గంజిబువ్వ వంటి ఏ సృజనైనా ఒక రూపుదిద్దుకొని పాఠకుడికి అనుభవంలోకి వచ్చే ప్రక్రియను ప్రభావితం చేసే అంశాలు ఐదు. కవి అంతరంగంలో కల్పనగా రూపుదిద్దుకొన్న అనుభవాలు, పరిశీలనల ప్రతీక; అంతకు మునుపే అతనికి అనుభవమైన జీవితం; కధ పాఠం; పాఠకుని అంతరంగంలో పునర్మించుకున్నది ఆ కధదే తనదైన ప్రతీక – అంటే నమూనా; పాఠకుడు ఈ కధ పరిచయం కాకముందు అనుభవించి ఉన్న జీవితం. ఈ ఐదింటిలో సృజన పాఠం కాక మిగిలిన నాలుగూ కవికి, ఆయన పాఠకునికీ ఆంతరంగికమైనవి, చాలా వ్యక్తిగతమైనవి. ఈ నాలుగింటికీ ఎంత ప్రగాఢంగా సమన్వయం కుదురుతున్నాదో ఆ మేరకు ఆ సృజన ఆ పాఠకుడికి అందుబాటులోకి వస్తున్నాది, ఆకట్టుకుంటున్నాది, లేదూ అంతకంటే తీవ్రంగా కుదిపేస్తున్నాది. అలాగే ఈ నాలుగింటి నడుమ ఏ మేరకు సమన్వయం కుదరలేదో ఆ మేరకు ఆ సృజన ఆ పాఠకునికి లభ్యం కాలేదు, ఆకట్టుకోలేదు, లేదూ అంతకంటె తీవ్రంగా అసహ్యం, రోత, హేళన వంటి విరుద్ధ భావనల్ని కలిగిస్తుంది.
ఈ ఐదింటిలో మూడు కధ ప్రచురించేటప్పటికే స్థిరమైపోయినవి, మరి మార్చగలిగేవి కాదు. అవి – కధ పాఠం, కవి ఆంతర్యం, ఆయన జీవితానుభవం. మిగిలిన రెండూ, అంటే పాఠకుని జీవితానుభవం, అతని ఆంతర్యం మాత్రం తాత్కాలికమైనవి. అదే కధను అదే పాఠకుడు ముందుకి చదివేనాటికి మారిపోయే అవకాశం ఉన్నవి. ఇంకా, ఈ మొత్తం అనుభవంలో తర్కబద్ధమైన భాష పాత్ర కేవలం సృజన పాఠానికే పరిమితమై ఉంది. మిగిలిన సృజనానుభవాన్ని నిర్వహించేది ప్రధమంగా తర్కబద్ధమైన భాష కాదు – అంటే నిఘంటువు, వ్యాకరణము, ఛందస్సు వంటి నియమాలకు పూర్తిగా బద్ధము, విధేయమైన భాష కాదు. అది ప్రధమంగా ఔద్వేగికమైన భాష. సృజనల ప్రసార అనుక్రమణికను, అనుభవాన్నీ వివరించే ఈ ప్రయత్నానికి ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. వీటి వివరాల్లోకి పోయే ముందు స్థూలమైన ఈ ప్రతిపాదనను గంజిబువ్వకు అన్వయించి చూపించి అది నాకెందుకంత నచ్చిందో పట్టి చూసుకోవచ్చు. అది గంజిబువ్వ గురించి విశ్లేషణ అవుతుంది తప్ప, విమర్శ కాబోదు. విమర్శ ఊసు వస్తే సృజన పాఠాన్ని, శయ్యను, ఎత్తుగడను, అంగాల పొందికను, భాషను, దృక్పధాన్ని, గొంతును ఇలా ఎన్నో అంశాలను వివరంగా పరామర్శించవలసి ఉంటుంది. అంతేకాక మొత్తం సారస్వత సమాజపు పఠనానుభవాన్ని పురస్కరించుకొని చర్చించవలసిఉంటుంది. ఆసక్తి ఉంటే అది చాల విస్తారమైన పని. ఇప్పటికిది వాటన్నిటికీ కొంత ఎడంగా, ఒక కధ ఒక పాఠకుడి అనుభవంలోకి ఎలా వచ్చిందన్న అనుశీలన మాత్రమే.
గంజిబువ్వ చదివి కవి జీవితాన్ని గురించి, కధ రూపుదిద్దుకుంటున్నప్పటి ఆయన ఆంతరంగిక స్థితిని గురించీ ఊహించవచ్చు. ఒక పిల్లల తండ్రి, చిన్నబ్రామయ్య అనే మిషనరీ స్కూల్ మేష్టారబ్బాయి, సుమారు ముప్ఫయ్యేళ్ళ క్రితం గాలీవానా వస్తే చర్చి కాంపౌండ్‌లోని తమ ఇల్లు ఎలా కారిపోయి, గెడ్డలోకి కొట్టుకుపోబోయినంత పనైందో తల్చుకుంటున్నాడు. ఆ వానల్లో తనకి నాన్న వండిపెట్టిన గంజిబువ్వని ఇప్పుడు గుర్తుకుతెచ్చుకుంటున్నాడు. ఇలా కధలో మనతో మాట్లాడుతున్న అబ్బాయి ‘బత్తుల ప్రసాద్’ కాదు. ఆయన సృజించిన ఒక పాత్ర, అంతే. అలాగే చిన్నబ్రామయ్య నిజంగా బత్తుల ప్రసాద్ నాన్నగారనీ, పెద్దబ్రామయ్య నిజంగానే ఆయన సహచరుడనీ ఇలా ఊహించుకోలేము. అందుకు వాస్తవమైన ప్రపంచంలోనివి ఆధారాలేం పాఠకునికి లభ్యంగా లేవు. ఒకవేళ కధలోని పాత్రల పేర్లు నిజ జీవితంలోని మనుషుల పేర్లే అయినా సరే, వాళ్ళు వాస్తవంగా, అచ్చంగా ఆ మనుషులే అనీ అపోహ పడకూడదు. బత్తుల ప్రసాద్ వెనకటికి బహుశ ఇలాంటి కారిపోయే ఇళ్ళనీ, ఆగకుండా కురిసే జడివానల్నీ, కొట్టుకొచ్చే గెడ్డల్నీ స్వయంగా అనుభవించే ఉంటారు. కాని అవన్నీ ఏక కాలంలోనే, అంటే అచ్చం కధలో జరిగినట్టే, అనుభవించి ఉంటారని కూడా మనం ఊహించుకోకూడదు.
ఎందుకంటే కవి ఇప్పటికే విస్తారమైన తన జీవితానుభవంలోంచి అక్కణ్ణించి కొన్నీ ఇక్కణ్ణించి కొన్నీ ఘటనలూ, మాటలూ, పరిసరాలూ, దృశ్యాలూ, అనుభవాలూ, సంభాషణలూ ఇలా సేకరించుకొని, ఎక్కడ అమిరే అంశాన్ని అక్కడ పొదిగి ఇప్పటి తన అంతరంగంలోని సృజన శిల్పపు ప్రతీకను నిర్మించుకుంటున్నాడు. అది ముందు, ప్రధానంగా ఒక కల్పన. ఈ అంశాలన్నీ అతని వాస్తవ జీవితంలోనివే కానక్కర్లేదు. కవి ఊహాశక్తి కొద్దీ ఇవి అతనికి అందుబాటులో ఉన్న కాల్పనిక ప్రపంచాలు, అంటే ఇదివరకు విన్న మాటలు, చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, చేసిన ఊహలు, కన్న కలలు – వీటన్నీంటినుండి కూడా లభ్యం కావచ్చు. ఉదాహరణకు గారెట్ (George P. Garrett) అని అమెరికన్ రచయిత నవలలు Elizabethan Trilogy అని, అవి ఒకటవ ఎలిజబెత్ రాణి వంటివాళ్ళ ప్రాచీన కాలాన్ని, పరిస్థితుల్నీ యదార్ధంగా చూసినవే చెప్తున్నాడా అని పాఠకులు భ్రమించేలా ఉంటాయని పేరు. (”… a body of work that is so imbued with its subject matter and time as to create the sense that he lived through it all, and had total recall of life in the respective courts of Queen Elizabeth the first, and James the first.”) ఆయన సమకాలికుడు, కాల్పనిక సృజన అంతర్గత స్వరూపాన్ని పరిశీలించటంలో చాల ఆసక్తిని, ప్రతిభను కనపరిచినవాడు గార్డ్‌నర్ (John C. Gardner Jr.) అని ఉండేవాడు. ఆయన కాల్పనిక సృజనకు ఈ కల్పనా చాతుర్యమే ప్రధానమైన అవసరమని ప్రతిపాదించి, అది ఎలా వాస్తవ ప్రపంచాన్నుండే కాక ఇంకెన్నో, అంతకంటే భిన్నమైన, లోతైన ప్రపంచాల్నుండీ ఆవిర్భవించే అవకాశం ఉందో సునిశితంగా చేసిన పరిశీలనలున్నాయి.
ఇప్పటికి ప్రస్తుతమైన విషయాలలో ఒకటి ఏమిటంటే గంజిబువ్వ అనే సృజన బత్తుల ప్రసాద్ వ్యక్తిగతమైన, వాస్తవమైన జీవితానుభవాలు, పరిశీలనల సంచయం వలన ప్రగాఢంగానే ప్రభావితమై ఉంటుంది. సుమారు ముప్ఫయ్యేళ్ళుగా ప్రోవైన ఈ అనుభవాల సంచయం ఆయన అంతరంగంలోన ఉడికుడికి పరిపక్వమై, ఈ నాటికి గంజిబువ్వగా అనివార్యంగా పైకొచ్చింది. సృజన అంతశ్చేతనలో సుళ్ళు తిరిగి తిరిగి, చివరికి ఏదో ఒకనాటికి తెల్లమై వెలికివచ్చే ఈ క్రమాన్ని కార్ల్ యుంగ్ (Carl G. Jung) ఎలా వివరించిందీ ముందుకి చెప్పుకోవాలి. రెండవది ఏమిటంటే గంజిబువ్వ తాను ఆవిష్కరిస్తున్న కాల్పనిక ప్రపంచం రచయిత ఎరిగున్న నిజమేననీ, ‘జూటా’ కాదనీ పాఠకుణ్ణి బలంగా ఒప్పించటంలో సఫలమౌతున్నాది. అందరు పాఠకుల్నీ అవునో కాదో గాని, కనీసం ఈ ఒక్క పాఠకుడ్ని. అయితే ఇక్కడ పాఠకుడు తనకు తనే చేసుకొనే హెచ్చరిక ఏమంటే బత్తుల ప్రసాద్ ఇప్పటి జీవితాన్ని గురించి ఈ కధ వాస్తవంగా పట్టిస్తుందని అనుక్కోలేము. ఆయన ఇప్పటి జీవితం, భాష, పరిసరాలు, వ్యవహార శైలి ఈ కధలో కల్పించిన ప్రపంచం లాగనూ ఉండొచ్చు, అంతకంటె చాలా భిన్నంగానూ ఉండొచ్చును. దీన్లో ఏది వాస్తవమో వేరేగా కనుక్కోవాలి తప్ప ఈ కధను చదివే కనుక్కోగల అవకాశం లేదు. అవసరం కూడా లేదు. పాఠకునికి సంబంధించినంతవరకు కేవలం ఈ ఒక్క కధే చాలా అపురూపమైన ప్రపంచాన్ని తనకు ఆవిష్కరించి ఆ కధనీ, కధలో మనుషుల్నే కాకుండా సృజనకారుడైన నిజం బత్తుల ప్రసాద్‌ని కూడా అభిమానించేటట్లు చేసుకున్నాది.
ఎంచేత? ఎలాగ? గంజిబువ్వను చూసేనాటికి పాఠకుడి మన:స్థితి ఏమిటి? అతని గత జీవితం ఏమిటి? ఇవి చెప్పుకొనే ముందు పైన చెప్పిన ‘సమన్వయం’ అంటే ఏమిటన్నది కొంత చెప్పుకోవాలి. సారస్వత కళలకు (Language Arts) సంబంధించినంత వరకు ఈ సమన్వయం అనేది ఒకరకమైన అనువాదం వంటిది. అనువాదం ఎప్పుడు సఫలమౌతుంది? చెప్పేవాడి భాష వినేవాడికి ఏ కొంతైనా అదివరకే వచ్చి ఉంటే కదా సఫలమౌతుంది. కాల్పనిక సృజన కవినుండి పాఠకునికి ‘అనువదింప’బడటానికి ఇది వరకు చెప్పుకున్న బింబ ప్రతిబింబ ప్రక్రియలలో అక్కరకు వస్తున్నది కేవలం వ్యావహారిక భాష కాదు, అది ప్రధమంగా ఔద్వేగిక భాష. ఇలాగని ప్రతిపాదించినవాళ్ళు చాలామందే ఉన్నారు. ఒక ఉదాహరణగా జెస్సీ ప్రిన్స్ (Jesse J. Prinz) అని వైజ్ఞానికుడున్నారు. ఆయన ఏమంటున్నారంటే సృజనానుభవం (aesthetic experience) అనేది ప్రధానంగా ఉద్వేగాలతో (emotions) ముడిపడి ఉంటుందని. ఇలాగే When is Art? అనీ, The language of art అనీ విశేషమైన పుస్తకాలున్నాయి. ప్రస్తుతానికి స్థూలంగా వీటి ప్రతిపాదన ఏమిటంటే వ్యావహారిక ప్రపంచపు తార్కిక భాషకు, కళా ప్రపంచపు మార్మికము, ప్రతీకాత్మకము, ఉద్వేగ ప్రధానమైన భాషకు సమన్వయం కొంతవరకే ఉండొచ్చు, లేదూ అసలు ఉండకుండా పోవచ్చు. ఈ నిర్ధారణలు విశేషంగా పరిశోధించి చేసినవి కాబట్టి వాటి వివరాలైతే వేరేగా చెప్పుకోవాలి.
గంజిబువ్వ సృజించిన ఔద్వేగిక స్థితితో సమన్వయం కావటానికి నాకు కలిసొచ్చిన అనుభవాలేమిటి? కధలోని భాష కనీసం నా చిన్ననాటి భాషైనా కాదు, ఇప్పుడైతే మేము తెలుగే మాట్లాడుకోము. ఈ కధను మొదటిసారిగా చూసినప్పుడు నేను ఫిలడెల్ఫియాలో ఒక హోటల్ గదిలో ఉన్నాను. అక్కడా వాన పడుతున్నాది. పైకప్పు కారే అవకాశం లేదు, చలివేసే అవకాశం లేదు. కాని నాకు జడివానలకి ఇంటి కప్పు కారుతూ చెక్కసున్నాలు రాలిపడుతుంటే మా నాన్నతో కలిసి వాన్నీళ్ళు కారని మూలలు వెదుక్కుని ముడుచుకు పడుకున్న అనుభవం ఉంది. అలాటి వాన రాత్రుళ్ళు కధలో అబ్బాయికి చిన్నబ్రామయ్య అన్నం కూరా అన్నీ కలిపి ఒకటే బువ్వ వండినట్టే మా నాన్న నాకు, మా అన్నకి వండిపెట్టిన అనుభవం, దాన్ని మేము ‘శెతుర్లు’ అంటే మా భాషలో ‘ఇగటాలు’ ఆడుకుంటూ ఆబగా తిన్న అనుభవం ఉన్నాయి. కధలోని మిషనరీ స్కూల్ కాంపౌండ్ ప్రపంచం అంతా, అన్నీ నేను పెరిగిన పరిసరాలే. కధలోని మనుషులు – బహుశ దళిత్ క్రిష్టియన్స్ – నాకు చాల ఆప్తులైన చిన్నప్పటి స్నేహితులు. ఇప్పుడు కేవలం జ్ఞాపకాలుగా మాత్రం మిగిలిపోయినవాళ్ళు. వాళ్ళని వెదుక్కుంటూ ఆ ఊళ్ళకి, పరిసరాలకీ వెళ్ళి ఎవరూ లేని ఖాళీ గదుల్నీ, చర్చిల్నీ చూసి నిరాశపడి వెనక్కొచ్చీసి కూడా, ఇంకా ఆశ చావక కొన్నాళ్ళకి మళ్ళీ అక్కడికే వెళ్ళి, మళ్ళీ వాళ్ళందర్నీ వెతుక్కుంటుంటాను. వరదల్లో గెడ్డలో ఇళ్ళు, సామాన్లు కొట్టుకుపోవటం మావాళ్ళకి అనుభవం ఉందని నాకు అనుభవం ఉంది. కధలో పేరులేని సన్నబిల్లోడు వాళ్ళ నాన్న తనకి వండి పెట్టినట్టే ఇప్పుడు తను తన పిల్లలకి ఎలా వండిపెడుతున్నాడో అలాగే నేను కూడా ఈనాడు మా నాయన మాదిరి నా పిల్లోల్లకు వండిపెడతా ఉంటి. దీన్ని మేము Daddy Baby Festible అంటాము. కాలం ఆకలికి వాళ్ళ నాయన లాగే మా నాన్నా కాలమైపొయినాడు. ఇన్ని కలిసొచ్చేయి.
ఇంకా ఉన్నాది. బత్తుల ప్రసాద్ సృజించిన సన్నబిల్లోని ప్రపంచం నా అంతరంగంలోని చిన్నపిల్లడి ప్రపంచం ఒకటే. వానమోత మోగుతాంటె సన్నబిల్లోడు మంచం దిగి ఒంటేలికి పోసుకుందామని శెత్తిరి తీసుకొని జాలాడిలోకి పోతాడు. నా అంతరంగంలోని చిన్నపిల్లడు అలాక్కాకుండా, గిడుగు తీసుకుని పంచాదిలోకి వెళ్తాడు. నాకు శెత్తిరి అంతే ఏమిటో తెలీదు, జాలాడి అంటే ఏమిటో తెలీదు. కాని ఔద్వేగిక ప్రపంచాల సమన్వయానికి, ఐక్యతకూ భాషా తర్కము, వ్యాకరణము, నిఘంటువూ అడ్డు రాలేదు. వైయాకరణి దృష్టితో చూస్తే గంజిబువ్వ నిండా అడుగడుగునా ‘గ్రామర్ మిష్టేక్స్’ ఇంకా ‘స్పెల్లింగ్ మిష్టేక్స్’ ఉన్నాయి. వాటన్నిట్నీ పరిహరించివేస్తే భాషకు న్యాయం జరుగుతుంది కాబోలు గాని సృజన అందమే చెడూరుకుంటుంది. నా దృష్టి అదికాదు; అందుకే గంజిబువ్వ రుచికి భాష, వ్యాకరణం అడ్డురాలేదు. బత్తుల ప్రసాద్ తన cognitive apparatus నుండి ఏ ఏ సరంజామాను ప్రోదిచేసుకుని ఈ సృజనను నిర్మించేరో ఆ సరంజామా అంతా దాదాపు నా అంతరంగంలోనూ ఉంది. కధ చదవటం మొదలుపెట్టగానే ఈ ఐక్యత కొట్టొచ్చినట్టు స్పష్టమై, చదువుతున్నకొద్దీ మరింతగా నాలో నేనే అదివరకే ఎన్నో ఏళ్ళుగా పునర్నిరించుకుంటున్న నా ప్రపంచంలోనికే నన్ను, నా ధ్యాసనూ తప్పనిసరిగా ఈడ్చుకొనిపోయి తన ప్రపంచంతో నా ప్రపంచాన్ని తాదాత్మ్యం చేసుకోగలిగింది. చదవటం పూర్తయ్యేక ఈ ప్రపంచమే గంజిబువ్వ నుండి స్వీకరించినవి కలుపుకొని మరింత ఐక్యము, సుసంపన్నమయ్యింది. అందుకే ఈ సృజన మరి నాకు అంతగా ఎక్కింది.
ఇలా ఒక సృజనను అనివార్యంగా స్వీకరించగలగటం అనేది నాకు చాల అరుదైన అనుభవం. ఎందుకంటే చాలా వరకు రచనలు నేను అలా పైపైన చూసి, కొంచెం కొసరు చదివి ఇంక ముందుకు పోలేక చదవటం మానుకుంటాను. అందువల్ల ఇంతగా ఇష్టమయ్యే సృజనలు తారసిల్లితే నాకు పండుగలాగే ఉంటుంది. మరి మిగతా పాఠకులు ఎందరో ఉంటారు. వాళ్ళ అంతరంగాలు, జీవితానుభవాలు గంజిబువ్వలో ప్రస్తుతమైనవాటికంటె చాల భిన్నంగా ఉండవచ్చు. సృజన నుండి వాళ్ళు ఆశిస్తున్నది దాన్లో అందిరాకపోవచ్చు. అప్పుడు వాళ్ళు గంజిబువ్వను స్వీకరించలేరు. ఇంతకంటె తీవ్రంగా కొందరికి ఈ కధలోని పరిసరాలు, మనుషులంటే అయిష్టత, ఏహ్యత సైతం ఉంటాయి. లేదూ ఈ కధలోని భాష కొందరికి నచ్చదు. అలాంటి పాఠకులు ఈ కధ యెడల విముఖంగా ఉంటారు. అది వాళ్ళ తప్పా? అశక్తతా? నేను ఇంతగా నెత్తికెత్తుకుంటున్న సృజన వాళ్ళకు నచ్చలేదంటే, లేదూ ఇంకా తీవ్రంగా వాళ్ళు దాన్ని అవమానిస్తే, అప్పుడు నా స్పందన ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? అలాగే, వాళ్ళకు ఏమీకానట్టుండే ఈ కధకి నేను పట్టం కడుతుంటే మరి వాళ్ళెలా స్పందించాలి? నాకైతే ఈ ప్రశ్నకు సంతృప్తినిచ్చే సమాధానం – జవాబు అని కాకుండా శాంతి అనే అర్ధంలో చెప్పుకొనే సమాధానం – త్రిపుర దగ్గర వాచ్యంగా కాక ఆయన మూర్తిమత్వంలోను, ఆయన సారస్వత జీవితమే ఒక నిదర్శనంగానూ మౌనంగా గోచరిస్తుంది.
7.
ఇవి మూడు ప్రశ్నల్లోని రెండో ప్రశ్నకు అనుబంధ ప్రశ్నల్లాంటివి. రస సిద్ధాంతులు, తాత్వికులు, సృజనకారులు, మనస్తత్వవేత్తలు, ఇటీవల వైజ్ఞానికులు సైతం ఈ ప్రశ్నకు సమాధానాల్ని వేలాది సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నారు. గొప్ప ప్రతిభావంతులు, మేధావులూ తమ యావజ్జీవితాల్నీ ఈ ఒక్క ప్రశ్నకూ సమాధానం కోసమే ధారపోసిన వాళ్ళున్నారు. త్రిపుర, రాళ్ళపల్లి వంటి వాళ్ళ ఔదార్యం నైసర్గికమైన వ్యక్తిత్వ సంస్కారానికి, ప్రతిభకు ఇలాంటి పరిశ్రమను, వివేచనను జోడించి సాధించుకున్నదని అనిపిస్తుంది. ఇది స్వానుభవమైతే తెలుస్తుంది గాని, లేనిది ఉన్నట్టు తెచ్చిపెట్టుకున్నది తెలిసిపోతుంది. ఇలాంటి పెట్టుడు ఔదార్యమే సారస్వతంలో అన్ని జాతులు, కులాలు, మతాలు, లింగాలు, ప్రాంతాలవారికీ సమానమైన ప్రాధాన్యతను ఇవ్వాలన్న లౌకిక మర్యాదకు, నిర్వహణకు ప్రాతిపదిక. వాచ్యంగా ఔదార్యాన్ని నటించడం గురించి ఒక కధున్నాది. ఒక జెన్ భిక్షువు ఊళ్ళోకొచ్చేడు. ఆయన శిష్యుడొకడు ఆయన లేనప్పుడు చూట్టానికొచ్చినవాళ్ళని చేరదీసి ఆయన ఇదివరకు చెప్పిన మాటల్నే బోధనల్లా ప్రవచిస్తున్నాడు. ఇది విన్న గురువు శిష్యుడ్ని కర్రతో ఒక దెబ్బ వేసేడు. శిష్యుడు అందుకు కోపగించుకొని “అదేంటి అవేళ మీరన్న ముక్కలే కదా నేనూ అన్నాను, నలుగురికీ ఉపయోగంగా ఉంటాయని? నన్నెందుకు దండిస్తారు?” అన్నాడు. అందుకు గురువు “అన్న ముక్కలు అవే గాని అవి నేనన్నప్పుడు సత్యం, నువ్వంటే అబద్ధం!” అన్నాడట.
నేను చాన్నాళ్ళ కిందట ఒకచోట నచ్చిన కధ చదవమంటే నామిని కధొకటి చదివేను. అక్కడున్నవాళ్ళ అనుభవాలు, దృక్పధం, భాష ఏవీ ఆ కధను ఒప్పుకొనేలా లేవు. వాళ్ళు నన్ను ‘ఇదొక కధా? నువ్వొక చదివినోడివా?!’ అన్నట్టు చూసి అంతలోనే తమాయించుకుని ‘వెరీ నైస్ ! ఇంట్రష్టింగ్!’ అనీసూరుకున్నారు, మర్యాదగా. త్రిపుర కధలంటే కొంతమంది ఎందుకంత ఆరాధిస్తారని ఒక పేరుమోసినవారికి చాల కంటగింపుగా ఉండేది. ఆయన ఉండబట్టక ఏదో ఒకచోట త్రిపురను దొరకబుచ్చుకుని కచ్చగా ‘మీ రాతల్లో ఒక్క ముక్కా నాకు అర్ధం కాదు, మీరేమంటారు? ‘ అన్నట్టు నిలదీసి అడిగేరట. త్రిపుర “May be you need to grow up a little to understand.” అని వదిలించుకున్నారట. మరీ ప్రాణం విసిగిస్తే ఇలాగన్నారు గాని త్రిపుర తను రాసేవి ఎవరికోగాని అర్ధం కావని బేషరతుగా ఒప్పుకుంటారు. ఒకసారి నాకు తెలిసున్నాయన త్రిపురని చూసొచ్చి “ఏదో ఆయనలాగున్నాడు, మనఁవిలాగున్నాఁవు! ఆయన్దారి ఆయన్దీ మన్దారి మన్దీ!” అన్నారు. ఆ మాట చెప్తే త్రిపుర ‘ఆయన కరక్టుగా అన్నాడువై! కరక్టుగన్నాడు! ‘ అని అతన్ని చాల మెచ్చుకున్నారు.
ఔదార్యం వేరు, ఉదారవాదం వేరు. లోకో భిన్న రుచి: అని, అంటే ఇంగ్లీష్‌లో In matters of taste there is no dispute (De gustibus non est disputandum) అనే వైఖరి ఉదారవాదం ఔతుంది. పుఱ్ఱెకో బుద్ధీ జిహ్వకో రుచీ కాబట్టి, అందరి అభిరుచుల్నీ అందరూ గౌరవించుకోవాలన్న పద్ధతి. ఇది అరాచకవాదం అవుతుందని రససిద్ధాంతులు దీన్ని అంగీకరించలేక, తిరస్కరించటమే కద్దు. దీన్ని గురించి చలోక్తిగా కాంట్ (Immanuel Kant) ఏమన్నారంటే “Art is a matter of taste, but there is no point in arguing matters of taste with the tasteless.” అని. ఔదార్యానికి పూర్తిగా భిన్నమైనది అహంవృత్తి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుషుల్ని, పరిస్థితుల్నీ, పరిణామాల్నీ కేవలం తనకు పరిచితమైన, పరిమితమైన దృక్కోణం నుండే చూస్తూ, తనను దాటి చూడలేకపోవటాన్ని అహంవృత్తి (ego-centrism) అని అన్నారు. చిన్నపిల్లలు ప్రపంచాన్ని చూసే పద్ధతి ఇలాగే ఉంటుందట. వాళ్ళు మనుషులందరూ ప్రపంచాన్ని ముమ్మూర్తులా తాము చూస్తున్నట్టే చూస్తారని భ్రమిస్తారట, అలాగే చూడాలని మంకుపట్టు పడతారట. అంచేత వాళ్ళు ఏ విషయాన్నీ ఇతరుల దృక్కోణం నుండి చుడలేకపోతారు. జాఁ పియాజ (Jean Piaget) అనే మనస్తత్వవేత్త విద్యాభ్యాసం, జ్ఞాన సముపార్జన ఎలా జరుగుతాయో పరిశోధించే క్రమంలో ఆరేడేళ్ళ వయసు పిల్లలకి ఒక పరీక్ష పెట్టేడు. అదేమిటంటే, పిల్లలు వాళ్ళ ముందుంచిన పర్వతశ్రేణుల నమూనాని చూస్తుంటారు. పరీక్షచేసేవాళ్ళు ఆ నమూనా వెనక కూర్చుంటారు. ఇప్పుడు ఆ నమూనాకి రక రకాల దృక్కోణాల్నుంచి తీసిన ఫొటోల్ని కూడా వాళ్ళముందుంచి, పరీక్షకుడు తనేం చూస్తున్నాడో చెప్పుకోమని వాళ్ళని అడుగుతాడు. ఆరేళ్ళలోపు పిల్లలందరూ ఈ ప్రశ్నకి సమాధానంగా వాళ్ళు చూసే కోణం నుండి పర్వతం బొమ్మ ఎలా కనిపిస్తోందో అచ్చం అలా కనిపిస్తున్న చిత్రాల్నే ఎంచి, మీకూ ఆ పర్వతం ఈ ఫొటోల్లోలాగే కనిపిస్తుందని చెప్పేరు. వాళ్ళకి తాము చూస్తున్నదే సరైన ప్రపంచం; అందరూ ప్రపంచాన్ని అలాగే చూడాలి.
పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఇలాంటి సంకుచితత్వం తగ్గి, భిన్నమైన దృక్కోణాల్ని గుర్తించి, సానుభూతితో అర్ధంచేసుకోగలిగే శక్తి సహజంగానే వస్తుందట, కాని పెద్దవాళ్ళలో కూడా ఇలాంటి ప్రవర్తన ఛాయలు రకరకాలుగా కొనసాగుతాయని పియాజ తరువాతివాళ్ళు చెప్తున్నారు. అహంభావి ప్రవర్తన అనివార్యంగా పోటీతత్వంతో, ఈర్ష్యతో నిండి ఇతరుల దృక్పధాలతో, తోవలతో యుద్ధంగా ప్రకటితమౌతుంది. మనం కౌమారంలో అహంభావులుగా ఉండే దశల్లోన మన స్వంత, చిన్ని ప్రపంచంలో బతుకుతూ, మన శక్తియుక్తుల మీద, ఔన్నత్యం మీద వెఱ్ఱి నమ్మకంతో ఉంటామట. అయితే మనందరము అంతరాంతరాల్లో ఇతరులతో మనని మనం పోల్చి చూసుకుంటామట కూడా. దీన్ని self-other comparison అని అన్నారు. మనందరికీ సహజంగానే మన స్వంత భావాలు, ఉద్వేగాలు, అనుభవాలు, శక్తియుక్తులే దగ్గిరగా, నిరంతరం కనిపిస్తుంటాయి; ఇతరుల కష్టసుఖాలు, శక్తియుక్తులు, వాళ్ళ దృక్పధాలకి దారితీసిన పరిస్థితులూ ఎంతో పెద్ద ప్రయత్నం చేస్తే తప్ప ఏ కొంతైనా అవగాహనకు రావు. ఎవరి మనసు పంజరాల్లో వాళ్ళం బందీలై బతుకుతున్నామని త్రిపుర అన్నారన్నాను. Without ropes they bind themselves అని అహంభావుల్ని గురించి లాఒ జు (Lao tzu) అన్నారట. అహం వలన దృష్టి సంకుచితం కావటం మనందరికీ ఉన్న ఇబ్బందే, అనంత కృష్ణశర్మ గారంటే మాత్రం అంత సులభంగా ఒదుల్చుకోగలిగేదా? కౌమారంలో అహంభావులుగా ఉన్నవాళ్ళు ఇతరుల పనిని, ప్రతిభను, వ్యక్తిత్వాల్ని తరచిచూసి క్రమంగా తనను తాను దిద్దుకోగలగటం ఉందట. ఈ పరిణామాలు self-other comparisonలో ఒక సహజమైన దశగా వైజ్ఞానికులు అర్ధంచేసుకుంటున్నారు.
తప్పులు చెయ్యటంలో సిగ్గుపడవల్సింది ఏమీ లేదని, తప్పుల్ని చేసి సత్వరం దిద్దుకోవటమే చదువు పరమార్ధమనీ, తప్పులు చెయ్యటానికి భయపడి అభ్యాసమే మానుకోవటమే అన్నిటికన్నా పెద్ద తప్పు అని విద్యావేత్తలు నొక్కి చెప్తారు. విద్యాభ్యాసంలో లోపాల్ని గుర్తించటానికి, చూసి దిద్దుకోటానికీ ఉపాధ్యాయులు తప్పనిసరి అవుతారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు. మా పక్కింట్లో ఒక పాప ఉండేది. దాని పేరు పాపాయి. అది బూరిబుగ్గలు, చిలిపి చేష్టలతో బంబులబుట్టి లాగ ఉండేది. దానికి వాకట్లో గోలెంలో ఉన్న నీళ్ళు చెంబుతో తెచ్చి ఇంట్లో పారపోసి కేరింతలు కొట్టడం ఒక ఆట, అలవాటైపొయింది. అది తప్పని, అలా చెయ్యకూడదనీ వాళ్ళమ్మ దానికి బుద్ధులు చెప్పి చెప్పి విసిగిపోయింది. ఒకరోజు ఆవిడ బయటికెళ్ళే పనుండి ఈ పాపాయిని నాకు అప్పచెప్పి, ‘నీళ్ళు ఒంపకు, తప్పూ!’ అని చాలా బుద్ధులు చెప్పి వెళ్ళింది. ఈ పాపాయి అమ్మ అటు వెళ్ళటం చూసి, చెంబు నిండా నీళ్ళు నింపుకుని గదిలోకి తేవటం, ఆ నీళ్ళు గదిలో జాగర్తగా ఒంపటం, వెంటనే నా ఎదురుగా వచ్చి నిలబడి “అంకుల్! చూలు … లీల్లూ ఉంపకూలదు. తప్పు!! ఇల్లంతా తలిచిపోతుందిగా? అలా ఉంపొచ్చా..? తప్పు!!” అని వల్లించడం, మళ్ళీ వాకట్లోకెళ్ళి ఇంకో చెంబుణ్ణీళ్ళు తెచ్చి ఒంపటం, మళ్ళీ నీతి బోధన! చెంబుడేసి నీళ్ళూ తెచ్చి ఒంపుతూనే ఉంది, బుద్ధులు వల్లిస్తూనే ఉంది. దాని నీతి పాఠాలు వింటూ నీళ్ళొంపడాలు చూస్తూ నవ్వలేక చచ్చేము.
సారస్వతంలో లోపాల్ని గురించి ‘మంచి సాహిత్యం భవిష్యత్తు కోసం అసలు మౌలికంగా సాహిత్య స్వరూపం ఏమిటన్నది…’ అని, ‘నిజమైన కవిత్వంలో ఒక విశ్వజనీనమైన ఆర్ద్రత, కరుణ అంతర్లీనంగా…’ అని, ఇలాటివి కవులు, సాహితీ మేధావులూ పెద్దవాళ్ళు ప్రవచించే విషయాలు విని విని, నేనూ ఇలాంటి చిలకపలుకులే పలకటం, సుమారు ఇలాంటి మాటల్నే రంజింపచేసేలాగ కొత్త కొత్తగా, గడుసుతనంగా అంటూ తిరగడం నేర్చుకున్నాను. ఇలాటివే ఉపన్యాసాలుగా, వ్యాసాలుగా వెలయిస్తే వాటికి బహుమతులొచ్చేవి. నేను, నాకు నచ్చినవే నచ్చుకునే కవులు కొందరం తరచు కలుసుకొంటూ, మేం రాసినవి ఒకళ్ళవొకళ్ళం మెచ్చుకుంటూ, మాకు నచ్చనివాళ్ళని, వాళ్ళ సృజనల్నీ వేళాకోళం చెయ్యటం – సాయంత్రాలు ఇలా గడిపేవాళ్ళం. ఈ గుంపులోనే మళ్ళీ అక్కడ ఎదుట లేనివాళ్ళని చాటుగా వేళాకోళం చేసుకోవటమూ ఉండేది. కవులందరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకీ ఏదో మేరకు పోటీ, ఈర్ష్య తప్పకుండా ఉండేవి. ఎదటపడితే సూటిగా అభిప్రాయం చెప్పటానికి మళ్ళీ మొహమాటం, అదొకలాటి స్నేహ పురస్సరమైన మర్యాద. ఎవర్నైనా ఎత్తిపొడిచి, ఎగతాళి చెయ్యటం ఎందుకోగాని చాల మజాగా ఉంటుంది. మా అమ్మని అడిగితే “దానికేఁవుంది నాన్నా, మనుషులన్నాక అలాటి మెరమెచ్చాలుండవా మరి? స్పర్ధయా వర్ధతే విద్యా!” అని సర్దిచెప్పింది. ఇది నాకేం బావుండింది కాదు, ఒక సాకులాగ అనిపించింది.
అప్పట్లో నాకు తిలక్ కవిత్వం చాల నచ్చినట్లుండేది. తణుకు వాళ్ళు ఎవరైనా కనిపిస్తే “తిలక్ అని కవి, ఆయన మీకు తెలుసా?” అని వాళ్ళ చుట్టూ తిరుగుతూ, ఇలా ఒక ఆరాధన లాగ ఉండేది. నా మిత్రులకూ అంతే; అప్పట్లో అది మా దృష్టి. మేము సాహితీ సమావేశాలకు వెళ్ళే చోటికి ప్రతీ వారం ఒక పెద్దాయన, తాశీల్దారుగారు వచ్చేవారు. ఆయన చూట్టానికి శ్రీశ్రీలా ఉండేవారు. ఎంతో దూరం నుండి బస్సులు మారొచ్చి మొహం తుడుచుకుంటూ, చాల అమాయకంగా తన చేతి సంచీలోంచి ఒక డైరీ పైకి తీసి, దాన్లో నీలం సిరాతో పెద్దపెద్దక్షరాల్లో రాసుకున్నవి బోల్డేసి పద్యాలూ, కవితలూ అవన్నీ భోళా నవ్వులు నవ్వుకుంటూ, తనలో తనే తన్మయమైపోయి పెద్ద గొంతుకతో చదివేవారు. అది మేము నవ్వు బిగబట్టుకొని విని, బయటికొచ్చి పగలబడి నవ్వుకునేవాళ్ళం. ఇలా మాకు చులకనైన కవుల్ని నేను అనుకరించి, వాళ్ళు కట్టినట్టే పద్యాలు కట్టి వెక్కిరించి అందర్నీ నవ్వించేవాణ్ణి. కాలక్రమంలో ఇంకెన్నో అనుభవాలయ్యీ ఏవేవో చదువుకొనో ఏమో తిలక్ కవిత్వం అంటే అప్పటి అనురక్తి సాంతం పోయింది. ఇప్పుడు తిలక్ కవితలు చూస్తే ఒకటి రెండు తప్ప రుచించవు. ఎందుకో ఆ సంజాయిషీ ఇంకెప్పుడైనా చెప్పుకోవాలి. అప్పటి తాశీల్దార్‌గార్ని చాటుగానైనా వెక్కిరించినందుకు ఇప్పటికీ నన్ను నేను మన్నించుకోలేను.
ఈ అహంవృత్తి బాలరామానుజన్ ప్రవర్తనలో కేవలం ఒక పార్శ్వం. ఇదంతా ఇంత విస్తారంగా రాయటం ఎందుకంటే సృజన పేరిట నేను చిన్నప్పట్నించీ నాలోన, చుట్టూనూ చూసింది, చూస్తున్న వ్యాసంగమంతా ఏదో ఒక మేరకు రాజీ పడినట్లు ‘అంతా సంశయమే మేనంతా…’ అన్నట్టుగా ఉంటుంది. Aesthetic idealsకి అఱ్ఱులుచాచటమేగాని అవి అందుకోగలిగేవి కావని అనిపిస్తుంది. సృజన ఎన్నిరకాలుగా కలుషితమౌతుందో నేను ఇదివరకు ఒక పెద్ద చిట్టాలాగ రాసుకున్నాను. ఇవన్నీ సృజనశీలి నీళ్ళొంపుతూనే నీతులు వల్లిస్తున్న పాపాయిలాగ అనాలోచితంగా అలవర్చుకునే అపోహలు, అలవాట్లు. ఇవి నాకు ఎలా తెలుసంటే ఇవన్నీ నాకు స్వయంగా అనుభవంలో ఉన్నవే, నేను చేస్తూ వస్తున్న తప్పులే. దీన్ని గురించి ఒక ఆసక్తికరమైన సంగతి ఉంది. తప్పులెంచేవాడికి ఒక తప్పు ‘ఇది తప్పు’ అని ఎలా తెలుస్తుంది? వాడికి స్వయంగా అనుభవంలోకి వచ్చింది కాబట్టే అది వాడి స్పృహలో ఉంది. వీటిలో ప్రతిఒక్కదాని స్వభావాన్ని గురించీ నాకు చాల కుతుహలంగా ఉంటుంది. త్రిపురని, బిపిన్‌నే కాక మనస్తత్వం, కళలు, మానవీయశాస్త్రాలు ఇలాంటివి చదువుకున్నవాళ్ళు అనేకమందిని వీటన్నిట్నిగురించీ అడిగడిగి కాల్చుకుతింటం నాకు ఒక పెద్ద వ్యసనమే అయిపోయింది. ఇలాంటి ప్రవర్తనల పార్శ్వాల్ని గురించి మనస్తత్వం, సాంఘికశాస్త్రం, జంతుశాస్త్రం, తత్వశాస్త్రం – ఇలాంటివి చదువుకునేవాళ్ళ పరిశీలనలు చాల సునిశితంగా ఉంటాయి. వాటిని తెలుసుకోవటం కొంత ఉపయోగిస్తుంది. ఉదాహరణకు వెక్కిరింత (Ridicule) ఉంది. మా చిన్నప్పుడు ఎదటి మనుషుల్లోని ప్రస్ఫుటమైన లోపాల్ని నలుగుర్లోనీ ఎత్తి చూపించి, గేలిచేసి వినోదించటం మా కుటుంబాల్లోన, బళ్ళోన, కాలేజీల్లోన, సాహిత్యంతో సహా చుట్టూ ఉన్న అన్ని రంగాల్లోనా సర్వ సాధారణంగా కనిపించేది. ఒకాయన ఉంటాడు. ఆయన పేరు సూర్యనారాయణ. ఆయనకి పోలియో వల్ల కాలు అవుకు. అతన్ని ‘అవుకు గాడు’ అని వ్యవహరిస్తారు! ఆయన పిల్లలు కనిపిస్తే ‘ఔరా నువ్వు సొట్ట సూరీడు కొడుకువిట్రా? ఏదీ ఇలా రమ్మీ?’ అని ఇలాగ. మనస్తత్వశాస్త్రం లోన The psychology of ridicule అని దీన్నిగురించి చాల ఆసక్తికరమైన, ప్రయోజనకరమైన చర్చ ఉంది. ఇది ముందుకి వివరంగా చెప్పుకుంటాను.
మా చిన్నప్పుడు బడి ఎగ్గొట్టినవాళ్ళకి ఒక పలకమీద ‘నేను బడి దొంగని’, ‘ప్రసాదు బడికి దొంగ, బజారు పెద్ద.’ అని ఇలా రాయించి ఇంకో కుర్రాణ్ణి తోడిచ్చి, ఆ పలక నెత్తిమిద పెట్టుకుని ప్రతీ క్లాసుకీ తిప్పేవారు. అప్పుడూ ఆ క్లాస్ టీచరుగారు “ఒరే! అదుగో బడి దొంగొచ్చేడు! అందరూ ఈణ్ణి చూసి నవ్వండఱ్ఱా!” అంటే ఆ క్లాస్ పిల్లలందరూ బడిదొంగవైపు వేలెత్తి చూపించి ‘ఈ … ఈ…’ అని కేలించి నవ్వేవారు. ఇది ఉట్టుట్టి ఇగటాలే కాబట్టి సరదాగాను ఉండేది, ఒక గుణపాఠం లాగా ఉండేది. (బడిదొంగ కూడా కాసేపటికి తనమీద తనే ‘ఈ…’ అని నవ్వుకుంటాడు, పలక నెత్తిన మోస్తూనే.) మరి సారస్వతంలోనా ఇలాంటి కాలుష్యాల్నుండి స్వయంగా ముక్తులైన ఉపాధ్యాయులే ఉండి ఉంటే ‘ప్రసాదు సృజనకు దొంగ. బజారు పెద్ద.’ అని సృజన పలక రాయించి నా నెత్తిన పెట్టి ఊరూరూ తిప్పి, కవులందరిచేతా ‘ఈ…’ అని నవ్విపించుతారని నా ఊహల్లో నేనే కట్టుకుని, నవ్వుకుంటుంటాను. త్రిపుర ఔదార్యం ఇలాంటి సృజన పలక. నేను త్రిపురను మొదటిసారిగా కలుసుకున్న రొజుల్లో పైన చెప్పుకున్న అహంభావంతోటే ఆయనదగ్గరికి వెళ్ళేవాణ్ణి. కుష్టువాళ్ళ ఆస్పటల్ ఎదురుగా కొండ దిగుతూ చాలా ఇరుగ్గా ఒక సందుండేది. దాన్లో ఒక వంద కొళాయిగొట్టాలేనా వంపులు వంపులుగా దిగుతుండేవి. అలా దిగ్గా దిగ్గా అక్కడ శాఖా గ్రంధాలయం ఉంటుంది. అక్కడ త్రిపుర కధలంటాయి. అవి చదివి నాకు అక్కడికక్కడే షాక్కొట్టినట్టయ్యి, అగ్గి రుంజుకున్నాది. వాళ్ళతోనీ వీళ్ళతోనీ అనగా అనగా ఒకళ్ళు ‘ఆయనిప్పుడు ఈ ఊళ్ళోనే ఉంట్నారు వై!’ అన్నారు. మహారాణీపేట అన్నారు గాని ఏ వీధో ఎవరికి తెలీదు. అలా చాన్నాళ్ళు వీధి వీధీ, ఇల్లిల్లూ తిరిగి, తిరిగి వెతుక్కోగా వెతుక్కోగా తొలిసారిగా ఒకరోజు రాత్రి బాగా పొద్దుపోయింతరవాత వాళ్ళిల్లే దొరికింది. అక్కడ గేటు ముందర గేదెలు కట్టీసున్నాయి. త్రిపుర, లక్ష్మి ఆంటీ చుట్టూ కొందరు సొమ్ములకాపు గుంటలు – అందరూ కలిసి హాల్లో టీవీ చూస్తున్నారు. నేను గేటు తిసుకుని తిన్నగా లోపటికెళిపోయి ‘నీను మీ ఫేన్ని!’ అన్నాను. ఆయన ‘ఓహోహో, దా ఇలాగొచ్చీ!’ అనీసి అందరం కలిసి మళ్ళీ అలా టీవీయే చూసుకున్నాము.
(ఇంకా ఉంది)