[సూచన: ఈ వ్యాసం చదవబోయే ముందు ఈ సంచికలోనే సంజయ్ సుబ్రహ్మణ్యం, ఫిలిప్ వాగనర్ వ్రాసిన లేఖలు, చదవండి. అవి చేసే పరిచయంతో ఈ వ్యాసం అర్ధం కావడం సులభమవుతుంది. ఆపైన చివరి అధ్యాయం చదవండి – సం.]
1. చరిత్ర లక్షణం
వలసపాలనకి పూర్వం — అంటే పద్దెనిమిదో శతాబ్దం ముందు కాలంలో — దక్షిణభారత ప్రాంతంలో చరిత్ర, చారిత్రక చైతన్యమూ అంటూ అసలుండేవా? గతం గురించి ఎంతో కొంత తెలిసే ఉండి వుండాలి కదా ఏదో ఒక రూపంలో. అయినప్పటికీ, తరతరాలుగా ఎందరో చరిత్రకారులు, మానవవిజ్ఞాన శాస్త్రజ్ఞులు, భాషాతత్వవేత్తలు దక్షిణ భారతీయులకి వాస్తవికమైన చరిత్ర పట్ల శతాబ్దాలుగా నిర్లక్ష్యవైఖరి ఉండేదనే భావించారు. బహుశా గతం గురించీ, విధి గురించీ, లేదా గతానికీ, వర్తమానానికీ ఉన్న సంబంధాల గురించీ ప్రత్యేకమైన అభిప్రాయాలున్న ఈ సంస్కృతి తన చరిత్రను వేరే రకంగా రాసుకున్నదేమో. గ్రీకులకు థుసిడైడిస్ (Thucydides), హెరోడాటస్ (Herodotus), పర్షియన్లకు అల్ తబారీ (Al-tabari), చైనీయులకు సుమా చియెన్ (Sima Qian) వున్నట్లు మనకంటూ చరిత్రకారులు ఎవరూ లేరు. సుమారు వెయ్యేళ్ళ క్రితమే, అల్ బీరూనీ (Abu al-Biruni) వంటి పండితుడే, “దురదృష్టవశాత్తు భారతీయులు చారిత్రక గతిక్రమాన్ని పట్టించుకోరు. వారి రాజుల వంశపరంపరలు నమోదు చేసుకోవడంలో వారికి ఒకరకమైన నిర్లక్ష్యభావం ఉంది. ఖచ్చితమైన సమాచారం కోసం నిలదీస్తే ఏం చెప్పాలో తెలియక కథలు కల్పించి చెప్తారు” అన్నాడు. ఇదేమాట, ఏ మార్పులు లేకుండా, వలసపాలన నాటి రచయితలు కూడా పదే పదే ఉటంకించడం మూలాన ఈనాటికీ ఒక సత్యంగా స్థిరపడిపోయింది.
కానీ, ఈ భావన ఖచ్చితంగా తప్పు! భారతీయులకు చారిత్రకస్పృహ లేదనీ, మంచికో, చెడుకో వలస పాలకుల వల్ల చరిత్ర రచన మనకు అబ్బిన కొత్త లక్షణమనీ వున్న అపోహను తొలగించడమే ఈ పుస్తకం ద్వారా మేము చేయదల్చుకున్నది. మంచికో, చెడుకో అని ఎందుకంటున్నామంటే – గత రెండు శతాబ్దాలలో పాశ్చాత్య చారిత్రక పద్ధతులని స్వాగతించిన వారు ఎందరో వున్నారు. గతాన్ని గురించిన భారతీయ చింతన విశ్వకాల సమగ్రరూపాత్మకమనీ, ఆ చింతనపై పాశ్చాత్య చారిత్రక పద్ధతులు దుష్ప్రభావం చూపుతున్నాయని దూషించిన వారూ వున్నారు. వీరి వాదన ప్రకారం ‘చరిత్ర’ అనేది పరాయి భావన. ఈ భావన మన గతానికి మనల్ని పరాయివాళ్ళుగా చేస్తున్నది. భారతీయులు (ప్రత్యేకించి, దక్షిణ భారతీయులు) ‘గతం’ సజీవము, స్వచ్ఛము, పూర్ణరూపాత్మకము అనే దృక్పథం కలిగినవారు. పాశ్చాత్యుల ‘చరిత్ర’ దృక్పథం గతాన్ని, అనుభవాల ఆధారంగా కేవలం వాస్తవాలుగా విడగొట్టే ప్రక్రియ. అచారిత్రకమైన సమాజాల పరిపూర్ణమైన గతం ఇలా కేవలం చారిత్రక నిజాల చట్రాలలో నశించిపోయింది.
పాశ్చాత్యులు పట్టుకొచ్చింది ఒక్క ‘చరిత్ర’ మాత్రమే కాదు కదా. పద్దెనిమిది, పంతొమ్మిదవ శతాబ్దాలలో వారు గడియారాన్ని, రైళ్ళని, ముఖ్యంగా ద్వంద్వ ప్రవృత్తిని కూడా పట్టుకొచ్చారేమో కదా. మిగిలినవాటి సంగతి ఎలా ఉన్నా, గడియారం మొట్టమొదటి సారిగా ఎలాంటి అనుభవాన్నిచ్చిందో 18వ శతాబ్దంలో డూప్లే (Joseph Dupleix) దగ్గర పాండిచ్చేరీ లో దుబాసీగా వున్న ఆనందరంగ పిళ్ళై చాలా చక్కగా వర్ణించాడు:
ఇంట్లో దానికదే నిలబడి వుంటుంది –
ఒక సాదా ఉపకరణం – గంటలు చెబుతుంది
అలుపెరుగక జాతకాల లెక్కలు వేసే సిద్ధాంతులు
అలుపెరుగని గడియారాన్ని చూసి దిగ్భ్రాంతులు
బ్రాహ్మణులకు కాలం ఖచ్చితంగా తెలుసుకొనే అవకాశం
శ్రీరంగ రాజు కోట తలుపు ఎప్పుడు తట్టాలో తమ భిక్ష కోసం
గడియారం రాకతో సిద్ధాంతుల పని కాస్త సులువై ఉండవచ్చు. పిళ్ళై గారింటిలో గడియారం గంటల కోసం ఆత్రంగా ఎదురుతెన్నులు చూసే ఎదురింటి బీద బ్రాహ్మణుడిని మనం సులువుగానే ఊహించుకోవచ్చు కానీ, అప్పటిదాకా వర్తులాకారమైన కాలాన్ని దీర్ఘరేఖలా మార్చిన గడియారం తరువాతి కాలంతో తేబోతున్న ఇబ్బందులని వారెవరూ ఊహించివుండరు.
అందువల్ల పదహారు, పదిహేడు, పదునెనిమిదో శతాబ్దాలనాటి దక్షిణ భారతీయుల ఐహిక చింతన ఎలా ఉండేది, ఆ సమాజం భూత భవిష్యద్వర్తమానాలైన కాలాన్ని ఎలా అర్థం చేసుకున్నది, తన గతాన్ని ఏవిధంగా అన్వయించుకున్నది అని ముందుగా పరిశీలించాలి. చారిత్రక చైతన్యం వలసపాలనకి పూర్వం భారతీయులకు లేదని, ఇక్కడ ఉన్నదల్లా ఇతిహాస సాహిత్యం, జానపద, పురాణ కథల అభూత కల్పనలు మాత్రమేనని, ఇటువంటి అసంగతమైన సాహిత్యం నుంచి చరిత్రకారులు ఎంతో కష్టంతో నిజాలను ఏరి, మన చరిత్రని వాస్తవిక దృక్పథంతో పునర్నిర్మించారనే భావన బలంగా నాటుకుపోయింది. నిజానికి ఈ పునర్నిర్మాణం శిలాశాసనాలు, పురావస్తు నాణాలు, విదేశీ పర్యాటకుల కథనాల వంటి పకడ్బందీ ఆధారాల సాయంతో జరిగింది తప్పించి, భారత సంస్కృతిలో అంతర్భాగమైన సాహిత్యపు వనరుల సహాయంతో కాదు.
ఇందుకు విరుద్ధంగా ఒక కొత్త పరిశీలనా పద్ధతిని ఈ అధ్యయనం ద్వారా ప్రదర్శిస్తున్నాము. ఈ పద్ధతి ద్వారా పదిహేడు, పదునెనిమిదో శతాబ్దానికి చెందిన సాహిత్యం నుంచి చారిత్రక వాస్తవాలున్న రచనలను వేరుచేసి గుర్తించడానికి వీలవుతుంది. తెలుగు, తమిళ, మరాఠీ, సంస్కృత భాషలకు చెందిన ఎన్నో రచనలు ఇంతవరకూ చారిత్రకమైనవిగా గుర్తించబడలేదు. కారణం సాహిత్యాన్ని ప్రక్రియలుగా, జాన్రాలుగా (genre) వర్గీకరించి మాత్రమే చూడడం. అందువల్ల అవి సంప్రదాయ చరిత్రకారుల కళ్ళకి చరిత్రగా కనిపించలేదు. ప్రధానంగా చరిత్ర రచనలే ఐనప్పటికీ, ఆనాడు ప్రాచుర్యంలో ఉన్న జానపద ఇతిహాసాలు, కావ్యాలు, లేదా వచన కావ్యాలు వంటి సాహిత్య ప్రక్రియల క్రిందికి తోసివేయబడ్డాయి గానీ స్వాభావికంగా అవి పరిశీలింపబడలేదు. అవి వారికి అలవాటైన చరిత్ర రచనలంత రసహీనంగా లేకపోవడం, బహుశా మరో కారణం కావొచ్చు.
దక్షిణ భారతంలో చరిత్ర ఎన్నడూ ఒక ప్రత్యేకమైన సాహిత్య ప్రక్రియ కాదు. అది రచనలో అంతర్భాగం. రచన కావ్య సంప్రదాయానికి చెందినదైతే కావ్యకాల్పనికతో, జానపద ఇతిహాసమైతే వీరోచితంగా, ఇలా ఈ భారతీయ భాషలలో వున్న రచనలలో నాటకీయత, చైతన్యమూ, రసోద్వేగమూ మెండుగా వుంటాయి. అందువల్ల భారతీయ చరిత్ర రచన సాహిత్య ప్రక్రియల వర్గీకరణకి లొంగదు. దక్షిణ భారత చారిత్రక రచనలని గుర్తించాలంటే, ముందుగా ప్రస్తుతం ప్రాచుర్యంలో వున్న పాశ్చాత్య చరిత్ర రచన ప్రమాణాలతో వాటికి ఉన్న మౌలికమైన వ్యత్యాసాలని గుర్తించాలి.
పాశ్చాత్య యూరోపులో ఆవిర్భవించిన చరిత్ర రచన ఒక ప్రత్యేకమైన సాహిత్య ప్రక్రియ,ఒక ప్రత్యేకమైన జాన్రా. నిర్దుష్టమైన ప్రాతిపదిక, ప్రణాళిక, శైలి, అనే మూడు స్పష్టమైన సాహిత్య లక్షణాలు ఈ జాన్రాకు వున్నాయి. గతానికి సంబంధించిన ఆధారాలని సంపాదించి, వాటి ప్రాముఖ్యత, విశ్వసనీయత ప్రాతిపదికలుగా వాటిని విభజించి, సాహిత్యలక్షణాలని పాటిస్తూ శుద్ధమైన వచనంలో వాటిని వివరించాలి – ఇదీ సాంప్రదాయ చరిత్రకారుల దృక్పథం. చరిత్ర రచనకు కేవలం వచనమే తగినది అనే ప్రాతిపదిక హెగెల్ కాలం నుంచీ బలపడి, పాశ్చాత్య చరిత్రకారులు కేవలం వచనం మాత్రమే చరిత్ర రచనకు స్వాభావికమని భావించారు.
చరిత్ర రచనకంటూ, ప్రాతిపదిక, ప్రణాళిక, శైలి అనే స్పష్టమైన లక్షణాలు ఆపాదించిన తరువాత పాశ్చాత్య ప్రపంచంలో చరిత్ర రచన ఒక ప్రత్యేక శాఖగా ఏర్పడటమే కాకుండా, అదొక వ్యవస్థీకృతమైన వృత్తిగా కూడా మారింది. మిగిలిన రచయితల నుండి వేరుపడి చరిత్రకారులు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ మార్పు ప్రపంచంలో చాలా ప్రాంతాలలో, ప్రత్యేకించి దక్షిణ భారతంలో రాలేదు. చరిత్ర రచన ఒక సాహిత్య ప్రక్రియగా కేటాయించబడలేదు. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఆ కాలంలో ఏ సాహిత్య ప్రక్రియ ప్రాచుర్యంలో ఉంటే ఆ ప్రక్రియలోనే చరిత్ర రచనలు కూడా సాగాయి. (ఆ రకంగా చరిత్ర రచన జాన్రాతీత సాహిత్యం!) అనుభూతి చెందే పాఠకుడు ఏ రచనలోనైనా కల్పనేదో, వాస్తవమేదో స్పష్టంగా తెలుసుకోగలడు. ఒకే సాహిత్య ప్రక్రియలో వచ్చిన రచనలలో చరిత్ర ఏదో, కల్పన ఏదో ఆ భాషయొక్క వ్యక్తీకరణలని చెవులొగ్గి వినేవారు సహజంగానే గుర్తించగలరు.
దీన్నే మరోలా కూడా చెప్పవచ్చు – ఒక దేశ, కాల, సాంఘిక వాతావరణంలో ఏ సాహిత్య ప్రక్రియ ప్రాచుర్యంలొ ఉందో, అదే ప్రక్రియలో చరిత్ర రచన జరిగింది. పురాణం ప్రాచుర్యం ఉన్న కాలంలో చరిత్ర పురాణంగానూ, కావ్యం ప్రాచుర్యంలో ఉన్న కాలంలో అది కావ్యంగానూ, వచనం ప్రధాన సాహిత్య సాధనం అయిన కాలంలో చరిత్ర రచనలు వచనంగానూ రచింపబడ్డాయి. అంటే, ఒకే సాహిత్య ప్రక్రియలో చారిత్రక రచనలు, సామాన్యమైన రచనలు రెండూ రకాలూ అంతర్గతంగా ఉంటాయి. అయితే, ఒకే ప్రక్రియలో వచ్చిన రెండు రకాల రచనలనీ ఆ రచనల్లో ఉపయోగించిన ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా గుర్తించవచ్చు. సూచికలు, కథనంలో శైలి మార్పు/బదిలీలు, వాక్యనిర్మాణం, పదాల ఎంపిక, ప్రమాణాల వ్యక్తీకరణలో లోతుపాతులు, ప్రణాళికాబద్ధమైన నిశ్శబ్దం, ఖాళీలు, ప్రత్యేకమైన ఛందోరీతులు, శబ్దాలంకార సూచికలు, చెప్తున్న వస్తువు యొక్క లక్ష్యం, కీలకమైన అర్థం విషయంలో పాఠకులని జాగరూకుల్ని చెయ్యడం వంటి విశిష్టమైన ప్రయోగాల ద్వారా — ఈ సాహిత్య సూచకాలు పలురూపాల్లో ఉంటాయి. ఈ సూచకాల ఉపయోగంలో వ్యత్యాసాలు అన్ని అల్లికగా కలగలిసి ఆ రచనకి ఒక ప్రత్యేకమైన శైలీలక్షణాన్ని (Texture) ఆపాదిస్తాయి.