శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు

మళ్ళీ ఇరవై రోజుల తరువాత సుబ్బయ్యగారిని కలవడం జరిగింది ఏదో మీటింగులో. ఆయన కష్టాలు చెప్పుకొచ్చేడు. కామేశ్వరిగారి తోటి హస్త సాముద్రికం మానిపించాడుట అతి కష్టం మీద. కానీ ఇప్పుడు గత రెండు వారాలుగా సంగీత సాధన చేస్తోంది అని కళ్ళ నీళ్ళెట్టుకున్నాడు. మొదలు పెట్టినప్పుడు ఉదయం ఒక గంట, సాయం కాలం ఒక గంట పాడేదిట. గత వారం రోజులుగా రోజుకి ఏడెనిమిది గంటలు సాధన చేస్తోంది అని బాధ పడ్డాడు. సంగీతమే కదా, అందులోనూ మీ శ్రీమతి గొంతు బాగానే ఉంటుంది గదా అన్నాను తెలివి తక్కువగా.

“గొంతు సంగతేమో గానీ రాగాలు ఎక్కువై పోయాయి. రెండు రోజుల నుండి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తోందండి” అని వాపోయాడు. “మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా రాగాలు తీస్తోందండి. పక్కింటి వాళ్ళు శలవలకి వెళ్ళారు గానీ లేకపోతే నేను కొడుతుంటే ఆవిడ ఏడుస్తోందా అని అనుకునే అవకాశం ఉందండి” అని బాధ పడ్డాడు.

“భలేవారే! మీ సంగతి తెలియని వారెవరున్నారండి మన కాలనీలో,” అని ఊరడించే ప్రయత్నం చేశాను.

“లేదండీ, అప్పుడప్పుడు రోడ్ మీద వెళ్ళేవాళ్ళు ఆగి మరీ వింటున్నారండి,” అంటూ విచారం వ్యక్తం చేశాడు.

నాల్గు రోజుల తరువాత సుబ్బయ్యగారింటి మీదుగా వెళ్ళుతుంటే నాలోని ఆత్మహత్యా సదృశమైన జిజ్ఙాస పురి విప్పింది, సంగీత సాధన గురించి తెలుసుకోవాలని. సుబ్బయ్యగారే తలుపు తీశారు. నన్ను చూసి ఆశ్చర్యపోయారనిపించింది. భయం భయంగా లోపలికి చూసి, “ధైర్యం చేసి లోపలికి రండి, కూర్చోండి” అన్నాడు. లోపలి నుంచి సంగీత సాధన వినిపిస్తోంది.

ఎందా ఆ ఆ ఆ ఆ రో మ ఘా ఆ ఆ ఆ ఆ నుబా ఆ ఆ ఆవులు
ఎందాఆ ఆ రో ఎందా రో ఓ ఓ ఓ ఓ ఓ ఎందా రో మా ఆ ఘా ఆ ఆ నుబావులు

“ఎందరో మహానుభావులు త్యాగరాజు కీర్తన అల్లా కాదనుకుంటానండి పాడడం,” అని నేను అన్నాను.

ఆయన నిట్టూర్చి, “ఆవిడకు చెప్పేంత జ్ఙానం, ధైర్యం నాకు లేవండి. మీరేమైనా ధైర్యం చేస్తానంటే పిలుస్తాను ఆవిడను” అన్నాడు. “అబ్బే వద్దులెండి మీకు లేని ధైర్యం నేనెక్కడ తెచ్చుకోగలను” అని అన్నాను. కానీ ఇంతలో ఆవిడ నన్ను చూసింది.

అన్నయ్యా ఆ ఆ ఆ ఆ ఆ గారూ ఊ ఊ ఊ ఊ మీకు స్వా ఆ ఆ ఆ ఆ గతం

అని ఎందరో..లాగా పాడింది. నిజం చెప్పొద్దూ నాకు కొంత భయం వేసింది. సుబ్బయ్యగారు సమయస్ఫూర్తి ప్రదర్శించి, “అన్నయ్యగారికి అర్జెంట్ పని ఉందట. వెంటనే కాఫీ పట్టుకురా” అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళబోతూ వెనక్కి వచ్చింది.

“అన్నయ్యగారూ, మఘాను బావులు కరెక్టా, మఘోను భోవులు కరెక్టా, మహాను భావులు కరెక్టా?” అని అడిగింది.

“మహానుభావులు కరెక్టు అనుకుంటానమ్మా, అందులో ఆవులు, బావులు, భోనాలు, ఘోరాలు లేవనుకుంటాను,” అన్నాను.

“నలుగురైదుగురు పాడినవి విన్నానండి. అందరూ తలోరకం గానూ పాడారు,” అంటూ ఆవిడ లోపలికి వెళ్ళింది, కాఫీ పెట్టడానికి. ఇలా వింటూ, నేర్చుకుంటూ సంగీత సాధనా అనుకుని నిట్టూర్చాను.

“ప్రద్యుమ్నుడు గారూ, మీరదృష్టవంతులు. మా ఆవిడ మాములుగానే మాట్లాడింది” అని ఆనందపడ్డాడు సుబ్బయ్యగారు. మా ఆనందం బుద్బుద ప్రాయమే అని వెంటనే తెలిసింది. కాఫీ పెడుతూ పాట మొదలు పెట్టింది శ్రీమతి కామేశ్వరి.

వందే హం జగద్వల్లభం దుర్లభం, వందే హం జగద్వల్లభం దుర్లభం
రామనామం యజ్ఙ రక్షణం లక్షణం
రిమపా మపమా రిగారిగరి సామాపామాసానిదాపా పాపామారిపామారి
పారిపామారీరిమపా రీరిరిగగమపామా పానిసానిసానిసారీ నినీపామగారిసా
పదామా గరిసా గరిగరీరిగారిరీరిగారి గగ్గారిర్రీ మమ్మాపప్పా ఘరిఘారీఘరిసా

క్షణక్షణానికి సంగీతంలో ఒత్తులు ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ వందే-హం దగ్గరికి వెళ్ళి ఆ పదాలని ఒత్తి ఒత్తి పీకి పాకం పడుతోంది. గొంతు ఊర్ధ్వ స్థాయికి చేరుకొంటోంది. చేతులు, కాళ్ళ తోటి విన్యాసాలు చేస్తోంది. చెంగున గెంతుతూ నీళ్ళ బిందె మీద చెంచాతో ఘటం వాయిస్తోంది. కాఫీ డబ్బా అనుకుంటాను, దానిమీద కంజీరా వాయించేస్తోంది. మధ్య మధ్య నీళ్ళ గ్లాసు మీద జలతరంగిణి పలికిస్తోంది. నిజం చెప్పొద్దూ నాకు మరికొంత భయం వేసింది. సంగీతంతో కూడా ఇంతగా భయపెట్టవచ్చని మళయాళ తంత్రశాస్త్రాల్లో రాశారని విన్నాను గానీ ఇప్పుడే ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. ఆ ఉత్సాహోద్రేకంలో కాఫీ బదులు కారం, పంచదార బదులు ఉప్పు వేసినా వేయవచ్చు అని అనుమానం వచ్చింది. నిజం చెప్పొద్దూ నాకు ఇంకొంత భయం వేసి వణికాను. ఎందుకైనా మంచిదని లేచాను. నమస్కారం పెట్టి బయటకు నడిచాను.

సుబ్బయ్య గారు నాతోటి వీధిగుమ్మం దాకా నడుస్తూ “నా గోడు ఎవరికీ చెప్పుకోలేను. చెప్పుకోకుండా ఉండలేను” అని దీనంగా అన్నాడు. భుజం తట్టి “ధైర్యంగా ఉండండి. సంగీతసాధన మీద త్వరలో ఆమెకు విరక్తి కలగాలని కోరుకుంటున్నాను” అని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాను. నా మనసంతా సుబ్బయ్యగారి మీద జాలి నిండిపోయింది.

ఇంటికి వచ్చేటప్పటికి శ్రీమతి అమ్లా నాగేష్వర్ మా ఇంట్లో ఉన్నారు. ప్రభావతీ, ఆవిడా ఏదో సీరియస్గా చర్చిస్తున్నారు. నేను లోపలికి వెళ్ళబోతుంటే మా ఆవిడ పిలిచింది.

“నేను డైనింగ్ టేబుల్ మేనర్స్ ఎండ్ ఎటికెట్ మీద కోర్సు చేస్తున్నాను” అని ప్రకటించింది. నేను ఆశ్చర్య పడి లేచే లోపున అమలగారు వెళ్ళిపోయారు.

“లాంగ్ టర్మ్ కోర్సు అయితే రెండు నెలలట, క్రాష్ కోర్సు అయితే రెండు వారాలట,” వివరించింది మా ఆవిడ. “రెండున్నర వేలేనటండీ. కోర్సు అయిన తరువాత పన్నెండొందల కట్లరి సెట్ ఉచితంగా ఇస్తారుట. పైగా ఒక రోజున ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఫైవ్‌స్టార్ హోటల్లో డిన్నర్ ‘ఫ్రీ’ గా కనీసం ఆరేడు వందలు ఖరీదుది, ఉంటుందిట. అంటే ఇంచుమించి మన పెట్టుబడి మనకి తిరిగి వచ్చేసిందన్న మాటేగా” అంటూ టీకా తాత్పర్య సహితంగా వివరించింది. “కోర్సు మన కాలనీ లోనే అరేంజ్ చేస్తున్నారు. ఎల్లుండి నుంచి మొదలు.”

“అరవైనాలుగేళ్ళు వచ్చి నీకెందుకే ఈ కోర్సు, అయినా మనం స్టార్ హోటళ్ళకి వెళ్ళం కదా” అని అన్నాను.

“మీ మొహం, (అదేమిటో మా ఆవిడ నా మొహాన్ని తరచుగా, తేలికగా వాడేస్తుంటుంది.) మొన్న మీ మేనల్లుడి పెళ్ళి, రిసెప్షన్ స్టార్ హోటల్లోనే చేశారు గాదూ. శంకర నారాయణగారి షష్టి పూర్తి, ఆది శేషయ్య, వెంకటలక్ష్మిగార్ల గోల్డెను జూబిలీ ఫంక్షను కూడా అక్కడే చేశారుగా!” తడుముకోకుండా జవాబు ఇచ్చింది.

“అయినా అవి అన్నీ బఫెలే కదా , గుంపులో దూసుకెళ్ళి మనకి కావాల్సింది తెచ్చుకొని తినెయ్యడమే కదా.”

“మొన్న శర్మ గారింట్లో , ఆర్నెల్లు అమెరికాలో ఉండొచ్చిన మిసెస్ హేమ్ ళటా రావ్ టేబుల్ స్పూన్తో తింటుంటే అబ్బురంగా చూశారు కాదూ!” మా ఆవిడ ఏ మాత్రమూ తగ్గలేదు.

“అబ్బురంగా కాదు, ‘ఓ మై గాడ్ వెరీ హార్డ్’ అంటూ చెంచాతో గారెను కోసే ప్రయత్నం చేస్తుంటే, అది ఎగిరి నా ప్లేటులో పడుతుందేమో నన్న భయంతో చూశాను,” వివరణ ఇచ్చుకున్నాను.

“అసలు భోజనం చేసిన తరువాత స్పూను, ఫోర్కు ప్లేట్లో ఎలా పెట్టాలో మీకు తెలుసా?” అని నా శ్రీమతి ఇంకో ప్రశ్న సంధించింది.

“నేను అవేవీ ఉపయోగించను, స్టార్ హోటల్ అయినా స్వంత ఇల్లు అయినా చేతులే వాడుతాను. పైగా భోజనం అయింతరువాత శుభ్రంగా చెయ్యి నాకేస్తాను” అని నిర్లజ్జగా సమాధానం ఇచ్చాను.

“అందుకనే మిమ్మల్ని అప్పలసామి అని అందరూ అంటారు, అయినా డబ్బులు ఆల్రెడీ కట్టేశాను,” అని చెప్పి శ్రీమతి లోపలికెళ్ళిపోయింది. అనగా చాప్టర్ క్లోజ్డ్, నో మోర్ చర్చ అని అర్ధం అన్న మాట. అంతేకాదు, ఇంట్లో కొత్త ఆచారాలు రాబోతున్నాయని కూడా అర్థం అన్న మాట.

‘అయ్యలారా! వీని బ్రదుకునకే టిఖాన లేదు, వీడేమి, సుబ్బయ్యను జూచి జాలిపడుటేమి? డోలు రోలును జూచి జాలిపడునా’ యనుచు జం.శాస్త్రి తలబాదుకొనెను. బదులు జెప్పుటకు సమాధానము లేక నేనునూ శూన్యములోకి జూడ నారంభించితిని.

రచయిత బులుసు సుబ్రహ్మణ్యం గురించి: హాస్యరచయితగా బ్లాగ్లోకంలో ప్రసిద్ధులు. ఇటీవలే వారి రచనల సంకలనం "బులుసు సుబ్రహ్మణ్యం కథలు" ప్రచురించారు.  ...