పెనవేసుకున్న ఆవేశాల
పెదవుల తీరంలో
నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ
అప్పుడే కళ్ళు తెరిచిన
ఒక స్వప్నం
అనంత మాయల
అపరిచిత సీమలో
కోటి కోట్ల దారులున్నా
నడకంతా
ఎదురుగా అగుపించే
అడుగుల ఆనవాళ్ళలోనే
పూరించబడ్డ
పదబంధ ప్రహేళిక
మరికొన్ని గడులను
మొలిపించుకోవడం
పూర్తయిందనుకున్న
వీధి నాటకం
మరో మలుపులో
మరికొన్ని సన్నివేశాలకు
తెర తీయడం
ఒక వొడ్డు నుంచి
మరో వొడ్డుకు చేరానని
మురిసే సమయానికి
మసక మసగ్గా అదే
మొదటి తీరం