శరవణన్ అని నా స్నేహితుడు. ఆయన, నేనూ ఒక రోజు ఏవో బజారు లెక్కలు సరిచూసుకుంటున్నాము. ఆయన పొడుగ్గా రిబ్బన్‌లాగ ఉండే రశీదు కాయితాన్ని కిందికీ మీదికీ నాలుగు సార్లు చూసి, మనసులోనే ఏదో లెక్క గుళ్ళించుకుని, మొత్తం సొమ్ము ఎంతయ్యిందో చెప్పీసేడు. నాకు ఆశ్చర్యం. నేను బజారు ఖర్చు ఎలా లెక్క చూస్తానంటే ఒక్కో సరుకు ఎదురుగా ఒకొక్క వరసలోనూ ఉన్న ధరను జాగర్తగా గమనించి, దాన్ని కిందదాని ధరతో కూడవేసి, అలా వరస కలుపుకుంటూ మొత్తం లెక్క చూస్తాను. ఆయన అలా చెయ్యకుండా ఇలా ఇలా కిందికీ మీదికీ కళ్ళెత్తీ దింపీ చూస్తూ ఉజ్జాయింపుగా లెక్క సరిగ్గానే చెప్పేస్తున్నాడు. నేను ఆశ్చర్యపోతుంటే నవ్వి, “నన్నేం చూసేవు! మా నాన్న పచారీ కొట్టు షావుకారు. ఆయనైతే కొన్ని వందల సామాన్ల పద్దు లెక్కనంతా కేవలం ఒకటి రెండు సార్లు కిందికీ మీదికీ చూసి అణా పైసలతో సహా ఖచ్చితంగా అప్పచెప్తాడు.” అన్నాడు. షావుకారుగారు అసలు ఏ లెక్కా కట్టకుండానే కూడిక సరిగ్గా చెప్పేస్తున్నారని అనుక్కునే వీల్లేదు. అది తర్క సమ్మతం కాదు; కనికట్టూ, గారడీ అవుతుంది. ఆయన ఏం చేస్తుండి ఉంటారంటే, మామూలుగా కొన్ని నిమిషాలైనా పట్టవలసిన లెక్కలోని అంచెలన్నింట్నీ ఎలాగో, చిత్రమా అనిపించేలా ఆయన క్షణంలో పూర్తిచేస్తున్నారు. ఆయన చిన్నప్పుడు అందరిలాగే ఒక్కో సరుకు ధరనీ కూడవేస్తూ లెక్కించేవాడేనని, అనుభవం మీద క్రమంగా ఎలాగో లెక్కని ఒక యంత్రంలా (Automaton) త్వరితంగా పూర్తిచేసే ఒడుపును సాధించుకున్నాడనీ అనుకున్నాము.
స్థిరమైన అభిరుచిని నిర్మించుకోగలిగినవాళ్ళు, అంటే ‘ఇదీ నా తోవ!’ అని తమ ‘లక్షణ సిద్ధాంతా’న్ని స్పష్టంగా అవగాహన చేసుకుని, స్థిరంగా నిలబెట్టుకోగలిగినవాళ్ళు సృజనలను పడికట్టే పద్ధతి ఈ షావుకారుగారి లెక్కలాగ ఉంటుందని నాకు అనిపిస్తుంది. నామిని సుబ్రమణ్యం నాయుడుగారు ఎప్పుడైనా అరుదుగా సృజనను గురించి తన అభిప్రాయం చెప్పుకునే పద్ధతిని పరికించి చూస్తే ఆయన రచనలని ఈ షావుకారుగారి లాగే అప్రయత్నంగా, instinctiveగా – మనోవేగంతో అంటారు – అలాగ పరీక్ష చేసి ఒక నిర్ణయానికి వస్తున్నారని తోస్తుంది. ఇలా మచ్చు చూసి కవితని, కధని, వ్యాసాన్ని గురించి ఒక అభిప్రాయానికి రావటం అంత అరుదేం కాదు. నేను కూడా ఏదైనా ఒక రచన కళ్ళెదుటికి వస్తే అది నాకు చదవాలనిపిస్తోందా లేదా అని ఒక క్షణం పాటు మాత్రం ‘చూసి’, సాంతం చదవకుండానే ఒక అభిప్రాయానికి వచ్చి, దాన్ని పక్కన పెట్టటమో, లేదంటే స్వీకరించి పట్టి పట్టి చదవడమో చేస్తున్నాను. సాంతం చదవకుండానే ఒక అభిప్రాయానికి రావడం మర్యాద కాదు. ఒక రకంగా దీన్ని గీర అని, పొగరుబోత్తనమనీ అనుకోవడమే రివాజు. ఇది ప్రజాస్వామ్య సంస్కృతికి కూడా విరుద్ధమైన స్వభావం; ఒకలాంటి నిరంకుశత్వం. ఇందుకు భిన్నంగా, ఎవరిది ఏ రచననైనా కాదనకుండా సుహృద్భావంతో ప్రతీ వాక్యం, పేరా చదివి, దాని సారాంశాన్ని వివరించి, దాని గుణదోషాలని తోచినవాటిని గురించి నాలుగు మంచి మాటలూ, రెండు బలహీనతలూ ఎత్తిచూపిస్తూ తెలుగు సాహిత్యంలో ఆ రచన స్థానం ఏమిటో ప్రకటిస్తూ ముక్తాయించటం లోక సబబు, ప్రజాస్వామికమైన మర్యాద. నాకు గీరని, పొగరనీ అనుక్కుందామంటే నాకే చిన్నతనం అనిపించి, నేను సయించవని పక్కన పెట్టీసిన రచనలను మళ్ళీ మళ్ళీ కనీసం చదివి చూద్దామని ఎంత అనుకున్నా – ‘మనసు మాట వినదు.’ మళ్ళీ అవి పక్కన పెట్టెయ్యటమే అవుతుంది. ఇలాంటివాటిలో గొప్పవి అని బాగా ప్రచారానికి ఎక్కినవి కూడా ఉంటాయి. ఈ నా మనస్తత్వాన్ని గురించి నాలో నేనే చాలా గుళ్ళించుకుంటాను.
రావి శాస్త్రిగార్ని ‘మీ ప్రశ్నకి నా జవాబు’ వంటి శీర్షికలోన ఎవరో “బాపు రమణల రచనల మీద మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగితే “స్కూల్ బాయిస్ మెంటాలిటీ!” అన్నారు. మెహెర్‌గారు చాసో కధల్ని గురించి ఆ కధలేవీ తనకు ఏ అనుభూతినీ కలిగించలేదని అంటున్నారు. వంశీగారి మా పసలపూడి కధల్ని గురించి నామిని “ఒకసారి చదివి చూస్తే నాకేమీ నచ్చలా…” అని చెప్పుకున్నారు. ఈ అభిప్రాయాలు మూడింటితోనూ నాకు ఏకీభావం ఉంది. ఈ మూడూ కేవలం ఉదాహరణలు. బాగా ప్రచారంలోకి వచ్చి, ఆవరకే నాణ్యమైనవి అని పేరుపడిన వ్యవస్థలే ఉంటాయి. ఉదాహరణకు ఆధునిక సాహితీకారులు అందరూ ‘గురజాడ మహాకవి అభ్యుదయ గురు పీఠం,’ ‘గురుదేవులు రవీంద్రులు విశ్వకవి,’ వంటి భాష్యాలను ఒకటో తరగతి పిల్లలనుండీ స్థిరంగా పదే పదే చదువుకుని, వీటిని కూడా ‘సూర్యుడు తూర్పున ఉదయించును’ అనే సత్యాల్లాగానే ఒప్పుకుని, ఆ పైన ఎల్లప్పుడూ వాటికి విధేయతనే ప్రకటించుకోవాలి. సాధారణంగా ఇలాంటి అభిప్రాయాలతో బేధం ఉన్నవాళ్ళు తమ విబేధాన్ని చాటుగా వ్యక్తం చేసుకుంటారు, కాని బహిరంగంగా ఏమీ అనలేరు.
పై మూడూ కూడా అంగీకారంలో ఉన్న బహుళమైన అభిప్రాయాలతో విబేధించేవి. ఇవి చదివి ‘ఓహో! కనీసం ఇంకొక్క మనిషికి కూడా నేను అనుకున్నట్టే అనిపించిందా?!’ అని అనుకున్నాను. ఇలాంటి పాఠకులు సృజనలో ఏదో వెతుక్కుంటున్నారు. అదేమిటో అర్ధంచేసుకొనే ప్రయత్నమే లక్షణ సిద్ధాంతం అని అంటున్నది. ఇది ఒక్కొక్క పాఠకుడి అనుభవాన్నీ పరిశీలిస్తూ ప్రారంభించేది. కాని, ఇలాంటి నిర్ధారణలు ఎవరు చేస్తున్నా, ఏ రచనల్ని గురించి చేస్తున్నా అవి ప్రధమంగా కేవలం వాళ్ళ ఒక్కరి అభిప్రాయాలు. ఈ వ్యక్తిగతమైన అభిప్రాయాల్ని సార్వజనీనమనీ, అందరూ తాము అనుకున్నట్టే అనుకోవాలనీ ఆశించడం సబబేనా? సబబేనని కాంట్ (Immanuel Kant), కాదని మామ్ (Somerset Maugham) చేసిన వివేచన ముందుకి చూడవచ్చును. ఇప్పటికి ఒక జాగ్రత్త ఏమిటంటే ఒకరి అభిప్రాయం ముందుగానైతే ఆ ఒక్కరి అనుభవం మాత్రమే; అది ‘ఆటోమేటిగ్గా’ మిగిలినవాళ్ళందరికీ, లేదా ఏ కొందరికైనా కూడా వర్తిస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి వివాదాస్పదమైన సంగతి. ఉదాహరణకు, చాసో కధలు, బాపు రమణ రచనలు తమకు ఎంతో నచ్చుతాయని చెప్తూ వస్తున్నవాళ్ళు వేలాదిగా ఉన్నారు; నచ్చవని చెప్పినవాళ్ళు ముగ్గురో, నలుగురో. ఇందుకు భిన్నమైనది ఇంకో ఉదాహరణ: త్రిపుర రచనలు తీసుకుంటే అవి తమకు అసలేం అర్ధం కాకుండా ఉన్నాయని చెప్పేవాళ్ళే అత్యధికంగా ఉంటారు.
ఒకరి అభిప్రాయం ముందుగానైతే ఆ ఒక్కరి అనుభవం మాత్రమే; దాన్నే ప్రాతిపదికగా చూపించి అందరి కోసం, లేదు ఇంకొక్కరి కోసం అయినా సరే ఎలాంటి నిర్ధారణా, సిఫారసూ చెయ్యలేము. ఈ విషయం ఒప్పుకోవడం, గుర్తుపెట్టుకోవడం చాల కష్టం. ఎందుకంటే ఇది మన ఉద్వేగాలతో, నమ్మకాలతో, సంకల్పాలతో, లక్ష్యాలతో చిక్కుగా ముడిపడి ఉన్నది, ఇదివరకు Cognitive Dissonance అని ప్రస్తావించిన దానికి సంబంధించిన అంశం. అందుకే, ఇది నచ్చినట్లు లేదు అనిపించిన రచనను, దాన్ని సమర్ధిస్తూ, మెచ్చుకుంటూ వచ్చిన సిఫారసులు ఎన్ని చదివినా, విన్నా ఆ అభిప్రాయం – అంటే first impression మార్చుకోవటం దుర్లభం. అది ఎప్పుడు సాధ్యమౌతుందంటే, ఏవో బలమైన కారణాల వలన ఆ పాఠకుడు ‘మారు మనసు’ పొందినప్పుడు – అంటే తన నమ్మకాలు, లక్ష్యాలు, సంకల్పాలు, తన ఔద్వేగిక వ్యవస్థల్లోన అనుకూలంగా మార్పు వచ్చినప్పుడు. దశాబ్దాల తరబడి డిటెక్టివ్ నవలల వంటివి రాసేవాళ్ళూ, చదివేవాళ్ళూ ఉన్నట్టుండి ‘ఆధ్యాత్మిక రచయితలు’గా, పాఠకులుగా మారు మనసు పొందటం చూస్తాము. ఇలాంటి మార్పుకు కారణాలను Cognitive Dissonance వివరిస్తుంది. వీటిలో ఒక మన:స్థితి ఇంకోదానికంటే మంచిది, గొప్పది అనే ఆలోచన, నిర్ణయం (value judgment) కళా దృష్టితో చూస్తే నిరాధారమైనవి. ఒక రచయితను గౌరవించటమంటే ఆయన రాసినవి మెచ్చుకోవడం ఒక్కటే కానక్కర్లేదు. కొత్తగా, నిశితంగా, విస్తారంగా పరీక్షించి చూస్తూ చేసిన విమర్శ ఎలాంటి పరిశీలన చేసినా అగౌరవం అయితే కాదు. కవి అయినా, పాఠకుడైనా ఎలా ఉన్న మానసిక స్థితినీ, ఔద్వేగిక స్థితినీ అలా ఉన్నది ఉన్నట్టుగా కనుక్కొని, అర్ధం చేసుకొని, నిర్మించుకొని, ప్రకటించుకోవటమే ‘సబబు’. ఇలా చెయ్యలేకపోవటం ‘జూటా’. ఇదివరకు నఓయా (Naoya Shiga) అని చెప్పిన జాపనీస్ రచయిత ఇలాంటి ‘నిజాయితీ’నే ఆశిస్తున్నారు. నామిని దీన్నే ఆశిస్తున్నారు. త్రిపురకి దొంగలు, కేటుగాళ్ళు, రగిడీసులు – ఇలాంటి మనుషులంటే ఒకరకమైన సానుభూతి, వాళ్ళు నటించకుండా తమ స్వభావానుసారం ప్రవర్తించేవాళ్ళని. పారిస్‌లో బెకెట్ ఇంటి దగ్గర్లోనే ఒక సెంట్రల్ జైల్ ఉండేదట. ఆయన దాన్లోని ఖైదీల్ని చూస్తూ గడిపేవాడట, వాళ్ళంటే తనకి ఏదో ప్రత్యేకమైన అభిమానం అని.
వేగంగా, కేవలం మచ్చు చూసినట్లు పరీక్ష చేసి వస్తువులు, ప్రవర్తనల్ని అంచనా వెయ్యటం అంత అసాధారణమైన విషయమేమీ కాదు. మన సంభాషణల్లోన సారమంతా నూటికి ఎనభయ్యైదు వంతులు మనిషి వాటం (Body Language) లోనే ఉంటుందని, వాచ్యంగా అంటున్న మాటల కంటె మనిషి హావ భావాల్ని బట్టే యదార్ధంగా అతని సంకల్పం ఏమిటో పోల్చుకోవాలనీ మనస్తత్వంలో చెప్తారు. గ్లాడ్‌వెల్(Malcolm Gladwell) అని, ఆయన ఇలా ఉజ్జాయింపుగా విషయాల అంతర్గత సారాన్ని అంచనా వెయ్యడాన్ని గురించి Blink: The Power of Thinking Without Thinking అని ఒక పుస్తకమే రాసేడు. మనుషుల సుప్త చేతనకు తక్కువ కాలంలో, కొద్దిపాటి సమాచారంతోనే చాలా త్వరితంగా విషయాన్ని అవగతం చేసుకొని, సరైన నిర్ణయాల్ని తీసుకొనే శక్తి ఉంటుందని ఆయన వాదించేడు. దీన్ని Thin slicing అని అంటారు. బ్లింక్ – అంటే ఒక రెప్పపాటులో అసలు విషయం ఏమిటో పోల్చుకుంటామనీ, చాలా సందర్భాల్లో ఎంతో తర్కించి చేసే నిర్ధారణల కంటే ఇలా అప్రయత్నంగా, అసంకల్పితంగా స్ఫురించే నిర్ణయాలే సరైనవిగా, సబబుగా ఉంటాయనీ ఆయన ప్రతిపాదన. స్నేహం, వ్యవహారం, బంధుత్వం వంటి సంబంధాల విషయంలో మనలో చాలా మందిమి ఇలాంటి పద్ధతుల్ని, అంటే ‘లక్షణ సిద్ధాంతాన్ని’ అసంకల్పితంగా వాడుకుంటాము. ఉదాహరణకు ఎవరైనా కలిసి, మాట్లాడి వెళ్ళిన తర్వాత, అక్కడ మిగిలి ఉన్నవాళ్ళు ఆ వెళ్ళిన వాళ్ళ వైఖరిని గురించి ‘అదేమో! ‘పైపైకి నవ్వుతున్నాది గాని ఎప్పటిలాగ సరిగ్గా మాట్లాడింది కాదు’ అనీ, ‘ఆయనేంటి అలా ఏదోలాగ చూస్తున్నాడు?’ అనీ ఇలా అంచనాకి రావటం సాధారణం. అనుభవజ్ఞులైన వ్యాపారస్తులు దుకాణంలోకి వచ్చిన మనిషి కొనే బేరమో కాదో తొలిచూపులోనే సరిగ్గానే నిర్ణయించుకుని, అందుకు తగినట్టుగా బేరం నిర్వహిస్తారు. ఇలాంటి నిర్ధారణలకు ప్రాతిపదికలు ఔద్వేగిక స్థితి, సంకల్పం. లోక వ్యవహారానికి దీన్ని అన్వయించడం లోని నిజానిజాల మాట ఎలా ఉన్నా, సృజనల పరిశీలనలో పాఠకులు ఇలా మచ్చు చూసి నాణ్యతను పోల్చుకుని, అభిప్రాయాన్ని స్థిరం చేసుకునే స్వభావం కొందరిలోనైనా చూస్తాము. నా స్వభావం ఇలాగుంది కాబట్టి దీన్ని అర్ధం చేసుకోవడం నాకు అవసరం. ఈ రోజుల్లోన ఉద్వేగం (Emotion) గురించీ, వివిధ కళారూపాల పైన ఉద్వేగపు ప్రభావాన్ని గురించీ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న శాస్త్రీయ పరిశోధన సృజన అనుభవంలో ఔద్వేగిక ఆవరణకు, సంకల్పానికీ ఉన్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవడానికి ఉపయోగమౌతుంది.
కాని ఈ పద్ధతిలోన కొన్ని ఇబ్బందులున్నాయి. పాఠకుడి ఇష్టాయిష్టాలు, దురభిమానాలు (Prejudice) పైన Thin-slicing అన్న ఉపజ్ఞను నిర్హేతుకమైన వివక్షగా, ఉదాసీనతగా ఎలా పతనం చేస్తాయో గ్లాడ్‌వెల్ స్వయంగా వర్ణిస్తున్నాడు. అందుకోసం ఇదివరకు వ్యక్తిత్వం అని, self అన్నదాని స్వభావాన్ని గురించి ముందుకి వివరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇష్టానిష్టాలు, దురభిమానాల వంటివి వ్యక్తిత్వపు పరిమితులు. కులం, ప్రాంతం, స్నేహం, అంతస్థు వంటివి ప్రాతిపదికగా అభిమానాలు, అవజ్ఞ ముందుగానే ఏర్పడి ఉండటం, సాటివాళ్ళను గురించి ఈర్ష్యా – ఇలాంటివి సాధారణమైన అనుభవాలు. ఇవి ఉద్వేగాలతో, బాల్య స్మృతితో చిక్కుగా ముడిపడి ఉండేవి, ఆధునికులు ‘సహృదయత’తో నలుగురినుండీ మర్యాదగా దాచిపెట్టుకొనేవి. దురదృష్టవశాత్తు అభిరుచిలో, వ్యక్తిత్వంలో ఎంతో పరిణతిని, వివేకాన్నీ సాధించుకున్నవాళ్ళయితే తప్ప, తమ వ్యక్తిగతమైన అనుభవాన్ని, అభిరుచినే పదిమందికీ వర్తింపచెయ్యాలన్న సహజమైన ఉబలాటాన్ని నిగ్రహించుకోవటం కష్టం అవుతుంది. రచనలు, రచయితల మూల్యాంకనం – అంటే Relative Ranking మీదే ధ్యాసంతా నిలుపుకుంటే ఈ ఉబలాటం నా మేలైన ఉవాచను అందరూ ఒప్పుకోండన్న సిఫారసుగా, లేకుంటే మరీ కట్టుతెగి వెక్కిరింతగా, హేళనగా పతనమౌతుంది.
విమర్శ నుండి విమర్శకునికి, పాఠకునికీ మినహాయింపు లేదు. పాఠకుడు సృజనను కవితో కలిసి జట్టుగా నిర్వహిస్తున్న పాత్రధారి కాబట్టి. తొలి చూపులో క్లుప్తంగా అభిప్రాయాలు తోచినప్పుడు – పొగడ్తలైనా, తెగడ్తలైనా సరే, వాటిని గురించి నేను – నానుండి నేనే – ఇంకొంత వివరాన్నీ, జాగ్రత్తనూ ఆశిస్తాను. తొందరపడి నా అభిప్రాయాన్ని నేనే ఒప్పుకోను. ఈ వివరం, జాగ్రత్తా – అంటే intellectual and artistic discipline కోసం శ్రమించకపోతే గనుక ఈ తొలిచూపు అభిప్రాయాలు, స్థూలమైన నిర్ధారణలూ ఉవాచలుగా, లేకుంటే అంతకంటే కనిష్టంగా, ఇదివరకు చెప్పుకున్నవి – మంకుతనం, హేళన ఇలా పతనమౌతాయి. ఎందుకిలా అవుతాయంటే, సృజనను అంచనా వేసుకొనే పనిలో పరిగణించవలసిన అంశాలు సృజన, కవీ, అప్పటికే స్థిరపడిన ఇతరుల అభిప్రాయాలూ – ఈ మూడింటిని మాత్రమే కాదు; దీనిలో పాఠకుడు – అంటే అభిప్రాయంలో తేడాని ప్రకటించుకుంటున్నవాడు – అతని స్వభావాన్నీ, అభిరుచినీ కూడా పరిగణన లోనికి తీసుకోవాలి. (ఇంగ్లిష్‌లో దీన్ని Says who? అని అంటారు కదా.) ఎందుకంటే సృజన కవీ, పాఠకుడూ జట్టుగా నిర్వహిస్తున్న ప్రదర్శన. పాఠకుని, విమర్శకుని సంకల్పం, లక్ష్యాలు, అనుభవం, ఔద్వేగిక స్థితి, వీటిని ప్రభావితం చేసే సాంఘిక పరిస్థితులూ ఇవి సృజన ‘ప్రదర్శన’ను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే ముందు నేను అంటున్న జాగ్రత్తల్ని గురించి:
ఒకటి – సృజనల ఎంపిక లోన నేను స్వీకరించలేకపోయిన వాటిని గురించి అంతరాంతరాల్లో కూడా నిర్హేతుకమైన హేళన, తిరస్కారం లేకుండా ఉండాలని. నేను నాణ్యమైనవని ఎత్తి చూపే వాటిని గురించి నిర్హేతుకమైన స్తుతి, మెచ్చికోలు, పూజనము లేకుండా ఉండాలని. రెండు, వివరం అంటే – శక్తి కొద్దీ వివేచన చేసి ఆ అభిప్రాయాన్ని ఎందుకు ప్రతిపాదిస్తున్నానో కనీసం నాకు నేను వివరించి చెప్పుకోగలగాలి. అందుకు వివరించి రాయటం ఉపయోగిస్తుంది. మనసులో ఏముందో రాస్తే తప్ప ఆ రాసేవాడికే తెలియదు. ఈ విషయాన్ని గురించి Writing as Thinking అని విస్తారంగా పరిశోధన, చర్చా ఉన్నాయి. నాకు అలా లోతుల్లోకి పోయి ఆలోచిస్తే తప్ప సంతృప్తి – అంటే satisfaction లేదు. మూడు – అలా ఎత్తి రాసుకున్నా తర్వాత ‘జాగ్రత్త’ అంటే ఏమిటంటే ఈ రాస్తున్నదంతా, అభిప్రాయమంతా ముందుగా కేవలం ఒక్క మనిషికి సంతృప్తికరంగా (satisfying) తోచినది – అంటే కేవలం One man’s opinion అని జ్ఞాపకం పెట్టుకోవటం. ఎంతోమంది ముందుగా ఎవరి మటుక్కి వాళ్ళూ, ఆపైన కలిసి వివేచన – అంటే చర్చ – చేసిన పిమ్మట ఆ సమాజపు అభిరుచి ఒకటి ఆవిష్కృతమయ్యే అవకాశమైతే ఉంది. విడి విడిగా ఉన్న పాఠకుల వైయక్తికమైన ఔద్వేగిక వ్యవస్థలూ, లక్ష్యాలూ, సంకల్పాలూ కలిసి అంతిమంగా ఈ అంగీకారానికీ దిశనూ, స్వరూపాన్నీ నిర్ణయిస్తాయి.
మూడవది: ఇదివరకే చెప్పుకున్నట్టు, సృజనతో ముడిపడి ఉన్న అన్ని పనులూ – రాయడం, చదవటం, ఆలోచించటం, చర్చించటం, ప్రచురించటం, విమర్శ చెయ్యటం ఇలాంటివన్నీ చాల కష్టతరమైనవి, అడుగడుగునా సంశయాన్ని కలిగించేవి. మాస్లో (Abraham Maslow), యుంగ్ (Carl Jung) వంటివాళ్ళు ఎందరో చెప్పినట్లుగా ఈ పనులు సృజనశీలురకు చెయ్యక తప్పనివి; తప్పనిసరి పనులు, కానీ చాల కష్టమైన పనులు, ఒంటరి పనులు. పోనీ కనీసం వెచ్చించిన కష్టానికీ, సమయానికీ ప్రతిఫలమైనా దక్కుతుందా అంటే జీతం, బత్తెం ఏమీ ఇవ్వలేని పేద పనులు. పైపెచ్చు, మిగతా విద్యల్లాగ వీటికి ఎలాంటి తర్ఫీదూ, శిక్షణా, అభ్యాస వ్యవస్థా కనీసంగా కూడా అందుబాటులో లేవు. సంగీతం, చిత్రలేఖనం వంటివి శిక్షణ, అభ్యాసం లేకుండా ఎవరూ చేపట్టరు. సారస్వత సృజనకి, విమర్శకి, ప్రచురణకి, అమ్మకానికీ, ప్రచారానికీ ఈ నియమం లేదు. కవి, విమర్శకుడూ కావటానికి రాయటం, చదవటం వచ్చి, ఆ రాసినది అందమైన బొమ్మలతో, ఆకర్షణీయంగా అచ్చు వేసుకోగలిగితే చాలు. ఇంతే కాక, సృజనాత్మకమైన పనులు అంగారక ప్రక్రియలు (Organic processes). అంటే మొక్కలు పెరగడం వంటి జీవ క్రియల వంటివి. గోడ కట్టటం, కుర్చీలు చెయ్యటం వంటి భౌతిక నిర్మాణాలకు భిన్నంగా, అవి ఎప్పుడు ఎందుకు మొలకెత్తుతాయో, ఎలా పెరిగి ఎంత పెద్దవై ఏ రూపాల్ని దాల్చి ఏ పువ్వులూ పళ్ళూ కాస్తాయో, అసలు ఫలిస్తాయో లేదో ఏ శాస్త్రమూ, తర్కమూ ఖచ్చితంగా చెప్పలేని పనులు. ఈ పనులు తలకెత్తుకొనే వాళ్ళు అందరూ ‘కవులే’. వీళ్ళ మనస్తత్వాలు సున్నితంగాను, పని వేదనాభరితంగానూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కావాలని అసంతృప్తికరమైన కధల్నీ, కవితల్నీ రాయాలనీ, చదవాలనీ, పనిమాలా ప్రచురించాలనీ ఎవరూ అనుక్కోరు. అందుకు భిన్నంగా ‘ఉన్నతమైన’ సాహిత్యం కావాలనీ, తాము చేస్తున్నది మెరుగైన పని అనే అనుకుంటారు. మనం చేసే పని, అద్దంలో మన మొహం లాగే ‘ఉత్తమ’మైందనే అనుకుంటాము. తీరా వీధిలోకెళ్ళేక ఎవరైనా చూసి చెప్తే ఏమైనా తెలుస్తుంది. స్వయంగా బలమైన, సృజనాత్మకమైన అనుభవం ఉన్న గురువులైతే వ్యక్తిగతమైన బలహీనతలను నిగ్రహించుకొని, సృజన అనుభవమే ప్రాతిపదికగా, కేవలం అభ్యాసం కోసం ఉద్దేశించి, దయతో తప్పుల్ని దిద్దుతారు. అది వాళ్ళకు అనివార్యమైన ప్రవృత్తి. సృజన దిద్దుబాటు ఈ ఒక్క తరహా మనుషులు – అంటే ఉపాధ్యాయుల వలన మాత్రమే సఫలమౌతుంది. సమాజం అందుకే గురువుల్ని గౌరవిస్తుంది. అకవి, లౌక్యుడు ఈ విషయాన్ని గ్రహించుకొనే ముందుగా ‘ఆచార్య’ పీఠం, అంటే సాహితీ పౌరోహిత్యం అన్నదాన్ని పట్టుదలగా సాధించుకుంటారు.
కళాకారుల పనుల తీరు ఇంత కష్టం. ఉదాహరణకు యుద్ధం, పర్వతారోహణ, వ్యాపార నిర్వహణ (Management) వంటి పనులు చాల సంక్లిష్టంగా, అస్పష్టమైన తోవలు, చిక్కుముళ్ళతో ఉంటాయి. సృజన, జీవితమూ రెండూ ఇలాంటి వ్యవహారాలేనని త్రిపుర; మనుషులకి బతకడం తప్పదు, కవులకు సృజన తప్పదు. బతకడం కంటే కూడా సృజన ఒంటరి పని. అందుకే ఈ రెండిటినీ కలిపి తలకెత్తుకొనేవాళ్ళు – కవులు అంటే త్రిపురకు ఒకరకమైన జాలి వంటి సానుభూతి అని అన్నాను. ఎవరైనా మనుషులో, సమాజాలో కష్టంలో ఉన్నారని తెలుసుకుంటే వాళ్ళలోని ‘లోపాల్ని’ తప్పనిసరై ఎత్తి చూపించవలసినప్పుడు కూడా ఆ పనిలో సానుభూతి, కరుణ కనిపిస్తాయి. సృజనాత్మకమైన పని – అంటే కళ – నిర్వహణ, అభివ్యక్తి ఎంత కష్టతరమో చరిత్ర నుండి దృష్టాంతాలను పరామర్శిస్తూ పోతే అదే ఒక పెద్ద గ్రంధమౌతుంది. కాని ఈ విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోగలిగితే అది ఒకరకమైన వందనానికి, కరుణకు దారితీస్తుందని త్రిపురను చూసి చూసి అనుకున్నాను. జేమ్స్ డికీ (James Dickey) అని అమెరికన్ కవి, అంటున్నారు: “A poet trains himself to stand out in a storm and be struck by lightning. If he is lucky enough to be struck six times, he becomes immortal. Randall Jarrell said it and he’s right.” ఈ సంగతి ఒప్పుకోగలిగి, గుర్తు పెట్టుకోగలిగితే, ఇలాంటి పనుల ఫలితాల్నీ, ఈ పనులు చేసే వాళ్ళ స్వభావాల్నీ పరిశీలించేటప్పుడు కాఠిన్యం, కరుకైన విమర్శా దృష్టి కంటే సానుభూతితో కూడిన సదసత్సంశయం సహాయంగా ఉంటుంది. త్రిపుర, నారాయణ రావు, బిపిన్ వీళ్ళ ముగ్గురి దృష్టీ ఇలాగే ఉంది, కాని చాలా వేరు వేరు కారణాల వలన, దృక్పధాల వలన ఇలా ఉంది. ఇప్పటికి క్లుప్తంగా త్రిపురది తాత్వికము, సృజనాత్మకమైన దృక్పధం, నారాయణ రావు గారిది భౌతికము – భాషను, ఆలోచననూ భూమికగా చేసుకున్న దృక్పధం, బిపిన్‌ది మనస్తత్వాన్ని, సంకల్పాన్నీ భూమికగా చేసుకున్న దృక్పధం.
ఇలాంటి జటిలమైన పనులు చేసినప్పుడు ఫలితం కనీసం చేసినవాళ్ళకు సంతృప్తికరంగా ఉండేలా పూర్తి కావడమనేదే చాలా అరుదైన సంగతి. అది ఇతరులందర్నీ – అంటే ఒక సారస్వత సమాజాన్ని మొత్తం సంతృప్తి పర్చాలనీ, ఆకట్టుకోవాలనీ అనుకోవడం గొంతెమ్మ కోరిక అవుతుంది; అది తీరడానికి సామరస్యం, సుహృద్భావం, ప్రచారం వంటివే దొడ్డి దోవలు కాబట్టి ఆ ఉబలాటం జల్పానికి, ప్రచారానికీ, సుహృద్భావ పూరితమైన సాహితీ స్నేహ మండళ్ళకూ దారితీస్తాయి. ఈ వ్యవహారాన్ని అర్ధం చేసుకొని తిరస్కరించిన సృజనకారులు ఎందరో ఉన్నారు: JD Salinger, Samuel Beckett, Charles Bukowski, త్రిపుర, నామిని ఇలాగ. వీళ్ళు పొగరుబోతులు, సుహృద్భావం తెలియని కఠినాత్ములూ కారు; తప్పనిసరి అయి, తమ సృజన చుట్టూ లౌక్యులు చేరకుండా కంచె కట్టుకున్నారు. దీన్ని గురించి Iowa Writers Workshop నుండి ఉపాధ్యాయులు కొందరి హెచ్చరికలు ఉన్నాయి. చాన్నాళ్ళ కిందట ఒక రోజు మా సంగీతం టీచరుగారు కొంచెం పరాగ్గా ఉన్నారు. ఏమయిందని అడిగేను. ఆవిడ దగ్గరికి వేరే దేశం నుండి ఒకావిడ వాళ్ళమ్మాయిని తీసుకొచ్చేరు. ఆ అమ్మాయి వయసులో చిన్నదే గాని చాలా ప్రతిభాశాలి అని, అమెరికాలో అప్పటికే కచేరీ చేసిందనీ, తనకి పాఠం సరిగ్గా చెప్పగలరో లేదో తెలుసుకోవాలి కాబట్టి ముందు ఏవైనా రెండు పాడి వినిపించమని టీచరు గార్ని అడిగింది ఆవిడ. టీచరు గారు అలాగే పాడతాను కాని ముందుగా ఆ పాప కూడా ఏదైనా పాడితే బాగుంటుందని అడిగేరు. ఆ అమ్మాయి పాడింది విని ‘మీ పాపకి ప్రతిభ ఉందన్న మాట నిజమే గాని, తను ఎంతో ఆత్మ విశ్వాసంతో పాడుతున్నదాన్లో తప్పులున్నాయి. అవి దిద్దుకొనేలాగ గీతాల నుండి మొదలుపెట్టాలి.’ అన్నారు. అందుకు ఆ పాప, వాళ్ళమ్మగారు కొంచెం కోపగించుకుని ఏదో సర్దిచెప్పి వెళిపోయేరు. మా టీచరు నాతో “ఇది వరకు, పాత రోజుల్లో ఎన్నో సంవత్సరాల పాటు అభ్యాసగానం చేసిన తరవాతే సభాగానానికి గురువు గారు అనుమతించేవారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల చేత కూడా ఏ మాత్రం ప్రతిభ ఉన్నా చాలు, అభ్యాసాన్ని అక్కర్లేదనుకొని సభాగానం, అంటే కచేరీలే చేయిస్తున్నారు. ఇది ఆ పిల్లల ఎదుగుదలకు అడ్డం వస్తుంది,” అని వాపోయారు.
అది విని నేను ఆవిణ్ణి ఓదార్చాలని గారెట్ (George Garrett) అని ఇదివరకు చెప్పుకున్న ఉపాధ్యాయుడు – ఆయన మాటలు చెప్పేను. ఆయన ఏమన్నారంటే కాల్పనిక సాహిత్యంలో ఇలా అభ్యాసం లేని సభాగానం చాల ప్రబలంగా ఉందని. కాల్పనిక సృజనలో మూల్యాంకనం, దానిమీద ఆధారపడి ఉన్న కీర్తి, ప్రతిష్టా ఇవే కాకుండా, వీటికి ఎడంగా ఎన్నో ఆనందాలున్నాయి, ప్రయోజనాలున్నాయి, వాటి మీద ధ్యాస పెట్టండని ఆయన విద్యార్ధులకు విన్నవించుకుంటున్నారు. చదవడం చాల ఆనందం కలిగించే పని అని, మంచి సృజనలను చదివితే ఇలా ఉంటుందనీ పాఠకులు పదే పదే చెప్తుంటారు. అలాగే కవులకు రాయడం అనే తప్పనిసరి పనిని ప్రారంభించి పూర్తిచెయ్యటంలో ఆనందం, తెరిపి. విమర్శకులు, పరిశోధకుల వంటి బుద్ధిజీవులకూ, జిజ్ఞాసులకూ ఇంతే. George Garrett అంటున్నారు: “Look, every day I see walking up this street, up the hill, in time for the school bus, kids from the local junior high school. For some reason everybody in Charlottesville has to have a musical instrument. So you see trombones and cornets and violins. Probably nobody, despite all the effort that’s being spent, not one person is going to be a violinist at Carnegie Hall or play with a major band. But in music nobody worries about it. No one sees it as waste. In writing, it ought to be the same.” సంగీతం నేర్చుకొనే ప్రతీ ఒక్కరూ కార్నెగీ హాల్‌లో కచేరీ ఇవ్వాలని అనుకోరు. సాహిత్యంలో ఇలాక్కాదు అని ఆయన అంటున్నారు. అభ్యాసంలోనే చాల ఆనందం ఉంటుంది, ఎన్నో ప్రయోజనాలుంటాయి. మూల్యాంకనం అభ్యాసాన్నుండి దృష్టిని మళ్ళించి, సభాగానాన్నే ప్రోత్సహిస్తుంది. పాశ్చాత్య దేశాల్లోన అభ్యాసం కోసం మరుగ్గా, మర్యాద డేగ చూపుకు దూరంగా Writers Workshop; Artists Workshop వంటివి పరిమితమైన వేదికలుంటాయి. ఇలాంటివి కవులకూ ఉపయోగపడతాయి.
Iowa Writers Workshop నుండి ఉపాధ్యాయుల్లో ఒకరు – T. Coraghessan Boyle – ప్రజాస్వామికమైన మర్యాద నుండి, సుహృద్భావము, సామరస్యపూర్వకమైన మర్యాద నుండీ సృజనకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గురించి, అలాంటి మర్యాద పట్ల తమ వైఖరిని గురించీ వర్ణిస్తున్నారు: “I used to be more democratic. Now I refuse to hear the author talk. The author’s words have to communicate to the audience on the page; that’s what this is all about. … I go through every line and it’s got to be perfect. I’m very hard on them in that sense. There’s none of this “we love you, Joe, and we love your story.” That’s useless to everybody, and I’ve been in workshops like that, everyone so supportive, loving each other. Great! But what’s accomplished? Nothing. I’m very tough line-to-line.” ఇది కాల్పనిక సృజన ప్రబలమైన, నైసర్గికమైన స్వభావంగా ఉండే ఉపాధ్యాయుని వైఖరి.
నైసర్గికమైన వందనాన్ని గురించి ఇంకొక ఉపాధ్యాయుడు Gordon Lish చెప్తున్నారు: “I tend to be very suspicious of those who think themselves very greatly talented. And I tell them, “What do you want to come to me for? If you think you’re writing beautifully now, what do you think I can add to that?” “Well, everyone says you’re great.” I say, “But my greatness resides in my getting rid of everything you think is beautiful.” No. I’m much more inclined to want to bet on somebody who is approaching these matters humbly and who sees themselves virtually deprived, but who for crazy reasons wants to be a writer.” విద్యార్ధుల పట్ల త్రిపుర వైఖరి ఇలాగే ఉంటుంది. మూల్యాంకనం దిశగా జారుతున్న చర్చను ఆయన ‘ఆఁ?.. అహఁహాఁ…’ అని ఒకటి రెండు మాటలు మాత్రం అంటూ పట్టుదలగా దారి మళ్ళిస్తారు, అనిర్ణేయకమైన సృజన అనుభవం వైపు, అభ్యాసం వైపు.
15.
సృజన, అంటే కావ్యపు ఆత్మకు ఆయువుపట్టు, అది పరికల్పించే ఔద్వేగిక ఆవరణ. ఇది ప్రధమంగా అప్రయత్నంగా, అసంకల్పితంగా వెలువడేది, ఆ పైన సంకల్పించి, ప్రయత్నించి మెరుగులు దిద్దుకొనేదీ. దీనికి ఆయువు పట్టు ఏమంటే సృజన శీలి, అంటే కవి సారస్వత మూర్తిమత్వం, అంటే Writer’s Self; ఆయన అంతరంగం – అంటే Writer’s Mind. సృజనలో ఔద్వేగిక వ్యవస్థ స్వరూపం, స్వభావాన్ని గురించి విశేషమైన పరిశోధన, చర్చ ఉన్నాయి. కవి భావావేశం అని వ్యవహరించే అతని సృజన తత్వం, అది ఒక్కొక్క సందర్భంలో ఒక్కో సృజనగా ప్రత్యేకమై వెలువడే ఔద్వేగిక స్థితి అతను ప్రయత్నం చేసి పొందేవీ, కొత్తగా సంపాదించుకొనేవీ కాదు. అదివరకు స్వభావతః తనలో ఉన్నదాన్నే తరచి చూసుకొని మళ్ళీ మళ్ళీ కనుక్కొంటూ వెలువరించుకొనేవి. నేను సృజనలో దేనికోసం చూస్తున్నాను? అని పైన అడిగినదానికి జవాబు ఏమంటే – సృజనను మచ్చు చూస్తూ నేను ప్రధమంగా ఈ ఔద్వేగిక ఆవరణపు స్వచ్చత కోసం, పటుత్వం కోసం, కాంతి కోసం చూస్తున్నాను. ముందుగా ఇది ఉంటే ఆ పైన ఇంకెన్నింటి కోసమో పట్టి చూడాలని అనిపిస్తుంది. ఇదివరకటి లక్షణ సిద్ధాంతాల్లో రస మతమని చెప్పేదానికీ, అది ప్రతిపాదించే నవ (దశ) రసాలకూ ఈ ఔద్వేగిక ఆవరణకూ సంబంధం ఉంది. అంతే కాక సంగీతంలో రాగానికీ, లయకూ ఈ ఔద్వేగిక స్థితిని కల్పించి, నియంత్రించే అద్భుతమైన శక్తి ఉంది. అందుకే సంగీతం నుండి రాగం, లయ సాహిత్యంతో కలసి పాటలోని ఔద్వేగిక ఆవరణను ఉద్దీపనం చేస్తాయి. ఈ రెండింటికీ నర్తన, హావ భావాలు తోడయితే అందివచ్చే నాట్య కళలోన ఔద్వేగిక స్థితిని అనుభవించే అవకాశం మరింత ప్రస్ఫుటంగా ఉంది. భరత ముని రస మతానికి నాట్యమే ప్రాతిపదిక అంటారు. కవులు కొందరు, నారాయణాచార్యులుగారి వంటి వాళ్ళు – కవిత్వంతో ఆగక, సంగీతం, నాట్యం నేర్చుకోవడం ఎందుకంటే మనుష్యుల సృజన అనుభవానికి సారస్వతం, సంగీతం, చిత్రలేఖనం కంటే ఈ అన్నింటి సృజన వ్యవస్థలనూ కలుపుకొని, పరాకాష్టకు తీసుకొని పోగలిగే శక్తి ఒక్క నాట్యానికే (Dance Drama) ఉంది. ఇది వరకు యక్షగానం, బుర్ర కధ, హరి కధ వంటి కళారూపాలు, ప్రస్తుతం సినిమాలూ విశేషంగా ప్రజాదరణ పొందటానికి ఇదే కారణం. సృజనకారుడికి చూస్తే సంతృప్తి లేదు, తనంత తానుగా దాన్ని నిర్మించాలి.
కాల్పనిక సృజన – అంటే కవిత్వం, కధ వంటి కళారూపాల్ని అనుభవిస్తున్న పాఠకుడూ, సృజిస్తున్న కవీ కూడా ఉద్వేగాలనూ, భావాల్నే కాదు, ఊహా చిత్రాలనూ, లయనూ, నర్తనను కూడా తామే చిత్రకారులూ, గాయకులూ, నర్తకులూ అయ్యి తమ మనోరంగం పైన సృష్టించుకుంటున్నారు. తమ ప్రదర్శనను తామే నిర్వహించుకుంటున్నారు. ఇదివరకే చెప్పుకున్నట్టు, కాల్పనిక సృజన పాఠకుని మనో రంగం పైన కవీ, పాఠకుడూ భిన్న కాలాల్లోన జట్టుగా నిర్వహిస్తున్న ప్రదర్శన. దీనికి ఒక నమూనా (Model) దృశ్యాభాస (simulation); రెండవది ప్రయాణం (Transportation); మూడవది కల (Dream). ఈ మూడింటిలో మొదట దృశ్యాభాసను గురించి. ఉదాహరణకు ఏదైన ఒక సినిమాను చూస్తున్నప్పుడు తెర మీద నటులు ఆ కధ అనుభవాన్ని ప్రేక్షకులకు ఆభాస అంటే simulate చేస్తున్నారు. మనకు వచ్చే కలలు ఇలాంటిదే దృశ్యాభాసకు ఇంకొక తరహా ఉదాహరణలు. ఓట్లీ (Keith Oatley) అనే శాస్త్రజ్ఞుడు, ఆయన అనుయాయులు గత పాతికేళ్ళుగా కాల్పనిక సృజనను గురించిన ఇలాంటి విషయాల్ని రక రకాలుగా పరిశోధిస్తున్నారు. Why Fiction May Be Twice as True as Fact: Fiction as Cognitive and Emotional Simulation అన్నది ఇందుకు ఒక ఉదాహరణ. స్థూలంగా ఆయన చెప్పిందేమంటే కాల్పనిక సృజనను చదువుతూ పాఠకుడు ఒక కల వంటి దృశ్యాభాసను తనకు తానుగా నిర్మించుకుంటున్నాడు. ఉద్వేగాలు (Emotions) ఈ సిమ్యులేషన్‌లో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. ఈ ఉద్వేగాలకు మూలాలు పాఠకుల స్వీయ చరిత్ర (autobiographical past) లోన, వాళ్ళ సాంస్కృతిక అనుభవ సంచయాల్లోన, వాళ్ళ జీవితాశయాలు, అనుభవాల్లోనా నిక్షిప్తమై ఉంటాయి. అంటే ఒక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కాపీలు పదిమందిమి విడి విడిగా వాడి చూస్తుంటే దాని సిమ్యులేషన్ పదిమందికీ ఒక్కలాగనే అనుభవమౌతుంది; దాన్లో కల్పన ఏమీ లేదు కాబట్టి. అదే ఒకే సినిమా డీవీడీని పదిమందిమి విడి విడిగా సినిమా వేసుకొని చూస్తే ఆ పది అనుభవాలూ దాదాపు సమానంగానే ఉన్నా, బొమ్మలు, మాటలు, పాటలు ఎదురుగా ప్రతిపాదిస్తున్న దృశ్యాభాసను మనం కొంతవరకు మనదే ప్రత్యేకమైన ‘కధ’గా మన అంతరంగాల్లో పునర్నిర్మించుకుంటాము. కధ, కవితల వంటి సారస్వత కల్పనల్లో ఇలాంటి దృశ్యాభాసను మనం ఎవరికి వాళ్ళం మనకు మాత్రమే ప్రత్యేకము, ఆంతరంగికమైన మస్తిష్కపు ఔద్వేగిక యంత్రాంగం మీద run చేసుకుంటున్నాము. అందుకే చదవటం అనే ఈ దృశ్యాభాస ఒక్కొక్క పాఠకునికీ తనకే ప్రత్యేకమైనది. కాయితం మీద వాక్యాలుగా మనకు ప్రత్యక్షమయ్యే రచన, సృజన అనే ప్రక్రియ గొలుసు కట్టులో కేవలం చిట్టచివరి అంచె. ఆ ఒక్క రచననే పాఠకులు ఒక్కొక్కరి ఔద్వేగిక భూమిక మీదా ఒక్కోలాగ ఎంతో భిన్నంగా, తమకే ప్రత్యేకమైన దృశ్యాభాసగా ప్రదర్శించుకుంటున్నారు. ఈ భూమికను నిర్వచించేవి ఉద్వేగం (Emotion), సంకల్పం (Motive), లక్ష్యం (Goal).
ఓట్లీ మాటల్లోనే: “Emotions happen when events occur that relate to our goals (see the schema for stories offered above) — i.e. to those concerns that are important to us. So an emotion not understood means that something has happened with an obscure implication. Emotions are at the center of literature because they signal what is personally important, and because they often have this element of the mysterious. The simulations which are novels, plays, movies and so forth, can allow us to explore emotions and find out more about the intimate implications of these elements in our lives.”
పాఠకుడు, విమర్శకుడు వీళ్ళు సృజనను పరామర్శిస్తున్నప్పుడు వాళ్ళ స్వంత లక్ష్యాలు, ఆకాంక్షలూ (Goals) తప్పనిసరిగా వాళ్ళ సృజనానుభవాన్ని ప్రభావితం చేస్తున్నాయి. సృజన అనుభవం తీవ్రమైన, అనివార్యమైన స్వభావంగా ఉన్నవాళ్ళ గమ్యం, ఆకాంక్షా ఆ సృజనానుభవమే; దాని కోసమే వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఆ వెదుకులాట వాళ్ళ సంకల్పాన్ని, లక్ష్యాన్నీ నిర్దేశిస్తుంది. అంతే కాక, ఓట్లీ అవగాహనలోన ఈ సంకల్పమే వాళ్ళ ఔద్వేగిక ఆవరణనూ నిర్దేశిస్తున్నాది. బలమైన కవి సజ్జనుడూ, సచ్చీలుడూ ఇలాగేం కాడు; మహాత్ముడూ, సత్య హరిశ్చంద్రుడూ ఇలాగా కాడూ. బలమైన కవి ‘నిజాయితీ’కి ప్రాతిపదిక ఏమంటే తన సృజనకు మాత్రమే ప్రత్యేకము, మౌలికము, నైసర్గికమైన ఈ ఔద్వేగిక ఆవరణ ఒకటి ఉందని ఒప్పుకొని, దాన్ని కనుక్కొని, స్థిరం చేసుకొని, ఆ ఒక్క మర్యాదకు మాత్రం నిబద్ధుడై తన సృజనావరణంలో ప్రకటించుకోగలిగిన శక్తి. దీనికి విరుద్ధమైన ప్రవర్తననే నామిని ‘జూటా’ అని అంటున్నారని ఇప్పటికి ప్రతిపాదన మాత్రం చేసి, మీదటికి వివరించి రాస్తాను. ఈ నిబద్ధత ఒక విధమైన నిష్ట. కవి తనకు గత్యంతరం లేక – అంటే ఒక ఒదిలించుకోలేని జబ్బులాగయ్యి, ఇలా ఉంటున్నాడు. ఇంతకు మించి పాఠకుని ‘నిజాయితీ’కి ప్రాతిపదిక ఏమంటే, అతను కూడా సృజనను తను చదువుతున్నప్పుడు, అంటే simulate చేసుకొని, తన అంతరంగంలో పునర్నిర్మించుకుంటున్నప్పుడు – తన సారస్వత మూర్తిమత్వానికి మౌలికము, ప్రాకృతికము, నైసర్గికమైన ఔద్వేగిక ఆవరణను ప్రేరేపించడంలో, ఉద్దీపనం చేయటంలో ఆ సృజన ఎలా సఫలమౌతోందో, లేదూ విఫలమౌతోందో ముందుగా అనుభవించి, ఆ పైన వివేచించి కనుక్కొని, స్థిరం చేసుకొని, ఏ మర్యాదా లేకుండా తన సృజనావరణంలో ప్రకటించుకో గలిగిన శక్తి. ఈ రెండు వ్యాపారాల మీదా కవి, పాఠకుల జాతి, కులం, లింగం, మతం, ఆచారం, వ్యవహారం, చదువు, అంతస్తు ఇలాంటి సాంస్కృతిక కారణాల ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇవి కవి, పాఠకుల ఆకాంక్షలని, ఆపేక్షనూ, సంకల్పాన్నీ, తద్వారా ఔద్వేగిక స్థితినీ ప్రభావితం చేస్తున్నాయి. వీటిని అర్ధం చేసుకొని ప్రకటించుకోవడానికి ఆధునికులకు సంకోచం. లోక మర్యాద సృజన మర్యాదకు అడ్డం వస్తుంది.
పరిశీలించి చూస్తే, సినిమాలు చూసేటపుడు, పుస్తకం చదివేటప్పుడు, పాట వినేటప్పుడూ కూడా మనం ఆ సృజన ప్రతిపాదించే అనుభవాన్ని మనవైన గతానుభవాలతో ఔద్వేగిక సమన్వయం చేసుకొనే ప్రయత్నమే చేస్తున్నాము. ఈ సమన్వయం బొత్తిగా పొసగకపోతే ఆ సృజన ఆ పాఠకుని విషయంలో సఫలం కావటం లేదు; ఎక్కడో తేడా వస్తున్నాది – అంటే something has happened with an obscure implication. ఏమవుతోందంటే ఆ సృజన ప్రతిపాదించే అనుభవం ఆ పాఠకుడి వ్యక్తిగతమైన ఆకాంక్షలకు (Goals), గతానుభవానికీ అనువుగా లేదు, లేకుంటే అడ్డం వస్తోంది. ఈ విషయం పరిశీలించి చూస్తే వ్యక్తిత్వం, ప్రవృత్తి, ఆసక్తి వలన స్థిరపడే దృక్కోణం, సాంస్కృతిక అనుభవం, కులం, లింగం, ప్రాంతం, అంతస్తు వంటివి సృజన ఔద్వేగిక అనుభవాన్ని ఎంత ప్రబలంగా ప్రభావితం చెయ్యగలవో, పరిమితం చెయ్యగలవో అవగతమౌతుంది. ఎంతో వైవిధ్యం ఉన్న ఈ ఔద్వేగిక అనుభవాలు ముందుగా చాల వ్యక్తిగతమైనవి కాబట్టి సృజన లక్షణాలను గురించిన వివేచనకు వాటి పరిశీలన అవసరం.
ఔద్వేగిక ఆవరణను గురించి మరింత వివరించే ముందు, కొన్ని ఉదాహరణలు – తెలుగు, ఇంగ్లిష్ నుండి. ఒకటి స్వంతం అని ముకుంద రామారావు గారి కవిత. రెండవది ఆదివారం మధ్యాహ్నాలు అని రామినేని లక్ష్మీ తులసి గారి కవిత. మూడవది తిలక్ కవిత గగనమొక రేకు, కన్నుగవ సోకు అని. ఇంగ్లిష్ నుండి రెండు కవితలు: Alan Dugan కవిత Love Song: I and Thou అని; ఇంకా Kim Addonizio కవిత What Do Women Want? అని. ఈ కవితలన్నీ నాకు మొదటిసారి చూడగానే మళ్ళీ పట్టి చదవాలి అనిపించేయి. ఈ ఆహ్వానంలో, అనుభవంలో నా గతానుభవం, నావైన ఆకాంక్షలకూ చాలానే పాత్ర చాలా ఉంది. ఈ కవితలకు చాలా మందే పాఠకులు ఉండుంటారు. వాళ్ళలో ఏ ఒక్కరి అనుభవం నాకు వివరంగా తెలిసే అవకాశం లేదు. కాని నా స్వంత అనుభవమైతే నాకు తెలుస్తుంది. దృశ్యాభాస లోన ఔద్వేగిక ఆవరణ ఎలా నిర్మితమౌతుందో వివరించడానికి మాత్రమే, అంటే illustration కోసం వీటిని ఎత్తి రాస్తున్నది. అంతకు మించి ఇవి ‘మంచి’ కవితలు అని నిర్ధారణ, సిఫారసు ఏమీ లేదు.
స్వంతం కవిత నన్ను ఎందుకు ఆకట్టుకుందో చెప్పాలంటే ఈ కవితను నేను నా మనోఫలకం మీద – అంటే సినిమా తెర మీద – మొదటిసారిగా ఎలా దృశ్యాభాస చేస్తున్నాను అనేది వివరించాలి. ఇది చదివినప్పుడల్లా నాకు ఒకాయన జ్ఞాపకం వస్తారు. మాటవరసకి ఆయన పేరు అప్పల్రాజుగారు. ఆయనకి సుమారు ఏభయ్యేళ్ళుంటాయి. రెండంతస్థుల మేడ మీద మూడో అంతస్థును కట్టిస్తున్నారు. బనీను, లుంగీ కట్టుకొని నిలబడి కొళాయి నీళ్ళతో స్లాబులు, గోడలు దగ్గరుండి తడిపిస్తుంటారు – కూలీలతో, వాళ్ళావిడతోనూ. ఒక రోజు నేను, మా బావ దూరం నుండి చూస్తూ నడిచొస్తున్నాము, ఆయన ఇంటి ముందర స్వయంగా దగ్గరుండి ఆవుకి తిండి తినిపిస్తుంటే. “రాజుగారు ధర్మాత్ముడు! ఆవుకి చపాతీలు తినిపిస్తున్నారు దగ్గరుండి!” అని మా బావ అన్నాడు. దూరం నుండి చూసి చపాతీలనుకున్నాము. మా బావ అప్పటికే ఆయనకి నమస్కారం పెట్టి “ఏటండీ రాజుగారు? గోమాతకి చపాతీలు తినిపిస్తున్నారా దగ్గరుండి?” అని అనీసేడు. తీరా దగ్గిరసా చూసేసరికి ఆయన ఆవుకి తినిపిస్తున్నవి చపాతీలు కాదు, అట్ట డబ్బాల నుండి చింపిన కాయితాలు. ఆయన ‘ఎలాగూ ఈ ఆవు ఎప్పుడూ కాయితాలు తింటుంది, వృధాగా పారెయ్యటం ఎందుకు, తనే స్వయంగా తినిపిస్తే గోసేవ చేసిన పుణ్యం’ అన్నట్టు అనుకున్నారట. ఆ దృశ్యం నా జ్ఞాపకాల్లో అలా ఉండి పోయింది.
ఈ కవితలోని పెద్ద మనిషి మగవాడు అని స్థిరంగా చెప్పడానికి, ఆయన తన భార్యకే ఆ సూచనలన్నీ ఇస్తున్నాడనుకోడానికీ ఎలాంటి ఆధారాలూ లేవు. నిజానికి ఇది ఒక యజమాని కూలీతో, భార్యే భర్తతో, లేకుంటే ఒక స్నేహితుడు ఇంకొకనితో అంటున్నట్టూ, లేదంటే కవి తనలో తనే స్వగతంగా అనుకుంటున్నట్టూ రక రకాలుగా రూపించుకొనే ఆస్కారమయితే ఉంది. కానీ నా దృశ్యాభాసకు నాయకుడు మాత్రం రాజుగారు. ఆయనే ఆవుకి తినిపించడం అయిపోయేక మూడో అంతస్థు డాబా మీదికెళ్ళి తన భార్యతో మాట్లాడుతున్నారు. ఈ కవితలోని నాయకుడు లౌక్యుడు, పెద్ద మనిషి తరహాగా తన స్వంతాన్ని కాపాడుకొని, పోషించుకొని నెగ్గుకు వచ్చే సామాజికుడు. ఒక్క చుక్కని కూడా ఎటూ పోనీయడు. ఈ కవిత చదివే ప్రతీ సారీ నాకు కలిగించే ఉద్వేగాలు ఒకరకమైన వెక్కిరింత, తిరస్కారం – phonies అని సాలింజర్, మొగలాయీలు అని నామిని, ‘మనో రోగస్థుడై దేహి’ అని ధూర్జటి, Gugg అని Charles Bukowski వంటివాళ్ళు చేసినవంటి హేళన. ఈ విషయమంటే నాకు ఒక ఆర్తి అనిపించేలాగ చాల ప్రగాఢమైన ఆసక్తి, మమేకత్వం కాబట్టి ఈ కవిత నిర్మించే ఔద్వేగిక వ్యవస్థతో నా అంతరంగంలోని ఉద్వేగాలకు బలమైన సమన్వయం కుదిరింది. కవిత అన్ని రకాలుగా కనీసం నాకు ఒక్కడికి సఫలం కావటానికి సైతం కేవలం ఔద్వేగిక ఆవరణ ఒక్కటే చాలదు. ఇది వరకు అనుకున్నవి సృజన వ్యవస్థలు అన్నింటిని గురించీ ముందుగా చెప్పుకొని, మళ్ళీ ఈ కవితను అన్ని రకాలుగానూ పరామర్శించాలి. ఇప్పటికిది కేవలం ఈ కవిత కవి ఉద్దేశించిన ఔద్వేగిక ఆవరణను ఇంకొక పాఠకుని అనుభవంలో ఎలా పునర్నిర్మిస్తుందో ఆ ఒక్క పాఠకుని అభిప్రాయం మాత్రం.
స్వంతం కవిత నాకు అప్పల్రాజు గారి ప్రవర్తనను వర్ణిస్తోంది. ఇందుకు భిన్నంగా, ఆదివారం మధ్యాహ్నాలు ప్రకృతిని – కాలంలో అనువారంగా వచ్చే మార్పునూ, అంతరంగంపై ఆ కాలపు ప్రభావాన్నీ వర్ణిస్తున్నాది. దీన్లో మాట్లాడుతున్న గొంతు ‘అప్పల్రాజు ‘ గారిది కాదు. అది స్వయంగా కవయిత్రి గొంతు. అది పరికల్పించాలని ప్రయత్నిస్తున్న ఔద్వేగిక ఆవరణ, అనుభవం కవయిత్రి లాగనే వారం అంతా ఉద్యోగాలు చేసుకొంటూ వారాంతం లోని మార్పును అనుభవించే ఆధునికులందరికీ పరిచితమైనది. ఇలాంటి మనుషులందరికీ ‘ఆదివారం మధ్యాహ్నం’ అన్న మాట వినీ వినగానే ఈ ఔద్వేగిక ఆవరణ స్ఫురణకు వస్తుంది. ముందుగా ఈ ఒక్క మాటా – అంటే కవిత పేరు వినగానే నాకు ఏం స్ఫురించిందో చెప్తున్నాను.
(ఇంకా ఉంది)