వందరూపాయల నోటు

[ఇది పాత కథ. ఈ కథ 1954 లో తెలుగు స్వతంత్రలో ప్రచురితమయ్యింది. 1965 లో “నారాయణరావు కథలు” అన్న ఏడు కథల సంకలనంలో నేను మొదటిసారిగా చదివినప్పుడు, చటుక్కున “Million Pound Note” సినిమా గుర్తుకొచ్చింది. ఆ సినిమా కథకీ, ఈ కథకీ కొన్ని పోలికలున్నాయని నేను చలమాల ధర్మారావు గారితో అన్నాను. ఆయన చెప్పారు నారాయణ రావు ఈ కథ ఆ సినిమా రాకముందే ఎప్పుడో రాశాడు, అని. నారాయణరావు గారి అనుమతితో దీనిని తిరిగి ప్రచురిస్తున్నాము. ఇంకో విశేషం. ఈ కథల సంకలనం నాకు తెలిసినంతవరకూ నా ఒక్కడి దగ్గిరే ఉంది. — వేలూరి వెంకటేశ్వర రావు, సంపాదకుడు]

డబ్బు కావలిసొచ్చింది. చాలా అవసరంగా, కొన్ని సరుకులు కావాలి. ఇతర ఖర్చులకు కొంత కావాలి. మా మరదలూ వాళ్ళూ వచ్చారు. వాళ్ళంతా బెజవాడ వెళ్ళాలనుకున్నారు. కేవలం సరదాకే అనుకోండి. వాళ్ళతో బాటు మా శ్రీమతి కూడా బయలుదేరాలని సంకల్పం. సంకల్పం అయితే భేషుగ్గా ఉంది గానీ, కేవలం కరచరణాలు మాత్రం చాలవు దాన్ని ఆచరణలో పెట్టడానికి.

తొమ్మిదవ అంగం, అతిప్రధానాంగం, డబ్బు కావాలి. దానికోసం పరిశ్రమించి చూడాలి. కావలసినప్పుడల్లా, కావలిసినంతదొరికే వస్తువైతే అది డబ్బు కానే కాకుండా పోతుంది. మరీ ఈ ఒకటవతారీఖు నెలకి ఒక్కసారే రావడం మరీ అన్యాయంగా వున్నదనీ, అధమం
రెండుసార్లైనా రావడం చాలా అవసరమనీ మా శ్రీమతి తన కనీసపు కోర్కెను చాలా రోజుల క్రితమే బయట పెట్టింది. కానీ ఆ మా వాంఛ నెరవేరే సుదినం ఇంకా రానందువల్ల ఆ నెల చివరిదినాన నేను రోడ్డు మలుపు దగ్గిర నిలబడి, నెపోలియన్‌ లా చేతులు వెనక్కి కట్టి తల ముందుకు వంచి వ్యూహం పన్నడంకోసం ఆలోచన చెయ్యవలసి వచ్చింది.

ఈ నాటివరకూ చాలా అరుదుగా డబ్బు అడిగిన ఆసామీనీ అడగాలిగానీ, మిగితా వాళ్ళు దమ్మిడీ ఇవ్వరనే రహస్యం నాకు ముందే తెలుసు. వరూధినికి “ననవిల్తు శాస్త్రమున మిణుకు లావర్తించుపని” లా నాకు అప్పు పుట్టించడం వెన్నతో పెట్టిన విద్య. నా స్నేహబృందంలో అలాంటి వ్యక్తులు ఇద్దరు.

వాళ్ళని ఎప్పుడూ ఇంకా అప్పు అడగలేదు. ఇలా ఆలోచిస్తూండగా షావుకారు ఎదురయ్యాడు. సినిమాకి కాబోలు సీరియస్‌ గా వెళ్ళిపోతున్నాడు. వీణ్ణి అడిగి చూద్దాం, ఇవ్వడు మూడొంతులు.

” ఎక్కడికో సీరియస్‌ గా వెళ్ళిపోతున్నారు షావుకారు గారు. కొంపదీసి సినిమాకి కాదు గదా” అని ఆపాను.

షావుకారు గారు ఆగాడు. ” లేదురా పార్క్‌ లో వెంకట్రావు గాడితో పనుంది. వాడక్కడ ఉంటానన్నాడులే.”
నాకు తెలుసు ఇది నాటకమని, సినిమాకని చెపితే ఎక్కడ ఇతరులు వస్తారో అని వీడి భయం.
“ఏడిశావులేవోయ్‌ వెధవ పనిలేని సమయం ఒకటుందీ నీకు. సర్లే గానీ, పిక్చర్‌ కి పోదాం వస్తావా? డబ్బులు నే పెట్టుకుంటానులే, గాభరా పడకు.”
“లేదురా నిజంగానే పనుంది”. నీళ్ళు నమిలాడు షావుకారు.
“సరే. రేపెళ్దాం ” “తప్పకుండా రా ఫస్ట్‌ షోకి.”
“అల్లాగేలే”
“అవును గానీ నడు చెప్తాను. కొంచెం నీతో పనుందిరా.”
“ఏమిటది?”
“ఏమీలేదు, అవసరంగా ఒక ఐదు రూపాయలు కావాలి. మళ్ళా రేపిచ్చేస్తాను. నా దగ్గిరో ఐదున్నాయి. ఇంకో ఐదు అవసరం అయ్యింది. నీ దగ్గిర తప్పకుండా ఉంటుందనే ధైర్యంతో అడిగాను.”
“రామరామ ఉంటే నీ క్కాదంటానురా. అసలీవేళ పొద్దున్నయితే, ఐదు కాదు, ఐదు వందలిచ్చేవాణ్ణి. ఇప్పుడు దమ్మిడి వుంటే చచ్చినంత ఒట్టు. ఏ మనుకోకు సుమా, ఇవ్వలేనందుకు.”
షావుకారు గబగబా వెళ్ళి పోబోయాడు.
“సరే. దానికేంలే, ఫరవాలేదులే. మా గిరి నడిగి తీసుకుంటాను. వాడు మనకి కొంత ఇవ్వాలిలే. రేపు మరిచిపోకుండా సినిమాకి రావాలి సుమా.”

షావుకారు వెళ్ళిపోయాడు. అసలు వాడిస్తాడని నే అనుకోనేలేదుగా. అసలు డబ్బుకీ వాడి ప్రాణానికీ లంకె. లక్షాధికారి బిడ్డడా, ఒక్క సారి సినిమాకైనా చూస్తూ చూస్తూ డబ్బు ఖర్చు పెట్టలేడు. అధవా వెళ్ళదలుచుకున్నా ఎవ్వరూ చూడకండా ఎవరితో చెప్పకండా వెళ్తాడు. లేకపోతే ఆ ఖర్చు భరించాలిసొస్తుంది. ఇప్పుడు వాడు సినిమాకే బయల్దేరాడు. వాడి వేషం, వాలకం గ్లాస్కో లాల్చీ లోపల రూపాయినోట్లూ, ఈ విషయం చెప్పేస్తున్నాయి.

నా మొదటి గట్టి నమ్మకం శ్రీనివాసరావు దగ్గిర పనిజరుగుతుందని. ఆతను చిరకాల మిత్రుడు. బజార్లో ఫ్యాన్సీ షాపు. ఆ షాపులో కొన్ని సామానులు అరువిచ్చినా చాలు. మనకి డబ్బే ఇవ్వక్కర్లేదు. సరే, షాపు కెళ్ళాను.

” ఏమండోయ్‌ శ్రీనివాసరావుగారూ, వ్యాపారం బాగా సాగుతోందా?”
“ఏదో మీ దయవల్ల.”
“షాపు బాగా పెద్దది చేశారే”
“అవునండీ ఈ మధ్య మీరెక్కడా కనపడడం లేదే?”
“ఏమీ లేదండి, ఆఫీసులో పనులెక్కువై, అసలు తీరుబడి ఉండడం లేదండి. చూడండి, మనదగ్గిర పియర్స్‌ పౌడర్‌ ఉందా?”
“ఆ ఉందండి. పియర్స్‌ ఉంది, క్యూటికూరా ఉంది. పాండ్స్‌ ఉంది. మీ కేది కావాలి?”
“పాండ్స్‌ ధర ఎంతండీ?”
“ఆ? ఎంతండి, రూపాయిముప్పావలా.”
“అబ్బా ధర పెరిగిందండీ. సరేగాని, ఇంకా రిబ్బన్లూ అవీ కూడా కావాలి.”

శ్రీనివాసరావు లేచి నిలబడి రిబ్బన్లు చూపించడం ప్రారంభించాడు. పౌడరు డబ్బాల రకాలు ముందు పేర్చాడు. నేను మెల్లిగా ప్రారంభించాను. “శ్రీనివాసరావుగారూ నేను ఇలా తిన్నగా ఆఫీసు నుంచి ఇటు వస్తున్నాను. ఈ సరుకులు కొంచెం అర్జెంటుగా కావాలి. రేపు ఉదయం డబ్బు పంపించడానికి మీ కభ్యంతరం లేదుగా?” ఈ మాటలనేసి శ్రీనివాసరావు మొహంకేసి చూశాను, అతను ఏమంటాడోనని.

“అరరె. భలేచిక్కు తెచ్చిపెట్టారే. మీ బోటి వాళ్ళకి అప్పిస్తే ఏ భయమూ లేదనుకోండి. మీ దగ్గిర డబ్బు దాచు కొన్నట్టే. కాని, మాకో వాటాదారుడున్నాడండి. దాంతో, ఏవో లెక్కలూ వ్యవహారం. అసలీ అప్పు, అనామత్తు వ్యవహారం పూర్తిగా మానుకున్నాం. మీరు అనుభవస్తులు. మీకు తెలియందేముందీ?

అయినా ఒక పని చెయ్యండి. మీకు కావలసిన సరుకులు ఏరి ఇక్కడ ఉంచండి. రేపుదయం మళ్ళా మీరు శ్రమ పడనక్కరలేకుండా, ఒక కుర్రాణ్ణి పంపండి డబ్బిచ్చి. ఈ సరుకులన్నీ కట్టి అతని చేతికిచ్చి భద్రంగా పంపుతాను,” అన్నాడు ఎంతో సానుభూతి చూపిస్తూ. నా మొహాన్ని నెత్తురు చుక్కలేదు. ఇంకేం మాట్లాడలేక, సరుకులు కావలిసినవి తీసి పక్కనపెట్టి రేపు కుర్రాణ్ణి పంపుతానన్నాను. డబ్బు రాలేదు సరిగదా, పైగా కొంత బాధ్యత నెత్తికొచ్చింది.

తలవంచుకొని చక్రవర్తి ఇంటికెళ్ళాను. వీడే నేననుకున్న గట్టి ఆధారం.
“చక్రవర్తీ నాకర్జంటుగా ఐదు రూపాయలు కావాలిరా” అన్నాను, సీరియస్‌ గా, ఏ ఉపోద్ఘాతం లేకుండా.
“చంపేశావురా, ఇప్పుడసలు దమ్మిడీ లేదు. ఇవాళేదో పనుండి మా నాన్ననడిగితే తనదగ్గిర అసలేమీ లేదన్నాడు. ఉంటే తప్పకుండా ఇచ్చే వాణ్ణి.” ఇంక మళ్ళా మాట్లాడలేదు నేను. సరేలే ఇంకోదగ్గిర చూస్తాను అని బయల్దేరి వచ్చేశాను. నేను బయల్దేరిన రోడ్డు తిన్నగా ఇంటిదాకా ఉందని మా గుమ్మం ముందు మా మరదలు పిలుపు వినిపించే దాకా తెలియలేదు.

తిన్నగా ఇంటికెళ్ళి పడుకున్నాను. భోజనం కూడా సరిగా చెయ్యలేదు. ఏమిటింత దారుణమైన వైఫల్యం? అయినా ఈ నెల చాలా ఎక్కువ ఖర్చయింది. అందుకే అప్పుకి బయల్దేరవలసి వచ్చింది. అయినా ఈ ఆడవాళ్ళకి మరీ ఇంగిత జ్ఞానం లేదు. లేకపోతే ఇప్పుడు ప్రయాణమేమిటి? వాళ్ళకేం తెలుసు ఈ శ్రమ? చెప్పేద్దామనుకున్నాను, “ప్రయాణం మానెయ్యమని “. ఏమో చెప్పలేకపోయాను. కొత్తగా కాపురం పెట్టిన రోజుల్లో అర్థాంగి “ప్రియురాలు” గా వుంటుంది. (ఆవిడని ఆరోజుల్లో అర్థాంగి అనడంకంటే సర్వాంగి అనడమే మంచిది) కొన్నాళ్ళకి ప్రియం తగ్గి చవకయిపోయి కేవలం “భార్య” అయి వూరుకుంటుంది. ఏమో పాపం, ఎంతమనసు పడి ప్రయాణం
పెట్టుకుందో? కాదంటే నొచ్చుకుంటుంది. ఇంత పురుషుడూ ఉండి పది రూపాయలు సమయానికి తేలేకపోతే భార్య ముందు ఎంత పరాభవం? పైగా ఉన్నవారింటిపిల్ల. అయినా రేపు రాత్రికి గదా ప్రయాణం.

మర్నాడు పొద్దున్న మరదలు చేతి కాఫీ తాగి ద్రవ్యాన్వేషణకి బయలుదేరబోతున్నాను. ఇంతట్లో మరదలు పిలిచి, ” బావగారికి మరీ పని లేక పోతూందిట. కాస్త పని చెప్పాలి. ఈ వంద రూపాయల నోటుకి చిల్లర తెచ్చి పెట్టండి” అని నోటు చేతికందించింది.

“మా ఊళ్ళో ఈ నోటుకి 90 రూపాయలే శశీ” అన్నాను నవ్వుతూ.
“పోనీ ఆ పదీ మీరువేసి వందా పట్రండి. బావగారు సంపాదిస్తున్నారుగా” అంది తడుముకోకండా. నోటు జేబులో పెట్టుకొని బయల్దేరాను.

నాది కాక పోయినా వందరూపాయలనోటు జేబులో ఉండడం ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఆ నోటు కాదనడానికి ఏ ఆధారం లేదు. డబ్బు అతి చంచలం. సామాన్య నాయికలాగా అందరికీ వర్తిస్తుంది. అది ఎవరిచేతిలో ఉంటే వారిదే. ఇంకొకరిదనడానికి ఏ ఆధారమూ ఉండదు. మామూలుగా చొక్కాలు, పంచెలూ, రిష్టువాచీలు, భార్యలూ, వీటికన్నిటికీ గుర్తులుంటాయి. కాని డబ్బుకలాకాదు. డబ్బు ఎవరి చేతిలో ఉంటే వారి ఆస్తి అయి చక్కా పోతుంది. ఇప్పుడు ఈ వంద రూపాయలనోటు నాదే ననిపించింది. ఇంకో రెండంగుళాలు పెరిగిన వాడిలా నడిచాను.

ఈ వందరూపాయలూ మార్చి మరదలు చేతికిచ్చేస్తే దీని విలువ ఏమీ పెరగదు. దీంతో ఒక అద్భుతమైన నాటకం ఆడాలి. తిన్నగా చక్రవర్తి ఇంటికెళ్ళాను. మా ఇంటి చుట్టుపక్కల వందరూపాయలచిల్లర ఇవ్వగల పెద్ద షాపులేవీ లేవు. బజారు చాలా దూరం. చక్రవర్తి ఇల్లే దగ్గిరలో మోతుబరుల ఇల్లు.

“చక్రవర్తీ ! చక్రవర్తీ”
చక్రవర్తి వచ్చాడు. ” ఏమిరా నిన్న ఐదు రూపాయలు దొరికాయా?” అన్నాడు.
“లేదురా ” అసలు అక్కర లేకపోయింది. మా నాన్న T.M.O. పంపాడు. వందరూపాయలు. అసలది ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఆలస్యం అయిందన్న మాట. నిన్నే వచ్చింది.”
” వెరీ గుడ్ లక్‌ అంటే అలా ఉండాలి”
“సరేగాని నాకర్జంటుగా వందరూపాయల చిల్లర కావాలి. నిన్న ఆ శ్రీనివాసరావు షాపులో కొన్ని సరుకులు కొన్నాను. ఇంకా తెల్లవారనే లేదు. అప్పుడే కుర్రాణ్ణి పంపించాడు. అయినా ఇంత ఇడియట్‌ అయిపోతున్నాడేమిట్రా శ్రీనివాసరావు? ఇంతలోనే పారిపోతామనుకున్నాడా?”
“పోనీరా అన్‌కల్చర్డ్ బ్రూట్ ” అన్నాడు చక్రవర్తి.
“అందుకేరా వాడి డబ్బు వాడి మొహాన పారేస్తే సరి. బోడి డబ్బు.”
చక్రవర్తి లోపలికెళ్ళొచ్చాడు.

“సరేగాని చక్రవర్తీ, మాటినీ కెళ్దాం వస్తావా? చార్లీ చాప్లిన్‌ మన్షూర్‌ వెర్దో చాలా బాగుంటుందిరా.”
“అలాగే వెళ్దాం. ఇదిగో బట్టలు వేసుకోని వస్తా. మరి చిల్లర ఇంకొక గంటకి గానీ దొరకదు. మా నాన్న పూజలో ఉన్నాడు.”
“అరె, ఆ కుర్రముండాకొడుకు ఇంటిదగ్గిర కాసుక్కూచున్నాడు. మనకి మాటినీ టైం అవుతోంది” అన్నాను.
చక్రవర్తి సావకాశంగా “వాడికెంతివ్వాలి?” అన్నాడు.
“ఆ ఎంతరా ఐదు రూపాయలలోపు.”
“సరే ఈ ఐదూ పట్టికెళ్ళి వాడికిచ్చెయ్యి. మనం బజారులో నోటు మార్చినప్పుడు తీసుకుంటాలే.”
“థేంక్స్. వాడి శని వదిలి పోతుంది.”
“సరే నేను ఇంటికెళ్ళి బట్టలేసుకొని సిద్ధంగా ఉంటాను. నువ్వు మా ఇంటికిరా. కలిసి పోవచ్చు మాటినీకి.”

ధైర్యంగా ఇంటికి వచ్చాను. చక్రవర్తి రాలేదు. ఆ ఐదు రూపాయలనోటుని చూసి నవ్వుకున్నాను. ఈ చక్రవర్తే నిన్న దమ్మిడి లేదన్న చక్రవర్తి. ఈ వేళ వందరూపాయల నోటు నా విలువ పెంచింది. చక్రవర్తి మాటినీకి వస్తాడని నేను అనుకోలేదు. ఎందుకంటే ఈ రోజు ఆదివారం. వాళ్ళింట్లో ప్రతి ఆదివారం పూజకి సరంజామా సమకూర్చే బాధ్యత చక్రవర్తిది. వాళ్ళనాన్న చూస్తుండగా బయటికి
రావడం చక్రవర్తి తరం కాదు.

ఆదివారమైనా ఆఫీసు పని కొంచెం ఉంది. 12 గంటలకి భోజనం చేసి ఆఫీసుకి పోయి పని చూసుకోవచ్చు. ఈ లోపుగా బజారుకి పోయిరావాలి. తిన్నగా శ్రీనివాసరావు షాపు దగ్గరికెళ్ళాను. నవ్వుతూ ” మీరే స్వయంగా శ్రమపడి వచ్చారే?” అన్నాడు. “నా పనికి రాక తప్పుతుందా, శ్రమేమిటి?” అన్నను.

గబగబ పర్సు తీసి “నాకర్జంటు పనుంది. ఇంకా వెండి కొట్టు కెళ్ళాలి. కాస్త ఆ సరుకులు ఇలా ఇవ్వండి. ఎంత? ఐదు రూపాయలనుకుంటాను,” అంటూ వందరూపాయల నోటు తీశాను. శ్రీనివాసరావు మొహం పెద్దదయింది. అంతపొద్దున్నే అతని షాపులో చిల్లరుండదని నాకు తెలుసు.

“అరే, చిల్లర లేదండి తెప్పించాలి.”
“అయితే కుర్రాణ్ణి పంపించి తెప్పించండి త్వరగా.”
“కుర్రవెధవ ఇంకా రాలేదండీ.”
“చంపారే. సరే నేనిలా నోటు మార్చుకొని వచ్చి ఇస్తాను. ఈ కట్ట ఇలా ఇవ్వండి.”
శ్రీనివాసరావు మాట్లాడలేక పోయాడు. వందరూపాయలతోసహా ఉన్న నన్ను ఒక ఐదు రూపాయల వస్తువులు పట్టుకెళ్ళద్దన లేక పోయాడు. ఠీవిగా, ఛాతీ విప్పుకొని ఆ కట్ట పుచ్చుకొని ఇంటికి దారి పట్టాను. (వెండి కొట్టు సంగతి వట్టి నాటకమని తెలుసుగా)

ఇంటికెళ్ళి రణరంగవిజేతలా మొహం పెట్టి ఆ డబ్బూ, ఆ వస్తువులూ అర్థాంగి కరకమల సమర్పితం చేశాను. ఆ మొహం వికసించింది. మనిషే పులకరించి పోయింది. మొహమంతా కళ్ళయి, ఆ కళ్ళంతా పాపై ఆ వస్తువులను చూచింది. పెదిమలు సన్నగా నొక్కి, పెదిమల చివరల చిన్న గుంటలు పడితే, ఆగుంటలనిండా సౌందర్యం నింపింది. కళ్ళల్లో నల్ల పాపలు వయారంగా ఒక మూలకి చేరి తాగమన్నాయి సౌందర్యాన్ని.

ఈ వందరూపాయల నోటు ఇక చిల్లర మార్చెయ్యొచ్చు. మధ్యాన్నం ఆఫీసుపని, నిద్ర, అన్నీ అయిపోయాక వీధిలోకి బయల్దేరాను.
రోడ్డుమలుపు దగ్గిర షావుకారు కనిపించాడు. “రా సినిమాకి పోదాం” అన్నాను ధైర్యంగా. నిన్న మాటిచ్చాడుగా. తప్పించుకోలేక పోయాడు. అయినా తను డబ్బు పెట్టుకోనక్కర లేదనే ధైర్యం బహుశా ఉండే వచ్చాడు. బుకింగు దగ్గర నేను వందరూపాయలు తీసి టిక్కెట్లు ఇమ్మన్నాను. చిల్లర లేదన్నాడు. అప్పుడే ప్రారంభం బుకింగ్‌ . షావుకారు నోటు చూశాడు. మొహం రంగు మారింది. తనే టిక్కెట్లు కొన్నాడు.

సినిమా అయిపోయింది. ఆవేళ షావుకారున్నంత హుషారుగా ఎప్పుడు లేడు. అంత ఆప్యాయంగా ఎప్పుడూ మాట్లాడలేదు. తిన్నగా ఇంటికి వస్తూ మార్వాడి షాపులో చిల్ల మార్చేశాను. నోటు ఇచ్చేస్తుంటే అప్రయత్నంగా రెండు కన్నీటి చుక్కలు రాలేయి. ఇంతపనీ ఆ నోటు చేసింది, మరదలు పుణ్యమా అని.

చిల్లర నోట్లు జేబులో వేసుకొని బయలుదేరాను. ప్రపంచమంతా ఒక పెద్ద వందరూపాయలనోటు మీద ఆనుకుంది ప్రతివాడూ ఎప్పుడూ మార్చకండా ఒక వందరూపాయలనోటు జేబులో ఉంచుకొంటే.

ఇంటికొచ్చేసరికి వాళ్ళు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. నేను చెప్పకుండా సినిమాకు వెళ్ళినందుకు అప్పచెల్లెళ్ళిద్దరికీ కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఆవిడ మొహం ఇంకా బాగుంటుంది. అయితే మార్చని వందరూపాయల నోటు కన్నా విలువైనదా ఆ సౌందర్యం?


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...