నేను చదువుతున్న సాక్షి వ్యాసాల పుస్తకం మూసి కిటికీ లోంచి బయటకు చూశాను. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. “ఆ కిటికీ వేసెయ్యండి. వర్షం వస్తే గాలికి చినుకులు లోపలికి పడతాయి. పిల్లలు జారిపడతారు,” ఆజ్ఞ జారీ చేసింది మా ఆవిడ ప్రభావతి. ప్రభావతీ విధేయుడైన ప్రద్యుమ్నుడు అనబడే నేను ఎదురు ప్రశ్న లేకుండా ఆ ఆజ్ఞ పాటించాను. భార్యామణి చెప్పింది చేయడం నాకు నలభయ్యొక్కేళ్ళుగా అలవాటు అయిపోయింది. పెళ్ళికి ముందు అమ్మ కూచి అనేవారు, పెళ్ళి అయిన తరువాత కొంగు చాటు మొగుడు అంటున్నారు. లోకులు పలు కాకులు అని ఊరికే అనరు పెద్దలు. పెళ్ళి అయిన నాల్గోరోజున, భర్త అనే ఒకే ఒఖ్ఖ నమ్మకంతో, ఏమాత్రం పరిచయం లేని నా చెయ్యి పట్టుకొని 3000కిమీలు నా తోటి ప్రయాణం చేసి, నేను పనిచేసే అస్సాం లోని జోర్హట్‌కి వచ్చిన ప్రభావతిని చూసి, “సాధ్యమైనంత వరకు ఈ అమ్మాయి కంట్లో నీరు చూడకూడదు” అని, అనుకున్నాను ఆనాడు. అది ప్రేమతో అనుకున్నానో జాలితో అనుకున్నానో తెలియదు, కానీ భార్యా విధేయుడు అనే బిరుదు నాకు రావడానికి అదే నాంది అనుకుంటాను. 30 ఏళ్ళు అస్సాం లోనూ, 10 ఏళ్ళు హైదరాబాద్ లోనూ పనిచేసి గత నాలుగేళ్ళగా విశ్రాంత జీవనం గడుపుతున్నాను. ఊరికి దూరంగా, ప్రశాంతంగా ఉండే ఈ కాలనీ మాకు నచ్చింది. నాకు మల్లె విశ్రాంత జీవనం గడిపే వాళ్ళు ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు.
నా ఆలోచనలలో నేను ఉండగా, గుమ్మం ముందు చప్పుడు అయింది. తలుపు తెరిచి చూశాను. శ్రీ సోది సుబ్బయ్యగారు, శ్రీమతి సోది సుబ్బయ్యగారు నుంచునున్నారు. సుబ్బయ్యగారు సెక్రటేరియట్లో పని చేసి రెండేళ్ళ క్రితం రిటైరు అయ్యారు. ఇద్దరు మగపిల్లలూ అమెరికాలో ఉంటారు. మనిషి సౌమ్యుడు. మితభాషి. నలుగురికి సాయం చేయడంలో ముందు చేయించుకోడంలో వెనక ఉంటాడు. ఆవిడా మంచిదే కానీ కొంచెం నాలుక పదునెక్కువని అంటారు. ఈ మధ్యనే ఆయనతో పరిచయం అయింది. వ్యాహ్యాళికి బయలుదేరి వర్షం వల్ల మా ఇంటి దగ్గర ఆగి ఉంటారని అనుకున్నాను.
“రండి. లోపలికి రండి,” అన్నాను. శ్రీమతి సుబ్బయ్య ఒక అడుగు ముందుకు వేయబోయింది. అంతలో సుబ్బయ్యగారు “పరవాలేదండీ, వర్షం తగ్గిపోతోంది” అన్నారు. శ్రీమతి సుబ్బయ్య మా ఇంట్లోకి వెయ్యబోయిన అడుగు వెనకకు తీస్కుంది. “భలేవారండి, వాన తగ్గిన తరువాత వెళ్ళవచ్చు రండి లోపలికి” అన్నాను. శ్రీమతి సుబ్బయ్య అడుగు మళ్ళీ ముందుకు వేయబోయింది. సుబ్బయ్య గారు “అబ్బే, లేదండీ. తడిసిపోయామూ. ఇప్పుడు లోపలికి ఎందుకు లెండి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం” అన్నారు. శ్రీమతి సుబ్బయ్య తన పాదం తిరిగి యధాస్థానానికి తీసుకెళ్ళింది. ఇంతలో మదీయ పత్ని శ్రీమతి ప్రభావతీదేవి రంగప్రవేశం చేసింది.
“భలే వారే అన్నయ్యగారూ! ఎక్కడికెడతారూ,” అంటూ శ్రీమతి సుబ్బయ్య చేయి పట్టుకొని లోపలికి లాగింది. క్షణం ఆలస్యం చేయకుండా శ్రీమతి సుబ్బయ్య కుడి కాలు ముందు పెట్టి మా గృహప్రవేశం చేసింది. ఇంక తప్పదన్నట్టుగా, కొంచెం బెరుకుగా, కొంచెం భయంగా, శ్రీ సుబ్బయ్యగారు మా ముందుగదిని వారి తడి పాద ధూళితో పావనం చేశాడు. వారి వెనుకనే నేనూ జం.శాస్త్రీ కదిలితిమి. (శాస్త్రిగారి స్నేహమున నేను చెడిపోవుచున్నానని మదీయ ధర్మపత్ని ఆక్షేపించును, నను వాని వ్యాసములు జదువవద్దనును. గాని, యంతకు మించి దూరమయిన సత్యము లేదు! నేనునూ వారి వలెనే మన చుట్టూ జరుగు ప్రహసనములను శ్రద్ధతో గమనించు యభ్యాసమును జేయబూనుట ఈ అపోహకు గారణమయినది.)
నేను ముందు గది అంటే మా ఆవిడ నా కేసి చురచురా చూస్తుంది. దాన్ని డ్రాయింగ్ రూము అని పిలవాలిట. ఒక టీవీ, నాలుగు కుర్చీలు, నా లాప్టాపూ తప్ప మరేమీ లేని ఆ రూముని అలా పిలవాలంటే నాకు మనస్కరించదు. కానీ ‘సతి మతంబు పతికి సమ్మతం బగు’ అను సూత్రమును నమ్మినవాడిని కాబట్టి, “రండి రండి, ఇలా డ్రాయింగ్ రూంలో కూర్చుందాం” అని వారిని ఆహ్వానించి, సుబ్బయ్య గారికి ఒక కుర్చీ చూపించాను. అప్పటికే సుఖాసీన అయిన శ్రీమతి సుబ్బయ్య “చూశారా అక్కయ్య గారూ, వెధవ వాన ఇప్పుడే పట్టుకోవాలా,” అంది. శాస్త్రి వెంటనే నను తట్టెను. నాకు మిక్కిలి యాశ్చర్యము గలిగెను. ‘అయ్యలారా! నా పత్ని ఆయనను అన్నయ్యగారూ అని పిలిచినదే, మరి యావిడ మాయావిడను అక్కయ్య అని నెట్లు పిలిచెనో! ఏమీ ఈ వింత, ఆడువారి నర్థము జేసికొనుట ఎంత కష్టమో’యని ఆలోచించ బూనితిని. గానీ, యాలోచించుట వలన కడుపు నొప్పి, తలనొప్పి, ఆపైన గుండె నొప్పి కలగవచ్చును, గావున చింతించి, ఒత్తిడి పెంచుకొను ప్రయత్నములు చేయబోరాదని మా మనో విశ్లేషక మిత్రుడు పోరినందున ఆ కార్యక్రమము వాయిదా వేసుకుంటిని. గాని యప్పటికే నా యాలోచన నా ముఖముపై గనబడెనో యేమో, నా ధర్మపత్ని నావైపు నొక కొరచూపు సంజ్ఞ విసిరెను. ప్రభావతి సంజ్ఞలలో ఆజ్ఞలను నిద్రలో కూడా అర్థం చేసుకోగల నేను వెంటనే ఎదురు ప్రశ్న లేకుండా ఆ ఆజ్ఞ పాటించి శాస్త్రిని అటు నెట్టాను. ఇంతలో మా కోడలు, అబ్బాయి వచ్చి హలో అంకుల్, హలో ఆంటీ, అని పలకరించి వెంటనే వారి రూములోకి వెళ్ళిపోయారు ఏదో గుసగుసలాడుకుంటూ. పిల్లలు నిద్రపోతున్నారు కాబట్టి వారి హలోల భాగ్యం సుబ్బయ్య దంపతులకు కలగలేదు.
నేను గొంతు సవరించుకొని “సుబ్బయ్య గారితో కొంచెం పరిచయం ఉంది కానీ మిమ్మలని ఇప్పుడేనండీ చూడడం,” అని శ్రీమతి సుబ్బయ్యగారితో అన్నాను.
“నా పేరు కామేశ్వరి అండీ. మీరు నాకు పరిచయమే. సమాఖ్య సమావేశాలలో మీ ఉపన్యాసం వినక తప్పదు కదండీ. ఆ తరువాతే గదా సమోసాలు, టీ ఇచ్చేది” అని నవ్వింది. లోపలి నుండి మా కోడలి నవ్వు వినబడింది. వెనువెంటనే మా పుత్రరత్నం నవ్వు కూడా వినపడింది. నేనేమనాలో తెలియక నా ట్రేడ్ మార్కు వెర్రి నవ్వు ఒకటి నవ్వాను.
“కాఫీ పెడతానుండొదినా!” అని నా శ్రీమతి ప్రభావతి కిచన్ లోకి వెళ్ళింది. (వెంటనే శాస్త్రి యిటు జరిగి నను గీరెను.) అయ్యలారా! వంటగదియని పిలిచిన నా ప్రభావతి క్రోధించునని కుశాగ్రబుద్దిగల మీరెఱుగుదని నాకు దెలియును. వంటజేయు గదిని వంటగది యనుటలో ఎంత సుఖమున్నది. కిచననిన యేమి, కిచకిచలు జేయు గది యనియా?ఆ పదమునకున్న అర్థమేమి, వాడుటలోని సౌలభ్యమేమి? జీవములేని ఇత్తడి చెంబు యయిననూ మన వంటగదిన నేలపై బడిన చవులూరించు తెలుగున డుంగుడుడుంగుమని దొరలునుగాని డింగుడాంగుమని యాంగ్లమున కీచుమనుచున్నదా! మరి జీవమున్న మనలకేమి ఈ పరభాషా… . నన్నెవరో శల్యపరీక్ష జేయుచున్నారను సహజస్పృహతో నా యాలోచన గతి తప్పి నేను మతిలోని కొచ్చితిని.
శ్రీమతి కామేశ్వరీ సుబ్బయ్య నా చేతి వంక తదేకముగా చూచుచుండెను. అది గమనించిన సుబ్బయ్యగారు కంటితో వలదు, వలదు అని తన శ్రీమతిని వారించుచునుండిరి. నా చేతికేమైననూ ఇందాక తిన్న కందట్టు అవశేషములు ఉండినవేమో యని నా చేతిని ముందు వెనుకలకు దిప్పి చూసుకుంటిని. ఏమియునూ కనిపించలేదు. అసలవి ఉండుటకు నవకాశము లేదు. మా కోడలి యాదేశానుసారము భోజనమునకు ముందు, తరువాత కూడ సబ్బు ద్రావకముతో చేతులు తగు రీతిని బర బరా రుద్ది శుభ్రము చేయుచున్నాను గదా! ఈ తోముడు కార్యక్రమము మా కోడలు, కొడుకు వెళ్ళువరకు చేయవలసినదే గదా యను నొక కొత్త చింత నన్ను పొడవబోయినంతలో…
శ్రీమతి సోది కామేశ్వరీ సుబ్బయ్య “అన్నయ్యగారు! మీ చేయొకసారి ఇలా ఇవ్వండి”, అని యడిగెను. నేను మరల నాశ్చర్య చకితుడనయితిని. ప్రభావతి అక్కగారయిన, నేనెట్లు అన్నయ్య నగుదునను ఇంకొక కొత్త సందేహము నా మదిలో ఇంతింతై ఎదిగిపోసాగెను. ఆహా నేటి కాలపు సంబంధ బాంధవ్యముల నెరుగ నా శక్యమే, ఎంత అజ్ఞానిని అని తలపోయుచుండగా, శ్రీ సుబ్బయ్యగారు వద్దు వద్దు అని జపించుచునే యుండగా, ఆమె యెంతయో యుత్సాహమున నా చేతిని తన చేతితో గుంజి గ్రహించి కూలంకషముగా, క్షుణ్ణముగా పరిశీలించ దొడంగెను. ఈ చర్యతో జం.శాస్త్రి భయంబున వెర్రి కేక నొకటి వేసి పరువెత్తి పారిపోయెను. శ్రీ సుబ్బయ్యగారు పొడుగ్గా నిట్టూర్చి, నా సిగరెట్టు ఒకటి తీసుకొని వెలిగించి, శూన్యంలోకి శూన్యంగా చూడ్డం మొదలెట్టారు.
శ్రీమతి కామేశ్వరీ సుబ్బయ్య తన చేతి సంచి (క్షమించండి, హాండ్ బాగ్ అనాలి) లోంచి ఒక భూతద్దాన్ని తీసి దాంతో మరింత దగ్గరగా నా అరచేతిని చూసింది. నా అరచేయి నాల్గు వైపులా నాల్గు నొక్కులు నొక్కింది. చేయి వెనక్కి తిప్పి, నరములను, చేతి ముణుకులను తన భూతద్వీక్షణములకు గురి చేసింది. చేయి పక్కకు తిప్పి అక్కడి గీతలను, అంతతో సంతృప్తి చెందక నా నుదుటి గీతలను కూడా భూతద్దములో గమనించింది. నాచేత కొన్ని నుదుటి వ్యాయామములు చేయించి, రేఖల ముడతల తీరును పరికించింది.
ఇంతలో కాఫీ నాలుగు కప్పుల్లోనూ, మా ఇంట్లో చెల్లక మిగిలిపోయిన పురావస్తు బూందీ ఒక ప్లేటు లోనూ, అవన్నీ ట్రేలోనూ పెట్టి పట్టుకుని శ్రీమతి ప్రభావతి కిచెన్ లోంచి డ్రాయింగ్రూమ్ లోకి, వయా డైనింగ్రూమ్ వచ్చింది. ఈ మారు శ్రీమతి కామేశ్వరీ సుబ్బయ్య కుడి చేతితో కాఫీ కప్పు పట్టుకొని, తన ఎడమచేత్తో నా ఎడమ చేయిని పట్టుకుని ఆ చేయిని కూడా అన్నీ పరీక్షలకి గురిచేసింది, కాఫీ పీలుస్తూ. శ్రీమతి ప్రభావతి వాళ్ళతోటి బూందీని తినిపించడానికి వ్యర్ధ ప్రయత్నం చేసింది. తినక పోగా, శ్రీమతి కామేశ్వరి “ఈ బూందీ పదిహేన్రోజుల క్రితం మూర్తి గారు పంచిపెట్టిన సారె బూందీ లాగే ఉంది” అని నిర్మొహమాటంగా అనింది. “నో,నో, నాటెటాలొదినగారూ, రెండు రోజుల క్రితం కొత్తపేట స్వీట్ షాప్‌లో కొన్నారు మీ అన్నయ్యగారు,” అని మా ఆవిడ మెత్తగా దబాయించి నావైపు చూసింది. నేను ఎదురు ప్రశ్న లేకుండా ఆ ఆజ్ఞ పాటించి తల నిలువుగా మూడుసార్లు కంపించాను. లోపలి నుండి మా కోడలివి, వెనువెంటనే మా అబ్బాయివీ నవ్వులు వినబడ్డాయి.
శ్రీమతి కామేశ్వరి నాచేతిని విడిచి పెట్టి “ఆహా మీది చాలా అదృష్ట జాతకం ప్రద్యుమ్నుడన్నయ్య గారూ” అని వక్కాణించింది. లోపలినుండి మా కోడలు వెనువెంటనే మా అబ్బాయి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చారు. మా అబ్బాయి డైనింగ్ రూంలో డైనింగ్ టేబుల్‌కున్న డైనింగ్ ఛెయిర్స్ రెండు తీసుకునొచ్చి కోడలు ఒకదానిపై కూర్చున్న తర్వాత రెండో కుర్చీపై వాడు కూర్చున్నాడు. నా అదృష్టాన్ని వినడానికి నా కోడలు, కొడుకు ఎంత ముచ్చటపడుతున్నారో చూసి నాకు ముచ్చటేసింది. సుబ్బయ్యగారు, నా పెట్టెలోంచి రెండు సిగరెట్లు తీసుకుని ముందు సిగరెట్టుతో వెలిగించుకుని శూన్యంలోకి చూడ్డం కొనసాగించేరు.
“మీకు రెండు పెళ్ళిళ్ళు అయి ఉండాలి” శ్రీమతి కామేశ్వరి గారు ఉద్ఘాటించింది. ఒక్క క్షణం నిశ్శబ్దమావరించింది. మరు క్షణమే నేను తేరుకొని “భలేవారే ఇప్పటికీ ఒక్కటే పెళ్ళి, ముందు ముందు ద్వితీయం ఉందేమో తెలియదు” అని నా ట్రేడ్ మార్కు నవ్వుతో అన్నాను. శ్రీమతి ప్రభావతి తన మోచేతితో నా డొక్కలో పొడిచింది. నొప్పిని నా ట్రేడ్ మార్కు లేని నిబ్బరంతో భరించాను.
“లేదు లేదు, ఖచ్చితంగా మీకు రెండు పెళ్ళిళ్ళు అయి ఉండాలి, మీ చెయ్యి చెబుతోంది, శాస్త్రం తప్పు చెప్పదు” అని ఆమె ఘట్టిగా బల్ల గుద్ది పునరుద్ఘాటించింది. రెండు కప్పులు కింద పడ్డాయి. అదృష్టవశాత్తు పగలలేదు.
“ఒక్క పెళ్ళికే మూడు వంతుల జుట్టు ఊడింది, రెండవ పెళ్ళి కూడానా ఈయనకి” అని శ్రీమతి ప్రభావతి పకపక నవ్వింది. “యెస్, యెస్. ఒక్క అత్తగారితోనే ఇంత అవస్తగా ఉంది, ఇంకో మదరిన్లా కూడా ఉంటే నా పరిస్తితి ఓ మై గాడ్” అని మా కోడలు కూడా పకపక మన్నది. వెనువెంటనే మా కొడుకు పకపకమన్నాడు. నా శ్రీమతి పకపక ఆగిపోయింది. శ్రీ సుబ్బయ్యగారు ఈ మాటు తన జేబులో నుండి ఒక లంక పుగాకు చుట్ట తీసి వెలిగించి తన శూన్యదృక్కుల ప్రసారం నిరాటంకంగా, నిర్విఘ్నంగా కొనసాగించారు.
“ఈయనకి స్త్రీ వల్ల ధనలాభం కూడా కలిగి ఉండాలి” అని శ్రీమతి కామేశ్వరి సెలవిచ్చింది.
“ఎనీవే నేను తెచ్చిన కట్నం మా ఆయనకు ప్రాఫిట్. కానీ మా అత్తగారు డౌరీ తేలేదు కదా, మామగారి కేమి లాబం!” అని మా కోడలు జవాబు ఆశించని ప్రశ్న వేసి కిసుక్కున నవ్వింది. యదావిధిగా, యధాశక్తి మా అబ్బాయి మా కోడలి నవ్వు ననుసరించాడు.
శ్రీమతి ప్రభావతి కాఫీ కప్పులు తీసుకొని వయా డైనింగ్ రూమ్, కిచెన్ లోకి విసవిసా వెళ్ళిపోయింది.
నేను ఏమియునూ తోచక మౌనము పాటించితిని. నా కోడలు, ఆమె మొగుడు ఇరువురూ లేచి, తమ గుసగుసల కార్యక్రమము కొనసాగించుకొనుటకై, వారి అభ్యంతర మందిరము లోనికేగిరి. శ్రీ సుబ్బయ్య గారు ఖిన్నవదనుడై లేచి, “క్షమించండి ప్రద్యుమ్నుడు గారూ, ఈ మధ్య మా ఆవిడ హస్త సాముద్రికం, నుదుటిరాత మొదలైన వాటిమీద ఏవో కొన్ని పుస్తకాలు చదువుతోంది. తన కొత్త జ్ఞానంతో ఇలా అందర్నీ ఇబ్బంది పెడుతోంది. చెబితే వినదు. మీకు తెలియనిది ఏముంది” అని గద్గద స్వరమున మరల మరలా బహు విధముల సారీలు జెప్పుచూ భార్యను లేవదీసుకొని పోయినాడు. నేనున్నూ ఈ మారు మారుమాటాడక వారిని సాగనంపి నా పుస్తకమును మరలా తెరిచితిని.
మళ్ళీ ఇరవై రోజుల తరువాత సుబ్బయ్యగారిని కలవడం జరిగింది ఏదో మీటింగులో. ఆయన కష్టాలు చెప్పుకొచ్చేడు. కామేశ్వరిగారి తోటి హస్త సాముద్రికం మానిపించాడుట అతి కష్టం మీద. కానీ ఇప్పుడు గత రెండు వారాలుగా సంగీత సాధన చేస్తోంది అని కళ్ళ నీళ్ళెట్టుకున్నాడు. మొదలు పెట్టినప్పుడు ఉదయం ఒక గంట, సాయం కాలం ఒక గంట పాడేదిట. గత వారం రోజులుగా రోజుకి ఏడెనిమిది గంటలు సాధన చేస్తోంది అని బాధ పడ్డాడు. సంగీతమే కదా, అందులోనూ మీ శ్రీమతి గొంతు బాగానే ఉంటుంది గదా అన్నాను తెలివి తక్కువగా.
“గొంతు సంగతేమో గానీ రాగాలు ఎక్కువై పోయాయి. రెండు రోజుల నుండి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తోందండి” అని వాపోయాడు. “మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా రాగాలు తీస్తోందండి. పక్కింటి వాళ్ళు శలవలకి వెళ్ళారు గానీ లేకపోతే నేను కొడుతుంటే ఆవిడ ఏడుస్తోందా అని అనుకునే అవకాశం ఉందండి” అని బాధ పడ్డాడు.
“భలేవారే! మీ సంగతి తెలియని వారెవరున్నారండి మన కాలనీలో,” అని ఊరడించే ప్రయత్నం చేశాను.
“లేదండీ, అప్పుడప్పుడు రోడ్ మీద వెళ్ళేవాళ్ళు ఆగి మరీ వింటున్నారండి,” అంటూ విచారం వ్యక్తం చేశాడు.
నాల్గు రోజుల తరువాత సుబ్బయ్యగారింటి మీదుగా వెళ్ళుతుంటే నాలోని ఆత్మహత్యా సదృశమైన జిజ్ఙాస పురి విప్పింది, సంగీత సాధన గురించి తెలుసుకోవాలని. సుబ్బయ్యగారే తలుపు తీశారు. నన్ను చూసి ఆశ్చర్యపోయారనిపించింది. భయం భయంగా లోపలికి చూసి, “ధైర్యం చేసి లోపలికి రండి, కూర్చోండి” అన్నాడు. లోపలి నుంచి సంగీత సాధన వినిపిస్తోంది.
ఎందా ఆ ఆ ఆ ఆ రో మ ఘా ఆ ఆ ఆ ఆ నుబా ఆ ఆ ఆవులు
ఎందాఆ ఆ రో ఎందా రో ఓ ఓ ఓ ఓ ఓ ఎందా రో మా ఆ ఘా ఆ ఆ నుబావులు
“ఎందరో మహానుభావులు త్యాగరాజు కీర్తన అల్లా కాదనుకుంటానండి పాడడం,” అని నేను అన్నాను.
ఆయన నిట్టూర్చి, “ఆవిడకు చెప్పేంత జ్ఙానం, ధైర్యం నాకు లేవండి. మీరేమైనా ధైర్యం చేస్తానంటే పిలుస్తాను ఆవిడను” అన్నాడు. “అబ్బే వద్దులెండి మీకు లేని ధైర్యం నేనెక్కడ తెచ్చుకోగలను” అని అన్నాను. కానీ ఇంతలో ఆవిడ నన్ను చూసింది.
అన్నయ్యా ఆ ఆ ఆ ఆ ఆ గారూ ఊ ఊ ఊ ఊ మీకు స్వా ఆ ఆ ఆ ఆ గతం
అని ఎందరో..లాగా పాడింది. నిజం చెప్పొద్దూ నాకు కొంత భయం వేసింది. సుబ్బయ్యగారు సమయస్ఫూర్తి ప్రదర్శించి, “అన్నయ్యగారికి అర్జెంట్ పని ఉందట. వెంటనే కాఫీ పట్టుకురా” అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళబోతూ వెనక్కి వచ్చింది.
“అన్నయ్యగారూ, మఘాను బావులు కరెక్టా, మఘోను భోవులు కరెక్టా, మహాను భావులు కరెక్టా?” అని అడిగింది.
“మహానుభావులు కరెక్టు అనుకుంటానమ్మా, అందులో ఆవులు, బావులు, భోనాలు, ఘోరాలు లేవనుకుంటాను,” అన్నాను.
“నలుగురైదుగురు పాడినవి విన్నానండి. అందరూ తలోరకం గానూ పాడారు,” అంటూ ఆవిడ లోపలికి వెళ్ళింది, కాఫీ పెట్టడానికి. ఇలా వింటూ, నేర్చుకుంటూ సంగీత సాధనా అనుకుని నిట్టూర్చాను.
“ప్రద్యుమ్నుడు గారూ, మీరదృష్టవంతులు. మా ఆవిడ మాములుగానే మాట్లాడింది” అని ఆనందపడ్డాడు సుబ్బయ్యగారు. మా ఆనందం బుద్బుద ప్రాయమే అని వెంటనే తెలిసింది. కాఫీ పెడుతూ పాట మొదలు పెట్టింది శ్రీమతి కామేశ్వరి.
వందే హం జగద్వల్లభం దుర్లభం, వందే హం జగద్వల్లభం దుర్లభం
రామనామం యజ్ఙ రక్షణం లక్షణం
రిమపా మపమా రిగారిగరి సామాపామాసానిదాపా పాపామారిపామారి
పారిపామారీరిమపా రీరిరిగగమపామా పానిసానిసానిసారీ నినీపామగారిసా
పదామా గరిసా గరిగరీరిగారిరీరిగారి గగ్గారిర్రీ మమ్మాపప్పా ఘరిఘారీఘరిసా
క్షణక్షణానికి సంగీతంలో ఒత్తులు ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ వందే-హం దగ్గరికి వెళ్ళి ఆ పదాలని ఒత్తి ఒత్తి పీకి పాకం పడుతోంది. గొంతు ఊర్ధ్వ స్థాయికి చేరుకొంటోంది. చేతులు, కాళ్ళ తోటి విన్యాసాలు చేస్తోంది. చెంగున గెంతుతూ నీళ్ళ బిందె మీద చెంచాతో ఘటం వాయిస్తోంది. కాఫీ డబ్బా అనుకుంటాను, దానిమీద కంజీరా వాయించేస్తోంది. మధ్య మధ్య నీళ్ళ గ్లాసు మీద జలతరంగిణి పలికిస్తోంది. నిజం చెప్పొద్దూ నాకు మరికొంత భయం వేసింది. సంగీతంతో కూడా ఇంతగా భయపెట్టవచ్చని మళయాళ తంత్రశాస్త్రాల్లో రాశారని విన్నాను గానీ ఇప్పుడే ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. ఆ ఉత్సాహోద్రేకంలో కాఫీ బదులు కారం, పంచదార బదులు ఉప్పు వేసినా వేయవచ్చు అని అనుమానం వచ్చింది. నిజం చెప్పొద్దూ నాకు ఇంకొంత భయం వేసి వణికాను. ఎందుకైనా మంచిదని లేచాను. నమస్కారం పెట్టి బయటకు నడిచాను.
సుబ్బయ్య గారు నాతోటి వీధిగుమ్మం దాకా నడుస్తూ “నా గోడు ఎవరికీ చెప్పుకోలేను. చెప్పుకోకుండా ఉండలేను” అని దీనంగా అన్నాడు. భుజం తట్టి “ధైర్యంగా ఉండండి. సంగీతసాధన మీద త్వరలో ఆమెకు విరక్తి కలగాలని కోరుకుంటున్నాను” అని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాను. నా మనసంతా సుబ్బయ్యగారి మీద జాలి నిండిపోయింది.
ఇంటికి వచ్చేటప్పటికి శ్రీమతి అమ్లా నాగేష్వర్ మా ఇంట్లో ఉన్నారు. ప్రభావతీ, ఆవిడా ఏదో సీరియస్గా చర్చిస్తున్నారు. నేను లోపలికి వెళ్ళబోతుంటే మా ఆవిడ పిలిచింది.
“నేను డైనింగ్ టేబుల్ మేనర్స్ ఎండ్ ఎటికెట్ మీద కోర్సు చేస్తున్నాను” అని ప్రకటించింది. నేను ఆశ్చర్య పడి లేచే లోపున అమలగారు వెళ్ళిపోయారు.
“లాంగ్ టర్మ్ కోర్సు అయితే రెండు నెలలట, క్రాష్ కోర్సు అయితే రెండు వారాలట,” వివరించింది మా ఆవిడ. “రెండున్నర వేలేనటండీ. కోర్సు అయిన తరువాత పన్నెండొందల కట్లరి సెట్ ఉచితంగా ఇస్తారుట. పైగా ఒక రోజున ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఫైవ్‌స్టార్ హోటల్లో డిన్నర్ ‘ఫ్రీ’ గా కనీసం ఆరేడు వందలు ఖరీదుది, ఉంటుందిట. అంటే ఇంచుమించి మన పెట్టుబడి మనకి తిరిగి వచ్చేసిందన్న మాటేగా” అంటూ టీకా తాత్పర్య సహితంగా వివరించింది. “కోర్సు మన కాలనీ లోనే అరేంజ్ చేస్తున్నారు. ఎల్లుండి నుంచి మొదలు.”
“అరవైనాలుగేళ్ళు వచ్చి నీకెందుకే ఈ కోర్సు, అయినా మనం స్టార్ హోటళ్ళకి వెళ్ళం కదా” అని అన్నాను.
“మీ మొహం, (అదేమిటో మా ఆవిడ నా మొహాన్ని తరచుగా, తేలికగా వాడేస్తుంటుంది.) మొన్న మీ మేనల్లుడి పెళ్ళి, రిసెప్షన్ స్టార్ హోటల్లోనే చేశారు గాదూ. శంకర నారాయణగారి షష్టి పూర్తి, ఆది శేషయ్య, వెంకటలక్ష్మిగార్ల గోల్డెను జూబిలీ ఫంక్షను కూడా అక్కడే చేశారుగా!” తడుముకోకుండా జవాబు ఇచ్చింది.
“అయినా అవి అన్నీ బఫెలే కదా , గుంపులో దూసుకెళ్ళి మనకి కావాల్సింది తెచ్చుకొని తినెయ్యడమే కదా.”
“మొన్న శర్మ గారింట్లో , ఆర్నెల్లు అమెరికాలో ఉండొచ్చిన మిసెస్ హేమ్ ళటా రావ్ టేబుల్ స్పూన్తో తింటుంటే అబ్బురంగా చూశారు కాదూ!” మా ఆవిడ ఏ మాత్రమూ తగ్గలేదు.
“అబ్బురంగా కాదు, ‘ఓ మై గాడ్ వెరీ హార్డ్’ అంటూ చెంచాతో గారెను కోసే ప్రయత్నం చేస్తుంటే, అది ఎగిరి నా ప్లేటులో పడుతుందేమో నన్న భయంతో చూశాను,” వివరణ ఇచ్చుకున్నాను.
“అసలు భోజనం చేసిన తరువాత స్పూను, ఫోర్కు ప్లేట్లో ఎలా పెట్టాలో మీకు తెలుసా?” అని నా శ్రీమతి ఇంకో ప్రశ్న సంధించింది.
“నేను అవేవీ ఉపయోగించను, స్టార్ హోటల్ అయినా స్వంత ఇల్లు అయినా చేతులే వాడుతాను. పైగా భోజనం అయింతరువాత శుభ్రంగా చెయ్యి నాకేస్తాను” అని నిర్లజ్జగా సమాధానం ఇచ్చాను.
“అందుకనే మిమ్మల్ని అప్పలసామి అని అందరూ అంటారు, అయినా డబ్బులు ఆల్రెడీ కట్టేశాను,” అని చెప్పి శ్రీమతి లోపలికెళ్ళిపోయింది. అనగా చాప్టర్ క్లోజ్డ్, నో మోర్ చర్చ అని అర్ధం అన్న మాట. అంతేకాదు, ఇంట్లో కొత్త ఆచారాలు రాబోతున్నాయని కూడా అర్థం అన్న మాట.
‘అయ్యలారా! వీని బ్రదుకునకే టిఖాన లేదు, వీడేమి, సుబ్బయ్యను జూచి జాలిపడుటేమి? డోలు రోలును జూచి జాలిపడునా’ యనుచు జం.శాస్త్రి తలబాదుకొనెను. బదులు జెప్పుటకు సమాధానము లేక నేనునూ శూన్యములోకి జూడ నారంభించితిని.