ఇవి ఇలా ఉండవు.
చెప్పుడు మాటల్లాగ పెట్టుడు సొమ్ముల్లాగా
తేలిపోతాయి
రాలిపోతాయి.
ఇవి అలాగా ఉండవు
గాజుకాయల్లాగ పచ్చి కుండల్లాగా
పగిలి పోతాయి పుసికి పోతాయి
ఇసక కోటల్లాగ ఈనప్పుల్లల్లాగా
ఇలా లేచి అలాగివి
కాలి పోతాయి కూలి పోతాయి.
వానలకి ఒరిసి ఇవి మట్టి పెళ్ళల్లాగ
వరదలో కొట్టుకుని ఏటి గట్టుల్లాగ
కట్టినవి ఇవన్నీ
జారిపోతాయి కరిగిపోతాయి.
ఇవి ఎలాగా ఉండవూ
గాలి వీస్తున్నట్టు దుమ్ము రేస్తున్నట్టు
అగ్గి జువ్వల్లాగ కట్ల తుట్టల్లాగ
అట్నుంచి ఇటు వచ్చి
కళ్ళముందే ఎటో జారిపోతాయి.
అతనికివి తెలుసు
ఇవి ఇక్కడివి కావని ఎక్కడికీ పోవనీ
ఇటు తిరిగి అటు తిరిగి
ఇటు చూస్తే అటు చూస్తే
ఇవి గారడీ లోవని,
కావనీ లేవనీ.