ఏమిటీ గ్రోసరీస్ ప్లాస్టిక్ సంచుల్లో తెచ్చావెందుకు అంటారా? ఏం చెయ్యను, అన్నీ కొన్నాక అప్పుడు గుర్తుకొచ్చింది గుడ్డ సంచులు ఇంట్లో వుండిపోయాయని.
వెళ్ళేముందు బ్యాగులు కారులో వున్నాయో లేదో చూసుకోకుండా అలా ఎలా వెళ్ళావూ అంటారా? ఇప్పుడు ఏమైందిటా? ప్లాస్టిక్ బ్యాగుల్లో తెచ్చాను. అంతేకదా దానికి అంత కోపం ఎందుకూ!?
ప్రతి వాళ్ళకు ఇదో పిచ్చి పట్టుకుంది. ఎన్వైరాన్మెంట్ ప్రొటెక్షన్! సేవ్ అవర్ ఎర్త్! సే నో టు ప్లాస్టిక్! అంటూ. అవసరం వున్నవాటిని లేని వాటిని కనిపెట్టేయడం, ఎడాపెడా ప్రచారం చేసి వాటిని జనాలకు బాగా అలవాటు చెయ్యడం, ఆ తర్వాత లబోదిబో మనటం మనకు అలవాటేగా! నెత్తిమీద కొచ్చాక అప్పుడు తెలిసొస్తుంది చేసిన తప్పు.
ఏమిటీ? వుయ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ గ్లోబల్ వార్మింగ్ అండ్ పొల్యూషనా? వుయ్ ఆల్ హావ్ టు డూ అవర్ పార్ట్ టు రెడ్యూస్ వేస్టా? అంటారు, అంటారు! మీకు ఇవ్వాళ జ్ఞానోదయం అయిందని మీరు చెప్పినట్టల్లా నేను చెయ్యాలి! ఇదిగో, వుయ్యీ గియ్యీ అంటూ నన్ను కలపకండి. నేను ఈ దేశం వచ్చినప్పుడు సుబ్బరంగా వున్నాను. నేను ఇలా మారిపోవటానికి కారణం మీరు, మీ అమెరికాయే.
ఒకప్పుడు ఇదే విషయం గురించి నేను మాట్లాడితే నన్ను చూసి నవ్వారు, తమరికి గుర్తుందో లేదో! అమెరికా వచ్చింది పొదుపుగా ఉండటానికి కాదు, లగ్జరీగా గడపటానికి అంటూ లెక్చర్లు ఇచ్చారు. ఎప్పటి కయ్యది ప్రస్తుతము అప్పటి కామాట అన్నట్టు మీకు ఏది వీలుగా వుంటే అది చేసెయ్యడం బాగా అలవాటైపోయింది. ఇన్నాళ్ళు చేసిందంతా చేసి వున్నట్టుండి బుద్ధిమంతులై పోయారు. ఈ బుద్ధి మొదటినుంచీ వుండాలి. వేస్ట్ చెయ్యటం తగ్గించాలని ఇన్నేళ్ళ తర్వాత మీరు ఇప్పుడంటున్నారు. నేను అప్పుడే అన్లేదూ ఇలా వృధా చెయ్యటం తప్పు కదా అని.
మీరేం చేశారూ? నన్ను ఓ వెర్రి మొహాన్ని చూసినట్టు చూశారు!
నేను ఈ దేశం వచ్చిన మర్నాడే మన కొత్త కాపరానికి కావలసిన వస్తువులన్నీ తెచ్చుకోవాలి షాపింగుకి పద పోదామన్నారు. కారు తాళాలు తీసుకుని మీరు డోరు లాక్ చెయ్యబోతుంటే నేను, అదేమిటీ అన్ని వస్తువులు తీసుకోవాలంటూ అంత పెద్ద లిస్టు రాశారు, బ్యాగులు లేకుండా వెళ్తే ఎలా? అని అడిగాను. మీరు వెంటనే హహ్హహ్హ అంటూ నవ్వటం మొదలు పెట్టారు! మీరు ఎందుకు నవ్వుతున్నారో అర్ధం కాక తెల్లబోయాను. మీరు కాసేపటికి నవ్వు ఆపి, ఇది అమెరికా ఓయ్! బ్యాగులు పుచ్చుకెళ్ళటానికి ఇది మీ బాపట్ల అనుకున్నావా? అంటూ హేళన చేశారు. ఇక్కడ ఏం కొనుక్కున్నా వాళ్ళే బ్యాగుల్లో పెట్టి ఇస్తారు అంటూ గొప్పగా చెప్పారు. ఆ రోజు బోలెడు షాపులు తిరిగి ఇంటికి, మనకు కావలసినవి చాలానే కొన్నాం. మన కారంతా బ్యాగులతో నిండిపోయింది.
ఇంటికి వచ్చాక వస్తువులతో పాటు షాపు వాళ్ళు ఇచ్చిన బ్యాగులు కూడా నేను దాచుకుంటుంటే మీరు మళ్ళీ నవ్వారు. ఆ బ్యాగులు దేనికైనా వాడుకోవచ్చు కదా అని అంటే, నేను పిసినారినని పల్లెటూరి గబ్బిలాయినని వెక్కిరించారు. ఇటువంటి బ్యాగులు ఎవ్వరూ దాచుకోరని అవి నేరుగా చెత్త బుట్టలోకి వెళ్తాయంటూ మీరు వాటిని గార్బేజ్‌లో పడేస్తుంటే ప్రాణం ఉసూరుమన్నది నాకు!
అలా మీరు ప్రతిదీ పారేసినప్పుడల్లా నాకు వెంటనే మా ఇంట్లో సంగతి గుర్తుకొచ్చేది.
ప్రతి నెలా ఫస్ట్ తారీకు రాగానే మా నాన్న కొత్తమాసు కొట్టునుంచి నెలకు సరిపడా వెచ్చాలు పట్టుకొచ్చేవారు. అమ్మ వెంటనే పొట్లాలు జాగ్రత్తగా తెరిచి డబ్బాల్లో సర్డుకుంటే మా సరోజ కాగితాలన్నీ సరిచేసి ఓ బొత్తిగా పెట్టేది. నేను ఆ పొట్లాలతో వచ్చిన దారాలన్నీ చిక్కులు పడకుండా బండీకి చుట్టేదాన్ని. నా పని దారాలన్నీ కండెకు చుట్టటం. మీరు, చిత్తుకాగితాలు, పిచ్చి దారం దాచిపెట్టి ఏం చేసేవారు, పిచ్చుక గూళ్ళు కట్టేవారా? అని ఎగతాళిగా అడిగారు! వృధా చెయ్యడం తగ్గించాలని మీరు ఇప్పుడు అనుకుంటుంటే, అసలు వృధా అనేదే వుండకూడదని మా సిద్ధాంతం.
బాగా వున్న కుటుంబంలో పుట్టి పై చదువులకు అమెరికా వచ్చిన మీకు, వస్తువుని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో ఎలా తెలుస్తుందీ? ఆ కాగితాలు కుంపటి అంటించుకోవడానికి, బాయిలర్ అంటించుకోవడానికి చక్కగా వుపయోగపడేవి. దానికి ముందు మా సరోజ అయితే సినిమా వార్తలు, అమ్మ ప్రమదావనం అప్పుడప్పుడూ కధలు కూడా చదువుకునేవారు. పాపం ఎక్కువ భాగం అన్నీ సగం సగం సగమే చదివేవారు! ఇక ఆ దారం పూల దండలకు వాడేవాళ్ళం.
మనం కొత్త ఇంట్లోకి మారిన కొద్దిరోజులకు మా అమ్మా నాన్న అమెరికా వచ్చారు. వాళ్ళకు ఇక్కడ అన్నీ వింతగాను విచిత్రం గాను వుండేవి. మన ఇంట్లో ప్రతి రూములొ చివరకు బాత్రూములో కూడా మాచింగ్ కలరుతో అందంగా తళతళ లాడుతూ వున్న గార్బేజ్ క్యానులు, వేస్ట్ బాస్కెట్లు చూసి ఆశ్చర్యపోయారు. వాటిల్లో చెత్త పడేయాలంటే చేతులు రావడం లేదమ్మా అనేవారు మా నాన్న! ప్రతి రోజు పిల్లలు, మీరు అన్నీ సగం సగం తిని మిగిలినవి గార్బేజ్‌లో పడేస్తుంటే మా అమ్మ, అయ్యో ఇక్కడ ముష్టి వాళ్ళన్నాలేరే! ఆంటూ వాపోయేది. ఎవరింటికి పార్టీలకు వెళ్ళినా పదార్థాలతో పాటు స్పూన్లు, గ్లాసులు, కాఫీ కప్పులు, ప్లేట్లతో సహా అన్నీ పారెయ్యడం చూసి మా అమ్మా నాన్న ఎంత బాధ పడేవారో.
ఇంటిముందు గడ్డి పెరగటానికి బోలెడంత ఖర్చు పెట్టటం, మళ్ళీ పెరిగిపోయిందంటూ లాన్ కట్ చెయ్యటం ఏమిటో వాళ్ళకు అర్ధం అయ్యేది కాదు. మీరు, అమెరికాలో ఐశ్వర్యానికి కొదవలేదని, ఇక్కడ దర్జాగా బతకటానికి సౌకర్యాలెన్నో వున్నాయని, చాలా దర్పంగా చెప్పేవారు! అల్లుడుగారనేసి మర్యాదతో పాపం వాళ్ళూ నోరు మూసుకుని వినేవారు. ఏం, మా అమ్మా నాన్నకూ తెలియదనా దర్జాకీ వృధాకీ తేడా!
ప్రపంచంలో అన్ని దేశాలలోకి అమెరికాదే అగ్రస్థానం అని చిన్నప్పుడు పాఠాల్లో చదువుకునేవాళ్ళం. ఒక్క ఐశ్వర్యం లోనే కాదు వృధా చెయ్యడంలో కూడా మనదే ముందు స్థానం! పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, మనల్ని చూసి బుద్ధిగా వున్న దేశాలు కూడా బురదలోకి దిగుతున్నాయి. ఇప్పుడు ఇండియాలో కూడా కాలుష్యాలకు కొదవ లేదు. పూర్వం చెత్తంతా తీసికెళ్ళి వీధిలో పారేసినట్టే ఇప్పుడూ పారేస్తున్నారు. కాకపోతే వెనక కూరలు తరిగిన చెత్తా, తిన్న విస్తళ్ళు పారేస్తే, ఇప్పుడు ప్లాస్టిక్ సంచులు, వస్తువులు బాటిల్స్ వగైరా పారేస్తున్నారు. పాపం నోరు లేని జంతువులు అవి తిని ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి.
మా అమ్మమ్మా వాళ్ళు కార్తిక మాసంలో అరటి దొప్పల్లో దీపాల్ని వెలిగించి, నదిలో వదిలే వారు. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాల్లాగా, నీళ్ళలో అందరూ వదిలే ఆ దీపాల్ని చూడటానికి అమ్మమ్మ కొంగు పుచ్చుకుని గజగజా వణుకుతూ ఆవిడ వెంట వెళ్ళేవాళ్ళం. ఆ మధ్య వూరువెళ్ళినప్పుడు మా చిన్న మావయ్య కోడలు షాలిని, వుయ్ లీవ్ లైట్స్ ఇన్ ద లేక్. యు వాంట్ టు కమ్ అండ్ సీ? అంది. ఇన్నాళ్ళకు మళ్ళీ అవకాశం వచ్చిందని సంబరపడి పోయాను. వచ్చిన వాళ్ళందరూ చిన్న ఫోమ్ ప్లేటులో టీ-లైట్ కాండిల్ వెలిగించి నదిలోకి వదిలేస్తుంటే ‘ఇదా కార్తిక దీపం!’ అని ఆశ్చర్యంతో పాటు బాధ వేసింది.
ఈ కాలుష్యం బాధ పాపం భగవంతుడికి కూడా తప్పటం లేదు. మాకు ఏ ఆపదలు రాకుండా కాపాడు స్వామీ అంటూ అందరూ ప్రార్ధించే వినాయకుడికే ఆపద వచ్చిపడింది. నేను హైస్కూల్ లో ఉన్నప్పుడు ఓ వినాయక చవితికి అనుకోకుండా మా నాన్న స్నేహితుడు గోపాలం మావయ్య కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చాడు. మా ఇంట్లో వినాయకుడ్ని చూసి, ఇదేం వినాయకుడు నల్లగా ముక్కు మొహం తెలీకుండా వున్నాడు, మా హైదరాబాద్ లో వినాయకుడు కలర్ సినిమా లాగా రకరకాల రంగుల్లో అందంగా వుంటాడు! మీకు వినాయక చవితి పండగ ఎలా చేసుకోవాలో ఏం తెలీదు. మేము ఎంచక్కా సినిమాలు చూస్తాం, డాన్సులు చేస్తాం! అంటూ డాబుగా చెప్పాడు. వాడే ఇప్పుడు టీవీలో యాంకర్గా పనిచేస్తూ, ‘మట్టితో చేసిన వినాయకుడినే కొనుక్కొని కాలుష్యాన్ని తగ్గించండి’ అని బోధిస్తూ వుంటాడు! మట్టితో చేసిన వినాయకుడ్ని పూజించటమే అసలైన విధానమని చెప్తున్నా ఎవరికీ చెవికెక్కటం లేదు.
ఇంతింతై వటుడింతై అన్నట్టు, జనంలో భక్తీ పెరిగి పోతున్నకొద్దీ వినాయకుడి సైజు కూడా ఆ ఏటికి ఆ ఏటికీ పెరిగిపోతోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో ఇంతింత లేసి విగ్రహాల్ని తయారుచేసి వాటికి చెత్త రంగులు పులిమి తొమ్మిది రోజులు చెవులు అదిరిపోయేలా పాటలు పాడి, డాన్సులు చేసి, ఆ తరువాత చెరువుల్లోనూ నదులలోను పడేస్తున్నారు. వినాయక చవితి వస్తోందంటే గణపతికి గుండెల్లో దడ మొదలౌతోంది! వెనక రోజుల్లో అయితే వినాయకుడు తన పుట్టిన రోజు సందర్భంగా భక్తులు పెట్టే ఉండ్రాళ్ళు, కుడుములు, పానకం, వడపప్పు, అప్పాల కోసం ఎదురు చూసేవాడు. ఇప్పుడు నైవేద్యాల మాట అటుంచి పెయింట్ వాసనలతో, లౌడుస్పీకర్లలో పాటలతో, దద్దరిల్లే ఆటలతో, ఆయనకు వూపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు పాపం!
మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మా పెదనాన్న, ఏసీ రూములో టీవీ ముందు కూర్చుని టేక్-ఔట్ ఫుడ్ తింటున్న మనవడ్ని చూపిస్తూ, ‘వీడు ఏదో కొత్త విషయం మీద పరిశోధన చేస్తున్నాడటే,’ అన్నారు. నేను ఏరా, ఏం చేస్తున్నావురా? అని అడిగితే ‘పొల్యూషన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్’ మీద రీసెర్చ్ చేస్తున్నాను అత్తా, అన్నాడు!
నన్నడిగితే ఇన్ని లక్షల జీవరాసులున్న ఈ భూప్రపంచంలో మనిషికి వున్నంత అజ్ఞానం ఇంకే ప్రాణికి లేదంటాను. ప్రకృతి మనకు ఇచ్చిన వాటిని హాయిగా అనుభవిస్తూ వాటిని జాగ్రత్తగా కాపాడుకోకుండా, ప్రకృతి విరుద్ధమైన వస్తువుల్ని సృష్టిస్తూ మనకు మనమే కొత్త కొత్త సమస్యల్ని, అపాయాల్ని సృష్టించుకుంటున్నాం. మన పై తరాలవాళ్ళ పద్ధతుల్ని- అలవాట్లను మొదట్లో చులకన చేసి నవ్వుకుంటాం. కొన్నేళ్ళ తర్వాత సైన్స్ చెప్పిందనో, రీసర్చిలో రుజువైందనో, లేకపోతే అమెరికా లాంటి దేశం కూడా ఆమోదించిందనో మనల్ని మనమే జస్టిఫై చేసుకుని మళ్ళీ వాటికోసమే పాకులాడుతాం.
మా నాన్నగారు ఎప్పుడు బయటికి వెళ్ళినా సైకిల్ కు ఓ రెండు కాటన్ సంచీలు తగిలించుకుని మరీ వెళ్ళేవారు. మీరు అది చూసి, మా మావగారు బ్యాగు లేకుండా బయటికి వెళ్ళరు! అంటూ నవ్వేవారు గుర్తుందా?
ఇప్పుడు మీరేం చేస్తున్నారుటా? నా ప్రశ్నకు ముందు సమాధానం చెప్పండి!