాబ్దంలోని గణించదగ్గ శతాలను ఎన్నటం పరిపాటయ్యింది. అలాగే, ఈ శతాబ్దిలో తెలుగులో వచ్చిన పుస్తకాలలో ప్రతి తెలుగువాడు చదువవలసిన 100 పుస్తకాల జాబితా తయారు చేయడానికి, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ లో కృష్ణదేవరాయ ఆచార్య పదవిలో ఉన్న ప్రసిద్ధ తెలుగు విమర్శకుడు, రచయిత శ్రీ వెల్చేరు నారాయణ రావు సారథ్యంలో కొందరు సాహితీ ప్రియులు ఈ క్రింది 100 పుస్తకాలను ఎంపిక చేశారు. ఈ జాబితాలో అనువాదాలు, అనుకరణలూ, అనుసరణాలూ, భాష్యాలూ, వ్యాఖ్యానాలూ, శాస్త్రీయ, వైజ్ఞానిక పుస్తకాలూ చేర్చబడలేదు. పుస్తకాల ఎన్నికలో వాడిన కొలబద్దలలో ముఖ్యమైనవి తెలుగు సాహిత్యంపై, తెలుగు జీవితంపై ఆ రచనలకున్న ప్రభావం, ఈ శతాబ్దిలో తెలుగుదేశపు జీవన విధానం, చారిత్రక భౌగోళిక పరిస్థితుల గురించి సాధికారకమైన చిత్రణ, సాహిత్య చరిత్రలో ఆయా పుస్తకాలకూ, రచయితలకూ ఉన్న స్థానం, మొదలయినవి. లోకో భిన్న రుచిః! ఈ జాబితా మీకు సమగ్రంగా తోచకపోవచ్చు, అసంపూర్ణంగా అనిపించవచ్చు; మీ గొప్ప 100 పుస్తకాల జాబితా వేరే పుస్తకాలతో నిండి ఉండవచ్చు. ఈ జాబితా వెనుక ఏ రకమైన అధికారిక గుర్తింపు లేదు. ఇది కొంతమంది సాహిత్యాభిమానుల సమిష్టి ఎన్నిక. కొందరు పాఠకులతో ఈ పుస్తకాలను మొదటిసారో, మరోసారో చదివించటమే ఈ ఎన్నిక ఉద్దేశం.
గమనికలు.
- కథారచయితల మంచి కథలు ఎక్కువ సంకలనాలలో వెలువడినప్పుడు, ఏ సంకలనాన్నీ ప్రత్యేకంగా పేర్కొనకుండా ‘వివిధ కథలు’గా పేర్కొనడం జరిగింది.
- వెల్చేరు నారాయణరావు ‘తెలుగులో కవితావిప్లవాల స్వరూపం’ ఈ జాబితాకోసం పరిగణింపబడలేదు.
ఈ క్రింది పట్టికలలో వంద రచనల్ని రచయితల పేర్ల అకారాదిగా వరసగా ఇచ్చాము. ఆ రచనల్ని వివిధ శీర్షికల కింద విభజించటానికి, అలాగే ప్రతి రచనకు అది వెలువడిన దశకాన్ని సూచించటానికి ప్రయత్నం చేశాము. ఒక రచన ఎప్పుడు వెలువడింది అనేది చెప్పటం చాలా క్లిష్టమైన వ్యవహారం. పాత పుస్తకాలను మళ్ళీ ప్రచురించేవారు వారు ఎప్పుడు తొలిసారిగా ప్రచురించారో చెప్తారే తప్ప ఆ పుస్తకం మొదటిసారి ఎప్పుడు ప్రచురించారనేది చెప్పరు. దీనికి తోడు కొన్ని పుస్తకాలు ఇప్పుడు దొరకటం కూడ లేదు. అందువల్ల దశకాల సూచన కేవలం సూచన గానే భావించవలసి ఉంటుంది. వాటిలో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉందని మాకు తెలుసును. ఐనా ఈ సమాచారం ఎవరికైనా కొంతవరకైనా ఉపయోగపడుతుందేమో అనే భావంతో ఈ సాహసానికి ఒడిగడుతున్నాం.
ఈ పట్టికను విశ్లేషిస్తే ఎన్నో కుతూహలం కలిగించే విషయాలు బయటపడతాయి. ఉదాహరణకు, కవిత్వ ప్రక్రియ 60లు, 70లు, కొంతవరకు 80లలో కూడ గుణాత్మకంగా చప్పబడి ఉండి 90లలో మళ్ళీ విజృంభించినట్లు కనిపిస్తుంది. అలాగే నవలా ప్రక్రియ ప్రస్తుతం కొంత క్షీణ దశలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక నాటకాల గురించి చెప్పక్కర్లేదు గత రెండు మూడు దశాబ్దాలలో మంచి నాటకాలే కనపడవు. ఆత్మకథలు అడుగంటినట్లున్నాయి. (ఆదర్శవంతమైన జీవితాలున్న వారు ఈ మధ్య కాలంలో లేరా?)
ఈ పట్టిక పాఠకులను తెలుగులోని మంచి రచనలు చదవటానికి ప్రోత్సహిస్తుందని, రచనా సామర్య్థం ఉన్న వారు అణగారిపోతున్న శాఖల, అంశాల పునరుద్ధరణకు నడుం కట్టడానికి దోహదం చేస్తుందని మా ఆకాంక్ష.
జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం |
---|---|---|---|
1. | అజంతా | స్వప్నలిపి | 1990 |
2. | ఆలూరి బైరాగి | ఆగమ గీతి | 1960 |
3. | ఆరుద్ర | ఇంటింటి పజ్యాలు, త్వమేవాహం | 70, 1950 |
4. | బోయి భీమన్న | రాగ వైశాఖి | 1960 |
5. | దాశరథి కృష్ణమాచార్య | కవితా సంకలనం | 1950 |
6. | దాసు శ్రీరాములు | తెలుగు నాడు | 1910 |
7. | దేవులపల్లి కృష్ణ శాస్త్రి | కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి | 1930 |
8. | దిగంబర కవులు | దిగంబరకవిత్వం | 1970 |
9. | దువ్వూరి రామిరెడ్డి | పానశాల | 1940 |
10. | గురజాడ అప్పారావు | ముత్యాల సరాలు | 1910 |
11. | ఇస్మాయిల్ | చెట్టు నా ఆదర్శం | 1960 |
12. | జాషువా | గబ్బిలం | 1950 |
13. | జయప్రభ | చింతల నెమలి | 1990 |
14. | ఖాదర్ మొహియుద్దీన్ | పుట్టు మచ్చ | 1990 |
15. | కొండేపూడి నిర్మల | నడిచే గాయాలు | 1990 |
16. | మహె జబీన్ | ఆకు రాలే కాలం | 1990 |
17. | ముద్దుకృష్ణ (సం.) | వైతాళికులు | 1940 |
18. | నగ్నముని | కొయ్య గుర్రం | 1970 |
19. | నండూరి సుబ్బారావు | ఎంకి పాటలు | 1930 |
20. | ఓల్గా, కన్నబిరాన్ (సం.) | నీలిమేఘాలు | 1990 |
21. | పఠాభి | ఫిడేలు రాగాల డజన్ | 1930 |
22. | పింగళి కాటూరి కవులు | సౌందరనందము | 1940 |
23. | రాయప్రోలు సుబ్బారావు | తృణకంకణము | 1920 |
24. | సతీష్ చందర్ | పంచమవేదం | 1990 |
25. | శివారెడ్డి | శివారెడ్డి కవితలు | 1980 |
26. | శ్రీశ్రీ | మహాప్రస్థానం | 1940 |
27. | శ్రీశ్రీ | ఖడ్గ సృష్టి | 1950 |
28. | తిలక్ దేవరకొండ బాలగంగాధర | అమృతం కురిసిన రాత్రి | 1950 |
29. | జి. లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ (సం.) | చిక్కనవుతున్న పాట | 1990 |
30. | తుమ్మల సీతారామమూర్తి చౌదరి | రాష్ట్రగానము | 1950 |
31. | వేగుంట మోహనప్రసాద్ | చితి చింత | 1980 |
32. | విద్వాన్ విశ్వం | పెన్నేటి పాట | 1950 |
33. | విశ్వనాథ సత్యనారాయణ | కిన్నెరసాని పాటలు | 1930 |
34. | విశ్వనాథ సత్యనారాయణ | రామాయణ కల్పవృక్షము | 1950 |
35. | ఏటుకురి వెంకటనరసయ్య | మగువమాంచాల | 1940 |
జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం |
---|---|---|---|
1. | ఎ. ఎస్. మూర్తి | తానా తెలుగు కథ | 1990 |
2. | అబ్బూరి ఛాయాదేవి | ఛాయాదేవి కథలు | 1960 |
3. | భానుమతీ రామకృష్ణ | అత్తగారి కథలు | 1960 |
4. | చాగంటి సోమయాజులు | చాసో కథలు | 1940 |
5. | ఎం .ఎ. సుభాన్ (సం.) | కథాసాగర్ | 1990 |
6. | కాళీపట్నం రామారావు | కా.రా. కథలు | 1980 |
7. | కొడవటిగంటి కుటుంబరావు | కథలు | 1950 |
8. | మధురాంతకం రాజారాం | కథలు | 1980 |
9. | ముళ్ళపూడి వెంకట రమణ | బుడుగు | 1950 |
10. | ముళ్ళపూడి వెంకట రమణ | వివిధ కథలు | 1950 |
11. | మునిమాణిక్యం నరసింహా రావు | కాంతం కథలు | 1940 |
12. | నామిని సుబ్రహ్మణ్యం నాయుడు | పచ్చనాకు సాక్షిగా | 1990 |
13. | పాలగుమ్మి పద్మరాజు | వివిధ కథలు | 1940 |
14. | రాచకొండ విశ్వనాథ శాస్త్రి | వివిధ కథలు | 1960 |
15. | సత్యం శంకరమంచి | అమరావతి కథలు | 1970 |
16. | శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి | వివిధ కథలు | 1940 |
జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం |
---|---|---|---|
1. | బీనాదేవి | పుణ్యభూమీ కళ్ళు తెరు | 1970 |
2. | బుచ్చిబాబు | చివరకు మిగిలేది | 1940 |
3. | చలం | మైదానం | 1940 |
4. | చంద్రలత | రేగడివిత్తులు | 1990 |
5. | చిలకమర్తి లక్ష్మీనరసింహం | గణపతి | 1920 |
6. | గోపీచంద్ త్రిపురనేని | అసమర్థుని జీవితయాత్ర | 1930 |
7. | జీ. వి. కృష్ణారావు | కీలుబొమ్మలు | 1940 |
8. | కేశవ రెడ్డి | రాముడుండాడు రాజ్జెవుండాది | 1990 |
9. | కొడవటిగంటి కుటుంబరావు | చదువు | 1940 |
10. | లత తెన్నేటి హేమలత | గాలిపడగలు నీటి బుడగలు | 1970 |
11. | మహీధర రామమోహన రావు | కొల్లాయిగట్టితేనేమి | 1960 |
12. | మొక్కపాటి నరసింహ శాస్త్రి | బారిస్టర్ పార్వతీశం | 1940 |
13. | రంగనాయకమ్మ | స్వీట్‌హోం | 1960 |
14. | శ్రీదేవి | కాలాతీతవ్యక్తులు | 1940 |
15. | ఉన్నవ లక్ష్మీనారాయణ | మాలపల్లి | 1920 |
16. | ఉప్పల లక్ష్మణ రావు | అతడు ఆమె | 1930 |
17. | వడ్డెర చండీదాస్ | హిమజ్వాల | 1970 |
18. | వాసిరెడ్డి సీతాదేవి | మట్టిమనిషి | 1970 |
19. | విశ్వనాథ సత్యనారాయణ | వేయి పడగలు | 1950 |
20. | యద్దనపూడి సులోచనారాణి | సెక్రటరి | 1970 |
21. | యండమూరి వీరేంద్రనాథ్ | తులసిదళం | 1970 |
జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం |
---|---|---|---|
1. | ఆత్రేయ | నాటకాలు | 1940 |
2. | భమిడిపాటి కామేశ్వర రావు | కచటతపలు | 1940 |
3. | గురజాడ అప్పారావు | కన్యాశుల్కం | 1900 |
4. | కాళ్ళకూరి నారాయణ రావు | వరవిక్రయం | 1920 |
5. | నార్ల వెంకటేశ్వర రావు | కొత్త గడ్డ | 1940 |
6. | పాకాల వేంకట రాజమన్నార్ | రాజమన్నార్ నాటికలు | 1960 |
7. | తిరుపతి వెంకట కవులు | పాండవోద్యోగ విజయాలు | 1920 |
8. | త్రిపురనేని రామస్వామి చౌదరి | శంబుక వధ | 1930 |
9. | వాసిరెడ్డి, సుంకర | మాభూమి | 1930 |
10. | వేదం వేంకటరాయ శాస్త్రి | ప్రతాపరుద్రీయం | 1910 |
జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం |
---|---|---|---|
1. | ఆదిభట్ల నారాయణ దాసు | నాయెరుక | 1920 |
2. | చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి | కథలు గాధలు | 1940 |
3. | దరిశి చెంచయ్య | నేనూ, నా దేశం | 1930 |
4. | కాళోజీ నారాయణరావు | ఇదీ నా గొడవ | 1950 |
5. | కందుకూరి వీరేశలింగం | స్వీయ చరిత్ర | 1920 |
6. | పుచ్చలపల్లి సుందరయ్య | విప్లవ పథంలో నా పయనం | 1950 |
7. | శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి | అనుభవాలు జ్ఞాపకాలు | 1930 |
8. | టంగుటూరి ప్రకాశం | నా జీవిత యాత్ర | 1940 |
9. | తిరుమల రామచంద్ర | హంపీ నుంచి హరప్పా దాక | 1990 |
జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం |
---|---|---|---|
1. | అక్కిరాజు ఉమాకాంతం | నేటికాలపు కవిత్వం | 1930 |
2. | కట్టమంచి రామలింగా రెడ్డి | కవిత్వతత్వ్త విచారము | 1930 |
జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం |
---|---|---|---|
1. | చలం | స్త్రీ | 1930 |
2. | గిడుగు రామమూర్తి | ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం | 1920 |
3. | పానుగంటి లక్ష్మీనరసింహా రావు | సాక్షి వ్యాసాలు | 1930 |
4. | పురాణం సుబ్రహ్మణ్య శర్మ | ఇల్లాలి ముచ్చట్లు | 1970 |
5. | రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ | నాటకోపన్యాసములు | 1940 |
6. | స్త్రీశక్తి సంఘటన | మనకు తెలియని మన చరిత్ర | 1990 |
7. | సురవరం ప్రతాపరెడ్డి | ఆంధ్రుల సాంఘిక చరిత్ర | 1950 |