సా విరహే తవ దీనా

భారతీయ సంగీత సాంప్రదాయానికి మూలం సామ వేదం. అతి ప్రాచీనమయిన భరతముని నాట్యశాస్త్రానికి సామవేదంలో ఉపవేదమైన గాంధర్వ వేదమే ఆధారం. ప్రాచీన కళారూపాల్లో సంగీత, నాట్యాలకి చాలా ప్రశస్తి వుంది. ఈ రెండూ కాలానుగుణంగా పరిణామం చెందుతూ అనేక రూపాలు సంతరించుకున్నాయి. అలాంటి రూపాల్లో భరత నాట్యానికీ, యక్షగానానికీ (opera) ప్రత్యేక చరిత్రా, స్థానమూ ఉన్నాయి. భరతనాట్యం కేవలం నృత్యానికే పరిమితమయితే, యక్షగానం నృత్య నాటికగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల పూర్వకాలంలో యక్షాగానాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉండేది.


మేవారి – గీత గోవింద
కపిల వాత్స్యాయన్

శ్రీ జయదేవకవి రచించిన గీతగోవిందము[1] బహుశా భారతీయ సాహిత్యములో మొదటి యక్షగానము అని చెప్పుకోవచ్చు. సరళమైన సంస్కృత పదాలతో నిండిన పద్యాలలో, పాటలలో శ్రీజయదేవుడు గీతగోవింద కావ్యాన్ని రాశాడు. ఇందులో రాధాకృష్ణుల విప్రలంభ (విరహము) సంభోగ (కలయిక) శృంగార వర్ణనలతో నిండిన కావ్యము ఇది. పన్నెండు సర్గలలో ఇరవైనాలుగు అష్టపదులు ఉన్నాయి. అష్టపదిలో ఎనిమిది చరణాలుంటాయి. సంస్కృతములో ప్రబంధము అని పిలువబడే అష్టపది పాట రూపంలో ఉంటుంది. గీతగోవిందములో ముచ్చటగా మూడే పాత్రలు – శ్రీకృష్ణుడు, రాధ, రాధ ఇష్టసఖి.

భారతదేశములో అన్ని ప్రాంతాలలో ఎవరికి తోచిన రాగాలలో, తాళాలలో ఈ అష్టపదులను పాడారు. తెలుగులో ఎన్నో చలన చిత్రాలలో అష్టపదులను పాడారు (ఉదా. విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, మేఘసందేశం). శాస్త్రీయ సంగీత కచేరీల చివరలో కూడా అష్టపదులను పాడడము వాడుక. తెలుగువారికి బాగా పరిచయమైన అష్టపది, విప్రనారాయణ చిత్రంలో భానుమతి పాడిన ‘సా విరహే తవ దీనా’. ఈ అష్టపదిని ఎన్ని రకాలుగా అనువదించారో, స్వరబద్ధం చేశారో పరిశీలించడం మా ఈ వ్యాసపు ఉద్దేశం. గీతగోవిందములో స్నిగ్ధ మధుసూదనము అనే నాలుగో సర్గలో హరివల్లభాశోక పల్లవము అనే ఈ అష్టపది నిందతి చందనం అనే పదాలతో ఆరంభమవుతాయి. దీని పల్లవి సా విరహే తవ దీనా.

ఈ అష్టపదిలో కృష్ణుడు లేని రాధ విరహోత్కంఠితయై పడే వియోగబాధ వర్ణించబడింది. ప్రియుడి విరహంతో ప్రియురాలు దగ్ధమవుతున్నట్లుగా భావించడం అష్టవిధ నాయికా లక్షణాలలో ఒకటి. యమునా తీరంలో ఒక పొదరింటిలో చంచల మనస్కుడై రాధను తలుస్తున్న కృష్ణుణ్ణి సమీపించి, రాధ పడే బాధనీ, నానా అవస్థలనీ ఆమె చెలికత్తె చెప్తుంది. ఈ సా విరహే అష్టపది చతుర్మాత్రాబద్ధమైనది. ప్రతి పంక్తికి ఏడు చతుర్మాత్రలు. చివరి చతుర్మాత్ర స-గణము లేక గ-గణము. అష్టపదిలోని ప్రతీ పదమూ ఒక ద్విపద. ఈ ద్విపదకు అంత్యప్రాస నియమం వుంది.

శ్లో. యమునాతీరవానీర
      కుంజే మంద మాస్థితం
      ప్రాహ ప్రేమభరోద్భ్రాంతం
       మాధవం రాధికాసఖీ

అష్టపది – 8 హరివల్లభాశోకపల్లవము
కర్ణాటరాగైకతాలీతాలాభ్యాం గీయతే

నిందతి చందన మిందుకిరణ మనువిందతి ఖేద మధీరం
వ్యాలనిలయ మిలనేన గరల మివ కలయతి మలయసమీరం
మాధవ మనసిజ విశిఖ భయాదివ భావనయా త్వయి లీనా
సా విరహే తవ దీనా – ధ్రువం (1)

(రాధ విరహం చేత చల్లని వస్తువులయిన గంధాన్నీ, వెన్నెలనీ, మలయమారుతాన్నీ తట్టుకోలేక దూరంగా మసలుకుంటున్నది. ఇవేవీ రాధకి శాంతినివ్వడం లేదు. మన్మధ బాణాల తాకిడికి భయపడిన దీనురాలైన రాధ అనుక్షణమూ నీ భావనలో లీనమై ఉన్నది.)

అవిరల నిపతిత మదనశరా దివ భవదవనాయ విశాలం
స్వహృదయ మర్మణి వర్మ కరోతి సజల నలినీదలజాలం
సా విరహే తవ దీనా – (2)

(మన్మథుడేమో విడువకుండా పుష్పబాణాలను ఎక్కుపెడుతున్నాడు. నీకేమవుతుందోనని ఆ శరాఘాతాలు నీ మీద పడకుండా, నీ రూపాన్ని భద్రంగా తన హృదయాంతరాళాలలో రాధ దాచుకున్నది.)

కుసుమవిశిఖశరతల్ప మనల్ప విలాస కలా కమనీయం
వ్రత మివ తవ పరిరంభసుఖాయ కరోతి కుసుమ శయనీయం
సా విరహే తవ దీనా – (3)

(నీవెప్పుడు వస్తావో అని తహతహలాడుతూ పూలపానుపుని పరిచి వుంచింది. ఆ పడకపై నిన్ను కౌగిలించుకొని ఆనందంగా పడుకోవాలని రాధ కలలు కంటున్నది.)

వహతి చ వలిత విలోచన జలధర మాననకమల ముదారం
విధు మివ వికటవిధుంతుద దంత దలన గలితామృతధారం
సా విరహే తవ దీనా – (4)

(గ్రహణ సమయములో రాహువు కొరికినప్పుడు స్రవించే అమృతబిందువులతో ప్రకాశించే చంద్రునిలా రాధ ముఖం నీకై విలపిస్తూ వున్నది.)

విలిఖతి రహసి కురంగమదేవ భవంత మసమ శరభూతం
ప్రణమతి మకర మధోవినిధాయక కరేచ శరం నవచూతం
సా విరహే తవ దీనా – (5)

(ఏకాంతములో కస్తూరితో నిన్ను మదనమనోహరునిగా చిత్రిస్తున్నది. తరువాత మకరధ్వజాన్ని, మామిడి చిగురును రచించి మన్మథా ఇహ నన్ను బాధించకు, నీకొక నమస్కారమంటున్నది.)

ధ్యానలయేన పురః పరికల్ప్య భవంత మతీవ దురాపం
విలపతి హసతి విషీదతి రోదితి చంచతి ముంచతి తాపం
సా విరహే తవ దీనా – (6)

(రాధకు మనసులో సదా నీవే. ఎప్పుడూ ఆమెకు నీ తలపే. నవ్వుతుంది; ఏడుస్తుంది; అటూ యిటూ తిరుగుతుంది. పిచ్చి పట్టినదానివలె ఉన్నది రాధ.)

ప్రతిపద మిద మపి నిగదతి మాధవ తవచరణే పతితాऽహం
త్వయి విముఖే మయి సపది సుధానిధి రపి తనుతే తనుదాహం
సా విరహే తవ దీనా – (7)

(ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు నీ పేరునే ఆమె జపిస్తుంది. నీ ఉదాసీనత వల్ల ఆమెను చంద్రుడు కూడా కాల్చి వేధిస్తున్నాడు.)

శ్రీజయదేవ భణిత మిద మధికం యది మనసా నటనీయం
హరివిరహాకుల వల్లవయువతిసఖీ వచనం పఠనీయం
సా విరహే తవ దీనా – (8)

(రాధ వియోగబాధను శ్రీకృష్ణునికి సవివరముగా తెలిపిన జయదేవ విరచితమైన రాధ చెలి పలుకులు సదా పఠనీయములు.)

శా. ఆవాసో విపినాయతే ప్రియసఖీ మాలాऽపి జాలాయతే
       తాపోऽపి శ్వసితేన దావదహనజ్వాలాకలాపాయతే
       సాऽపి త్వద్విరహేణ హంత హరిణీరూపాయతే హా కథం
       కందర్పోऽపి యమాయతే విరచయన్ శార్దూలవిక్రీడితం

(రాధ ఇల్లు అడవిలా (అస్తవ్యస్తముగా) వున్నది. ప్రియసఖులను కూడా సహించుట లేదు. వెచ్చని ఊపిరులు వదులుతున్నది. మన్మధుడు జింకను వేటాడే పులిలా ఆమెతో ఆడుతున్నాడు.)

ఇందులోని ఐదవ చరణము ఎంతో భావయుక్తమైనది. దీన్ని చదువుతుంటే షేక్స్‌పియర్ రాసిన కింది పంక్తులు గుర్తుకు వస్తాయి.

More strange than true: I never may believe
These antic fables, nor these fairy toys.
Lovers and madmen have such seething brains,
Such shaping fantasies, that apprehend
More than cool reason ever comprehends.
The lunatic, the lover and the poet
Are of imagination all compact:

– William Shakespeare, A Midsummer night’s dream, Act 5, Scene 1.

ఈ అష్టపదిలోని కొన్ని పదాలని భారతీయ భాషలలో ఆయా భాషల ఉచ్చారణ రీత్యా వాడుతారు. ఒరియాలాటి భాషలలో ళ-కారము, బ-కారము ఎక్కువగా వుంటాయి. తెలుగులాటి ద్రావిడ భాషలలో కూడా కొన్ని పదాల మధ్యలో ఉండే ల-కారాన్ని ళ-కారంగా పలుకుతారు. తమిళ మలయాళ భాషలలో ‘అంత’, ‘చంచతి’ లాటి పదాలను అంద’, ‘చంజ’ లాగా ఉచ్చరిస్తారు.