నమః శ్రీపాదరాజాయ
నమస్తే వ్యాసయోగినే
నమః శ్రీపురందరార్యాయ
విజయార్యాయ తే నమః
హరిదాసులు హరికథాకాలక్షేపసమయములో, దేవరనామములను పాడే వేళలో “శ్రీపాదరాయలకు, వ్యాసరాయలకు, పురందరదాసులకు, విజయదాసులకు నమస్కృతులు” అని స్తుతించడము వాడుక. అంటే ఈ హరినామ సంకీర్తనములకు మూలపురుషుడైన శ్రీపాదరాయలను మొట్టమొదట పేర్కొనడము ఒక గొప్ప విశేషము.
బాల్యము
బృందావనం, శ్రీపాదరాజ మఠం
ముళ్బాగిల్, కోలార్ జిల్లా. కర్ణాటక.
శ్రీపాదరాయలు దాసకూట పితామహుడు. ఇతడు క్రీ.శ. 1412 నుండి 1502 వరకు జీవించాడని ఊహిస్తారు. కొందరు 1420 నుండి 1487 వరకు బ్రదికి ఉన్నాడని అంటారు. ఇతడు బెంగళూరికి 40 మైళ్ళ దూరములో ఉండే అబ్బూరు అనే గ్రామములో శేషాచార్యులు, గిరియమ్మలకు జన్మించాడు. ఇతని పూర్వాశ్రమపు పేరు లక్ష్మీనారాయణ. అక్షరాభ్యాసం పిదప తండ్రి వద్దనే పాఠాలు నేర్చుకొనేవాడు. ఆ కాలములో బ్రాహ్మణులకు పశుసంపద ఉండేది. లక్ష్మీనారాయణ పసులకాపరి కూడా. ఒక రోజు సాయంత్రం ఆవులను ఇంటికి తోలుకొని వస్తున్నాడు. అప్పుడు ఒక పల్లకి అక్కడికి వచ్చి నిలిచింది. అందులో స్వర్ణవర్ణతీర్థులనే ఒక స్వాములవారు కూర్చుని ఉన్నాడు. అతడు లక్ష్మీనారాయణుని పిలిచి “అబ్బూరు ఇక్కడికి ఎంత దూరం?” అని అడిగాడు. అప్పుడు లక్ష్మీనారాయణుడు ఇలా జవాబిచ్చాడు, “నన్ను చూడండి, నా మందను చూడండి, ఆకాశాన్ని చూడండి, అబ్బూరు ఎంత దూరమో మీకే తెలుస్తుంది.”
ఈ జవాబును విన్న స్వర్ణవర్ణతీర్థులు బాలకుని చురుకుదనానికి అబ్బుర పడ్డాడు. అబ్బూరులో ఉండే పురుషోత్తమతీర్థులనే యతివర్యుల దర్శనార్థము ఆ ఊరికి స్వర్ణవర్ణతీర్థులు వచ్చాడు. ఈ స్వర్ణవర్ణతీర్థులు జగద్గురు మధ్వాచార్యుల ప్రథమ శిష్యులైన పద్మనాభతీర్థుల మఠములోని ఒక శాఖకు అధికారి. పురుషోత్తమతీర్థులను సందర్శించి లక్ష్మీనారాయణుని తనతో తీసికొని వెళ్ళాలనే ఆశను ప్రకటించాడు. తండ్రి శేషాచార్యులకు అంతగా ఇష్టము లేకపోయినా చివరకు ఒప్పించి, అతని అనుమతితో ఆ కుటుంబాన్నంతా తనతో శ్రీరంగమునకు తీసికొని వెళ్ళాడు. త్వరలోనే ఆ కాలములో మతాచార్యులకు అవసరమైన సమస్త విద్యలలో ప్రావీణ్యాన్ని లక్ష్మీనారాయణుడు స్వర్ణవర్ణతీర్థుల వద్ద సంపాదించాడు. స్వర్ణవర్ణతీర్థులకు వృద్ధాప్యము రావడంతో తన మఠానికి లక్ష్మీనారాయణుని మఠాధికారిగా నియమించాడు. వేదాంత విద్యలో ఇంకా ఎక్కువ తరిఫీదు పొందడాని కోసం కుంభకోణములో ఉండే విబుధేంద్రతీర్థుల మఠానికి స్వర్ణవర్ణతీర్థులు లక్ష్మీనారాయణతీర్థులను పంపాడు. ఈ విబుధేంద్ర తీర్థుల మఠము అంతకు కొంత కాలమువరకు ఉత్తరాది మఠములో ఉండేది. కొన్ని కారణాలవల్ల (ఇక్కడ ఆ సుదీర్ఘ చర్చ అనవసరము) అది దానినుండి చీలిపోయింది. కొన్ని సంవత్సరాలకు పిదప ఇది మంత్రాలయములోనున్న శ్రీరాఘవేంద్రస్వామి మఠముగా మారింది.
శ్రీపాదరాయ నామము
లక్ష్మీనారాయణతీర్థులకు శ్రీపాదరాయలనే పేరు ఎలా వచ్చింది? దీనికి రెండు కథలు ఉన్నాయి. వాడుకలో ఉన్న మొదటి కథ – ఒకప్పుడు విబుధేంద్రతీర్థులతో తీర్థయాత్రలు చేస్తుండగా ఉత్తరాదిమఠ స్వాములైన రఘునాథతీర్థులను కొప్ర అనే గ్రామములో సందర్శించడమైనది. ఒక విద్వత్సభను ఏర్పాటు చేశారట. అందులో లక్ష్మీనారాయణుడు ఇద్దరు యతివర్యుల సమక్షములో టీకాచార్యులనబడే జయతీర్థుల న్యాయసుధను గురించి అపూర్వమైన పద్ధతిలో వ్యాఖ్యానము చేశాడట. దానికి ముగ్ధులైన రఘునాథతీర్థులు “మేమంతా శ్రీపాదులమైతే (యతులైతే) నీవు శ్రీపాదరాయలు” అని అన్నారట. ఈ బిరుదు అలా అతనికి శాశ్వతముగ నిలిచి పోయింది. మరో కథ – ఆ కాలములో తిరుమలలో శ్రీనివాసుని అర్చించే పూజారులు లంచగొండులు, దేవునికి చెందిన ఆభరాణాదులను తమ స్వంత ఖర్చులకై వాడుకొనేవారట. చంద్రగిరి రాజైన సాళువ నరసింహరాయలు వారిని శిక్షించగా పసివాళ్ళు తప్ప మిగిలిన వారందరు చనిపోయారు. అప్పుడు బ్రహ్మహత్యాదోషము రాజుకు అంటుకొంటుంది. ఆ దోషము నుండి రాజును కాపాడినాడనీ, రాజు తన సింహాసనముపై కూర్చుండబెట్టాడని, అప్పుడు ఇతనికి శ్రీపాదరాయలనే పేరు వచ్చిందని అంటారు.
ఈ రెండవ కథ నిజానికి కొంత దగ్గరని నా అభిప్రాయం. ఎందుకంటే ఉత్తరాది మఠాధికారులైన రఘునాథతీర్థులకు, అందులోనుండి చీలి వేరైన మఠానికి అధికారియైన విబుధేంద్ర తీర్థులకు సామరస్యము ఎంతగా ఉంటుందో అన్నది ప్రశ్నార్థకమే. స్వర్ణవర్ణతీర్థులు బృందావనస్థులైన పిదప శ్రీరంగములో కొన్ని యేళ్ళు ఇతడు ఉండి ఉండవచ్చు. ఒకప్పుడు దేశాటన చేస్తూ, కోలారుకు సమీపములో ఉండే ముళ్బాగిలుకు వచ్చారు. ముళ్బాగిలు అసలు పేరు మూడలబాగిలు, అంటే పూర్వద్వారము (మూడల అంటే కన్నడములో తూర్పు దిక్కు). దీనికి నిదర్శనముగా వీరి శిష్యుడైన శ్రీనిధితీర్థులు వ్రాసిన శ్రీపాదరాజాష్టకములోని క్రింది పద్యాన్ని ఇక్కడ ఇస్తున్నాను –
నమ్యద్వీరనృసింహనామనృపతేర్భూదేవహత్యా వ్యధాం
దూరీకృత్య తదర్పితోజ్జ్వల మహాసింహాసనే సంస్థితః
సేవ్యే పూర్వకవాటనామకపురే సర్వేష్టసిద్దిప్రదః
సః శ్రీపాదయతీశ్వరః ప్రతిదినం భూయాత్బహుశ్రేయసే
వీరనరసింహుడనే రాజు బ్రాహ్మణుని చంపగా ఆ పాపాన్ని దూరము చేసినప్పుడు ఆ మహారాజు అర్పించిన సింహాసనాన్ని అధిరోహించాడు, తూరుపు వాకిలిగా ఉండే ఊరిలో అందరి కోరికలను తీర్చేవాడు, శ్రీపాదయతీశ్వరుడు ప్రతిరోజు ఎంతో మంచిని కలుగజేస్తాడు, వారికి నమస్సులు.
ముళ్బాగిలు విజయనగర రాజ్యానికి తూర్పు సరిహద్దు లాటిది. అక్కడే సుమారు వంద సంవత్సరాలకు ముందు అక్షోభ్యతీర్థ యతివర్యులు విద్యారణ్యులను వాదములో ఓడించి అంగారముతో (బొగ్గుతో) ఒక నరసింహస్వామి రేఖాచిత్రాన్ని గీచినట్లు ఒక కథ వుంది. ఏది ఏమైనా శ్రీపాదరాయలు ముళ్బాగిలులో స్థిరపడ్డాడు. అక్కడే పరమపదాన్ని అంది బృందావనస్థులయ్యారు. వారు అక్కడ ఉన్నప్పుడే వ్యాసరాయలు అక్కడికి వచ్చి శ్రీపాదరాయలను తన గురువుగా అంగీకరించి అక్కడే అతని శిష్యుడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక విశేషమేమంటే మధ్వమత యతి పరంపరలో గురు శిష్యులైన శ్రీపాదరాయలకు, వ్యాసరాయలకు మాత్రమే ఈ రాయల పట్టము ఉన్నది, మరెవ్వరికీ లేదు.
వాగ్గేయకారత్వము
శ్రీపాదరాయలు యెప్పుడు వాగ్గేయకారుడయ్యాడు? శ్రీపాదరాయలు శ్రీరంగములో తన గురువులైన స్వర్ణవర్ణతీర్థులతో ఉండేటప్పుడు తరచుగా రంగనాథస్వామి ఆలయానికి వెళ్ళుతుండేవాడు. అక్కడ పూజాసమయములో ఆళ్వారుల భక్తిగీతాలను తమిళములో పాడుతూ ఉండడము అతనికి సుపరిచితము. ప్రాంతీయ భాష ఐన తమిళములోని పాటలు సంస్కృతము తెలియని, తమిళ సాహిత్యము కూడా అంతగా తెలియని ప్రజలకు అర్థమయ్యే అవకాశము వుంది, అందువల్ల వారి భక్తి భావము, ఆధ్యాత్మిక చింతన అధికమవడానికి ఆస్కారము వుంది. మరి కన్నడ భాషలో ఇలా ఎందుకు పాటలు లేవని ఆలోచించేవాడు. ముళ్బాగిలులో స్థిరపడిన తరువాత కన్నడములో పాటలను రచించి దేవుడి పూజ చేసేటప్పుడు వాటిని పాడేవాడు, పాడటము మాత్రమే కాదు, గజ్జెలు కట్టి భక్తి పారవశ్యంతో చిందులు తొక్కేవాడు. ఇతడు చేయని ప్రయోగము లేదనుటలో ఆశ్చర్యము, అతిశయోక్తి ఏ మాత్రము లేదు. కీర్తనలు, భ్రమరగీతములు, వేణుగీతములు, ఉగాభోగములు, వృత్తమాలికలు, దండకము, సుళాదులు మున్నగువాటిని ప్రప్రథమముగా కన్నడ భక్తి సాహిత్యములో ప్రవేశ పెట్టాడు.
కర్ణాటక సంగీత పితామహుడు శ్రీపాదరాయలను పదకవితా పితామహుడు, దాససాహిత్య పితామహుడు అని ఎందుకు అంటారంటే –
- అంతకు ముందు కన్నడములో విరివిగా లేని కొత్త విధములైన సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో ఉండేటందుకు మార్గదర్శి అయ్యాడు. ఈ మార్గదర్శకత్వము ఎలాటిదంటే తరువాతి కాలములో బహుజనాదరణ పొందిన దేవరనామములకు ఇతడే సూత్రధారి.
- ఇతని భ్రమరగీతాలు, వేణు గీతాలు తరువాతి కాలములోని పదాలకు, జావళులకు నాందీవాక్యాలను పలికాయి.
- రాగబద్ధమైన, తాళబద్ధమైన పాటలను వృత్తమాలిక ద్వారా కనిపెట్టినది కూడా ఇతడే.
- కొత్తవి కాకపోయినా ఉగాభోగాలను ఇతనికి పిదప వచ్చిన హరిదాసులు ఎక్కువగా వాడారు.
- సంస్కృతములో , తెలుగులో దేవునిపై దండకాలు ఎన్నో ఉన్నా, కన్నడములో ఇతడు వ్రాసిన దండకము నిజముగా అపూర్వమైనది.
- అన్నిటికంటే ముఖ్యముగా రాగమాలికలవలె తాళమాలికలను తాను వ్రాసిన సుళాదుల ద్వారా కర్ణాటకసంగీతములో ప్రవేశపెట్టిన ఘనత ఇతనిదే.
- ఒక సంగీత బాణీని సృష్టించడము మాత్రమే కాక ఆ పద్ధతి నిరంతరముగా గంగాప్రవాహములా కొనసాగడానికి ప్రత్యక్షముగా, పరోక్షముగా శిష్యులను ప్రోత్సహించాడు.
ప్రత్యక్ష శిష్యులలో ప్రముఖుడు వ్యాసరాయలు. మాధ్వ యతి పరంపరలో వ్యాసరాయల స్థానము మధ్వాచార్యుల, జయతీర్థుల తరువాతిది మాత్రమే. ఈ ముగ్గురిని ఆచార్యత్రయము అంటారు. శ్రీపాదరాయలవద్దకు రాక మునుపే ఇతడు ఎన్నో విద్యలను నేర్చినాడు. అయినాకూడ శ్రీపాదరాయలను గురువుగా అంగీకరించాడు. వాదిరాజయతి, పురందరదాసు, కనకదాసు, (వీరు వ్యాసరాయల శిష్యులు) తరువాత తండోపతండములుగా వచ్చిన అనేక హరిదాసులు ఇతని పరోక్ష శిష్యులే.
శిష్యుడు గౌరవముతో, భక్తితో గురువును స్తుతించడము సామాన్యము, కాని గురువు శిష్యుని గొప్పవాడని, తనతో సమానమని చెప్పడము అరుదు. శ్రీపాదరాయలు అలాటి గురువు. వ్యాసరాయలను గురించి ఇలా అంటాడు –
“సాసిర జిహ్వెగళుళ్ళ శేషనె కొండాడబేకు
వ్యాసమునిరాయర సంన్యాసదిరవ”
వేయి నాల్కలతోడి శేషుడె మెచ్చుకొనవలెను
వ్యాసమునిరాయని సంన్యాస మహిమ
విద్యా ప్రౌఢిమ: వ్యాసరాయలు తన గురువులైన శ్రీపాదరాయల విద్యాప్రౌఢిమనును గురించి సరళముగా సంస్కృతములో వ్రాసిన ఈ పాటలో ఇలా అంటాడు.
పల్లవి:
మేదినీసురవంద్య శ్రీపాదరాయ
చరణం:
సకల సత్యస్థాప సుజ్ఞానదీప
ప్రకట పావనరూప అరికుజనమతలోప
నికటవర్జిత పాప కీర్తిప్రతాప
చరణం:
పరమ సుగుణాంతరంగ భవదురితభంగ
శరణ కీర్తితరంగ శత్రు తిమిరపతంగ
శరణు శుభచరితాంగ షట్ఛాస్త్రసంగ
చరణం:
వర హేమవర్ణ మునిపతియ సుకుమార
గురుతిలక శ్రీపాదరాయ అమితోద్ధార
శరణజన సురధేను భక్తమందార
అంకిత ముద్ర: ‘రంగవిఠల’ శ్రీపాదరాయల అంకిత ముద్ర. ఒకప్పుడు పర్యటనలో భీమానదిలో రాయలకు రెండు విగ్రహసంపుటాలు దొరికాయి. అందులో ఒకటి పండరీనాథుడైన విఠలునిది. ఆ విఠలుని పేరిటనే రంగవిఠలుని అంకితముద్ర అతని కీర్తనలలో కనబడుతుంది. ముందున్న రంగ పదము శ్రీరంగేశ్వరుడైన రంగనాథుని కోసమై ఉండవచ్చును. ఆ రెండవ సంపుటమును ఎవ్వరును తెరువలేకపోయినారు. ఒకప్పుడు గురువుగారు పూజచేయమనగా, వ్యాసరాయలు పూజ చేస్తూ ఆ పెట్టెను తెరువగా అందులో ఉండే కృష్ణుని విగ్రహము కనబడింది. తరువాత ఆ వేణుగోపాలుని విగ్రహాన్ని శిష్యునికి బహూకరించి పూజించమన్నాడు శ్రీపాదరాయలు. అందుకేనేమో వ్యాసరాయల అంకితముద్ర శ్రీకృష్ణుని పేరిలో ఉన్నది (కృష్ణా నీ బేగనె బారో, ఇత్యాదులు). ఇతని తరువాత వచ్చిన చాలమంది వాగ్గేయకారులు విఠల నామాన్ని తమ అంకితముద్రలో వాడడము కూడ ఇతని రంగవిఠల అంకితముద్ర ప్రభావమే.
ద్వైతమతము -తత్త్వవాదము
శ్రీపాదరాయలు, వ్యాసరాయలు మున్నగు వారందరూ మధ్వమతావలంబులు. మధ్వాచార్యులు క్రీ.శ. 1238-1317 మధ్య కాలములో జీవించాడు. మధ్వాచార్యులు నారాయణ భట్టు, వేదవతి దంపతులకు పుట్టాడు, ఇతనికి పూర్వాశ్రమములో వాసుదేవుడు అని పేరు. అచ్యుతప్రేక్షుడనే యతికి శిష్యుడుగా పూర్ణప్రజ్ఞుడనే పేరుతో ఇతడు సన్యాసాన్ని స్వీకరించాడు. తరువాత వాదవివాదాలలో ఇతడు చాల మంది పండితులను ఓడించగా, గురువైన అచ్యుతప్రేక్షుడు ఇతనికి ఆనందతీర్థుడనే పేరు నిచ్చి వేదాంతసామ్రాజ్యానికి సార్వభౌముడిగా చేశాడు. ఇతడు శంకరుని అద్వైత మతములో తార్కికముగా ఎన్నో లోటులను ఎత్తి చూపి మహాభారతానికి తాత్పర్యాన్ని, భగవద్గీతకు ఒక కొత్త భాష్యాన్ని రచించాడు. చివరకు ద్వైతమతాన్ని స్థాపించాడు. దీనినే తత్త్వవాదమని కూడా అంటారు. మధ్వ మతావలంబులు ఆచార్యులను హనుమంతుని, భీముని తరువాతి అవతారమని తలుస్తారు. ద్వైత సిద్ధాంతములో హరి సర్వోత్తముడు, వాయువు జీవోత్తముడు. జీవాత్మ పరమాత్మలకు, జడమునకు పరమాత్మకు, జీవాత్మకు జీవాత్మకు, జడమునకు జీవమునకు, జడమునకు జడమునకు భేదమున్నదన్నదే ఈ తత్త్వపు వాదన. ‘సోऽహం’ కాదు ‘దాసోऽహం’ అన్నదే భక్తికి ముక్తికి మార్గము.
మధ్వాచార్యులను గంధర్వ విద్యానిపుణుడని, సామగానప్రియుడని, వనస్పతులను చిగురింపజేసేవాడని చెబుతారు. ఇతడు వ్రాసిన ద్వాదశ స్తోత్రము చాలా అందమైనది. తత్త్వవాదపు మౌలిక అభిప్రాయాలను తెలుపడము మాత్రమే కాక, సంగీతపరముగా కూడా ఈ స్తోత్రములోని 12 అధ్యాయాలు శ్రవణానందముగా ఉంటాయి. ఇప్పుడు కూడా దేవతార్చనలో నైవేద్య సమయములో వీటిని రాగయుక్తముగా పాడడము పరిపాటి. ఇతడు క్రౌంచపదవృత్తముగా వ్రాసిన ‘అంబరగంగ చుంబిత పాద’ అనే పద్యాన్ని నేను నన్నెచోడునిపై వ్యాసములో ఉదహరించాను. ఇవన్నీ విపులముగా ఇక్కడ వివరించడానికి కారణం మధ్వాచార్యుల కాలమునుండి దేవతార్చనలో, మతప్రచారములో సంగీతము ఒక ముఖ్యమైన భాగముగా ఉండిందని తెలుపడానికే. ఈ ద్వాదశస్తోత్రములోని ఒక రెండు ఉదాహరణలను కింద ఇస్తున్నాను –
వందే వంద్యం సదానందం వాసుదేవం నిరంజనం
ఇందిరాపతిమాద్యాది వరదేశవరప్రదం (1.1)
సదానందుడు, నిరంజనస్వరూపుడు, వంద్యుడు, వరప్రదులకు వరప్రదుడైన ఆ ఇందిరాపతి వాసుదేవునికి నమస్సులు.
బహుచిత్రజగద్బహుదాకరణాత్
పరశక్తిరనంతగుణః పరమః
సుఖరూపమముష్య పదం పరమం
స్మరతస్తు భవిష్యతి తత్సతం (4.3)
ఎన్నో చిత్ర లోకాలను ఎన్నో సారులు సృష్టించిన ఆ పరమేశ్వరుడైన శ్రీహరి పాదాలను స్మరిస్తే అనంతసంతోషము లభిస్తుంది.
వామన వామన భామన వందే
సామన సీమన శామన వందే
శ్రీధర శ్రీధర శంధర వందే
భూధర వార్ధర కంధరధారిన్ (5.7)
ఓ వామనా, దుష్ట శిక్షకా, శిష్టరక్షకా, జ్ఞానప్రదాతా, ధర్మసీమను కాపాడువాడా, శక్తిప్రదాతా, జగద్రక్షకా, నీకు నమస్సులు. ఓ శ్రీధరా, సమస్తైశ్వర్యనిలయా, శ్రేష్ఠాకారా, భూధరా, జలధరా, శంఖగ్రీవా, నీకు నమస్సులు.
నందితీర్థోరుసన్నామినో నందినః
సందఘానాః సదానందదేవే మతిం
మందహాసారుణాపాంగదత్తోన్నతిం
నందితాశేషదేవాదివృందం సదా
ప్రీణయామో వాసుదేవం
దేవతామండలాఖండమండనం (8.11)
నందితీర్థులమనే పేరితో ఆనందమును పొందినవారైతిమి. ఎల్లప్పుడు ఆనందమతులై దేవునిపై ధ్యానము నుంచినారము. దేవతలకందరికీ ఆనందమును కలిగించువాడైన మందహాసుని, అరుణాపాంగవీక్షణుని వందించుచున్నాము. సమస్తదేవతల మండలానికి తలమానికమైన నీవు తృప్తుడౌదువుగాక!
ఆనందచంద్రికాస్యందక వందే
ఆనందతీర్థపరానంద వరద (12.9)
ఆనందతీర్థా, పరము అనే ఆనందాన్ని ఇచ్చువాడా, నీ దీవెనలు ముక్తులకు ఆనందచంద్రిక వంటిది.
దాససాహిత్యపు పునాదులు
అసలు మొట్ట మొదట ఇటువంటి దాస సాహిత్యాన్ని కన్నడములో సృష్టించింది ఎవరు అనేది ఇంకా వివాదాంశమే. ఆ కాలపు కర్ణాటక దేశములో ఇప్పటి మహారాష్ట్ర, ఆంధ్ర దేశాలలో కొన్ని భాగాలు కూడా ఉండేవి. జైన, బౌద్ధ, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత ధర్మాల కూడలి ఈ ప్రదేశము. బసవేశ్వరుని వచనాలు, అక్కమహాదేవి వచనాలు వీరశైవ సిద్ధాంతాలను ప్రాచుర్యములోకి తెచ్చాయి. ఉదాహరణకు బసవేశ్వరుని ఈ వచనము అర్థం చేసికొనడానికి ఎంత సులభమో, అర్థములో అంత మహత్తరమైనది –
నాదప్రియ శివనెంబరు, నాదప్రియ శివనల్ల
వేదప్రియ శివనెంబరు, వేదప్రియ శివనల్ల
నాదప్రియనూ అల్ల, వేదప్రియనూ అల్ల
భక్తిప్రియ నమ కూడలసంగమదేవ
నాదప్రియు డందురు శివుని, నాదప్రియుడు కాడు శివుడు
వేదప్రియుడు డందురు శివుని, వేదప్రియుడు కాడు శివుడు
నాదప్రియుడు కాడు, వేదప్రియుడు కాడు
భక్తిప్రియుడు మన కూడల సంగమదేవుడు
నరహరి తీర్థులు
అచలానందుని దాసులలో 60 మంది ఆద్యులను ప్రథమ హరిదాసులంటారు. మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడైన నరహరితీర్థులు ఈ హరిదాస సాహిత్యానికి నాందీవాక్యము పలికాడని అంటారు. ఈ నరహరి తీర్థులను గురించి కొద్దిగా ఇక్కడ చెప్పడము అవసరము.
ఇతడు మధ్వాచార్యుల శిష్యులలో ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తాడు. ప్రథమ శిష్యుడు పద్మనాభతీర్థులు, నరహరి తీర్థులు ఇద్దరూ ఆంధ్రులు, గోదావరీతీర నివాసులు. నరహరి తీర్థుల పూర్వాశ్రమపు పేరు శ్యామ శాస్త్రి (లేక స్వామి శాస్త్రి). శ్రీకూర్మములో చాల యేండ్లున్నట్లు ఆలయ శాసనాలు తెలుపుతాయి. కొందరు ఇతడు కూచిపూడి నాట్యాచార్యుడైన సిద్ధేంద్రయోగికి గురువని కూడా చెబుతారు. బహుశా రాజమహేంద్రవరములో మధ్వాచార్యులతో వాదించి ఓడిపోయి అతని శిష్యుడయ్యాడు. నరహరితీర్థులను మధ్వాచార్యులు కళింగదేశానికి పంపుతాడు. ఆ కాలములో భానుదేవుడు కళింగదేశపు రాజు. ఈ భానుదేవుడు క్రీ.శ. 1278లో చనిపోయాడు. ఇతని కొడుకు రెండవ నరసింహదేవుడు పసివాడు. రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక రాజప్రతినిధి కావాలి. ఒక ఏనుగు పూలమాలతో పురవీధులలో వెళ్ళుతూ అక్కడ నిలిచి ఉన్న నరహరితీర్థుల మెడలో ఆ మాలను వేసింది. నరహరితీర్థులు రాజప్రతినిధిగా రాజ్యాన్ని చక్కగా శత్రువులనుండి కాపాడతాడు.
పన్నెండు సంవత్సరాల తరువాత రాజ్యాన్ని నరసింహదేవునికి అప్పగిస్తాడు. రాజు నీవేదైనా కోరుకో, నీకు కావలసింది ఇస్తాను అని చెప్పగా నరహరితీర్థులు మధ్వాచార్యుల ఆజ్ఞానుసారము అక్కడ కోశాగారములో ఉండే మూలరాముల, సీతాదేవి విగ్రహాలను అడగగా, రాజు ఇస్తాడు. దానిని తీసికొని ఉడుపికి వెళ్ళి మధ్వాచార్యులకు అర్పించాడని చెబుతారు. ఈ మూలరాముల విగ్రహము (ఇక్ష్వాకు మహారాజు చేత పూజించబడి, దశరథునికి సంక్రమించి, పిదప లక్ష్మణ హనుమంతులచే అర్చించబడి, భీమునిచే పూజించబడి గజపతి రాజులకు ఇవ్వబడిన ప్రతిమ) నేడు కూడా శ్రీరాఘవేంద్ర మఠములో అర్చనలను అందుకొంటున్నది. నరహరితీర్థుల ప్రేరణ వల్లనే యక్షగానాలను తుళునాడులో బయలాట రూపములో మధ్వాచార్యులు ప్రవేశ పెట్టారని అంటారు. (జయదేవుని గీతగోవిందపు ప్రేరణ యేమో?) ఈ నరహరితీర్థులు ఉడుపిలో కన్నడమును అభ్యసించి కీర్తనలను వ్రాసినాడు అంటారు. నేడు మనకు మూడు కీర్తనలు లభ్యమవుతున్నాయి (తిళికో నిన్నొళగె నీనె మరుళె, ఎంత మరుళాదె, హరియే ఇదు సరియే). అందులో ‘హరియే ఇదు సరియే‘ అనే కీర్తనను ఇక్కడ ఇస్తున్నాను –
పల్లవి:
అనుపల్లవి:
చరణం:
వితతవాహుదె నిన్న పతిత పావన కీర్తి
చరణం:
భక్తవత్సల నామ వ్యర్థవాగదె
చరణం:
నగధర ఎన్న బిడువ బగె ఏనిదు
చరణం:
కీయనె, నా పరకీయనె నినగె
చరణం:
నెంటనె నినగె బంట నానల్లవె
చరణం:
కొట్టళు అవళేన బిట్టదు నానేన
చరణం:
మొరె హొక్కెను నా నరహరి పూర్ణనె
హరి నీ కిది సరియా
చరణ సేవకునిపై కరుణ చూపవేల
పతితుడని శ్రీపతి కావకున్న
వితత మగునె నీదు పతిత పావన కీర్తి
శక్తుడై నీవేల భక్తుని కావవు
భక్తవత్సల పేరు వ్యర్థమగునే
దిగులు జెందక తన్నిన భృగుని కాచితివి
నగధర నన్ను విడుచు తెరగు ఏమిటి
హేయు డజామిళుని బ్రోచితివి స్వ-
కీయుడె, నే పరకీయుడె నీకు
దుష్ట హిరణ్యకుని పాపము బాపితివి
చుట్టమె నీకు, బంటు నేనే గద
తుచ్ఛ అహల్యను మెచ్చి పాలించ
యిచ్చెనె నీకేమి, ఇవ్వని దేమి నేను
దొర నీదు మనసుకు సరియగు నట్లు చేయి
మొర లిడెదను నే నరహరి పూర్ణుడ
కాని కొందరు విమర్శకులు ఇవి నరహరితీర్థుల కాలము నాటిది కావంటారు. మూడు పాటలలో మూడు విధాలైన అంకితాలు ఉండడము ఒక కారణము. ఆ కాలపు పాటలలో అనుపల్లవి లేదు. పై పాటలో అనుపల్లవి ఉంది. అదియును గాక ఆంధ్రుడైన నరహరితీర్థులు కన్నడము నేర్చుకొని ఇలాటి పాటలను ఎలా వ్రాసి ఉంటాడు అన్నది మరొక కారణము. నా ఉద్దేశములో మూడవది ఒక కారణము కాదు. సకలవిద్యా పారంగతులైన సన్యాసులకు కొత్త భాషను నేర్చుకొనడము కష్టమేమీ కాదు. ఏది ఏమైనా ఇటువంటి పాటలు చాల తక్కువ. మొట్ట మొదట విరివిగా కన్నడములో శ్రీహరి కీర్తనలను వ్రాసింది శ్రీపాదరాయలే అనడములో సందేహము లేశమైనా లేదు.
శ్రీపాదరాయల కీర్తనలు
జి. వరదరాజరావు సంపాదకత్వములో ప్రచురించబడిన ‘శ్రీపాదరాజర కృతిగళు’ పుస్తకములో సుమారు వంద కృతులు ఉన్నాయి. అందులో కొన్నిటికి ఒకే ఒక ఆధారము, కొన్ని సందిగ్ధ రచనలు. శ్రీపాదరాయలు కన్నడములో మాత్రమే గాక సంస్కృతములో ‘వాగ్వజ్ర’ అనే గ్రంథాన్ని రచించాడు. శ్రీపాదరాయల కీర్తనలలో కొన్నిటికి పల్లవి, అనుపల్లవి, చరణాలు ఉన్నాయి; మరి కొన్నిటికి అనుపల్లవి లేక పల్లవి చరణాలు మాత్రమే ఉన్నయి. అన్నమాచార్యుల సంకీర్తనములలో కూడ అనుపల్లవి అరుదు.
మొదట నేను అతడు వ్రాసిన కొన్ని కీర్తనలను పరిచయము చేస్తాను:
1. కంగళిద్యాతకో – తోడి రాగము, రూపక తాళము.
పల్లవి:
అనుపల్లవి:
రంగన శ్రీపాదంగళ నోడదె
చరణం:
బందు భూమియల్లి నిందు
చంద్ర పుష్కరిణి స్నానవ మాడి ఆ –
నందదిందలి రంగన నోడద
చరణం:
విరజానది స్నానవ మాడి
పరమవైకుంఠ రంగమందిర
పరవాసుదేవన నోడద
చరణం:
తోర ముత్తిన సరవ ధరిసి
తేరనేరి బీదిలి
మెరెవ రంగవిఠలన నోడద
కన్ను లింకెందుకో కావేరి రంగని జూడని
జగమ్మునందు మంగళరూపుని
రంగని శ్రీపాదమ్ముల జూడని
ఎప్పుడైన నొక్క సారి
వచ్చి వసుధ జనులు జేరి
చంద్రపుష్కరిణిలోన మునింగి యా-
నందమొందుచు రంగని జూడని
హరిపాదోదక మీ కావేరి
విరజానది స్నానముజేసి
పరమ పదమ్మగు రంగధామపు
పరవాసుదేవుని జూడని
రత్నమాల వైజయంతి
మంచి ముత్తెపు సరము దాల్చి
తేరు నెక్కి వీధిని
మెఱయు రంగవిఠలుని జూడని
2. బారో నమ్మ మనెగె – వరాళి రాగము, ఆది తాళము.
పల్లవి:
చరణం:
గుల్లు మాడదె మొసరెల్ల సవిద కృష్ణ
చరణం:
మస్తకదలి పరవస్తు తోరిద కృష్ణ
చరణం:
గెజ్జెయ కట్టి తప్హెజ్జెయ నిక్కుత
చరణం:
మ్యారె ఇల్లదె కర తోరెంద శ్రీకృష్ణ
చరణం:
రంగవిఠల భవభంగవ పరిహరిసో
రారా యింటి కిపుడు గోపాలకృష్ణ
గొల్ల బాలకులపై మెల్లగ భుజ మెక్కి
సద్దు జేయక వడి చల్ల ద్రాగు కృష్ణ
కస్తూరి తిలకము శిస్తుగ నుదుట బెట్టి
మస్తకమున పరవస్తు వుంచిన కృష్ణ
ముజ్జగము లెల్ల బొజ్జలో బెట్టి
గజ్జెలు గట్టి తప్పు టడుగు వేయుచు
భామినులు వదలిన చీరల బలు దాచి
ఏమియు తెలియక నటియించెడు శ్రీకృష్ణ
అంగనలకు వ్రతభంగము జేసిన
రంగవిఠల భవభంగము పడగొట్టర
3. భూషణకె భూషణ – సారంగ రాగము, ఝంపె తాళము.
పల్లవి:
శేషగిరివాసా శ్రీ వర వెంకటేశ
చరణం:
కాలిగె భూషణ హరియాత్రెయు
ఆలయకె భూషణ తులసి వృందావన వి-
శాల కర్ణకె భూషణ విష్ణు కథెయు
చరణం:
మానవే భూషణ మానవరిగె
జ్ఞానవే భూషణ మునియోగివరరిగె
మానినిగె భూషణ పతిభక్తియు
చరణం:
మంగళాంగగె మణివ శిర భూషణ
శృంగార తులసిమణి కొరళిగె భూషణ
రంగవిఠల నిమ్మ నామ అతి భూషణ
అందమున కందము యిది యందము
అహిశైలవాస శ్రీ వరవేంకటేశ
నాల్క కగు నందము నారాయణుని పేరు
కాలికి యందము హరియాత్రలె
ఆలయపు టందము తులసి బృందావవనము
చాల యందము చెవికి విష్ణు కథలు
దానమే యందము యిరు చేతులకును
మానమే యందము మానవులకు
జ్ఞానమే యందము మునియోగివరులకు
మానినికి యందము పతిభక్తియె
రంగడిని చూచుటయె కనుల కగు నందము
మంగళాంగుని గొల్చు తల యందము
శృంగార తుళసిమణి కుత్తుక కందము
రంగవిఠల నీదు పేరెంతొ యందము
(భూషణము అంటే నగ, నగ ధరిస్తే అందముగా ఉంటుంది కదా, అందువల్ల భూషణ అనే పదాన్ని అందము అనే అర్థములో అనువాదము చేసినాను.)
4. కొంబు కొళల – మాయామాళవగౌళ రాగము, అట తాళము.
పల్లవి:
అంబుజనాభగె మన హంబలిసుత్తదె యవ్వా
చరణం:
బెడగుగారన కూడె నుడి తెరళిత్తె యవ్వా
చరణం:
ఆతన కాణదె మన కాతరిసుతిదె యవ్వా
చరణం:
మన్నణెగారన కూడె హెణ్ణు జన్మ సాకె యవ్వా
చరణం:
మనసిజపితనొడనె మన తెరళితె యవ్వా
చరణం:
గోపజనర కూడిద శ్రీపతి రంగవిఠలా
చారు మురళి మ్రోయించి వెడలిపోయెను నమ్మించి
వారిజనాభుని మది కోరుచు కుందెనె యమ్మా
నడువజాలమె యమ్మా అడుగుల నుంచలేమె
సొగసుగాడిని దలువ నుడి కంపించె నమ్మా
ఆడకుంటి మాట లమ్మా ఓడినా మే వానికొఱకు
వాడిని గానక మది వాడె గలత నమ్మా
అన్నపాన మేమి లేదే కన్నుల నిదుర రాదే
మన్నన వానిని జేర కన్నె బదుకు చాలునె యమ్మా
అనఘుని వార్తలకు మది గోరును గాదా
మనసిజపితునికై మది కదలెనె యమ్మా
గోపుని వార్తలకు తాప మధికమాయె నమ్మా
గోపజనుల గూడిన శ్రీపతి రంగవిఠలా
5. పోపు హోగోణ – ధన్యాసి రాగము, ఆది తాళము.
పల్లవి:
పోపు హోగోణ బారో
చరణం:
జానకియ వివాహవంతె జాణ నీ బరబేకంతె
చరణం:
శిశుపాలన ఒల్లళంతె నినగె వాలె బరెదళంతె
చరణం:
రాజ్యవన్ను బిడబేకంతె రంగవిఠల బరబేకంతె
వేగ వెడదాము రారా రంగ
వేగ వెడదాము రారా
జాహ్నవీ తీర మంట జనకరాయల తనయ యంట
జానకికి వివాహ మంట వెంటనే రావాలంట
కుండినుని నగర మంట భీష్మకుని దుహిత యంట
శిశుపాలుని గోర దంట నీకు కమ్మ వ్రాసె నంట
పాండవులు కౌరవులకు జూదమాడి యోడి రంట
రాజసభను విడవాలంట రంగవిఠలుడు రావాలంట
6. నందనందన – వసంతరాగము, అఠతాళము.
నందనందన పాహి గుణవృంద
సుందరరూప గోవింద ముకుంద
దినకరభవపాల కనకాంకితచేల
జనకజాలోల జనకానుకూల
పవనజపరివార యవనవిదార
నవరత్నహార నవనీతచోర
తుంగ విహంగతురంగ దయాపాంగ
రంగవిఠల భవభంగ శుభాంగ
ఉగాభోగములు
ఇంతకు ముందే చెప్పినట్లు కన్నడములో వచనములు సుప్రసిద్ధములు. వచన శైలిలో తాళము లేక రాగయుక్తముగా పాడడానికి అనుకూలముగా వ్రాయబడినవే ఉగాభోగములు. సామాన్యముగా త-న-న, త-ద-రి-న లాటి అర్థముకాని ఊత పదాలతో రాగాలాపన చేస్తారు. ఈ ఉగాభోగములలో రాగాలాపన అర్థవంతములైన పదాలతో ఉంటుంది. తరువాతి వాగ్గేయకారులకు ఇవి కరదీపికలాంటివి. కింద శ్రీపాదరాయల ఉగాభోగములలో రెంటిని మీకు పరిచయము చేస్తున్నాను:
కరుణది తనుమనధనంగళెల్లవు
నిన్న చరణకమలకొప్పిసిద బళిక
మరళి ఎన్న మరుళుమాడువరె
సరకు ఒప్పిసిద మ్యాలె సుంకవుంటె దేవా
కరుణాకర నిన్న చరణదడియొళిట్టు కాయో రంగవిఠల
దయకై తనుమనధనమ్ము లన్నిటి
నీదు పదకమలములం దుంచితిని
మఱిక నన్ను మాయ జేసెదవె
సరకు నొసగితిని పిదప సుంక మేల నయ్యా
కరుణాకర నీదు యడుగులందు జేర్చికావుమ రంగవిఠల
ధ్యానవు కృతయుగది
యజన యజ్ఞవు త్రేతాయుగది
దానవాంతక దేవతార్చనె ద్వాపరయుగది
ఆ మానవరిగెష్టు ఫలవో అష్టు ఫలవు
కలియుగది గానదలి కేశవ యెనలు
కైగొడువను రంగవిఠల
ధ్యానము కృతయుగమున
యజ్ఞయాగము త్రేతాయుగమున
దానవాంతకుని దేవతార్చన ద్వాపరయుగమున
ఆ మానవుల కెంత ఫలమో యంతె ఫలము
కలియుగమున గానమున కేశవ యనగ
కాపాడును రంగవిఠలుడు
ఈ ఉగాభోగము విష్ణుపురాణములోని కింది శ్లోకమునకు అనువాదమే!
ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞైః
త్రేతాయాం ద్వాపరోऽర్చయన్
యదాప్నోతి తదాప్నోతిః
కలౌ సంకీర్త్య కేశవం
వృత్తమాలిక
శ్రీపాదరాయలు ప్రవేశ పెట్టిన మరొక కొత్త పంథా వృత్తమాలిక. వృత్తమాలికలోని విశేషమేమంటే మొట్టమొదట వృత్తములా ఒక పద్యము ఉంటుంది, దీనిని రాగయుక్తముగా పాడవచ్చును, కాని దీనికి తాళము ఉండదు. దీని తరువాత ఒక పదము ఉంటుంది, ఈ పదమునకు రాగము, తాళము రెండు ఉంటాయి. ఉదాహరణ కావ్యాలలో కూడ మొదట చంపకమాలలాటి ఒక వృత్తము ఉంటుంది, తరువాత తాళబద్ధమైన కళిక, అందులోని సగమైన ఉత్కళిక రగడ రూపములో ఉంటాయి. పాల్కురికి సోమనాథుని నమశ్శివాయ రగడ బహుశా ఇతనికి పరిచయమేమో? లేక ఆచార్యులు సంస్కృతమునుండి దీనిని గ్రహించి ఉండవచ్చును. ఉదా. ‘సా విరహే తవ దీనా’ పాడుటకు ముందు ‘యమునాతీర’ అనే శ్లోకాన్ని పాడాలి, తరువాతనే ‘నిందతి చందన’ అష్టపదిని పాడాలి. చాల మంది గాయకులు ఈ నియమాన్ని ఉల్లంఘించడము శోచనీయమే. కింద శ్రీపాదరాయలు వ్రాసిన రెండు వృత్తము, పదములను మీకు పరిచయము చేస్తున్నాను . రేగుప్తి రాగములో, ఝంపతాళములో ఉండే ఈ కీర్తనలో ఇలాటివి తొమ్మిది చేరి వృత్తమాలికగా మారింది.
వృత్తము:
వారిజాంబక, వారిజారివదన, వారాశిజావల్లభ
వారివాహనిభాంగ, వాసవనుత, వాకెమ్మదొం దాలిసో
వారిజోద్భవనయ్య, నిన్న విరహవారాశియొళు ముళుగిహ
నారీనిచయవ పారుగాణిసు కృపానావెయలిందెమ్మను
వారిజాంబక, వారిజారివదన, వారాశిజావల్లభ
వారివాహనిభాంగ, వాసవనుత, పలు కొక్క టాలించరా
వారిజోద్భవజనక, నీదు విరహవారాశిలో మునిగిన
నారీతతి నిదె దాట జేయర కృపానౌకలో మమ్మిప్పుడు
పదము:
మారనెంబవను బలు క్రూర నమ్మగలి నీ
ఊరిగ్హోదుదను కేళి
వారిజాస్త్రవను ఎదెగేరిసెమ్మను బిడదె
హోరువను అహోరాత్రియలి తపిసుత
మారు డెందమున దయ లేదు, మము వీడి నీ
వూరు వీడుటను వినెను
వారిజాస్త్రమును ఎద నెక్కుపెట్టెను విడక
పోరాడు నహోరాత్రములు తపించి
శ్లోకము:
పతి సుత పితృ ముఖ్య భ్రాతృ బాంధవరు ఎంబ
అతిశయ నమగిల్ల ఆలిసో మాతనెల్ల
రతిపతిపిత నీనే రాత్రియొళు కొళలనూదె
క్షితిపతి నిన్నెడెగె క్షిప్రదిం బందెవల్లో
పతి తలిదండ్రు లన్న బిడ్డ బంధువులు వీరి
యతిశయ మది లేదు వినవయ్య మాట నిపుడు
రతిపతిపిత నీ వే రాత్రిలో మురళి నూద
క్షితిపతి నీ దరికి వేగమే వచ్చితిమిగా
పదము:
బాలతనదలి యమునాతీరదలి నీ వత్స
పాలనెయ మాడుతిరలు ఆ
కాల మొదలాగి ఈ వ్యాళె పరియంతరవు
కాలుఘళిగగలదిహ కాంతెయర త్యజిసువరె
బాల్యమున నా యమునా తీరమున నీ వాల
పాలించుచుంటివిగదె యా
వేళ మొదలుకొని యీ వేళ వఱ కెప్పు డొక
కాలు గడియ విడువని కాంతలను వదలెదవె
దండకము
తెలుగులో నన్నయ కాలమునుండి దండకాలు ఉన్నాయి. కన్నడములో సుమారు క్రీ. శ. 1200 కాలములో బంధువర్మ అనే కవి హరివంశాభ్యుదయములో వ్రాసిన దండకమే మనకు లభించిన ప్రథమ దండకస్వరూపము. శ్రీపాదరాయలు శ్రీలక్ష్మీనృసింహ ప్రాదుర్భావము అనే దండకమును వ్రాసినాడు. ఇందులో 546 పంక్తులు ఉన్నాయి, రెండువేలకు పైగా గణాలు ఉన్నాయి. చాల పెద్ద దండకాలలో ఇదొక్కటి.
“శ్రీరమా మానినినీ మానసేందివరోత్ఫుల్ల సంఫుల్ల చంద్రా చిదానంద సాంద్రా సదా సన్నుతేంద్రా నమోపేంద్ర నిస్తంద్ర నీ కేళు” అని ప్రారంభమైన యీ దండకము “రంగవిట్ఠల్ల సన్నామియే శ్రీరమాకామియే ప్రేమియే త్వాన్నమస్తే నమస్తే నమస్తే నమః” అని అంతమవుతుంది. నిత్యపూజలో దండకమును కూడ ఒక పూజాస్తోత్రముగా ప్రవేశపెట్టినవాడు శ్రీపాదరాయలు.
భ్రమరగీతము
భాగవతములోని దశమ స్కంధములో భ్రమరగీతము అనే ఒక అధ్యాయము ఉన్నది. దాని ప్రేరణతో శ్రీపాదరాయలు ఒక భ్రమరగీతాన్ని రచించాడు. శ్రీకృష్ణుడు మధురానగరికి వెళ్ళాడు, ఎన్నాళ్ళైనా తిరిగిరాలేదు. ఇక్కడ రేపల్లెలో గోపికలు విచారముగా తిరుగాడుతుండగా, ఒక భ్రమరాన్ని చూచారు. అది శ్రీకృష్ణునికి స్నేహితుడని, అతని దగ్గరనుండి వచ్చిందని భావించి దానితో తమ విరహబాధను తెలియజేసికొంటారు, శ్రీకృష్ణుని సహవాసమువల్ల తుమ్మెదకు కూడా కృష్ణుడిలా మోసగాడి (కితవా) పట్టము తప్పలేదు. ఈ భ్రమరగీతము దేశి రాగములో అటతాళములో వ్రాయబడినది. నాలుగు పంక్తుల పల్లవితో, ఎనిమిది పంక్తుల తొమ్మిది చరణాలతో ఉండే ఈ గీతము చాల నిడివియైనది. ఈ భ్రమరగీతము శృంగార రసముతో నిండి ఉండే తరువాతి కాలపు పదములకు (ఉదా. క్షేత్రయ్య పదములు), జావళీలకు ఒక విధమైన మూస అని చెప్పవచ్చును. అందులోని మూడవ చరణమును మీకు అనువాదముతో సహా క్రింద అందజేస్తున్నాను:
మధుకుంజవనదల్లి మధువైరి కొళల నూదలు
మధుర నిస్వన కేళీ మదిరాక్షియరెల్ల ధా-
మద ధ్యానవ బిట్టు మృగమదగంపవిడి
దైది మదననయ్యన కాణుత శ్రీహరియ
ముదవేరి తలెవాగి మేదిని నిట్టిసలాగ
మృదువాక్యదొళెమ్మప్పి అధరామృతభోజన
క్కొదగువ సతత సన్నద్ధ నమ్మ నగలి క-
ల్లెదెయాదనెంతో కృపాళు హే కితవా
మధుకుంజవనములో మధువైరి మురళి నూదగ
మధుర నిస్వనము విని మదిరాక్షులు తాము స్వగృ-
హపు ధ్యానము వదలి మృగమద మలదికొని
యచట మదనజనకుని చూచుచు శ్రీనాథు
ముదమెక్క తల దించి మేదిని బె ట్టగ నపుడు
మృదువాక్యముల జుట్టుకొని అధరామృతపానము
నందించ నెపుడు సిద్ధుడు మనల వీడి యతి
కఠినాత్ముడయెనో కృపాళు డో వంచక
వేణుగీతము
రాసక్రీడకు ముందుగా శ్రీకృష్ణుని మోహనమురళీస్వరములను విన్న గోపికలు ఎలా సంభ్రమ పడ్డారో, ఎలా చిత్తభ్రమ చెందారో అనే విషయాన్ని ఒక వేణుగీతలో ఎంత మనోరంజకముగా వర్ణిస్తాడో శ్రీపాదరాయలు!
తందెయ కందనెందు కొంకుళొలిట్టు కందన కెళగిట్టు
అందిగె గెజ్జె కివిగళిగిట్టు ముత్తిన బట్టు
హొందిసి గల్లదల్లి తానిట్టు కస్తూరియ బట్టు
ముందాగి మూగిన మేలళవట్టు మనె బాగిల బిట్టు
కందర్పన శరదింద నొందు బహు
కంది కుందుతలిందువదనెయరు
ఇందిరేశ నానందగానకె
చంద్రముఖియరొందాగుత బరుతిరె
తండ్రిని తనయుడనుచు నెత్తుకొనిరపుడు, పాపను ధర దించి,
అందెల గజ్జె చెవులకు పెట్టి, ముత్యపు బొట్టు
సొంపుగ చెక్కిళ్ళ బెట్టేరు, కస్తూరి బొట్టు
ముందుగా ముక్కున పెట్టుకొనేరు, గృహ ద్వారము విడిచి
కందర్పుని శరముచే బాధపడి
వాడి కుందుచు నిందువదన లా
యిందిరేశు నానందరవళికి
చంద్రముఖులు గుంపులుగా వచ్చిరి
కీర్తనల రాగములు
శ్రీపాదరాయల కీర్తనలు ఈ రాగాలలో పొందుపరచబడియున్నవి. ఇవి నేడు ఈ విధముగా పాడబడుతున్నాయో లేకపోతే శ్రీపాదరాయల కాలములో కూడా ఈ రాగాలలో పాడబడినాయో అన్నది వివాదాంశమే. ఎందుకంటే మోహనలాటి రాగాలు అన్నమాచార్యుల రాగిరేకులలో లేవు. బహుశా అవి వేరే పేరులతో ఆ కాలములో పిలువబడుతూ ఉండేవేమో? ఆ రాగాలు ఇవి – ఆనందభైరవి, ఆరభి, ఆహిరి, కల్యాణి, కాంభోజి, కాపి, కురంజి, కేదారగౌళ, గుండక్రియ, గూర్జరి, తోడి, దేశి, ధన్యాసి, నాట, నాదనామక్రియ, నారాయణి, పున్నాగవరాళి, పూర్వి, బౌళి, భైరవి, మధ్యమావతి, మాయామాళవగౌళ, మాళవశ్రీ, ముఖారి, మోహన, రేగుప్తి, వరాళి, వసంత, శంకరాభరణము, శుద్ధసావేరి, శ్రీ, సారంగ, సావేరి, సురటి, సౌరాష్ట్ర, హిందోళ. ఇందులో ఎక్కువగా (నాలుగు లేక ఐదు కీర్తనలు) కల్యాణి, కాంభోజి, తోడి, నాదనామక్రియ, భైరవి, మోహన, శంకరాభరణ రాగములలో ఉన్నవి. కల్యాణి, ఆనందభైరవి, దేవగాంధారి, సారంగ రాగాలను పాటలలో ప్రత్యేకముగా పేర్కొన్నాడు.
సూళాదులు
సంగీతములో తాళము చాల ముఖ్యమైనది, అందుకే భావ, రాగ, తాళములు కీర్తనలకు అవసరము అంటారు. కాని కర్ణాటక సంగీతములో ఒక ఐదు శతాబ్దములకు ముందు తాళరీతులు శాస్త్రీయముగా వాడబడేవి కావు. ఎన్నో విధములైన విభజనలు ఉండేవి. పూర్వ కాలములో సంగీతములో తాళములను మార్గ తాళములు, దేశి తాళములు అనేవారు. ఈ పద్ధతిలో 5 మార్గ, 120 దేశి తాళములు ఉండేవి. తరువాత 108 తాళాలు, 72 మేళకర్త తాళాలు, నవసంధి తాళాలు, ఇలా ఎన్నో తాళాలు ఉండేవి. కాని ప్రస్తుతము అమలులో ఉండే తాళాలకు సూళాది (సుళాది) సప్త తాళాలు అని పేరు. దీని ప్రకారము ఏడు విధములైన తాళాలు మాత్రమే సంగీతములో ఉంటాయి. వాటి వివరాలను క్రింది పట్టికలో చూడ వీలగును. ఇందులో I లఘువు, O ద్రుతము, U అనుద్రుతము. ఈ లఘువులోని అక్షరాల సంఖ్య అది ఏ జాతికి చెందినదో, దానినిబట్టి ఉంటుంది (త్ర్యస్ర లేక తిస్ర – 3, చతురస్ర – 4, ఖండ – 5, మిశ్ర – 7, సంకీర్ణ – 9). కాని ద్రుతము లఘువులో సగమైనా, దానికి అన్ని జాతులలో రెండు అక్షరాలు మాత్రమే, అదే విధముగా ద్రుతములో సగమైన అనుద్రుతానికి ఒక అక్షరము. ఇలా మనకు 35 విధములైన తాళములు లభిస్తాయి. దీనికి తోడుగా మూడు లయలైన విలంబిత (మెల్లగా), దానికి రెండింతలైన మధ్య, మూడింతలైన దురిత (త్వరగా) లయలను చేరిస్తే మనకు 105 తాళాలు లభిస్తాయి.
తాళము | చిహ్నము | త్ర్యస్ర | చతురస్ర | ఖండ | మిశ్ర | సంకీర్ణ |
ధ్రువ | OIII | 11 | 14 | 17 | 23 | 29 |
మట్య | IOI | 8 | 10 | 12 | 16 | 20 |
రూపక | OI | 5 | 6 | 7 | 9 | 11 |
ఝంప | IUO | 6 | 7 | 8 | 10 | 12 |
త్రిపుట | IOO | 7 | 8 | 9 | 11 | 13 |
అట | IIOO | 10 | 12 | 14 | 18 | 22 |
ఏక | I | 3 | 4 | 5 | 7 | 9 |
ఆ కాలపు ప్రముఖ వాగ్గేయకారులైన శ్రీపాదరాయలు, అన్నమాచార్యులు, వ్యాసరాయలు, పురందరదాసు మున్నగువారందరు తమ కీర్తనాసాహిత్యాన్ని ఈ సూళాది తాళాలకే బద్ధము చేశారు. ఈ ప్రక్రియలో శ్రీపాదరాయల ఘనత ఏమంటే మొట్టమొదటిసారిగా పాటలను తాళమాలికలో వ్రాశాడు. తరువాత ఎందరో వాగ్గేయకారులు ఈ పద్ధతిని అనుసరించినా ఇతడే దీనికి మార్గదర్శి. వీరు నాట (అన్నంతకాలదల్లి నిన్న నానరియదె – ఏడు తాళాలు), భైరవి (ఈ వనదెడెగళు, ఈ లతెవనగళు – తొమ్మిది తాళాలు), సారంగ (నిన్నాధీన శరీర – ఐదు తాళాలు) రాగాలలో మూడు సూళాదులను తాళబద్ధము చేశారు. సూళాదులలో అన్ని తాళాలకు ఒకే రాగము ఉంటుంది., తాళములు కూడ క్రమముగా ధ్రువ, మఠ్య, త్రిపుట, రూపక, ఝంప, అట, ఏక తాళాలలో ఉండాలి. సూళాదులలో కొన్ని తాళాలు మళ్ళీ వాడబడవచ్చును, వాటిలో ఏడుకన్న తక్కువ తాళాలు కూడ ఉండవచ్చును.
ఇతని తరువాత ఎందరో ఇదే చట్రములో సూళాదులను వ్రాశారు. అన్నమాచార్యుల దశావతార సూళాదికి ప్రేరణ కూడ శ్రీపాదారాయలే అని విమర్శకులు భావిస్తారు. పురందరదాసులు, విజయదాసులు కూడ ఎన్నో సూళాదులను వ్రాశారు. ఈ సూళాదులపైన ఒక దీర్ఘ వ్యాసము మరొకప్పుడు మీకు సమర్పిస్తాను.
కీర్తనలలోని భాష, శైలి, యితర విశేషాలు
శ్రీపాదరాయలు వ్రాసిన కన్నడ కీర్తనలను సులభముగా అర్థము చేసికొనవచ్చును. అందులో ఉండే ఆ భాష ఐదు శతాబ్దాల తరువాత ఇప్పుడు కూడ రమ్యముగా, రసవంతముగా, జీవంతముగా ఉంటుంది వినడానికి. ద్వితీయాక్షరప్రాస, అంత్యప్రాసలతో గీతికలు వినసొంపుగా ఉంటాయి. పాటలు నవరసభరితముగా ఉంటాయి. హాస్యము కూడ సున్నితముగా కనబడుతుంది కొన్ని పాటలలో. రుక్మిణీ-సత్యభామల వాదము అందుకొక ఉదాహరణ.
మందరధరను ప్రీతి-
యింద నిన్న పడెదనేనె
ఒందు మణియ కారణది
బందె భామిని సుగుణ కామిని
మందరధరుడు ప్రీతి
తోడ నిన్ను పొందెనేమి
పచ్చ రాయి తెచ్చె ని-
న్నిందు భామిని సుగుణకామిని
అని రుక్మిణి అంటే సత్యభామ ఇలా అంటుంది:
సుమ్మనె బందవళిగె
బ్రహ్మలగ్నది బందెనగె
సామ్యవేనె యాకె నినగె
హెమ్మె రుక్మిణి సుపద్మగంధిని
ఊరకె వచ్చినావు
లగ్నమాడి వచ్చినాను
సామ్య మెకడ మనకు గర్వ
మేల రుక్మిణి సుపద్మగంధిని
సామెతలను, నానుడులను కూడా చక్కగా కీర్తనలలో వాడాడు ఇతడు. ఉదాహరణకు:
ఉంటాద కాలక్కె నెంటరు ఇష్టరు
బంటరాగి బాగిల కాయ్వరు
ఉంటాదతన తప్పి బడతన బందరె
ఒంటెయంతె గోణ మేలెత్తువరు
సంపదల వేళలో బంధు మిత్రులు
బంటులుగా తలుపుల కాతురు
సంపదలు కరిగి బీదగ మారగ
ఒంటెవలె గుడార మెత్తుతారు
మధ్వనామమనే 30 చరణాల కీర్తనలోని ఛందస్సు నాకెంతో యిష్టము. అది పంచమాత్రల సీసపద్యములా ఒక తూగుతో సాగుతుంది. దాని పల్లవి –
జయజయ జగత్రాణ జగదొళగె సుత్రాణ
అఖిలగుణ సద్ధామ మధ్వనామ
జయజయ జగత్రాణ జగములో సుత్రాణ
అఖిలగుణ సద్ధామ మధ్వనామ
శ్రీపాదరాయలు తన పాటలలో యమకములాటి ప్రయోగములను కూడ చేసినాడు. మచ్చుకు ఒక ఉదాహరణ:
ఆనందసదనదొళగె గోపియరు
ఆ నందసుతన కండు
ఆనందభరితరాగి తూగిదరు
ఆనందభైరవియింద
ఆనందసదనములో గోపికలు
ఆ నందసుతుని జూచి
ఆనందభరితులై తూగేరు
ఆనందభైరవిలోన
జోలపాటలను వ్రాయడములో కూడ ఇతనికితడే సాటి. ఉదాహరణకు క్రింది చరణాన్ని చూడండి –
భూమియ చిన్నద తొట్టిల మాడి
సోమసూర్యరెంబ కలశవ హూడి
నేమది వేదగళ సరపణి మాడి
ఆ మహాకాశక్కె కొండిగళ హాకి
భూమిని బంగరు ఊయెల జేసి
సోమసూర్యు లనెడు కలశము బెట్టి
నేమము వేదముల గొలుసుల జేసి
ఆ మహాకాశమున కొండెలు వేసి
మనము ప్రతిదినము యిళ్ళల్లో పాపలకు దృష్టిదోషము తగులుతుంది అని చెబుతుంటాము గదా! ఆ సంఘటనను ఎంత సొగసుగా వర్ణించాడో చూడండి –
దృష్టి తాకితో బీది మెట్టబ్యాడవో
సృష్టియ నారియరెల్లరు కణ్ణిట్టు హీరువరో నిన్న
దిష్టి తగిలెరా వీధి త్రొక్కబోకురా
సృష్టిని గల స్త్రీలందరు కనులతో జుర్రెదరుర నిన్ను
విష్ణువు సర్వోత్తముడైనా, శివుని కూడ మధ్వమతావలంబులు అంతే భక్తితో పూజిస్తారు –
వృషభ నేరిద విషధరన్యారె పేళమ్మయ్య
హసుళె పార్వతియ తపసిగె మెచ్చిద
జటామండలధారి కాణమ్మ
వృషభ మెక్కిన విషధరుడెవరె చెప్పవేమె
పసిది పార్వతీ తపమును మెచ్చిన
జటామండలధారి జూడమ్మ
గుమ్మడిని గురించి కూడా ఒక పాట వ్రాశాడు శ్రీపాదరాయలు –
గుమ్మ బందనెలొ దుర్జన బేడ
సుమ్మనిరెలో రంగయ్య”
గుమ్మ డరుదెంచె ఆటలు చాలు
కిమ్మనకురా రంగయ్య
తరువాతి కాలములో పురందరదాసులు ‘గుమ్మన కరెయదిరే’ అని వ్రాసిన ఒక మంచి పాటకు ఇది బహుశా ప్రోత్సాహమేమో?
సత్యనారాయణవ్రతము మున్నగు నోములు నోచేటప్పుడు దేవునికి అంగపూజ చేస్తారు, దేవుడి ప్రతి అంగాన్ని పేర్కొంటూ అర్చిస్తారు. ఆ పద్ధతిలో ‘శ్రీరంగవిఠలన శ్రీమకుటకె శరణు’ (శ్రీరంగవిఠలుని మకుటమునకు శరణు) అని ఒక కీర్తన చాల చక్కగా వ్రాసినాడు శ్రీపాదరాయలు. ఇది కూడా పంచమాత్రబద్ధమై వినడానికి సొగసుగా ఉంటుంది. అందులో ఒక చరణము –
సొంపునోటద చెలువ సోగెగణ్ణిగె శరణు
సంపిగెయ కుసుమసమ నాసికకె శరణు
గుంపురత్నద కర్ణకుండలగళిగె శరణు
ఇంపుదర్పణనిభ కపోలగళిగె శరణు
సొంపుచూపుల సొబగు సోగ కనులకు శరణు
సంపంగి కుసుమంపు నాసికకు శరణు
గుంపు రత్నపు కర్ణకుండలములకు శరణు
ఇంపుటద్దమొ యను కపోలములకు శరణు
శ్రీపాదరాయల కీర్తనాసాహిత్యములో వాసి, వైవిధ్యము ఉన్నా కూడ సంఖ్యలో అది తక్కువే. అన్నమాచార్యుల, పురందరదాసుల వేలాది కీర్తనల పక్క ఒక వంద పాటల సంఖ్య పెద్దదేమీ కాదు. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. శ్రీపాదరాయలు ముఖ్యముగా మఠాధికారి. మతప్రచారము, నిత్యపూజ, పర్యటనలు, శిష్యులకు పాఠములు నేర్పడము ఇవి అతని దైనందిన చర్య. ఉదయమునుండి రాత్రివరకు ఈ పనులలో అతడు నిమగ్నమై ఉండాలి. తరువాతనే గీతరచన. బహుశా అందువల్లనే కాబోలు ఎక్కువగా సంకీర్తనలను వ్రాయలేదు.
శ్రీపాదరాయలు – అన్నమాచార్యులు
శ్రీపాదరాయలు అన్నమాచార్యులను కలిసినారా అనే ప్రశ్న అప్పుడప్పుడు నాకు కలుగుతుంది. అన్నమయ్య, పురందరదాసుల సమాగమమును గురించి అన్నమయ్య మనుమడు వర్ణించాడు గాని అన్నమయ్య శ్రీపాదరాయల, అన్నమయ్య వ్యాసరాయల ముఖాముఖిని గురించి అతడు వ్రాయలేదు. శ్రీపాదరాయలు, వ్యాసరాయలు, అన్నమాచార్యులు సమకాలీనులు. వీరిలో శ్రీపాదరాయలు అందరికన్న పెద్దవాడు. వీరు ముగ్గురు ఒకే రాజు ఆస్థానములో (చంద్రగిరిలోని సాళువ నరసింహరాజు) ఉన్నారు. ముఖ్యముగా తిరుమల శిఖరాన వెలసిన శ్రీనివాసునిపై భక్తి పారవశ్యముతో పాడారు. పండ్రెండు సంవత్సరాలు దేవునికి పూజ చేసిన వ్యాసరాయలు అదే దేవుడిముందు ప్రతిరోజు పాడిన అన్నమాచార్యులతో మాట్లాడి ఉండడంటే నమ్మ శక్యము కాదు. అన్నమయ్య వ్రాసి శిలాఫలకాలపై చెక్కించిన సూళాదులు తప్పక శ్రీపాదరాయల ప్రేరణ, ప్రోత్సాహములుగా ఉండాలన్న విషయములో అతిశయోక్తి లేదు. కొందరు భిన్న మతాలను అనుసరించడము (అన్నమయ్య విశిష్టాద్వైతుడు, శ్రీపాద, వ్యాసరాయలు ద్వైతులు) దీనికి కారణామేమో అని ఊహిస్తారు. నా ఉద్దేశములో అది కారణము కాదు. శ్రీరంగములో చాలా కాలము గడిపి అక్కడి తమిళ పాశురములను విని అదే విధముగా కన్నడములో ఉద్యమాన్ని ప్రారంభించిన శ్రీపాదరాయలకు ఇట్టి సంకుచిత స్వభావము ఉండి ఉండదని నేను భావిస్తాను. అదియును కాక శ్రీపాదరాయల అనుమతితో శ్రీనివాసుని పూజించిన వ్యాసరాయలు ఆ పూజను విశిష్టాద్వైతరీతులలో చేసినాడు కాని ద్వైతవిధానములో కాదు. కాబట్టి ఇది సబబు అని నాకు తోచదు. బహుశా శ్రీపాదరాయలు, వ్యాసరాయలు రాజగురువులుగా ఉన్నారు. అన్నమయ్యకు నరసింహరాయలకు తరువాతి కాలములో అంతగా పొంతన కుదరలేదు. ఇది ఒక వేళ కారణమేమో? లేకపోతే శ్రీపాదరాయల, వ్యాసరాయల మఠాలలో అన్నమయ్యను గురించిన దాఖలాలు ఉన్నాయేమో? ఔత్సాహికులు ఈ విషయాన్ని బాగుగా పరిశోధించాలి.
ముగింపు
త్యాగరాజ-ముత్తుస్వామి-శ్యామశాస్త్రులను కర్ణాటక సంగీత వాగ్గేయకార త్రయము అని సామాన్యముగా పిలుస్తారు. కాని నిజముగా నేటి కర్ణాటక సంగీతానికి పటిష్ఠముగా పునాదులను వేసినవారు శ్రీపాదరాయలు, అన్నమాచార్యులు, వ్యాసరాయలు. నేటి కర్ణాటక సంగీతానికి ఆద్యుడు, పూజ్యుడు శ్రీపాదరాయలు. శ్రీపాదయతివర్యులను మాధ్వపరంపరలో ధ్రువుని అవతారమని భావిస్తారు. నమ్మితే అది నిజము, లేకపోతే కాదు. కాని హరిదాసపద సాహిత్యాకాశములో శ్రీపాదరాయలు ఒక ధ్రువతార అనడములో సందేహము లేదు. వారిని స్మరిస్తూ వారి రంగవిఠల అంకితముద్రతో, నా ఒక వృత్తమాలికాపుష్పముతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
వృత్తము (సంపఁగి) – మోహన రాగము
ననుగన నిప్పుడే ప్రియసఖా నయమౌ నగుమోముతోడ రా
స్వనముల నూదరా సరసమై సరసా విని పొంగిపోదురా
ధనములు వద్దురా నిజముగా ధరపై ధన మీవె నాకురా
మనసిక వీణగా పలుకురా మను వియ్యది నీదె మాధవా
పదము – మోహన రాగము, అట తాళము
పల్లవి:
తహతహల పడె మనసు త్వర రా
అనుపల్లవి:
మహిళ నిక ముంచ కీ వ్యధలో
చరణం:
నిక పిచ్చి పట్టు నిది నా స్థితి
అకలంక నీకొఱకు చూచితి
ఇక రమ్ము నీవెరా నా గతి
చరణం:
పాటకై వేచె నా వీనులు
ఆటకై చూచె నీ కన్నులు
పూట నే వెదకితిని తెన్నులు
చరణం:
రంగ రాకున్న మది శకలము
శృంగార మోహనా హరి రా
రంగవిట్ఠల యిపుడె దరి రా
ఉపయుక్త గ్రంథసూచి
- ఉదాహరణ వాఙ్మయ చరిత్ర – నిడుదవోలు వేంకటరావు, విజయభాస్కర పబ్లికేషన్స్, హైదరాబాదు, 1968.
- ఛందోవిచారమంజరి – M.P. మంజప్ప శెట్టి మసగలి, మసగలి ప్రకాశన, మైసూరు, 1992.
- ద్వాదశస్తోత్రము – మధ్వాచార్యులు
- నన్నెచోడుని క్రౌంచపదము – జెజ్జాల కృష్ణ మోహన రావు, ఈమాట, మార్చి 2009.
- పదకవితాసార్వభౌముడు క్షేత్రయ్య – జెజ్జాల కృష్ణ మోహనరావు, తెలుగు పలుకు – 2011 తానా సమావేశాల ప్రత్యేక సంచిక, ఈమాట, జులై 2011.
- శ్రీ అన్నమాచార్యుల జీవితచరిత్ర – తాళ్ళపాక తిరువేంగళనాథుడు (చిన్నన్న), పీఠిక వేటూరి ప్రభాకర శాస్త్రి, తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణ, తిరుపతి, 2001.
- శ్రీకృష్ణదేవరాయల ఆంధ్రేతర సాహిత్యము – జెజ్జాల కృష్ణ మోహనరావు, ఈమాట, జులై 2010.
- ప్రముఖ కన్నడాంధ్ర వాగ్గేయకారుల సంకీర్తనలలో తిరుమల శ్రీనివాసుని ప్రశంస – ఒక పరిశీలన – మాళగి వ్యాసరాజ్, నరేంద్ర ఆఫ్సెట్ ప్రింటర్స్, 2000.
- ప్రథమోపలబ్ధ స్వరసహిత సంకీర్తనా శిలాలేఖము – సం. P. V. పరబ్రహ్మ శాస్త్రి, తిరుమల రామచంద్ర, వేటూరి ఆనందమూర్తి, ఆకెళ్ళ మల్లికార్జున శర్మ, N. S. శ్రీనివాసన్ – తి. తి. దేవస్థానం ప్రచురణ, తిరుపతి, 1999.
- శ్రీపాదరాజతీర్థరు
- శ్రీపాదరాజర కృతిగళు – సం. G. వరదరాజరావ్, కన్నడ అధ్యయన సంస్థె, మానసగంగోత్రి, మైసూరు, 1987.
- సా విరహే తవ దీనా – జెజ్జాల కృష్ణ మోహన రావు, సాయి బ్రహ్మానందం గొర్తి, మార్చి 2010.
- సాళువనరసింహరాయలు.
- హరిదాస ఆందోలన – ఒందు అధ్యయన – N. K. రామశేషన్, మిత్రా ప్రింటర్స్, మైసూరు, 1991.
- Glorious History of Orissa.
- Haridasas and Carnatic music.
- Haridasa Literature in Kannada – K. G. Narayana Prasad – from Poet Saints of India, ed. M. Sivaramakrishna and Sumita Roy, pp 166-172, Sterling Publishers, New Delhi, 1998.
- Madhvacharya
- Naraharitirtha