ఫాల్

అక్టోబర్ లో అడుగు పెట్టేసరికి
చుట్టూ వున్న చెట్లన్నీ
ముదురు రంగు కాషాయాల్ని ధరించటం మొదలెడతాయి

అంతకు మునుపు దట్టమైన ఆకులని
నిలువెల్లా చుట్టుకున్న ప్రతి చెట్టూ
జ్ఞాపకాల పత్రహరితాన్ని పండిన ఆలోచనలుగా మార్చేసి
కలల పూగుత్తుల్ని చప్పుడు కాకుండా రాల్చేసి
రాబోయే శిశిరానికి దీక్షగా సన్నద్ధమవుతుంది

రాజోచిత లాంఛనాలను, ఆభరణాలను
ఒక్కటొక్కటిగా తీసివేసినట్లు
ప్రేమని, సౌఖ్యాన్ని, సౌందర్యాన్ని
లిప్తలో త్యజించిన సిద్దార్ధుడిలా
నిరలంకారంగా నిశ్చలంగా నిలబడింది చెట్టు

తాత్వికతను వైరాగ్యాన్ని విభూది రేకలుగా
శరీరమంతా అలముకున్న జ్ఞానిలా, యోగిలా.


రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...