వారం వారం ఒకే మూసలో గడిచిపోయేవాళ్ళకి ఆదివారం మధ్యాన్నం ‘ఏదోలాంటి’ ఒక విశేషమైన అనుభవాన్ని మోసుకొచ్చే సందర్భం. ఇలాంటి సందర్భాలు కొన్ని అందరికీ సామాన్యమైనవి – పండుగలు, జాతరలు, పరీక్షలు, శలవులు, ఎండలు, వరదలు ఇలాగ. ఉదాహరణకు పూర్వం గోధూళి వేళ అని ఉండేదని, ఎండపాటి వేళ చల్లపడుతుంటే గోవులు అంతెత్తున దుమ్ము రేపుకుంటూ ఇళ్ళకి తిరిగొచ్చే సాయంత్రాలు ఆ కాలం సాంఘిక జీవనంలో ప్రత్యేకమైన ఔద్వేగిక అనుభవాలనీ, అప్పటి సృజనల వల్లనే అనుభవపూర్వకంగా తెలుస్తుంది; ఇది చరిత్ర చదివి తెలుసుకునే అవకాశం లేదు. మా చిన్నప్పుడు కాఫీలవేళ అని ఉండేది. అది మా వీధికి, అలాంటి పేటలకే ప్రత్యేకమైన అనుభవం. మధ్యాన్నం గడియారం చిన్న ముల్లు ఇంక మూడు దాటిందనగా వీధి పొడుగునా వంటిళ్ళలోన కిరసనాయిల స్టవ్వులు వెలిగించిన చప్పుళ్ళు, కాసేపట్లో బ్రూక్‌బాండ్ గుండ నీళ్ళలో పడి మరిగిన కాఫీ సువాసనా, అంతట్లోకే స్టవ్వును బలవంతంగా ఆర్పెస్తే గాలిలో తేలుతూ వచ్చే కిరసనాయిలు పొగ వాసన – ఈ చప్పుళ్ళూ, వాసనలూ కాఫీ వేళను వీధంతటికీ ప్రకటించే మంగళాశాసనాలు. ఆ వాసనల్ని అనుసరిస్తూ అత్తలు, మామ్మలు, పిన్నులు ఇరుగు పొరుగమ్మలు బిలబిల్లాడుతూ వచ్చి ఒకింట్లో చేరి కాఫీలు తాగుతూ అసుక్కొట్టుకునే పండగే కాఫీల వేళ. కాఫీకి ఔద్వేగిక స్థితిని ప్రత్యక్షంగా ఉత్తేజపరిచే గుణం ఉంది. కాఫీ తాగటం ఎంతోమందికి స్వయంగా అనుభవం, సుపరిచితమైనది. ఇవాళ కాఫీల వేళ వంటిదే అనుభవం స్టార్‌బక్స్, కాఫీ డే వంటి చోట్లకు పోయి కాఫీ తాగటం. కవయిత్రి ఇలాంటి సామాన్యమైన (common) అనుభవాల్ని తీసుకున్నప్పటికీ కవిత దృక్కోణం ఆవిడకు, ఆవిడకు సఫలమైన పాఠకులకు ప్రత్యేకమైనది. ఆదివారం మధ్యాహ్నాలు ఇలాంటి జన సామాన్యమైన వస్తువును, ఔద్వేగిక ఆవరణను వస్తువుగా స్వీకరించిన కవిత.
ఇంకొన్ని అనుభవాలు చాలా వ్యక్తిగతమైనవి, వయసుతో, అంతస్థుతో, తరాలతో మారిపోతుండేవి. ఒకాయనకి మంగళవారం పొద్దున్న తొమ్మిదింపావుకి మాత్రమే రేడియోలో వచ్చే నాదస్వరం అంటే ఇష్టం. ఆ విశేషం కోసమని ఆయన రోజుల్లో మంగళవారం కోసం, అందునా ఉదయం తొమ్మిది గంటలు కొట్టడం కోసం ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తుంటారు. ఒకావిడ పిల్లలు హాష్టల్నుండి శుక్రవారం మధ్యాన్నం ఇంటికొచ్చి మళ్ళీ ఆదివారం సాయంత్రం వెనక్కెళ్ళిపోతారు. ఆవిడ సహజంగానే శుక్రవారం మధ్యాహ్నం కోసం ఆతృతగానూ, ఆదివారం సాయంత్రం అంటే బెంగ గానూ ఉంటారు. ఒకబ్బాయి సాయంత్రం డాబామీద ఎండిన బట్టలు తీసుకోడానికి తన ప్రేయసి వచ్చే వేళకి ఎదుటింటి డాబా మీద ఎదురుచూస్తాడు; ఆ అమ్మాయి వస్తే పండుగ, రాకపోతే నిరాశ. ఈ రెండవ తరహా ఔద్వేగిక అనుభవాలు వ్యక్తిగతమైనవి. కవి ఇలాంటి అనుభవాల్ని అందిపుచ్చుకుని, సృజనగా చెక్కి ఆ ప్రదర్శనను పాఠకుని అనుభవంలో దృశ్యాభాసగా రక్తికట్టించటం పదిమందికీ సామాన్యమైన అనుభూతుల్ని చిత్రీకరించటం కంటే కష్టతరం అవుతుంది. ఎందుకంటే మొదటి తరహా అనుభవాలలో కవికీ, పాఠకలోకానికి సామాన్యమైన అనుభవ సంచయం, స్మృతి సంచయం సృజన ఔద్వేగిక ఆవరణను తమంత తాముగా పునర్మించుకోడానికి పాఠకులకు ఉపకరిస్తాయి. వ్యక్తిగతమైన అనుభవాల చిత్రణలో ఈ వెసులుబాటు ఇంతలా లేదు. వాటిని ఆలంబనగా చేసుకున్న సృజనలను చదువుకునేటప్పుడు పాఠకులు ఆ అనుభవాలకు సమీపంగా ఉన్న అనుభవాలతో, ఆవరణలతో తమ దృశ్యాభాసలోని ఖాళీల్ని పూరించుకుంటారు. మూడవ తరహా అనుభవాలు చాల ఆంతరంగికమైనవి, ఎలా వ్యక్తం చెయ్యాలోనని ఎంతో సతమతం కావలసి వచ్చేవి.
ఉదాహరణకు సాలింజర్ (J. D. Salinger) కధ ఒకటి Uncle Wiggily in Connecticut అని, దాన్లో అంకుల్ విగిలీ నిజంగా ఒక మనిషి కాదు. ఎలోయిస్ అని ఒక వివాహిత ఒకప్పటి తన ప్రియుడు వాల్ట్‌ని తల్చుకుంటూ రహస్యంగా కుమిలిపోవడం ఈ కధ ఔద్వేగిక ఆవరణకు ప్రాణప్రదం. ఆవిడ వాల్ట్‌తో కలసి బస్సు కోసం పరుగెడుతూ పడిపోయి మడమ బెణికితే వాల్ట్ ఆ మడమకు ముద్దుగా ‘Poor uncle Wiggily…’ అని పేరు పెడతాడు. అతను యుద్ధంలో చచ్చిపోయి చాలా ఏళ్ళయినా ఎలోయిస్ అతన్నే తల్చుకుంటూ కుమిలిపోతుండటమే కధ ఔద్వేగిక భూమిక. కాని ఇలాగని సాలింజర్ చెప్పరుగాక చెప్పరు, కనీసం సంభాషణల్లో కూడా ఎక్కడా సూచించనివ్వరు. ఐనప్పటికీ ఆ అవ్యక్తమైన దిగులు, బెంగ సన్నివేశాలు, సంభాషణల juxtaposition (పేర్పు) వలన పాఠకుడికి ప్రగాఢంగా హత్తుకుంటాయి. Wiggle అంటే ఒదులుగా వేళ్ళాడటం. ఆ ఒక్క మాట, అది రగిల్చే జ్ఞాపకాలూ కధకు ఆయువుపట్లు కాబట్టి కవి ఆ ముద్దు పేరును కధ పేరుగా ఎంచుకున్నారు. చాల చమత్కారమైనవీ, ఇదమిద్ధం అని విడమర్చి చెప్పలేనివీ అమూర్తము, ఆంతరంగికమైన ఇలాంటి అనుభవాలకు ఒక ఆకృతిని, ఆవరణనూ కల్పించి, దాన్ని మళ్ళీ పాఠకుని అనుభవంలో రూపు కట్టించడంలో కొందరు సృజనకారులది అపురూపమైన పనితనం. కళ్యాణ సుందరీ జగన్నాధ్ ఇలాంటి పనిమంతురాలు. తిలక్ ప్రయోగాలు “శిశిర వసంతాల మధ్య వచ్చే మార్పును జ్ఞాపకం తెస్తుంది”, “ఏ నిశ్శబ్ద ప్రపంచాల మద్య ఏమిటి నీ కళ్ళు మాట్లాడుతున్నాయి?”, “కాంక్షా మధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను” వంటి ఇంకొన్ని ఉదాహరణలు. జీవితాన్ని మీ ఊహా వీధిలోనే ఐనా సరే, ‘హసన్మందార మాల’గా ఎలా ధరిస్తారు? బ్రాడ్స్కీ (Joseph Brodsky) కవిత The Song అని ఇంకొక ఉదాహరణ, ముందుకి పరామర్శించేది. చాలా ఏళ్ళ కిందట ఒకాయన వాటం, మాట తీరూ చూసి చూసి మా ఇంట్లో ‘ఆయనొక ఉడుద్బుడుద్బోవాటం’ అని మాట పుట్టించేరు. ఆ మాటని నాలిక గుండ్రంగా మడతపెట్టి అమ్మలు పాపాయిలతో అనేటట్టు అనాలి. ఆ వ్యాఖ్యలో ఏదో కొంచెం వేళాకోళం ఉందని స్ఫురిస్తుంది గాని అంతకంటే ఏమీ రూపు కట్టదు. ‘ఉడుద్బుడుద్బో’ రకం మనిషంటే ఎలా ఉంటారు? చూస్తే తప్ప తెలీదు. కవి పని ఆయన వ్యక్తిత్వాన్ని కేవలం మాటల్లో రూపించడం.
ఇక్కడ సందర్భానుసారం రెండు సంగతులు. ఒకటి: మొత్తం జీవితానుభవం అంతా, అంటే మానవుల cognitive experience యావత్తూ ఏదో ఒక మేరకు ఉద్వేగ ప్రధానమైనది. కంప్యూటరుకూ మనిషికీ తేడా ప్రధమంగా ఉద్వేగ ప్రధానమైనదని ఓట్లీ (Keith Oatley) విశేషంగా ప్రతిపాదిస్తున్నారు. ఇది ముందుకు వివరిస్తాను. కొన్ని సందర్భాల్లో ఈ ఉద్వేగానుభవపు తీవ్రత, విస్తృతి చాల ఎక్కువగా ఉంటాయి. అలాంటి సందర్భాలకు సంకేతాలుగానే ఇంగ్లీష్‌లో fun, joy, epiphany, enchantment వంటి మాటలు, తెలుగులో పులకరింత, జలదరింపు, వెగటు, బెంగ ఇలాంటివి వేలకొలదీ మాటలూ ఉన్నాయి. కాని వీటిలో ఏ ఒక్క మాటా, పదబంధమూ కూడా ఆ ఔద్వేగిక అనుభవాన్ని అనుభవమంత ప్రగాఢంగా వర్ణించలేదు, నిర్మించలేదు. అంటే – మాటలు, భాష ఉద్వేగ ప్రధానమైన జీవితపు అనుభవానికి పేలవమైన సంకేతాలు మాత్రమే. ప్రాచీనమైనవి, ఆదిమజాతుల భాషల్లో ముఖ్యమైన ప్రాకృతిక అనుభవాలు – వాన, మంచు కురవటం ఇలాంటివాటికి ఒక్కొక్కదానికే వందల కొద్దీ మాటలు ఉంటాయట. అవి ఒక్కొక్కటీ ఒక్కొక్క అనుభవపు చాయను ప్రతిఫలిస్తాయి. రంగులు, రుచులూ ఇంతే కదా. భౌతికమైనవి, మూర్తమైన అనుభవాలకే ఇన్ని మాటలు కావలసి వస్తే, అమూర్తము, ఆంతరంగికమైనవి – ‘అదోలా’ ఇంకా ‘ఏదోలా’ ఉండే ఆదివారం మధ్యాహ్నాల వంటి అనుభవాలకోసం కవి ఎక్కణ్ణించి, ఎలాగ ఏ మాటల్ని తెచ్చుకొని తన పని పూర్తి చేస్తారు? అది ఎంత కష్టతరమైన పని?! కోపం, సంతోషం, ప్రేమ, అసూయ ఇలాంటి మాటలు నిజంగా అవి సూచించే ఔద్వేగికానుభవాలకు చాల పేలవమైన సంకేతాలు కదా. సృజనశీలి ఈ వెలితిని నిరంతరం అనుభవిస్తూ, దాన్ని పూరించేవి ఖచ్చితమైన మాటల కోసం, ఊహల కోసం, రేఖలు, స్వరాలు, చిత్రాల కోసం తపిస్తుంటాడు.
Epiphany అనదగిన సాంద్రతరమైన జీవితానుభవాల్ని పంచుకోడానికి భాష, ఆలోచన బొత్తిగా సరిపోవు; కాని అవి తప్ప గత్యంతరం లేదు. రోజువారీ జీవితంలో అనుభవాలు అన్నీ ఇంత సాంద్రతరమైనవి కావు కాని స్థూల దృష్టికి చాల సాధారణం, పూర్తిగా భౌతికం లేకుంటే తార్కికం అని తోచే అనుభవాలు, పరిశీలనల మాటున సైతం ప్రతి ఒక్కరికీ తమదే అయిన ఔద్వేగిక అనుభవం పొంచి ఉంటుంది. ఉదాహరణకు స్థూల దృష్టికి కేవలం తార్కికము, భౌతికమైనవని తోచే మాటలు విని చూడండి: తుత్తునాగము, బుచ్చి సుందర్రావు, రశ్మ్యుద్గారత, చీఁవన్నగారి చిట్టి, ఏడు మూళ్ళు ఇరవయ్యొకటి, ద్రవ పీడన సమాపక స్థితి, కెనడా రాజధాని అట్టావా, నేల, చాప చుట్ట. ఇవి వినగానే సూచింపబడుతున్న వస్తువుతో పాటు, ఇలాంటి ప్రతి మాటకూ లంకెలు (Allusions)గా మనదే ప్రత్యేకము, వ్యక్తిగతమైన ఔద్వేగికానుభవం కూడా ఒకటి స్మృతిపధంలో చప్పున మెరిసి, పోతుంది. ఉదాహరణకు చాపచుట్ట అనగానే నాకు ఈత చాప చుట్ట దృశ్య చిత్రంతో పాటు, మా చిన్నప్పటి ఒక ఇల్లూ, అక్కడ మా అమ్మ ఇంటికొచ్చినవాళ్ళని చాప పరచి కూర్చోపెట్టటం గుర్తొస్తాయి. ఇలా ప్రతి మాట యొక్క వాచ్యార్ధంతో, నానార్ధాలతోనూ ముడిపడి ఏ పేరూ లేని ఒక ఔద్వేగికావరణ – అంటే emotional charge తప్పనిసరిగా అల్లుకొని ఉంది. చివరికి ఏ అర్ధం పర్ధం లేని మాటలు అని చూడండి: నల జిలకరి నాం నాం; అనామినారే, డబకు డబా రే; జంబలకిడి పంబ; టిఱ్ఱి టిఱ్ఱి టిఱ్ఱ్. ఈ చివరిది కొట్టాంలో గేదెల్ని పిలిచే కేక. ఆ మొత్తం ఉదయం, గేదెలూ, మనుషులూ, చిత్తడీ పేడ వాసనలూ అన్నీ ప్రత్యక్షమౌతాయి నాకు.
ఇలా ఏ మాటను, పద బంధాన్ని చదివినా, విన్నా అది సూచించే ఆలోచనతో పాటు మనోఫలకం మీద ఏదో ఒక అనిర్వచనీయము, అస్పష్టమైన ఔద్వేగిక అనుభవమైతే కదుల్తుంది. ఆ అనుభవం అంతరాంతరాల్లోని జీవితానుభవాలతో, జ్ఞాపకాలు, నమ్మకాలు, పక్షపాతాలు, సంకల్పాలు, లక్ష్యాల చుట్టూ అదివరకే నిర్మించుకొని ఉన్న ఔద్వేగిక సముచ్చయంతో ముడిపడి ఉండేది. ఉదాహరణకు ఏడు మూళ్ళు? అంటే నాకు ఇరవయ్యొకటి అన్న తార్కికమైన జావాబుతో పాటు, చిన్నప్పుడు మేష్టారు నన్ను ఏడు మూళ్ళెంత? అని చౌకీలు అడిగిన సంగతి, ఆ సన్నివేశం చుట్టూ ఉన్న ఔద్వేగిక అనుభవం జ్ఞాపకం వస్తాయి. మట్టి తవ్వితే మన్నుతో పాటు తడి కూడా ఎలా వచ్చి తీరుతుందో, వాక్కూ అర్ధమూ ఎలాగయితే ఒకదాన్నొకటి విడదీయలేకుండా పెనవేసుకొని ఉంటాయో, తార్కిక వాస్తవమూ, ఉద్వేగము ప్రతి చిన్నపాటి జీవితానుభవంతోనూ తప్పనిసరిగా పెనవేసుకొని ఉంటాయి. జీవితపు ప్రతి ఒక్క అనుభవం తరచి చూస్తే చివరికి ఔద్వేగిక అనుభవమేనని ఇదివరకు ఎమర్సన్ (Ralph W. Emerson) ప్రతిపాదించేరు. “Life is a train of moods like a string of beads; and as we pass through them they prove to be many colored lenses, which paint the world their own hue, and each shows us only what lies in its own focus.” అని. ఓట్లీ వంటి శాస్త్రజ్ఞులు ఇప్పుడు ఆ ప్రతిపాదనను పరిశోధిస్తున్నారు. భాషా తర్కానికి ఔద్వేగిక ఆవరణను అందిపుచ్చుకొనే శక్తి, ఆసక్తి ఉండవు. అది కేవలం రచనలోని ఊహను, ఆలోచనను మాత్రమే అందుకొని, విశ్లేషించగలుగుతుంది.
మన రోజువారీ అనుభవంలోన రంగులు, రుచులు, ధ్వనులు, స్పర్శల్లో వివిధమైన అనుభవాల విస్తృతి (range) ఎంత విస్తారంగా ఉందో అంతకు పదింతలు వైవిధ్యం ఔద్వేగిక అనుభవాల్లోన ఉంది. ఇంతటి విస్తారము, గహనమైన ఔద్వేగికానుభవం సాధారణంగా మనందరికీ అందుబాటులో ఉండదు. తిలక్ మాటల్లో మన ఔద్వేగిక వ్యవస్థకు చోదకమైన అంతరంగం ‘అలసి నిత్య జీవితంలో సొలసి సుషుప్తి’ చెందింది. సృజనశీలి జీవితానుభవం ఇలా ఉండదు. అది ఎప్పుడూ బిగిసి ఉండి, సున్నితమైన కొనగోటి మీటుకు కూడా ‘బూం’ మని పెద్దగా ప్రతిధనించి, మూర్చనలు పోయే వీణ తీగెలాగ జీవితం సమస్తాన్నీ ఒక ఉద్వేగభరితమైన ఉత్సవం లాగ, జాతరలాగా చూస్తూ ఉంటుంది. నబకోవ్ (V. Nabakov) మాటల్లోన అది “…the art of seeing the world as the potentiality of fiction”. ఇదివరకు నేను వాగనర్‌ను (David Wagoner) అడిగితే ఆయన చెప్పింది: నిత్య జీవితంలో మంచి చెడ్డల బేరీజులు, నిర్ణయాలతోనూ సతమతమౌతుంటుండే మన అంతరంగాన్ని మంచి కవిత తన పదాలు, నడకలు, చిత్రాలు, ఉపమలతో ఊరడించి, సర్వ సాధారణమైన దృశ్యాల్ని, మనుషుల్ని, ప్రపంచాన్నే మరింత ఉదారంగా లోతుగానూ దర్శింపచేస్తుంది. (“I have no good way to answer your very difficult question. But a partial answer would be that the sounds and rhythms and metaphors of poetry sometimes make us suspend our ordinary judgments and help us see the material world and its people, ordinary actions, and commonplace events more openly and deeply.”) కవి ఈ అనువాదాన్ని ఎందుకు, ఎలా సాధించుకుంటున్నాడు?